విహారాలు

India

Gamyam

Sunday, April 24, 2011

FOREIGN టికెట్ .. ఫారిన్ లొకేషన్స్

‘డాడీ ఫారిన్ పోదామా...?’
అని కూతురడిగితే...
ఏ డాడీకయినా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి...
ఐ మీన్ గుండెల్లో విమానాలు ఎగురుతాయి..!
కాని ఈ డాడీ చాలా స్మార్ట్ డాడీ.
‘ఓ తప్పకుండా అందరం పోదాం పదండి’ అని సినిమా హాల్‌కి తీసుకెళ్లాడు.
ఫారిన్ లొకేషన్లు అన్నీ చూసి ఫ్యామిలీ ఫారిన్ రిటర్న్ అయినట్టుగా తెగ సంబరపడిపోయింది.
మధ్యతరగతి కుటుంబాలకు సినిమా ఎన్నో కిటికీలను తెరుస్తుంది.
అందులో ఫారిన్ లొకేషన్స్ ఒకటి. ఈ సమ్మర్‌లో తొందరగా
ఏసీ సినిమా హాల్లో ఓ టిక్కెట్టు కొయ్యండి... ఫారిన్ ట్రిప్ కొట్టండి.
సినిమా తీసేవాళ్లను, చూసేవాళ్లను రీఛార్జ్ చేసే ఆ టేకాఫ్
మీ సండేకి ఎన్నో హ్యాపీ లాండింగ్స్ కలిగిస్తుందని నమ్ముతూ...




