గలగల పారే గోదావరి హొయలు.. పచ్చని ప్రకృతి.. చుట్టూ కొండలు.. ఇసుక తిన్నెలపై భోజనం.. గోదారి తీరాన అడవి తల్లి బిడ్డలైన గిరిజనలు.. నదీ ప్రవాహంలో లాంచీ ప్రయాణం.. ఇదీ పాపికొండల విహారయాత్ర శోభ. శ్రీరామగిరి నుండి పాపికొండల వరకు సాగే లాంచీ ప్రయాణం.. మరుపురాని ఓ మధురానుభూతి. వేసవిలో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే ఈ గోదారి విహారయాత్ర గురించి ...
* వేసవిలో అందాల విందు
* కనువిందైన ప్రకృతి సోయగం
* పరవశింపజేసే విహారయాత్ర
* పాపికొండల్లో బోటు ప్రయాణం ఆహ్లాదం
* గోదారి అలలపై మరుపురాని ప్రయాణం
ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్టల్రోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు.
యాత్రసాగేదిలా...
ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎతె్తైన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి.
పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్ర హాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవమూర్తు లను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎతె్తైన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.
ఝటాయువు గురుతులు...
వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటా యి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తు న్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.
పరవశింపజేసే పాపికొండలు...
మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆధరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునిశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు.
ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు 2 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎతైన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. టూరిజం శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.
- చింతపల్లి వెంకటనర్సింహారెడ్డి, ఖమ్మం
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment