విహారాలు

India

Gamyam

Sunday, April 10, 2011

రామేశ్వరం .... అంతా రామమయమే

మన దేశానికి నలువైపుల ఉన్న పవిత్ర క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. ఉత్తరాన బదరీనాథ్, తూర్పున పూరీ జగన్నాథ్, పడమట ద్వారకలుండగా దక్షిణ సరిహద్దు క్షేత్రంగా రామేశ్వరం వెలసింది. మొదటి మూడూ వైష్ణవ క్షేత్రాలు కాగా, రామేశ్వరం ఒక్కటే శైవ క్షేత్రం. కాశీయాత్ర పుణ్యం దక్కాలంటే అక్కడి గంగా జలంతో రామేశ్వరంలోని లింగానికి అభిషేకం చేయాలంటారు. అలాంటి మహిమగల రామేశ్వరానికి స్నేహితులతో కలిసి గత డిసెంబర్ నెలలో వెళ్లొచ్చాం. అందరం వైద్య వృత్తికి చెందిన వాళ్లం. ఆనాటి విశేషాల సమాహారమే ....

మధురై దాకా విమానంలో వెళ్లి, అక్కడ నుండి రామేశ్వరానికి రానూ పోనూ కార్లు బుక్ చేసుకున్నాం. బయలుదేరిన కొద్ది గంటల్లో మండపం అనే ఊరు చేరాం. అక్కడ నుండి రామేశ్వర దీవికి కారు, రైలు లేదా బోటులో వెళ్లొచ్చు. 'కాసేపటిలో మనమంతా పంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్లబోతున్నాం. 2.3 కి.మీ. దూరం సాగే ఈ బ్రిడ్జి మన దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి' అని మా డ్రైవర్ చెప్పాడు.

డబుల్ లీఫ్ బాస్కూల్ బ్రిడ్జి

బ్రిడ్జి మీదుగా వెడుతుంటే పరవళ్లు తొక్కుతూ బంగాళాఖాతం ఒకవైపు, ప్రశాంతంగా ప్రవహిస్తూ హిందూ మహాసముద్రం మరోవైపు. బ్రిడ్జి మధ్యకు వెళ్లాక కార్లు ఆపి దిగాము. కొద్దిగా వంగి చూస్తే రైల్వే బ్రిడ్జి కన్పిస్తోంది. దాని పొడువు 6, 776 అడుగులు. 1914 నుండీ వాడుకలో ఉందట. దాని ప్రత్యేకత ఏమంటే ఏదైనా ఒక పెద్ద నౌక ఆ దారిలో వెళ్లాలంటే బ్రిడ్జిని రెండు భాగాలుగా చీల్చి నౌక వెళ్లాక మళ్లీ యథాస్థానానికి తేవచ్చు. దీనిని 'డబుల్ లీఫ్ బాస్కూల్ బ్రిడ్జి' అని అంటారు. 2007 వరకు మీటర్ గేజీగా ఉన్న ఈ రైలు మార్గాన్ని ఇప్పుడు బ్రాడ్ గేజీగా మార్చారు. ప్రతి నెలా కనీసం పది నౌకలు ఈ మార్గంలో వెళ్తాయట.

మా అదృష్టం బాగుండి మేము చూస్తుండగానే కింద బ్రిడ్జి మీదుగా ఒక రైలు రామేశ్వరం వైపు అతి మెల్లగా వెళ్తూ కనిపించింది. మా పిల్లలు తెగ బాధ పడ్డారు. 'అరె మనం కూడా ఆ రైలులో ఉంటే సముద్రం ఇంకా దగ్గరగా కనపడేది కదా' అని. అంతలోనే ఒకాయన సంచిలో అప్పుడే దొరికిన పెద్ద శంఖాలు పట్టుకొని వచ్చాడు. అలవాటు ప్రకారం బేరం చేసి చెరొక శంఖం కొనేసాము. రామేశ్వర ద్వీపం కూడా శంఖం ఆకారంలో ఉంటుందని చెప్పాడతను. 2004లో వచ్చిన భూకంప, సునామీలలో కూడా ఈ పంబన్ బ్రిడ్జి చెక్కు చెదరలేదంటే మన ఇంజనీర్ల ప్రతిభకు జోహార్లు అనుకున్నా.

ధనుష్కోటి ప్రయాణంలో ...