తెలుగు సినిమాలకు, ఆ మాటకొస్తే భారతీయ సినిమాలన్నింటికీ చాలా ఏళ్ల పాటు, నిన్న మొన్నటి వరకూ ఫారిన్ అంటే ఎయిర్ పోర్టే. చినబాబు విదేశాలలో చదువు ముగించుకొని ఇవాళే వస్తున్నారు అని ఏ పనివాడో వంటవాడో అంటాడు. హీరో తల్లి అబ్బాయి కోసం ఇష్టమైన వంటకాలు చేయిస్తూ బిజీగా ఉంటుంది. తండ్రి సూట్ వేసుకొని దర్పంగా రెడీ అయ్యి కారులో బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కొస్తాడు. కాసేపటికి విమానం ల్యాండ్ అవుతున్న స్టాక్ షాట్ పడుతుంది. ఇదే విమానం ఇలాగే కొన్ని వందల సినిమాల్లో ల్యాండ్ అయి ఉంటుంది గతంలో. కట్ చేస్తే - ఫ్లయిట్ దిగి వస్తున్నట్టుగా కళ్లకు నల్ల కళ్లద్దాలు పెట్టుకొని హీరో వస్తాడు. ఆ తర్వాత అతడు ఇంటికి రావడం, మరదలు పిల్లను కాదని హీరోయిన్‌తో ప్రేమలో పడటం కథ మలుపులు తిరగడం... ఇంతే మనకు తెలిసిన ఫారిన్ ట్రిప్.
కాని మరి మనం ఇలా ఎంతకాలమని స్టూడియో నాలుగ్గోడల మధ్య మగ్గిపోవాలి. ఎంతకాలమని అట్టముక్కల మధ్య పాటలు పాడుకోవాలి.
అలా ఆమ్‌స్టర్‌డ్యామ్ పోలేమా? తులిప్ పూల మధ్య పరుగులు తీయలేమా? కొత్త లొకేషన్లతో సరికొత్తగా రీచార్జ్ కాలేమా? అయ్యాం. అవుతున్నాం. ఇప్పుడైతే కేవలం లొకేషన్ల ఆసరాతోనే బతుకుతున్నాం.
*******
కాశ్మీర్ కొంతకాలం బతికించింది మనల్ని. పలానా చిత్రం యూనిట్ బయలుదేరి పాటల కోసం కాశ్మీరు వెళుతోంది అని సినిమా మ్యాగజైన్లలో వార్తలొస్తే నోరు తెరుచుకొని చూసేవాళ్లు అభిమానులు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో... అని హీరోయిన్ అంటే ఓ చందమామా అని ప్రేక్షకులు అన్నారు. అక్కడి గుల్‌మార్గ్‌లో, చెమ్మ నిండిన నల్లటి రోడ్డు మీద, అటూ ఇటూ మంచుముద్దలు పేరుకొని ఉండగా, చేతులకు గ్లౌవ్స్ వేసుకున్న హీరో హీరోయిన్లు పాటలు పాడుకుంటుంటే వెచ్చగా ఉండేది. హాయిగా ఉండేది. దాల్ లేక్‌లో జివ్వుమని కొండగాలి కత్తిలా మదిలో గుచ్చుకునేది. కాని బోర్ కొట్టింది. అంతేకాదు అక్కడ ఏకె ఫార్టీసెవన్ ఫార్టీనైన్‌సార్లు మోగడం మొదలుపెట్టింది. ప్యాకప్. ఎక్కడికెళ్లాలి. ఊటీ వద్దు. ఎన్నిసార్లు తీస్తాం. బృందావన్ గార్డెన్స్? ఆ ఏం చూస్తాం... పై నుంచి కింద వరకూ మెట్ల మీద నుంచి దొర్లుతూ రంగులు మారే నీళ్లేగా? లాభం లేదు దేశం దాటాల్సిందే. ఫారిన్ లొకేషన్‌లోకి వెళ్లాల్సిందే.
*******
మన ఎన్టీఆర్ ఇష్టపడిన ఒకే ఒక ఫారిన్ లొకేషన్ ఉంది. అది మెడ్రాస్! ఆయన దానిని దాటి వచ్చేవారు కాదు. అంతకు మించిన లొకేషన్ ఏముంది అనేవారు. పొద్దున ఒక సినిమా. మధ్యాహ్నం ఒక సినిమా. రాత్రికి ఒక సినిమా. మూడు స్టూడియోల్లో మూడు షిఫ్ట్‌ల్లో ఎక్కువ రోజులు వృధా చేయకుండా యాక్ట్ చేశారు కాబట్టే అన్ని వందల సినిమాలు పూర్తి చేయగలిగారు. ప్రేక్షకులను రంజింప చేయగలిగారు. కాని అటువంటి ఎన్టీఆరే మొదటిసారిగా ‘సాహసవంతుడు’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ఫారిన్ లొకేషన్‌ను పరిచయం చేశారు. అదేమిటో తెలుసా? నేపాల్. నేపాల్ మనకంటే పేద దేశమే అయినా మన కంటే బుజ్జి దేశమే అయినా అది అమెరికా ఆస్ట్రేలియా కాకపోయినా మన వరకు అది తొలి ఫారిన్ లొకేషనే. బహుశా దీనికి కొన్నేళ్ల ముందే దేవ్ ఆనంద్ హరేరామా హరేకృష్ణ సినిమాను పూర్తిగా నేపాల్‌లో తీయడం కూడా ఒక కారణం కావచ్చు. కథలో భాగంగా ఏదో పని మీద ఎన్టీఆర్ నేపాల్ వెళతారు. అక్కడ విలన్‌తో ఫైటింగ్‌లు చేస్తారు. అయితే ఇందులో ఒక మైనస్ ఉంది. ఎన్టీఆర్ తెర మీద ఉంటే కళ్లు లొకేషన్ మీదకు వెళ్లవు. ఎన్టీఆర్ మీదకే వెళతాయి. ఎన్టీఆర్‌ను అమెరికాకు తీసుకెళ్లినా అంతే. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎన్టీఆర్ విగ్రహం కంటే చాలా చిన్నది.
*******
సక్సెస్ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి సామాన్యమైన విషయాన్ని అసామాన్యంగా చెప్పడం. రెండు అసామాన్యమైన విషయాన్ని చాలా సామాన్యంగా చెప్పడం.
ఒక దశలో సినిమాలు రొటీన్ అయిపోయాయి. అదే ప్రేమ కథ. అదే ప్రతీకారం. తెలుగులో అయినా హిందీలో అయినా అదే సుత్తి. కథను ఎలాగూ మార్చలేము. కనీసం లొకేషన్ మారిస్తే? ఈ సూత్రాన్ని మనవాళ్లకంటే ముందు కనిపెట్టినవాడు రాజ్‌కపూర్. సినిమాకు సీన్ మార్చాలని కనిపెట్టింది అతడే. అందుకే ‘సంగమ్’ సినిమాను ఒక అందమైన ఫారిన్ ట్రిప్‌లా మార్చేశాడు. అందులో కథ అంతా ఇండియాలోనే జరుగుతుంది. వైజయంతీమాల, రాజ్‌కపూర్‌ల హనీమూన్ ట్రిప్ మాత్రం యూరప్‌లో. కొత్త పెళ్లి జంట యూరప్ అంతా ముచ్చటగా తిరిగేస్తుంటే ఆ రోజుల్లో వాళ్లనలా చూడ్డం పెద్ద వండర్.

పావలా టికెట్‌తో మొత్తం యూరప్‌ను చూడటం కూడా వేడుకే. అందుకే సంగమ్ సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత అనేక సినిమాలు. షమ్మీ కపూర్ యాహూ అంటూ రంగంలో దిగాడు. ‘యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్’.. అంటూ పారిస్ వీధుల్లో ప్రేక్షకుల్ని తిప్పాడు. అందులో కథ ఏమీ ఉండదు. పారిస్ లొకేషన్లు... పాటలు.... దీవానేకా... నామ్‌తో పూఛో... అని రఫీ గొంతు ఐఫిల్ టవర్‌ను డీకొట్టి ప్రేక్షకులకు హృదయాలను తాకుతూ ఉంటే షమ్మీకపూర్ అందంగా మెడ ఎగరేస్తుంటే షర్మిలా టాగోర్ తన లావణ్యమైన దేహానికి పొదుపుగా బికినీ చుట్టి పరుగులు తీస్తుంటే అదే పెద్ద రీచార్జ్. ఆ తర్వాత కొంతకాలానికి యష్‌చోప్రా వచ్చి చలో స్విట్జర్లాండ్ అన్నాడు.

దేఖ ఏక్ ఖ్వాబ్ తుమ్హే సిల్‌సిలే హుయే అని ఎరట్రి పూల మధ్య సిల్‌సిలా సినిమా కోసం అమితాబ్, రేఖలను పరుగులెత్తిస్తుంటే జనం రీచార్జ్ మీద రీచార్జ్ అయ్యారు. ఆ ఫ్రెష్ బ్రీజ్‌కు హమ్మయ్యా అని ఏసీ లేకుండానే చల్లబడ్డారు. ఒక రకంగా ఫారిన్ లొకేషన్లను సున్నితమైన కథలకు వాడుకోవచ్చని చెప్పినవాడు యష్‌చోప్రానే. అందుకే స్విట్జర్లాండ్ గవర్నమెంట్‌వాళ్లు యష్ వస్తున్నాడంటే చాలు రెడ్ కార్పెట్ పరుస్తారు. ఆ దేశంలోని మహామహులకు జరగని మర్యాదలు యష్‌కు జరుగుతుంటాయి. ఇక ఢామ్‌ఢమాల్ అని ఫారిన్‌లో క్లయిమాక్స్‌లు మొదలెట్టింది మాత్రం ఫిరోజ్‌ఖానే. ‘ఖుర్బానీ’ సినిమాను లండన్‌లో తీసి పిచ్చ సంచలనం సృష్టించాడు. అంతేకాదు లండన్‌లో రీరికార్డింగ్, మిక్సింగ్ లాంటి పెద్ద పెద్ద మాటలను అతడే ప్రవేశ పెట్టాడు. మొత్తం మీద హిందీలో ఫారిన్ ట్రిప్ సెటిల్ అయ్యింది. కానీ తెలుగులో ఈ ‘సక్సెస్ సూత్ర’ కుదురుకోడానికి కొంత టైమ్ పట్టింది. పైన అనుకున్నాం కదా, ఎన్టీఆర్ ఇమేజ్ లొకేషన్‌లను మింగేసేదని.
*******
అక్కినేని రెండుసార్లు హార్ట్ పరేషన్! కోసం అమెరికా వెళ్లారుగాని ఒక్కసారి కూడా షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లలేదు. అండమాన్ అమ్మాయి కోసం ఆయన చేసిన ఒకే ఒక్క ఫారిన్ లొకేషన్ అండమాన్. అయితే ఏ కారణం చేతనో అండమాన్ మన దేశంలోనే ఉండిపోయింది కనుక అది ఫారిన్ లొకేషన్ అనిపించుకోదు. కాని వాళ్లబ్బాయి నాగార్జున మాత్రం ఇక్కడ కాలు బయటకు తీస్తే ఏదో ఒక విదేశంలో ఏదో ఒక హీరోయిన్‌తో కలిసి పెట్టేవాడు. క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా అని మనీషా కోయిరాలాతో ఆయన పాడుతుంటే లొకేషన్‌బ్యూటీతో పాటు మనీషాబ్యూటీ కూడా కలిసిపోయి ఆ పసుప్పచ్చ చీర చెంగు నాగార్జున ముఖాన జాలువారి సున్నితమైన సరసోద్వేగాలు రీచార్జ్ కావడం తెలుగు ప్రేక్షకులు చూశారు. కాని ఇలాంటి మూడ్‌లో పానకంలో పుడకలాగా సూరిబాబు లవంగంలాంటి బ్రహ్మానందం తగిలితే బతుకు జనతాబారే. మన్మథుడులో ఫారిన్ లొకేషన్‌ను కామెడీ కోసం చాలా బాగా వాడుకున్నారు.

ఆ సినిమాలో బ్రహ్మానందం తర్టీ ఇయర్స్‌గా పారిస్‌లో ఉంటున్నాడు. నాగార్జునా, సొనాలీ బిందే... సారీ... బింద్రే అక్కడకు వెళితే వాళ్లకు తారసపడ్డాడు. అప్పుడు సూరిబాబు డైలాగు- ఇదేమిటో తెలుసా? పారిస్. ఇండియాను టేప్ రికార్డర్‌లో పెట్టి ముప్పయ్యేళ్లు ఫాస్ట్‌ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది.

