విహారాలు

India

Gamyam

Tuesday, November 23, 2010

జోధ్‌పూర్‌ రాచరిక సౌధం... ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌

పర్యాటక రంగంలో... దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌. ఎడారి అందాలు, కోటలు, బురుజులు వంటి ఎన్నో అద్భుత కట్టడాలకు ఈ ఎర్ర నేల ఎంతో ప్రసిద్ధిగాంచింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలోనూ రాజస్థాన్‌ ముందువరుసలో నిలుస్తున్నది. అక్కడ కొలువైన అందాలు ఆ రాష్ట్రాన్ని పర్యాటక దిగ్గజంగా మలిచాయి. ఎన్నో రాచరిక వ్యవస్థలకు పుట్టినిల్లయిన రాజస్థాన్‌లో ఆ రాజుల కళాపోషణకు గుర్తుగా అనేక సౌధాలు, కోటలు వెలిశాయి. అలాంటి చారిత్రక కట్టడాల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న రాచరిక సౌధం ‘ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌’ విశేషాలు...

umaid-bhawan-palace 
ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌... వ్యక్తిగత నివాసాల్లో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరిందిన కట్టడాల్లో ఒకటి. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నగరంలో ఉంది. ప్రస్తుతం తాజ్‌ హోటల్స్‌ గ్రూప్‌ ఈ ప్యాలెస్‌ బాగోగులు చూస్తున్నది. మొత్తం 347 గదులున్న ఈ ప్యాలెస్‌ను జోధ్‌పూర్‌ మహారాజు... మహారాజా ఉమైద్‌ సింగ్‌ నిర్మించారు. రాజా ఉమైద్‌ సింగ్‌ అధికారం నివాసంగా ఉన్న ఈ అద్భుత ప్యాలెస్‌ కు ఆయన ముని మనవలు ప్రస్తుత యజమానులు. ఈ ప్యాలెస్‌ చిత్తర్‌ హిల్స్‌పై నిర్మించినందువల్ల ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ను దీని నిర్మాణ సమయంలో చిత్తర్‌ ప్యాలెస్‌ అని కూడా పిలిచేవారు. తరువాత రాజా ఉమైద్‌ సింగ్‌ పేరు మీద ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌గా నామకరణం చేశారు. చిత్తర్‌ హిల్‌, జోధ్‌పూర్‌లోనే అత్యంత ఎతె్తైన ప్రదేశం. నవంబర్‌ 18, 1929వ సంవత్సరంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టి 1943లో పూర్తిచేశారు.

నిర్మాణం...
ఐదు వేల మంది నిర్మాణ కార్మికులు 15 ఏళ్ళపాటు శ్రమకోర్చి నిర్మించిన ఈ అందమైన భవనం జోధ్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో ఉంది. నిర్మాణంలో కాంక్రీట్‌గాని, సిమెంట్‌ గాని ఉపయోగించకుండా కేవలం రాళ్ళతో నిర్మించడం ఉమైద్‌ ప్యాలెస్‌ ప్రత్యేకత. రాళ్లలోని పాజిటివ్‌, నెగెటివ్‌ ముక్కలను ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ... ఈ భవనాన్ని నిర్మించడం అప్పట్లోనే పరిణితి చెందిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాజప్రాసాద నిర్మాణానికి కావాల్సిన రాళ్ళను తరలించడానికి అప్పట్లోనే ఇక్కడకి ఒక రైలు మార్గాన్ని కూడా వేశారు. ఇక్కడ ఏ సీజన్‌లోనైనా 23 డిగ్రీల ఉష్ణోగ్రతకు హెచ్చుతగ్గులు లేకుండా ఉండడం శాస్తవ్రేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని విషయం. 26 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌ మూడున్నర ఎకరాలు భవన నిర్మాణానికి కేటాయించగా మిగిలిన ప్రాంతంలో గార్డెన్‌గా తీర్చిదిద్దారు.

india_jodhpur
దేశవిదేశాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు ఈ నిర్మాణానికి డిజైన్లను అందించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్‌ హెన్రీ లాంచెస్టర్‌, భారతీయ ఇంజనీర్‌ బుద్ధమాల్‌ రాయ్‌ ఈ భవన నిర్మాణానికి నమూనాలందించారు. ఉమైద్‌ ప్యాలెస్‌ లోని మధ్య గుమ్మటం 105 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నిర్మాణంలోని టవర్స్‌ అన్నీ రాజ్‌పుత్‌ల నిర్మాణశైలిని కళ్ళముందుంచుతాయి. హీరానంద్‌ యు. బాటియా రెసిడెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసిన ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి అప్పట్లోనే అక్షరాల 94 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందట. భవనం ఇంటీరియర్‌ డిజైన్‌ను ‘మాపుల్స్‌ ఆఫ్‌ లండన్‌’ వారు చేపట్టగా... వారు వస్తున్న ఓడను జర్మన్లు సముద్రంలో ముంచారు.

దాంతో మహారాజా ఉమైద్‌ సింగ్‌ ఆ పనిని పోలెండ్‌కు చెందిన మరో ప్రముఖ డిజైనర్‌ స్టీఫాన్‌ నార్‌బ్లిన్‌కు అప్పగించారు. లావిష్‌ ఇంటీరియర్‌ స్టైల్‌ను ప్రతిబింబించే విధంగా నిర్మించిన ఈ కట్టడంలో బంగారు, వెండి పూతతో ఎంతో అద్భుతంగా నిర్మించారు. స్వయానా చిత్రకారుడు కూడా అయిన స్టీఫాన్‌ నార్‌బ్లిన్‌ చిత్రించిన చిత్రాలు భవన ఇంటీరియర్‌కు మరింత ఆకర్షణను చేకూర్చాయి. చిత్తర్‌ ప్యాలెస్‌, తన పూర్వీకుల జ్ఙాపకార్థం నిర్మించారు. అంతేకాకుండా, ఓటమి ఎరుగని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న రావు జోధా నిర్మించిన మెహరంగధ్‌ కోట కూడా తన పూర్వీకుల జ్ఙాపకార్థమే నిర్మించారు.

మెహ్రంగద్‌ కోట...
Palace_Gardens
మెహ్రంగద్‌ కోట రాథోఢ్‌ వంశ పరిపాలను గుర్తు. అయితే ఈ కోటపైన కట్టడాలను రావు జోధా చాలాసార్లు మార్పులు చేశారు. ఆయన చేసిన మార్పుల్లో చాలావరకు మొఘల్‌ సామ్రాజ్య నిర్మాణ శైలికి అద్దం పడు తుండగా... మరోవైపు అద్భుతంగా మలిచిన ఆర్చీలు, గుమ్మటాలు, బొటానికల్‌ పెయింటింగ్స్‌, వాటర్‌ కోర్సులు అన్నీ రాజా ఉమైద్‌ సింగ్‌ చిత్త ర్‌ ప్యాలెస్‌ రాజ్‌పుత్‌ నిర్మాణ శైలిని అడుగడుగా ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర కూటుల రాచరికానికి ప్రతీక ఈ ప్యాలెస్‌. పురాతన హిందూ నిర్మాణశైలికి అద్దం పట్టే అద్భుత రాతికట్టడమైన కైలాష్‌నాథ్‌ దేవాలయం వీరి కళాభిరుచికి నిదర్శనాలు.

ఉమైద్‌ భవన్‌ ఇప్పుడో స్టార్‌ హోటల్‌...
ప్రస్తుతం తాజ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోనే అతిపెద్ద స్టార్‌ హోట ల్‌గా ఉన్న ఈ ప్యాలెస్‌లో కొంత భాగాన్ని ఇప్పటికీ మహారాజా ఉమైద్‌ సిం గ్‌ వారసులు వారి నివాసానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలె స్‌కు మహారాజా గజ్‌సింగ్‌-2 వారసుడుగా చలామణి అవుతున్నారు. 1972లో ఈ ప్యాలెస్‌ హోటల్‌గా రూపాంతరం చెందింది. 1978లో ఈ హోటల్‌ నిర్వహణ బాధ్యతలను... భారత్‌లోనే అతిపెద్ద హోటల్‌ గ్రూప్‌ అయిన ఐటీసీ వారికి అప్పగించారు. ఈ హోటల్‌కు వచ్చే పర్యాటకులు మునుపెన్నడూ ఎరుగని అత్యాధునిక వసతి సౌకర్యాలను అనుభవిస్తారు.

