విహారాలు

India

Gamyam

Showing posts with label గౌతమ బుద్ధుడు. Show all posts
Showing posts with label గౌతమ బుద్ధుడు. Show all posts

Sunday, April 24, 2011

సాంచి - బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధ సంఘ నివాసంతో పునీతమైన నేల.

రెండు పురా పర్యటనలు ధమ్మమూ ఆదిమమూ

భోపాల్‌కి సాంచి చాలా దగ్గర. గంటన్నర ప్రయాణం. మధ్యప్రదేశ్ గ్రామాల మధ్య నుంచి విదిశ వెళ్ళే రహదారి మీద ప్రయాణం. విదిశ అనే పేరు వినగానే 'వనలతాసేన్'ను వర్ణిస్తూ 'విదిశలో అలుముకున్న చిక్కని చీకట్లలాగా ఆమె కురులున్నాయి' అన్న జీవనానంద దాస్ వాక్యం గుర్తొచ్చింది. మేం వెళ్తున్న దారిలో ఒకచోట మైలురాయి మీద కర్కాటక రేఖ (Tropic of cancer) అని రాసి ఉంది. కర్కాటక రేఖను దాటుతున్నానని తెలియగానే నాకేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. బండి ఆపమని చెప్పి దిగి ఆ ఊహాజనిత రేఖమీద కొన్ని క్షణాలు నిల్చున్నాను.

సాంచి మధ్యప్రదేశ్‌లోని రాయిసెన్ జిల్లాలో ఉన్న ఒక మామూలు గ్రామం. ఊళ్లో అడుగుపెట్టాక కూడా ఏ విశిష్ట సంవేదనలూ కలగవు. సాంచి స్థూపం కొండమీద ఉందని తెలిసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యమనిపించింది. నేనంతదాకా చూసిన బౌద్ధ చైత్యాలు అమరావతి, నాగార్జునకొండ, ఘంటశాల వంటివి నేలమీద నిర్మించిన చైత్యాలు. కారు మలుపులు తిరుగుతూ పైకెక్కుతుండగా అప్పుడప్పుడే లేత చిగుళ్ళతో రంగులు పోసుకుంటున్న మాఘమాసపు అడవి మధ్య ఆ కొండ సాక్షాత్కరించింది. చుట్టూ లేతాకుపచ్చని నీలపు కాంతిలో పొలాలు, నేల, నింగి కలగలిసి ఒక నీటిరంగుల పూత నా ముందు ప్రత్యక్షమయింది. నాకు తెలియకుండానే నాలో ఏదో ప్రశాంత భావన ఉదయించడం మొదలయ్యింది.

బుద్ధుడు ప్రత్యక్షమైనట్టే ఉంది

కారు పార్కింగ్ ప్లేస్‌లో ఆపుతూ డ్రైవరు 'అదిగో అదే సాంచి' అన్నాడు. ఆ ఎండ వెలుతురులో నా ముందు స్థూపం ప్రత్యక్షం కాగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. పరుగు పరుగున ఆ ప్రాంగణం దగ్గరికి పోయి నిల్చొన్నాను. నా ముందు ధ్యానమూర్తి అయిన బుద్ధుడు ప్రత్యక్షమయినట్టే ఉంది. మనకెంతో పరిచితమైన ధ్యానబుద్ధ ప్రతిమలో ఏదో విశేషముంది. ఆ మూర్తిని చూస్తున్నప్పుడు మనలో ఏదో అనిర్వచనీయ భావన మేల్కొంటుంది. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండమీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధ స్థూపాలన్నిటిలోనూ కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యం లాగా కనిపిస్తుంది.

క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 10వ శతాబ్దం దాకా దాదాపు 1300 ఏళ్ళ పాటు ఈ స్థూపం ఎందరో బౌద్ధభిక్షువులకీ, బౌద్ధ మతాభిమానులకీ, బౌద్ధ సాంఘికులకీ ఆశ్రయంగా నిలబడుతూ వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికి సంబంధం లేదు. బుద్ధుడు తన జీవితకాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జుంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో సవివరంగా నమోదు చేశాడు గాని సాంచి గురించి కనీసం ప్రస్తావించలేదు. అయినా కూడా బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధ సంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచి చరిత్రలో నిలబడింది.

అశోకుడు నిర్మించాడు


సాంచి గురించి మొదటి ప్రస్తావన సింహళ బౌద్ధ గ్రంథాలైన 'మహావంశం', 'దీపవంశం'లలో ఉంది. అవి చెప్పేదాన్ని బట్టి అశోకుడు మౌర్యచక్రవర్తి కాకముందు ఉజ్జయినిలో రాజప్రతినిధిగా పరిపాలన సాగిస్తున్నప్పుడు ఇప్పటి విదిశకు చెందిన ఒక వర్తకుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు దేవి. ఏళ్ళ తరువాత అతడి కుమారుడు మహేంద్రుడు విదిశలో ఉన్న మహారాణి దేవిని చూడడానికి వెళ్లినపుడు ఆమె విదిశగిరి దగ్గర తాను నిర్మించిన బౌద్ధారామానికి అతణ్ణి తీసుకువెళ్ళి చూపించినట్టుగా ఆ గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్ళేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్ళేటప్పుడో ఈ అడవిలో ఈ కొండని చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండమీద రాస్తే నలుగురూ చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ 'దృష్టి' ఉంది. అందుకనే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండమీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. తన అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు అతడు ఈ స్థూప నిర్మాణం చేపట్టాడు.

అయితే సాంచి మౌర్య సామ్రాజ్య వైభవాన్ని కూడా దాటి బతికింది. మౌర్య సామ్రాజ్యం పతనమయ్యాక కొద్దికాలం ఇబ్బందిపడ్డప్పటికీ ఆ తరువాత వచ్చిన శుంగవంశుల కాలంలో ఆ నిర్మాణం మరింత విశాలమైంది. ఆ కాలంలో అశోకుడు నిర్మించిన స్థూపాన్ని పెద్దది చేయడం, చుట్టూ పిట్టగోడ, మెట్లు, హర్మిక నిర్మించడం జరిగింది. ఈసారి ఆ స్థూపాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే పని శాతవాహనుల వంతయింది. వాళ్ళ కాలంలోనే ఈనాడు మనం చూస్తున్న తోరణాలు నిర్మాణమయ్యాయి. మళ్లా హర్షుడి కాలంలో సాంచి మరొక వైభవాన్ని చవిచూసింది.

జనరల్ టేలర్ కనుగొన్నాడు

సాంచి ఎప్పటినుంచి నిర్జనంగా మారిందో స్పష్టంగా తెలియదు కాని 13వ శతాబ్దపు తరువాతి కాలానికి చెందిన నిర్మాణాలేవీ ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచి బౌద్ధభిక్షువులు నెమ్మదిగా తరలిపోయారు. అందుకు స్పష్టంగా చెప్పగల కారణాలేవీ లేవు. 1818లో ఈస్టిండియా కంపెనీకి చెందిన జనరల్ టేలర్ ఈ శిథిలాల్ని కనుగొనేదాకా సాంచి భారత చరిత్రలో ఒక విస్మృత పదం. సాంచిని ఇప్పుడున్న రూపంలో మనం చూడడానికి కారకులైనవాళ్లు అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్, కెప్టెన్ ఎఫ్.జి మైసే, మేజర్ కోల్ ముఖ్యంగా సర్ జాన్ మార్షల్. సాంచిలో స్థూపాలు సురక్షితంగా బయటపడడంతో పాటు, దుర్భరమైన నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అశోకుడు స్థాపించిన స్తంభాన్ని జమీందారు ముక్కలు చేసి చెరకు గానుగగా మార్చుకున్నాడు లాంటివి.

శ్రమణజీవితఫలం గుర్తుకొచ్చింది

నేను పిచ్చివాడిలా ప్రదక్షిణంగా, అప్రదక్షిణంగా ఆ స్థూపం చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ, నా చేతుల్లోకి చిక్కుతున్నట్టే చిక్కి మరుక్షణమే జారిపోతున్న ఆ అపురూపమైన ప్రశాంతి ఎటువంటిదో బోధపరచుకునే ప్రయత్నం చేశాను. ఇది ఎటువంటి జీవిత ప్రయత్నాలకు సార్థక్యంగా, సత్ఫలితంగా లభించగల కానుక అయి ఉండవచ్చునని ఆలోచించాను. బుద్ధుడి దీర్ఘ సంభాషణల్లో 'సామంజ ఫలసుత్త'మనే అందమైన, ఆలోచనాపూరితమైన సంభాషణ ఉంది. నాకా సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక కార్తీక పున్నమి రాత్రి మగథ చక్రవర్తి అజాతశత్రు రాజగృహంలో తన ఇంటి మేడ మీద వెన్నెల్ని చూస్తూ ఇంత అందమైన రాత్రి ఎవరైనా ఒక వివేకవంతుడు సన్నిధికి పోయి కూర్చుంటే ఆయన చెప్పే మాటలు వింటే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అటువంటి వివేకవంతుడు ఎవరన్నా ఉన్నారా అని తన మంత్రుల్ని ప్రశ్నిస్తాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి గురించి చెప్తారు.

కాని జీవక కుమారబచ్చ అనేవాడు తన మామిడితోటలో విడిది చేసిన బుద్ధుడి గురించి చెప్తాడు. అప్పుడు అజాతశత్రువు బుద్ధుణ్ణి చూడడానికి వెళ్ళి ఆయనతో సంభాషణకు పూనుకుంటాడు. ఆ రోజు అతడు బుద్ధుణ్ణి అడిగిన ప్రశ్న శ్రమణజీవిత ఫలమేమిటని. బుద్ధుడు అతనికి ఎన్నో పార్శ్వాలలో, ఎన్నో ఉదాహరణలతో ఎంతో వివరంగా చెప్తాడు దాని గురించి. అది చదివినప్పుడు నాకర్థమైందేమిటంటే, ఒక మనిషి సామాజిక నిశ్రేణిలో భాగంగా ఉండకుండానే, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ తాలూకు బానిసత్వం నుండి బయటపడి అదే సమయంలో తనకూ, సమాజానికీ కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చునని చెప్పాడని. ఒక ఇంటిమీద నిల్చొన్న మనిషి కింద రహదారుల మీద మనుషులు అటూ ఇటూ తిరుగుతూ, ఇళ్ళలోకి వస్తూ వెళ్తూ ఉండడాన్ని చూస్తూ 'మనుషులు ఇలా ఇళ్ళల్లో ప్రవేశిస్తున్నారు. ఇలా బయటికి వెళ్తున్నారు, ఇలా వీధుల్లో నడుస్తున్నారు, ఇలా నాలుగు రోడ్ల కూడళ్ల దగ్గర చేరుతున్నారు' అని అనుకున్నట్టే మృత్యువు గురించి, మనుషుల ప్రవేశాల గురించీ, నిష్క్రమణల గురించి కూడా ఆలోచించడానికి వీలవుతుందన్నాడాయన.

శ్రమణజీవితంలో ఉండే వివిధ రకాల ప్రయోజనాల గురించి చెప్తూ, బుద్ధుడు ఇంకో మాట అన్నాడు. ఆ జీవితం పనికిమాలిన సంభాషణలకి దూరంగా ఉండే జీవితమన్నాడు. ఆ జీవితంలో 'రాజుల గురించీ, దొంగల గురించీ, మంత్రుల గురించీ, సైన్యాల గురించీ, భయాల గురించీ, తిండి గురించీ, తాగుడు గురించీ, వస్త్రాల గురించీ, శయ్యల గురించీ, హారాల గురించీ, అత్తరుల గురించీ, బంధువుల గురించీ, వాహనాల గురించీ, గ్రామాల గురించీ, నగరాల గురించీ, దేశాల గురించీ, స్త్రీల గురించీ, నాయకుల గురించీ' అనవసర సంభాషణలు ఉండవన్నాడు. దాని గురించీ, దీని గురించీ ఊహాగానాలు ఉండవన్నాడు. మనం మన కార్యస్థానాల్లో, మన సమాచార, వార్తా ప్రసార మాధ్యమాల్లో, మన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చేస్తున్నదదే అని గుర్తొచ్చాక సాంచి మరింత గొప్పగా అనిపించింది.

భీమ్ బేట్క గుహలు

సాంచి నుండి భోపాల్ తిరిగి వస్తుండగా భోపాల్ దగ్గరలోనే భీమ్‌బేట్క గుహలున్నాయని తెలిసింది. ఎప్పుడో పదేళ్ల కిందట నేనా గుహల గురించి చదివాను. అప్పుడు నాలో రగిలిన కుతూహలం మళ్లా బయటికొచ్చింది. ఒక్కసారి నా మనసు క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 300వ శతాబ్దానికి (అవును 300 శతాబ్దమే) పరుగులు పెట్టింది.

ఇట్లాంటి స్థలాలకి మనం అసలు ఎందుకు వెళ్ళాలి? ఠాగూర్ ఒకచోట రాస్తాడు. మనం ఇట్లాంటి స్థలాలకు వెళ్లినపుడు మనం మనలోని పరిమిత జ్ఞానాల నుంచి, సంకుచిత దృక్పథాల నుంచి బయటపడతామనీ; అపరిమితమైన దాంతో, గంభీరమైన దాంతో శాశ్వతమైన దాంతో మనని మనం అనుసంధానించుకుంటామనిన్నీ, అవకాశాల కోసం వెతుకులాడే పరుగు నుంచి కొద్దిసేపైనా పక్కకు తిరిగి ఇటువంటి తీరికవేళల కోసం, సోమరివేళల కోసం ప్రయత్నాలు చేయాలన్నాడాయన. బషో యాత్రా వర్ణనలు చదివి వాటిని తెలుగులోకి తెచ్చిన తరువాత, నాకు కూడా ఇట్లాంటి సోమరివేళల కోసం వెతుకులాట మొదలయ్యింది.

భీమ్ బేట్క గుహలు వింధ్య పర్వతాల్లో ఉన్న గుహల సముదాయం. సముద్ర మట్టానికి దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న ఈ గుహల్లో తొలి భారతీయ మానవుడు నివసించిన జాడలున్నాయి. అక్కడ కనీసం ఒక లక్ష ఏళ్ళ కిందటనే మనిషి జీవించిన ఆనవాళ్లున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అక్కడ గుహల్లో ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలున్నాయి. ఈ చిత్రాలు కనీసం 30 వేల ఏళ్ల నాటివి.

