విహారాలు

India

Gamyam

Monday, May 30, 2011

ఒక దివ్య చారిత్రక ప్రకృతి.. సలేశ్వరం

సాధారణంగా ఒక టూర్‌లో దేవాలయాలను గాని, చారిత్రక ప్రదేశాలను గాని, ప్రకృతి రమణీయ ప్రదేశాలను గాని ఏదో ఒకటే చూస్తాం. కాని ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉండే అరుదైన ప్రదేశాల్లో ఒకటి మన రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవుల్లో ఉంది. పేరు సలేశ్వరం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేమార్గంలో 150 కిలోమీటర్ల మైలు రాయి దగ్గర ఫరహాబాద్ గేటు ఉంటుంది. అక్కడి నుండి 32 కి.మీ. దట్టమైన అడవుల్లోకి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌వారి అనుమతితో వెళ్లొచ్చు. 10 కి.మీ. వెళ్ళగానే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిథిల భవనాలు కనిపిస్తాయి.

నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు, చల్లదనానికి ముగ్దుడై వందేళ్ళకు ముందే అక్కడ వేసవి విడిదిని నిర్మించుకొన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి ఫరహాబాద్, అంటే అందమైన ప్రదేశం అని పేరొచ్చింది. అంతకు ముందు దాని పేరు పుల్లచెలిమల (పులుల చెలిమలు). ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. 'టైగర్ సఫారీ' పేరిట ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే జంతువులను, పులులను చూపిస్తారు.

నిజాం విడిది (రాంపూర్ చెంచుపెంట) చౌరస్తా నుంచి ఎడమకు తిరిగి 22 కి.మీ. వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్‌క్యాంప్ వస్తుంది. అక్కడ వాహనాలు ఆపుకోవాలి. అక్కడనుండి సలేశ్వరం అనే జలధార (వాటర్‌ఫాల్స్)ను చేరుకోవడానికి 2 కి.మీ నడవాలి. రెండు పొడవైన, ఎత్తైన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయక్కడ. ఆ గుట్టల మధ్య ఒక లోతైన లోయ (సుమారు అర కి.మీ.)లోకి ఈ జలధార దుముకుతుంది. తూర్పువైపున్న గుట్టను అమాంతంగా అర కిలోమీటరు దిగి (పశ్చిమం వైపుకి) తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమపు గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొసను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. అలా దిగేటప్పుడు మనలని ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలి పడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి.

సలేశ్వరం జలధార: కుండం ఒక ఫర్లాంగు దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడి నుండి కుండం నుండి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒకచోటయితే కేవలం బెత్తెడు దారి మీద నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడ జారితే భక్తుడు శివైక్యం చెందవలసిందే. కుండం (గుండం) చేరిన తరువాత అత్యంత అద్భుతమైన దృశ్యం మనకు దర్శనమిస్తుంది. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార కుండంలోకి దుముకుతుంది. కుండం దగ్గర నిలబడి పూర్తిగా తల ఎత్తి పైకి చూస్తే రెండు గుట్టలు ఒక నిజమైన పెద్ద కుండగా ఏర్పడినట్లు, ఆ కుండ మూతి నుండి ఆకాశం, సూర్యకిరణాలు లీలగా కనిపిస్తున్నట్లు తోస్తుంది.

జలధార కింద నేను, నా మిత్రుడు రామారావు స్నానం చేశాం. ఆ నీటి చల్లదనానికి ఒళ్ళు పులకించిపోయింది. దోసిళ్ళతో కడుపు నిండా నీళ్ళు తాగాం. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం వల్లనేమో ఆ రోజంతా మాకు ఆకలే కాలేదు. జలధార కింద కుండం, కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకొని రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. ఆ స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. స్వామికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కొద్దిగా దక్షిణంగా నడిచి కింది గుహలోకి వెళ్ళాం. ఈ గుహలో కూడా శివలింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి.

జాతర ప్రత్యేకత


సలేశ్వరం జాతర సంవత్సరానికొకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి, నీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. స్థానికులు కొందరు అరుదైన వనమూలికలను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. భక్తులు దారి పొడవునా 'అత్తన్నం అత్తన్నం లింగమయ్యో', 'పోతున్నం పోతున్నం లింగమయ్యో' అని అరుస్తూ నడుస్తుంటారు.

చారిత్రక ఆనవాళ్లు


నాగార్జునకొండలో బయటపడిన ఇక్ష్వాకుల నాటి (క్రీ.శ. 220 - క్రీ.శ. 360) శాసనాలలో 'చుళ ధమ్మగిరి' గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువుల కోసం ఆరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ ధమ్మగిరి ఈ సలేశ్వరమేనేమోననిపిస్తుంది. కారణం అక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16" x 10" x 3" (పొడవు x వెడల్పు x ఎత్తు) అంగుళాలుగా ఉంది. ఇలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. 'చుళ' తెలుగులో 'సుల' అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరం (లేదా శూలేశ్వరం) గాను, చివరిగా సలేశ్వరంగానూ మారి ఉంటుందనిపిస్తుంది.

ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా విష్ణుకుండినుల (క్రీ.శ. 360-క్రీ.శ. 570) కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణం 10" x 10" x 3" అంగుళాలుగా ఉంటుంది. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినుల చిహ్నమగు 'పూలకుండి' శిలాఫలకం ఉంది. (అయితే అలాంటి కుండ శాతవాహనులకు, ఇక్ష్వాకులకు కూడా చిహ్నంగా ఉండేది.) ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తుగల నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలతో ఉంది. కుడి చేతుల్లో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో డమరుకం, మరో ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది.

వీరభద్రుని కింద కుడివైపున పబ్బతి పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా, ఎడమవైపున స్త్రీ మూర్తి (?) ఉంది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలు(?) ఉన్నాయి. ఇవే పాతవిగా తోస్తున్నాయి. ఆ విగ్రహాల ముందర ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసురు రాయి ఉంది. గుడికి ఎడమ వైపున గల రాతి గోడకి బ్రాహ్మీలిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం ఉంది. ఈ రెండూ విష్ణుకుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్రకారులు చదివితే విష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చుననిపిస్తోంది.

'స్థల మహాత్మ్యం' అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్రమహాత్మ్య కావ్యంలో దీన్ని (సలేశ్వరం) రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా, పశ్చిమాన గల లొద్దిని (గుండం) బ్రహ్మకుండంగా పేర్కొన్నారు. విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి నిరూపించారు కూడా.

క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి 'మల్లికార్జున పండితారాధ్య చరిత్ర'లో 'శ్రీ పర్వత క్షేత్ర మహాత్మ్యం'లో కూడా ఈ సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు విశేషంగా వర్ణించాడు. 17వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర చెపుతోంది.

ప్రకృతి రమణీయత


భారతదేశంలోని అడవుల్లో నల్లమల అడవులు రెండవ పెద్ద అడవులుగా పేర్గాంచాయి. ఈ అడవులు హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో 130 కి.మీ. తరువాత మన్ననూరులో ప్రారంభమవుతాయి. సముద్ర మట్టానికి సుమారు కి.మీ. ఎత్తున ఏర్పడడం వలన ఈ అటవీ ప్రదేశం చల్లగా ఉంటుంది. సలేశ్వరం దగ్గర్లోనే భూమి-గుట్టల సంగమ ప్రాంతం (వ్యూపాయింట్) ఉండటం వలన చల్లగాలులు వీస్తూ అలరిస్తాయి. ఇదే ప్రాంతంలో 'పులుల చెలిమలు' (పులులు నీరు తాగే కుంటలు) కూడా ఉండటం వలన గాలిలో చల్లదనం ఎక్కువ అవుతుంది. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు మనల్ని దారిపొడవునా అలరిస్తాయి.

సలేశ్వరం లోయ సుమారు రెండు కి.మీ. పొడవుండి మనకు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్‌ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కాన్యన్ అందాలను చాలామంది మెకనెస్‌గోల్డ్ సినిమాలో చూసి ఉంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులున్నాయి. అవి జంతువులు నీటికోసం వెళ్ళే మార్గాలని స్థానిక గిరిజనుడు చెప్పాడు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆదిమ మానవులకు, ఆ తరువాత బౌద్ధ భిక్షువులకు, మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలే చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆదిమ మానవుల ఆనవాళ్ళైన చెంచులు అక్కడ జీవిస్తున్నారు.

అడవిలో ట్రాఫిక్ జామ్


సలేశ్వరం జాతరకు ఇంతకు ముందు స్థానిక ప్రాంతాలవారే పోయేవారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు రావడంతో అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ సంవత్సరమైతే రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది ఈ జాతరను వీక్షించారని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దాంతో లింగమయ్య దర్శనానికి పర్యాటకులు గంటల తరబడి క్యూలో నిల్చోవలసి వచ్చింది.

ఇంతకు ముందు తిరుపతి దర్శనానికే అలాంటి పరిస్థితి ఉండేది. అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఇరుకైన దారిలో వందలాది వాహనాలు వెళ్లాల్సివచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వార్త టీవీల్లో కూడా వచ్చింది. ఏప్రిల్ 17న సలేశ్వరానికి వెళ్ళిన మాకు అడవి నుంచి బయటకు రావడానికి ఐదు గంటల సమయం పట్టింది. ఐతే అర్థరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో గడపడం భలే ఆనందంగా అనిపించింది.
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, పరిశోధకులకు ఎంతగానో నచ్చే ప్రదేశం ఇది.


- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250

మేమూ... గోదావరీ... కిన్నెరసానీ...

‘‘ఏ పని చేసినా ధ్యానంలా చెయ్యి. ధ్యానాన్ని మట్టుకి పనిలా చెయ్యకు’’ కిటికీ దగ్గర సీట్లో కూర్చున్న తనికెళ్ల భరణి తను చదువుతున్న ఆ పుస్తకంలో ఆ వాక్యం చదువుతుంటే విన్న మేం బావుందంటుండగా పాలకొల్లు స్టేషనొచ్చేసింది.

పాలకొల్లు నుంచి నరసాపురం రూట్లో ఉన్న చించినాడ ఊరివేపు డైవర్టయ్యింది కానుమిల్లి అమ్మిరాజు పంపిన ఇన్నోవా. వశిష్ట గోదావరికి ఎడాపెడా ఉన్న గట్లమీద చిక్కటి కొబ్బరి తోటలు ఆ చెంచినాడ బ్రిడ్జి దాటుకుంటూ డాక్టర్ ఆర్వీరాజు గారి బ్లాకండ్ వైట్ గెస్ట్‌హౌస్‌కి వందల మీటర్ల దూరంలో కట్టిన ఏపీ టూరిజమ్ వాళ్ల రిసార్ట్స్ కళకళ్లాడిపోతున్నాయి.


భరణి అతని అసిస్టెంటు యోగా వెంకటేషూ, నేనూ కారు దిగి లోపలికి వెళ్తుంటే మాకెదురొచ్చాడు ముదునూరి అక్కిరాజుగారు. రిసెప్షన్ దగ్గర దిండి రిసార్ట్స్ మేనేజర్ కమల్ వెల్‌కమ్ అంటా వచ్చి ‘‘మీరు పైన స్నానాలు చేసి రండి. మీ రూమ్స్ హౌస్‌బోట్లో ఉన్నాయి. మీ సామాన్లక్కడ సర్దిస్తాం’’ అన్నాడు.


ముప్ఫై రెండు గదులున్న ఆ బిల్డింగ్ వెనక్కెళ్లాం. కొబ్బరి చెట్ల నీడల్లో కుడిపక్క బారు, రెస్టారెంటు, చిల్డ్రన్ పార్కు ఉన్నాయి. ఎడం పక్క స్విమ్మింగ్ పూలు, నిండా కాయల్తో పనసచెట్టూ, వాటిని దాటుకుంటూ ముందుకెళ్తే నలభై అడుగులు లోతు ఉన్న వశిష్ట గోదావరి పాయ. దాని ఒడ్డున... జలజాక్షి, నీలవేణి, కిన్నెరసాని, వశిష్ట సంపంగి అనే పేర్లు గల హౌస్ బోట్లున్నాయి. బోటుకు రెండేసి ఏసీ గదులు అటాచ్డ్ బాత్రూములు ఉన్నాయి. మెట్లెక్కి పైకొస్తే అందమైన బాల్కనీ.

http://www.sasitourism.com/tourism/manage_files/Image/eco%20tourism/andhra%20pradesh%20eco/House-boat.jpg
మాకిచ్చిన కిన్నెరసాని బాల్కనీలో కొచ్చాను. కాస్సేపటికి అక్కిరాజుతో పాటొచ్చిన భరణి, ‘‘మీరు, వంశీ ఆ మూలకి, నేనూ, వెంకటేషూ ఈ పక్కకి’’ అంటూ మూలకెళ్లిపోయాడు. ‘‘పోనీండ్రా నర్సాపురం సైడూ’’ అంటూ అక్కిరాజరవక ముందే డుబ్ డుబ్ చప్పుళ్లతో బయల్దేరింది కిన్నెరసాని.

ఆ మూలున్న భరణి కాసేపు ఏదో పుస్తకం చదువుకుని తర్వాత రాతలో పడిపోయాడు. ముందుకెళ్తున్న మాకు పన్నెండుమంది కూర్చున్న పెద్ద పడవ ఎదురైంది. వాళ్లంతా చేపలు పట్టేవాళ్లు. వాళ్లలో ముగ్గురు కుర్రోళ్లు సెల్‌ఫోన్లలో తెగ మాటాడేసుకుంటున్నారు. ‘‘ఎవరాళ్లు? ఏంటా గొడవ’’ అంటే మొదలెట్టాడు రాజుగారు. ‘‘వాళ్ల పడవలో అయిలు ఉంది. దాన్ని గోదాట్లో వెయ్యడానికి బయల్దేరారాళ్లు.


అయిలు అంటే అదో చేపలు పట్టే వల. కిలోమీటరు పొడుగుంటుంది. సందలాడే టైములో చేపల వేటలో దిగే యీళ్లు చాలా సంపాదిస్తారు. కానీ మొత్తం తాగుడికి తగలేస్తారండీ. ఈళ్లే నిలబెట్టుకోడం జరిగితే కుబేరులైపోతారు తెల్సా!’’ అన్నాడు. ముందుకెళ్తుంది కిన్నెరసాని.


కాసేపట్లో సముద్రంలో కల్సిపోతున్న ఈ వశిష్ట గోదారి నీళ్లు ఉప్పగా ఉన్నాయి. అందుకే దీనికెడాపెడా రొయ్యల చెరువులు. గోదారి మధ్యలో చెట్టుకీ చెట్టుకీ మధ్య పదడుగుల గ్యాప్‌లో దిగేసిన కొబ్బరిచెట్ల వరస. దాన్ని కట్టు అంటారంట. ఆ ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లకి అదో స్థిరాస్తంట. రాయాలంటే ఇదో పెద్ద కథవుద్దంట.


లాంచీ ముందుకెళ్తోంది. కట్టు ముందుండే ఆ కొబ్బరిచెట్టు దుంగల మీద నిలబడ్డ నల్లటి నీటి కాకులు చాలా పొడవాటి ముక్కులతో మెడిటేషన్ చేస్తున్నట్టు నిలబడున్నాయి. వాటన్నింటినీ చూసిన అక్కిరాజు, ‘‘వీటిలో ఒక కాకి చెరువులోకి వాలితే ఇరవై రొయ్యలకి తక్కువ తినదు. దాన్ని చంపడానికొచ్చే లెసైన్సున్న నాటు తుపాకోడు, ఒక కాకిని చంపడానికి రెండొందలడుగుతాడు.


అయితేనండీ ఎర్రటి దాని మాంసం భలే రుచి. అసలా రుచెలా గొచ్చిందనుకుంటున్నారు? అదెప్పుడూ రొయ్యల్ని, చేపల్ని గదండీ తినేదీ’’ అన్నాడు. రాజమండ్రి నించి ఎగువ గోదారి అందం చుట్టూ కొండలతో అచ్చమైన గోదారందం. ఈ దిగువ గోదారిది ఇంకో రకమైన అందం.


అచ్చం కేరళాలోలాగా గోదావరికి ఎడాపెడా చిక్కాచిక్కటి కొబ్బరి తోటల మధ్య మొలచిన బోలెడన్ని సెల్‌ఫోన్ టవర్లు. ఆ నావ అడ్డచెక్క మీద కూర్చున్నోడు గెడేస్తుంటే చుక్కాని దగ్గర కూర్చున్న ఇంకోడు సెల్‌ఫోన్లో మాట్లాడ్తున్నాడు. ఖాళీగా ఉన్న ఆ రేవు పక్కన ఒంటరిగా కూర్చున్న ఆ కన్నెపిల్ల ఏదో ఆలోచిస్తోంది. కాస్త దూరంలో మూడు గేదె పెయ్యలు మేస్తుంటే ఒక గేదెని ఆన్చి నిలబడ్డ కుర్రోడు సెల్‌ఫోన్ మాట్లాడుతున్నాడు.


గోదారికి ఎనిమిది గంటలు పాటు ఎనిమిది గంటలు పోటు ఉంటుందంట. రాజుగారు చెప్తున్నదింటా దూరంగా చూస్తున్నాను. మూడు కాశీ ఆవులు కిందకి దిగిన తుమ్మ కొమ్మల్ని మేస్తుంటే ముగ్గురు చిన్న కుర్రోళ్లు బోసి మొలల్తో స్నానాలు చేస్తున్నారు. ఈలోగా టమోటా రంగు చీర కట్టుకొచ్చిన ఆడ మనిషి పామంచాల్లో కాళ్లు కడుక్కెళ్లి పోతుంటే, సిమ్మెంటు దిమ్మ మీద వాలిన కింగ్ ఫిషర్ పక్షి చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది.


ఎడం పక్క సఖినేటిపల్లి రేవు, కుడిపక్కన నరసాపురం రేవు. సఖినేటిపల్లి రేవులో వరుసగా ఆగున్న పడవల వెనకాల నలుపు, పచ్చ, నీలం రంగు జెండాలు కట్టిన పొడుగాటి కర్రలు కనిపించాయి. అవేంటని అడిగితే వేటకెళ్లినప్పుడు సముద్రంలో వలేశాకా గుర్తు కోసం ఈ జెండాలని పాతుతాం అన్నారు.


పడవలన్నీ ఇక్కడే ఉన్నాయేంటి వేటకెళ్లలేదా అంటే తిథులను బట్టి వెళ్తాం. ఎందుకంటే కొన్ని తిథుల్లోనే చేప సముద్రంలో పైకితేల్తా తిరుగుద్ది అన్నారు.

‘‘ఇప్పుడీళ్ల పడవలు సముద్రంలో కెళ్లకూడదండీ, గవర్నమెంటు నిషేధం ఉంది. ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే సీజనిది. ఏరా కరెక్టేనా నే సెప్పేది?’’ అన్నాడు రాజుగారు.
‘‘అయ్యబాబోయ్ చాలా కరెస్టండి’’ అన్నాడా పడవలో కుర్రాడు.

కొంచెం ముందుకెళ్లిన కిన్నెరసాని వెనక్కి తిప్పేస్తుంటే, ‘‘ఇదేంటి, అంతర్వేది అన్నాచెల్లెళ్ల గట్టు వెళ్లదా?’’ అన్నాను. ‘‘కెరటాలు తగుల్తాయండి’’ అన్నాడు అసిస్టెంటు డ్రైవరు శ్రీను. కిన్నెరసాని వెనక్కి తిరుగుతున్నప్పుడు వరసగా కట్టేస్తున్న వేట పడవల పేర్లు చాలా తమాషాగా ఉన్నాయి. మల్లే బాగిర్తి, దోనే నాగన్న, రాచపల్లి అయిలయ్య, నక్కా రాములు తాత, మేరుగు పెద్ద కోదండం. వాటిని చదివిన భరణి ‘‘పేర్లలో ఎంత నేటివిటి’’ అనేసి మళ్లీ పన్లోకెళ్లిపోయాడు.


