విహారాలు

India

Gamyam

Sunday, August 1, 2010

టర్కీ - మూడు నగరాలు... ముప్పేట మర్యాదలు

మూడు నగరాలు... ముప్పేట మర్యాదలు

రెండు ఖండాలు... ఒక నగరం... దాని మధ్యలో బాస్పరస్ జలసంధి. రెండు సముద్రాలను కలిపే జలమార్గం. బైబిల్‌లోని నోవా కథకి పుట్టినిల్లు. అక్కడ పడవలో విహరిస్తుంటే ఓ టర్కీ మ్యూజిక్ ఛానల్‌వారు మా బృందంతో ఆవారా పాట పాడించుకున్నారు. హిందుస్థాన్ వాళ్లెవరు కనిపించినా అప్రయత్నంగా ఆవారా హూ... పాటను హమ్ చేస్తారు టర్కీవాసులు. ఆవారా తర్వాత హిందీ సినిమాలేమీ అక్కడకి వెళ్లినట్టు లేవు చూడబోతే.

In Dialogue సంస్థ ఆహ్వానంపై హైదరాబాద్ నుండి 13 మందిమి మే నెలలో టర్కీ వెళ్లాం. ఇది టర్కీ-ఇండియాల మధ్య ప్రజాసంబంధాల మెరుగుకు కృషి చేసే సంస్థ. ఆహ్వానితుల్లో అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్ర రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, చరిత్రకారుడు అయిన నరేంద్ర లూథర్, కొంతమంది యూనివర్శిటీ అధ్యాపకులు, సోషల్ వర్కర్లు ఉన్నారు. అధ్యాపకుల్లో నేనూ ఒకడిని. మే 24 ఉదయం హైదరాబాద్‌లో విమానమెక్కి సాయంత్రానికల్లా మా మొదటి మజిలీ ఇస్తాంబుల్ చేరుకున్నాం. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి మూడు గంటల ప్రయాణం. అక్కడి నుండి ఇస్తాంబుల్‌కి మరో నాలుగు గంటలు. ఈ యాత్రలో ఫ్లయిట్ టికెట్ మేమే పెట్టుకున్నాం. టర్కీలో ఉన్న ఏడు రోజుల ఖర్చులు మాత్రం ఇన్‌డయలాగ్ వాళ్లే పెట్టుకున్నారు. అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించారు. మొదటి మూడు రోజులు ఇస్తాంబుల్‌లోను, ఒకరోజు కొన్యాలోను గడిపి చివరి రెండు రోజులు అంకారా దర్శించాం.

పర్యాటక స్థలాలే కాకుండా చారిత్రాత్మక ప్రదేశాలు కూడా చూసేలా ఏర్పాట్లు చేశారు. స్కూల్ టీచర్లతోను, పిల్లలతోను మాట్లా డాం. పత్రికలు, టి.వి. ఆఫీసులు సందర్శించి జర్నలిస్టులతో చాలా విషయాలు చర్చించాం. అంతే కాదు, టర్కీ కుటుంబాలతో భోజనాలు, ఆ దేశ పార్లమెంట్ డిప్యుటీ స్పీకర్ ఇంట్లో విందు... వీటన్నిటితో ఎంతో ఆసక్తికరంగా సాగింది మా యాత్ర. ఇస్తాంబుల్ లోని 'రైటర్స్ అండ్ జర్నలిస్ట్స్ ఫౌండేషన్' ఏర్పాటు చేసిన సమావేశంలో నేను భారతదేశంలో మీడియా వ్యవస్థపై ప్రజెంటేషన్ కూడా చేశాను.

అతిప్రాచీన నగరం

ఇస్తాంబుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ నగరానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాని పూర్వ నామధేయం కాన్‌స్టాంటినోపుల్. రోమన్, బైజాంటైన్, ఒట్టోమన్ సామ్రాజ్యాలకి రాజధానిగా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత, అంటే క్రీ.శ. 1453 వ సంవత్సరంలో తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని ఆక్రమించుకొన్నప్పటి నుండి అది ఇస్తాంబుల్‌గా ప్రసిద్ధికెక్కింది.

ఇప్పటి ఇస్తాంబుల్ ఆధునిక నగరం. కోటి యాభైలక్షల జనాభాతో ప్రపంచంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా పేరొందింది. అంత పెద్ద నగరమంటే ఇరుకు రోడ్లు, వీధులు సాధారణమే అని మనకు అనిపించవచ్చు... కాని ఇస్తాంబుల్ ఎక్కడా ఇరుకుగా అనిపించదు. చక్కటి 8 లేన్, 6 లేన్ రోడ్లు, ఫ్లయ్ఓవర్లతో విశాలంగా ఉంటుంది. మెట్రో రైల్వే వ్యవస్థ, బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లతో నగరంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇంకో విషయం... ఇస్తాంబుల్ సిటీలో నీటి కోసం బోర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. నగరం చుట్టూ 15 డాములు కట్టి పైపుల ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేస్తున్నారు. హీటింగ్ సిస్టమ్‌కి, వంట చేసుకోడానికి ఆ నీళ్లే వాడతారు. నీళ్లే కాదు, ప్రతి ఇంటికి గ్యాస్ కూడా పైప్‌లైన్ ద్వారానే సప్లయ్ చేస్తున్నారు. ఒక్క ఇస్తాంబుల్ లోనే కాకుండా టర్కీలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ పైపుల ద్వారా గ్యాస్ సప్లయ్ చేస్తున్నారని విన్నపుడు మరి మనకు కెజి (కృష్ణా గోదావరి) బేసిన్ గ్యాస్ ఎప్పుడు వస్తుందో అనిపించింది.

చర్చి మసీదై ఇప్పుడు మ్యూజియమైంది

ఇస్తాంబుల్‌లో మేము సెమాన్యోలు టి.వి. ఆఫీస్, హజియా సోఫియా మ్యూజియం, బ్లూ మాస్క్ (బ్లూ మసీదు) బాస్పరస్ జలసం«ధి, గ్రాండ్ బజార్, టోప్ కపి సరాయిలను సందర్శించాం. వీటన్నిటిలో హజియా సోఫియాది గొప్ప చరిత్ర. ఇది క్రీ.శ. 360లో రోమన్లు నిర్మించిన చర్చి. అప్పటి నుండి వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా విలసిల్లింది. 1453లో సుల్తాన్ మహ్మద్-ఐఐ ఆధ్వర్యంలో తురుష్కులు కాన్స్‌టాంటినోపుల్‌ని ఆక్రమించుకుని ఇస్తాంబుల్‌గా పేరు మార్చారు. అప్పటి నుండి 1934 దాకా హజియా సోఫియా మసీదుగా ఉంది.

1922లో ముస్తాఫా కమల్ పాషా అధికారంలోకి వచ్చారు. వెంటనే సంస్కరణలు మొదలుపెట్టారు. టర్కీ భాషకు అరబిక్ స్క్రిప్ట్‌కి బదులు ఇంగ్లీషు స్క్రిప్ట్‌ని వాడడం ఆ సంస్కరణల్లో ఒకటి. సెక్యులర్ భావజాలం గల ఆయన ఆ సంస్కరణల్లో భాగంగానే 1934లో హజియా సోఫియాని మ్యూజియంగా మార్చాడు. అప్పటినుండి ఇప్పటివరకు అది మ్యూజియంగానే ఉంది. అలాగే మన దేశంలోనూ బాబ్రీ మసీదు-రామజన్మభూమిని మ్యూజియంగా, జాతి సంపదగా మార్చే ఆలోచన చేయొచ్చేమో.

రూమీ స్మృతులు, డెర్విష్ డాన్స్‌లు..

కొన్యా మా రెండవ మజిలీ. ఆ పేరు చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే కొన్యా అనగానే సుప్రసిద్ధ సూఫీ కవి మౌలానా జలాలుద్దీన్ రూమీ గుర్తొస్తాడు. అలాగే డెర్విష్‌లు చేసే సూఫీ నృత్యం గుర్తుకొస్తుంది. 'జోదా అక్బర్' సినిమాలో 'ఖ్వాజా మేరే ఖ్వాజా' పాటలో డెర్విష్‌ల నృత్యం ఎంత పాపులర్ అయిందో మనకి తెలుసు. ఇన్‌డయలాగ్ సంస్థ వారు రెండేళ్ల క్రితం టర్కీ నుంచి డెర్విష్‌లను రప్పించి తారామతి బరాదరీలో నృత్య కార్యక్రమం కూడా నిర్వహించారు.

భగవంతుని పట్ల ప్రేమని, మానవత్వాన్ని, పరమత సహనాన్ని ప్రవచించే సూఫీ సంగీతానికి వైతాళికుడైన రూమి పుట్టిన ప్రదేశాన్ని, ఆయన సమాధిని సందర్శించుకోవడం చాలా ఆనందం కలిగించింది. కొన్యాలోని టర్కీ వ్యాపార సంఘం స్థానిక కేంద్రంలో బ్రేక్‌ఫాస్ట్ చేసాం. ఒక వ్యాపారవేత్త కుటుంబంతో కలిసి భోజనం కూడా చేసాం. తర్వాత ఒక హైస్కూల్‌కి వెళ్లి విద్యార్థులతో టీచర్లతో కాసేపు ముచ్చటించాం. అదే రోజు రాత్రి అంకారా ప్రయాణమయ్యాం.