ముందు ధనుష్కోటికి వెళ్లి ఆ తర్వాత రామేశ్వరంలో గుళ్లు చూద్దామనుకున్నాం. ధనుష్కోటి చేరాలంటే కొంత దూరం జీపులో ప్రయాణించక తప్పదు. ముందు కెళ్తున్న కొద్దీ చుట్టూ సముద్రం. సన్నటి ఇసుక దారిలో మా జీపు. 'ఇప్పుడు సునామీ లాంటిది వస్తే' అన్న ఊహ నా మదిలో మెదిలింది కానీ పెదవి విప్పలేదు. తీరా ధనుష్‌కోటి చేరాక చూస్తే అక్కడ సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. జీపు అతను అర్ధగంటలో అంతా చూసి వచ్చేయండి అన్నాడు. ఇసుకలో కూరుకుపోతున్న కాళ్లను పైకి లాగుతూ గబగబ అందరూ బీచి వైపు పరుగు తీశాము. అంతలో ఒక చిన్న కొట్టు దగ్గర ఒక పండు ముసలావిడ కనపడింది. వచ్చీరాని నా తమిళంలో ఆమెను ధనుష్‌కోటి వివరాలు అడిగాను.

ఇక్కడ నుండి శ్రీలంక 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుండే శ్రీరాముడు తన వానర సేన సాయంతో రామసేతు నిర్మించి లంక చేరాడట. క్రీ.శ.1480 వరకు శ్రీలంకకు అందరూ ఇక్కడి భూమార్గం నుండే వెళ్లేవారట. కానీ కాలక్రమేణా ఎన్నో తుపాన్లు ఈ సేతువుని దెబ్బ తీశాయి. ఇప్పుడు అవి చిన్న దీవులుగా మారి 3 నుండి 4 అడుగుల లోతు నీటిలో ఉన్నాయి. ఇక్కడ సముద్రం కూడా 7 నుండి 11 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద పడవలు రాలేవని, చిన్న పడవలపైనే చేపలు పట్టుకుంటామని ముసలావిడ చెప్పింది. ధనుష్‌కోటిలో అక్కడక్కడ చిన్న గుడిసెలు, పాడుబడిన బంగళాలు, రైల్వే స్టేషన్, చర్చీ లాంటివి ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం వచ్చిన అతి పెద్ద తుపాను ధనుష్‌కోటిని మొత్తం తుడిచిపెట్టేసిందని, అదృష్టవశాత్తు సరుకుల కోసం రామేశ్వరం వెళ్లిన తనూ, తన చిన్న మనవరాలూ, మరికొందరు ఊరివాళ్లు బతకి బట్ట కట్టామని, స్వంత ఊరిని వదలలేక ఇక్కడే బతికేస్తున్నామని చెప్పింది.

సైకత లింగావిర్భావం

తరువాత మా మజిలీ రామేశ్వరం గుడి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఏడవది. గుడి సముద్ర మట్టానికి కేవలం పది అడుగుల ఎత్తున ఉంది. ఈ గుడి ఆవిర్భావం వెనకున్న కథనం ఇది - శ్రీరాముడు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి రామేశ్వరంలో శివలింగం ప్రతిష్టించాలనుకున్నాడట. శివలింగాన్ని తెమ్మని హనుమను కైలాసానికి పంపాడట. ముహూర్త సమయానికి ఆయన తిరిగి రాకపోవడంతో సీతమ్మవారు ఇసుకతో సైకత లింగం తయారుచేయగా శ్రీరాముడు దానిని ప్రతిష్టించాడట. అంతలో కైలాసం నుండి శివలింగం తీసుకుని వచ్చిన హనుమ సైకత లింగాన్ని తోకతో పెకిలించబోగా శ్రీరాముడు వారించి సమీపంలోనే హనుమ తెచ్చిన లింగాన్ని ప్రతిష్టింపచేశాడట.

'హనుమా, నీవు తెచ్చిన శివలింగానికే మొదటి పూజ, అభిషేకం, నైవేద్యం జరుగుతాయి. ఆ తరువాతే నాది' అని శాంతింపచేశాడట. ఆనాటి ఆ సైకతలింగమే శ్రీరామేశ్వర లింగం. హనుమంతుని లింగం శ్రీ విశ్వేశ్వర లింగం. త్రేతాయుగం నాటి ఆలయం శిథిలావస్థకు చేరగా క్రీ.శ. 12వ శతాబ్దంలో సింహళరాజు పరాక్రమ బాహు దీనిని పునర్నిర్మించాడట.

సేతుమాధవ తీర్థం

ఆలయంలోకి ప్రవేశించేముందు సముద్ర స్నానానికి వెళ్లాం. ఈ సముద్ర స్నాన ఘట్టాన్ని 'అగ్ని తీర్థం' అంటారు. ఇక్కడ సముద్రం ఎంత దూరం వెళ్లినా ప్రశాంతంగా ఒక నదిలా ఉంటుంది. సముద్ర స్నానాలు అయ్యాక తడి బట్టలతోనే అందరం గుడిలోకి నడిచాం. దారిలోనే చిన్న బక్కెట్లు పట్టుకొని తీర్థాలనుండి నీళ్లు చేది తలలపై పోస్తామని కొందరు వెంటపడ్డారు. దంపతులకు 500 రూపాయల చొప్పున మాట్లాడుకుని గుడిలోకి వెళ్లాం. రామేశ్వరంలోని ఆలయ ప్రాంగణంలో 22 తీర్థాలు ఉన్నాయి. వెచ్చగా, చల్లగా ఒక్కొక్క తీర్థంలో ఒక్కో రుచిలో ఉన్నాయి నీళ్లు. ఈ తీర్థాలలో అతి పెద్దది సేతుమాధవ తీర్థం. ఇక్కడి నీటిని తలపైన పోసుకుంటే జన్మజన్మల పాపాలు పోతాయట.

