విహారాలు

India

Gamyam

Showing posts with label Kerala. Show all posts
Showing posts with label Kerala. Show all posts

Saturday, January 14, 2012

కేరళ కొండల్లో మన ' చిందులు'

మీకు కేరళలోని కొట్టాయం దగ్గరి కొండల్లో 'వాగమన్' ఊరు చూసి రావాలనుందా? ఐతే వెళ్ళకండి. వెడితే తిరిగి రాబుద్ధి కాదుగదా- అందుకని. పోగేసిన సౌందర్యం విశాలంగా పరుచుకున్న చోటు వదిలి మరోచోట ఇరుకిరుగ్గా బతకడం వట్టిదండగ అని ఆలోచన వస్తుంది. పైగా అక్కడే 'సూయిసైడ్ పాయింట్' అని ఓ అందమైన లోయ ఉంది. కొందరు అన్యోన్యంగా చెట్టపట్టాలు వేసుకుని అందులో దూకేస్తుంటారని సహ టూరిస్టు ఒకాయన అన్నాడు.http://www.cosytours.com/images/vagamon_new_large.jpg
హైదరాబాద్ నుంచి దళిత సాంస్కృతిక సంస్థ 'చిందు' వాళ్లు కేరళ కొండ కోనల్లోకి పోతూ మమ్మల్ని కూడా (ఆర్టిస్టు మోహన్ను, నన్నూ) పట్టుకుపోయారు.. మొన్నీమధ్యనే. అక్కడి కొండలు మహా కులుకుతాయో ఏమో! ఒంపు సొంపులు తిరిగే ఘాట్ రోడ్డు కొట్టాయం అంచు నుంచీ మొదలైంది. పచ్చటి లోయలు వగలుపోతూ అడుగు ముందుకెయ్యనియ్యవాయె. మేం ఎక్కిన బండికి ఎదురొచ్చే బళ్ల ధ్యాసే లేనట్టుంది... పొదల్లో పాములా సరసరా సాగి వాగమన్ అనే కొండ మీది పల్లెలో స్వర్గం లాంటి, రిసార్టు వంటి అందాల వసతికి చేర్చింది. లారీ బేకర్ గారు మొదట ప్రయోగం చేసిన టెర్రకోట ఇళ్ల లోగిళ్ళ వలయం అది. అ పక్కనే ఉన్న కొండమీది ఇంటికి అప్పుడప్పుడు అరుంధతీరాయ్ వచ్చి రాత పనులు చేసుకుపోతుంటారట.

వాగు వంకల పక్కనే ఎత్తుకు పైఎత్తు కొండలు దాటుకు పోతుంటే మనం కరిగి నామరూపాలు లేకుండా పోవడం కనిపిస్తుంది. ఎదర రెండు మూడు లక్షల కొబ్బరి చెట్లు, రెండు లక్షల అరటి చెట్లు, వాటికి కాసిన ఎర్రటి కొండ అరటికాయలు చేతులూపి పిలుస్తున్నట్టుంటాయి. తల వంచుకుని మాట్లాడుతున్నట్టుండే తారు పెంకుటిళ్లు... పచ్చటి బోడిగుండుల్లాటి 'మెడోస్' మీద పడి దొర్లే టూరిస్టులు... అంతా పరమాద్భుతం.