మరోసారి మరో డైలాగు- పారిస్‌లో దొంగలు పడరు. ఇక్కడ రోడ్డు మీద బ్యాగ్ పడేసి ఆరు నెలల తర్వాత వచ్చి చూసినా అలాగే ఉంటుంది. అతడి మాటలు నమ్మి హీరో హీరోయిన్లు బ్యాగ్ పక్కన పెడతారు. కట్ చేస్తే వర్టికల్ రాబరీ. అనగా నిలువు దోపిడీ.
సూరిబాబు లవంగంలాంటి వాళ్లను ఫారిన్‌కు జత చేయడం త్రివిక్రమ్ కనిపెట్టిన మంచి ఫార్ములా. సక్సెస్ అయిన ఫార్ములా.
*******
దగ్గర్లో ఉంటే పని ఈజీ. మద్రాసు నుంచి ఇండస్ట్రీని షిఫ్ట్ చేయాల్సిందే అని పట్టుపడితే కొంతకాలం తిరుపతిలో సినిమాలు చుట్టేశారు మనవాళ్లు దగ్గరని. అలాగే ఫారిన్ లొకేషన్ అంటే చాలానాళ్లు సింగపూర్‌లో చుట్టేశారు మనవాళ్లు, అరవం వాళ్లు. అరాకొరా లొకేషన్ దొరికినా పూర్తి సినిమా తియ్యడంలో సిద్ధహస్తుడైన బాలచందర్ అందమైన అనుభవంను సింగపూర్‌లో తీసి ప్రేక్షకులకు ఒక అందమైన అనుభవాన్ని కలిగించాడు. కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద... బోలెడన్ని పాటలు... కాసేపు క్యాన్సర్. జనం ఉర్రూతలూగారు ఆ సినిమాలో.

ఊరికే కాలక్షేపానికి చిన్న జోక్. అందమైన అనుభవంలో రజనీకాంత్‌కు పిల్లిగడ్డం ఉంటుంది. ఒకమ్మాయి వచ్చి అతణ్ణి ఇష్టపడుతున్నానని చెప్పి నీ పిల్లి గడ్డం చాలా బాగుంది అంటుంది. నీకు నచ్చిందా అని అడుగుతాడు రజనీకాంత్. చాలా అంటుందా అమ్మాయి. అయితే తీసుకో అని టక్కున ఆ గడ్డాన్ని పీకి ఆ అమ్మాయి చేతిలో పెడతాడు రజనీకాంత్. ఇలాంటి కామెడీ కొంచెమే అయినా బాలచందర్ మొత్తం సీరియస్ సినిమాని కూడా తీశాడు ఫ్రాన్స్‌లో. 47 రోజులు గుర్తుందిగా. కొత్తగా పెళ్లయి ఫారిన్ వెళ్లిన అమ్మాయి మొగుడి చేతిలో ఎన్ని కష్టాలు పడగలదో ఆ రోజుల్లోనే ఊహించి తీశాడు బాలచందర్. అవన్నీ ఇప్పుడు పేపర్లలో న్యూస్‌గా వస్తున్నాయి. అయితే చాలా త్వరగానే సింగపూర్ మీద మనవాళ్లకు మోజు తీరిపోయింది. మనం ఇంకా అమెరికాకు వెళ్లాల్సి ఉంది.

*******
డేరింగ్ డాషింగ్ కృష్ణ తెలుగులో చాలావాటికి ఆద్యుడైనట్టే అమెరికా లొకేషన్లకు కూడా ఆద్యుడు. అమెరికాలో తీసిన మొదటి సినిమా హలో కృష్ణ హలో రాధ. కాని ఆ సినిమా రిలీజైనట్టుగానీ ఎవరైనా చూసినట్టుగానీ ఎవరికీ తెలియదు. అప్పట్నించి అమెరికా అంటే మనవాళ్లకు యాంటి సెంటిమెంట్. అమెరికాలో సినిమా తీస్తే ఢమాల్ అని నమ్ముతుంటారు నిన్నమొన్నటి వరకూ. అమెరికా అల్లుడు, అమెరికా అబ్బాయి, పడమటి సంధ్యారాగం... ఇంచుమించు యావరేజ్ అబౌ యావరేజ్ తప్ప హిట్ కాలేకపోయాయి. జంధ్యాల అమెరికాలో కృష్ణగారబ్బాయి రమేష్‌తో పూర్తిగా తీసిన చిన్నికృష్ణుడు వారం కూడా ఆడలేదు. అదే జంధ్యాల విజయశాంతితో తీసిన పడమటి సంధ్యారాగం టివీలో పదే పదే ప్రసారం అవుతూ ప్రస్తుతం ఒక క్లాసిక్‌గా స్థిరపడింది. కె.రాఘవేంద్రరావు భారీగా ఖర్చుపెట్టి కొత్తవాళ్లతో అమెరికాలో తీసిన పరదేశి సినిమా కూడా అమెరికా సెంటిమెంట్‌తో చతికిల పడింది. అయితే ఈ సెంటిమెంట్‌ను వైవిఎస్ చౌదరి బ్రేక్ చేశాడు. అమెరికాలో తీసిన దేవదాసు పెద్ద హిట్ అయ్యింది. అయినప్పటికీ ఏదో దోషం కొడుతూనే ఉంది. ఇటీవల వచ్చిన జై చిరంజీవ, సలీమ్‌వంటి సినిమాలు కూడా అమెరికా గాలికి అల్లాడాయి.
*******
న్యూజిలాండ్‌లో స్థిరపడిన లక్కీ అలీ ఇండియాకి పాడ్డానికి వచ్చి తన పాటలనూ పనిలో పనిగా న్యూజిలాండ్‌నూ పాపులర్ చేసి వెళ్లాడు. క్రికెట్‌లో కివిస్ జట్టును న్యూజిలాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లనూ చూడ్డం తప్ప అక్కడకు వెళ్లి సినిమాలు షూట్ చేయాలని ఎవరికీ తోచలేదు. కాని త్వరలోనే సినీ కొలంబస్‌లో బస్‌లో కాకపోయినా విమానంలో అక్కడ కాలుమోపారు. బాగున్నారా బాగున్నారా బావగారూ బాగున్నారా అని దుమ్ము లేపారు. ఆ తర్వాత నాగార్జున సంతోషంగా అక్కడ సగం సినిమా లాగించేశాడు.

న్యూజిలాండ్‌లో నాగార్జున, గ్రేసీ సింగ్‌ల మధ్య సన్నివేవాలు చాలా ఫ్రెష్‌గా అనిపించి సినిమాకు బలం చేకూర్చాయి. మంచి కథకు మంచి లొకేషనే సగం బలం అని నిరూపించాయి. న్యూజిలాండ్‌లో తీసిన కామెడీ కోటా శ్రీనివాసరావు హింసరాజు, బ్రహ్మానందం గిరి ఫ్రమ్ మంగళగిరి చాలా పెద్ద హిట్. నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఏ సన్నివేశంలో ఇమిడ్చినా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతుంది. సంతోషంలో ఒక పెళ్లి పార్టీ జరుగుతుంటుంది. అక్కడే నాగార్జున ఉంటాడు. నాగార్జునతో గిరి ఫ్రమ్ మంగళగిరి పాత్ర ఇంట్రడక్షన్ డైలాగ్ ఇలా ఉంటుంది-

ఏమండీ... ఇక్కడకు ట్రైన్లుగానీ రావు కదా.

ఆ డైలాగ్ వినగానే చాలామంది నవ్వుతారు.
ఎందుకంటే అంతకు కొన్నాళ్ల ముందే వరంగల్‌లో గూడ్సుబండి ఒకటి వంతెన మీద నుంచి నడిరోడ్డు మీదకు దూకి కకావికలం సృష్టించింది. ఆ భయం చాలామందిని వెంటాడింది. గిరి పాత్రలో ఆ భయాన్ని చూసి అందరూ నవ్వుకుంటారు.
లొకేషన్ ఏదైనా పంచ్ మనది పడితే తప్పకుండా సక్సస్ అందుతుంది. ఇదే న్యూజిలాండ్ ఇటీవల ప్రభాస్ డార్లింగ్ కోసం ఫస్ట్‌హాఫ్ అంతా మెరిసింది.
*******
ఫారిన్ ట్రిప్‌లంటే విలన్‌లను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. హిందీ సినిమాల్లో చాలామంది విలన్‌లు ఎయిర్ స్ట్రిప్ మీద చిన్న డకోటా విమానంలాంటి విమానాల్లోంచి దిగుతుంటారు. మరి వాళ్లు ఏ దేశం నుంచి వస్తారో ఏమో. అలాగే క్లయిమాక్స్‌ల్లో కూడా విచిత్రమే. హీరో మరికాసేపట్లో అటాక్ చేస్తాడనగా ఎస్‌బాస్‌గాళ్లతో మన బాస్ ఇలా అంటాడు- తొందరగా సర్దండి. హెలికాప్టర్ రాగానే మనం దేశం దాటేయాలి. మనం వెర్రి ముఖాలేసుకొని చూస్తుంటాం. హెలికాప్టర్‌లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లగలరా ఎవరైనా? దానికి పర్మిషన్ ఉందా? అది సాధ్యమా? ఎవరూ ఆలోచించరు. అయితే విలన్‌లు పెట్టుకునే ఈ ఫారిన్ ట్రిప్ దాదాపుగా సఫలం కాదు. ఎందుకంటే హీరో విలన్‌ని పట్టుకుంటాడు. విలన్ ఒకవేళ హెలికాప్టర్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసినా చివరి నిమిషంలో దానిని పట్టుకొని వేళ్లాడుతూ ఎలాగోలా అతడి భరతం పడతాడు. కాని ఇటీవలి కాలంలో ఇలాంటి ఫారిన్ ట్రిప్‌లు కనపడటం లేదు. ఔట్ డేటెడ్ అయిపోయాయి.
*******
నిజానికి ఫారిన్ ట్రిప్ అంటే చాలా సరదా ఉండాలి. సంతోషం ఉండాలి. నవ్వు తమాషా. అలాంటి ఫారిన్ ట్రిప్ ఒకే ఒకసారి కనిపిస్తుంది తెలుగులో. జయం మనదేరా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇలాంటి సరదా ఉంటుంది. ధమ్స్‌ప్ తాగి లాటరీలో ఫ్రీగా ఫారిన్ ట్రిప్ కొట్టేస్తారు సౌందర్య, సౌందర్య బామ్మ రమాప్రభ. వీళ్లిద్దరితో పాటు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, ఏవిఎస్, ఆలీ, బ్రహ్మానందం ఐఫిల్ టవర్ పీసా