విహారాలు

India

Gamyam

Tuesday, May 10, 2011

గ్రీకు సంస్కృతికి పెట్టని కోట.. పెట్రా


Petraఅరేబియన్‌ ఎడారి అంచున ఉన్న.. నబతియన్‌ సామ్రాజ్యపు చారిత్రక రాజధాని నగరం పెట్రా. సముద్ర సంబంధిత సాంకేతిక రంగంలో ప్రవీణులైన నబతేయన్లు ఈ నగరానికి ఎన్నో సొరంగ మార్గాలను, నీటి కందకాలను నిర్మించారు. గ్రీకు-రోమన్ల సంస్కృతికి నిలువుటద్దం లాంటి.. సుమారు నాలుగువేల మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా వుండే ఒక రంగస్ధలం ఇక్కడి ప్రధాన ఆర్షణ. అందువల్లనే ఈ నగరం.. నేటి ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. గ్రీకు, రోమన్‌ నాగరికత ఇక్కడి కపిలవర్ణ శిలల్లో మనకు దర్శనమిస్తుంది. ఎల్‌-డీయర్‌ మోనాస్టరీ (ఒక మఠం వంటి ప్రాంగణం) వద్ద హెలెనిస్టిక్‌ దేవాలయానికి అభిముఖంగా ఉన్న.. పెద్ద పెద్ద భవనాల్లాంటి ఎన్నో సమాధులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇవి మధ్య తూర్పు దేశాల సంస్కృతికితార్కాణాలుగా నిలుస్తున్నాయి.

అక్కడ జన సంచారం అంతగా కనిపించదు. ఉన్నట్టుండి వీచే వేడిగాలులు.. ఇసుక తుఫానులూ - వాతావరణాన్ని ఒక్కసారిగా కలగాపులగం చేస్తాయి. అంతటి వేడిమిలోనూ - ఒకింత చల్లదనంతో సేదతీర్చే పిల్లతెమ్మెరలు అప్పుడప్పుడూ పలకరిస్తుంటాయి. మనసుని పులకరింతల దొంతరల్లోకి నెట్టివేస్తాయి. అదే పెట్రా. జోర్దాన్‌లోని మధ్య తూర్పు ప్రాంతం. జాన్‌ విలియం బర్గన్‌ అనే కవి 1845లో పెట్రాపై ఓ అందమైన కవిత రాశాడు. ఒంటరితనం - అందం - సౌకుమార్యం కలగలిసిన అందమైన నగరం అంటూ. ఆ తర్వాత న్యూడైజెట్‌ అవార్డుని అందుకోవటం.. ఆ కవిత దేశ విదేశీ సరిహద్దుల్ని దాటి అశేష పాఠకుల మదిని దోచుకోవటం - ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోయిన సంగతులు. అప్పట్నుంచీ పెట్రా పర్యాటకుల మనసుల్ని కొల్లగొట్టే అంశంతో వార్తల్లో చోటు చేసుకుంటూనే ఉంది. ఇక్కడికి జోర్దాన్‌ నుంచీ అతి తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు. ముస్లిం సంస్కృతి అడుగడుగునా. ఇక్కడి వారికి ఆచార వ్యవహారాలన్నా.. సంస్కృతీ సంప్రదాయాలన్నా ప్రాణం. కాబట్టి - విదేశీ పర్యాటకులు కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అరకొర దుస్తులతో దర్శనమివ్వటం వీరికి నచ్చదు. జోర్దాన్‌లోని వాడిమూసా గ్రామానికి అతి సమీపంలోని పెట్రాకి వెళ్లాలంటే - అమ్మన్‌ ఎడారి ప్రాంతం నుంచీ జాతీయ రహదారిపై ప్రయాణించాలి.