ఇంకొంచెం సేపటికి మరో కుగ్రామం వైపు వెళ్లాం- అక్కడ కొండకు ఒకవైపు జాజికాయ, జాపత్రి, మిరియాలు, ఏలకులు, లవంగాల తోటలు, చెట్లు. గాలి నిండా చల్లదనం.... ముక్కులోంచి మనసులోకి చేరి బుర్రను వెర్రెత్తించే లవంగాల వాసన... లోయల్లో ప్రాణం లేచొచ్చే వెలుగుదారుల్లాటి పైన్ చెట్ల వరుస. ఆకాశమంత ఎత్తున్నాయవి. బుడిబుడి గుత్తుల్లాగ పొట్టిగా టీ చెట్లమూకలు. ఇక ఎక్కడబడితే అక్కడ చిత్ర విచిత్ర రంగురంగుల పెదపేద్ద పూలు, గంతులు వేయించే ఏవో తీగలు. ఎకాలజీ, బయో డైవర్సిటీ పిచ్చిగల వాళ్ళకి కావలసినంత సమాచారం ఇచ్చే కొండదారులు.http://www.yaatrika.com/traveler/wp-content/uploads/2010/01/vagamon-021.jpg
మేము బస చేసిన ఇళ్ళ చుట్టూ ఆకుల గలగలను మోసుకొచ్చే గాలి... నోటితోనూ గాలి పీల్చుకోవచ్చన్నంత శుభ్రమైన గాలి, మా కోసం కాబోలు కొంచెం కూడా కొబ్బరినూనె వాడని కేరళీయ వంటకాలు చేశారు. అక్కడికి ఉప్పుడు బియ్యం మన ప్రాంతాల నుంచే ఎక్కువ సరఫరా అవుతుందని మళయాళీ వంటాయన చిరునవ్వు నవ్వి చెప్పాడు. మూలికలు కలిపిన వేడి రంగునీటిని తాగడానికి ఇచ్చాడు. ఆపై నికార్సయిన టీ, మరోటీ శ్రమ తెలీకుండా తెగపుచ్చుకున్నాం. మేమున్న గదుల్లో ఒక్క దోమ లేదు. అసలు 'ఫేన్'లే లేవు! కొండగాలి సువాసనలు దోమలకు నచ్చదేమో మరి. అంతా తిరిగి నడుస్తోంటే లోయ మధ్యలో వేలాడుతున్నట్టుంది- గాల్లో ఈదుతూ.http://thenmala.info/hills/images/vagamon.jpg
ఇలాటి దృశ్య సౌఖ్యం మధ్యన 'ద.భా. దళిత వేదిక సాంస్కృతిక సమావేశం' కోసం ఢిల్లీ, చెన్నయ్, త్రివేండ్రం, బెంగుళూరు నుంచి వచ్చిన దళిత కళాకారులు, మన 'చిందు'వారూ డప్పులతో కొండ లోయల గుండెలదరగొట్టారు. ఆటపాటలు కలిపి నృత్యనాటక ప్రదర్శనలిచ్చారు. కొందరు చెట్ల మీద కొంగలు సైతం విని హరాయించుకునేట్టు ఉద్యమ ప్రసంగాలు, చర్చలు చేశారు. వీరితో విదేశీయులూ చేరేరు. 'చిందు'వారి ప్రదర్శనలు చూసి పరాయి రాష్ట్రాలవారు నోరు వెళ్ళబెట్టి చేతులెత్తేసేరు. కర్నాటక దళిత బృందం వారు ఈసారి మైసూర్‌లో జరుపుదామని ఆహ్వానం ప్రకటించారు. అంబేద్కర్, దళిత కళావేదికల వారు జాతీయ స్థాయి ప్రయత్నాలు, స్థానిక నాటక ప్రదర్శనల వెసులుబాటు వంటి అంశాల మీద చర్చ మరీ వేడెక్కకుండా మధ్య మధ్య పాటలతో అదరగొట్టారు. 'నందనార్' ఏకపాత్రాభినయం వంటి సంగీత ప్రధాన రూపకంతో పాటు 'వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్' గురించి బోధనా పద్ధతిలో పాఠం చెప్పి కలైమణి అందర్నీ కట్టిపడేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సబ్రినగారు ఆడపిల్ల పుట్టడం, స్వేచ్ఛ చవిచూడడం, చివరికి చేదు వాస్తవం గ్రహించడం వంటివి రూపకంగా చూపెట్టి ఎవర్నీ కనురెప్ప వేయనీయకుండా ఆశ్చర్యంలో పడేశారు.

రాత్రి చలిలో 'కేంప్ ఫైర్' సరదాలేగాక పుస్తక ప్రపంచం గురించి లక్ష్మణన్, ప్రబలన్, ప్రళయన్ వంటి కేరళ దళిత మిత్రులు బాగా మాట్లాడారు. ప్రబలన్ వంటి ఒకరిద్దరికి ఆధునిక తెలుగు కథల గురించి చెప్పి చితక్కొట్టేద్దామనుకున్న శుభ తరుణంలో వాళ్ళు తెలుగువాళ్ళవి ఏవేవి చదివారో మాకు చెప్పేరు. మనం 'వైకం' అంటే వాళ్ళు 'కొ.కు' అనేదాకా రావటం చిత్రం! సాహిత్యం బాగా చదివిన ప్రబలన్ గారు ఎంతమంది దక్షిణాది ఆధునిక రచయితలకు తెలుగు సాహిత్యంలో ఆధునిక ధోరణులు తెలుసో గడగడా ఎక్కంలా చెప్పారు. 'ప్రళయన్'గారేమో హిందీ, ఆంగ్ల భాషల్లో స్వేచ్ఛా వ్యాఖ్యానంతో సబ్ ఆల్టరన్ దృష్టికోణంలో వచ్చిన 'అపూర్వ పురాణగాథ'ల గురించి కొద్దిసేపే అయినా చక్కగా మాట్లాడారు పసుపు పచ్చటి చిప్స్ కరకరలాడిస్తూ. http://i1.trekearth.com/photos/56678/vagamon.jpg
దాంతోపాటు అవకతవక అనువాదాల వల్ల మూలగ్రంథాలు ఎలా పాడవుతాయో నెత్తీనోరూ బాదుకుంటూ చెప్పారు. థాంక్ గాడ్! ఒక ఢిల్లీ పెద్ద మనిషికి, ఒక మలయాళీకి, ఒక తమిళుడుకి ఆధునిక తెలుగు రచయితలు తెలుసు- ఇది భలే ఉంది- చర్చ సాగనివ్వచ్చు- అనుకునే సమయానికి చిన్నపాటి క్లయిమాక్స్ పేలింది. అప్పటిదాకా ఆంగ్లం దంచిన ప్రబలన్ తన పుట్టుక, స్కూలు చదువు మన విజయనగరంలో జరిగాయని చెప్పాడు. ఆ తర్వాత ప్రేమ పెల్లుబుకి ఆయన తెలుగులో దడదడ ప్రసంగం అందుకున్నాడు. చివరాఖరున ఏ ఉద్యమమైనా సాంస్కృతిక కళారూపాల్లో మరీ ముఖ్యంగా స్థానిక, జానపద రూపాల్లో అణగారిన ప్రజాసమూహాల్లోకి చొచ్చుకుపోనిదే వట్టి మేధో చర్చలు సాగించి లాభం లేదని లక్ష్మణన్ ఒక 'అండర్‌లైన్' లాంటి ముక్కతో ముగించారు.

మరియొక్కటి కూడా చెప్పి ముగిస్తాను.
మోహన్‌గారి యానిమేషన్ చిత్ర ప్రదర్శన చూసి హోల్ మొత్తం జనం వార్నాయనో అని పై స్వరంతో అన్నారు. మమ్మల్ని అక్కడికి తెచ్చిన కారణం కోసం నేను, మోహన్‌గారు చెట్ల కింద రకరకాల సీతాకోకచిలకల మధ్య, సుదీర్ఘంగా పాడే మలబార్ కోయిల ఈల వింటూ, పూలు రాలిన గడ్డిని చూస్తూ డజనుకు పైగా పెయింటింగ్‌లు వేశాం. ప్రదర్శన తరువాత వాటిని వాళ్ళకి ఇచ్చేసి వాగమన్ ముచ్చట ముగించుకున్నాం. మా అందరి అరచేతులు పచ్చడయ్యేట్టు వాళ్ళంతా ఇచ్చిన షేక్‌హాండ్‌లతో వేన్ ఎక్కి లోయల్లోకి పాదరసంలా జారుతూ రైల్లోకొచ్చిపడ్డాం. తెల్లారి (జింబో) నగర ప్రవేశం చేశాం.
ఈ యాత్రా విశేషాలు చదివిన వారందరికీ ప్రకృతి దృశ్య వీక్షణం, ఈర్ష్యాసూయలు ఉచితముగా కలుగు గాక!
http://www.getawayskerala.com/wp-content/uploads/2011/09/Vagamon.jpg
- శివాజీ

Wednesday, November 2, 2011

కేరళ ప్రకృతికాంత..వాయనాడ్‌

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ అందాలకు వ్యసనపడకపోతే అది సందర్శకుడి దృష్టిలోపమే... కేరళలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ప్రకృతి ఒడిలో తేలియాడిన అనుభూతి కలుగుతుంది. కన్యాకుమారి, అలెప్పీ, కోవలం, వెంబనాడ్‌, కుమారకోం, అలప్పూజ... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాష్ట్రం మొత్తం విహార కేంద్రాలమయం. ఆ కోవకు చెందిన అద్భుత పర్యాటక ప్రదేశమే వాయనాడ్‌. ప్రకృతి అందాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న వాయనాడ్‌ విశేషాలు...
Attappadi
 
వాయనాడ్‌ ప్రకృతి సౌందర్యానికి మీరు మైమరచిపోయి ఉండకపోతే, మీ కళ్లలో గానీ, మనసులో గానీ, స్పందనలో గానీ ఏదో లోపం ఉందనుకోవాల్సిందే... కేరళ రాష్ట్రానికి 590 కిలోమీటర్ల పొడవైన విస్తార తీరప్రాంతం ఉంది. ఇక్కడి ఇసుక, గాలులు, తరంగాలు ఎన్నో దండయాత్రలు, సాహసయాత్రలు, వివిధ ఖండాలు, సంస్కృతులకు చెందినవారితో జరిగిన వాణిజ్యాలకు సాక్ష్యాలు. అరబ్బులు, పోర్చుగీసులు, చైనీయులు, పర్షియన్లు, డచ్చివారు, బ్రిటిష్‌వారు, ఫ్రెంచ్‌ వారు... ఇలా అందరూ తమ ఓడలను కేరళ తీరంలో లంగరు వేశారు.

