విహారాలు

India

Gamyam

Sunday, January 22, 2012

అమెరికా పాపికొండులు

 







మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారో లేదో కాని.. ఒక ప్రదేశాన్ని పోలిన మరొక ప్రదేశం ఏదో ఒక దేశంలో తప్పకుండా ఉంటుందేమో అనిపిస్తుంది ఇది చదివితే. గోదావరి దగ్గర పాపికొండలున్నట్లే.. అమెరికాలోని సియాటిల్‌కు దగ్గర్లో 'లేక్ చలాన్' ఉంది. ఆ అద్భుతమైన పర్యాటక ప్రదేశం గురించే ఈ ట్రావెలోకం..
అమెరికాలో మా అబ్బాయి ఉంటే అక్కడికెళ్లాం. "ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా! లేక్ చలాన్ చూసొద్దాం'' అన్నాడు మా వాడు. అంతే టూర్ ఖరారైంది. అమెరికాలో ప్రసిద్ధి చెందిన లేక్‌లలో ఇదొకటి. సియాటల్ నుండి సుమారు 350 మైళ్ల దూరంలో ఉంది ఈ లేక్. లేక్ చలాన్ అంటే లోతైన ప్రదేశం అని స్థానిక భాషల్లో అర్థం ఉంది. తెల్లవారుజామున నాలుగింటికే ప్రయాణం మొదలుపెట్టి ఏడున్నర గంటకల్లా లేక్ చలాన్ చేరుకున్నాం. ప్రయాణం మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. ఇంకొక అరగంటలో లేక్ మీద బోట్ ప్రయాణం మొదలవ్వబోతుండగా మెల్లగా ఒక్కొక్కరే కార్ల నుంచి దిగడం మొదలుపెట్టారు. చూస్తుండగానే సుమారు 150 మంది పర్యాటకులు జత కలిశారు. మేము ఇంటి దగ్గరే ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వు చేసుకున్నాం. నేను, నా భార్య, మనవడు, కొడుకుతో సహా బోటు ఎక్కాం. సువిశాలమైన నదీ జలాలలో హంసలా మందగమనంతో బయలుదేరిన బోటు నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంది. ఇరువైపులా పాల నురగలా నీళ్లను వెదజల్లుతున్న సరస్సులో ఆకాశాన్నంటే పర్వత శిఖరాల మధ్య మా ప్రయాణం సాగింది. చల్లటి ఆ వాతావరణం మనస్సుకి ఎంతో హాయిగా అనిపించింది.

ముచ్చటైన మూడు లేక్‌లు

అమెరికాలో అత్యంత లోతున్న మూడు లేక్‌లలో ఒకటి- ఆరెగాన్ స్టేట్‌లోని 'క్రేటర్ లేక్'. ఇది 1932 అడుగుల లోతుతో 5 మైళ్ల వెడల్పుతో ఉంటుంది. రెండవది కాలిఫోర్నియాలోని నెవెడా బార్డర్‌లో ఉన్న 'తాహె' లేక్. ఇది 1645 అడుగుల లోతుతో పదిమైళ్ల వెడల్పుతో ఉంటుంది. మూడవది మేము ప్రయాణిస్తున్న లేక్ చలాన్. దీని లోతు 1486 అడుగులు, పొడవు 5 మైళ్లు. వెడల్పు మాత్రం ఒక్క మైలే. ఈ లేక్‌కు దిగువన వాస్టోబేసిన్, ల్యూసర్న్ బేసిన్ అని రెండు బేసిన్లను నిర్మించారు. వీటిలో ఒకటి సముద్రమట్టానికి నాలుగు వందలు, మరొకటి ఆరువందల అడుగుల దిగువన ఉన్నాయి. ఈ లేక్‌ను 'లేడీ ఆఫ్ ద లేక్' అని కూడా పిలుస్తారు. ఆ చిత్రమైన పేరు ఎలా వచ్చిందో తెలుసా..? దీన్ని మొట్టమొదటిసారి ఓ మహిళ చూసింది కాబట్టి..ట. బోట్ లోపల కూర్చోవడానికి అనుకూలమైన మంచి కుషన్ చైర్‌లు ఉన్నాయి.

బయటి దృశ్యాలను చూసి ఆనందించడానికి గాజు కిటికీలను అమర్చారు. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో సేవించడానికి టీ, కాఫీ, బిస్కట్‌లు అమ్మే చిన్న కొట్టును పెట్టారు. అక్కడే చక్కటి బాత్‌రూం ఏర్పాటు చేశారు. బోట్‌లో కూర్చున్న రెండొందల మందిలో ఒకరిద్దరు భారతీయులు తప్పిస్తే మిగతా అందరూ అమెరికన్లే ఉన్నారు. పరిచయమున్నా లేకపోయినా అందరికీ విష్ చేస్తూ, చిరునవ్వులతో వాళ్లంతా లోపలికి వచ్చారు. బోట్‌లోనే బయట కూర్చుని చూసేందుకు వీలుండే పైకప్పులేని స్థలం కూడా ఉంది. కొందరు అక్కడే ఉత్సాహంగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వెనక్కి వెళుతున్న ప్రవాహాన్ని చూస్తూ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారంతా. మేము కూడా అలాగే చూద్దామని బోటుపైకి చేరుకున్నాం. కాని బోటు ప్రవాహ వేగానికి వస్తున్న ఈదురు గాలికి తట్టుకోలేకపోయాం.