అబ్బురపరచే శిల్పకళా వైభవం

రామేశ్వరం గుడిని రామనాథస్వామి ఆల యం అంటారు. ద్రవిడ శిల్పరీతిలో కట్టారు. గుడి పదిహేను ఎకరాలలో విస్తరించి ఉంది. గోపురం వంద అడుగులది. ఎక్కడ చూసినా అందమైన స్తంభాలు, వాటిపై అత్యద్భుతమైన శిల్పాలు కనబడ్డాయి. దేవాలయంలో మూడు మండపాలను మొత్తం 4000 స్తంభాలతో కట్టారు. ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో శ్రీరామలింగేశ్వరుడు ఉన్నాడు. దీనికి ముందువైపు సీతారామలక్ష్మణులు, రెండు చేతులలో రెండు శివలింగాలు కలిగి ఉన్న హనుమ, పక్కనే చేతులు జోడించిన సుగ్రీవుడు కనపడతారు. ఉత్తరంగా ప్రత్యేక గర్భాలయంలో శ్రీవిశ్వనాథస్వామి, సమీపంలో ఆయన దేవేరి శ్రీవిశాలాక్షి కొలువు తీరారు. శ్రీరామలింగేశ్వర స్వామికి దక్షిణాన శ్రీపర్వతవర్ధినీ దేవి అమ్మవారూ, వారి ముందు వైపు ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది.

తీర్థాల నీటి పుణ్యమా అని గుడిలో అన్ని చోట్ల నేల తడితడిగానే ఉంది. ఆలయ శిల్పకళావైభవాలను మళ్లీ ఒకసారి తీరిగ్గా వచ్చి చూడాలనుకున్నాం. ముఖ్యంగా మండపాలను, స్తంభాల వరుసలను చాలా సినిమాల్లో చూసినట్లు అనిపించింది.

అడుగడుగునా రాముడే

రామేశ్వరానికి రెండున్నర కి.మీ. దూరంలో గంధమాదన పర్వతం ఉంది. ఈ దీవిలోనే ఎత్తైన ప్రదేశం అది. లంక చేరడానికి హనుమ ఈ పర్వతం పైనుండే దూకాడట. ఇక్కడి ఆలయంలో శ్రీరాముని పాదాలను, సీతారామలక్ష్మణ విగ్రహాలను వీక్షించవచ్చు. రాముడు ఒక చేయి పైకి లేపిన ముద్రలో కొలువై ఉన్నాడు. పైనుండి రామేశ్వరం బాగా కనిపించింది.
8 కి.మీ. దూరంలో శ్రీకోదండరామాలయం ఉంది. విభీషణుడు శ్రీరాముని శరణు వేడిందీ, అతనిని వారు లంకాధీశునిగా పట్టాభిషేకం చేసిందీ ఇక్కడేనని చెప్పారు. 1964లో వచ్చిన తుపానుకు తట్టుకుని నిలిచిన పురాతన ఆలయపు రాతి గోడలు గుడి ముందు కనపడ్డాయి. ఈ ఆలయంలోనూ సుందరమైన శ్రీరామ సీతా లక్ష్మణ హనుమ విష్ణువు విగ్రహాలున్నాయి.

రామేశ్వరంలో ఇంకా చూడాల్సినవి జడాతీర్థం, లక్షణ తీర్థం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, అబ్దుల్ కలాంగారి ఇల్లు .. ఇలా చాలానే ఉన్నాయి. పొద్దున్నుండి తిరిగి తిరిగి అలిసిపోయిన మా పిల్లలు 'ఇక తిరగలేము, ఆకలో రామచంద్రా' అని మొరపెడుతుంటే 'సరే పదండి' అని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్లో దూరాము.
రామేశ్వరంలో వసతి, భోజన సౌకర్యం ఎంతో చవకగా, నాణ్యంగా అనిపించాయి. చక్కటి గవ్వలు, శంఖాలు, గవ్వలతో చేసిన దువ్వెనలు, అద్దాలు విరివిగా దొరుకుతాయి. ముఖ్యంగా శ్రీరాముడు అడుగడుగునా కనపడి మమ్మల్ని తరింపచేశాడు.


- డా. ఎం. రమణి
040 - 2339 1994

No comments:

Post a Comment