విహారాలు

India

Gamyam

Saturday, August 7, 2010

ఒక ఆంధ్రా ఫారెస్ట్ ఊటీ కంటే బాగుంటుంది

వానాకాలంలో శేషాచలం కొండలు మరింత అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి చూసి వచ్చాక మరోసారి వెళ్లకుండా ఉండలేనంత అందం వాటి సొంతం. ఈ ప్రాంతం తిరుపతికి దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి... అక్కడికి వెళ్లినప్పుడు 'పనిలో పనిగా'నైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. నిజానికి నేరుగా అక్కడికే టూర్ ప్లాన్ చేసుకునేంత సుందరమైన టూరిస్టు స్పాట్ శేషాచలం కొండలు.

పక్షుల పలకరింపులు, ఎత్తైన కొండలు, అబ్బురపరిచే జలపాతాలు... ఎటు చూసినా చిరుజల్లుకు ముసురుకుంటున్న పచ్చదనమే. కొండల మధ్య నడుస్తూ, సెలయేళ్లు దాటుకుంటూ చెట్లు, పొదలు తప్పించుకుంటూ అడుగు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో అందాలు కనిపిస్తాయక్కడ. ఈ కాలంలో పచ్చని గొడుగు పట్టుకుని ప్రకృతి ఒద్దికగా కూర్చున్నట్టు ఆ అడవుల్లో పచ్చదనమే కాదు ఎక్కడ చూసినా గుంటలన్నీ నీటితో నిండి జలకళ ఉట్టిపడుతుంటుంది.

అక్కడ మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మజెముడు పుష్పం ఎంత విశేషమో, రాతిబండలపై ఆదిమానవుడు గీశాడని భావించే పశువుల బొమ్మలు కూడా అంతే విశేషం. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ వాచర్స్ చూస్తూ ముందుకు పోతుంటే అక్కడక్కడ గిరిజనులు పశువుల కోసం వేసుకున్న పాకలు కనిపిస్తాయి. ఊటీని తలపించే లోయల్ని చూడటం, ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్ల మధ్య నుంచి నడవటం ఒక గొప్ప అనుభూతినిస్తుంది.

రైల్వేకోడూరు నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్తే... కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళగుట్టలు, మలిట్లకోన, పెద్ద కంజులు, చిన్న కంజులు, ముంతతువ్వ బండలు, జాలకోన, యానాది ఊట్ల, దొంగబండలు, ఊరగాయకుంట, కమ్మపెంట, కుందేలుపెంట, ఈతకాయ బండలు, కోటమారుకుంట, ఏనుగలబావి, స్వామి వారి పాదాలు, (ఆ పాదాలు కొలిచే వీలులేని ఎత్తులో అద్భుతంగా ఉంటాయి) కోతులకుప్ప, నెప్పోడిసెల, కందిరేవులు, మట్లకోన, సలీంద్రకోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. గుండాలకోనలో గుంజన జలపాతం, గాదెల అటవీ ప్రాంతంలో జాలకోన చూడటం ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

క్షేత్రాలయాలు

విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వై.కోట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయ ఉత్సవాలకు కొందరు వాహనాల్లో వెళ్తే, కొందరు కాలి నడకన వెళ్తుంటారు. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.

గుండాలకోన సెలయేరు పైభాగాన పసుపుగుండం, గిన్నిగుండం, అక్కదేవతల గుండం... ఇలా ఏడు గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత. గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సలీంద్ర కోన కూడా పర్యాటకులను ఆకట్టుకునేదే.

గలగల శబ్దాలతో ఒక అందమైన జలపాతం. దాని పక్కనే ఒక గుహ. అడవి మధ్యలోనున్న ఆ గుహలో కొలువుదీరిన తుంబుర స్వామి. చూడముచ్చటగా కనిపించే ఆ ప్రదేశమే తుంబురకోన క్షేత్రం. ఇక్కడ కూడా మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు.

ఔషధ మొక్కలు


ఈ అడవుల్లో ప్రధానంగా నాలుగు రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. అవి పెర్రీత, పసలోడి గడ్డ(గ్లోరియోసోసుపర్భా), ఫేమ్ లిల్లీ పూలు, ఎర్రచందనం చెట్లు. పెర్రీత, పసలోడి చెట్లకు ఏర్పడే గడ్డల నుంచి రసాన్ని తీసి ఎరువులు, పురుగుమందుల తయారీలో ఉపయోగిస్తారు. విషపూరితమైన ఈ గడ్డల్ని మనుషులు తింటే చనిపోతారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి మంచి గిరాకీ ఉందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఒక కిలో ఐదు వేల నుండి పది వేల రూపాయల వరకు ఉంటుంది. పెర్రీత పండ్లకు కిలో రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ధర ఉంటుంది.

సన్నని తీగలా పెద్ద చెట్లకు అల్లుకుపోయి ఎరుపు, పసుపుపచ్చరంగులు కలగలిపిన ఫేమ్‌లిల్లీ (గ్లోరియోసోసుపర్భా) పువ్వులు ఎక్కడున్నా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటి వాసనకు పది నిమిషాల్లో శరీరం మత్తెక్కిపోతుంది. వీటినీ మందుల తయారీలోనే ఉపయోగిస్తారు. ధర కిలోకు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ పూలకు కిలో యాభై వేల రూపాయలు ధర ఉంటుందని చెప్తారు. ఇవి అటవీ అధికారుల రక్షణలోనే పెరుగుతున్నాయి. ఈ పూలు కూడా మనుషులకు ప్రమాదమే.

