నీలి నింగి.. ఎటుచూసినా.. జలనిధి. నాట్యం చేస్తున్నట్లుండే కొబ్బరి, తాటి చెట్లు. క్షణానికోసారి పలకరించి వెళ్లే అలలు. చల్లగాలి సవ్వడి తప్ప మరో శబ్దం లేని ఏకాంత ప్రదేశం... నూతన జంటలకు అపురూప విహారానుభూతిని అందించే అరుదైన ప్రదేశం.. మర్పే బీచ్. కర్ణాటకలోని ఉడుపికి ఆరు కి.మీ దూరంలో ఉన్న మల్పె బీచ్. మెత్తని ఇసుక తిన్నెలతో కాళ్లను తాకే చల్లని నీటి అలలతో మనసును ఉత్సాహపరుస్తుంది. ప్రేమికులు, నవదంపతులే కాదు చిన్నాపెద్దా అందరూ చూసి మైమరిచిపోయిన అందమైన బీచ్ ఇది.
కర్ణాటకలో ప్రవహించే ఉదయవరా నదినే మల్పె నది అంటారు. మల్పె అనే ఊరిలోని సముద్ర తీరంలో ఉదయవరా నది కలవడంతో దీనిని మల్పె బీచ్ అని పిలుస్తుంటారు. నీలి రంగులో ఉండే ఇక్కడి అలలు మనసును ఈత వైపుకు లాగుతుంటాయి. ఇక్కడి జాలర్లు తమ వలలలో నిండుగా చేపలను పట్టుకుని వెళ్లే దృశ్యం మనసుకు ఆనందం కలిగిస్తుంది.
మల్పె కర్ణాటకలోని ముఖ్యమైన రేవు పట్టణం. చిన్న కార్గో బోట్ల ప్రయాణానికి గాను ఈ మల్పె నదిని ఉపయోగించుకుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు మనసుకు ప్రశాంతతను, ఉత్సాహాన్నిస్తాయి. ఈ బీచ్ సమీపంలోనే చిన్న ద్వీపాలు, తీరాలు కూడా ఉంటాయి. వెళ్లాలనుకునే వారు బోటు సిబ్బంది సహాయంతో వెళ్లి చూసిరావచ్చు.
సముద్రంలో రేగే తుపానుల తాకిడి నుంచి తట్టుకోవడానికి, కాసేపు సేదతీరడానికి ఈ ప్రాంతం చక్కగా అనుకూలిస్తుంది. ఇక్కడి ప్రజల జీవనాధారంగా చేపలనే ఎంచుకున్నారు. చేపల పెంపకం, సముద్రంలో వాటిని పట్టుకోవడం వంటివి వీరికి వెన్నతో పెట్టిన విద్య.
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment