విహారాలు

India

Gamyam

Sunday, May 22, 2011

ఘన చరిత్ర గల నగరాలు రోస్టాక్, బెర్లిన్

గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మండే, మధ్యలో వీకెండ్ కలుపుకుని నాలుగు సెలవులు రావడంతో, స్నేహితులని కలిసేందుకు రోస్టాక్ వెళ్లాను. అక్కడి నుంచి ఒకరోజు బెర్లిన్ కూడా వెళ్లొచ్చాం. బయలుదేరినప్పుడు మామూలు సెలవులే, మామూలు సరదా తిరుగుళ్లే అనుకున్నాను కానీ, ఈ కొద్ది రోజుల గురించీ, ముఖ్యంగా బెర్లిన్ గురించి ఇంత బలమైన ముద్ర పడుతుందని ఊహించలేదు. రెండూ ఘనమైన చరిత్ర గల నగరాలే.

మొదట రోస్టాక్ గురించి చెబుతాను.

రోస్టాక్ నగరం జర్మనీ దేశాన, ఉత్తర దిశలో, బాల్టిక్ సముద్రం ఒడ్డున ఉంది. వార్నో నది దీని గుండా ప్రవహిస్తుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన యూనివర్సిటీల్లో ఒకటైన రోస్టాక్ విశ్వవిద్యా లయానికి ఇది ప్రసిద్ధి. అలాగే, నౌకానిర్మాణ పరిశ్రమలెన్నో ఉన్నాయి. ఈ నగరానికి పదకొండో శతాబ్దం నుంచీ చరిత్రలో స్థానం ఉంది. ఒకానొక కాలంలో, గొప్ప వెలుగు వెలిగి, మధ్యలో తగ్గి, మళ్లీ పందొమ్మిదో శతాబ్దం నాటికి పుంజుకుంది. ప్రపంచ యుద్ధ కాలంలో దారుణంగా దెబ్బతిన్నా, క్రమంగా మళ్లీ నిలదొక్కుకుంది.

ఈస్టర్ సమయంలో వెళ్లినందుకేమో, తాత్కాలికంగా వెలిసిన దుకాణాలు మార్కెట్ వీధుల నిండా కనిపించాయి. రాత్రి వేళ వెళ్లినందుకు అక్కడి సందడి కళ్లారా చూడలేదు కానీ, పండగ వాతావరణం తెలుస్తూ ఉంది. మార్కెట్ ప్రాంతంలో ఒకప్పటి నగర సరిహద్దుల్ని తెలిపే గోడా, నగర ముఖ ద్వారం తాలూకు ఆనవాళ్లూ ఇంకా అలాగే ఉన్నాయి. అలాగే, చారిత్రక దృష్టితో అలాగే ఉంచేసిన పాత కట్టడాలు (కాలం దాడులను తట్టుకున్నవి) - గతానికి సాక్ష్యాలుగా, ఠీవిగా, గంభీరంగా చూస్తూ, నగరమంతా కనిపిస్తూనే ఉన్నాయి.

ఇక్కడి విశ్వవిద్యాలయం నగరమంతా వ్యాపించి ఉంది. అక్కడొకటీ, ఇక్కడొకటీ, వారి భవనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయం 1419లో స్థాపితమైంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా, ఇప్పటి దాకా నిలిచి ఉంది. దాదాపు అప్పట్నుంచీ అలాగే ఉన్న భవనాలు కొన్ని ఉన్నాయి. ఐన్‌స్టీన్‌కు గౌరవ డాక్టరేటు ఇచ్చిన మొదటి విశ్వవిద్యాలయంగా దీని పేరు గుర్తు నాకు.


ఇక బాల్టిక్ సౌందర్యం చెప్పనలవి కాదు. ఒక పక్క మంచులో నడుస్తున్నట్లు కాళ్లని గడ్డ కట్టిస్తున్న నీళ్లలో నడుస్తున్నా, బయటకు రావాలనిపించలేదు. ఎటు చూసినా పెద్దవీ, చిన్నవీ నౌకలు, వయసు తేడా లేక హాయిగా ఆనందిస్తున్న జనం. వీరిలో అనుకోకుండా, మేము తెలుగు మాట్లాడుతూ ఉండడం విని, ఒక తెలుగు కుటుంబం కూడా పలకరించింది. ఇక్కడి నుండి స్వీడన్, ఫిన్‌ల్యాండ్, డెన్మార్క్, ఇస్టోనియా, లాట్వియా వంటి దేశాలకు ఫెర్రీల్లో కూడా వెళ్లొచ్చు. సమయాభావం వల్ల, ఫెర్రీ అనుభవం ఇంకా ఎదురుకాలేదు.


ఇక బెర్లిన్ అనుభవం...

బెర్లిన్ చేరాలంటే రోస్టాక్ నుండి ట్రైన్‌లో దాదాపు రెండున్నర గంటల ప్రయాణం. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, ప్రతి నిమిషమూ చరిత్ర పాఠంలా గడిచింది. పాఠ మంటే, తరగతి గదుల పాఠాల తూటాలు కాదు - జీవితాల, గతాల వ్యథా, కథానూ!

బెర్లిన్ స్టేషన్ ఓ పెద్ద బహుళ అంతస్థుల షాపింగ్ మాల్. కిందా పైనా కూడా ట్రైన్లు కనపడ్డాయి. ఒకటి ఇక్కడి లోకల్ ట్రైన్లకూ, మరొకటి బయటి ట్రైన్లకూ అనుకుంటా. ఇది యూరప్‌లోని అతి పెద్ద స్టేషన్లలో ఒకటి. అత్యాధునికంగా ఉన్న ఈ భవనం బయట కొస్తే, ఒక వింత ఆకారంలో ఉన్న విగ్రహం ఉంది. అక్కడ రాసి ఉన్నది చదివితే తెలిసింది దీని చరిత్ర.


ప్రస్తుతం ఉన్న బెర్లిన్ స్టేషన్ 2006లో పూర్తయింది. ఇప్పుడీ స్టేషన్ ఉన్న చోట ఒకానొకప్పుడు ల్యేటర్ స్టేషన్ ఉండేది. 1871లో నిర్మితమైన ఈ స్టేషన్ అప్పట్లో చాలా ముఖ్యమైన కూడలి. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమ యంలో బాగా దెబ్బతింది. తరువాత, కొన్నాళ్లు కాస్త తక్కువ స్థాయిలో నడిచినా, మళ్లీ ఆగిపోయింది.


అందులోనూ, తూర్పు పశ్చిమ జర్మనీల విభజన జరిగాక పశ్చిమ జర్మనీ రైల్వే లైన్లు తూర్పు జర్మనీ చేతిలో ఉండటంతో, దీన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఎనభైల్లో కొంత పునర్నిర్మాణం జరిగినా, జర్మనీలు రెండూ కలిసిన కొన్నేళ్లకు, పాతదాని స్థానంలో ఇప్పటి స్టేషన్ రూపు దిద్దుకుంది.

స్టేషనులోని పర్యాటకుల సమాచార కేంద్రంలో నగర పర్యటన పేరిట ఉన్న కరపత్రం తీసుకుని, మ్యాప్ చూసుకుంటూ, అంతా నడిచే తిరిగాం ఆ రోజంతా.

ఇక్కడి నుంచి నడిచే దూరంలోనే, జర్మన్ చాన్సెలర్ అధికారిక కార్యా లయమూ, జర్మన్ పార్లమెంటూ ఉన్నాయి. 1894లో కట్టిన ఈ పార్లమెంటు భవనం అప్పట్నుంచీ జర్మన్ చరిత్రలో కలిగిన చాలా మార్పులకు ప్రత్యక్ష సాక్షి. ఇక్కడి నుండి బ్రాండెన్ బర్గర్‌టోర్ చేరుకున్నాం. ఇది ఒకప్పటి నగర ముఖద్వారం. బెర్లిన్ మొత్తం అక్కడే ఉందా అన్నంత సందడిగా ఉంద క్కడ.


ఒకప్పుడు ఇవతల ఒక దేశం, అవతల ఒక దేశంలా ఉండి, మిలటరీ క్యాంపులతో నిండి ఉన్న ప్రదేశమంతా, ఇప్పుడు పల్లె టూళ్లలో జరిగే జాతరలా ఉంది. విచిత్ర వేష ధారులు, పిల్లల ఆటలు, బెంజి కార్ల ప్రదర్శన. ఈ కోలాహలాల మధ్య ఎవరో ఉద్యమకారుల ప్రదర్శన కూడా కనపడింది. జర్మన్‌లో రాసి ఉండటం వల్ల అట్టే అర్థం కాకపోయినా, ఏదో అఫ్గాన్ యుద్ధానికి సంబంధించినదని అర్థమైంది. పండగ పాటికి పండగా, ప్రదర్శన పాటికి ప్రదర్శనా - దేని జనాలు దానికి. ఇలా రెండూ పక్క పక్కనే శాంతియుతంగా జరగడం నాకు కొత్తగా అనిపించింది.


ఇక్కడికి దగ్గర్లోనే ‘హోలోకాస్ట్ మెమో రియల్’ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం, అంతకుముందు కాలంలో మరణించిన యూదు మతస్తుల జ్ఞాపకార్థం గత దశాబ్దంలో నిర్మించిన కట్టడమిది. చూసేందుకు విభిన్నంగా ఉంటుంది. ఏమిటిది ఇలా ఉంది, అసలు దీని అర్థమేమిటి? అన్న సందేహం కలుగుతుంది.


అక్కడి నుండి వస్తూ, ఓ సైన్సు మ్యూజి యంకి వెళ్లి, అక్కడి పరిశోధనల ఫలితాల గురించి ఆసక్తికరంగా చూస్తూండగా, కింద రోడ్డుపై ఏదో ప్రదర్శన. ఈస్టర్ శాంతి ర్యాలీయా, అన్నింటినీ కలగలిసిన ప్రొటెస్టు ర్యాలీనా అన్నది అర్థం కాలేదు. ఇట్నుంచి నడిస్తే, బెర్లిన్‌లోని ప్రముఖ వ్యాపార కూడలి అయిన పోట్స్‌డామర్ ప్లాట్జ్ వద్దకు వచ్చాం. ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో నిండి, అద్భుత ప్రపంచంలా ఉంది కానీ, ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, తరువాత కోల్డ్‌వార్ కాలంలో ఇక్కడేమీ ఉండేది కాదట. కోల్డ్ వార్ కాలంలో బహుశా, బెర్లిన్ గోడ ఇక్కడి నుండే వెళ్లేదేమో.


పక్కకి తిరగ్గానే బెర్లిన్ గోడ! ఒకప్పుడు అటూ ఇటూ రెండు దేశాలు. ఇప్పుడు మిగిలిందల్లా గోడలోని కొంత భాగం, దానికి తోడు గతాన్ని మరువకుండా జ్ఞాపకం చేస్తూ ఆ రోడ్డుపై పెయింట్ చేసిన చరిత్రా. కాస్త ముందుకెళ్తే, ఒకప్పటి అమెరికన్ మిలట్రీ స్థావరమైన చెక్‌పాయింట్ చార్లీ కూడా కనిపిస్తుంది. కోల్డ్ వార్ కాలంలో, తూర్పు నుండి పశ్చిమానికి మరలడానికి ప్రయత్నించేవారికి ఇదే ద్వారం. ఇక్కడే ఒకప్పుడు ఎందరో సరిహద్దు దాటుతూ దొరికిపోయి ప్రాణాలు వదిలారు.


బెర్లిన్ గోడ ఆనవాళ్ల కింద, నాజీ దారుణాల గురించి తెలిపే ప్రదర్శన వంటిది ఏర్పాటు చేశారు. అవన్నీ చదువుతూ ఉంటే, ఆవేశం, అయోమయం, బాధ, ద్వేషం, భయం, దిగ్భ్రాంతి అన్నీ ఒకేసారి కలిగాయి. (చేసినవాళ్లు) వీళ్లూ మనుషులేనా? ఏమిటీ మూర్ఖత్వం? అనిపించింది. ఇవి చూస్తున్న ప్పుడే హిట్లర్ కాలంలో పెరిగిన ఒక ముస లావిడ కనిపించి, కాసేపు తన అనుభవా లను పంచుకున్నారు.


అయితే, గోడ చివర నుంచి ఈ చివర వరకూ నడుస్తూ, కింద ఈ ప్రదర్శన చివరికి వచ్చేసరికి, కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాం. అక్కడిదాకా, నేను బెర్లిన్ నగరాన్ని పెద్ద చరిత్ర ఉన్న నగరంగా చూస్తూ వచ్చా కానీ, అప్పటినుండి కొత్త గౌరవం కలగడం మొదలైంది. ఇన్ని దారు ణాలు చూసి, సర్వనాశనానికి గురై, ఎన్నో ఊచకోతలను నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చినా, అటుపై యుద్ధాలంటూ ముక్కలై, మళ్లీ మరణాలనూ, అశాంతు లనూ అనుభవించి, సుఖమన్నది చరిత్రేమో అన్నట్లు ఉన్న పరిస్థితుల నుండి, ఇప్పటి బెర్లిన్‌గా మారిన తీరు అద్భుతం!


ఇక్కడి ప్రజలు ఎలాంటివారో నాకు తెలీదు. దక్షిణాన కొత్త మనిషిని నన్ను సాదరంగా ఆహ్వానించినట్లు ఇక్కడా స్నేహంగా ఉంటారో లేదో నాకు తెలీదు. ఉన్నా లేకున్నా ఈ చరిత్రకు వారసులై, కొత్త జీవితాలు బతుకుతూ, దారుణాలైనా మరువక, తమ ముందు తరాల కష్టాలను గుర్తుపెట్టుకుని, పాత జ్ఞాపకాలను గౌరవిస్తూ ఉన్నారు కనుక, వీరంటే కూడా నాకు గౌరవం ఏర్పడ్డది. నిజంగానే మనలో ఎందరివో ‘చెంచాడు భవసాగరాలనీ’, పైగా చెంచాలు కూడా చాలా చిన్న సైజువనీ అనిపించింది.


ఇలా, ఈ భావోద్వేగాల వెల్లువలో కొట్టుకుపోయి, అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఇక్కడే గడిపేయడంతో, ఇతర ప్రాంతాలు చూడ్డానికి అట్టే సమయం మిగల్లేదు. అందుకే గబగబా చూస్తూ గెండార్మెన్ మార్కెట్ కూడలికి వచ్చాం. ఇది మరో అద్భుతమైన భవన త్రయం. నిజానికి తప్పకుండా తిరిగి వచ్చి కాసేపు గడపాల్సిన స్థలం ఇది. ఇక్కడి నుండి రాజసం నిండిన హుంబోల్ట్ విశ్వవిద్యాలయ భవనాలూ, అక్కడే ఉన్న పాత చర్చీ, దానిలోని ఆర్టు మ్యూజియమూ చకచకా చూస్తూ, మళ్లీ ఒక మెయిన్ రోడ్డు పైకి వచ్చాం.


ఇక్కడే ప్రఖ్యాతి చెందిన బెర్లిన్ డోమ్ ఉంది. అదే ప్రాంతంలో వివిధ ప్రముఖ మ్యూజియములు కూడా ఉన్నాయి. అయితే అప్పటికే సమయం సాయంత్రం ఆరు కావొస్తూ ఉండటంతో, ప్రవేశ ద్వారాలు మూసేశారు. డోం ఎదురుగ్గా ఉన్న లాన్‌లో కూర్చుని, ఈ కట్టడాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కాసేపు గడిపాం. దాంతో పాటు మరోసారి బెర్లిన్ రావాలి, ఈ ప్రాంతంలోనే ఎక్కువసేపు గడపాలి అని నిర్ణయించుకుని, రోస్టాక్ వెళ్లేందుకు మళ్లీ బెర్లిన్ స్టేషనుకు వచ్చాం.


ఈ నగరాల చరిత్ర చదివి వచ్చిన నేను ఈ నగరం ఇంత జీవకళతో ఉట్టిపడుతూ దర్శనమిస్తుందనుకోలేదు. మొత్తానికి రోస్టాక్, బెర్లిన్లను చూద్దాం అనుకుని టూరిస్టుగా వెళ్లినదాన్ని కాస్తా, ఈ నగరాల పోరాట స్ఫూర్తికి భక్తురాలిగా తిరిగొస్తానని ఊహించలేదు.


- వి.బి.సౌమ్య

No comments:

Post a Comment