ఇక్కడ ఎర్రచందనం వృక్షాలు కూడా ఎక్కువే. వాటితో తయారు చేసిన బొమ్మలు, గృహోపకరణాలను ఇంట్లో పెట్టుకోవటం 'స్టేటస్ సింబల్'గా భావిస్తారనేది తెలిసిన విషయమే. అంతేకాదు ఔషధ గుణాలు కలిగిన ఎర్రచందనం చెట్లను మందుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. చైనా, జపాన్, సింగపూర్, మలేషియా లాంటి విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి.

జలపాతాలు

బాలపల్లె అడవుల్లో ఉన్న గుంజన నది జలపాతం నయగరా జలపాతాన్ని గుర్తుకు తెస్తుందంటే అతియోశక్తి కాదేమో! అంత అందంగా కనిపిస్తుందది. బండల మీదుగా సుమారు 500 అడుగుల లోతుకు ప్రవహించే జలధార అద్భుతం. ఈ జలపాతం గురించి చాలామందికి తెలియకపోవటం దురదృష్టం. ఇది దట్టమైన అటవీ ప్రాం తంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల రాకపోకలకు ఎంతో ఇబ్బంది. అంతేకాదు ప్రమాదం కూడా. రహదారి సౌకర్యం ఉంటే దీనికి ఎంతో గుర్తింపు వచ్చేది. చెంచమ్మకోనలోని జలపాతం, సెలయేళ్లు కూడా ఎంతో హాయిని కలిగించేవే.

కొండెలెక్కుతున్నా, జారిపడుతూ సెలయేళ్లు దాటుతున్నా, ఇరుకుదారుల్లో నుంచి నడవాల్సి వచ్చినా ఆ కష్టమేదీ అనిపించదు. ఆ అడవి అందాలు చేసే మాయ అది. ఒక్కసారి సందర్శిస్తే చాలు... 'మళ్లీ ఓ సారి వచ్చిపో' అన్నట్టు ఆ ఆహ్లాదపు జ్ఞాపకాలు మనసులో తిష్ట వేసుకుంటాయి. పూర్తిగా ఒక కొత్త లోకంలో ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో మంచి నేస్తాన్ని వదిలివస్తున్న గాఢమైన అనుభూతికి లోనవ్వాల్సిందే ఎవరైనా.

టూరిస్టు స్పాట్‌గా చేయండి

'అరుదైన ఔషధ, అటవీ వృక్షాలతో పాటు శేషాచల అడవుల్లో ఏనుగుల మందలు, పొడదుప్పిలు, కొండగొర్రెలు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, చిరుతపులుల సంఖ్య ఎక్కువే. సింహాలకైతే కొదువలేదు. అంతేకాదు దేవంగ పిల్లి, బెట్లూడుత, బంగారు బల్లి లాంటి అరుదైన జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. కరక్కాయ, బిక్కి, ఈతపళ్ళు, నేరేడు పండ్లు, ఉసిరి, తంగేడు, చీమ ఉసిరి లాంటి ఫలాలు ఎంత విరివిగా దొరుకుతాయో కొండ వేపాకు, మోగి, తంబజారి వంటి ఔషధాలు కూడా అంతే విపరీతంగా దొరుకుతాయని' బాలపల్లె ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఎం. క్రిష్ణయ్య చెప్పారు.

'ఈ కొండల్లో అద్భుతమైన లోయలు, పురాతన దేవాలయాలు, సుందరమైన జలపాతాలు, విష్ణుగుండం, బ్రహ్మగుండం...లాంటి గుండాలు చాలానే ఉన్నాయి. ఇన్ని ప్రకృతి అందాల నడుమ ఈ అడవిలో రేంజర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని' రైల్వేకోడూరు రేంజర్ రామ్లానాయక్ చెప్పారు.

'ఎన్నో విశేషాలు కలిగిన ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఊటీని మరపిస్తుంది. అడవుల్లో దారులు ఏర్పాటు చేసి వాహన సౌకర్యం కల్పిస్తే పర్యాటకులకు, అభివృద్ధికి అనువుగా ఉంటుంది. అటవీ సిబ్బందిని గైడ్‌గా ఉపయోగించుకుంటే సందర్శకులకు పర్యటన మరింత సులువు అవుతుంద'ని రైల్వేకోడూరువాసి తాతంశెట్టి తులసి అన్నారు.
వీరందరి ఆలోచన ఒక్కటే శేషాచలకొండల్ని అటవీ ప్రాంతంగా మాత్రమే కాకుండా పర్యాటక ప్రాంతంగా చూడాలనేది. అధికారులు చొరవ తీసుకుంటే అది సాధ్యమే. అదే జరిగితే చల్లదనం కోసం ప్రశాంతత కోసం టూర్‌కు వెళ్లాలని అనుకునేవారు ఫస్టు ప్రిఫరెన్స్ ఈ ఊటీకే ఇవ్వొచ్చు.

- సుగవాసి రాజశేఖర్, రైల్వేకోడూరు

No comments:

Post a Comment