గాలి తిరిగింది. దగ్గర్లో సముద్రం ఉండటం వల్ల ఈదురు గాలి మా ముఖాలక్కొడుతోంది. స్పీడుగా ముందుకెళ్తున్న కిన్నెరసాని మధ్యాహ్నానికి దిండి రిసార్ట్స్ రేవులో ఆగింది. ఒడ్డున బోటుకి లంగరేసి కట్టేశాక పవర్ కనెక్షనిచ్చేసరికి రూముల్లో ఏసీ మిషన్లు పన్జెయ్యటం మొదలెట్టినియ్యి.


రెస్టారెంట్లో వంటల్తో పాటు భరణి కోసం రాజోలు లాయరు బబ్బీస్ (అసలు పేరు పొన్నాడ సూరిబాబు) గారింట్లోంచి అక్కిరాజు తెప్పించిన వెజిటేరియన్ కూరలు, ఆవపెట్టిన అరటిపువ్వు కూర, ఆవపెట్టిన పనసపొట్టు కూర, చల్ల మిరపకాయలు, వేగీవేగని గుమ్మడి వడియాలు, కచ్చాపచ్చాగా దంచిన కొబ్బరి మామిడి పచ్చడి... ఇలా ఒకటి కాదు చాలా.


వీటన్నిట్లోకి మహాద్భుతమైంది, ఒక్క గోదావరి జిల్లాలవాళ్లు మట్టుకే కాచే లక్ష్మిచారు. ‘‘చాలా బాగుంది. దీని రెసిపీ ఎలాగ సార్?’’ అన్నాడు గుంటూరువాడైన యోగా వెంకటేషు. ‘‘ఇది ఆడోళ్లు కాస్తారు. మాకేం తెల్సు’’ అన్నాడు అక్కిరాజుగారు. ‘‘నైటుకి కూడా దాచుకుంటాను’’ అంటూ నా పక్కకొంగి, ‘‘ఓ గంటసేపు రిలాక్సవుతాను’’ అంటా కిందున్న తన రూములోకెళ్లిపోయాడు భరణిగారు.


ఈలోగా అక్కిరాజు కాకినాడ ఫ్రెండయిన ప్రభు సాల్మన్ వచ్చాడు. పరిచయాలు, కాసేపు మాటలు అయ్యేటప్పటికి గంట గడిచిపోయింది. నిద్రలేచి ముఖం కడుక్కొచ్చిన భరణిక్కూడా ప్రభుని పరిచయం చేశాక బయల్దేరింది బోటు. చించినాడ రేవు పక్కన పిల్లలు క్రికెట్ ఆడ్డం చూసిన అక్కిరాజు, ‘‘ఎక్కడ జూసినా క్రికెట్టే. ఇదంతా ఈ మధ్య ఇండియా నెగ్గడం వల్లొచ్చింది’’ అంటా విసుక్కున్నాడు.


మర్రిచెట్టు మధ్యలోంచి మొలిచిన ఈతచెట్టు నిండా గెలలు. కింద నీడలో పొద్దుటే కప్పేసిన సమాధికి వెదురుకర్రతో చేసిన క్రాస్ గుచ్చి, దాని మొదట్లో బంతిపూలు పెట్టారు. ఇంకొంచెం ముందుకెళ్లాక అయిదు తలల తాటిచెట్టుని చిత్రంగా చూశాం. విచిత్రం, చెట్టున్న పొలం యజమానికి అయిదుగురు కొడుకులంట.


ఇంకొంచెం ముందుకెళ్తే కిక్కిస్ పొదల్లో ఒక లంక కనిపించింది. అది ప్రతి యేడూ పెరుగుతా వస్తుంది కాబట్టి దాన్ని పెరుగులంక అని పిలుస్తారంట. అక్కడ్నించి ముందుకెళ్లడానికి ఆ లంకకి కుడి పక్కనుంచో దారి, ఎడం పక్కనుంచో దారి ఉన్నాయంట. ‘‘ఇప్పుడు ఎడం పక్కనుంచి పోనియ్యండి. వచ్చేటప్పుడు కుడి పక్కనుంచొద్దాం’’ అన్నాడు ప్రభు.


ఆ రేవులో ఆడపిల్లలు బట్టలుతుకుతుంటే, కొందరు ఉతికేసి పిండిన బట్టలని తీగలకారేస్తున్నారు. దాని పేరు గంగడిపాలెం రేవంట. ఊరు లోపలుందంట. బోటు ఇంకా ముందుకెళ్తుంటే మాకెదురైన ఆ చిన్న నావలో అందరూ ఆడోళ్లే. ఒడ్డున సీమచింత చెట్టు కొమ్మల్నిండా పండిన ఎర్రటి సీమచింత కాయలు. తట్టుకాలువ అనే ఆ చిన్న ఊరి రేవులో రంగురంగుల పడవలు, ఒడ్డుమీద చిన్న చిన్న ఇళ్లు, ఒడ్డున నిలబడ్డ చిన్న పిల్లలు మాకు టాటా చెప్తున్నారు.


చెట్టు కొమ్మలూగుతున్నాయి. చల్లగాలి తిరిగింది. మఠం రేవు దాకా వెళ్లాక వెనక్కి తిరిగింది. రెండు పెద్ద చేపలు నీళ్లలోంచి పైకి లేచి మళ్లీ లోపలికెళ్లిపోయాయి. వాటిని చూసిన నేను, ‘‘గోదాట్లో ఎలాంటి చేపలు పడతాయి’’ అన్నాను. ‘‘కొయ్యంగ, మేన, పండుగొప్ప, మాగ, వర్షాకాలంలో పొలస’’ అన్నాడు అక్కిరాజుగారు.


‘‘మరి సముద్రంలో?’’

‘‘నెమలికోను, నామాలసొర, నల్లసందువా, అగలిస్, మెంజీరంతో పాటు మనిషంత ఎత్తుండే గొడుం అన్న చేప కూడా పడద్ది’’ అన్నాడు. వెళ్తున్న హౌస్ బోటు నెమ్మదిగా స్లో అయ్యింది. రెండు ఎకరాల్లో కిక్కిస్ దుబ్బుల అంచునాగింది. ‘‘దిగండి’’ అన్నాడు ప్రభు సాల్మన్. దిగి కొంతదూరం లోపలికి నడిచాక, తెల్లటి మొండి గోడలు... ఒక పక్క కౌంటర్ లాంటిది, ఇంకోపక్క రెస్టారెంట్, కిచెనూ ఉన్న ఆనవాళ్లు..

‘‘ఏంటియ్యి?’’ అన్నాను. ‘‘ఒకనాటి ఏపీ టూరిజం వాళ్లు మేనేజ్ చేసిన ఈవెనింగ్ రిసార్ట్స్ తాలూకూ జ్ఞాపకాలు. నేనూ మా వెరోనికా చాలాసార్లు వచ్చిన ఏకైక ప్లేసిది’’ అన్నాడు. కాస్త వివరంగా చెప్పమన్నాను. సూర్యుడు ఇంకాస్సేపటికి కిందకి దిగిపోతున్న టైములో మొదలెట్టాడు ప్రభు సాల్మన్.

‘‘అప్పట్లో దిండి రిసార్ట్స్ కట్టలేదు. చుట్టూ నీళ్ల మధ్యున్న ఈ తిప్పమీద కట్టిన ఈవెనింగ్ రిసార్ట్స్‌లో ఒకటే జనం. ఎక్కడెక్కడి జనమో సాయంత్రమైతే ఇక్కడుండేవారు. నేనూ, మా వెరూ ఈ రిసార్ట్స్ పర్మినెంట్ కస్టమర్లం. అహ్మద్ టమోటా రైసు, బిర్యానీ, రమణ చేసే గుత్తొంకాయ కూరకి ఫ్యాన్సుం’’ అన్నాడు ప్రభు.

‘‘అసలేం జరిగింది? ఈ రిసార్ట్స్ ఎందుకలా పాడయ్యాయి?’’ అన్నాను.

‘‘ఆ వేళ ఆగస్టు ఇరవై మూడు. వారం రోజుల్నుంచున్న తుపాను గాలులు బాగా పెరిగిపోయాయా వేళ. ఆ రాత్రి గోదారి పోటు బాగా పెరిగింది. ఇక గాలి గురించి చెప్పడానికి భయమేస్తుంది. ఒకటే వర్షం. పెద్ద పెద్ద వృక్షాలూ, జంతువుల కళేబరాలూ నీళ్లలో కొట్టుకొస్తున్నాయి. లంకలో కాపురాలుండే జనాలు ఒడ్డెక్కేస్తున్నారు. ఏకంగా కొన్ని గుడిసెలు ఉన్న పళంగానే కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ తుపాను రాత్రి నీళ్లలో కొట్టుకుపోయినియ్యి కాటేజెస్’’ అన్నాడు ప్రభు.


‘‘మళ్లీ కట్టొచ్చుగా?’’ అన్నాడు యోగా వెంకటేషు.

‘‘కట్టకపోవచ్చు. ఎందుకంటే వరదల రోజుల్లో కొంచెం కొంచెం చొప్పున ఈ నేలని మింగేస్తుంది గోదావరి.’’
‘‘ఐతే మీరూ మీ వెరోనికా మళ్లీ రాలేదా ఈ పక్కకి?’’ అన్నాను.
ఆ ప్రశ్నకదోలాగయిపోయిన ప్రభు, ‘‘రీసెంటుగా తనకి చేసిన సర్జరీ ఫెయిలవడంతో హాస్పిటల్లోనే చనిపోయింది మా వెరోనికా’’ అంటున్నప్పుడు చీకటి పడ్తున్న నల్లటి ఆకాశంలాగే మారిపోయిందతని ముఖం.

Sunday, May 22, 2011

ఉరిమే డ్రాగన్ నేలలో... * Royal Kingdom of Bhutan

'పాలపుంతకి సైతం పాదయాత్ర చేస్తాను' అని నా 'భ్రమణకాంక్ష' పుస్తకంలో రాసుకున్నాను. కానీ సరిహద్దులు దాటి ప్రయాణాలు చెయ్యటానికి నాకు చాలా కాలం పట్టింది. తెలిసిన మిత్రుల ద్వారా గత సంవత్సరం నేపాల్ వెళ్లాను. ఈ సంవత్సరం భూటాన్ వెళ్లాను. ముందుగా ఖాట్మండు చేరుకొని పాత మిత్రుల్ని పలకరించి అక్కడ నుండి కాకరబిత్తా మీదుగా సిలిగురిలోని టెన్సింగ్ నార్కే బస్‌స్టాండుకి వెళ్లి, భూటాన్ బోర్డర్‌లో ఉన్న జయగాం అనే టౌన్‌కి ప్రయాణమయ్యాను.

దారి పొడవునా వంపుగా పెరిగిన వెదురు పొదలూ, నిటారుగా నింగిలోకి దూసుకుపోతున్న పోక చెట్లూ పచ్చని పతాకాల్ని ఎగురవేస్తున్నట్లు ఉన్నాయి. ఎర్రని సిమోల్ పూల చెట్ల మీద నల్లని బుల్ బుల్ పిట్టలు కూర్చుని పాడుతూ వసంతానికి వన్నెలు అద్దుతూ ఉన్నాయి. సాయంత్రానికి జయగాం చేరుకున్నాను. దానికి ఆనుకునే ఉంటుంది ఫుంట్‌షూలింగ్ టౌన్. అక్కడ నుండి Royal Kingdom of Bhutan మొదలవుతుంది. సరిహద్దు గేటు దాటి లోపలికి వెళ్లేసరికి బజార్ల నిండా విదేశీ యాత్రికులు, స్థానికులు, భారతీయులు సమపాళ్లలో కనిపించారు. భూటాన్ చేరుకోవటానికి ఈ ఫుంట్‌షూలింగ్ ఒక్కటే సరైన భూమార్గం. డార్జిలింగ్, సిక్కిం, కలకత్తాల నుండి ఇక్కడికి నేరుగా బస్‌లు ఉన్నాయి. అక్కడ ప్రతి కొండ మీదా ఇళ్లు కనిపిస్తాయి. కొండ వాలుల్లో కనిపిస్తున్న కాలి బాటల వైపు నా మనసు లాగింది. ఏ బాట పట్టుకొని నడిచినా ఏదో ఒక వింత ప్రదేశంలోకి చేరుకోవడం ఖాయం. బౌద్ధమందిరాల ముందు ఉన్న పెద్ద ప్రార్థనా చక్రాలు నిరంతరం 'ఓం మణి పద్మేహం' అంటూ తిరుగుతూనే ఉంటాయి. బార్డర్ పాస్ ఇచ్చే ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో అప్లికేషన్ తీసుకొని బజార్లన్నీ బాగా తిరిగి, ఒక ఇండియన్ హోటల్లో ఆకలి తీర్చుకొని, ధర్మశాలకి చేరుకొన్నాను రాత్రికి.


పాస్‌పోర్టు, వీసా అక్కరలేదు


తెల్లవారగానే ఇమ్మిగ్రేషన్ ఆఫీసుకి పరుగులు తీశాను. అక్కడ నాకంటే ముందే చాలామంది పాస్‌ల కోసం గుంపులుగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కూలీలు, కాంట్రాక్టర్లు. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన ఒక లేబర్ కాంట్రాక్టరుతో పరిచయం అయింది.'అయ్యా ! నేను మూడు నెలల నుండి తిరుగుతున్నాను. ఈ రోజు నా ఫైలు మీద సంతకం అవుతుంది' అని ఆనందంగా చెబుతున్నాడు. భూటాన్ వెళ్లే భారతీయ యాత్రికులకి పాస్‌పోర్టు, వీసా అక్కరలేదు. కాని పాస్ ఉండాలి. దానికి రెండు ఫోటోలు, ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు. అయితే భూటాన్ ఆఫీసరు నన్ను చూడగానే 'ఒంటరిగా వెళ్లే వారికి పాస్‌లు ఇవ్వటం లేదు. మీరు ఏదైనా గ్రూపులో చేరండి ఇస్తాం' అన్నాడు. తర్వాత ఏమనుకున్నాడో నా అప్లికేషన్ మీద తొమ్మిది రోజులకి బార్డర్ పాస్ స్టాంప్ వేశాడు. ఆనందంగా బయటికి వచ్చాను.


వెంటనే బస్‌స్టాండ్‌కి వెళ్లి తింఫూకి టికెట్ తీసుకున్నాను. ఏడు గంటల ప్రయాణం. చార్జీ 180 'నూ'లు. వారి 'నూ' మన రూపాయికి సమానం. వారి టైం మనకంటే 30 నిమిషాలు ముందు ఉంటుంది. బస్‌స్టేషన్ పేరు 'భూటాన్ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాన్స్‌పోర్టు సర్వీస్'. ప్రయాణీకుల భద్రతకి అంత ప్రాముఖ్యం ఇస్తారన్న మాట. ఐదు నిమిషాల్లోనే ఆకాశమంత ఎత్తులో ఉన్న రోడ్డు మీదకి చేరుకున్నాం. గంటకి 30 కి.మీ. కంటే వెళ్లలేవు వాళ్ల చిన్న బస్సులు. ఒక పక్క 'పూర్ విజిబిలిటీ', 'ల్యాండ్‌స్లైడ్ ఏరియా' బోర్డులు కనబడుతూనే ఉన్నా మరోవైపు అద్భుతమైన ప్రకృతి. పిట్టల గోల బస్‌లోకి కూడా వినిపిస్తూనే ఉంది. బౌద్ధ మందిరాలు అక్కడక్కడ తళుక్కుమంటున్నాయి. కొండల మీద అడవులు దట్టంగా ఉన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మెట్ల పద్ధతి వ్యవసాయం ఉంది. లోయల అంచుల నిండా పళ్లతోటలు ఉన్నాయి. చాలా చోట్ల జల విద్యుత్ కేంద్రాలున్నాయి. కొన్ని చోట్ల డాములూ ఉన్నాయి.


పోర్కు లేకుండా భోజనం దొరకదు


జేడూ పట్టణం చేరేసరికి అద్భుతమైన వాస్తు కళానైపుణ్యంతో నిర్మించిన ఒక భవన సముదాయం రోడ్డు పక్కనే కనిపించింది. అది రాయల్ భూటాన్ యూనివర్శిటీ. కొద్దిగా చదునైన భూమి ఉంటే చాలు, అక్కడ ఒక గ్రామం ఏర్పడిపోతుంది. సాయంత్రానికి కిన్‌లే అనే హోటల్ ముందు ఆగింది బస్సు. ఇక్కడ ప్రతి హోటల్‌కూ బార్ కలిసే ఉంటుంది. పోర్కు లేకుండా భోజనం దొరకడం కష్టం.
కొండల పైకి వెళ్లే కొద్దీ చీకటి ముసురుకొస్తూ ఉంది. చలి పెరిగింది. ఎంత ఎత్తులో ఉన్నాసరే ప్రతి ఇంటికి కరెంట్ సౌకర్యం ఉంది. చీకటి ఎక్కువయ్యే కొద్దీ భయం పోగొట్టుకోవటానికి అది చుక్కల్ని తోడుగా తెచ్చుకొంటూ ఉంది. కొండల మీద ఇళ్లలో లైట్లు, ఆకాశంలో చుక్కలు ఒకే రకంగా మెరిసిపోతున్నాయి. తింఫూ బస్‌స్టాండు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది. తాషిక్ దేలేర్ అనే హోటల్‌లో రోజుకి అద్దె ఐదు వందల 'నూ'లు. అదే అన్నిటికన్నా తక్కువ రేటు. అక్కడ పనిచేస్తున్న వారందరూ స్త్రీలే. ఓనరు కూడా ఒక వయసు మళ్లిన స్త్రీ. ఆవిడని చూడగానే పాల్ గాగిన్ చిత్రాలు గుర్తుకొచ్చాయి. బొద్దుగా, గుండ్రంగా ఉండే తహతియన్ సుందరిలాగా ఉంది ఆమె ఆకారం.

గోడమీద ఉన్న ఒక పోస్టర్ నన్ను ఆకర్షించింది. దాని పేరు The Lamb Shall Play With The Lion. ఒక మేక పిల్ల సింహం జూలు నిమురుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఈ బొమ్మ వేసిన చిత్రకారుడి పేరు ఎడ్వర్డ్ హిక్స్. ఆయన ప్రఖ్యాతి చెందిన అమెరికన్ జానపద కళాకారుడు. 'అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమించుకోవాలి' అనే తాత్త్విక భావాలున్న వాడు హిక్స్. భూటాన్ ప్రజల ఆలోచనా సరళికి ఈ చిత్రం బాగా నచ్చి ఉంటుంది. నా గదిలో ఉన్న టీవీలో భూటాన్ రాజు వాంగ్ ఛుక్ చేస్తున్న ప్రసంగాన్ని వింటూ నిద్రలోయల్లోకి దొర్లిపోయాను.


వారికి ఆదాయం కంటే ఆనందం ముఖ్యం


నన్ను ఆహ్వానించిన మిత్రుల అడ్రసు వెతకడానికి ఉదయమే బయలుదేరాను. అయితే అది నా హోటల్ ఎదురుగానే ఉంది. దాని పేరు వాస్ట్ గ్యాలరీ. టవర్‌క్లాక్ సెంటర్‌లోని పెద్ద భవనం అది. భూటానీయలు మాట్లాడే భాష పేరు జోంఖా. భూటాన్‌ని Land of The Thunder Dragon అని పిలుస్తారు. తింఫూ జనాభా మొత్తం 70 వేలకి మించదు. అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు, కంపెనీలు లేవు. దేశం జనాభా కూడా తక్కువే. ఇరవై లక్షలు. డెబ్బయి శాతం ప్రజలు వ్యవసాయం మీదా, మిగిలిన వారు టూరిజం మీదా జీవిస్తారు. భూటాన్‌లో బియ్యం, బంగాళాదుంపలు, మొక్కజొన్న, బార్లీ బాగా పండుతాయి. టింబర్ వారికి ముఖ్యమైన ఎగుమతి. జల విద్యుత్తు ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది.

విదేశీయుల్ని ఎక్కువగా అనుమతిస్తే వారి వలన కూడా ఎంతో ఆదాయం వస్తుంది. కాని ఏడాదికి 2000 మంది కంటే ఎక్కువమందిని అనుమతించరు. "మాకు జాతీయ తలసరి ఆదాయం కంటే తలసరి ఆనందం ముఖ్యం'' అనేది వారి పాలసీ. స్మోకింగ్‌ని అనుమతించరు. అలాగే ప్లాస్టిక్‌ను కూడా సరిహద్దుల అవతలే ఉంచేశారు. మన జేబులో సిగరెట్ ఉన్నా నేరమే. రెండు సిగరెట్ పెట్టెల్ని తన జేబులో ఉంచుకొన్నందుకు ఒక బౌద్ధ సన్యాసికి రెండు సంవత్సరాల జైలు శిక్ష వేసినట్లుగా నేను ఆ రోజే న్యూస్‌పేపర్లో చదివాను. భూటాన్ వారు ఆధునికతను పూర్తిగా ఆమోదించరు. బౌద్ధమత ధర్మాలకీ, ఆధునిక నాగరికతకీ మధ్య సమతౌల్యాన్ని సాధించాలనేది వారి లక్ష్యం.

బజార్లు తిరుగుతూ భూటాన్ గురించిన ఆలోచనలు చేస్తూ పది గంటలకల్లా వాస్ట్ గ్యాలరీ చేరుకున్నాను. కానీ నన్ను భూటాన్‌కు ఆహ్వానించిన ఇద్దరు చిత్రకారులూ ఊర్లో లేరు. ఒకరు శాంతినికేతన్‌లోనూ, మరొకరు థాయిలాండ్‌లోనూ ఉన్నారట. కాసేపట్లో ప్రముఖ చిత్రకారుడు ఆషాకామా అక్కడికి వస్తే పరిచయం చేసుకొన్నాను. వారి గ్యాలరీ చూడడానికి ఇండియా నుంచి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆషాకామా ఆ గ్యాలరీలో భూటాన్ యువకులకి చిత్రకళలో శిక్షణ ఇస్తుంటాడు. చెక్కతో నిర్మించిన పాత భవనం చాలా దృఢంగా ఉంది. "ఇక్కడ మీరు ఎన్నాళ్లయినా ఉండవచ్చు'' అంటూ అక్కడ ఒక గది నాకు చూపించాడు. చుట్టూ చిత్రాలు, మంచి ఆర్ట్ లైబ్రరీ, పక్కనే హోటల్. అంతకంటే ఏం కావాలి? సాయంత్రానికి కెజాంగ్ అనే ఫోటోగ్రాఫర్ పరిచయం అయ్యాడు. "ఇండియన్ ఎంబసీలో నా One Man Show జరుగుతూ ఉంది'' అంటూ ఆహ్వాన పత్రిక అందించాడు. తరువాత నాకు పరిచయం అయిన మరో యువకుడు రించేన్. ఇతడు తింఫూలోని Happy Valley Youth అనే సంస్థని నడిపిస్తున్నాడు. "నేను ఎక్కువగా మాట్లాడతాను, కాబట్టి నాకు ఎక్కువమందితో పరిచయం ఉంది'' అంటూ నా స్కెచ్‌బుక్‌లో చిన్న బొమ్మ కూడా వేశాడు. గ్యాలరీలో కూర్చుంటే ఇలాగే చాలామంది పరిచయం అయ్యారు.

పాతిక శాతం హిందువులే


ఆ రోజు ఆషాకామా ఆహ్వానంపై ఆయన మిత్రుడి ఇంటికి వెళ్లాను. ఇల్లు చేరేసరికి చీకటి పడింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కడే రెండు రివాల్వింగ్ హీటర్ల మధ్యన కూర్చొని పెయింటింగ్ వేస్తున్నాడు. ఆయన పేరు బిస్వాస్. భూటాన్‌లో 25 శాతం హిందువులు కూడా ఉన్నారని అప్పుడే తెలిసింది. గతంలో ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవాడు. కాని ప్రస్త్తుతం ఫుల్‌టైం ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆయన నీటిరంగుల చిత్రాల్లో ఎక్కువగా భూటాన్ వాస్తుకళా నిర్మాణాలు సాక్షాత్కరిస్తుంటాయి. ఆయన వద్ద యాంగ్లింగ్ (గాలంతో చేపలు పట్టడం) మీద మంచి బుక్ కలెక్షన్ ఉంది.

భూటాన్ వారి పేర్లు ఎక్కువగా వాంగ్ ధేమ్, దోర్జీ, కిన్‌లే, దోల్మా, వాంగ్ ఛుక్ లాంటివి ఉంటాయి. వాళ్ల రాజు గారి పేరు Wang Chuck కాబట్టి మామూలు ప్రజలు ఆ పేరు పెట్టుకున్నప్పుడు Chuk అని మాత్రమే రాసుకుంటారు. అక్కడ ప్రతి ఇంటి పైకప్పుకీ ఆకుపచ్చని రంగుని విధిగా వేస్తారు. తింఫూ నగరమంతా ఒక విశాలమైన లోయలో నిర్మించబడి ఉంది. భూటానీయులు ఎక్కువగా వారి జాతీయ దుస్తులే ధరిస్తున్నారు. మోకాళ్ల వరకు నల్లని మేజోళ్లు, వదులుగా ఉండే కోటు, బూట్లు, టోపీ.. ఇవీ వారి దుస్తులు. 1959వ సంవత్సరం వరకూ భూటాన్ విదేశీయుల్ని అసలు అనుమతించలేదు. తమ నాగరికత నాశనమై విదేశీయుల ప్రాబల్యం ఎక్కువ అవుతుంది అనే భయంతో. కానీ ఆధునిక ప్రపంచపు ఒత్తిడిని తట్టుకోలేక, పాత అలవాట్లను కొనసాగించటంలో ఉండే ఇబ్బంది వలన తలుపులు తీయక తప్పలేదు.

ఇండియన్ ఎంబసీకి వెళ్లి డైరెక్టరును కలుసుకున్నాను. సమకాలీన భారతీయ కళాకారుల చేత ఒక షో ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. తరువాత హ్యాండీ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్లాను. వాల్‌నట్ చెక్కతో చేసిన చిన్న బొమ్మలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. తేలిగ్గా, అందంగా ఉన్న ఆ చిన్న బొమ్మల్లోనే ఎంతో పనితనం ఉంది. అంగుళం సైజులో ఉండే బొమ్మల్లో కూడా హావభావాలు చూపించారు. చెక్కతో చేసిన మాస్క్‌లు అన్నిటికంటే అందంగా ఉన్నాయి. వారి ఉత్సవాల్లో మాస్క్‌లు లేకుండా నాట్యం ఉండదు.

జడల బర్రెలపై ప్రయాణిస్తారు


వాస్ట్ స్టూడియోకి రోజూ వచ్చిపోయే విదేశీ యాత్రికులతో బాగానే పరిచయాలు ఏర్పడ్డాయి. గ్యాలరీ పనులు చూస్తున్న అమ్మాయి పేరు కింగ్‌వాంగ్‌దేమ్. ఆమెకి చదరంగం అంటే ఇష్టం. నా రాజుకి చెక్ చెప్పకుండానే చంపేస్తూ ఉండేది. నేను మాత్రం "మీ రాజుని ఓడించడం నాకు ఇష్టం లేదు. స్మోకింగ్, ప్లాస్టిక్ లాంటి శత్రువుల్ని జయించి మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి'' అని చెప్పి, ఆమె చేతుల్లో ఓడిపోతూ, ఆట నేర్పిస్తూ ఆనందించేవాడిని. "సార్! ఈ సారి వచ్చినపుడు మా ఊరుకి తీసుకెళ్తాను. వస్తారా?'' అని అడిగింది. "జడల బర్రె మీద ప్రయాణం చేయాలనే కోర్కె తీరుస్తానంటే తప్పకుండా వస్తాను'' అన్నాను.
"మా గ్రామానికి వెళ్లాలంటే రెండు రోజుల పాటు నడవాలి'' అంది.
"అక్కడ మీ వాళ్లు ఏం చేస్తుంటారు?''
"వ్యవసాయానికి, యాత్రికులకి గుర్రాల్ని, జడల బర్రెల్ని సరఫరా చేయడంతోపాటు కోర్టీసెప్‌లు ఏరుకొంటారు. దాంతో జీవితం గడిచిపోతుంది'' అని చెప్పింది.

ఆ పురుగులకి మంచి డిమాండ్ ఉంది

కోర్టీసెప్‌లు అంటే పురుగులు. ఇవి 14 నుండి 17 వేల అడుగుల ఎత్తులో ఉండే మంచుకొండల మీద ఉంటాయి. అవి ఒక రకమైన పురుగు మొక్కలు. చలికాలంలో పురుగులాగా, ఎండాకాలంలో గడ్డిలాగా కనిపిస్తాయి. నిజానికి ఇవి Himalayan Bat Moth అనే పురుగులు. ఇవి గొంగళి పురుగుల్లాగా ఉండి పసుపురంగులో మెరుస్తూ, చిన్న మంచు కన్నాలలో కూరుకుపోయి ఉంటాయి. వైద్యానికి పనికి వచ్చే ఈ చిత్రమైన కోర్టీసెప్‌లకు హాంగ్ కాంగ్, సింగపూర్ చేశాల్లో మంచి డిమాండ్ ఉంది. శీతాకాలంలో ఆ ప్రాంత ప్రజలు వాటి సేకరణలో ఉంటారు.

ఒక రోజు సాయంత్రం ఆషాకామా వచ్చి "మనం ఇప్పుడు కొండల మీదికి వెళుతున్నాం రండి'' అంటూ కారు ఎక్కించాడు. తూర్పు వైపున ఉన్న కొన్ని కొండల మీద బొత్తిగా చెట్లు లేవు. "ఈ ప్రాంతాల్లో మొక్కల అవసరాన్ని గురించి కింగ్‌కి ఒక ప్రపోజల్ తయారు చేస్తున్నాను'' అని చెప్పాడు ఆషాకామా. ఆ కొండల మీద కొన్నిచోట్ల బౌద్ధ మందిరాలున్నాయి. మంచినీళ్ల సౌకర్యం కూడా ఉంది. ఎత్తయిన దిబ్బల మీద వందల కొద్దీ పార్థనా జెండాలు పాతి ఉన్నాయి. నిలువుగా ఉండే ఆ ప్రార్థనా జెండాల వెడల్పు రెండు అడుగులు, ఎత్తు పది నుండి యాభై అడుగుల వరకూ ఉంది. ప్రతి పది కిలోమీటర్లకీ వీటిని చూడగలం. ఇక్కడ డెబ్బయి శాతం ప్రజలు బౌద్ధులు కావడంతో వారి ప్రార్థనా విధానాలే అమలులో ఉంటాయి.

ఆషాకామాలో దాగి ఉన్న మరో కోణం పర్యావరణ పరిరక్షణ."ఈ ప్రార్థనా జెండాల కోసం నరికి వేస్తున్న చెట్ల వలన సంవత్సరానికి పదిశాతం అడవి తగ్గిపోతూ ఉంది. నిజంగా బుద్ధుణ్ణి గౌరవించే వాళ్లు ఈ పని చేయకూడదు. దీని వలన పుణ్యం కంటే పాపమే ఎక్కువగా జరుగుతుంది'' అని వాపోయాడు. అదే సమయంలో కింద ఉన్న లోయలో ఒక చోట దట్టంగా పొగ పైకి లేస్తూ ఉంది. ఎక్కడో నిప్పంటుకొంది. నిటారుగా ఆకాశం వైపుగా ప్రయాణిస్తున్న ఆ పొగని చూస్తుంటే వేదకాలం నాటి యజ్ఞాలు గుర్తుకొచ్చాయి. 'తమని రక్షించమని వృక్షాలు ఆకాశ దేవతలకి పొగతో సందేశాలు పంపుతున్నట్లుగా ఉంది' అనుకొన్నాను.

169 అడుగుల బుద్ధుణ్ణి చూశాను

ఫోటోలు తీయడం పూర్తి కాగానే మేమిద్దరం బుద్ధ విగ్రహం ఉన్న కొండ మీదకి వెళ్లాం. ఒక ఎత్తయిన కొండని చదును చేసి బుద్ధుని కంచు విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీని ఎత్తు 169 అడుగులు. కానీ వాస్ట్ స్టూడియో నుంచి చాలా చిన్నదిగా కనిపించింది. అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. చైనా ప్రభుత్వ సహాయంతో దాన్ని గత ఐదు సంవత్సరాలుగా నిర్మిస్తూనే ఉన్నారు. భూమి స్పర్శ ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకొంటున్న ఆ మైత్రేయ బుద్ధ విగ్రహం చుట్టూతా 50 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని చూశాక తింఫూ దాటి ఎటూ వెళ్లలేక పోయానన్న బాధ తీరిపోయింది.

తెల్లారి ఏడుగంటలకే నా తిరుగు ప్రయాణం కాబట్టి ఆ రాత్రి భోజనం ఆషాకామా గారింట్లో ఏర్పాటైంది. ఆషాకామా ఇల్లు చాలా విశాలంగా ఉంది. దానిలో అచ్చంగా చిత్రకళా సాధన కోసం ఒక పెద్ద గది ఉంది. అందులో అన్నీ సగం పూర్తి చేసిన బొమ్మలే ఉన్నాయి. ప్రతి దానికీ oh my god అని ఆశ్చర్యపోయే ఆయన భార్య 'మీ కోసం పోర్క్ స్పెషల్ వండాను. దాన్ని చౌమీన్‌తో తింటేనే బాగుంటుంది ఆది భయ్యా' అంటూ ఒక పెద్ద పింగాణీ ప్లేటుని నింపి నా ముందు పెట్టింది. "మీరందరూ కూడా ఇండియాకి తప్పకుండా రావాలి'' అని ఆహ్వానిస్తూ నా బ్యాగులో ఉన్న బుద్ధుని బొమ్మ బహుమతిగా ఇవ్వబోయాను. కానీ O.M.G ఒప్పుకోలేదు సరికదా, భయ్యా We have enough Buddhas, we want your traditional art అని చెప్పారు. 'సార్! మా రాజుగారి ఫోటో ఒకటి ఉంచుకోండి' అంటూ ఆషాకామా మాత్రం నాకు వాంగ్ ఛుక్ ఫోటో ఒకటి ఇచ్చాడు.

నన్ను గ్యాలరీ దగ్గర దించి వెళ్లిపోతూ "మరలా వచ్చే ఏడాది తప్పనిసరిగా రావాలి'' అంటూ అందరూ ఆహ్వానించారు. "మీ రాజుగారి పెళ్లికి తప్పకుండా వస్తాను'' అని వాగ్దానం చేసాను.
బస్ సరిగ్గా ఉదయం ఏడు గంటలకి బయలుదేరి పొగమంచుని చీల్చుకొంటూ కిందికి దూసుకుపోతూ ఉంది. డ్రైవర్‌కి అలవాటైన దారి. మాకు బయట ఏమీ కనిపించటం లేదు. కుడివైపు కొండమీద ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహం మంచు తెరల మధ్య తేలిపోతున్నట్టుగా ఉంది. ఈ దివ్యమైన పర్వతాల ప్రపంచానికి మరలా ఎప్పుడు వస్తానో అనుకుంటూ తిరుగుముఖం పట్టాను.


- ప్రొఫెసర్ ఎమ్. ఆదినారాయణ
ఫైన్ ఆర్ట్స్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం
e-mail : auscholargypsy@gmail.com, 98498 83570, 98498 83570

ఘన చరిత్ర గల నగరాలు రోస్టాక్, బెర్లిన్

గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మండే, మధ్యలో వీకెండ్ కలుపుకుని నాలుగు సెలవులు రావడంతో, స్నేహితులని కలిసేందుకు రోస్టాక్ వెళ్లాను. అక్కడి నుంచి ఒకరోజు బెర్లిన్ కూడా వెళ్లొచ్చాం. బయలుదేరినప్పుడు మామూలు సెలవులే, మామూలు సరదా తిరుగుళ్లే అనుకున్నాను కానీ, ఈ కొద్ది రోజుల గురించీ, ముఖ్యంగా బెర్లిన్ గురించి ఇంత బలమైన ముద్ర పడుతుందని ఊహించలేదు. రెండూ ఘనమైన చరిత్ర గల నగరాలే.

మొదట రోస్టాక్ గురించి చెబుతాను.

రోస్టాక్ నగరం జర్మనీ దేశాన, ఉత్తర దిశలో, బాల్టిక్ సముద్రం ఒడ్డున ఉంది. వార్నో నది దీని గుండా ప్రవహిస్తుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన యూనివర్సిటీల్లో ఒకటైన రోస్టాక్ విశ్వవిద్యా లయానికి ఇది ప్రసిద్ధి. అలాగే, నౌకానిర్మాణ పరిశ్రమలెన్నో ఉన్నాయి. ఈ నగరానికి పదకొండో శతాబ్దం నుంచీ చరిత్రలో స్థానం ఉంది. ఒకానొక కాలంలో, గొప్ప వెలుగు వెలిగి, మధ్యలో తగ్గి, మళ్లీ పందొమ్మిదో శతాబ్దం నాటికి పుంజుకుంది. ప్రపంచ యుద్ధ కాలంలో దారుణంగా దెబ్బతిన్నా, క్రమంగా మళ్లీ నిలదొక్కుకుంది.

ఈస్టర్ సమయంలో వెళ్లినందుకేమో, తాత్కాలికంగా వెలిసిన దుకాణాలు మార్కెట్ వీధుల నిండా కనిపించాయి. రాత్రి వేళ వెళ్లినందుకు అక్కడి సందడి కళ్లారా చూడలేదు కానీ, పండగ వాతావరణం తెలుస్తూ ఉంది. మార్కెట్ ప్రాంతంలో ఒకప్పటి నగర సరిహద్దుల్ని తెలిపే గోడా, నగర ముఖ ద్వారం తాలూకు ఆనవాళ్లూ ఇంకా అలాగే ఉన్నాయి. అలాగే, చారిత్రక దృష్టితో అలాగే ఉంచేసిన పాత కట్టడాలు (కాలం దాడులను తట్టుకున్నవి) - గతానికి సాక్ష్యాలుగా, ఠీవిగా, గంభీరంగా చూస్తూ, నగరమంతా కనిపిస్తూనే ఉన్నాయి.

ఇక్కడి విశ్వవిద్యాలయం నగరమంతా వ్యాపించి ఉంది. అక్కడొకటీ, ఇక్కడొకటీ, వారి భవనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయం 1419లో స్థాపితమైంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా, ఇప్పటి దాకా నిలిచి ఉంది. దాదాపు అప్పట్నుంచీ అలాగే ఉన్న భవనాలు కొన్ని ఉన్నాయి. ఐన్‌స్టీన్‌కు గౌరవ డాక్టరేటు ఇచ్చిన మొదటి విశ్వవిద్యాలయంగా దీని పేరు గుర్తు నాకు.


ఇక బాల్టిక్ సౌందర్యం చెప్పనలవి కాదు. ఒక పక్క మంచులో నడుస్తున్నట్లు కాళ్లని గడ్డ కట్టిస్తున్న నీళ్లలో నడుస్తున్నా, బయటకు రావాలనిపించలేదు. ఎటు చూసినా పెద్దవీ, చిన్నవీ నౌకలు, వయసు తేడా లేక హాయిగా ఆనందిస్తున్న జనం. వీరిలో అనుకోకుండా, మేము తెలుగు మాట్లాడుతూ ఉండడం విని, ఒక తెలుగు కుటుంబం కూడా పలకరించింది. ఇక్కడి నుండి స్వీడన్, ఫిన్‌ల్యాండ్, డెన్మార్క్, ఇస్టోనియా, లాట్వియా వంటి దేశాలకు ఫెర్రీల్లో కూడా వెళ్లొచ్చు. సమయాభావం వల్ల, ఫెర్రీ అనుభవం ఇంకా ఎదురుకాలేదు.


ఇక బెర్లిన్ అనుభవం...

బెర్లిన్ చేరాలంటే రోస్టాక్ నుండి ట్రైన్‌లో దాదాపు రెండున్నర గంటల ప్రయాణం. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, ప్రతి నిమిషమూ చరిత్ర పాఠంలా గడిచింది. పాఠ మంటే, తరగతి గదుల పాఠాల తూటాలు కాదు - జీవితాల, గతాల వ్యథా, కథానూ!

బెర్లిన్ స్టేషన్ ఓ పెద్ద బహుళ అంతస్థుల షాపింగ్ మాల్. కిందా పైనా కూడా ట్రైన్లు కనపడ్డాయి. ఒకటి ఇక్కడి లోకల్ ట్రైన్లకూ, మరొకటి బయటి ట్రైన్లకూ అనుకుంటా. ఇది యూరప్‌లోని అతి పెద్ద స్టేషన్లలో ఒకటి. అత్యాధునికంగా ఉన్న ఈ భవనం బయట కొస్తే, ఒక వింత ఆకారంలో ఉన్న విగ్రహం ఉంది. అక్కడ రాసి ఉన్నది చదివితే తెలిసింది దీని చరిత్ర.


ప్రస్తుతం ఉన్న బెర్లిన్ స్టేషన్ 2006లో పూర్తయింది. ఇప్పుడీ స్టేషన్ ఉన్న చోట ఒకానొకప్పుడు ల్యేటర్ స్టేషన్ ఉండేది. 1871లో నిర్మితమైన ఈ స్టేషన్ అప్పట్లో చాలా ముఖ్యమైన కూడలి. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమ యంలో బాగా దెబ్బతింది. తరువాత, కొన్నాళ్లు కాస్త తక్కువ స్థాయిలో నడిచినా, మళ్లీ ఆగిపోయింది.


అందులోనూ, తూర్పు పశ్చిమ జర్మనీల విభజన జరిగాక పశ్చిమ జర్మనీ రైల్వే లైన్లు తూర్పు జర్మనీ చేతిలో ఉండటంతో, దీన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఎనభైల్లో కొంత పునర్నిర్మాణం జరిగినా, జర్మనీలు రెండూ కలిసిన కొన్నేళ్లకు, పాతదాని స్థానంలో ఇప్పటి స్టేషన్ రూపు దిద్దుకుంది.

స్టేషనులోని పర్యాటకుల సమాచార కేంద్రంలో నగర పర్యటన పేరిట ఉన్న కరపత్రం తీసుకుని, మ్యాప్ చూసుకుంటూ, అంతా నడిచే తిరిగాం ఆ రోజంతా.

ఇక్కడి నుంచి నడిచే దూరంలోనే, జర్మన్ చాన్సెలర్ అధికారిక కార్యా లయమూ, జర్మన్ పార్లమెంటూ ఉన్నాయి. 1894లో కట్టిన ఈ పార్లమెంటు భవనం అప్పట్నుంచీ జర్మన్ చరిత్రలో కలిగిన చాలా మార్పులకు ప్రత్యక్ష సాక్షి. ఇక్కడి నుండి బ్రాండెన్ బర్గర్‌టోర్ చేరుకున్నాం. ఇది ఒకప్పటి నగర ముఖద్వారం. బెర్లిన్ మొత్తం అక్కడే ఉందా అన్నంత సందడిగా ఉంద క్కడ.


ఒకప్పుడు ఇవతల ఒక దేశం, అవతల ఒక దేశంలా ఉండి, మిలటరీ క్యాంపులతో నిండి ఉన్న ప్రదేశమంతా, ఇప్పుడు పల్లె టూళ్లలో జరిగే జాతరలా ఉంది. విచిత్ర వేష ధారులు, పిల్లల ఆటలు, బెంజి కార్ల ప్రదర్శన. ఈ కోలాహలాల మధ్య ఎవరో ఉద్యమకారుల ప్రదర్శన కూడా కనపడింది. జర్మన్‌లో రాసి ఉండటం వల్ల అట్టే అర్థం కాకపోయినా, ఏదో అఫ్గాన్ యుద్ధానికి సంబంధించినదని అర్థమైంది. పండగ పాటికి పండగా, ప్రదర్శన పాటికి ప్రదర్శనా - దేని జనాలు దానికి. ఇలా రెండూ పక్క పక్కనే శాంతియుతంగా జరగడం నాకు కొత్తగా అనిపించింది.


ఇక్కడికి దగ్గర్లోనే ‘హోలోకాస్ట్ మెమో రియల్’ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం, అంతకుముందు కాలంలో మరణించిన యూదు మతస్తుల జ్ఞాపకార్థం గత దశాబ్దంలో నిర్మించిన కట్టడమిది. చూసేందుకు విభిన్నంగా ఉంటుంది. ఏమిటిది ఇలా ఉంది, అసలు దీని అర్థమేమిటి? అన్న సందేహం కలుగుతుంది.


అక్కడి నుండి వస్తూ, ఓ సైన్సు మ్యూజి యంకి వెళ్లి, అక్కడి పరిశోధనల ఫలితాల గురించి ఆసక్తికరంగా చూస్తూండగా, కింద రోడ్డుపై ఏదో ప్రదర్శన. ఈస్టర్ శాంతి ర్యాలీయా, అన్నింటినీ కలగలిసిన ప్రొటెస్టు ర్యాలీనా అన్నది అర్థం కాలేదు. ఇట్నుంచి నడిస్తే, బెర్లిన్‌లోని ప్రముఖ వ్యాపార కూడలి అయిన పోట్స్‌డామర్ ప్లాట్జ్ వద్దకు వచ్చాం. ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో నిండి, అద్భుత ప్రపంచంలా ఉంది కానీ, ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, తరువాత కోల్డ్‌వార్ కాలంలో ఇక్కడేమీ ఉండేది కాదట. కోల్డ్ వార్ కాలంలో బహుశా, బెర్లిన్ గోడ ఇక్కడి నుండే వెళ్లేదేమో.


పక్కకి తిరగ్గానే బెర్లిన్ గోడ! ఒకప్పుడు అటూ ఇటూ రెండు దేశాలు. ఇప్పుడు మిగిలిందల్లా గోడలోని కొంత భాగం, దానికి తోడు గతాన్ని మరువకుండా జ్ఞాపకం చేస్తూ ఆ రోడ్డుపై పెయింట్ చేసిన చరిత్రా. కాస్త ముందుకెళ్తే, ఒకప్పటి అమెరికన్ మిలట్రీ స్థావరమైన చెక్‌పాయింట్ చార్లీ కూడా కనిపిస్తుంది. కోల్డ్ వార్ కాలంలో, తూర్పు నుండి పశ్చిమానికి మరలడానికి ప్రయత్నించేవారికి ఇదే ద్వారం. ఇక్కడే ఒకప్పుడు ఎందరో సరిహద్దు దాటుతూ దొరికిపోయి ప్రాణాలు వదిలారు.


బెర్లిన్ గోడ ఆనవాళ్ల కింద, నాజీ దారుణాల గురించి తెలిపే ప్రదర్శన వంటిది ఏర్పాటు చేశారు. అవన్నీ చదువుతూ ఉంటే, ఆవేశం, అయోమయం, బాధ, ద్వేషం, భయం, దిగ్భ్రాంతి అన్నీ ఒకేసారి కలిగాయి. (చేసినవాళ్లు) వీళ్లూ మనుషులేనా? ఏమిటీ మూర్ఖత్వం? అనిపించింది. ఇవి చూస్తున్న ప్పుడే హిట్లర్ కాలంలో పెరిగిన ఒక ముస లావిడ కనిపించి, కాసేపు తన అనుభవా లను పంచుకున్నారు.


అయితే, గోడ చివర నుంచి ఈ చివర వరకూ నడుస్తూ, కింద ఈ ప్రదర్శన చివరికి వచ్చేసరికి, కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాం. అక్కడిదాకా, నేను బెర్లిన్ నగరాన్ని పెద్ద చరిత్ర ఉన్న నగరంగా చూస్తూ వచ్చా కానీ, అప్పటినుండి కొత్త గౌరవం కలగడం మొదలైంది. ఇన్ని దారు ణాలు చూసి, సర్వనాశనానికి గురై, ఎన్నో ఊచకోతలను నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చినా, అటుపై యుద్ధాలంటూ ముక్కలై, మళ్లీ మరణాలనూ, అశాంతు లనూ అనుభవించి, సుఖమన్నది చరిత్రేమో అన్నట్లు ఉన్న పరిస్థితుల నుండి, ఇప్పటి బెర్లిన్‌గా మారిన తీరు అద్భుతం!


ఇక్కడి ప్రజలు ఎలాంటివారో నాకు తెలీదు. దక్షిణాన కొత్త మనిషిని నన్ను సాదరంగా ఆహ్వానించినట్లు ఇక్కడా స్నేహంగా ఉంటారో లేదో నాకు తెలీదు. ఉన్నా లేకున్నా ఈ చరిత్రకు వారసులై, కొత్త జీవితాలు బతుకుతూ, దారుణాలైనా మరువక, తమ ముందు తరాల కష్టాలను గుర్తుపెట్టుకుని, పాత జ్ఞాపకాలను గౌరవిస్తూ ఉన్నారు కనుక, వీరంటే కూడా నాకు గౌరవం ఏర్పడ్డది. నిజంగానే మనలో ఎందరివో ‘చెంచాడు భవసాగరాలనీ’, పైగా చెంచాలు కూడా చాలా చిన్న సైజువనీ అనిపించింది.


ఇలా, ఈ భావోద్వేగాల వెల్లువలో కొట్టుకుపోయి, అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఇక్కడే గడిపేయడంతో, ఇతర ప్రాంతాలు చూడ్డానికి అట్టే సమయం మిగల్లేదు. అందుకే గబగబా చూస్తూ గెండార్మెన్ మార్కెట్ కూడలికి వచ్చాం. ఇది మరో అద్భుతమైన భవన త్రయం. నిజానికి తప్పకుండా తిరిగి వచ్చి కాసేపు గడపాల్సిన స్థలం ఇది. ఇక్కడి నుండి రాజసం నిండిన హుంబోల్ట్ విశ్వవిద్యాలయ భవనాలూ, అక్కడే ఉన్న పాత చర్చీ, దానిలోని ఆర్టు మ్యూజియమూ చకచకా చూస్తూ, మళ్లీ ఒక మెయిన్ రోడ్డు పైకి వచ్చాం.


ఇక్కడే ప్రఖ్యాతి చెందిన బెర్లిన్ డోమ్ ఉంది. అదే ప్రాంతంలో వివిధ ప్రముఖ మ్యూజియములు కూడా ఉన్నాయి. అయితే అప్పటికే సమయం సాయంత్రం ఆరు కావొస్తూ ఉండటంతో, ప్రవేశ ద్వారాలు మూసేశారు. డోం ఎదురుగ్గా ఉన్న లాన్‌లో కూర్చుని, ఈ కట్టడాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కాసేపు గడిపాం. దాంతో పాటు మరోసారి బెర్లిన్ రావాలి, ఈ ప్రాంతంలోనే ఎక్కువసేపు గడపాలి అని నిర్ణయించుకుని, రోస్టాక్ వెళ్లేందుకు మళ్లీ బెర్లిన్ స్టేషనుకు వచ్చాం.


ఈ నగరాల చరిత్ర చదివి వచ్చిన నేను ఈ నగరం ఇంత జీవకళతో ఉట్టిపడుతూ దర్శనమిస్తుందనుకోలేదు. మొత్తానికి రోస్టాక్, బెర్లిన్లను చూద్దాం అనుకుని టూరిస్టుగా వెళ్లినదాన్ని కాస్తా, ఈ నగరాల పోరాట స్ఫూర్తికి భక్తురాలిగా తిరిగొస్తానని ఊహించలేదు.


- వి.బి.సౌమ్య

Monday, May 16, 2011

అందాలొలుకు(లు)... మనాలి. . .


Kullumanaliహిమ శిఖరమంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందాల నడుమ సిమ్లా రాజధానిగా విరాజిల్లుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌కి మధ్యలో ఉన్నదే మనాలి... అక్కడి అందాలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాలుష్యానికి అలవాటుపడి ట్రాఫిక్‌ కూడళ్ల మధ్య చిక్కుకుపోయి, కాంక్రీట్‌ జంగిల్‌లో కాపురాలు చేస్తున్న హైటెక్‌ నగరవాసికి ప్రశాంత కూడలి... ఈ మనాలి. అందుకే దీనిని స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా అంటారు.

ఉత్తర భారతావనిలో ఘనమైన హిల్‌ స్టేషన్‌లలో ఒకటిగా చెప్పుకోదగిన కులు లోయ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనదే మనాలి. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యపట్టణమైన సిమ్లాకు ఉత్తరాన 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో... బియాస్‌ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి మూడు కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉండటం విశేషం. చుట్టూ మంచు లోయల మధ్య వేడినీటి కొలనులు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.

నాటి మనువాలయమే...
పూర్వం ‘మను’ అనే ముని నివసించిన ప్రాంతం కాబట్టి అతని పేరునే ‘మనాలి’గా ఏర్పడింది. అయితే ఒకప్పుడు దీనిని మనువాలయగా పిలిచేవారట. అంటే మను నివసించిన ప్రదేశం అని పేరు.

వాతావరణం...

Rahala_Waterfalls మామూలుగా అయితే శీతాకాలంలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ సీజన్‌లో ఉన్ని దుస్తులు తప్పనిసరిగా వేసుకుని తిరగాల్సిందే. సమ్మర్‌లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతం ఉంటుంది. అందుకనే ఎక్కువగా పర్యాటకులు ఈ సీజన్‌లోనే ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, లోయలు... దట్టమైన అటవీ ప్రాంతాలతో... ప్రకృతి అందాలను రెట్టింపుచేసేలా అందమైన పక్షుల కువకువ ధ్వనులతో అలరారుతుంటుంది. సంవత్సరమంతా సీజన్‌తో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సందర్శించవచ్చు.

సాహసవీరులకు సేదతీర్చే...
ఇక్కడికి వచ్చే ఔత్సాహిక మంచు స్కేటర్స్‌కి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సహాయకుల పర్యవేక్షణలో స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. సోలాంగ్‌ నుల్లా, రోహతాంగ్‌లా వ్యాలీప్రాంతాలు ఇక్కడ మంచు స్కయింగ్‌కి అనుకూలం. ఇక్కడ జనాభా మొత్తం 4,200 మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హిందీ, హిమాచల్‌, ఇంగ్లీష్‌ భాషలు మాట్లాడతారు.

దుస్తులు...
మనాలి ప్రజలు పొడవైన ఉలెన్‌ కోటు వేసుకుంటారు. దానిని ‘చోళ’ అని పిలుస్తారు. నడుముకు కట్టుకునే బెల్టులా ‘డోరా’ అనే వెయిస్ట్‌ క్లాత్‌ కట్టుకుంటారు. ‘సుతాన్‌’ అనే టైట్‌ ప్యాంట్లను వేసుకుంటారు. ‘టోప’ అనే బ్లాక్‌ క్యాప్‌ను ఎక్కువగా పెట్టుకుంటారు. ‘లాచూ’ అనే బుజాలు కప్పుకునే ఒకరకం బ్లాంకెట్‌ కూడా వేసుకుంటారు. ఇవన్నీ చలినుంచి రక్షించే సాధనాలే అవడం విశేషం.

ఆహారం...
Kullumanali1 వరి, గోధుమ ఇక్కడి ముఖ్య పంటలు. ఇక్కడి ప్రజలు కోద్ర, సత్యార వంటి ఎనర్జెటిక్‌ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం విశేషం. వీరికి టీ అంటే మక్కువ. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుందక్కడ. అందుకనే పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు, లస్సీ వంటివి ఇక్కడ విరివిగా ఉపయోగిస్తారు. కులు మనాలి ప్రజలు బార్లీతో తయారుచేసిన ప్రత్యేకమైన వైన్‌, రెడ్‌ రైస్‌ను విందులు వినోదాల్లో తరచుగా తీసుకుంటారు. ఈ రెండింటినీ ‘చక్తి’, ‘లుగ్రి’ అని పిలుచుకుంటారు.

వసతులు...
లెక్కకి మిక్కిలిగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అనేక హోటళ్ళు ఉన్నాయి. ఎంత ఖర్చు పెడితే అంత... అన్నట్లుగా ఇక్కడ అన్ని వర్గాల వారి ఆర్థిక స్థోమతను బట్టి వారి వారి అభిరుచుల మేరకు అన్ని వసతులను అందజేస్తుంటాయి ఇక్కడి హోటళ్ళు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు చెందిన వంటకాలను కూడా అందజేయటం ఇక్కడి హోటల్‌ యాజమాన్యాల ప్రత్యేకత. టూరిస్ట్‌లు కూడా వారి వారి రేంజ్‌ను బట్టి వారికి కావలసిన హోటళ్లలో దిగుతుంటారు.

ఎలా వెళ్లాలంటే...
Manali-Tour మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల పరిధిలో భూంటార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది. అక్కడినుంచి మనాలి నుంచి ఢిల్లీ వయా సిమ్లాకు విమాన సౌకర్యం ఉంది. 135 కిలోమీటర్ల పరిధిలో జోగీందర్‌నగర్‌ నుంచి నేరో గేజ్‌ లైన్‌ రైలు సౌకర్యం ఉంది. బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ చంఢీఘఢ్‌ దాకా ఉంది. చంఢీఘఢ్‌ నుంచి 310 కి.మీ.దూరం. ఢిల్లీ నుంచి మనాలి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వీటి మధ్య 585 కి.మీ. దూరం ఉంది. మనాలి నుంచి సిమ్లాకు 270 కి.మీ. దూరం. బస్సు సౌకర్యం ఉంది.
http://www.visitmanalikullu.com/images/bijli_mahadev.jpg
చూడదగిన ప్రదేశాలు బిజిలీ మహదేవ్‌ దేవాలయం...
సముద్ర మట్టానికి 2460 మీ ఎత్తులో... కులు ప్రాంతానికి 10 కి.మీ. దూరంలో ప్రఖ్యాత బిజిలీ మహదేవ్‌ దేవాలయం ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ముఖ్యంగా కులు ప్రాంతంలో ఉన్న లోయల్లో మౌంటెనైఉ టెక్కర్స్‌కి ఆహ్లాదంగా ఉండటమే గాక వాళ్లలోని సాహసాపేక్షను ఈ ప్రాంతంలో పర్వతాలను అధిరోహించి మరీ తీర్చుకుంటుంటారు.
http://www.indianetzone.com/photos_gallery/9/hadimba_9236.jpg
హిడింబి దేవాలయం...
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇక్కడ భారతంలో ఘటోత్కచునికి తల్లి... భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబికి దేవాలయం ఉండటం. పైగా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోవడం మరో విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాక్షసికి దేవాలయం కట్టడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం. గుడి చాలా పురాతన కట్టడంలా ఉంటుంది. ఒక గుహలో ఉంటుంది. నిత్యం అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉండటం విశేషం. కొండ చుట్టూ మంచుతో కప్పి ఉంటుంది. ఎత్తయిన కొండలపై మరింత ఎత్తుగా చెట్లు ఆకాశంలో మబ్బులను తాకేలా ఉండటం విశేషం.

రహల్లా జలపాతం...
సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్‌ కనుమ ప్రాంతంలో పర్యాటకులు నయాగారా జలపాతం చూసిన అనుభూతిని పొందుతారు. మనాలికి మూడు కిలోమీటర్ల దూరంలోవాయువ్య దిశలో ఓల్డ్‌ మనాలి ప్రాంతం ఉంది. అక్కడ పురాతన కోటలు... సంప్రదాయ మను దేవాలయం చూడదగిన ప్రదేశాలు. వీటన్నితో మనాలి దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

కర్టసీ : సూర్య Daily

మైమరిపించే..మాల్డా

Barasona
దక్షిణ బెంగాల్‌ నుంచి ఉత్తర బెంగాల్‌కు వెళ్లేవారికి మాల్డా సింహద్వారం. మాల్డా ప్రాంతాన్ని గౌర్‌, పండువా రాజ వంశాలు పాలించారు. వారి తదనంతరం ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని ఇంగ్లీష్‌ బజార్‌ పేరుతో పాలించారు. గౌరీ-బంగా ప్రాంతంగా మాల్డాను ఒకప్పుడు పిలిచేవారు. మహానంద నది ఒడ్డున మాల్డా నగరం ఉంది. గంగా, మహానందా, ఫుల్హర్‌, కాలింద్రి నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహించటం ద్వారా అనేక పంటలతో సస్యశ్యామలమైంది. అలాగే అనేక రాజవంశాలు ఇక్కడ వర్ధిల్లాయి.http://www.meriyatrra.com/photos/images/malda_2.jpg
మాల్డా పట్టణాన్ని గౌరీపురగా పిలిచేవారని పాణిని వివరించాడు. పండువా రాజ్యాన్ని పుండ్రబర్ధనగా కూడా పిలిచేవారు. బెంగాల్‌ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో మాల్డాను గౌర్‌, పండువాగా పిలిచేవారు. మౌర్య సామ్రాజ్యంలో పుంద్రబర్ధన లేక పుండ్ర నగర్‌లు భాగంగా ఉండేది. http://www.meriyatrra.com/photos/images/malda.jpg
మాల్డాకు కొత్త అందాలను కల్పించటంలో బౌద్ధ మత పాలా, హిందూ సేనా వంశంతో పాటుగా ముస్లిం నవాబులు తమ వంతు కృషి చేశారు. చారిత్రకంగా మాల్డాకు ఘన చరిత్రే ఉంది. గంగానది ప్రవహించే ప్రాంతం కావడంతో మాల్డాలో అతి మేలైన ఫాల్జా మామిడి పండ్లు పండుతాయి. వీటి తీపితనం చెప్పేది కాదు.

చూడవలసిన ప్రాంతాలు...
Kadam_Rasul 

గౌర్‌: బారా సోనా, ఖాదమ్‌ రసూల్‌, లత్తన్‌ మసీదులు గౌర్‌లో ఉన్నాయి. 1425లో నిర్మించిన దాఖిల్‌ దర్వాజా ఉంది. మాల్డాకు 12 కి.మీ. దూరంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు దగ్గరలో గౌర్‌ ఉంది.http://www.indianetzone.com/photos_gallery/14/maldaBaraSona_7363.jpg
పండువా: సికిందర్‌ షా హయాంలో ముస్లిం వాస్తుకళతో అదీనా మసీదును 1369లో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద మసీదుల్లో ఇది ఒకటి. దీనిని హిందూ దేవాలయంపై నిర్మించారని అంటారు. దీని పక్కనే అనేక చిన్న మసీదులు కూడా ఉన్నాయి. మాల్డాకు 18 కి.మీ. దూరంలో పండువా ఉంది.http://www.rangan-datta.info/images/gour_1.jpg
ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: కోల్‌కతా సమీపంలో విమానాశ్రయం.
రైలు మార్గం: మాల్డా అతిపెద్ద రైల్వే స్టేషన్‌. కోల్‌కతా, గౌహతిల నుంచి నేరుగా రైళ్లు ఉన్నాయి.
రహదారి మార్గం: కోల్‌కతా నుంచి 340 కిలోమీటర్లు.

జలనాట్య తరంగిణి

Dubai_Fountain_Lights_and_W
ఓ వేసవి సాయంత్రం అక్కడ కొలువైతే... సింగరాలు, వయ్యారాలే... ఇంకా ఎన్నొన్నో దృశ్యాలు. అలసిపోయిన మనుషులకు, భారమైన మనసులను తేలిక పరిచే అద్భుత జల నాట్య తరంగిణి, విద్యుద్దీపాల వెలుగులు, సుగంధ ద్రవ్య పరిమళాలు. 
వీటికి తోడుగా... చక్కనైన సంగీతం, మరెన్నో విశిష్టతలు. సరిగమపదనిసలు సరాగాలు ఆడినట్లు, రాగం తానం పల్లవి తామే అయినట్లు... సృష్టి, స్థితి, లయ తనే అయినట్లు... నీటి కాన్వాసుకు ఎన్నొన్నో వర్ణాలు. ఎగసిపడే జల సోయగం క్షణక్షణానికి అభిషేకం చేయడం... కూచిపూడి, భరతనాట్యాలు నాకు తెలుసన్నట్లు వివిధ నృత్య భంగిమలు... ఇలా అన్నీ కొలువై ఉండడం నిజంగా.. .మహాద్భుతమే. ఆ అద్భుతమే కొంత కాలానికి ఈ విశ్వమే అచ్చెరువొందేలా, పర్యాటకులు విస్మయం చెందేలా అలరిస్తోంది. దుబాయిలోని గ్లోబల్‌ వాటర్‌ ఫౌంటైన్‌... దర్శిస్తే హృదయానందం... క్షణం క్షణం... నయనానందం... తథ్యం...
బర్జ్‌ ప్రాంతంలో కొలువుదీరిన ఈ ఫౌంటైన్‌ 25 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది.
http://cdn-wac.emirates247.com/polopoly_fs/1.202623.1271844713!/image/596032675.jpg
ఈ ఫౌంటైన్‌ సుమారు ఐదువందల అడుగల ఎత్తు వరకు నీటిని వెదజల్లగలదు. సహస్రాధిక రూపాల్లో ఈ నీరు నాట్యం చేస్తుంది. ఆ నాట్యాన్ని కళ్లతో చూసి ఆనందించాల్సిందే తప్ప వేరొకరు చెబితే థ్రిల్‌ ఉండదు. అంతా అత్యాధునిక సాంకేతికత్వంతో తయారు చేస్తోన్న ఈ గ్రేట్‌ ప్రాజెక్ట్‌ ఎమార్‌ డెవలపర్‌ మహ్మద్‌ ఆలీ అలాబర్‌ నిర్మించారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్ళు, రిసార్ట్‌‌స, 4 రెస్టారెంట్లు... అన్ని కలిపి సుమారు ఐదు వందల రూములుగా నిర్మించారు.. పారిశ్రామికంగాను, పర్యాటకంగాను దుబాయిని అంత ర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానాన్ని అలంకరించే దుబాయ్‌ పర్యాటకులను ఆకట్టుకోవడంలో కూడా అగ్రస్థానంలో ఉంది. కాలిఫోర్నియాకు చెందిన సాంకేతిక నిపుణులు ఈ ఫౌంటైన్‌ను తీర్చిదిద్దడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు.http://i.ytimg.com/vi/QuuAE9_Xxjw/0.jpg
ఎన్నో విశేషాలు...
జలకన్య నృత్యాలతో పాటు... అరబిక్‌, భారతీయ, పాశ్చాత్య సంగీతాలను సమన్వయం చేసే నిరంతర సంగీత స్రవంతి. రెస్టారెంట్లు... ఫౌంటైన్లను... ప్రభావితం చేసే ఏడు వేల విద్యుద్దీపాలు... సుమారు... 50 రంగులను నిక్షిప్తం చేశారు. ప్రతి క్షణం గాలిలోనే ఇరవై వేల గ్యాలన్ల నీరు మనకు కనిపిస్తుంది. వంద అడుగుల నుండి ఐదొందల అడుగుల వరకు నీరు తాండవం చేస్తుంది. ఈ హోటళ్ళు... రెస్టారెంట్ల... ఫౌంటైన్‌ అన్ని నిర్మాణాలు కలిసి సుమారు రెండు వందల పద్దెనిమిది మిలియన్ల అమెరికన్‌ డాలర్లు వ్యయం అయ్యిందని అంచనా. గత సంవత్సరం ప్రారంభమైన ఈ జలసోయగం... ప్రపంచవ్యాప్త పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లాస్‌ వెగాస్‌ ఉన్న ప్రఖ్యాతిగాంచిన వాటర్‌ ఫౌంటేన్‌ కంటే ఇది ఎంతో పెద్దది... ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని లాస్‌వెగాస్‌లో వున్న ఫౌంటైన్ ‌గొప్పగా భావించేవారు.. కానీ ఈ నిర్మాణం చేపట్టానికి ముందే ఇది రికార్డులను సృష్టించింది. కాగా ఈ ఫౌంటైన్‌ను నిర్మించేందుకు లాస్‌వెగాస్‌ ఫౌంటైన్‌ను చూసిన తర్వాతే ఈ ఆలోచన వచ్చిందని అలాబర్‌ అన్నారు. ఈ వాటర్‌ ఫౌంటైన్‌ సంవత్సరానికి సుమారు కోటి మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మంచుపూల వనాల్లో...

కాశ్మీరుకి బయల్దేరేముందు మేము పడ్డ ఆందోళన ఇంతా అంతా కాదు. 'కాశ్మీరా? ఫరవాలేదా? అక్కడంతా అల్లర్లట కదా... కాల్పులట కదా' అని మా మిత్రులు, సన్నిహితులూ మొదట్లో భయపెట్టారు. తీరా అక్కడికి చేరాక ఆ భయమంతా పటాపంచలైపోయింది. మీడియా కాస్త ఎక్కువ చేస్తోందేమో అనే అనుమానం వచ్చింది.
*                                                               *                                                                    *
విశాఖపట్నం నుండి విమానంలో బయలుదేరిన మేము అంటే మా అమ్మా నాన్నా నేనూ ఢిల్లీలో దిగి, అక్కడ ఆ రాత్రి బస చేసి, మరుసటి రోజు మూడు గంటల ప్రాంతంలో కాశ్మీరుకు చేరాం. దారిలో విమానంలోంచి హిమాలయాలను చూడడం గొప్ప అనుభవం. ఆ కొండలన్నీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కట్టిన తెల్లటి ఇసుక గూళ్లలా కనిపించాయి. పైనుండి భూమిని చూడటమే ఒక వింత అనుభవమయితే అలాంటిది ఏకంగా హిమాలయాలనే చూడటం మహా అద్భుత అనుభవం.

ముందుగానే జమ్ముకాశ్మీర్ పర్యాటక కేంద్రం వారి రూమ్స్‌ను ఇంటర్నెట్‌లో బుక్ చేసుకున్నందువల్ల హోటల్ 'లలారుఖ్' చేరుకుని గదిలో సామన్లు పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత శ్రీనగర్‌లోని అందమైన ప్రాంతాలు చూడడానికి బయల్దేరాం.

ఇంకొన్ని కళ్లుంటే...


ఊరు చూపెట్టడానికి ఆటోవాడు ఎంత తీసుకుంటాడని అక్కడివారిని అడిగితే, మమ్మల్ని వారు చాలా విచిత్రంగా చూశారు. ఎందుకలా చూశారో మొదట మాకు అర్థం కాలేదు. పర్యాటకులు చలికి భయపడి ఎక్కువగా ఆటోల్లో తిరగరనీ, సుమోల్లోనే తిరుగుతారనే విషయం తర్వాత తెలిసింది. మేం ఒక సుమో మాట్లాడుకుని పావు గంటలో దాల్ సరస్సు పక్కనుంచి 'మొగల్ నిషాద్' గార్డెన్స్‌కు వెళ్లాం. ఆ గార్డెన్ ముందు వైపు దాల్ సరస్సు ... వెనుక మంచు కొండలు. మధ్యలో తివాచీ పరిచినట్లు పచ్చదనం. చూడడానికి నాకు ఇంకొన్ని కళ్లుంటే బావుండేదనిపించింది.
కాశ్మీరులో గొప్పవారైనా, పేదవారైనా ఇంటి పై కప్పును రేకులతోనే వేసుకుంటారు. కప్పులన్నీ ఇంగ్లీషు 'ఎ' ఆకారంలో ఉండి కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా ఉంటాయి.
తర్వాత రోజు గుల్మార్గ్ వెళ్లాం. ఆ చోటంతా మంచు నిండుగా అందంగా కనిపించింది. ఆ ముందురోజు వరకూ బాగా వర్షం పడి, దారంతా మంచుతో నిండిపోయి యాత్రికులను ఇబ్బంది పెట్టిందట. కాని మేం వెళ్లిన రోజునుండే వర్షాలు తగ్గి, రోడ్డు మీద పేరుకుపోయిన మంచును ఊడుస్తున్నారు. మన దగ్గర మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు మీద చెత్త ఊడ్చినట్టు అక్కడ మంచును ఊడ్చి పారేస్తున్నారు.

స్టెడ్జ్ బళ్లపై తిరిగాం


గుల్మార్గ్ మంచు కొండల్లో ఆడుకోవాలనుకునే వాళ్లు అక్కడే పొడవాటి జర్కిన్లు, బూట్లూ అద్దెకు తీసుకోవచ్చు. మేము 'స్లెడ్జ్' బళ్ల మీద చిన్న చిన్న మంచుకొండలు ఎక్కాము. ఈ బళ్లను మనుషులే తాడుకట్టి లాగుతారు. ఆ మంచుకొండలపై బళ్లతో జారుతూ వెళుతుంటే ఎవ్వరైనా సరే బాల్యంలోకి వెళ్లిపోవలసిందే.
తర్వాత 'హజరత్‌బల్ దర్గా'కి వెళ్లాం. మహ్మద్ ప్రవక్త వెంట్రుక ఉండడం వల్లే అది వారికి ఎంతో పవిత్రం. ఆ దర్గా వెనుక భాగం నుంచి దాల్ సరస్సులో బోట్ షికారు చేశాం. మధ్యలో ఒక చోట చిన్న ద్వీపంలా కనిపించింది. అక్కడ నాలుగు చినార్ చెట్లు ఉన్నాయి. అందుకే ఆ చోటుని 'చార్ చినార్' అంటారు. బోటులో అక్కడిదాకా వెళ్లొచ్చాం.
సింధునదిలో గంతులేశాం


రెండవ రోజు మేము సోన్‌మార్గ్ వెళ్లాం. దారిలో మాకు కొన్ని స్కూళ్లు కనబడ్డాయి. స్కూలు పిల్లలు ఎండలో కూర్చోవడం చూసి పాపమనిపించింది. వారంతా ఎండకోసం అక్కడ కూర్చున్నారని తెలిశాక నవ్వుకున్నాం. సోన్‌మార్గ్ వెళ్లే దారికి ఇరుపక్కలా ఆవాల పొలాలు ఎక్కువగా కనిపించాయి. ఆ మొక్కలకి పసుపు పచ్చ పూలు ఉంటాయి. దారి పొడుగూతా ఎటు చూసినా పసుపు పచ్చ అందాలే.
సోన్‌మార్గ్ కూడా గుల్మార్గ్ లాగే మంచు కొండలతో నిండి ఉంటుంది. కానీ ఇక్కడ మంచు కరిగి సింధూనదిగా ప్రవహిస్తుంది. పరవళ్లు తొక్కి పారుతున్న నదిని చూస్తే అందమైన లేడి పిల్ల చెంగు చెంగున గంతులేసి పరిగెడుతున్నట్లు ఉంటుంది. నదిలో చెయ్యి పెడితే షాక్ కొట్టేంత చల్లగా ఉన్నాయి. అయినా సరే ముఖం కడుక్కొని, ఆ నీళ్లు తాగి, మా దగ్గరున్న సీసాల్లో నింపుకొని కదల్లేక కదిలాం.
అక్కడనుంచి ఆసియాలోనే అతి పెద్ద సరస్సయిన వుళ్లారు సరస్సు చూడడానికి వెళ్లాం. సరస్సు చుట్టూ పార్కులాంటిది కట్టారు. మంచు కొండలు, చెట్లు చూస్తున్నప్పుడు కాశ్మీరు వాళ్లు వాళ్ల సినిమాలు తీయడానికి వేరే ఎక్కడికీ వెళ్లనవసరం లేదనిపించింది.

అందాల 'టులిప్' గార్డెన్


అక్కడి నుండి శ్రీనగర్‌లోని ఫేమస్ టులిప్ గార్డెన్‌కి వెళ్లాము. అక్కడ రంగు రంగుల 'టులిప్స్' చూపరులను కట్టిపడేస్తాయి. నలుపు, తెలుపు, గులాబి, కాషాయం, ఎరుపు, పసుపు ఇంకా బోలెడు రంగురంగుల టులిప్స్‌ను చాలా అందమైన ఆకృతుల్లో పెంచారు. ఆ తోటను చూస్తే చిన్నప్పుడు చదివిన జానపద కథల్లో యువరాణుల పూల తోట ఇదేనేమో అనిపించింది.

మూడో రోజు పహల్గాం వెళ్లాం. అక్కడికి వెళ్లే దారిలో లిడ్డర్ వేలీ కనబడుతుంది. లిడ్డర్ వేలీ అంటే అదేదో లోయ కాదు - ఒక నది. ఆ నదిలో ఎవరు గేలం వేసినా తప్పనిసరిగా చేప తగులుతుందని విని ఆశ్చర్యపోయాం. దీన్ని బట్టి ఆ నదిలో ఎన్ని లక్షల చేపలున్నాయో అనిపించింది! ఆ నీళ్లు మానససరోవరం దగ్గరి మంచు కరిగి ప్రవహిస్తుండడం వల్ల వచ్చినవట. ఎలాగూ మానస సరోవరం వరకూ వెళ్లలేం కదా అని ఆ నీళ్లలో కాసేపు దిగి ఆడుకున్నాం. ఆ నీళ్లు కూడా ఒళ్లు జిల్లుమనేంత చల్లగా ఉన్నాయి. అక్కడి పారే నదు లు అంత అందం గా ఎందుకుంటాయా అని ఆలోచిస్తే ... పారే నీటికి ఇరుపక్కలా కొండ రాళ్లు ఉండడం వల్లనేమో అన్పించింది. మన దగ్గర ఇసుక ఉన్నట్టు. నీరు ఆ రాళ్లకు తగుల్తూ, ఆ రాళ్ల సందుల్లోంచి పైకి చిందుతూ తుంపర్లుగా లేస్తూ వెళ్లడం మనోహరంగా కన్పించే దృశ్యం. అదే రోజు శ్రీనగర్‌లో పారి మహల్ కూడా వెళ్లాం. పారి మహల్ నుంచి దాల్ సరస్సు మొత్తం కనిపిస్తుంది.

కాశ్మీరీలు యాత్రికుల్ని గౌరవిస్తారు


శ్రీనగర్‌లో మనుషులు చాలా స్నేహశీలతతో కనిపించారు. యాత్రికులను గౌరవిస్తారు. పర్యాటకుల్ని మోసం చేయరు. ఒకరోజు అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని మమ్మల్ని జీలమ్ నదికి తీసుకెళ్లమని అడిగితే ఇంత దగ్గరగా ఉన్న దానికి ఆటో ఎందుకని చెప్పి దారి చూపించాడే కానీ అటూ ఇటూ తిప్పి డబ్బులు అడగాలనుకోలేదు. అక్కడి మనుషులతో మనం కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు టీ తాగి వెళ్లమనో, భోంచేసి వెళ్లండనో ఎంతో మర్యాదగా వాళ్లింటికి ఆహ్వానిస్తారు. మనుషుల పట్ల వారు చూపించే ప్రేమకు కళ్లు చిప్పిల్లాయి నాకు.

చలిపులికి భయపడిపోయాను


మేం వెళ్లింది ఏప్రిల్ నెలలో. అక్కడ పగటి గరిష్ఠ ఉష్టోగ్రత 25 డిగ్రీలకంటే ఎక్కువ లేదు. అదే చలికాలంలో మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుందట. అయితే మన ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకూ ఉంటుందని చెబితే 'అమ్మో ... మేము అక్కడ వస్తే మాడి మసైపోతామేమో' అని నవ్వారు. చలంటే ఎంతో ఇష్టపడే నేను రాత్రుళ్లు 8 రగ్గులు కప్పుకుని పడుకోవాల్సి వచ్చింది. మొదట్లో అరచేతులు కనిపించనంత పొడుగాటి చొక్కాల్లాంటివి చూసి ఆశ్చర్యపోయా. ఒకర్నిద్దర్ని చూసి అవిటివారేమో అనుకున్నాను. ఎండ వచ్చేకొద్దీ ఒక్కొక్కరూ చేతుల్ని బయటకి తీయడం చూసి 'హమ్మయ్య' అనుకున్నాను. చలికి భయపడి అరచేతుల్ని చొక్కాల్లోపల ఉంచుకున్నారని అర్థమైంది.

మన స్కూళ్లు ఏప్రిల్, మే మాసాల్లో మూసేస్తే అక్కడ చలికి భయపడి నవంబర్, డిసెంబర్లలో మూసేస్తారట. మనవి వేసవికాలం సెలవులైతే వాళ్లవి శీతాకాలం సెలవులన్నమాట. అన్నం పొయ్యి మీదనుంచి దించగానే తినెయ్యాలి అక్కడ. లేదంటే క్షణాల్లో బిరుసెక్కిపోతుంది. 'కీషవ' అనే డ్రై ఫ్రూట్స్‌తో చేసిన లిక్విడ్ స్వీట్‌ని నేను చాలా ఇష్టంగా తాగాను.
మేం సుమోలో వెళ్తున్నప్పుడు ఒక ఉద్యోగిని కలిశాం. మాతో కాసేపు మాట్లాడిన తరువాత 'కాశ్మీరు గురించి, మా వాళ్ల గురించి మీ వాళ్లతో ఏమని చెప్తారు' అని అడిగాడాయన. 'ఇక్కడ ప్రశాంతంగా ఉందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లని' చెబుతాం అని బదులిస్తే అతను చాలా సంతోషించాడు.

- ఎస్.ఎ. కిరణ్మయి

మారిషస్

మారిషస్ వలసకూలీలే వర్థిల్లారు

"దేవుడు మొదట మారిషస్‌ను సృజించి, తరువాత స్వర్గాన్ని సృష్టించాడు. నిజం చెప్పాలంటే, మారిషస్‌కు నకలుగానే స్వర్గాన్ని సృష్టించాడు''- సుప్రసిద్ధ రచయిత మార్క్‌ట్వైన్ చేసిన వ్యాఖ్యలో కొంత ప్రశంస ఉన్నా, ఎక్కువ కొంటెతనమే ఉన్నది. మారిషస్ అందాన్ని గురించి పర్యాటకులు సరే, అక్కడి ప్రజలు చెప్పుకునే గొప్పలను వినీవినీ ఆయన ఆ మాటలు అన్నారట. ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని విసిరిపారేసి, వాచ్యార్థంలోనే ఆయన ప్రశంసను మారిషన్లు ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు.

జాతీయభావన ఏదీ ఇంకా గట్టిగా స్థిరపడని మారిషస్‌లో దేశమంటే ఇంకా మట్టీ నీరూ పర్వతాలూ పచ్చదనమే. కాసింత గాలీ, కొంచెం సూర్యరశ్మీ, అపారమైన సముద్రమూ, తగినంత విశ్రాంతీ- పనిగంటల తరువాత మారిషన్లకు ఇదే ప్రపంచం. కూపస్థమండూకాలని నిందాపూర్వకంగా అంటుంటారు కానీ, చిన్న ప్రపంచం నిజంగానే చింతలు లేని ప్రపంచం. ద్వీపవాసుల మనస్తత్వాలు చిరుసరిహద్దులలోనే సంతోషాన్ని వెదుక్కునేవిగా ఉంటాయి. ఎల్లలు లేని ప్రపంచం మీద వారికి మోజు ఉండదు. వారి ఆశలు దురాశల దూరాల వైపు కన్నెత్తి చూడవు.


మారిషస్ బహుశా ఇప్పుడు కూడా చాలావరకు అట్లానే ఉండి ఉంటుంది. కానీ, అది నిన్న అట్లా లేదు. బహుశా రేపు అట్లా ఉండనూబోదు. అక్కడి నైసర్గికత అద్భుతమే కావచ్చు కానీ, మానవ ప్రవృత్తి అక్కడ అత్యంత క్రౌర్యాన్నే చూపింది. ఐరోపా సామ్రాజ్యవాదుల మానవ వ్యాపారానికి, శ్రమదోపిడికి అది వేదిక అయింది. అక్కడి చెరుకు రసంలో నల్లజాతి రక్తకణాలున్నాయి. భారతీయుల స్వేదబిందువులున్నాయి. చెరకు పండించేదొకరైతే వండేది మరొకరు- అని ఒక మారిషస్ సామెత.

అక్కడ ఆదివాసులెవరూ లేరు


కోటి సంవత్సరాల కిందట హిందూమహాసముద్ర గర్భంలోని అగ్నిపర్వతం బద్దలై ఎగిసిన శిలాద్రవం రెండు మూడు దీవులకు జన్మనిచ్చింది. అందులో పెద్దది మారిషస్. మారిషస్ తీరమంతా వ్యాపించిన పగడాల శిలలు సాగర ఉధృతి నుంచి ఆ దేశాన్ని రక్షిస్తాయి. మడగాస్కర్‌కు తూర్పువైపున సుమారు తొమ్మిదివందల కిలోమీటర్ల దూరంలో, భారతదేశ దక్షిణతీరానికి నైరుతి దిశగా సుమారు మూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిషస్ దేశం వైశాల్యం అన్ని దీవులతో కలిసి రెండువేల నలభై చదరపు కిలోమీటర్లు. మారిషస్ విశేషమల్లా ఒకటే, అక్కడ ఆదివాసులెవరూ లేరు. నాలుగైదువందలేళ్ల కిందటిదాకా మానవ ఆవాసం తెలియని దేశం అది. మొదట అరబ్ యాత్రికులు, తరువాత పోర్చుగీసు నావికులు మజిలీచేసిన ఆ ఆఫ్రికన్ దీవిని డచ్ సామ్రాజ్యవాద అన్వేషకులు ఆక్రమించారు.

వారి ఆకలికి అక్కడి డోడో పక్షి (స్థూలంగా ఉండి, గెంతడం తప్ప ఎగరలేని పక్షి) అంతరించిపోయింది. డచ్ రాకుమారుడు మారిస్ నసావ్ పేరుతో మారిషస్ అయిన ఆ దేశం ఫ్రెంచివారి వలసగా వందసంవత్సరాల దాకా ఉండింది. ఈ కాలంలోనే చెరకుతోటల పెంపకానికి ఆఫ్రికన్ నల్లజాతివారిని బానిసలుగా వినియోగించారు. అత్యంత క్రూరమైన బానిసవిధానం అక్కడ రాజ్యమేలింది. ఫ్రెంచివారి నుంచి 19వ దశాబ్దారంభంలో మారిషస్ బ్రిటిష్‌వారి చేతిలోకి వచ్చింది. బానిసవిధానంపై వ్యతిరేకత బ్రిటిష్ సమాజాన్ని కూడా నాడు కుదిపివేసింది. తప్పనిసరి అయి బ్రిటిష్ పార్లమెంటు బానిసత్వాన్ని రద్దుచేసింది. నల్లజాతివారు విముక్తులయ్యారు. స్వతంత్రులైన నల్లజాతివారు అనేకమంది తమ స్వదేశాలకు తిరిగివెళ్లగా, చెరకు భూస్వాములకు శ్రామికుల కొరత ఏర్పడింది. అప్పుడు ఇన్‌డెంచర్ పద్ధతిలో శ్రామికులను భారత్ నుంచి, చైనా నుంచి తరలించడం మొదలయింది.

70 శాతం భారతీయులే


మారిషస్ నేటి జనాభాలో సుమారు 70 శాతం మంది భారతీయ సంతతివారు . ఆశ్చర్యకరంగా అందులోని అత్యధికులు నేటి బీహార్ రాష్ట్రం నుంచి వెళ్లినవారు. సముద్రతీరం లేకపోయినా, కలకత్తా రేవు నుంచి ఎగుమతి అయిన మానవవనరులన్నీ దాదాపుగా బీహారీవే. బెంగాలీలు చదువులకోసం వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లారు కానీ, పొట్టచేత పట్టుకుని పడవలెక్కలేదు. మారిషస్ జాతిపిత శివసాగర్‌రామ్‌గులామ్ పూర్వీకులూ, అధ్యక్షులు అనిరూధ్ జగన్నాథ్ పూర్వీకులూ బీహార్‌నుంచి వచ్చిన శ్రామికులే. వారి పూర్వీకుల భాష భోజ్‌పురీయే. చెన్నై రేవు నుంచి, ఉత్తరాంధ్ర రేవుల నుంచి తమిళులు, తెలుగువారు మారిషస్ వెళ్లారు. ఉత్తరభారతదేశంలో 19 వ శతాబ్దం ఆరంభం నుంచి నెలకొని ఉన్న రాజకీయ అస్థిరతా, దారిద్య్రమూ, ఆర్థిక సంక్షోభమూ బీహార్ వంటి ప్రాంతాలనుంచి శ్రామికుల వలసకు నేపథ్యమైంది. 1834లో భారత్ నుంచి ఇండెంచర్ శ్రామికులతో మొదటి ఓడ మారిషస్ చేరింది. ఆ వలస తరువాత మూడు నాలుగు దశాబ్దాల దాకా సాగుతూనే వచ్చింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం ఉత్తరాదిలో నెలకొన్న సంక్షోభపరిస్థితులు కూడా ఈ వలసలకు కారణమయ్యాయి.

దక్షిణాదిలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చిన వరుస దుర్భిక్షాలు కొందరు సుదూరదేశానికి దోహద పడ్డాయి. తాము ఎంత దూరంలో ఉన్న ప్రాంతానికి వెడుతున్నామో, ఎప్పుడు తిరిగి రాగలమో వలసవెడుతున్న వారికి అవగాహన లేదు. త్వరలోనే తిరిగి రాగలమనే ధైర్యంతోనే చాలామంది ఓడలెక్కారు. అందుకే చాలామంది తమ కుటుంబసభ్యులను వదిలిపెట్టి బయలుదేరారు. శ్రామిక కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందంలో కనీస పనికాలం ఐదేళ్లు మాత్రమే ఉండడంతో, వేతనం, భోజనం, వైద్యం, నివాసం- వీటికి యజమానులు హామీ పడడంతో మెరుగైన జీవితం లభిస్తుందన్న ఆశతో శ్రామికులు వలసలకు సంసిద్ధం అయ్యారు.

లేబర్ కాంట్రాక్టర్లు స్త్రీకార్మికులను సమాన సంఖ్యలో తీసుకువెళ్లడానికి సుముఖంగా లేకపోవడంతో- మారిషస్‌లో స్థిరపడిన భారతీయులకు అతి త్వరలోనే కుటుంబ సమస్యలు తలెత్తాయి. ఉన్న సంసారాలు ఛిద్రం కావడం, పిల్లలకు సంబంధాల విషయంలో తమ కులం, భాష వారు దొరకకపోవడం- వంటి అనేక సమస్యలను వారు ఎదుర్కొన్నారు. ఇక యజమానుల క్రూరత్వానికి అయితే హద్దేలేదు. పనిచేయలేని వారికి అన్నమూ జీతమూ ఇవ్వకుండా వేధించేవారు. చెరకు తోటలమధ్య ఆకలితో చచ్చిపడి ఉన్న మనుషుల శవాలు తరచు తారసపడేవి. మారిషస్‌లో కట్టుకూలీల దుస్థితి గురించి గాంధీజీ అనేకమార్లు బ్రిటిష్‌ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయన 1901లో స్వయంగా మారిషస్ వెళ్లి మూడువారాల పాటు గడిపి, భారతీయుల స్థితిగతులను పరిశీలించారు. అంతిమంగా కట్టుకూలీల వ్యవస్థ రద్దు కావడానికి గాంధీపట్టుదల కూడా ఒక కారణం అయింది.

లౌకిక తెలుగు సమాజం వెలిసింది


ఫ్రెంచిపాలనలో వచ్చి స్థిరపడిన నల్లజాతివారు, కొందరు శ్వేతజాతీయులు, బ్రిటిష్‌పాలనలో కట్టుకూలీలుగా వచ్చిన చైనీయులు, భారతీయులు - వీరంతా ఒకే సమాజంగా రూపొందడానికి శతాబ్దానికి పైగా విఫలయత్నం చేశారు. మారిషన్లుగా కొన్ని సాధారణ లక్షణాలను సమకూర్చుకున్నప్పటికీ, ఫ్రెంచ్ పాలనలో రూపొందిన స్థానికమైన ఫ్రెంచిమిశ్రిత క్రోల్‌భాష, బ్రిటిష్ వలసపాలనలో అనుసరించవలసి వచ్చిన అధికార ఇంగ్లీషుభాష, తమ వెంట మోసుకువచ్చిన తమ పాత భాష- వీటి మధ్య మారిషన్లు నలిగిపోయారు. క్రమక్రమంగా తమ పూర్వీకుల భాషను విసర్జిస్తూ, స్థానిక క్రోల్- ఇంగ్లీషు భాషలను అనుసరించసాగారు. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్రపోరాటంలో ప్రధానంగా భారతీయ సంతతివారు భోజ్‌పురీల నాయకత్వంలో పాల్గొన్నారు. తక్కిన ప్రజావర్గాల వారు కూడా వలసవాద వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు కానీ, అధిక సంఖ్యాకులకు సహజంగానే నాయకత్వం దక్కింది.

పెద్దగా రాకపోకలు లేని ఒక దీవికి వివిధ నేపథ్యాలకు చెందిన భారతీయులు వలస వెళ్లి స్థిరపడిన సందర్భంలో- కులాలు, ఇతర భేదాలు సమసిపోవడమో, కొత్త రూపు తీసుకోవడమో జరగాలి. కాని మారిషస్‌లో కులం పూర్తిగా మాసిపోయిందని చెప్పలేము. శాకాహార అగ్రవర్ణమొకటి అక్కడి రాజకీయార్థిక శ్రేణుల్లో రూపొందింది. ఇప్పుడు పాలిస్తున్న రామ్‌గులామ్, జగన్నాథ్ ఆ వర్గానికి చెందినవారే. అయితే, తమలో కులాల సమస్య లేదని అక్కడి తెలుగుసంస్థల నాయకులు అంటున్నారు. దక్షిణాఫ్రికా తెలుగువారిలో లాగానే మారిషస్ తెలుగువారిలో కూడా 'నాయుడు' ఇంటిపేరున్న వారున్నారు. అధికులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినవారు కావడంతో, ఆ ఇంటిపేరును ఫలానా కులానికి చెందినదిగా భావించే అవకాశం ఉన్నది. కానీ, ఇతరుల విషయంలో ఇంటిపేర్లే అదృశ్యమయ్యాయి, కులాలేమిటో వారికి గుర్తు లేదు. ఇతర భాషల వారితో, మతాల వారితో కుటుంబాలు సంకరం కూడా అయ్యాయి. ఒక రకంగా లౌకికమయిన తెలుగు సమాజం మారిషస్‌లో వెలిసినట్టు లెక్క.

ఉగాది జాతీయ సెలవుదినం


లౌకికమయిన తెలుగుసమాజమే అయినా, అది ఎంతవరకు తెలుగు సమాజం అన్నది ఒక ప్రశ్న. 'మా పిల్లలకెవరికీ తెలుగు రాదు, మళ్లీ నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము' అన్నారు. మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం చైర్మన్ ఆదినారాయణ్ హచ్చమా (ఈయనను ఆత్మా అని పిలుస్తారు) 'మేం ఫ్రెంచిలో మాట్లాడతాము, ఇంగ్లీషులో రాస్తాము, తెలుగులో ప్రార్థన చేస్తాము' అని చెప్పారు. మారిషస్ వచ్చినతరువాత ఈ నాలుగైదు తరాల కాలంలో, తెలుగువారు మరచిపోనిది రామభజనలు మాత్రమేనని, ఇప్పటికీ ఉగాది, రామనవమి జరుపుకుంటారని చెప్పారు. మారిషస్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది తెలుగులో పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టనున్నారు. మారిషస్ ప్రభుత్వం తెలుగు ఉగాదిని జాతీయసెలవు దినంగా కూడా ప్రకటించింది.

ఉత్తరాంధ్ర వాళ్లే ఎక్కువ


మారిషస్ తెలుగువారు ఇప్పుడు కోరుకుంటున్నది ప్రత్యేక ప్రతిపత్తి. హిందువుల పేరిట ఉత్తరాదివారితో కలిపేసి తమకు ఏ పరిగణనా ఇవ్వకపోవడం సరికాదని, తెలుగువారిని, ఇతర భాషల వారిని విడిగా గుర్తించాలని వారు కోరుతున్నారు. జనాభా లెక్కల్లో చాలామంది తెలుగువారు మతం అన్న ప్రశ్న దగ్గర తెలుగు అని రాస్తుంటారు. పూర్వీకుల భాష కింద క్రోల్‌ను పేర్కొంటారు. దీని వల్ల తెలుగువారి సంఖ్య జనాభా లెక్కల్లో సరిగా ప్రతిఫలించడం లేదని, మూడుదశాబ్దాలుగా తెలుగువారి జనాభా ఉన్నచోటనే ఉండడం ఆశ్చర్యకరమని మారిషస్ ప్రభుత్వంలో ఆర్థిక నిపుణులుగా పనిచేస్తున్న రచయిత సోకప్పడు రామినాయుడు (విష్ణు) అంటారు.

రామినాయుడు మారిషస్ తెలుగువారి గురించి అనేక పుస్తకాలు రాశారు. తన తాత అయిన బాపినాయుడు పండ సోకప్పడు జ్ఞాపకాలను ఆయన ఇంగ్లీషు, క్రోల్ భాషల్లో పుస్తకంగా రాశారు. మారిషస్ తెలుగువారి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం పనికివస్తుంది. మారిషస్ తెలుగువారి ఇంటిపేర్ల గురించి, మారిషస్‌లో తెలుగువారి పెళ్లిళ్ల గురించి, పండగల గురించి, తెలుగు క్యాలండర్, పంచాంగాల గురించి రామినాయుడు రాసిన పుస్తకాలు ప్రసిద్ధాలు. భారతదేశంలోని తెలుగుసమాజంతో అనుసంధానం చెందాలని మారిషస్ తెలుగువారు తపన పడుతున్నారు. రాష్ట్రవిభజన గురించి ప్రస్తావిస్తూ- రేపు రెండు రాష్ట్రాలయితే, మారిషస్ తెలుగువారం ఏ రాష్ట్రంతో మానసిక అనుబంధం ఏర్పరచుకోవాలి? అని ఆత్మ ప్రశ్నించారు. మారిషస్‌కు వచ్చిన తెలుగువారిలో ఉత్తరాంధ్రవారే కాకుండా- నెల్లూరు జిల్లావారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కూడా ఉన్నారు.