చూడముచ్చటైన చెట్లు, ఎత్తయిన పర్వత శిఖరాలను దాటుతుంటే ఎంతో అద్భుతమనిపించింది. ఆ శిఖరాలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే దాదాపు 8,245 అడుగులు. వందల మైళ్ల విస్తీర్ణంలో అడవి ఉండడంతో ఎటు చూసినా దట్టంగా చెట్లే. మధ్య మధ్యలో ఆ కొండల మీద నుండి కిందకు దూకుతున్న సెలయేర్లు, పూర్తిగా కరగని తెల్లటి మంచు ముద్దలు కనువిందు చేశాయి. బోట్‌లో వెళుతున్నప్పుడు లేక్ ఒడ్డున చిన్న చిన్న పల్లెలు సైతం కనిపించాయి. ఆ పల్లెవాసులు బోట్లలో తిరుగుతూ చేపల్ని పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల మైళ్ల కొద్దీ చెట్లు కాలిపోయి ఉన్నాయి. దావాగ్ని ఫలితమట. అమెరికాలోని అడవుల్లో ఒక చోట నిప్పు రాజుకుంటే.. మైళ్లకు మైళ్లు వ్యాపిస్తుంది. 1929లో లాగే నిప్పు రాజుకుని 'మేథ్యూ' రివర్ వరకు అడవిని నాశనం చేసిందని స్థానికులు చెప్పారు. ఆ అగ్ని 62 రోజుల వరకు మండూతూనే ఉందట. మంటల్ని అర్పే ప్రయత్నంలో ఇద్దరు అగ్నిమాపక దళ సిబ్బంది కూడా చనిపోయారని తెలిసింది. ఈ అడవులకు అగ్ని ప్రమాదాలొక్కటే కాదు, అప్పుడప్పుడు వరదల ముప్పు కూడా వస్తుంటుంది. ఆ ఛాయలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొదట్లో స్థానిక అమెరికన్లు (రెడ్ ఇండియన్లు) డేరాలు వేసుకుని వింటర్ విలేజ్‌గా ఉంటున్న ఈ ప్రాంతంలో ఆ తర్వాత బ్రిటిష్ వారు స్థిరపడేందుకు ప్రయత్నించారట. దీంతో ఇద్దరి మధ్యా వైరం వచ్చి కొన్నాళ్ల తర్వాత సమసిపోయిందట. ఇరువర్గాలు ప్రశాంతంగా గడిపే ప్రయత్నంలో భాగంగా.. ఆర్మీ క్యాంపులు ఏర్పాటు అయ్యాయి. అలా ఏర్పడిందే 'లేక్ చలాన్ టౌన్‌షిప్'. ఇక్కడ అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. మేము సుమారు 12.30 గంటలకు 'స్టీహికెన్' ప్రాంతానికి చేరుకున్నాం. అదే మా ప్రయాణపు చివరి మజిలీ. అక్కడ ఎన్నో విశేష ప్రదేశాలున్నాయి. రెండు మూడు రోజులు గడపడానికి వచ్చిన వాళ్లంతా దిగి హోటల్స్‌కి వెళ్లారు. మాలాగా తిరుగు ప్రయాణం చేసే వాళ్లు మాత్రం మూడునాలుగు కిలోమీటర్ల దూరంలోని 'రైన్‌బో ఫాల్స్' చూసేందుకు రెడీగా ఉన్న బస్సు ఎక్కాం.

మాతోపాటే ఒక గైడు కూడా బస్సెక్కి ప్రయాణిస్తున్నంత సేపూ హాస్యోక్తులతో అందరినీ ఉత్సాహపరిచాడు. మేము వెళుతున్న బస్సును ఓ అరవై అయిదేళ్ల ముసలావిడ నడపడం మరో విశేషం. 312 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న 'రైన్‌బో ఫాల్స్'ను చూడటం ఒక మధురానుభవం. అద్భుతమైన ఆ జలపాతం కింద నిలబడి ఆ దృశ్యాన్ని ఎంతోసేపు చూశాం. ఇక్కడికి రావడానికి బస్సే కాదు, అద్దె సైకిళ్లు కూడా దొరుకుతున్నాయి. హిల్ వ్యూ తిలకించేందుకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉండటం విశేషం.

ఈ హార్బరులో శీతాకాల జింకల పార్క్, ఆ జింకల కోసం గడ్డిపెంచే స్థలాలు, అవి అగ్నికి ఆహుతి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంచు కాలంలో స్కేటింగ్ చేసే ప్రదేశాలు, గొర్రెల ఫామ్స్ లాంటివి ఎన్నో ఉన్నాయిక్కడ. తిరుగు ప్రయాణంలో పాతకాలం నాటి బ్రిటిష్ స్కూలును చూశాం.
తెల్లగా, పొట్టిగా ఉన్న గైడ్ చార్లీచాప్లిన్‌లా టోపీ పెట్టుకుని.. భలే చమత్కారంగా కనిపించాడు. మేమంతా అక్కడి నుంచి తిరిగి 1.30 గంటలకు బోట్ వద్దకు చేరుకుని, అందులోనే భోజనం చేశాం. ఇక్కడి ప్రకృతిరమణీయతను నెమరేసుకుంటున్నప్పుడు మాకందరికీ పాపికొండలే గుర్తొచ్చాయి. అందుకే ఈ ప్రాంతానికి మేమంతా కలిసి 'అమెరికా పాపికొండలు' అని ముద్దు పేరు పెట్టుకున్నాం. ఆ సంతోషంతోనే రాత్రికి ఇల్లు చేరుకున్నాం.


- డా. జింగరి నరహరి ఆచార్య
ఫోన్: 9866650184

No comments:

Post a Comment