‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ’ అని ఓ సినీకవి అభివర్ణించినట్టు.. ప్రకృతి కన్యలా.. పచ్చని చెట్లతో నిండిన అభయారణ్యంతో.. కిలకిలారావాలతో పక్షుల సందడితో.. రాష్ట్రంలోనే ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది కిన్నెరసాని. సెలయేళ్ల మధ్య పశుపక్ష్యాదులతో కనువిందు చేసే ప్రకృతి సోయాగాల అందాలతో... జీవావరణ ఉద్యానవనంగా ఖ్యాతి గడిం చిన ఆ పర్యాటక కేంద్రం కనువిందు చేసే ప్రకృతి సోయగాలు
- పిక్నిక్ స్పాట్‌గా కిన్నెరసాని
ఖమ్మం జిల్లా పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలోని యానంబైలు, కిన్నెరసాని గ్రామాల నడుమ 34 సంవత్సరాల క్రింత 1967లో అటవీ శాఖ అభయాణ్యంలో కిన్నెరసాని నదిపై రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రిజర్వాయర్ డ్యామ్ నిర్మాణించిన దగ్గరనుండి దగ్గర నుంచి పిక్నిక్ స్పాట్‌గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ర్ట నుంచి సైతం పర్యటనకు వస్తుంటారు. పాల్వంచలో నెలకొల్పిన వివిధ పరిశ్రమలకు వ్యవసాయ రంగానికి నీటిని అందజేయాలనే సంకల్పంతో నిర్మించిన రిజర్వాయర్.. జెన్కోకు చెందిన కేటీపీఎస్, స్వాంజ్ ఐరన్ ఇండియా లిమిటేడ్, నవభారత్ కర్మాగారాలకు నీటిని అందిస్తోతంది.
అంతే కాకుండా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు సైతం నీటిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. ఈ నది నీటి ప్రవాహం మీద దిగువ భాగంలో దాదాపు 2 వేల ఎకరాల భూమిని సాగు చేస్తూ దీనిపై అధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు 350 ఎకరాల విస్తీర్ణంలో నీటితో నిండిన కిన్నెరసాని ప్రాజెక్టు పచ్చని చెట్లు, గుట్టలు, లోయల మధ్య కనువిందు చేస్తూ దర్శనమిస్తో్తంది. నదిపై నిర్మాణం చేసిన డ్యామ్‌కు 14 క్లస్టర్ గేట్లను ఏర్పాటు చేశారు.
సెలవుల్లో సందడి...
స్థానిక విద్యార్థినీ, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు సెలవు దొరికిందంటే చాలు కిన్నెసానిలో ప్రత్యక్షమవుతారు. దీనికి తోడు దూరప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో సెలవు దినాల్లో ఈ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోతుంది. 1974 నవంబర్ 29న నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా సింగరేణి కాలరీస్ సంస్థ రెండు అంతస్తుల అద్దాల మేడ, జింకల పార్కు 10 క్యాటేజీలతో పాటు విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు.
ఇక్కడి అభయ అరణ్యాన్ని పరిరక్షించి అంతరించిపోతున్న అరుదైన జంతు జాతులను రక్షించేందుకు వన్యమృగ సంరక్షణ విభాగాన్ని పాల్వంచ కేంద్రంగా నెలకొల్పారు. ఒక డివిజనల్ స్థాయి అధికారి ఇద్దరు రేంజ్ అధికారులతో మొత్తం 20 మందికి పైగా సిబ్బందితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి కాలరిస్ సంస్థ ఆధీనంలో ఉండే జింకల పార్కును వైల్డ్ లైఫ్ శాఖకు అప్పజెప్పడంతో వారే ఆలనాపాలనా చూస్తున్నారు. అదే విధంగా 6 సంవత్సరాల క్రితం వరకు కిన్నెర సాని ప్రాంతంలో అడవి సంరక్షణ బాధ్యతల ఫారెస్టు శాఖ అధీనంలో ఉండగా ఇటీవల ఫారెస్టు నుంచి వైల్డ్‌లైఫ్ యనంబైలు రేంజ్ పరిధిలోకి మార్పు చేశారు. మొదట ఇరిగేషన్ శాఖ అధీనంలో ఉన్న కిన్నెరసాని డ్యామ్ జెన్కోకు చెందిన కేటీపీఎస్ యాజమాన్యం చేతుల్లోకి వచ్చింది. ఈ అభయారణ్యంలో పులి, చిరుతపులి, ఎలుగు బంట్లు, దుప్పలు, అడవి పందులు, కుందేళ్ళు తదితర వన్యమృగాలు సంచరిస్తుండగా 300 రకాల పక్షులు జాతీయ పక్షి నెమళ్లు, ముసళ్ళు, వందల సంఖ్యలో ఉన్నాయి.
టేకు, ఉసిరి, మామిడి, జిట్రేగి, బండారి, సోమ, ఎగిస, వెదురు. మెర్రెడు, జాలేరు రాళ్ళ వాగు లాంటి జీవ వాగులు సైతం ఉన్నాయి. ఇలాంటి అకర్షణీయమైన అందాలతో కిన్నెరసాని ప్రాజెక్ట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగరేణి కాలరీస్ సంస్ధ ఏర్పాటు చేసిన అద్దాల మేడ కాటేజీలు, జలదృశ్యం విశ్రాతి భవనం వంటి వసతి సదుపాయాలు ఉన్నాయి. అయితే.. వీటిని ఎక్కువగా.. సింగరేణి అధికారులు, అటు జెన్కో కేటీపీఎస్ అధికార్లు సిబ్బంది వీఐపీలు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారన్న అపవాదు కూడా లేదకపోలేదు.
అద్దాల మేడ...
కిన్నెరసానికి ప్రత్యేక ఆకర్షణ.. అద్దాల మేడ. 34 సంవత్సరాల క్రింతం సింగరేణి సంస్థ నిర్మించిన అద్దాల మేడ పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే కొన్నేళ్ళ క్రితం పీపుల్స్‌వార్ ఈ అద్దాల మేడను బాంబులతో ధ్వంసం చేయడంతో దీని ఆకర్షణీయతకు కొంత విఘాతం ఏర్పడింది. ధ్వంసమైన అద్దాల మేడను పునురుద్ధరిస్తే.. పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కాటేజీలను శుభ్రపరిచి, మంచినీటి సౌకర్యం కల్పిస్తే అద్దాల మేడకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడికి విచ్చేస్తున్న పర్యాటకులు కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
- చింతపల్లి వెంకట్ నర్సింహారెడ్డి, బుర్ర కోటేశ్వరరావు,
కొత్తగూడెం, ఖమ్మం
కొత్తగూడెం, ఖమ్మం
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment