ఓ వేసవి సాయంత్రం అక్కడ కొలువైతే... సింగరాలు, వయ్యారాలే... ఇంకా ఎన్నొన్నో దృశ్యాలు. అలసిపోయిన మనుషులకు, భారమైన మనసులను తేలిక పరిచే అద్భుత జల నాట్య తరంగిణి, విద్యుద్దీపాల వెలుగులు, సుగంధ ద్రవ్య పరిమళాలు.
వీటికి తోడుగా... చక్కనైన సంగీతం, మరెన్నో విశిష్టతలు. సరిగమపదనిసలు సరాగాలు ఆడినట్లు, రాగం తానం పల్లవి తామే అయినట్లు... సృష్టి, స్థితి, లయ తనే అయినట్లు... నీటి కాన్వాసుకు ఎన్నొన్నో వర్ణాలు. ఎగసిపడే జల సోయగం క్షణక్షణానికి అభిషేకం చేయడం... కూచిపూడి, భరతనాట్యాలు నాకు తెలుసన్నట్లు వివిధ నృత్య భంగిమలు... ఇలా అన్నీ కొలువై ఉండడం నిజంగా.. .మహాద్భుతమే. ఆ అద్భుతమే కొంత కాలానికి ఈ విశ్వమే అచ్చెరువొందేలా, పర్యాటకులు విస్మయం చెందేలా అలరిస్తోంది. దుబాయిలోని గ్లోబల్ వాటర్ ఫౌంటైన్... దర్శిస్తే హృదయానందం... క్షణం క్షణం... నయనానందం... తథ్యం...
బర్జ్ ప్రాంతంలో కొలువుదీరిన ఈ ఫౌంటైన్ 25 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది.
ఈ ఫౌంటైన్ సుమారు ఐదువందల అడుగల ఎత్తు వరకు నీటిని వెదజల్లగలదు. సహస్రాధిక రూపాల్లో ఈ నీరు నాట్యం చేస్తుంది. ఆ నాట్యాన్ని కళ్లతో చూసి ఆనందించాల్సిందే తప్ప వేరొకరు చెబితే థ్రిల్ ఉండదు. అంతా అత్యాధునిక సాంకేతికత్వంతో తయారు చేస్తోన్న ఈ గ్రేట్ ప్రాజెక్ట్ ఎమార్ డెవలపర్ మహ్మద్ ఆలీ అలాబర్ నిర్మించారు. ఫైవ్ స్టార్ హోటళ్ళు, రిసార్ట్‌స, 4 రెస్టారెంట్లు... అన్ని కలిపి సుమారు ఐదు వందల రూములుగా నిర్మించారు.. పారిశ్రామికంగాను, పర్యాటకంగాను దుబాయిని అంత ర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానాన్ని అలంకరించే దుబాయ్ పర్యాటకులను ఆకట్టుకోవడంలో కూడా అగ్రస్థానంలో ఉంది. కాలిఫోర్నియాకు చెందిన సాంకేతిక నిపుణులు ఈ ఫౌంటైన్‌ను తీర్చిదిద్దడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు.
ఎన్నో విశేషాలు...
జలకన్య నృత్యాలతో పాటు... అరబిక్, భారతీయ, పాశ్చాత్య సంగీతాలను సమన్వయం చేసే నిరంతర సంగీత స్రవంతి. రెస్టారెంట్లు... ఫౌంటైన్లను... ప్రభావితం చేసే ఏడు వేల విద్యుద్దీపాలు... సుమారు... 50 రంగులను నిక్షిప్తం చేశారు. ప్రతి క్షణం గాలిలోనే ఇరవై వేల గ్యాలన్ల నీరు మనకు కనిపిస్తుంది. వంద అడుగుల నుండి ఐదొందల అడుగుల వరకు నీరు తాండవం చేస్తుంది. ఈ హోటళ్ళు... రెస్టారెంట్ల... ఫౌంటైన్ అన్ని నిర్మాణాలు కలిసి సుమారు రెండు వందల పద్దెనిమిది మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయం అయ్యిందని అంచనా. గత సంవత్సరం ప్రారంభమైన ఈ జలసోయగం... ప్రపంచవ్యాప్త పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లాస్ వెగాస్ ఉన్న ప్రఖ్యాతిగాంచిన వాటర్ ఫౌంటేన్ కంటే ఇది ఎంతో పెద్దది... ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని లాస్‌వెగాస్‌లో వున్న ఫౌంటైన్ గొప్పగా భావించేవారు.. కానీ ఈ నిర్మాణం చేపట్టానికి ముందే ఇది రికార్డులను సృష్టించింది. కాగా ఈ ఫౌంటైన్‌ను నిర్మించేందుకు లాస్‌వెగాస్ ఫౌంటైన్‌ను చూసిన తర్వాతే ఈ ఆలోచన వచ్చిందని అలాబర్ అన్నారు. ఈ వాటర్ ఫౌంటైన్ సంవత్సరానికి సుమారు కోటి మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.
No comments:
Post a Comment