రాజమహల్‌లో ఉన్న అనుభూతిని పొందుతారు. హోటల్‌లో ఎక్కడ చూసినా అత్యంత ఖరీదైన ఫర్నిచర్‌ మన కు దర్శనమిస్తుంది. నేటి పర్యాటక అవసరాలకు అనుగుణంగా యాత్రి కులకు అన్నిరకాల సౌకర్యాలు అందించడం ఈ హోటల్‌ ప్రత్యేకత. ఈ హోటలను సందర్శించే పర్యాటకులను... హోటల్‌ మధ్యనున్న 110 అడు గుల ఎతె్తైన గుమ్మటం విశేషంగా ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే... ఈ హోటల్‌కు ఇదే ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ హోటల్‌లో అన్ని రకాల ఆహారప దార్థాలను వండి వార్చడానికి ఎన్నో రెస్టారెంట్లు కొలువుదీరి ఉన్నాయి. ది ట్రోఫీ బార్‌, రిసాలా రెస్టారెంట్‌, ది మర్వర్‌ హాల్‌, ది పిల్లర్స్‌ రెస్టారెంట్‌, కెబాబ్‌ కార్నర్‌ వంటి ఎన్నో ఫుడ్‌ పాయింట్స్‌ మీకు దర్శనమిస్తాయి. విదేశీ యాత్రికులకు కావలసిన వంటకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.

UmaidBhawan
ఈ హోటల్‌ గుమ్మటాల మధ్య నుండి సూర్యాస్తమయాన్ని చూడడం ఒక మరుపురాని అనుభూతి. ఆ అనుభూతిని అనుభవించాలనేగాని మాటల్లో వర్ణించలేము. అంతేకాకుండా ప్యాలెస్‌ ముందు పచ్చగా పరుచుకున్న లాన్లు ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే కాకుండా హోటల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బిల్డింగ్‌ మధ్యలో ఉండే స్విమ్మింగ్‌ పూల్‌ హోటల్‌కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నదని చెప్పవచ్చు. అంతేకాకుండా హోటల్‌ను ఆనుకొని ఒక ప్రైవేట్‌ మ్యూజియం కూడా ఉన్నది. ఈ మ్యూజియంలో దేశవిదేశాలకు సంబంధించిన ఫర్నిచర్‌, గడియారాలు, బొమ్మలు వంటి రకరకాల వస్తువులు కొలువుదీరి ఉంటాయి. ఇందులో జోధ్‌పూర్‌ మహారాజు వారి పరిపాలన కాలంలో సేకరించిన వివిధ రకాలైన, విలువైన వస్తువుల కూడా ఉంటాయి. విహారం లేదా వ్యాపారం నిమిత్తం జోధ్‌పూర్‌కు వచ్చే పర్యాటకులు ముందుగా ఈ ప్యాలెస్‌ హోటల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

గత కొన్నేళ్ళుగా ఈ ప్యాలెస్‌ దేశీయ పర్యాకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బిజినెస్‌ కాన్ఫరెన్సులకు ఈ హోటల్‌ ప్రముఖ విడిదిగా మారిందని చెప్పవచ్చు. ఇందులో బిజినెస్‌ మీటింగ్‌ కావలసిన విశాలమైన మీటింగ్‌ ఏరియా ఉంది. అంతేకాకుండా మీటింగ్‌ కావలసిన ఫర్నిచర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. జోధ్‌పూర్‌ సందర్శించే పర్యాటకులు ఈ హోటల్‌ సందర్శించకుండా వెనుదిరిగారంటే... వారు పూర్తి విహారానుభూతిని ఆస్వాదించలేదనే అర్థం. ప్రపంచంలోనే ఫస్ట్‌ క్లాస్‌ హోటల్‌గా రేటింగ్‌ పొందిన ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌కు గత కొంతకాలంగా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

No comments:

Post a Comment