పర్యాటకుల స్వర్గధామం...

Nalliyampathy
 
అద్భుతమైన వాయనాడ్‌ పర్యాటకుల పాలిట స్వర్గధామంగా విలసిల్లుతోంది. కేరళలోని పశ్చిమ కనుమల్లోగల హిల్‌స్టేషన్లలో అపారమైన వృక్ష సంపద, వన్యప్రాణులు ప్రతివారినీ ఆకట్టుకుంటుంటాయి. అట్టప్పడి, ఇడుక్కి, పక్షిపాతాళం, పీరుమేడు, సైలెంట్‌ వ్యాలీ, వాగమాన్‌ దేవీకులం, నెల్లియంపత్తి, పొన్ముడి ఇలా హిల్‌స్టేషన్ల పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ జాబితా అనంతం. మంచి సుగంధ ద్రవ్యాల నుంచి వెలువడే పరిమళాలు, కళ్లను కట్టిపడేసే పచ్చదనపు సౌరభాలు, మెరుస్తూ ప్రవహించే నదులు, భౌగోళికంగా కనపడే ఎత్తుపల్లాలు, ‘యూ’ ఆకారంలోని మలుపుల గుండా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తే ఆ అనుభూతులు ఇవన్నీ కలిపి మనసుకు ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలబోసి మరీ అందిస్తాయి.సముద్రమట్టానికి 700 నుంచి 2,100 మీటర్ల ఎత్తువరకు ఉన్న వాయనాడ్‌, దక్కన్‌ పీఠభూమి దక్షిణభాగం మీద సగర్వంగా నిలిచి ఉంటుంది. కల్పెట్టా, సుల్తాన్‌ బాతెరి, మనంతావడి, పట్టణాలు పర్యాటకులకు కావల్సిన వసతి, ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తాయి.

చరిత్రలో వాయనాడ్‌...
Hotels-in-Wayanad
 
ఈ ప్రాంతాన్ని ప్రముఖ రాజవంశీయుడు కేరళవర్మ పఝస్సి రాజా తదితరులు పాలించారు. 19వ శతాబ్దం తొలినాళ్ళలో బ్రిటిష్‌వారు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురిచియా గిరిజనుల సాయంతో పఝస్సి రాజా బ్రిటిష్‌ వారిపై సాగించిన పోరాట చరిత్రను స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించారు. కేరళ సింహంగా పేరొందిన పఝస్సి రాజా సమాధులు మనంతవాడి, వాయనాడ్‌లలో ఉన్నాయి.

విస్తారమైన కాఫీ తోటలు, తేయాకు తోటలు, యాలకులు, మిరియాలు, వెనీలా తోటలను చూస్తుంటే మైమరిచిపోతాం. 14 కిలోమీటర్ల పొడవున్న కొండదారిని తమరస్సెరీ చురమ్‌ అంటారు. ఇదే వాయనాడ్‌కు స్వాగతద్వారం. పొరుగునున్న కోజికోడ్‌ జిల్లాతో వాయనాడ్‌ను కలిపే మార్గం ఇదే. అన్నింటికంటే పైన ఉండేది లక్కిడి హిల్‌ స్టేషన్‌.చరిత్ర పూర్వ యుగం నాటి పటాల్లో ఎడక్కల్‌ గుహలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి చరిత్ర పూర్వయుగం నాటి రాతి కట్టడాలు చాలా ప్రసిద్ధి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, జీవశాస్తవ్రేత్తలు, పురాతత్వ శాస్తవ్రేత్తలు, వెల్లువలా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి గుహల్లో ఉన్న పెట్రోగ్లిఫ్‌లు ఐదువేల సంవత్సరాల కంటే ముందు కాలం నాటివని చెబుతుంటారు.