ఒకప్పటి బాధితులే నేటి పాలకులు


మారిషస్ స్వాతంత్య్రం పొంది నలభయిమూడేళ్లే. పూర్తి రిపబ్లిక్‌గా పరివర్తన చెందింది రెండుదశాబ్దాల కిందటే. బానిసత్వమూ వెట్టిచాకిరీ లేని స్వతంత్ర ప్రస్థానంలో మారిషస్ ఇంకా బాల్యంలోనే ఉన్నది. చిన్నదేశం కావడం వల్లా, ద్వీపదేశం కావడం వల్లా ఉండే సహజ లక్షణాలు, నవ స్వతంత్రదేశం కావడం వల్ల మిగిలి ఉన్న ఆదర్శ సంక్షేమవ్యవస్థలు ఆ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అదే సమయంలో దేశదేశాల పర్యాటకులకు విడిది కావడం, పారిశ్రామికులకు సంపన్నులకు పన్నుల్లేని స్వర్గం కావడం ప్రపంచీకరణ యుగంలో మారిషస్‌ను ప్రమాదకరసీమల్లోకి నెట్టివేశాయి. శుభ్రతకు, ప్రకృతికీ పెట్టింది పేరైన మారిషస్ ఇప్పుడు అభివృద్ధిలో సింగ్‌పూర్‌ను ఆదర్శంగా భావిస్తున్నది. నిట్టనిలువు హర్మ్యాలనే అభివృద్ధి చిహ్నాలుగా భావించేపక్షంలో, మారిషస్ కూడా త్వరలోనే జనసమ్మర్దంతో వినియోగ సంస్కృతితో కిక్కిరిసిపోతుంది. చెరకుతోటలు అంతరించిపోయి, కాంక్రీటు నిర్మాణాలే అంతటా నిండిపోతాయి. సముద్రతీరాలు కాలుష్యంతో మురిగిపోతాయి. ఎబొనీ అడవులు కలపదాహానికి ఎండిపోతాయి.

ఒకనాడు కూలీలుగా వలసవెళ్లిన ప్రజలు తమను తాము పాలించుకుంటున్న దేశం మారిషస్. నూటాయాభై ఏండ్ల కిందట నష్టజాతకులై మాతృదేశాన్ని వదిలివెళ్లినవారు, ఇప్పుడు మరో దేశంలో స్వతంత్రపౌరులుగా ఉన్నారు. తమ దేశ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోగలిగిన అవకాశం వారికి ఉన్నది. భారత ప్రభుత్వంతో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని తమ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. దక్షిణాఫ్రికాలోను, సుదూర కరేబియన్ దీవుల్లోను తమలాగే వలసవెళ్లిపోయిన భారత సంతతివారితోనూ ఒక అనుబంధాన్ని నిర్మించుకోవచ్చు. వలసవాద క్రూరత్వంతోనే మానవ ఆవాసం మొదలైన మారిషస్‌లో ఇప్పుడు బాధితులే పాలకులు. వారి వల్లనే అది ఒక దేశం అయింది. భారతదేశపు అవలక్షణాలు సోకకుండా వారి ప్రయాణం సాగాలి. భారతీయులకు మార్గదర్శకంగా ఉండేలా వారి ప్రగతి ఉండాలి.

విషాద పాదముద్రలు


"మారిషస్ ఎట్లా అనిపిస్తోంది?'' అని అడిగారు ఆత్మా, రామినాయుడు.
"మారిషస్ ఎక్కడ చూశాను, మేం మారిటిమ్ మాత్రమే చూస్తున్నాము'' అని చెప్పాను. మారిటిమ్ అంటే మేం విడిది చేసిన రిసార్ట్ హోటల్. ఏప్రిల్ 24 నుంచి 28 దాకా మారిషస్‌లో అయిదురోజుల అధికార పర్యటన కోసం వచ్చిన భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వెంట వెళ్లిన మీడియా బృందానికి ఆ ఐదునక్షత్రాల హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే లేవడం, రాష్ట్రపతి కార్యక్రమానికి అనుగుణంగా వాహనాలలో వెళ్లడం, రాత్రికి తిరిగి రావడం తప్ప సొంతంగా ఆ ద్వీపదేశాన్ని పరిశీలించడానికి గానీ, ప్రజలతో మాట్లాడడానికి గానీ మాకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు తెలుగుసినిమా డ్యూయెట్లలో విరివిగా కనిపిస్తున్న సుందర సముద్రతీరాలను ప్రత్యక్షంగా చూడలేకపోయాము. ఒకరోజు మాత్రం ఒక కార్యక్రమాన్ని తప్పించుకుని మారిషస్ తెలుగు సాంస్క­ృతిక కేంద్రం వారిని కలుసుకున్నాను.

అట్లాగని, రాష్ట్రపతి కార్యక్రమంలో మారిషస్‌ను అర్థం చేసుకోవడానికి కావలసిన దినుసులు లేవని కాదు. చిన్న చిన్న రోడ్ల గుండా మోటార్‌సైకిల్ పైలట్ల వెనుక ప్రయాణించిన మా వాహనాల అద్దాలకిటికీలు మారిషస్‌ను బాగానే అర్థం చేయించాయి. రాష్ట్రపతి సందర్శించిన స్థలాలు కూడా ఆ దేశచరిత్రను, వర్తమాన ప్రాధాన్యాలను అవగతం చేసుకోవడానికి ఉపకరించాయి. రాష్ట్రపతి కార్యక్రమంలో ఆ దేశానికి, భారత్‌కు చెందిన జాతీయనేతలకు నివాళులర్పించే కార్యక్రమంతో పాటు, ఒక ధార్మిక కార్యక్రమం, రెండు చారిత్రక వారసత్వ స్థలాల సందర్శన కూడా ఉన్నాయి.

మధ్య మారిషస్‌లోని సవన్నె జిల్లాలో ఉన్న గంగాతలావ్ (గంగా తటాకం) మతప్రాధాన్యమున్న స్థలం. మారిషస్ పర్యావరణ, జల శాఖలు ఈ స్థలాన్ని నిర్వహిస్తున్నాయి. కొండల మధ్య అగాధంలో ఏర్పడిన ఆ తటాకం (పూర్వపు పేరు గ్రాండ్ బేసిన్) లోని నీరు భారతదేశంలోని గంగానది నుంచి వస్తున్నట్టుగా 19వ శతాబ్దం చివరలో ఒక హిందూపూజారికి కల వచ్చిందట. అది ఆ నోటా ఈ నోటా ప్రచారమై హిందువులలో సంచలనం సృష్టించింది. మరుసటి సంవత్సరం మహాశివరాత్రికి ఆ తటాకం నుంచి నీరు తీసుకువెళ్లి అభిషేకం చేశారు. తరువాత కాలంలో ప్రతి మహాశివరాత్రికి కాలినడకన వెళ్లి అక్కడ ఆ తీర్థాన్ని సందర్శించడం ఆనవాయితీ అయింది.

1972లో భారతదేశం నుంచి గంగాజలాన్ని తె చ్చి ఆ సరస్సులో కలిపారు. 1998లో తటాకాన్ని పవిత్రసరస్సుగా ప్రకటించారు. 2007లో 108 అడుగుల శివవిగ్రహాన్ని సరస్సు ఒడ్డున ప్రతిష్ఠించారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా తన వెంట 60 లీటర్ల గంగాజలాన్ని తీసుకువచ్చి, తటాకంలో కలిపారు. శివుని విగ్రహం దగ్గర వేదమంత్రాలతో రాష్ట్రపతి కుటుంబసభ్యులు పూజాదికాలు చేశారు. సెక్యులర్ రాజ్యాధినేత గంగాజలాన్ని తీసుకురావడం, పూజలు చేయడం సబబేనా అన్న ప్రశ్నలు ఆ కార్యక్రమం దగ్గర వినిపించాయి.

రాష్ట్రపతి కార్యక్రమంలో మరో ముఖ్యమైనది ఆప్రవాసీఘాట్ సందర్శన. బానిసత్వాన్ని నిషేధించబోతున్న బ్రిటిష్ ప్రభుత్వం దాని స్థానంలో కట్టుకూలీల వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనుకుని అందుకు ఎంచుకున్న వలసదేశం-మారిషస్. 1834లో మొదటి కట్టుకూలీల నౌక 'అట్లాస్' పోర్ట్‌లూయిస్ తీరం చేరింది. మొదటి అజ్ఞాత కూలీ మారిషస్ నేలపై అడుగుపెట్టిన చోట నిర్మించిన స్మారకమే ఆప్రవాసీఘాట్. ఆ స్థలంలో వలసకూలీలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక విడిది, వైద్యసదుపాయాల గదులు ఉన్నాయి. మూడంతస్థుల అసలు భవనం శిథిలమై ఇప్పుడు ఒక అంతస్థు మాత్రమే మిగిలింది. మానవజాతి చరిత్రలో ఇండెంచర్‌కూలీల వ్యవస్థ తప్పనిసరిగా నమోదు కావలసిన దుర్మార్గఘట్టమని గుర్తించిన యునెస్కో 2006లో ఈ స్థలాన్ని అంతర్జాతీయ చారిత్రక వారసత్వ స్థలంగా గుర్తించింది. రాష్ట్రపతి ఈ స్థలంలో మారిషస్‌కు వలసవచ్చిన కూలీలకు నివాళి అర్పించారు. 1834నుంచి 1923 దాకా సాగిన ఈ వలసల్లో భారతీయులే కాక, చైనా తదితర దేశాలనుంచి కూడా కార్మికులు వచ్చారు.

ఆప్రవాసీఘాట్ ప్రధానంగా మారిషస్‌లోని భారతీయసంతతివారికి ఉద్వేగపూరితమైన స్మారకంకాగా, ఆఫ్రికన్‌సంతతివారికి ముఖ్యమైనది బానిసత్వచరిత్రకు సంబంధించిన స్మారకం లె మోర్నె. మారిషస్ నైరుతి భాగంలో హిందూమహాసముద్రంలోకి తొంగిచూస్తున్నట్టున్న ఈ పర్వతం నల్లబానిసలు పారిపోయి తలదాచుకునే స్థలంగా ప్రసిద్ధిచెందింది. ఈప్రాంతంలో ఫ్రెంచివారి బానిస వ్యాపారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో, తిరుగుబాటు చేసిన బానిసలు, పారిపోయిన బానిసలు ఈ కొండసానువుల్లో సంచరించేవారట.

1835 ఫిబ్రవరి ఒకటిన ఒక పోలీసు బృందం కొండను ఎక్కడానికి వస్తూ, బానిసత్వవిధానం రద్దయిన సమాచారాన్ని కొండపై దాక్కున్న బానిసలకు తెలియజేయడానికి ప్రయత్నించారట. పోలీసులు చెబుతున్నదేమిటో వినిపించుకోకుండా, వారు తమను పట్టుకోవడానికే వస్తున్నారని అనుకుని కొండకొమ్ముమీద నుంచి బానిసలు దూకి చనిపోయారట. అప్పటినుంచి ఫిబ్రవరి ఒకటోతేదీని మారిషన్ క్రోల్‌లు (ప్రధానంగా క్రోల్ ఫ్రెంచి మాట్లాడే ఆఫ్రికన్లు) బానిసత్వ నిషేధ స్మారకదినంగా జరుపుకుంటున్నారు. ఈ స్థలాన్ని కూడా యునెస్కో చారిత్రక వారసత్వ స్థలంగా గుర్తించింది. ప్రతిభాపాటిల్ ఈ స్మారకం దగ్గర కూడా నివాళులర్పించారు. వేర్వేరు ప్రజాశ్రేణులకు సంబంధించిన రెండు ప్రధాన చారిత్రక అంశాలను స్ప­ృశించడం ద్వారా మొత్తం ప్రజానీకాన్ని సంతృప్తిపరచినట్టయింది.
గంగాతలాబ్ మినహాయిస్తే, ఈ రెండు స్థలాల వెనుకా విషాదం ఉన్నది, వాటిని స్మరించుకుని ముందుకు వెళ్లడంలో మారిషస్ సౌందర్యమూ ఉన్నది. తెలుగుసినిమాల్లో కనిపించే మారిషస్‌లో ఈ ఉద్వేగం, అందం ఎక్కడ కనిపిస్తుంది?
* కె. శ్రీనివాస్

Tuesday, May 10, 2011

గ్రీకు సంస్కృతికి పెట్టని కోట.. పెట్రా


Petraఅరేబియన్‌ ఎడారి అంచున ఉన్న.. నబతియన్‌ సామ్రాజ్యపు చారిత్రక రాజధాని నగరం పెట్రా. సముద్ర సంబంధిత సాంకేతిక రంగంలో ప్రవీణులైన నబతేయన్లు ఈ నగరానికి ఎన్నో సొరంగ మార్గాలను, నీటి కందకాలను నిర్మించారు. గ్రీకు-రోమన్ల సంస్కృతికి నిలువుటద్దం లాంటి.. సుమారు నాలుగువేల మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా వుండే ఒక రంగస్ధలం ఇక్కడి ప్రధాన ఆర్షణ. అందువల్లనే ఈ నగరం.. నేటి ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. గ్రీకు, రోమన్‌ నాగరికత ఇక్కడి కపిలవర్ణ శిలల్లో మనకు దర్శనమిస్తుంది. ఎల్‌-డీయర్‌ మోనాస్టరీ (ఒక మఠం వంటి ప్రాంగణం) వద్ద హెలెనిస్టిక్‌ దేవాలయానికి అభిముఖంగా ఉన్న.. పెద్ద పెద్ద భవనాల్లాంటి ఎన్నో సమాధులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇవి మధ్య తూర్పు దేశాల సంస్కృతికితార్కాణాలుగా నిలుస్తున్నాయి.

అక్కడ జన సంచారం అంతగా కనిపించదు. ఉన్నట్టుండి వీచే వేడిగాలులు.. ఇసుక తుఫానులూ - వాతావరణాన్ని ఒక్కసారిగా కలగాపులగం చేస్తాయి. అంతటి వేడిమిలోనూ - ఒకింత చల్లదనంతో సేదతీర్చే పిల్లతెమ్మెరలు అప్పుడప్పుడూ పలకరిస్తుంటాయి. మనసుని పులకరింతల దొంతరల్లోకి నెట్టివేస్తాయి. అదే పెట్రా. జోర్దాన్‌లోని మధ్య తూర్పు ప్రాంతం. జాన్‌ విలియం బర్గన్‌ అనే కవి 1845లో పెట్రాపై ఓ అందమైన కవిత రాశాడు. ఒంటరితనం - అందం - సౌకుమార్యం కలగలిసిన అందమైన నగరం అంటూ. ఆ తర్వాత న్యూడైజెట్‌ అవార్డుని అందుకోవటం.. ఆ కవిత దేశ విదేశీ సరిహద్దుల్ని దాటి అశేష పాఠకుల మదిని దోచుకోవటం - ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోయిన సంగతులు. అప్పట్నుంచీ పెట్రా పర్యాటకుల మనసుల్ని కొల్లగొట్టే అంశంతో వార్తల్లో చోటు చేసుకుంటూనే ఉంది. ఇక్కడికి జోర్దాన్‌ నుంచీ అతి తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు. ముస్లిం సంస్కృతి అడుగడుగునా. ఇక్కడి వారికి ఆచార వ్యవహారాలన్నా.. సంస్కృతీ సంప్రదాయాలన్నా ప్రాణం. కాబట్టి - విదేశీ పర్యాటకులు కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అరకొర దుస్తులతో దర్శనమివ్వటం వీరికి నచ్చదు. జోర్దాన్‌లోని వాడిమూసా గ్రామానికి అతి సమీపంలోని పెట్రాకి వెళ్లాలంటే - అమ్మన్‌ ఎడారి ప్రాంతం నుంచీ జాతీయ రహదారిపై ప్రయాణించాలి.

కపిలవర్ణ శిలల్లో కమనీయ చరిత్ర...
Petra1ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటైన నగరం జోర్డాన్‌లోని పెట్రా. ఇదే కాదు.. మరో చారిత్రక నగరం జెరిష్‌ కూడా ఎన్నో చారిత్ర విశేషాలను తనలో దాచుకుంది. దాదాపు రెండు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పెట్రా ఒకప్పటి వ్యాపార కేంద్రం. మౌంట్‌ హోర్‌ అనే పర్వతాన్ని తొలిచి ఈ నగరాన్ని నిర్మించారట. పెట్రా అన్న పదం గ్రీకు పదం పెట్రియా నుంచి వచ్చింది. అంటే రాయి అని అర్థం. ్రపూ.6వ శతాబ్దంలో నబాటియన్ల రాజధానిగా వెలుగొంది గ్రీకు చరిత్రకి ఎన్నెన్నో అద్భుత కళకృతులను అందించింది. ఇప్పటికీ శాస్తవ్రేత్తల మదిని తొలిచే సంగతుల నెన్నింటినో ఈ నగరం వెలికి తెస్తూనే ఉంది. 1812 వరకూ పెట్రా ఆనవాళ్లు ప్రపంచానికి తెలియదు. స్విస్‌ చారిత్రిక పరిశోధకుడు జోహన్‌ లడ్విగ్‌ బర్కంత్‌ ఈ పెట్రా చరిత్ర పుటల్ని తెరిచిన మొట్టమొదటి వ్యక్తి. ఈ నగరాన్ని రెడ్‌-రోజ్‌ సిటీగా అభివర్ణించాడు జాన్‌ విలియం అనే కవి.

Petra_Roman_Gateయునెస్కో చారిత్రక నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కోటను.. ఇక బీబీసీ మరికాస్త ముందుకు వెళ్లి... మరణించేలోపు మీరు చూడాలనుకుంటున్న అరుదైన పర్యాటకకేంద్రాల్లో పెట్రా ఒకటని తేల్చేసింది. అందుకే ఈ అందమైన నగరం ఆధునిక ప్రపంచవింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. పెట్రా చారిత్రక కట్టడమే కాదు.. సువిశాలంగా విస్తరించిన పర్షియల్‌ గల్ఫ్‌ ప్రాంతానికి చేరుకోవటానికి చక్కటి మార్గం కూడా. దక్షిణాన.. గాజా, ఉత్తరాన.. బోస్రా, డమాస్కస్‌, అకాబా, లూరుూస్‌ ప్రాంతాల వారితో నబాటియన్లు వ్యాపార వ్యవహారాలు నడిపేవారట. చుట్టూ ఎడారి ప్రాంతం.. కొండలూ గుట్టల మధ్య ఎలాంటి నీటి వసతి లేకున్నా.. చక్కటి ప్రణాళికతో నబాటియన్లు నిర్మించిన ఈ కోట చరిత్రకు పునాదులు వేసింది. ఉన్నపళంగా వరదలు ముంచెత్తినా.. ఏళ్ళ తరబడి వర్షాలు కురవకపోయినా.. నబాటియన్ల ఆలోచనల ముందు ప్రకృతి సైతం తలవంచాల్సి వచ్చింది. ఉవ్వెత్తున ముంచుకొచ్చే వరదలు ఓ వైపు నుంచీ కోటని దాటి మరోవైపు వెళ్లిపోయేందుకు.. కోట లోపల సమృద్ధిగా నీటి వనరులు నిల్వ ఉండేందుకు వారు కల్పించిన మార్గాలు ఇన్నీ అన్నీ కావు. పెట్రా కోటని ఒక్కరోజులో చూడాలంటే కుదిరే పనికాదు. ప్రతి అడుగునూ స్పృశించటం.. మనసు తెరల్లో చరిత్రని నిక్షిప్తం చేసుకోవటం.. ఆనాటి శిల్ప చాతుర్యానికి అచ్చెరువొందటం.. ఒక్కరోజులో ఎలా సాధ్యం. పెట్రా కోట అంతరంతరాల్లోకి వెళ్ళి తరచి చూడటం ఒక్కటే మార్గం.

