విహారాలు

India

Gamyam

Friday, December 17, 2010

శ్రీశైలం- మహానంది- అహోబిలం

చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి లేదా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు. రాయలసీమ నుంచి వచ్చేవారు అహోబిలం మీదుగా మహానంది, అక్కడి నుంచి అటవీ మార్గంలో శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబ దర్శనం అనంతరం, దగ్గరలోని ఇష్టకామేశ్వరి ఆలయం, పాతాళగంగ చూసుకొని రాత్రి అక్కడే బస చేయవచ్చు. దేవస్థానం సత్రాలతో పాటు టి.టి .డి. కాటేజ్‌లు కూడా ఉన్నాయి.
దేవస్థానం ఫోన్ నెంబర్లు : 08524-288883,288885, 288886. 
గంగ, యమున కాటేజ్ ఫోన్ : 08524-287351.

మహానందీశ్వరం
మరుసటి రోజు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం నుంచి దోర్నాల మీదుగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహానంది చేరుకోవడం ఓ ఆధ్యాత్మిక అనుభవం. మహానందిలో పర్వతసానువుల్లో కొలువైన నందీశ్వర స్వామి దర్శనం ఆహ్లాదం కలిగిస్తుంది. ఆలయం వెనుక ఉన్న కొండల నుంచి స్వచ్ఛమైన నీరు వేసవిలో సైతం కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. నందీశ్వరుని కిందుగా వచ్చే ఆ ధార, ఆలయం ఎదురుగా ఉండే కోనేరులో పడుతుంది. ఆ కోనేరులో భక్తులంతా స్నానాలు చేస్తారు.


వసతి సౌకర్యాలు : తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన 28 గదుల సత్రం, మహానంది దేవస్థానం నిర్మించిన 5గదుల సత్రం, పాపిరెడ్డి కాటేజి, నాగనంది సదనంలో 25గదులతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలకు చెందిన వసతి గృహాలు వున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ వసతి, టూరిజం అతిథి గృహాలు వున్నాయి. 
ఫోన్ నెంబర్లు : 
దేవస్థానం కార్యాలయం - 08514 234726, 234727, 234728,
పున్నమి అతిథి గృహం 9441733829

నవనారసింహం

మహానంది నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అహోబిల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నవ నారసింహులు వెలసి ఉన్నందున నవ నారసింహ క్షేత్రమని పిలుస్తారు. నరసింహ స్వామి కొండ కిందా పైనా వెలసి ఉండటంతో దిగువ, ఎగువ అహోబిలమని పిలుస్తారు. ఇక్కడ నివసించే చెంచులు నృసింహ దేవునికి జుంటి తేనె, అడవి మాంసం నైవేద్యముగా సమర్పించి పూజిస్తారు. నరసింహుడు చెంచులక్ష్మిని పరిణయమాడినట్లుగా భావించి చెంచులు అల్లుడిగా మర్యాదలు చేస్తారు. ఈ ఆలయాలన్నీ ప్రకృతి సోయగాలతో అలరారుతూ ఉంటాయి.


అహోబిల నరసింహస్వామి(ఎగువ అహోబిలం), మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహ స్వామి, కారంజ నరసింహ స్వామి, భార్గవ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, ఛత్రవట నరసింహ స్వామి, పావన నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహ స్వామి(దిగువ అహోబిలం)లు నవ నారసింహులుగా పూజలందుకుంటున్నారు. ఎగువ అహోబిలం ఆలయం పక్క నుంచి రమణీయమైన కొండలు, జలపాతాలను చూసుకుంటూ నవనారసింహుల్లోని ముగ్గురు నరసింహ స్వాముల్ని దర్శించుకోవచ్చు. ఓపిక ఉన్న వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ 5 కిలోమీటర్లు నడిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. నడవలేని వారికి డోలీ సౌకర్యం కూడా వుంది. గండశిల నుంచి చూస్తే నల్లమల అందాలన్నీ ఒకచోటు పోగేసుకున్నాయా అనిపిస్తుంది.


ప్రకృతి ఆరాధన స్ఫూర్తిని మనలో కలిగించేందుకే పుణ్యక్షేత్రాలను పర్వతాలు, అడవులు, నదీనదాల చెంత ఏర్పాటు చేశారనేందుకు అహోబిల క్షేత్రం నిదర్శనం. శ్రీశైలం, మహానంది, అహోబిలం క్షేత్రాలు చూసేందుకు కనీసం మూడు రోజుల సమయం కేటాయిచాలి. టూరిజం గెస్ట్‌హౌస్‌తో పాటు దేవస్థానం వసతి కూడా అందుబాటులో ఉంటుంది. 
మఠం వారి మాలోల అతిథి గృహం ఫోన్ నెం:08519-252045, 
ఏపీ టూరిజం వారి హరిత అతిథి గృహం ఫోన్:08519-252060, 
టీటీడీ అతిథిగృహం ఫోన్ నెం:08519-252045, 
అహోబిలం మేనేజర్ కార్యాలయం ఫోన్ నెం: 08519-252025

No comments:

Post a Comment