టవర్ చుట్టేస్తారు. వీళ్లల్లో ఒక్కరూ ఇంతకు ముందు విమానం ఎక్కినవారు కాదు. ఒక్కరూ విదేశం చూసినవారు కాదు. అందుకే అలీ హోటల్‌లో దిగగానే ఒకమ్మాయి హౌస్ కీపింగ్ అని వస్తుంది. అమ్మాయి.. పైగా హౌస్ కీపింగ్ అంటూ ఉందంటే ఇదేదో కీపింగ్ వ్యవహారమే అనుకొని రా కీప్ చేస్తా అంటాడు అలీ చేతులు చాస్తూ. చంప ఛళ్లు మంటుంది. ప్రేక్షకుల్లో నవ్వు వస్తుంది. గంభీరమైన సెకండాఫ్‌ను ఈ ఫస్ట్ హాఫ్ బేలెన్స్ చేసింది. ఫారిన్ లొకేషన్స్ లేకపోతే ఈ కామెడీ పండేది కాదు.
*******
మారీచుడు చచ్చిపడిన చోటే మారిషస్ అనేవాళ్లు ఉన్నారుగానీ ఆ మాట అటుంచితే మారిషస్ చాలా సినిమాల హీరోయిన్లకు బాత్‌టబ్‌లా ఉపయోగపడింది. అక్కడి క్రిస్టల్ క్లియర్ బీచ్‌లలో హీరో హీరోయిన్ పాడుకుంటుంటే చూస్తున్న ప్రేక్షకులు ఏదో లోకానికి వెళ్లినట్టు మైమరచిపోతారు. మారిషస్‌లో సవాలక్ష సినిమాల పాటలు తీశారు. హలో బ్రదర్‌లో మనసిచ్చి గిచ్చి బరువాయే పాట మారిషస్ అందాలనూ రమ్యకృష్ణ సౌందర్యాన్ని పోటీ పడీ ప్రదర్శించింది. షూటింగ్ వత్తిడితో సెట్‌ల హైరానాతో విసిగిపోయిన నిర్మాత ఇటు టూ ఇన్ వన్‌గా ఉంటుందని పాటలు మారిషస్‌లో తీయడానికి ఓకే అంటున్నాడు. రిలాక్స్ కావచ్చు. షూటింగూ జరుగుతుంది కనుక ఇదొక గొప్ప సౌలభ్యం. మారిషస్ దాకా ఎందుకు అనుకునేవాళ్లు మలేసియాలో కూడా పాటలు తీశారు. తీస్తున్నారు. కౌలాలంపూర్ ట్విన్ టవర్స్ మనం ఎన్నిసార్లు చూళ్లేదు.
*******
ఇప్పుడు బ్యాంకాక్ రంగప్రవేశం చేసింది.
దీనిని పూరిజగన్నాథ్ చాలా పాపులర్ చేశాడు. ఇవివి సత్యనారాయణ ఈ లొకేషన్‌ను తుక్కుతుక్కుగా సినిమాలో ఉపయోగించుకున్నాడు. ఎవడి గోల వాడిది పెద్ద హిట్. ఈ సినిమా అంతా బ్యాంకాక్‌లోనే నడుస్తుంది. ప్రతి సన్నివేశం అలరిస్తుంది. ఇందులో బ్రహ్మానందం ప్రొఫెషనల్ కిల్లర్. లక్ష్మీపతి అతడి అసిస్టెంట్. కోవై సరళను చంపడానికి బ్రహ్మానందం సుపారీ తీసుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపాలి. కాని ప్రతిసారీ ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు. ఒకసారి బీచ్‌లో కోవై సరళ పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఆమెను చంపడానికి చాటు చేసుకొని కూచుంటాడు బ్రహ్మానందం. అయితే ఇంతలో టూ పీస్ బికినీ వేసుకున్న ఒక అమ్మాయి అడ్డం నిలుచుంటుంది. వెళ్లి దాన్ని అడ్డం తీసేయమంటాడు బ్రహ్మానందం తన అసిస్టెంట్‌ను. మీరే స్థలం మార్చుకోవచ్చుకదా అంటాడు అసిస్టెంట్. నేను ఇక్కడే ఫిక్స్ అయ్యా అంటాడు బ్రహ్మానందం. దాంతో లక్ష్మిపతి వెళ్లి ఆ అమ్మాయి డ్రాయర్‌ని లాగేయబోతాడు. అది చూసిన కోవై సరళ లక్ష్మిపతిని పట్టుకొని నాలుగు బాదుతుంది. ఆ బాదుడు ఎంతకూ ఆగదు. అతడు చస్తాడేమోనని బ్రహ్మానందం ప్రవేశిస్తాడు. తాను ఏమీ ఎరగనివాడిలా లక్ష్మిపతికి బుద్ధి చెప్తూ ఒక డైలాగ్ మొదలుపెడతాడు...

‘‘సిగ్గులేదురా... పవిత్ర భారతదేశంలో పుట్టి... థాయిలాండ్ వచ్చి ఒక అమ్మాయి డ్రాయర్ లాగుతావా...! ఆ అమ్మాయిని చూడ్రా... చూడు.. ఒంటినిండా బట్టల్లేక చిన్న పీలికలాంటి డ్రాయర్ వేసుకుంటే... దాన్ని కూడా లాగిపారేయడానికి నీకు మనసెలా ఒప్పిందిరా..?

ఒరేయ్... ఆడదానికి లవర్ కన్నా... లివర్ కన్నా... డ్రాయర్ ముఖ్యంరా... లాయర్ ఫీజు తీసుకొని ధర్మాన్ని కాపాడతాడు. డ్రైవర్ డబ్బు తీసుకొని డ్రైవింగ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలం కాపాడుతుంది రా డ్రాయర్. అలాంటి డ్రాయర్‌ని అతి దారుణంగా లాగేస్తావా...! ఆడదానికి ఆరడుగుల చీర కన్నా... ఆరు అంగుళాల డ్రాయర్ రక్షణనిస్తుందిరా.. అందుకే డ్రాయరో రక్షతి రక్షతహ అన్నార్రా...

అలాంటి ట్రాయర్‌ని మేనర్స్ లేకుండా లాగేస్తావా... అని లక్ష్మీపతిని ఫుట్‌బాల్ ఆడేస్తుంటాడు.

ఈ సినిమా మొత్తం ఇలాంటి నవ్వులు పువ్వులే బ్యాంకాక్ బీచ్‌లలో ఇసుకపూసుకొని దొర్లుతుంటాయి. పూరి జగన్నాథ్ దాదాపు అన్ని సినిమాల్లోనూ బ్యాంకాక్ పాటలు తీశాడు. చిరుతను మొత్తంగా అక్కడే షూట్ చేశాడు. బ్యాంకాక్ వెళ్లడానికి వీసా అక్కర్లేదుట. అందుకే అందరూ సులువుగా అక్కడికి చేరుకుంటారట. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫారిన్ ట్రిప్ అదే.
చలో బ్యాంకాక్ అందామా.
*******
ఫారిన్ లొకేషన్లు ఎంత బాగా ఉన్నా నేపథ్యాన్ని ఎంత బాగా కలర్‌ఫుల్ చేసినా అవి అన్నిసార్లూ కథకు కనెక్ట్ కావాలని లేదు. కథకు ప్లస్ అవుతాయని లేదు. చిరంజీవితో మృగరాజు ఫారిన్ లొకేషన్స్‌లోనే తీశారు. కాని ఫ్లాప్ అయ్యింది. అదే చిరంజీవితో జై చిరంజీవ కూడా వర్కవుట్ కాలేదు. ఇటీవల రామ్‌చరణ్‌తో ఆరెంజ్ తీస్తే ఆ సినిమా కూడా క్లిక్ కాలేదు. ఆ కథకు ఆస్ట్రేలియా వల్ల మేలు జరగలేదు. తాజాగా తీన్‌మార్ పరిస్థితీ అదే. దీని కథేమిటి? ఈకాలం పిల్లలు ప్రేమను లైట్ తీసుకుంటున్నారు. గతంలో అయితే అంటే ఫ్ల్యాష్‌బ్యాక్‌లో అయితే ఒకే బాణం ఒకే అమ్మాయి అన్నట్టుగా బతికేవారు అని చెప్పడం. అట్ ద సేమ్‌టైమ్ గాఢమైన ప్రేమ కలగాలేగాని ఈ కాలం పిల్లలు కూడా దానిని సీరియస్‌గా తీసుకుంటారు అని గట్టిగా చెప్పడం.

యాక్చువల్‌గా దీనిని లోకల్‌లో తీయాలి. ఈకాలం ప్రేమను ఏ తిరుపతిలోనో తీయాలి. గతకాలం ప్రేమను ఏ మద్రాసులోనో. అప్పుడే కనెక్ట్ అయి ఉండేవారు. కాని సినిమా మొత్తం ఫారిన్‌లో తీశారు. అద్భుతమైన లొకేషన్లు. అందమైన కార్లు. నీలాకాశం. పచ్చటి కొండలు. ఇటాలియన్ ఫుడ్. ఇంగ్లీషు ముఖాలు. చూడ్డానికి హాయిగా ఉంటుంది. కాని ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో, డెరైక్టర్ అయిన మనోజ్ కుమార్‌ను గుర్తుకు చేసుకోవాలి. ఆయన తన అసిస్టెంట్స్‌కు ఒకే మాట చెప్పేవాడు. అదేమిటంటే లొకేషన్ల వల్ల సినిమాలు ఆడవు అని.
హిందీలో హృషీకేశ్ ముఖర్జీలాంటి వాళ్లు తెలుగులో కె.విశ్వనాథ్, బాపు, వంశీ లాంటి వాళ్లు తక్కువ లొకేషన్లలో సినిమాలు తీసి జనాన్ని మెప్పించారు.
మొత్తం మీద ఒకటి.
సినిమాలో లొకేషన్ ఉండాలిగాని లొకేషనే సినిమా కాకూడదు.
- ఇన్‌పుట్స్: బుర్రా నరసింహ
సెట్ కన్నా.. ఫారినే బెటర్!
యూరప్‌లో రెండు పాటలు తీయాలనుకోండి... ముందు అక్కడున్న ‘లైన్ ప్రొడ్యూసర్స్’ (వీరే ఫారిన్ షూటింగ్ కో ఆర్డినేటర్స్) ద్వారా పర్మిషన్‌కి అప్లై చేసుకోవాలి. లండన్ మినహాయించి, అన్ని యూరప్ దేశాల్లో పర్మిషన్లు ఈజీగానే వస్తాయి కానీ... ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో పర్మిషన్ అంటే వారం ముందే అప్లై చేసుకోవాలి. పదహారు మందితో ఏడు రోజుల పాటు యూరప్‌లో రెండు పాటలను చిత్రీకరించాలంటే... పర్‌హెడ్ లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఫ్లైట్ ఛార్జీలు, పర్మిషన్లకు, అకామడేషన్లకు అయ్యే ఖర్చది. అంటే నిర్మాతకు మొత్తంగా 18 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చవుతుంది. అదే... లండన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అయితే... పర్ హెడ్ లక్షా 40 వేల నుంచి లక్షా 50 వేల దాకా అవుతుంది. అంటే నిర్మాతకు 25 నుంచి 27 లక్షల దాకా లెక్క తేలుతుంది. కాకపోతే మన దగ్గర స్టూడియోల్లో సెట్ వేసి పాట తీయాలంటే... సెట్టుకు 30 నుంచి 40 లక్షలు అవుతుంది. అంటే ఒక పాటకు నిర్మాత 45 లక్షల దాకా ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అదే ఫారిన్‌లో అయితే రెండు పాటలను నాచురల్ లొకేషన్లలో రిచ్‌గా 25 లక్షల్లో తీసుకుని వచ్చేయొచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఫారిన్‌లో పాటలు నిర్మాతలకు లాభమే అని చెప్పాలి. ఎక్వీప్‌మెంట్ మాత్రం ఇక్కణ్ణుంచే తీసుకెళతారు.
20 ఫారిన్ పాటలు
హైర హైర హైరబ్బా... (జీన్స్)

టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా... (భారతీయుడు)


చమ్మచక్క చమ్మచక్క జున్ను ముక్క చంప నొక్క (బొబ్బిలి రాజా)


మధుమాసపు మంజుల రాగమా... (ఆయనకిద్దరు)


సారి సారి సారి అంటుందోయ్ కుమారీ... (బావగారూ బాగున్నారా)


నిన్నా కుట్టేసినాది మొన్నా కుట్టేసినాది (నరసింహనాయుడు)


కిళిమాంజారో... (రోబో)


నువ్వంటే నాకిష్టమనీ... (సంతోషం)


బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే... (బద్రి)


గలగల పారుతున్న గోదారిలా... (పోకిరి)


పడ్డానండీ ప్రేమలో మరీ... (స్టూడెంట్ నం 1)


ఈ తూరుపు ఆ పశ్చిమం (పడమటి సంధ్యారాగం)


నువ్వు నువ్వు నువ్వే నువ్వు... (ఖడ్గం)


అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ (సమరసింహారెడ్డి)


దాయి దాయి దామ్మ (ఇంద్ర)


జీవితం స్వప్నసాగర గీతం (చిన్ని కృష్ణుడు)


నీవే నీవే నీవే నీవే... (డార్లింగ్)


సిడ్నీ నగరం చేసే నేరం... (ఆరెంజ్)


నా మనసునే మీటకే నేస్తమా (మన్మథుడు)


ఈ హృదయం కరిగించి వెళ్లకే.. (ఏమాయ చేశావె)


ప్రియదర్శిని రామ్

No comments:

Post a Comment