జెరిష్‌ కూడా...
పెట్రా లాంటిదే మరో నగరం జెరిష్‌. శతాబ్దాల చరిత్రకలిగిన ఈ నగరం.. ఎందరో కళాకారుల శ్రమ ఫలితం. సుమారు ఆరు వేళ ఏళ్ళ క్రితమే ఇక్కడ మానవుడు నాగరికుడిగా జీవించాడు. దానికి తార్కాణాలుగా ఎన్నో అద్భుత కట్టడాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. విశాలమైన వ్యాపార కేంద్రం (ప్లాజా), కొలానాడెడ్‌ వాక్‌వే, కాథడ్రల్‌ థియేటర్‌ లాంటి ఎన్నో విశిష్ట కట్టడాలు. ప్రతి పర్యాటకుడి మదిని పులకింపజేస్తాయి.

వాడి రామ్‌ ఎడారి, మృత సముద్ర అందాలు...
Jerashఈ ఎడారిలో సూర్యస్తమయ దర్శనం.. వర్ణించరాని అనుభూతి. కపిలవర్ణ ఇసుకతిన్నెల మాటున.. సన్నని సూర్యకాంతితో మెరిసే రాళ్ళతో ఇక్కడ సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక మృత సముద్రం (డెడ్‌ సీ) గురించి చెప్పాలంటే.. ఈ సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు. సాధారణ సముద్ర జలాలకంటే.. ఈ మృత సముద్రంలోని నీరు పదిరెట్టు ఉప్పుగా ఉంటుంది. మీకు పూర్తిగా ఈదడం రాకపోయినా.. ఈ డెడ్‌ సీలో ఈదడం అత్యంత సులభం. సూర్యాస్తమయం సమయాన.. ఈ చల్లని సముద్ర జలాల్లో ఈదడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.

నోరూరించే.. జోర్డాన్‌ శాఖాహారం..
పెట్రా ట్రిప్‌లో మిమ్మల్ని ఎంతోగానో ఆకర్షించేది.. ఇక్కడి శాఖాహార భోజనం. జోర్డాన్‌లో ఎక్కువ శాఖాహారాన్ని ఇష్టపడతారు. స్థానికంగా దొరికే రకరకాల దుంపలు, ఎగ్‌ప్లాంట్స్‌, బ్రెడ్‌ ఉపయోగించి చేసే వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా గ్రీన్‌ సలాడ్‌ లాంటి భోజనానంతర పానీయాలు కూడా నోరూరిస్తాయి. ఉడకబెట్టిన కూరగాయలతో చేసే వంటకాలే ఇక్కడ మనకు ఎక్కువగా దర్శనమిస్తాయి. మదబా ప్రాంతంలోని హారెట్‌ జె.డౌడ్నా, పెట్రాలోని పెట్రా కిచెన్‌ లాంటి హోటళ్లు ఇలాంటి వంటకాలకు ఎంతో ప్రసిద్ధి.

భిన్న సంస్కృతులకు ఆలవాలం...
జోర్డాన్‌లో సర్వమత సమ్మేళనం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ క్రిస్టియన్‌, ఇస్లాం మతం వెల్లివిరుస్తోంది. ఇక్కడ ‘బెథానీ బెయాండ్‌ జోర్డాన్‌’లో ఉన్న బాప్టిస్ట్‌ చర్చికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఇక్కడ ఏసుక్రీస్తు.. ‘జ్ఞాన స్నానం’ (బాప్టైజ్‌డ్‌) చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడికి సమీపంలో ఉన్న మౌంట్‌ నెబో ను మోజెస్‌ విడిదిచేసిన చివరి మజిలీగా చెబుతారు. ఇలాంటి ఎన్నో చారిత్రక విశేషాలను తనలో నిక్షిప్తం చేసుకున్న జోర్డాన్‌ను జీవితంలో ఒక్కసారైనా దర్శిచాలి.. అనడం అతిశయోక్తి కాదేమో..

హిమాలయ ముఖద్వారం.... కార్గిల్

gompa-shergol కార్గిల్‌.. ఈ పేరు చెబితే.. యుద్ధ వాతావరణం కళ్ళముందు కదలాడుతుంది. హిమాలయ పర్వతాల నడుమ.. పాకిస్తాన్‌ వాస్తవాధీన రేఖకు అతిచేరువలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే.. ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. అక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందోనని ఒకింత భయంతో వెనకడుగు వేస్తారెవరైనా.. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో పార్శ్వాన్ని స్పృశిస్తే.. కార్గిల్‌ ప్రకృతి అందాల కన్నె పడుచు. హిమాలయాల ఒడిలో ఉన్న కార్గిల్‌ పూర్వం నుంచి వాణిజ్య వ్యాపారాలకు ఖ్యాతి గాంచింది. శ్రీనగర్‌కి పశ్చిమాన 204 కిలోమీటర్ల దూరంలో, సముద్రపు ఒడ్డునుంచి 2704 మీటర్ల ఎత్తులో ఈ నగరం ఉంది. కాశ్మీర్‌-చైనా వ్యాపార సంబంధాలకు ఈ నగరం పునాది. 1949లో కేంద్రీయ ఆసియా వ్యాపారం సమాప్తం అయిన తరువాత కూడా ఇక్కడి పాతబజారులో ఆసియా, టిబెట్‌ వస్తువులకి అధిక డిమాండ్‌ ఉంది. హిమాలయ పర్వతశ్రేణుల మధ్య కార్గిల్‌ ఉండటంతో పర్యాటకులకు ఆసక్తికరమైన యాత్రాస్థలంగా ఉంది. ఇక్కడ బార్లీ, గోధుమలు, వివిధరకాల కూరగాయలను పండిస్తారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు...
Kargil1ఇక్కడ ట్రైనింగ్‌, క్యాంపింగ్‌, నౌకాయానంతో పాటు పర్వతారోహణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఒకరోజు ప్రయాణం తరువాత సురూఘాట్‌ చేరుకుని హిమాలయ పర్వతాలను చూడవచ్చు. కార్గిల్‌ నుంచి గోమా కార్గిల్‌ మధ్య రెండు కిలోమీటర్ల ప్రయాణంలో ఉత్కంఠభరితమైన దృశ్యాలు అబ్బురపరుస్తాయి. అంతేకాకుండా సరూ నదిపై ఉన్న పాత వంతెన మీదుగా ‘పోయెన్‌’ గ్రామాన్ని చేరుకోవచ్చు. దీని అవతలి వైపు వాఖా నది ఉంది. కార్గిల్‌ మార్కెట్‌లో పొగాకుతో పాటు హుక్కా కూడా దొరుకుతాయి. రోజువారీ వస్తువులతోపాటు పర్వతారోహణకు అవసరమైన వస్తువులను కూడా ఇక్కడ అమ్ముతారు. యాత్రికుల అవసరాలకు అనువైన వస్తువులన్నీ లభ్యమవుతాయి. ఈ మార్కెట్‌లో వస్తువుల కొనుగోలుకి మధ్యాహ్న వేళలో వెళితే సికిందర్‌ సైన్యంలో భాగమైన మినారోజ్‌ ప్రజాతివారిని కూడా చూడవచ్చు.

ఇక్కడ చూడాల్సినవివే...
మలబేక్‌ చంబా: ఈ ప్రాంతంలో 9 మీటర్ల ఎత్తున్న పెద్ద రాతి బండ ఉంది. దీనిని మైత్రేయ్‌ అని అంటారు. ఇది బౌద్ధ కళకు ఉత్కృష్టమైన తార్కాణం.

మల్‌బేక్‌ గోంపా: ఇది ఈ ప్రాంతంలో అతి పెద్ద రాతి బండ. ఇది ప్రాచీన కాలంలో యాత్రీకులకు దారి చూపేదట.

షెగాల్‌: వాఖా నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతపు ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఓ గుహ. మరొకవైపు నుంచీ చూస్తే ఇది ఓ చిన్న రంధ్రాన్ని పోలి వుంటుంది.
ఉరమ్యాన్‌ జాగ్‌: పెద్ద పెద్ద పర్వతాలతో ఉన్న ఈ ప్రదేశంలో పూర్వం బౌద్ధమతస్తులు ధ్యానం చేసుకునేవారు.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటక సంస్థ, శ్రీనగర్‌ నుంచి లేహ్‌ వరకు నిర్ణీత బస్సు లను నడుపుతోంది. అం తేకాకుండా శ్రీనగర్‌, లే్‌హ నుంచి కార్గిల్‌ వర కు టాక్సీలు కూడా ఉం టాయి. మల్‌బేక్‌ చేరు కోవడానికి టాక్సీ, జీప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Monday, May 2, 2011

కిన్నెరసాని సొగసు చూడతరమా..!

kinnerasani2 
‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ’ అని ఓ సినీకవి అభివర్ణించినట్టు.. ప్రకృతి కన్యలా.. పచ్చని చెట్లతో నిండిన అభయారణ్యంతో.. కిలకిలారావాలతో పక్షుల సందడితో.. రాష్ట్రంలోనే ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది కిన్నెరసాని. సెలయేళ్ల మధ్య పశుపక్ష్యాదులతో కనువిందు చేసే ప్రకృతి సోయాగాల అందాలతో... జీవావరణ ఉద్యానవనంగా ఖ్యాతి గడిం చిన ఆ పర్యాటక కేంద్రం కనువిందు చేసే ప్రకృతి సోయగాలు
- పిక్నిక్‌ స్పాట్‌గా కిన్నెరసాని

ఖమ్మం జిల్లా పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలోని యానంబైలు, కిన్నెరసాని గ్రామాల నడుమ 34 సంవత్సరాల క్రింత 1967లో అటవీ శాఖ అభయాణ్యంలో కిన్నెరసాని నదిపై రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ డ్యామ్‌ నిర్మాణించిన దగ్గరనుండి దగ్గర నుంచి పిక్నిక్‌ స్పాట్‌గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ర్ట‚ నుంచి సైతం పర్యటనకు వస్తుంటారు. పాల్వంచలో నెలకొల్పిన వివిధ పరిశ్రమలకు వ్యవసాయ రంగానికి నీటిని అందజేయాలనే సంకల్పంతో నిర్మించిన రిజర్వాయర్‌.. జెన్కోకు చెందిన కేటీపీఎస్‌, స్వాంజ్‌ ఐరన్‌ ఇండియా లిమిటేడ్‌, నవభారత్‌ కర్మాగారాలకు నీటిని అందిస్తోతంది.

kinnerasani 

అంతే కాకుండా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు సైతం నీటిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. ఈ నది నీటి ప్రవాహం మీద దిగువ భాగంలో దాదాపు 2 వేల ఎకరాల భూమిని సాగు చేస్తూ దీనిపై అధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు 350 ఎకరాల విస్తీర్ణంలో నీటితో నిండిన కిన్నెరసాని ప్రాజెక్టు పచ్చని చెట్లు, గుట్టలు, లోయల మధ్య కనువిందు చేస్తూ దర్శనమిస్తో్తంది. నదిపై నిర్మాణం చేసిన డ్యామ్‌కు 14 క్లస్టర్‌ గేట్లను ఏర్పాటు చేశారు.

సెలవుల్లో సందడి...
స్థానిక విద్యార్థినీ, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు సెలవు దొరికిందంటే చాలు కిన్నెసానిలో ప్రత్యక్షమవుతారు. దీనికి తోడు దూరప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో సెలవు దినాల్లో ఈ ప్రాంతమంతా పర్యాటకులతో నిండిపోతుంది. 1974 నవంబర్‌ 29న నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా సింగరేణి కాలరీస్‌ సంస్థ రెండు అంతస్తుల అద్దాల మేడ, జింకల పార్కు 10 క్యాటేజీలతో పాటు విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు.

kinnerasani8 

ఇక్కడి అభయ అరణ్యాన్ని పరిరక్షించి అంతరించిపోతున్న అరుదైన జంతు జాతులను రక్షించేందుకు వన్యమృగ సంరక్షణ విభాగాన్ని పాల్వంచ కేంద్రంగా నెలకొల్పారు. ఒక డివిజనల్‌ స్థాయి అధికారి ఇద్దరు రేంజ్‌ అధికారులతో మొత్తం 20 మందికి పైగా సిబ్బందితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి కాలరిస్‌ సంస్థ ఆధీనంలో ఉండే జింకల పార్కును వైల్డ్‌ లైఫ్‌ శాఖకు అప్పజెప్పడంతో వారే ఆలనాపాలనా చూస్తున్నారు. అదే విధంగా 6 సంవత్సరాల క్రితం వరకు కిన్నెర సాని ప్రాంతంలో అడవి సంరక్షణ బాధ్యతల ఫారెస్టు శాఖ అధీనంలో ఉండగా ఇటీవల ఫారెస్టు నుంచి వైల్డ్‌లైఫ్‌ యనంబైలు రేంజ్‌ పరిధిలోకి మార్పు చేశారు. మొదట ఇరిగేషన్‌ శాఖ అధీనంలో ఉన్న కిన్నెరసాని డ్యామ్‌ జెన్కోకు చెందిన కేటీపీఎస్‌ యాజమాన్యం చేతుల్లోకి వచ్చింది. ఈ అభయారణ్యంలో పులి, చిరుతపులి, ఎలుగు బంట్లు, దుప్పలు, అడవి పందులు, కుందేళ్ళు తదితర వన్యమృగాలు సంచరిస్తుండగా 300 రకాల పక్షులు జాతీయ పక్షి నెమళ్లు, ముసళ్ళు, వందల సంఖ్యలో ఉన్నాయి.

టేకు, ఉసిరి, మామిడి, జిట్రేగి, బండారి, సోమ, ఎగిస, వెదురు. మెర్రెడు, జాలేరు రాళ్ళ వాగు లాంటి జీవ వాగులు సైతం ఉన్నాయి. ఇలాంటి అకర్షణీయమైన అందాలతో కిన్నెరసాని ప్రాజెక్ట్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగరేణి కాలరీస్‌ సంస్ధ ఏర్పాటు చేసిన అద్దాల మేడ కాటేజీలు, జలదృశ్యం విశ్రాతి భవనం వంటి వసతి సదుపాయాలు ఉన్నాయి. అయితే.. వీటిని ఎక్కువగా.. సింగరేణి అధికారులు, అటు జెన్కో కేటీపీఎస్‌ అధికార్లు సిబ్బంది వీఐపీలు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారన్న అపవాదు కూడా లేదకపోలేదు.

అద్దాల మేడ...

Kinnerasani1

కిన్నెరసానికి ప్రత్యేక ఆకర్షణ.. అద్దాల మేడ. 34 సంవత్సరాల క్రింతం సింగరేణి సంస్థ నిర్మించిన అద్దాల మేడ పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే కొన్నేళ్ళ క్రితం పీపుల్స్‌వార్‌ ఈ అద్దాల మేడను బాంబులతో ధ్వంసం చేయడంతో దీని ఆకర్షణీయతకు కొంత విఘాతం ఏర్పడింది. ధ్వంసమైన అద్దాల మేడను పునురుద్ధరిస్తే.. పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కాటేజీలను శుభ్రపరిచి, మంచినీటి సౌకర్యం కల్పిస్తే అద్దాల మేడకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడికి విచ్చేస్తున్న పర్యాటకులు కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.

- చింతపల్లి వెంకట్‌ నర్సింహారెడ్డి, బుర్ర కోటేశ్వరరావు,
 కొత్తగూడెం, ఖమ్మం
కర్టసీ : సూర్య Daily

సింధియా రాజుల విడిది కేంద్రం.. శివపురి

George_Palace
మధ్య ప్రదేశ్‌లోని శివపురికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. మనదేశంలో పేరుగాంచిన రాజుల్ల సింధియా రాజులకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. అలాంటి ప్రముఖ సింధియా రాజులకు వేసవి విడిది కేంద్రంగా ఉపయోగపడిన ప్రాంతమే శివపురి. చుట్టూ పచ్చని అడవులతో ప్రకృతి వనరులతో చూడగానే ఆకట్టుకునే ప్రాంతం శివపురి. మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కాలంలో ఏనుగులను లొంగదీసుకున్న ప్రాంతం కూడా ఇదే కావడం విశేషం. ప్రభుత్వం ఇక్కడ పులుల సంరక్షణాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆనాటి సింధియా రాజుల పాలనకు గుర్తుగా ఇక్కడ ఎన్నో కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Madhav_Vilas_Palace

మాధవ్‌ విలాస్‌ ప్యాలెస్‌...
సింధియా వాస్తుకళను ప్రతిబింబించేలా నిర్మించిన భవంతి మాధవ్‌ విలాస్‌ ప్యాలెస్‌. భవంతి లోపల చలువరాళ్లు పరిచిన తీరు చాలా అందంగా ఉంటుంది. ప్యాలెస్‌కు సమీపంలోనే గణపతి మండపం కూడా ఉంది.


http://travel247.tv/india/wp-content/uploads/2010/05/Madhav-National-Park-Shivpuri.jpg

వన్యప్రాణుల విడిది... మాధవ్‌ నేషనల్‌ పార్క్‌...
శివపురిలో 156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వన్యప్రాణి కేంద్రం ‘మాధవ్‌ నేషనల్‌ పార్క్‌’. అడవి లోపల ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ అక్కడ సరస్సు ఒకటి ఉంది. వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఛింకారా జింకలు, నల్లదుప్పి, చిరుతపులి వంటి జంతువులు ఉన్నాయి. వీటితోపాటు అనేక ఇతర జంతుపులు ఉన్నాయి.

మాధవ్‌ రావ్‌ సింధియా స్మారక స్థూపం... 


http://www.indianholiday.com/images/tourist-attractions/madhya-pradesh/shivpuri.jpg
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
జార్జ్‌ కాజిల్‌...
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
  
జార్జ్‌ కాజిల్‌
 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం 
దర్శించుకోవచ్చు.
 http://www.indianholiday.com/images/new-images/mp/george-castle.jpg
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మాధవ్‌ రావ్‌ సింధియా స్మారకార్ధం నిర్మించిన కేంద్రం ఇది. తెల్లని చలువరాళ్లు ఈ భవంతికి కొత్త శోభను ఇచ్చాయి. సింధియా వంశస్థుల చిత్రపటాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు.
శివపురి దట్టమైన అడవుల లోపల ఏర్పాటుచేసిన భవంతి జార్జ్‌ కాజిల్‌. దీనిని జియాజీ సింధియా నిర్మించారు. అడవి లోపల గల సరస్సును పూర్తిగా తిలకించాలంటే ఈ భవనం ఎక్కాల్సిందే. సూర్యాస్తమం సమయంలో ఆకాశం ఎన్ని రంగులు మారుతుందో దానిని పర్యాటకులు ఈ సరస్సులో తిలకించవచ్చు.

సాఖ్య సాగర్‌ బోట్‌ క్లబ్‌...

మాధవ్‌ నేషనల్‌ పార్క్‌లో భాగం సాఖ్య సాగర్‌ బోట్‌ క్లబ్‌. ఈ సరస్సులో భిన్నరకాల పాములు ఉన్నాయి. అలాగే బురద మొసళ్లు, కొండచిలువ వంటివి ఇక్కడ ఉన్నాయి. దీనికి సమీపంలోనే సాఖ్య బోట్‌ క్లబ్‌ ఉంది.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: గ్వాలియర్‌ (112 కి.మీ.).. ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇక్కడి నుంచి ఢిల్లీ, భోపాల్‌లకు విమాన సర్వీసులున్నాయి.

రైలు మార్గం: ఝాన్సీ (101 కి.మీ.).. సమీపంలోని ప్రధాన రైల్వే జంక్షన్‌. శివపురిలో కూడా రైల్వే స్టేషన్‌ ఉంది. మక్సి - గ్వాలియర్‌ మార్గంలో శివపురి ఉంది. అయితే ఇక్కడికి పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు నడుస్తాయి. వారంలో ఐదు రోజుల పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలతో పాటుగా, ఇతర ప్యాసింజర్‌ సేవలు ప్రతిరోజూ ఉన్నాయి.

రహదారి మార్గం: గ్వాలియర్‌, భోపాల్‌, ఇండోర్‌, ఝాన్సీ. ఉజ్జయిన్‌ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

కర్టసీ : సూర్య Daily