చూడాల్సినవివే...
బ్రహ్మగిరి పర్వత పాదాల్లో ఉన్న తిరునెల్లి దేవాలయం, పులియర్మాలలోని అనంతానంత స్వామి దేవాలయం, శ్రీమహాగణపతి దేవాలయం, పల్లిక్కున్ను చర్చి వంటివి వాయనాడ్‌లో చూడాల్సిన ప్రదేశాలు. చెంపారా శిఖరం, బాణాసుర సాగర్‌ డ్యాం, కురువు ద్వీపం, సూచిపార, పంతపార మీన్ముట్టి జలపాతాలు ఇవన్నీ కలిసి మెప్పాడి అంబాలావయల్‌ ప్రాంతంలో పర్యటించేవారికి విభిన్న అనుభూతులను అందిస్తాయి. కాబానీ నది వాయనాడ్‌కు జీవనది లాంటిది. కాళింది, మనంతావడి, పనమారం అనేవి దాని ఉపనదులు.
http://www.indialine.com/travel/images/meenmutty-falls-wayanad.jpg
రాష్ట్రంలోని ఆదివాసీలలో 36 శాతం మంది ఇక్కడే ఉంటారు. వారిలో పానియాలు, ఆదియాలు, ఊరలీలు, కురుమలు, కట్టునాయక్కన్లు ఉన్నారు. కర్నాటక నుంచి 13వ శతాబ్దంలో జైనులు ఇక్కడికి వచ్చారు. హిందువుల్లో అగ్రవర్ణాలుగా పేరొందిన నాయర్లు 14వ శతాబ్దంలో వచ్చి, ఇక్కడ వారి భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పారు. ఆ తర్వాత ముస్లింలు వచ్చారు. 1950లలో ఉత్తరాది జిల్లాల నుంచి వలస వచ్చిన క్రిస్టియన్లు వాయనాడ్‌ జిల్లాలో మొక్కల పెంపకం సంస్కృతికి ఆద్యులు.http://kunzum.com/wp-content/uploads/2011/05/kerala-wayanad-kuruva-280311-0036.jpg
కన్నూరు జిల్లాలోని ఓ చిన్న తీరప్రాంత గ్రామమైన ముఝప్పిలంగడ్‌ ఇప్పుడు కేరళకు వచ్చే పర్యాటకులకు స్వర్గధామంగా విలాసిల్లుతోంది. భారతదేశంలోనే రెండో అతి విస్తారమైన ఈ బీచ్‌ ఉత్తర కేరళలో కన్నూరుకు దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలోనూ, తలస్సెరికి ఉత్తరంగా ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడున్న అడ్వెంచర్‌ టూరిజం అకాడమీ వారు సీ సర్ఫింగ్‌, పారాగ్లైడింగ్‌ వంటి జల క్రీడలను అందిస్తారు. యూరప్‌కు, తలస్సెరికి ఉన్న చారిత్రక బంధాల కారణంగా యూరోపియన్‌ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ, ముఝప్పిలంగడ్‌ అందాలను ఆస్వాదిస్తారు. ఇటీవలికాలంలో ఇటు స్వదేశీ పర్యాటకులతో పాటు అటు విదేశీ పర్యాటకులను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్న ఈ పట్టణం ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.
ముఝప్పిలంగడ్‌ తురుతు (ద్వీపం) అంజరకాండి నది మధ్యలో ఉంటుంది. ఇది బీచ్‌కు చాలా సమీపంలో ఉంది.

ముఝప్పిలంగడ్‌కు అత్యంత సమీపంగా ఉండే ధర్మదాం ద్వీపం మరో అదనపు ఆకర్షణ. కొబ్బరి చెట్లు, పొదలతో నిండి ఉండే ఈ ద్వీపం బీచ్‌ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంతంలోని అరేబియన్‌ మహా సముద్ర జలాలతో మూడువైపులా ఇది చుట్టుముట్టి ఉంటుంది. ఈ అందాల ద్వీపం ప్రైవేటు ఆస్తి కావడం దీన్ని సందర్శించడానికి అనుమతి తీసుకోవాల్సివుంటుంది. చరిత్రకారుల కథనం ప్రకారం, ధర్మదాంను ఇంతకుముందు ధర్మపట్టణం అని పిలిచేవారు. దీనికి బౌద్ధమూలాలున్నాయి. త్వరలోనే బీచ్‌ నుంచి ధర్మదాం ద్వీపానికి రోప్‌వే రూపుదిద్దుకుంటోంది.

ఇది పూర్తయితే... ప్రపంచంలోకెల్ల ఇదే అతిపెద్ద రోప్‌వేగా పేరుగాంచనుంది. అంతేకాకుండా పర్యాటకులకు అది అదనపు ఆకర్షణ అవుతుంది. కన్నూరులో ఉన్న తలస్సెరీ, పయ్యాంబళం బీచ్‌లు కూడా తప్పనిసరిగా చూసి తీరాల్సిన ప్రాంతాలే. ఇంతకుముందు ఫ్రెంచి కాలనీగా ఉంటూ, ఇప్పుడు పుదుచ్చేరిలో భాగమైన మాహే కూడా ముఝప్పిలంగడ్‌కు సమీపంలో ఉన్న మరో ఆకర్షణీయమైన ప్రదేశం.

Wednesday, September 28, 2011

హెర్బల్‌ టూరిజం

herbal-tourism
రొటీన్‌లైఫ్‌లో కాస్తంత ఉపశమనం పొందాలంటే అత్యుత్తమ మార్గం వివిధ ప్రాంతాల సందర్శన. ఒకప్పుడు తీర్థయాత్రల పేరిట దూరప్రాంతాల్లోని పుణ్యక్షేత్రా లను సందర్శించే వారు. నేడు ప్రకృతి రమణీయ ప్రాంతాలను, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతా లను పర్యటించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఎకో టూరిజం, ట్రైబల్‌ టూరిజం, మెడికల్‌ టూరిజం లాంటి సరికొత్త భావనలూ రూపుదిద్దు కు న్నాయి. అలాంటి వాటిలో ఒకటి హెర్బల్‌ టూరిజం. పర్యటకులకు వివిధ వనమూలికలపై అవగాహన పెంచడం తో పాటు పంచకర్మ లాంటి ఆయుర్వేద చికిత్సలను అందించడం కూడా ఇందులో భాగమే. దేశంలో హెర్బల్‌ టూరిజానికి కేరళ పేరుపొందుతోంది.

కేరళలోని ప్రకృతి రమణీయ దృశ్యాలతో మానసికారోగ్యాన్ని, ఆయుర్వేదంతో శారీరకారోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.భారత దేశంలో ెహర్బల్‌ టూరిజంకు మంచి భవిష్యత్తుంది.యూరోపియన్‌ మందుల వినిమయం ఎక్కువగా ఉన్నా... భారతదేశంలో ఆయుర్వేదానికి అనాది నుంచే ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. శారీరక,మానసిక వ్యాధులను నిర్మూలించడంలో ఆయుర్వేదం ఎంతగానో ఉపయుక్తమైన దంటారు.శిరోధారా అనే పరిజ్ఞానం ఆయుర్వేదంలో ప్రముఖమై నది.ఆయుర్వేద పరిశోధన, వినియోగానికి కేరళకు భారతదేశంలో మంచి గుర్తింపు ఉంది. ేరళలో అనేక అయుర్వేద తయారీ కంపెనీలు ఎప్పటికపప్పుడు వ్యాధి నిర్మూలన కోసం మందులను తయారుచేసేందు కృషి చేస్తున్నాయి.కేరళలోని వెస్ట్రన్‌ ఘాట్‌లో ఎన్నో వనమూలికలు, మొక్కలు లభిస్తాయి.

herb4 

ప్రింటింగ్‌ పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో గురుకులం వంటి విద్యాలయాల్లో ఆయుర్వేద విజ్ఞానం మౌఖికంగా పరివ్యాప్తి చెందేది. తరువాత వాటిని రచనలోకి తెచ్చారు.కొండకోనల్లో నివసించే వివిధ కొండ జాతి వాళ్లకు ఎంత పరిజ్ఞానం ఉండేదో.. గురుకులం విద్యార్థులకూ అంతే పరిజ్ఞానం ఉండేది. ఆ పరిజ్ఞానమే కాలాలు దాటీ నేటికీ అందుబాటులో ఉంది. నేడు ఈ ఆయుర్వేద చికిత్సలు చేయించుకునేందుకు విదేశీయులు కూడా అధిక సంఖ్యలో కేరళలో పర్య టిస్తున్నారు. వీరి కోసం ఆయా సంస్థ లు ప్రత్యేక ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా మెడికల్‌ టూరిజం లాంటిదే.

సాధారణ మెడికల్‌ టూరిజంలో శస్తచ్రికిత్స లు చేయించుకునే వారు వస్తుంటే, హెర్బల్‌ టూరిజంలో ప్రధానంగా ఆయుర్వేదం, మూలికా ఔషధాలతో చికిత్సలు పొందదల్చుకున్న వారు వస్తుంటారు.
ఆయుర్వేదానికి ఆద్యుడిగా పేర్కొనే ‘ధన్వంతరి’ని పేర్కొంటారు.‘అగ్నివేశ్‌ తంత్ర’ అనే పుస్తకంలో ‘అగ్నివేశ’ ఆయుర్వేదాన్ని గురించిన అనేక విషయాలు బహిర్గతం చేశారు. తరువాత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోనూ అనువాదం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

herb-6
చరక్‌ సంహిత పుస్తకానికి కొనసాగింపుగా శుష్రుత అనే పుస్తకంకూడా వెలువడింది. సంహిత అనే అనేక మంది రచయితల కృషితో సంస్కృతంలో,హిందీ వంటి అనేక భాషలలో ఆయుర్వేద సాహిత్యం వెలువడింది.అందులో శాలిగ్రామ్‌ నిఘంటు,భానౌషధి చంద్రోదయా వంటివి ప్రముఖమైనవి. హెర్బల్‌ టూరిజంలో భాగంగా ఈ రకమైన పుస్తకాలు ఇప్పుడు ఆంగ్లంలోనూ లభిస్తున్నాయి. ఎంతో మంది విదేశీయులు ఈ పుస్తకాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

విశ్వవిఖ్యాతం కేరళ ఆయుర్వేదం

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఎవరి జీవితమైనా సజావుగా సాగుతుంది. ఈ సృష్టిలో ఆరోగ్యంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరి సొంతం. అది ప్రకృతి ప్రసాదిత వరం. సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునే వారు ఇపుడు ప్రకృతినే వైద్యునిగా మార్చుకుంటున్నారు. ఇది ఇప్పటి మాట మాత్రం కాదు, చాలా సంవత్సరాల క్రితమే అంటే క్రీస్తుపూర్వం మూడువేల సంవత్సరాల క్రితమే ప్రకృతి నుంచి మానవుడు ఉపశమనం పొందాడన్న సత్యాన్ని అనేక శాస్ర్తీయ వైద్య గ్రంథాలు వివరిస్తున్నాయి. ప్రకృతి ప్రేరేపిత రూపమైన మానవుని శరీరం కూడా పంచభూత తత్వాలకు (గాలి, నీరు, భూమి, ఆకాశం, తేజం) లోబడి పనిచేస్తుందనేది వైజ్ఞానిక సత్యం.

ఈ పంచ ధర్మాలతో నిర్మాణమైన మానవుని శరీర రక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు ఆధారమైన, అనుకూలమైన చికిత్సా విధానంపైనే ప్రజలు విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరడానికి యోగ్యమైన చికిత్సా విధానాలను ఆశ్రయించి సత్ఫలితాలను పొందుతున్నారు. ఇతర వైద్యవిధానంతో పాటు నేడు ప్రాచీన, సంప్రదాయ వైద్యం కూడా అన్ని చోట్లా ఆమోదాన్ని పొందుతోంది. సంప్రదాయ వైద్యాన్ని పర్యాటక రంగానికి అనుసంధానం చేసుకుంటూ ఆయుర్వేద వైద్య విధానానికి తగినంతగా ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని కలిగిస్తున్నాయి.
herbs
ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయ వైద్యవిధానాల్లో ఒకటైన కేరళ ఆయుర్వేద వైద్యం దేశం నలుమూలలకు విస్తరించి ప్రత్యేకతను చాటుకుంటోంది.ఇటీవల కేరళ ఆయుర్వేద వైద్యం ప్రజల విశ్వాసం చురగొంటోంది..కేరళ ఆయుర్వేదంలో ధన్యామ్ల ధార, కతివస్తి, కిజి, క్షీరధూమం, లేపనం, నశ్యం, పిజిచి, సిర్వోస్తి, స్నేహాపనం, వాస్తి వంటి చికిత్సా విధానాలపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో దేశానికి చెందిన వారే గాకుండా విదేశీయులు సైతం ఇక్కడ ఏర్పాటైన కేరళ ఆయుర్వేద కేంద్రాల్లో చికిత్స పొందేందుకు వస్తున్నారు.

