విహారాలు

India

Gamyam

Showing posts with label Krishna. Show all posts
Showing posts with label Krishna. Show all posts

Friday, December 17, 2010

శ్రీశైలం- మహానంది- అహోబిలం

చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి లేదా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు. రాయలసీమ నుంచి వచ్చేవారు అహోబిలం మీదుగా మహానంది, అక్కడి నుంచి అటవీ మార్గంలో శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబ దర్శనం అనంతరం, దగ్గరలోని ఇష్టకామేశ్వరి ఆలయం, పాతాళగంగ చూసుకొని రాత్రి అక్కడే బస చేయవచ్చు. దేవస్థానం సత్రాలతో పాటు టి.టి .డి. కాటేజ్‌లు కూడా ఉన్నాయి.
దేవస్థానం ఫోన్ నెంబర్లు : 08524-288883,288885, 288886. 
గంగ, యమున కాటేజ్ ఫోన్ : 08524-287351.

మహానందీశ్వరం
మరుసటి రోజు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం నుంచి దోర్నాల మీదుగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహానంది చేరుకోవడం ఓ ఆధ్యాత్మిక అనుభవం. మహానందిలో పర్వతసానువుల్లో కొలువైన నందీశ్వర స్వామి దర్శనం ఆహ్లాదం కలిగిస్తుంది. ఆలయం వెనుక ఉన్న కొండల నుంచి స్వచ్ఛమైన నీరు వేసవిలో సైతం కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. నందీశ్వరుని కిందుగా వచ్చే ఆ ధార, ఆలయం ఎదురుగా ఉండే కోనేరులో పడుతుంది. ఆ కోనేరులో భక్తులంతా స్నానాలు చేస్తారు.


వసతి సౌకర్యాలు : తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన 28 గదుల సత్రం, మహానంది దేవస్థానం నిర్మించిన 5గదుల సత్రం, పాపిరెడ్డి కాటేజి, నాగనంది సదనంలో 25గదులతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలకు చెందిన వసతి గృహాలు వున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ వసతి, టూరిజం అతిథి గృహాలు వున్నాయి. 
ఫోన్ నెంబర్లు : 
దేవస్థానం కార్యాలయం - 08514 234726, 234727, 234728,
పున్నమి అతిథి గృహం 9441733829

నవనారసింహం

మహానంది నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అహోబిల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నవ నారసింహులు వెలసి ఉన్నందున నవ నారసింహ క్షేత్రమని పిలుస్తారు. నరసింహ స్వామి కొండ కిందా పైనా వెలసి ఉండటంతో దిగువ, ఎగువ అహోబిలమని పిలుస్తారు. ఇక్కడ నివసించే చెంచులు నృసింహ దేవునికి జుంటి తేనె, అడవి మాంసం నైవేద్యముగా సమర్పించి పూజిస్తారు. నరసింహుడు చెంచులక్ష్మిని పరిణయమాడినట్లుగా భావించి చెంచులు అల్లుడిగా మర్యాదలు చేస్తారు. ఈ ఆలయాలన్నీ ప్రకృతి సోయగాలతో అలరారుతూ ఉంటాయి.


అహోబిల నరసింహస్వామి(ఎగువ అహోబిలం), మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహ స్వామి, కారంజ నరసింహ స్వామి, భార్గవ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, ఛత్రవట నరసింహ స్వామి, పావన నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహ స్వామి(దిగువ అహోబిలం)లు నవ నారసింహులుగా పూజలందుకుంటున్నారు. ఎగువ అహోబిలం ఆలయం పక్క నుంచి రమణీయమైన కొండలు, జలపాతాలను చూసుకుంటూ నవనారసింహుల్లోని ముగ్గురు నరసింహ స్వాముల్ని దర్శించుకోవచ్చు. ఓపిక ఉన్న వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ 5 కిలోమీటర్లు నడిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. నడవలేని వారికి డోలీ సౌకర్యం కూడా వుంది. గండశిల నుంచి చూస్తే నల్లమల అందాలన్నీ ఒకచోటు పోగేసుకున్నాయా అనిపిస్తుంది.


ప్రకృతి ఆరాధన స్ఫూర్తిని మనలో కలిగించేందుకే పుణ్యక్షేత్రాలను పర్వతాలు, అడవులు, నదీనదాల చెంత ఏర్పాటు చేశారనేందుకు అహోబిల క్షేత్రం నిదర్శనం. శ్రీశైలం, మహానంది, అహోబిలం క్షేత్రాలు చూసేందుకు కనీసం మూడు రోజుల సమయం కేటాయిచాలి. టూరిజం గెస్ట్‌హౌస్‌తో పాటు దేవస్థానం వసతి కూడా అందుబాటులో ఉంటుంది. 
మఠం వారి మాలోల అతిథి గృహం ఫోన్ నెం:08519-252045, 
ఏపీ టూరిజం వారి హరిత అతిథి గృహం ఫోన్:08519-252060, 
టీటీడీ అతిథిగృహం ఫోన్ నెం:08519-252045, 
అహోబిలం మేనేజర్ కార్యాలయం ఫోన్ నెం: 08519-252025

Wednesday, December 15, 2010

కృష్ణమ్మ ఒళ్లో... సరదాల విహారం..

krishanmmam1
పర్యాటక రంగంలో మరో ముందడుగు! కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోన్న ‘రివర్‌ క్రూయిజ్‌’ ప్రాజెక్టు ఇటీవలే సాకారమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థ... నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య బోటు ప్రయాణాన్ని చేపట్టింది. ఈ బోటు పేరు ‘ఎం ఎల్‌ అగస్త్య’. 90 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బోటు ఇటీవలే జలప్రవేశం చేసింది. రెండు రోజుల ప్యాకేజీ. ఈ బోటు ప్రయాణంతో కృష్ణమ్మ పరవళ్లు మరింత కనువిందు చేయడం ఖాయం. భారీ వర్షాల వల్ల తొణికిసలాడుతున్న కృష్ణానది ప్రవాహానికి ఎదురెళ్లడం పర్యాటకులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. చాన్నాళ్ల నుంచీ మరుగున పడి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా చొరవతో కార్య రూపం దాల్చాయి.
krishanmmam
హైదరాబాద్‌ నుంచి పర్యాటకులను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లడానికి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా రెండు బస్సులను నడపనుంది. శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ లోని యాత్రీ నివాస్‌ నుంచి ఉదయం 7 గంటలకు, పాత కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఉన్న పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్రీయ రిజర్వేషన్‌ కార్యాలయం (సిఆర్‌ఓ) నుంచి 7:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. నాగార్జున సాగర్‌ చేరిన అనంతరం అక్కడి నుంచి బోటు ప్రయాణం సాగుతుంది. 90 కిలోమీటర్ల మేర ప్రయాణం. సాయంత్రానికి బోటు లింగాలగట్టుకు చేరుకుంటుంది. అనంత రం సాక్షి గణపతి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కల్పిస్తారు. శ్రీశైలంలోని పర్యాటకాభివృద్ధి సంస్థ హోటల్‌లో రాత్రి బస. మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు ‘రోప్‌ వే’ ద్వారా పాతాళగంగకు తీసుకెళ్తారు. అనంతరం తిరుగు ప్రయాణం.

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ చేరుకున్న తరువాత ఎత్తిపోతలు, నాగార్జున కొండ, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌, మ్యూజియం సందర్శన కల్పిస్తారు. అవి ముగిసిన వెంటనే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఎసి గదుల్లో నివాస వసతి పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది.

టారిఫ్‌ వివరాలివీ...
హైదరాబాద్‌ నుంచి నాన్‌ ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2000
పిల్లలకు - రూ.1500
ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2500
పిల్లలకు - రూ.1800
నేరుగా నాగార్జున సాగర్‌లోనే బోటు ప్రయాణం చేయదల్చుకుంటే...
పెద్దలకు - రూ.1500
పిల్లలకు - రూ.1100