విహారాలు

India

Gamyam

Wednesday, December 15, 2010

పాపికొండల్లో.. హ్యాపీగా...

papikondalu2
చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది.

‘హైదరాబాద్‌ - భద్రాచలం - పాపికొండలు’ ఈ పదాల కలయికే ఆసక్తిక రం. భద్రాచలం మీదుగా... హైదరాబాద్‌ నుంచి పాపికొండలకు పర్యాటకాభివృద్ధి సంస్థ ఇటీవలే ప్యాకేజీని ప్రవేశపెట్టింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరితే... భద్రాచలంలో భద్రాద్రి రాముడు, పర్ణశాల సందర్శనం... అనంతరం గోదా రమ్మ ఒడిలో ‘హరిత’ ప్రయాణం... వెదురు గుడిసెల్లో బస... పాపికొండల ప్రయాణానికి చిరునామాగా మారిన పేరంటాల పల్లి సందర్శన... ఇదీ ఈ ప్యాకేజీ.

తొలి అడుగు భద్రాచలంలో...
papikondalu1హైదరాబాద్‌ నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ప్రతి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:30 - 6:00 గంటల మధ్య భద్రాచలం చేరుకుంటుంది. అక్కడే హరిత హోటల్‌లో బస. శబరీ నదీ స్నానం, కొండపై కొలువైన భద్రాద్రి రాముని దర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి 70 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణం. పర్ణశాల, ఇతర స్థానిక పర్యాటక కేంద్రాల సందర్శనాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది.

ప్రయాణం ‘హరిత’మయం...
దీనికి కొనసాగింపుగా... పోచవరం వరకు బస్సు ప్రయాణం ఉంటుంది. దట్టమైన అడవుల్లో గిరిపుత్రులు నివాసం ఉండే పోచవరం గోదావరి నదీ తీరం లో ఉంది. అడవుల్లో అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉండే గిరిజనుల ఆవాసాలు చూపు మరల్చుకోనీయవు. అక్కడి నుంచి పాపికొండల ప్రయాణం మొదలవు తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన బోటు ‘హరిత’లో జలప్రవేశం.

papikondalu3 180 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ బోటులో సుమారు రెండున్నర గంటల మేర ప్రయాణం నిజంగా ‘హరిత’మయమేనని అనిపిస్తుంది. ఎందుకంటే... పచ్చగా అలరారే దట్టమైన అడవుల మధ్య పాయగా చీలిన గోదావరి అలలపై ఈ పడవ పర్యాటకులను తీసుకెళ్తుంది. సూర్యాస్త మయం వేళ, బంగారు రంగులో మెరిసిపోయే గోదావరి నదీ జలాలు, పర్వతాల బారుల వెనుక అస్తమించే సూర్యు డిని తిలకించడం ఓ అద్భుతమే..!

ఇసుక తిన్నెల్లో, వెదురు గుడిసెల్లో...
సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం పర్యాటకులు కొల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఇసుక తిన్నెల్లో వెదురు బొంగులతో వేసిన గుడిసెలు స్వాగతం పలుకుతాయి. పర్యాటకుల రాత్రి బస అక్కడే. సంధ్యవేళ పర్వాతాల మీది నుంచి సుడులు తిరుగుతూ వీచే చల్లని గాలులు ఇబ్బంది పెట్టకుండా పర్యాటక శాఖ సిబ్బంది బ్లాంకెట్లను ఏర్పాటు చేస్తారు. గిరిజనుల సంప్రదాయ వంటకాలతో భోజనం ఉంటుంది. చుట్టూ నీళ్లు, హరితమయమైన పర్వతాల పంక్తి, సోలార్‌ దీప కాంతుల మధ్య డిన్నర్‌.

ఉషోదయం వేళ ఈశ్వరాలయ సందర్శనం...
papikondalu కొల్లూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పాపికొండల మధ్య వెలసిన పేరంటాల పల్లి శైవక్షేత్రం సందర్శన ఉంటుంది. ఏటా కార్తికమాసం, శివరాత్రి పర్వదినాల సమయంలో ఈ శైవక్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పేరంటాల పల్లి నుంచి హరితలోనే తిరుగు ప్రయాణం ఉంటుంది. లాంచీలో పోచవరం, అక్కడి నుంచి మళ్లీ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులో భద్రాచలం చేరుకుంటారు. పాపి కొండల ప్రయాణం మిగిల్చే మధు రానుభూతులతో హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులో తిరుగు ప్రయా ణం అవుతారు. ఇది జీవితంలో మరిచిపోలేని విహారంగా మగిలిపోతుంది.

హైదరాబాద్‌ నుంచి ఇదే తొలిసారి...
ప్రస్తుతం పాపికొండల ప్రయాణం రాజమండ్రి నుంచి కొనసాగుతోంది. అది కూడా కేవలం బృం దాలుగా వెళ్లడానికే వీలుంది. హైదరాబాద్‌ నుంచి కూడా ఉన్నా... పాపికొండల మధ్య రాత్రి బస చేసే అవకాశం ఉండేది కాదు. ఈ రెండింటికి భిన్నంగా... పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా కొత్తగా ఈ ప్యాకేజీని ప్రకటించారు.

ప్రతి వారాంతంలో అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి, శని, ఆదివారాల్లో పాపికొండల్లో విహరించి... సోమవారం తెల్లవారు జామునే హైదరాబాద్‌కు చేరుకునేలా సుల్తానియా... ఈ ప్యాకేజీని రూపొందించారు. నగరానికి చెందిన పర్యాటకుల నుంచి ఈ ప్యాకేజీకి చక్కని స్పందన లభిస్తోంది. కిందటినెలలోనే హైదరాబాద్‌-నాగార్జున సాగర్‌-శ్రీశైలం ప్యాకేజీని కూడా ఆయన ప్రవేశపెట్టారు.
ఏపీ టూరిజం ఎండీ... Tourism-MD
సందీప్‌ కుమార్‌ సుల్తానియా

టారిఫ్‌ వివరాలివీ...
ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2800
పిల్లలకు - రూ.2250
నాన్‌ ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2250
పిల్లలకు - 1850
సంప్రదించాల్సిన పర్యాటక శాఖ కార్యాల యాల వివరాలు...
హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌లోని కేంద్రీకృత రిజర్వేషన్‌ కార్యాలయం, ట్యాంక్‌బండ్‌ వద్ద గల పర్యాటక శాఖ కార్యాలయం, గ్రీన్‌ల్యాండ్‌లోని టూరిజం ప్లాజా, సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌లల్లో ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు... 9848540371, 040- 66746373, 66745986.
- మహేంద్రకర్‌ చంద్రశేఖర్‌ రావు

No comments:

Post a Comment