కపిలవర్ణ శిలల్లో కమనీయ చరిత్ర...
Petra1ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటైన నగరం జోర్డాన్‌లోని పెట్రా. ఇదే కాదు.. మరో చారిత్రక నగరం జెరిష్‌ కూడా ఎన్నో చారిత్ర విశేషాలను తనలో దాచుకుంది. దాదాపు రెండు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పెట్రా ఒకప్పటి వ్యాపార కేంద్రం. మౌంట్‌ హోర్‌ అనే పర్వతాన్ని తొలిచి ఈ నగరాన్ని నిర్మించారట. పెట్రా అన్న పదం గ్రీకు పదం పెట్రియా నుంచి వచ్చింది. అంటే రాయి అని అర్థం. ్రపూ.6వ శతాబ్దంలో నబాటియన్ల రాజధానిగా వెలుగొంది గ్రీకు చరిత్రకి ఎన్నెన్నో అద్భుత కళకృతులను అందించింది. ఇప్పటికీ శాస్తవ్రేత్తల మదిని తొలిచే సంగతుల నెన్నింటినో ఈ నగరం వెలికి తెస్తూనే ఉంది. 1812 వరకూ పెట్రా ఆనవాళ్లు ప్రపంచానికి తెలియదు. స్విస్‌ చారిత్రిక పరిశోధకుడు జోహన్‌ లడ్విగ్‌ బర్కంత్‌ ఈ పెట్రా చరిత్ర పుటల్ని తెరిచిన మొట్టమొదటి వ్యక్తి. ఈ నగరాన్ని రెడ్‌-రోజ్‌ సిటీగా అభివర్ణించాడు జాన్‌ విలియం అనే కవి.

Petra_Roman_Gateయునెస్కో చారిత్రక నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కోటను.. ఇక బీబీసీ మరికాస్త ముందుకు వెళ్లి... మరణించేలోపు మీరు చూడాలనుకుంటున్న అరుదైన పర్యాటకకేంద్రాల్లో పెట్రా ఒకటని తేల్చేసింది. అందుకే ఈ అందమైన నగరం ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. పెట్రా చారిత్రక కట్టడమే కాదు.. సువిశాలంగా విస్తరించిన పర్షియల్‌ గల్ఫ్‌ ప్రాంతానికి చేరుకోవటానికి చక్కటి మార్గం కూడా. దక్షిణాన.. గాజా, ఉత్తరాన.. బోస్రా, డమాస్కస్‌, అకాబా, లూరుూస్‌ ప్రాంతాల వారితో నబాటియన్లు వ్యాపార వ్యవహారాలు నడిపేవారట. చుట్టూ ఎడారి ప్రాంతం.. కొండలూ గుట్టల మధ్య ఎలాంటి నీటి వసతి లేకున్నా.. చక్కటి ప్రణాళికతో నబాటియన్లు నిర్మించిన ఈ కోట చరిత్రకు పునాదులు వేసింది. ఉన్నపళంగా వరదలు ముంచెత్తినా.. ఏళ్ళ తరబడి వర్షాలు కురవకపోయినా.. నబాటియన్ల ఆలోచనల ముందు ప్రకృతి సైతం తలవంచాల్సి వచ్చింది. ఉవ్వెత్తున ముంచుకొచ్చే వరదలు ఓ వైపు నుంచీ కోటని దాటి మరోవైపు వెళ్లిపోయేందుకు.. కోట లోపల సమృద్ధిగా నీటి వనరులు నిల్వ ఉండేందుకు వారు కల్పించిన మార్గాలు ఇన్నీ అన్నీ కావు. పెట్రా కోటని ఒక్కరోజులో చూడాలంటే కుదిరే పనికాదు. ప్రతి అడుగునూ స్పృశించటం.. మనసు తెరల్లో చరిత్రని నిక్షిప్తం చేసుకోవటం.. ఆనాటి శిల్ప చాతుర్యానికి అచ్చెరువొందటం.. ఒక్కరోజులో ఎలా సాధ్యం. పెట్రా కోట అంతరంతరాల్లోకి వెళ్ళి తరచి చూడటం ఒక్కటే మార్గం.