ఆయుర్వేద వైద్యమంటే...
herb-walk 
శరీరం, మనసు, ఆత్మ మూ డింటినీ సవ్యదిశలో ఉంచగలిగేదే ఆయుర్వేద వైద్యవిధానం. ఏ అనారోగ్యమైనా మనిషిని శారీరకంగా, మరోవైపు మానసికంగా కుంగ తీస్తుంది. ‘నిజం-ఆగంధు’ ప్రక్రియ లను అనుసరించి ఆయుర్వేద చికిత్స చేస్తే పూర్తిస్థాయి నివారణ సాధ్యపడుతుందని వైద్యులు అంటున్నారు. ఆయుర్వేదంలో శోధనం, క్షమనం రెండింటికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. శోధన ప్రక్రియ ద్వారా వ్యాధి మూలాన్ని సంగ్రహించి క్షమనం ద్వారా శాశ్వత పరిష్కారానికి దోహదం చేసే చికిత్సను చేస్తున్నారు. అలాగే బాడీమసాజ్‌ ప్రక్రియ కూడా ఆయుర్వేదంలో ముఖ్య భూమికను పోషిస్తోంది.

శారీరక రుగ్మతలకు చికిత్స...
her-tour3 
వందలాది ప్రకృతి పరమైన తైలాలను ఉపయోగించి శరీరానికి మసాజ్‌ అందించడం ద్వారా హృదయ భాగం నుంచి కాలి వేళ్ల వరకూ అనేక శారీరక రుగ్మతలకు స్వస్థత చేకూరుతుందని వైద్యుల నమ్మకం. వీటిలో అభియాంగమ్‌, ఎలకిడి, శిరోధార, నవరాకిడి, పిడిచిల్‌, తక్రధార లాంటి మసాజ్‌ చికిత్సల ద్వారా శరీరంలోని రక్త ప్రసరణ సరిగా జరిగేలా, మెడ సంబంధిత నొప్పులు, మానసిక, శారీరక ఒత్తిడి, నరాల బలహీనత, కీళ్ల సంబంధిత వ్యాధులు, పక్షవాతం లాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చని చెపుతున్నారు. ముఖ్యంగా పంచకర్మ విధానం (వాస్తి, విరేచన, వామన, నాస్య, రక్తమోక్ష) ద్వారా మనిషి శరీరాన్ని ఉత్తేజింప చేయవచ్చని ఆయుర్వేద వైద్యనిపుణులు అంటున్నారు.

రిసార్ట్స్‌లోనూ ఏర్పాటు...

కేరళలోని వివిధ రిసార్ట్స్‌లలో నిర్వాహకులు స్పాకేంద్రాల పేరుతో ఆయుర్వేద వైద్యా నికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారికి అవసరమె న అన్ని సౌకర్యాలను ఇందులో కల్పిస్తున్నా రు. కీళ్లనొప్పులు, ఒబెసిటీ, ఆస్థమా, కండరాల నొప్పులు, మైగ్రెయిన్‌, కంటి సంబంధిత వ్యాధులకు వీటిలో పంచకర్మ చికిత్సలను అందిస్తున్నారు. ఇలాంటి వాటితో కేరళ క్రమంగా హెర్బల్‌ టూరిజానికి అంతర్జాతీయ కేంద్రంగా ప్రసిద్ధి చెందుతోంది.

Tuesday, July 5, 2011

ప్రకృతి అందాల కొలమానం ... కుమరకోమ్‌

సముద్ర గర్భాన్ని చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవాగవానుడి లేలేత కిరణాల హొయలు, ఆ ఆదిత్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలారావాలు, ఈ సుందర దృశ్యాలను ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, వాటిలోని జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడుచేసే కొబ్బరాకుల గలగలలు.. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న అద్భుతమైన ప్రాంతమే కేరళ.

water-houseసముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్‌ హిల్స్‌ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగుభూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది.

శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదులపైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌కు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్‌ జీవనశైలికి ప్రతిబింబం..

కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌.. కొచ్చి నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్‌ చెట్ల మధ్యలో.. వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధమైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లోనూ...
house-kerala ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్‌కి బుకర్‌ ఫ్రైజును తెచ్చిపెట్టిన ‘గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలుచేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్‌ లాగూన్‌లోని రిసెప్షన్‌ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు...
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్స్‌లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం...
keralas సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్‌కు సమీపంలో, కవనార్‌ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయాణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్‌ నుండిగానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌కు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్‌...
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమరకోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే...
కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహావసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్లకంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలామంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్‌ సంబరాలు...
locationssకేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీజ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్‌ రేస్‌ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్‌ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ.కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో.. కొచ్చిన్‌ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్‌ జెట్టీ ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్‌ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.

కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం...
కుమరకోమ్‌ ప్రాంతం అంతా వెంబనాడ్‌ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్‌ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్క్‌ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రత్యేకతలు ....

కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమరకోమ్‌ టూరిస్ట్‌ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.