విహారాలు

India

Gamyam

Wednesday, December 15, 2010

అహోం క్రీడావినోదానికి ప్రతీక...

Rang-Ghar
శివసాగర్‌ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరాన వున్న రంగ్‌ఘర్‌ ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల నిర్మాణం. అహోం రాజుల రాయల్‌ ప్యాలెస్‌ ఉన్న తలాతల్‌ ఘర్‌ నుంచి 5 నిమిషాల్లో కాలినడకన ఇక్కడికి చేరుకోవచ్చు. అహోం రాజులు కట్టించిన ప్రత్యేకమైన ఈ ఆంఫిథియేటర్‌ (క్రీడా విన్యాసాలు ప్రదర్శించే వేదిక) అప్పటి వారి రాజ్యవైభవానికి ప్రతీక. అహోం రాజులు క్రీడలు తిలకిస్తూ ఆనందించే వేదికగా వినియోగించిన ఈ స్థలం... ప్రఖ్యాత రోమన్‌ కొలోసియంను పోలివుంటుంది. రంగ్‌ఘర్‌ అహోం రాజుల కాలంనాటి రెండంతస్తుల పెవిలియన్‌. దీని నిర్మాణపరమైన గుణగణాలు ఎంతో విలక్షణమైనవి. భారీ స్తంభాలపై నిర్మించిన ఈ కట్టడం పై కప్పు నేటి సాంకేతిక విజ్ఞానాన్ని సైతం అబ్బురపరుస్తుంది. ఈ నిర్మాణ వైభవంలో ఇస్లాంపరమైన ప్రభావం కనిపిస్తుంది. భవనం బాహ్య అలంకరణలో భాగంగా ఒక అపురూపమైన విలాస నౌక ఉంది. అహోం రాజులు స్థానికంగా దొరికే వివిధ రకాల సామాగ్రిని దీని నిర్మాణం కోసం ఉపయోగించారు.

అంటుకునే స్వభావ గల ఒక రకమైన వరిధాన్యం (బోరాచాల్‌), గుడ్లును రంగ్‌ఘర్‌ నిర్మాణానికి వాడడం విశేషం. రంగ్‌ఘర్‌ నిర్మాణం పూర్తయి కొన్ని వందల ఏళ్ళ గడిచిన తరువాత కూడా బోరాచాల్‌ ఇప్పటికీ తాజా స్థితిలో మనకు దర్శనమివ్వడం విశేషం. ఇప్పటి భవంతిని అహోం రాజు ప్రమతా సింఘా, క్రీశ 1744-1750 మధ్యకాలంలో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. రాజకుటుంబాలతో కలిసి ఆయన వివిధ రకాల క్రీడలు ఈ రంగ్‌ఘర్‌లో వీక్షించేవారు. ఇక్కడ రంగలీ బిహు (అహోంలో జరిగే పెద్ద పర్వదినం) సందర్భంగా పక్షుల పోటీలు, దున్నపోతుల పోటీల వంటి రకరకాల పోటీలను నిర్వహించేవారు. క్రీడా ప్రదర్శనలను నిర్వహించే ఇంత పెద్ద ఆంఫిథియేటర్‌ భారత్‌లోనే కాదు, ఆసియాలోకెల్లా ఇదే అతి పురాతనమైనది కావడం గమనార్హం. 2007లో గౌహతిలో జరిగిన జాతీయ క్రీడలకు రంగ్‌ఘర్‌ను అధికారిక లోగో గా ఉపయోగించారు.

No comments:

Post a Comment