విహారాలు

India

Gamyam

Wednesday, March 9, 2011

గోదారి ఒడ్డున ప్రకృతి పడుచు... పట్టీసీమ

అందమైన గోదారి నడుమ అహ్లాద కరమైన వాతావరణంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ప్రకృతి సౌందర్య కేంద్రం పట్టిసీమ. పట్టిసీమలో విడిది చేయకుండా... పాకింకొండలు-భద్రాచలం బోటు ప్రయాణం పరిపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి తిరునాళ్ళు తప్పకుండా దర్శించాల్సిన ఉత్తవాలు. ప్రకృతి అందాలతోనే కాక చారిత్రకంగా, ఆద్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న పట్టిసీమ పర్యాటక విశేషాలు...

Pattiseema_3స్థానికులు ‘పట్టిసం’ అని కూడా పిలుచుకునే విశిష్ట విహారకేంద్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ. కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం గోదావరి ఒడ్డున, ఇసుకతిన్నెల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతోంది.పాపికొండల మధ్య సాగే గోదావరి బోటు ప్రయాణంలో ఇది ప్రధాన విడిది కేంద్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యధికంగా చిత్రీకరణ జరిగిన మంచి అందమైన దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రశాంత వాతవరణంలో అతి సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రతియేటా ఐదురోజులపాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

సినిమా షూటింగ్‌కు ప్రసిద్ధిగాంచిన దేవాలయం...
పాపి కొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి.

ఆధ్యాత్మికతను నెలవు వీరభద్రస్వామి దేవస్థానం...
ఇక్కడ వెలిసిన వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం విశిష్ట స్థానం సంపాదించుకుంది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఒకప్పుడు దేవాలయము శిధిలమవడం వల్ల దేవాలయానికి పూర్తి మరమ్మత్తులు చేశారు. దేవాలయం చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు.

Pattiseemaఒకప్పుడు ఇక్కడ కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయములో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. భక్తులు విడిది చేసేందుకు ఇక్కడ గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు, భోజనశాలలు, గోదావరి పడవల రేవు, స్నానాలరేవులను రెండేళ్ళ క్రితం కొత్తగా ఏర్పాటు చేశారు. చుట్టూ గోదావరి, మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది.

ఆలయ చరిత్ర...
దక్షయాగంలో సతీదేవి అగ్నికి ఆహుతికాగా, రౌదమ్రూర్తియైన పరమశివుడు తన శిరస్సునుండి ఒక జటాజూటాన్ని పెరికి నేలకు వేసి కొట్టగా అందులోనుండి వీరభద్రుడు ఆవిర్భవించిచాడు. అప్పుడు... దక్షుని యాగాన్ని ధ్వంసం చేయమని శివుడు ఆనతీయగా వీరభద్రుడు ప్రమధగణాలతో హుటాహుటిన దక్షుని యాగ శాలకు వెళ్ళి యఙ్ఞకుండమును ధ్వంసముచేసి అడ్డువచ్చినవారిని సంహరిస్తూ దక్షుని శిరస్సు ఖండించాడు. ఆ రౌద్రమూర్తి దేవకూట పర్వతముపై ప్రళయ తాండవం చేస్తుండగా... అతని చేతిలోని ‘పట్టిసం’ అనే కత్తి జారి దేవకూట పర్వతముపై పడింది. వీరభద్రుని రౌద్ర తాండవాన్ని ఎవరూ ఆపలేక చివరకు అగస్త్యమహామునిని వేడుకున్నారు.

Pattiseema_2అప్పుడు అగస్త్యమహాముని వచ్చి వీరభద్రుని వెనకనుంచి ఆలింగనముచేసుకొని విడిపోయిన అతని జటాజూటాన్ని ముడివేసి అతన్ని శాంతింపచేశాడని పురాణ గాధ.అక్కడే రుద్ర సంభూతుడైన వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై వెలిశాడట. ఈ ఆలయంలో మూల విగ్రహముపై అగస్త్యుని చేతిగుర్తులు, శిరస్సుపై ముడిని మనం చూడవచ్చును. పట్టిసం జారిపడినది కనుక ఈక్షేత్రానికి పట్టిసాచల క్షేత్రమని పేరు వచ్చింది.కాలక్రమేణా అది పట్టిసం, పట్టిసీమగా మారింది.కొవ్వూరు నుండి గోదావరి గట్టున 26వ కిలోమీటరు వద్ద ఉన్న ఈ ేత్రానికి... గోదావరి నదిలోనికి ఏటవాలుగ చక్కని రోడ్డు వుంది.అక్కడనుంచి పడవలలో నది దాటి నదిమధ్యలో గల పట్టిసం కొండకు చేరవచ్చు. వర్షాకాలం మినహాయించి నదీ ప్రవాహాన్ని బట్టి ఇక్కడ ఇసుక తిప్పలు ఏర్పడతాయి.

ఇలా చేరుకోవచ్చు...
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుండి పట్టిసీమ సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం ద్వారా వచ్చే దూరప్రాంత ప్రయాణీకులు రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం నుండి చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణీకులు రాజమండ్రి లేదా నిడదవోలు స్టేషన్ల ద్వారా ఇక్కడికి చేరవచ్చు. కొవ్వూరు కూడా దగ్గరి రైల్వే స్టేషన్‌ అయినప్పటికీ అక్కడ తగినన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఆగవు. 

కర్టసీ : సూర్య Daily

No comments:

Post a Comment