జెరిష్‌ కూడా...
పెట్రా లాంటిదే మరో నగరం జెరిష్‌. శతాబ్దాల చరిత్రకలిగిన ఈ నగరం.. ఎందరో కళాకారుల శ్రమ ఫలితం. సుమారు ఆరు వేళ ఏళ్ళ క్రితమే ఇక్కడ మానవుడు నాగరికుడిగా జీవించాడు. దానికి తార్కాణాలుగా ఎన్నో అద్భుత కట్టడాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. విశాలమైన వ్యాపార కేంద్రం (ప్లాజా), కొలానాడెడ్‌ వాక్‌వే, కాథడ్రల్‌ థియేటర్‌ లాంటి ఎన్నో విశిష్ట కట్టడాలు. ప్రతి పర్యాటకుడి మదిని పులకింపజేస్తాయి.

వాడి రామ్‌ ఎడారి, మృత సముద్ర అందాలు...
Jerashఈ ఎడారిలో సూర్యస్తమయ దర్శనం.. వర్ణించరాని అనుభూతి. కపిలవర్ణ ఇసుకతిన్నెల మాటున.. సన్నని సూర్యకాంతితో మెరిసే రాళ్ళతో ఇక్కడ సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక మృత సముద్రం (డెడ్‌ సీ) గురించి చెప్పాలంటే.. ఈ సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు. సాధారణ సముద్ర జలాలకంటే.. ఈ మృత సముద్రంలోని నీరు పదిరెట్టు ఉప్పుగా ఉంటుంది. మీకు పూర్తిగా ఈదడం రాకపోయినా.. ఈ డెడ్‌ సీలో ఈదడం అత్యంత సులభం. సూర్యాస్తమయం సమయాన.. ఈ చల్లని సముద్ర జలాల్లో ఈదడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.

నోరూరించే.. జోర్డాన్‌ శాఖాహారం..
పెట్రా ట్రిప్‌లో మిమ్మల్ని ఎంతోగానో ఆకర్షించేది.. ఇక్కడి శాఖాహార భోజనం. జోర్డాన్‌లో ఎక్కువ శాఖాహారాన్ని ఇష్టపడతారు. స్థానికంగా దొరికే రకరకాల దుంపలు, ఎగ్‌ప్లాంట్స్‌, బ్రెడ్‌ ఉపయోగించి చేసే వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా గ్రీన్‌ సలాడ్‌ లాంటి భోజనానంతర పానీయాలు కూడా నోరూరిస్తాయి. ఉడకబెట్టిన కూరగాయలతో చేసే వంటకాలే ఇక్కడ మనకు ఎక్కువగా దర్శనమిస్తాయి. మదబా ప్రాంతంలోని హారెట్‌ జె.డౌడ్నా, పెట్రాలోని పెట్రా కిచెన్‌ లాంటి హోటళ్లు ఇలాంటి వంటకాలకు ఎంతో ప్రసిద్ధి.

భిన్న సంస్కృతులకు ఆలవాలం...
జోర్డాన్‌లో సర్వమత సమ్మేళనం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ క్రిస్టియన్‌, ఇస్లాం మతం వెల్లివిరుస్తోంది. ఇక్కడ ‘బెథానీ బెయాండ్‌ జోర్డాన్‌’లో ఉన్న బాప్టిస్ట్‌ చర్చికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఇక్కడ ఏసుక్రీస్తు.. ‘జ్ఞాన స్నానం’ (బాప్టైజ్‌డ్‌) చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడికి సమీపంలో ఉన్న మౌంట్‌ నెబో ను మోజెస్‌ విడిదిచేసిన చివరి మజిలీగా చెబుతారు. ఇలాంటి ఎన్నో చారిత్రక విశేషాలను తనలో నిక్షిప్తం చేసుకున్న జోర్డాన్‌ను జీవితంలో ఒక్కసారైనా దర్శిచాలి.. అనడం అతిశయోక్తి కాదేమో..

No comments:

Post a Comment