ఇప్పుడు కవితలు రాసే యువకవులు నగరాల్లో కూర్చుని తమ పల్లెటూళ్ల గురించీ, బాల్యం గురించీ, ఎడ్ల గురించీ, వ్యవసాయ పనిముట్ల గురించీ రాస్తున్నట్టే ఒకప్పుడు వాల్మీకి, కాళిదాసు వంటివారు వ్యావసాయిక సమాజంలో భాగంగా కవిత్వం రాస్తూ తమ అరణ్య జీవిత జ్ఞాపకాల్ని తలపోసుకున్నారు. వైదిక, వేదాంత, తాంత్రిక, దార్శనిక పరిభాషల్లో 'గుహ' అంటే అత్యంత పవిత్రస్థలం. జీవిత రహస్యాలు గోచరించే స్థలం. నేడు మనకు వాక్కులో దివ్యజ్ఞానానికి ఆనవాళ్లుగా మిగిలిన గుహలు నిజంగా ఎలా ఉంటాయో, అక్కడ మానవుడు ఎలా జీవించి ఉంటాడో చూడాలంటే భీమ్ బేట్క వెళ్లాలి!

చరిత్ర వెనక్కి జరిగింది

1870లో స్పెయిన్‌లో అల్టామీర గుహల్లో ఆదిమ మానవుడు చిత్రించిన చిత్రాలు బయటపడడం యూరప్‌నే కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది. అంతదాకా దావిన్సీని, రాఫేల్‌ని, రూబెన్స్‌ని మాత్రమే ఆరాధిస్తూ వచ్చిన యూరోపియన్ చిత్రకారుణ్ణి పికాసోగా మార్చిన గుహలవి. ఆదిమ మానవుడు వస్తుపరంగా మనకన్నా వెనకబడి ఉండవచ్చునేమోగానీ, సాంకేతికంగా శిల్ప దృష్టిపరంగా మనకన్నా ఎన్నో యుగాల ముందున్నాడని ఆ చిత్రాలు ప్రపంచానికి చాటాయి. అల్టామీర గుహాచిత్రలేఖనాలు బయటపడ్డ కొద్ది రోజులకే ఫ్రాన్స్‌లో, ఆఫ్రికాలో, చైనాలో కూడా ప్రాచీన గుహాచిత్రలేఖనాలు బయటపడ్డాయి. వీటన్నిటిలోనూ ఆఫ్రికన్ గుహాచిత్రలేఖనాలు అత్యంత ప్రాచీనాలు.

అయితే 1957లో ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయానికి చెందిన వి.ఎస్. వకాంకర్ భీమ్‌బేట్క గుహల్లోని చిత్రలేఖనాల్ని బయటపెట్టడంతో భారతదేశ కళాచరిత్ర, మానవభావావేశ చిత్రణ 30 సహస్రాబ్దాలు వెనక్కి జరిగింది. భారతదేశంలోని తక్కిన గుహాచిత్రలేఖనాలు అన్నీ ఒక ఎత్తు, భీమ్‌బేట్క గుహాచిత్రాలొక్కటీ ఒక ఎత్తు. అందుకనే వకాంకర్ భీమ్‌బేట్కని 'ప్రాగైతిహాసిక మానవుడి స్వర్గం'గా అభివర్ణించాడు. అందుకనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా భీమ్ బేట్కని గుర్తించింది.

భారతదేశంలో ఈ గౌరవం పొందిన గుహాసముదాయం ఇదొక్కటే. ప్రపంచంలో దీనితో సమానమైన గౌరవం పొందిన గుహాసముదాయాలు కొన్ని ఉన్నాయి. కలహారి ఎడారిలోని బుష్‌మన్‌ల గుహాచిత్రాలు, ఫ్రాన్స్‌లోని పాతరాతియుగపు గుహాచిత్రాలు. ఒక మానవ నివాసాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కో పది ప్రమాణాలు పెట్టుకుంది. అందులో భీమ్‌బేట్క రెండు ప్రమాణాలకు నిలబడుతోందని యునెస్కో చెప్పింది. ఒకటి, ఇక్కడ మానవుడికీ ప్రకృతికీ మధ్య సుదీర్ఘంగా ఒక నిరంతర ఆదానప్రదానం జరిగిందన్న నిరూపణ ఉండడం, రెండవది, ఈ ప్రాంతంలో ఇప్పటికీ నివసిస్తున్న ఆదివాసుల జీవన విధానాన్ని బట్టి గత 300 శతాబ్దాలుగా వేట, ఆహార సేకరణ ముఖ్య వృత్తులుగా వికసించిన ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ వస్తున్నది అన్నది.

అగస్త్యుణ్ణి కానన్నాను

అడవి దారమ్మట పలాశ, మోదుగు వృక్షాల్ని చూస్తూ భీమ్ బేట్క చేరాను. డ్రైవరు కారు ఆపి 'ఇక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళాలి' అన్నాడు. వింధ్యపర్వతాల్లో అడుగుపెట్టాను అని స్ఫురించగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. ఒకప్పుడు అగస్త్యుడు ఉత్తరం నుంచి ఈ వింధ్య దాటే దక్షిణానికి అడుగుపెట్టాడు. ఆయన తిరిగి వెళ్లడం కోసం వింధ్య అప్పటి నుంచీ తలొగ్గి ఎదురుచూస్తూనే ఉంది. కాని వింధ్యని శాశ్వతంగా అణచడం కోసం అగస్త్యుడు ఈ దారిన తిరిగి వెళ్లలేదు. బహుశా అప్పణ్ణుంచీ తనను చేరవస్తున్న ప్రతి మానవుడిలోనూ వింధ్య ఒక అగస్త్యుణ్ణి గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుందనుకుంటాను. అందుకనే ఆ పర్వత సముదాయం నన్ను 'నువ్వు అగస్త్యుడివేనా?' అని అడిగినట్టనిపించింది. నేను చిరునవ్వుతో 'అగస్త్యుణ్ణి కాదు! అవిసె చెట్టుని మాత్రమే' అన్నానా కొండలతో (సంస్కృతంలో అగస్త్యమంటే అవిసె చెట్టు అని కూడా అర్థం.)

సుమారు నాలుగు గంటల పాటు ఆ గుహలంతటా కలియ తిరిగాను. ఆ గుహా సముదాయం ఒక ప్రాచీన మెట్రోపోలిస్ లాగా అనిపించింది. అది దాదాపుగా 700 గుహల సముదాయం. అందులో 243 గుహల దాకా భీమ్‌బేట్క చుట్టుపక్కల ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 30 వేల సంవత్సరాల నాటివనే వాళ్లూ ఉన్నారు. కాదు ఐదువేల ఏళ్ళ నాటివే అనే వాళ్లూ ఉన్నారు. పూర్తిగా నిర్ధారణ కాకున్నా అవి రాతియుగం కాలం నాటి వనడంలో సందేహం లేదు. మన కళలు, సాహిత్యం, మతాల మీద మధ్యరాతియుగం ప్రభావాలే బలంగా ఉంటాయి. ఆ రకంగా చూసినట్లయితే భారతీయ సాహిత్యం మీద, మతాల మీద, భారతీయ జీవిత దృక్పథం మీద మధ్యరాతియుగ ప్రభావం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

మధ్యరాతియుగంలో భారతదేశం ఐదు ప్రధాన భూభాగాలుగా ఉండేది. వేదాల్లో పంచజనుల ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. ఈ పంచజనుల ప్రస్తావన చాలామంది అనుకునేటట్లుగా ఐదు కులాల ప్రస్తావన కాదు. ఇది మధ్యరాతియుగపు భారతీయ జీవిత జ్ఞాపకాల నుంచి ఉత్పన్నమైన భావన. భారతదేశపు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మధ్యభాగాలకు చెందిన జనజీవితాన్ని సూచించే మాట అది. అప్పట్నుంచీ, ఇప్పటిదాకా కూడా భారతదేశం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు భాగాలుగా వికసిస్తూ ఉన్న ఏకజాతి, ఏకదేశం, ఏకస్ఫూర్తి. ఈ ప్రతిపాదనకు గంభీరమైన ప్రాతిపదికగా భీమ్ బేట్క గుహలు నిలబడి ఉన్నాయి.

అది చిత్రకేంద్ర సంస్కృతి

  అనేక ప్రాచీన గుహాచిత్రాల్లో, అయితే మనుషులకి ప్రాతినిధ్యం ఉంది, లేదా జంతువులకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. బహుశా ఈ సమస్య అనాదికాలం నుంచి కళనీ, సాహిత్యాన్నీ కూడా పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికీ మన ఆధునిక, అత్యాధునిక చిత్రకళలో కూడా అయితే ప్రకృతి ఉంటుంది లేదా మనుషులు మాత్రమే ఉంటారు. కాని భీమ్‌బేట్క గుహల్లో చిత్రించిన చిత్రాల్లో జంతువులు, మనుషులు కూడా సమాన ప్రాతినిధ్యం పొందారు. ఆ మాటకొస్తే ఆ చిత్రలేఖనాల్లో కేవలం ప్రకృతి లేదు, కేవలం మనిషి లేడు. ప్రకృతి, మనిషి సమానంగా పాల్గొనే ఒక జీవనక్రతువు మాత్రమే ఉంది. బహుశా ఈ స్ఫూర్తినే ఋగ్వేదం కూడా అనుసరించి ఉంటుందనుకోవచ్చు. ఋగ్వేదమానవుడి గురించి రాస్తూ రేమండ్ పణిక్కర్ తన 'వేదిక్ ఎక్స్‌పీరియన్స్'లో ఈ విషయాన్నే పదేపదే వివరిస్తాడు. కాగా, ఋగ్వేదమానవుడు ప్రకృతి, మానవుడు పాల్గొనే ఇటువంటి క్రతువులకి ఆలంబనగా 'వాక్కు'ని స్వీకరించాడు. అది శబ్దకేంద్ర సంస్కృతి. వింధ్య పర్వతాల్లో నివసించిన ప్రాచీన భారతీయుడు ప్రకృతి - మనిషి పాల్గొనే క్రతువుకి ఆలంబనగా చిత్రలేఖనాన్ని స్వీకరించాడు. ఇది చిత్రకేంద్ర సంస్కృతి.

నేనక్కడ సంచరిస్తున్నంతసేపూ ఆ గుహల్లో ఆదిమానవులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నట్టూ, తింటున్నట్టూ, పాడుతున్నట్టూ, ఆడుతున్న ట్టూ ఊహించుకున్నాను. కింద లోయల్లో రకరకాల వన్యమృగాలు ఘీంకారాలతో, క్రేంకారాలతో అరుస్తూ అటూఇటూ పరుగెడుతున్నట్టుగా అనిపించిం ది. నా రక్తంలో ఎక్కడో లోపల నిద్రిస్తున్న 300 శతాబ్దాల కిందటి, అంటే సుమారు 1200 తరాల కిందటి నా పూర్వమానవుల భావోద్వేగాల్ని నా జన్యుస్మృతుల్లోంచి తట్టి లేపే ప్రయత్నం చేశాను. ఆనాటి మానవుడు ఏమి కోరుకుని ఉంటాడు? ఏమి కలగని ఉంటాడు? మధ్యయుగాల భారతీయ చిత్రకళ గురించి రాస్తూ ఆచార్య సుశీలాపంత్ ఇట్లా అన్నాడు.

ఆదిమానవుడి అడుగుల్లోకి...

'భారతీయ శిలాచిత్రలేఖనాల విశిష్టలక్షణమేమిటంటే, అవి తమ యుగస్వభావానికి అద్దం పడతాయి. అవి మొత్తం ఉపఖండానికే చెందిన ఒక ఉమ్మడి దృగ్విషయం. వాటిలో భారతీయ సాంస్కృతిక ఏకత్వం ప్రతిబింబిస్తూంటుందని మనం చెప్పవచ్చు ... ఈ చిత్రకళ తక్కిన ప్రాచీన భౌతిక అవశేషాల్లాగే మానవుడి నాగరికతా ప్రయాణంలో మొదటి అడుగుల్ని గుర్తు చేస్తుంది. తన తదనంతర తరాల ప్రయోజనం కోసం చరిత్రపూర్వ మానవుడు తన మొత్తం ప్రపంచాన్నంతటినీ ఇక్కడ చిత్రించి పెట్టాడు. మానవుడి అభివృద్ధి అతడుండే స్థలాన్ని బట్టీ, అతడు జీవించే కాలాన్ని బట్టీ ఎట్లా ప్రభావితమవుతుందో ఈ చిత్రకళ చూపిస్తుంది. తక్కిన పురావస్తుసాక్ష్యాల్లో మనకు లభ్యంకాని రహస్యాలకోసం ఈ గుహసముదాయాల్లో మనం వెతకవలసి ఉంటుంది ... మానవుడి చరిత్రకీ, సమాజానికీ, ఆర్థికవ్యవస్థకీ, మతానికీ, క్రతువులకీ, వలసలకీ సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లభ్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇతిహాసపు చీకటికోణం అట్టడుగునపడి కనిపించని కథల్ని ఈ మౌనచిత్రాలు వినిపించాలంటే మనమింకా ఎంతో మట్టి తవ్వవలసి ఉంటుంది. బూజు దులపవలసి ఉంటుంది.'
తిరిగి వెనక్కి వస్తూంటే నాకో మన్వంతరం పూర్తయినట్టనిపించింది. సాంచి స్థూపం పరిపూర్ణమానవుడి పరిపూర్ణ ప్రజ్ఞానానికి స్మారకచిహ్నమయితే, భీమ్‌బేట్క గుహలు ఆదిమానవుడి ఆదిమ జీవితకాంక్షకు, జిగీషకు నిలువెత్తు సాక్ష్యాలుగా నాకు గోచరించాయి. మానవ చరిత్రలో నేనొక పూర్తి అధ్యాయాన్ని ఏకబిగిన చదివేసాననిపించింది.


* వాడ్రేవు చినవీరభద్రుడు
వ్యాసకర్త సెల్ : 94909 57129

Sunday, March 27, 2011

గౌతమి బుద్ధుని ఘనమైన గురుతు ... గుంటుపల్లి

తెలుగునాట గౌతమ బుద్ధిని ఆనవాళ్లకు కొదువలేదు. అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ, ఘంటసాల... ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధార్థుని అడుజాడలు ఎన్నో చోట్ల మనకు దర్శనమిస్తాయి. అలాంటి ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాలలో గుంటుపల్లి ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలంలోని ఈ చారిత్రక గ్రామం... ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలుగొందుతోంది. మనరాష్ట్రంలోని అత్యంత ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో ఒకటైన గుంటుపల్లి విశేషాలు... 

Guntupalli_big-boudhalayaప్రాచీన కాలంలోనే బౌద్ధమత జీవన విధానం ఆంధ్రదేశంలో నలుదిశలా ఫరిఢవిల్లింది. రాజులు, చక్రవర్తులు ఎందరో సిద్ధార్థుని అడుగుజాడల్లో నడిచి ప్రజలకు నిస్వార్ధ సేవచేశారు. ఆ క్రమంలో ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్టస్థానానికి నిద ర్శనంగా నిలుస్తున్నాయి. ఇటువంటి క్షేత్రాలలో బహు శా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలాని కి చెందినది. క్రీపూ 3వ శ తాబ్దానికే ఇవి ముఖ్యమైన బౌ ద్ధక్షేత్రాలుగా విరాజిల్లాయి. గుంటుపల్లిని కొన్నేళ్ల క్రితం వరకు కేవలం బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం లభ్యమె ైన మహామేఘవాహ న సిరిసదా శాసనం ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమైంది.

చారిత్రక నేపథ్యం...
గుంటుపల్లి ఊరి కొండలపైన ఉన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడవలసిన పురాతన అవశేషాలు గా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరి కింది. ఈ తీర్ధం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనిపించే ఎన్నో ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం. కొండలపైన అంచులో తొలిచిన గుహాల యం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీపూ 300 నుండి క్రీశ 300 మధ్యకాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు.

Guntupalli_Buddist_sitఅలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషకుల అభిప్రాయం. బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించా రు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమి త మవ్వాలి కాని రసానుభూతి కాదు. మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేది. జీలకర్రగూడెం, కంఠ మనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధా రామాలు కనుగొన్నారు.

ఇవీ.. ఇక్కడి ప్రముఖ నిర్మాణాలు...

గుహాలయం: క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపం (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణామార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాల్లాగా) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహార్‌లోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలుండడం విశేషం.

పెద్ద బౌద్ధ విహారం:
Dharmalingeshwaraswamyఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానం. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహల్లోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

మొక్కుబడి స్తూపాలు: కొండపైని వివిధ ఆృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమా రు అరవై మొక్కుబడి స్తూపాలున్నా యి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠ ములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కు బడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

రాతి స్తూపములు: ్ర పూ 2వ శతాబ్దానికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ పూ 19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీటర్లు.

శిధిల మంటపం: ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ పూ 1 నుండి క్రీ శ 5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చైత్య గృహం:
Mokkubadi_Sthupaluఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంృత అధిష్టానము నాసిక్‌, కార్లే గుహలను పోలి ఉంది.

ఇటుకల స్తూప చైత్యం: ఇది కూడా క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎతె్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ పూ 2-1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ చైత్య గృహం 11 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉన్నది.

ఇటీవల వెలుగులోకి వచ్చినవి...
డిసెంబర్‌ 4, 2007వ సంవత్సరంలో... ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభానికి చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమైంది. ఈ శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయి. నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడికారాలు, గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినది. ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యా సి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసిన ట్లు చెబుతున్న ఈ శిలాఫలకంలో ప్రాృత భాషలో ఉన్నది. కేంద్ర పురావస్తు శాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలుగులోకి తెచ్చింది.

Tuesday, January 11, 2011

2011లో... విహరించండిలా..!

కొత్త ఆశలను, కొంగొత్త ఆశయాలను మోసుకొని నవ వసం తం వచ్చేసింది.నూతన సంవత్సర వేడుకల సందడి నుండి మొత్తానికి బయటకొచ్చి మళ్లీ బిజీ లైఫ్‌ షెడ్యూళ్లతో ప్రజలంతా బిజీ అయ్యారు. అయితే ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగాలతో... ఆశయాలను, ఆశలను నెరవేర్చుకునే బిజీలో సమయాన్నంతా గడిపేయకుండా... పని ఒత్తిడి తగ్గించి సరికొత్త విహార ఆనందాన్ని అందించేందుకు దేశవిదేశాలకు సంబంధించిన అనేక ట్రావెలింగ్‌ సంస్థలు సరికొత్త టూర్‌ ప్యాకేజీలతో ముందు కొస్తున్నాయి.సెలవులను ఉపయోగించుకుంటూ... విహార యాత్రలు చేస్తూ... కొంత ప్రశాంతత పొందడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అవి పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా తిరిగి ఉత్తేజంతో వృత్తి ఉద్యోగాలను హాయిగా కొనసాగించడానికీ ఉపకరిస్తాయి. ఈ నేపథ్యంలో 2011 లో కొంగొత్త ప్యాకేజీలను అందిస్తున్న టూరిజం సంస్థలు, విహార ప్రదేశాల వివరాలు ఈ '' విహారాలు ''  లో .....
dambulla-cave-temple 
ఈ సంవత్సరం మాల్దీవులు, భూటాన్‌, శ్రీలంక తదితర పొరుగు దేశాలు మీ విహార ఆతిథ్యానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఎక్కువశాతం ఉన్న మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్తోమతకు తగిన అనేక ప్యాకేజీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. 2010 చివర్లో మాల్దీవులకు ప్రత్యేక ప్యాకేజీని రూపొందించిన ‘మేక్‌ మై ట్రిప్‌’ సంస్థ ఈసారి శ్రీలంకకు కూడా ఆ ప్యాకేజీని విస్తరించింది. రెండు ద్వీపదేశాలలో సాగే ఈ ఏడు రాత్రుల ప్యాకేజీ కేవలం 50 వేల రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది (ట్రావెల్‌, షెల్టర్‌ చార్జీలు కలుపుకొని). తాజ్‌ గ్రూప్‌ 74 వేల రూపాయలకు ఢిల్లీ కపుల్‌ టూర్‌ ప్యాకేజ్‌నీ అందిస్తోంది. అలాగే 62 వేలకు కోల్‌కతా మీదుగా థింపు (భూటాన్‌ రాజధాని)కి కపుల్‌ ప్యాకేజీని అందిస్తుండగా... ఇదే థింపు ప్యాకేజీని మేక్‌ మై ట్రిప్‌ కేవలం 13,895 రూపాయలకు అందిస్తుండడం విశేషం.
టాంజానియా...
ప్రపంచ వర్యాటకులను విశేషంగా ఆక ర్షించిన సాకర్‌ ప్రపంచ కప్‌... 2010 సంవత్సరాన్ని దక్షిణాఫ్రికాకు పర్యాటక రాబడిని బాగానే పెంచింది. అయితే ఈ సంవత్సరం ఆ ఛాన్స్‌ టాంజానియా సొంతం చేసుకోనుంది. కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, యాత్ర, ఆక్వాటెర్రా ఎడ్వెంచర్స్‌ వంటి పలు సంస్థలు... 2010 లో టాంజానియాకు కొన్ని ప్యాకేజీలను అందించాయి. వాటికి విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ సంవ త్సరం ఆ దేశానికి మరిన్ని మెరుగైన ప్యాకేజీలను రూపొందించే దిశలో ప్రయత్నిస్తున్నాయి. సెరెంగెటి, జంజీబార్‌, కిలిమంజారో వంటి ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రాలను కలుపుతూ ఈ ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి.‘వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌’ అనే ట్రావెల్‌ కంపెనీ 2011 ఆగస్ట్‌లో అరుదైన జంతు వలస వీక్షణాన్ని ప్యాకేజీగా అందించనుంది.
యూరప్‌...
Maldives1 

స్విట్జర్లాండ్‌ ఎప్పటినుండో యూరప్‌ పర్యాటక రాజధానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సంవత్సరం ఈ జాబితాలో క్రొయేషియా కూడా చేరనుంది.అందమైన సముద్ర తీరప్రాంతాలు, బీచ్‌లు...ఇలా ఏ-గ్రేడ్‌ అందాలతో క్రొయేషియా ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. క్రొయేషియా అందాల నగరం సొమోబోర్‌ ఇప్పుడు తన ప్రత్యేకతను చాటుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇక్కడ జరిగే జానీ ఫెస్టివల్‌...

దగ్గరలోని డుబొవాక్‌ నగరంలో జరిగే మెడీవియల్‌ నొబిలిటీ ఫెయిర్‌ వంటి ఫెస్టివల్స్‌ ఈ ప్రాంతాలకు మరింత విహార శోభను చేకూర్చనున్నాయి. ఈ వేసవిలో ‘ఎబెర్‌క్రోంబీ అండ్‌ కెంట్‌’ ట్రావెల్‌ కంపెనీ క్రొయేషియా, స్లొవేనియాలకు 13 రోజుల టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. అలాగే ‘వావ్‌’ (వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌) ఈ ప్రాంతాలనే కలుపుతూ కొన్ని టూర్‌ ప్యాకేజీలను అందిస్తున్నాయి. క్రొయేషియానే కాకుండా స్పెయిన్‌, పోర్చుగల్‌, గ్రీస్‌ లకు కూడా అనేక ప్యాకేజీలు అందుబాటు ధరల్లో వేసవి టూర్లను అందించనున్నాయి.
  ఫిలిప్పీన్స్ ...
Kilimanjaro3 

ఈ ఏడాది మార్చి నుండి ఫిలిపె్పైన్స్‌ విహారం భారత్‌కు మరింత చేరువ కానున్నది. ప్రముఖ సంస్థలు అందిస్తున్న టూర్‌ ప్యాకేజీలు ఫిలిపె్పైన్స్‌ను దక్షిణాసియాకే టూరిస్ట్‌ ఎట్రాక్షన్‌ గా నిలబెట్టనున్నాయి. ఇవే కాకుండా మలేషియా, దుబాయ్‌లు కూడా తమ విహార వారసత్వాన్ని నిలుపు కోనున్నాయి. ఈ సంవత్సరం కొత్త టూరిజం ప్యాకేజీల గురించి... మేక్‌ మై ట్రిప్‌ సీఓఓ కేయూర్‌ జోషీ మాట్లాడుతూ...‘‘టిబు, మనిలా వంటి ప్రాంతాలు ఈసారి దక్షిణాసియా దేశాల్లో టూరిజం ఎట్రాక్షన్‌గా నిలువనున్నాయి. అలాగే మలేషియా, దుబాయ్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు కూడా తమ వినూత్న ప్యాకేజీలతో తమ వారసత్వాన్ని నిలబెట్టుకోనున్నాయి’’ అని చెబుతున్నారు.
వావ్‌...
రోజుకూ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యతో మహిళ పర్యాటకుల ప్రత్యేక ట్రావెల్‌ గ్రూప్‌ వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది. 2005లో పదిమంది మహిళలు ఒక గ్రూప్‌గా మొత్తం పది ట్రిప్‌లను ప్రారంభించిన ఆ సంస్థ ఎండీ సుమిత్రా సేనాపతి ఈ రోజు 50 మంది సభ్యులు ఒక గ్రూపుగా మొత్తం 30 టూర్లను నిర్వహించే స్థాయి సంస్థను చేర్చింది. 2011 ఈ నెంబర్‌ను 40 కి పెంచే దిశగా ప్రయత్నిస్తోంది. ఇందులో ట్రైన్‌ టూర్‌ ప్యాకేజీ విశేష ఆకర్షణగా నిలువ నుంది. చైనాలోన బీజింగ్‌ నుండి లాసా వరకు సాగే ఈ రైలు ప్రయాణం ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్‌ జర్నీ కావడం విశేషం.
Bhutan0 

నిజానికి మహిళ లకు ప్రత్యేకమైన ఇలాం టి టూర్లను కొన్ని కంపెనీలు కూడా ప్రారంభించాయి. అందులో యాత్ర టూర్‌ కంపెనీ కూడా ఉంది. ‘‘2010లో 16 మంది గ్రూప్‌తో కేరళ విహారాన్ని ఏర్పాటుచేశాం.దానికి విశేష స్పందన లభించింది’’ అని తెలుపుతున్నారు యాత్ర వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సబీనా చోప్రా. సుమిత్రా సేనాపతి కూడా ఈసారి కూర్గ్‌, మైసూర్‌, నాసిక్‌, జలంధర్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు కొత్త ప్యాకేజీ లు అందిస్తున్నట్టు తెలియ జేస్తున్నారు.
ఎక్స్‌పరిమెంట్‌ హాలీడేస్‌...
కొత్త యాత్రికులను ఆక ర్షించే విధంగా ఈ ఏడాది ప్రముఖ టూర్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన అనేక టూర్‌ ప్యాకేజీలకు అప్పుడే విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 30 శాతం కొత్త యాత్రి కులను ఆకర్షించినట్టు ఆయా సంస్థలు తెలియజేస్తు న్నాయి. ‘‘ఫిట్‌ (ఫారెన్‌ ఇండిపెండెంట్‌ ట్రావెల్‌) టూర్లు యువ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యువత తమదైన ప్రత్యేక విహారానం దంకోసం ఇలాంటి టూర్‌ ప్యాకేజీలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతేకాదు, వారు ఎక్స్‌పరిమెంటల్‌ టూర్ల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు’’ అని తెలియ జేస్తున్నారు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ టూర్‌ కంపెనీ రిలేషన్‌షిప్‌ అండ్‌ సప్లయర్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ కరన్‌ ఆనంద్‌.
Samobor2 

అనుకున్నట్టుగా విహారానుభూతిని పొందడానికి భారతీయ యువ పర్యాటకులు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ దేశాలకు వెళ్ళడానికి మక్కువ చూపుతున్నారట. ప్రైవేట్‌ ట్రావెల్‌ కంపెనీ ఎబెర్‌క్రోంబ్‌ అండ్‌ కెంట్‌ వైప్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ కల్సి కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాడు. ‘‘నేటి యువత కేవలం సైట్‌ సీయింగ్‌ కోసమే తమ విహారాన్ని పరిమితం చేసుకోవడం లేదు. ఎక్స్‌పరిమెంట్‌ టూర్లనే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు’’ అని తెలియజేస్తున్నారు ఆనంద్‌.
సెల్ప్‌-డ్రైవ్‌ టూర్లు...
నేడు చాలామంది పర్యాకులు సెల్ఫ్‌ - డ్రైవ్‌ టూర్లపైన ఎక్కువ మక్కువ చూపిస్తు న్నారు.ప్రత్యేకవాహనంలో సొంతగా పర్యాటక కేం ద్రాలను చుట్టేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సెల్ఫ్‌-డ్రైవ్‌ టూర్ల విషయంలో న్యూజీలాండ్‌, మలేషి యా వంటి కొన్ని దేశాల్లో విహరించాడానికి మొగ్గుచూపు తున్నారు. దుకుంటే...ఆ దేశాల్లో ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసె న్స్‌ను అనుమతిస్తారు. అందువల్ల ఇప్పుడు ఆ దేశాలు సెల్ఫ్‌ - డ్రైవింగ్‌ వెకేషన్లను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దుతున్నాయట.
భారత్‌లో...
Maldives 

ఇక మనదేశంలోని పర్యాటక కేంద్రాల విషయానికి వస్తే...ఎప్పటిలాగే లెహ్‌, కేరళ వంటి ప్రాంతాలు ట్రావెల్‌ మార్కెట్‌ను ఈ సంవత్సరం కూడా పెంచనున్నాయి. సాంప్రదాయ విహారప్రదేశాలైన గోవా, రాజస్థాన్‌ కూడా అదే మార్గంలో పయనించనున్నాయి. ‘‘వరదల నుంచి కోలుకున్న లెహ్‌ కు ఇప్పుడు చాలా డిమాండ్‌ ఏర్పడింది’’ అని అంటున్నారు యాత్రా కో-ఫౌండర్‌ సబీనా చోప్రా. ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ... ‘‘2010లో మేం చేపట్టిన 30 టూర్లలో 6 టూర్లు లడఖ్‌కే కేటాయించడం జరిగింద’’ని చెబుతున్నారు వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌ అధినేత సుమిత్రా సేనాపతి. ఇక ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ గా పిలువబడే దక్షిణాది ప్రకృతి సోయగం కేరళ ఈ సంవత్సరం కూడా తన ప్రత్యేకతను చాటుకోనుంది. రాఫ్టింగ్‌ టూరిజంకు పేరుగాంచిన కేరళ మాన్‌సూన్‌, ఎడ్వెంచర్‌ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ 
ముందం జలో ఉంటుంది.
థీమ్‌ ట్రావెలింగ్‌...
స్పా, క్రుయిజ్‌, సఫారీ, గోల్ఫ్‌, వైన్‌ టూర్‌ వంటివి ఇప్పుడు అధికంగా వినప డుతున్న పదాలు. సైట్‌ సీయింగ్‌కే పరిమితం కాకుండా పర్యాటకులు కొత్తద నాన్ని కోరుకుంటున్నారు. అందుకే పర్యాటక సంస్థలు పై అంశాలను దృష్టిలో పెట్టుకొని మరీ థీమ్‌ ట్రావెలింగ్‌ ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ రీయూనియన్‌ వంటి వాటితో ఫ్యామిలీ టూర్‌ ప్యాకేజీలకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ తరహా ప్యాకేజీలు ఈ సంవత్సరం మరింత వృద్ధిని నమోదు చేసుకోవాలని ప్రముఖ ట్రావెల్‌ గ్రూప్స్‌ ఉవ్విళ్లూ రుతున్నాయి.
సోషల్‌ మీడియా దన్ను...
websites 

నానాటికీ పెరిగిపోతున్న సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్లు పర్యాటకుల కోసం ఎంతో విలువైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి ప్రముఖ సైట్లలో పర్యాటకులు తమ విహారానుభూతులను ఫొటోలతో సహా నిక్షిప్తం చేస్తుండడంతో విహార కేంద్రాల గురించి పూర్తి సమాచారం కోసం తెలియక తికమక పడే పర్యాటకులకు అవసరమైన సమాచారమంతా మౌస్‌ క్లిక్‌తో లభ్యమవుతోంది. ఇలా ఈ సైట్లు పరోక్షంగా టూరిజం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ట్రిప్‌ అడె్వైజర్‌, టూర్‌ ఆపరేటర్‌ వంటి వెబ్‌సైట్లు విహా ర కేంద్రాల పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నాయి.

అంతేకాకుండా అన్ని టూర్‌ కంపెనీలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పింస్తుండడం తో పర్యాటకులు టూర్‌ ప్యాకేజీలు ఎంచుకోవడం మరింత సులభతరం అయ్యిందనే చెప్పాలి. మొత్తం రాబడిలో 13 శాతం రాబడి ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్ల మూలంగానే అందుతుందంటే... పర్యాటకుల సేవలో అవి ఎంత కృషి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం వేసవి టూర్‌ ప్యాకేజీలు గతం కంటే మరింత హోరెత్తించనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Wednesday, December 15, 2010

జైన సంస్కృతి చిహ్నం.. బాహుబలి

Bahubali
మనదేశం భిన్నమతాలకు ఆలవాలం హైందవ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతులు ఈ నేలలో ఫరిఢవిల్లాయి. చారిత్రక కట్టడాల రూపంలో సంస్కృతుల చిహ్నాలు... దేశవ్యాప్తంగా నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. వందల, వేల ఏళ్ళనాడే భారతావనిలో జైన మతం విశేష ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు, సంస్కృతి చిహ్నాలు మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో పేరెన్నికగన్నదే ‘శ్రావణ బెళగొళ’... దేశంలోనే పెద్దదైన ‘బాహుబలి’ విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. జైన సంస్కృతీ సంపదను కళ్ళకు కడుతున్న కర్ణాటకలోని ‘శ్రావణ బెళగొళ’ విశేషాలు...

రెండు కొండల మధ్య ప్రృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే బెళగొళ కన్న డంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు. అలాంటి శ్రమ ణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్యాణం పొందడానికి ఈ కొం డలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను ‘శ్రమణ బెళగొళ’ అనేవారు. క్రమంగా ‘శ్రావణ బెళగొళ’గా మారిం ది. స్థానికులు ‘బెళగొళ’ అనే పిలుస్తారు. చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.



భారీ గోమఠేశ్వరుడు...
Bahuఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీశ 983వ సం వత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక. ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్ర హాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిం దే. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు. ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహు బలి పాదం ఎత్తుకు సరిపోతాం.

కనులకు విందు... మస్తకాభిషేకం...
12 ఏళ్ళకొకసారి జరిగే మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషే కం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం. గోమఠేశ్వరునికి క్యాన్ల కొద్దీ పలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూ ట్స్‌, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్‌ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషే కం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభి షేకం సమ యంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆల యం కొండమీద ఉం టుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయి నా ఎక్కడం కొంచెం కష్ట మే. మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల తరువాత కొండపైకి చేరుకుంటారు....

బాహుబలి చరిత్ర...
Jain_Inscriptగోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.

జైన విశిష్టత...
Belagola మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని ృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

అంతా శాసనాలమయం...
బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే. జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్‌ స్టోన్స్‌ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు. ఇందులో చిన్న కొండ మీద 271,ె పద్ద కొండ మీద 172, 80 శాసనాలు బెళగొళలో, మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్ని కూడా క్రీశ 600-19వ శతాబ్దం మధ్యనాటివే. లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి.

ఇలా వెళ్లాలి...
శ్రావణ బెళగొళ కర్నాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో ఉంది.బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయ పట్టణం ప్రధాన కేంద్రం. ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు-మంగుళూరు హైవే రూట్‌లో వస్తుంది. రైల్వే ద్వారా చేరాలంటే హసన్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. ఇక విమానయానం ద్వారా వచ్చే ప్రయాణీకులు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా చేరాలి. యాత్రికులు బెళగొళలో పర్యటించడానికి అవసరమైన సమగ్ర సమాచారం కోసం ఇక్కడ ఉన్న జైనమఠం అడ్రస్‌లో సంప్రదించవచ్చు.

Saturday, September 18, 2010

బౌద్ధ ప్రాశాస్త్యాన్ని చాటిన... భట్టిప్రోలు

రాష్ట్ర చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమైన భట్టిప్రోలుది విశిష్టస్థానం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ బౌద్ధారామాలలో ఒకటిగా కీర్తించబడితున్న బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. క్రీపూ 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం... భవననిర్మాణ రీతుల్లోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవెైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి. గౌతమ బుద్ధుడు, జెైన తీర్థంకరుడెైన మహావీరుడు దర్శించినట్టుగా చెప్పబడుతున్న గుంటూరు జిల్లాలోని ఆ అద్భుత చారిత్రక క్షేత్రం ‘భట్టిప్రోలు’ వెైశిష్ట్యం ......


Bhattiproluభట్టిప్రోలు ప్రాచీననామం ప్రతీపాలపురం. ఆంధ్ర శాతవాహనుల కాలానికి పూర్వం నుండే ఉన్న ప్రముఖ నగరం ఇది. సారవంతమైన కృష్ణానది మైదానంలో... సముద్రతీరానికి సమీపానగల ఈ ప్రాచీన నగ రం... అక్కడ తవ్వకాలలో బయటపడిన బౌద్ధ స్థూపం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. భట్టిప్రోలుకు సమీపంలో ఉన్న పోతవరలంక వరకు పెద్ద పడవలు, నౌకలు వచ్చేవనీ, అక్కడి నుండి వరి ధాన్యము, దినుసులు, వస్త్రాలు ఎగుమతి అవుతుండేవనీ, జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రంగా ఈ నగరం విరాజిల్లిందని చరిత్రకారుల అభిప్రాయం. ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్ర ఇలా భట్టిప్రోలు అనేక పేర్లున్నాయి. క్రీశ 8వ శతాబ్దానికి చెందిన జెైనకవి నయసేనాని వ్రాసిన ‘ధర్మామృత’ కావ్యంలో ప్రతీపాలపురం ప్రసక్తి ఉంది.

Stupaఇది క్రీశ 5వ శతాబ్దంలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడెైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఇతని వారసుడు ధనదుడు జెైన మతాన్ని వదిలి బౌద్ధురాలెైన కమల శ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథ బృహత్కథాకోశంలో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో ‘కుబీరక’ రాజు ప్రసక్తి ఉంది. ధన దుడి కి కుభీరక, కుబేర అనే పేర్లు కూడా ఉన్నాయి. జెైన రాజెైన ఖారవేలుడు పితుడ్రనగరంలోని బౌద్ధే త్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ‘ఖారవేలు’ని శాసనాల్లో చెప్పబడినది. ఆ శాస నాల్లో పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకా రులు భావిస్తున్నారు.

చారిత్రక శిథిలాలు...
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్థూపం చరిత్ర తెలుసుకునేందుకు భారతీయులకంటే విదే శీయులే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. క్రీశ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్ట్‌ సెవెల్‌ అనే విదే శీయులు భట్టిప్రోలును సందర్శించారు. 1892లో అలెగ్జాండర్‌ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరపును ఆర్‌. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. అప్పుడు ఒక విహారపు పునా దులు బయటపడ్డాయి. బుద్దుని తల ప్రతిమ వెలుగుచూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచ నా ప్రకారం క్రీపూ 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. లాంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్థూపం, కోట గోడలు కనపడ్డాయట.

స్థూపప్రాకారంలో చలువరాతి పలకలు, గోడలో ఇమిడిన నలుచదర పు స్థంభాలు, ఆయక వేదికలు, చక్కగా చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆయక స్థంభం ఎత్తు 15 అడుగులు. వాటిపెై మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కి వున్నాయి. ప్రదక్షిణాపథానికి అంచున 4 అడుగుల ఎత్తువరకు పాలరాతి గోడ ఉండేది. ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు, ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించిందని చెబుతారు.

భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్ర పర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన ‘మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేం దుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరి కాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరెైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కల కత్తాలోని ‘శ్రీధర్మ రాజి క విహార్‌’లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంత టి ప్రాముఖ్యతగల ఈ చారిత్రక ప్రదేశంపెై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం విచిత్రం.

స్థూప విశిష్టత...
భట్టిప్రోలు స్థూపాన్ని ధాతుగర్భం అంటారు. అనగా బుద్ధుని ధాతువులపెై నిర్మించబడినది అని అర్థం. శాసనాల్లోని ‘బుద్ధ శరీ రాని నిఖేతుం’, ‘బుద్ధ శరీరాని మహనీయాని కమ్మనే’ అనే వాక్యాలనుబట్టి స్థూపం యదార్ధమైన బుద్ధ ధాతువుపెై నిర్మించబడినట్లు స్పష్టమవుతోంది. స్థూపం మధ్య రంధ్రం ఉన్నది. రంధ్రం చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్థూపం పెైన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రం గుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

ఆంధ్రులు ఒక విశిష్టమైన స్థూప నిర్మాణశెైలిని అభివృద్ధి చేశారు. ఇందు ఆయక స్థంభాలు ప్రధానమైన సాక్ష్యాలుగా నిలుస్తు న్నాయి. చక్రాకార స్థూపనిర్మాణం భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జునకొండ స్థూపాల్లో పరిణితి చెందింది. చక్రా కార వెైశిష్ట్యం ఏమిటంటే, స్థూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం, ధర్మభావ వ్యక్తీకరణల మేళ వింపు. చక్రాకార స్థూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలుగా చెబుతారు.

శాసనాలు...
భట్టిప్రోలు శాసనాల్లోని భాష... ప్రాకృతం, లిపి... బ్రాహ్మీ భేదము. రాతిపేటికలు, స్ఫటికపు మంజూషిక, వెండిరేకు, స్ఫటికపు పూసపెైన 10 లేఖనాలు లభించాయి. ఈ శాసనాల వల్ల స్థానిక సభ దానధర్మాల్లో భాగస్వామ్యం వహించినట్లు తెలుస్తున్నది. సింహగోష్ఠి అనేది స్థానిక సంస్థ (నాలుగవ పేటిక). గోష్టి సభ్యులందరి పేర్లూ ఇందులో ఉన్నాయి. సింహగోష్ఠి అధ్యక్షుడు కుభీర కుడు (కుబేర, కుభిరక, కుభిర). బుద్ధుని శరీర ధాతువులు నిక్షిప్తం చేసేందుకు ‘కుర’ అనే అతడు పేటిక చేయించాడు (మూడ వ పేటిక). ఐదవ పేటిక శాసనంలో ‘రాజా కుబేరక’ అని ఉంది.

భాష, లిపి...
Lipiస్థూపంలో దొరికిన ధాతుకరండముపెై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నీ ఈ లిపినుండే పరిణామం చెందాయి. బౌద్ధ మతంతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణాసియా ఖండంలో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లావోస్‌, కంబోడియా మొదలెైన భాషలకు లిపి ప్రదానం చేసింది. తెలుగు దక్షిణ భాషా కుటుంబానికి మూలం ద్రవిడం. దీనినుండి క్రీపూ 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయం. నేటి తెలుగు లిపికి ‘మాతృక’గా పరి ణామక్రమం లో మొదటిదిగా ‘భట్టిప్రోలు లిపి’ ని పేర్కొంటారు. స్థూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగా లను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది.

ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనదిగా చెబుతారు. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీపూ500 కాలంలో అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణాపధంలో క్రీపూ300 నాటికి భట్టిప్రోలులో ప్రస్తుతం ఇక్క డ మనకు కనిపించే రూపం సంతరించుకొంది. శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాలా వెైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణాలు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కనిపించిన ‘ళ’ ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు. ఇంతటి చారిత్రక వెైభవం కలిగిన భట్టిప్రోలు మనకు ప్రాచీనులు అందించిన జ్ఞానభండాగారమని చెప్పకతప్పదు.

- ఎస్‌.కె