అటాటుర్క్ మ్యూజియంలో...

అంకారా టర్కీ రాజధాని. 60 లక్షల జనాభాతో ఎన్నో ఇండస్ట్రీలతో కళకళలాడే నగరం. అంకారాలో మూడు రాత్రులు, రెండు పగళ్లు బస చేసాం. అటాటుర్క్ మౌసోలియం, మ్యూజియం ఆఫ్ అనటోలియన్ సివిలైజేషన్స్, కోజా టోపే మసీదు, అంకారాలోనే అతిపెద్దదైన అంకా మాల్‌లను సందర్శించాం.

అటాటుర్క్ మౌసోలియంకి వెళ్లినపుడు ఆధునిక టర్కీ నిర్మాత అయిన కమల్‌పాషా చేసిన యుద్ధాలు, సాహసాలు, ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులను గురించి మా గైడ్ చెబుతూ ఉంటే కమల్ పాషా గొప్పదనాన్ని కీర్తించకుండా ఉండలేకపోయాం. మౌసోలియం లోని సావనీర్ షాప్‌లో అటాటుర్క్ రాసిన 'గ్రేట్ స్పీచ్' పుస్తకం కొనుక్కొన్నాను. 'మ్యూజియం ఆఫ్ అనటోలియన్ సివిలైజేషన్'లో రాతియుగం నుంచి హిట్టైట్లు, గ్రీకులు, రోమన్లు, ఒట్టోమన్ల వరకు అందరి గురించి విపులంగా ఎగ్జిబిట్స్‌ని ఉంచారు. అందుకే అంకారా వెళ్లిన వాళ్లు ఈ మ్యూజియంని తప్పకుండా సందర్శించాలి.

అంకారా నుండి తిరిగి ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి ఇండియా తిరుగు ప్రయాణం అయ్యాం. మా టర్కీ యాత్రలో అన్నిటిలోకి నా మనసును దోచుకొన్నది టర్కీ కుటుంబాల ఆత్మీయత, ఆతిథ్యం. ప్రతిరోజూ ఒక్క పూటయినా ఒక టర్కీ కుటుంబంతో కలిసి భోజనం చేశాం. వారి మర్యాదలు, గెస్టులను రిసీవ్ చేసుకొనే తీరు, గౌరవించే విధానం మరచిపోలేను. అందుకే ఇండియాలో వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వమని కోరాం.

ఆలివ్ పికిల్, చెర్రీ జామ్...

టర్కీ సందర్శించాలనుకునే వారు అక్కడ ఆహారం ఎలా ఉంటుందో అని చింతపడనవసరం లేదు. అద్భుతమైన సలాడ్‌లు, బాయిల్డ్, ఫ్రయిడ్, పికిల్డ్ వెజిటబుల్స్ అన్నీ అక్కడి ప్రజల భోజనంలో భాగమే. వెజిటేరియన్లమని చెప్పుకునే వారికన్నా ఎక్కువగా కూరగాయలు తింటారు ఆ దేశ ప్రజలు. ఆ మాటకొస్తే మధ్యధరా తీరప్రాంత వంటకాలలో వెజిటబుల్స్‌ది ఎప్పుడూ అగ్రస్థానమే. కొద్ది మొత్తంలో చికెన్, మటన్ లేదా బీఫ్ భోజనంతో పాటు తీసుకోవడం టర్కీలో పరిపాటి. పలావ్ కూడా తింటారు. టర్కీలో ఆలివ్‌లు, పిస్తా, చెర్రీలు, ఆప్రికాట్‌లు, హేజల్‌నట్‌లు విస్తారంగా పండుతాయి కాబట్టి వీటన్నిటినీ వంటకాల్లో విరివిగా వాడతారు. ఆలివ్ పికిల్, చెర్రీజామ్, ఆఫ్రికాట్ జామ్‌లను చాలా టేస్టీగా తయారుచేస్తారు.

టర్కీ వాసుల భోజనంలో టీ తప్పనిసరి. మనలా టీలో పాలు కలుపుకోరక్కడ. బ్లాక్ టీ తాగుతారు. అది కూడా చాలా చిక్కగా ఘాటుగా ఉంటుంది. నల్లసముద్రం తీర ప్రాంతంలో పండే ఘాటురకమైన టీనే వీరు ఇష్టపడతారు. అంత ఘాటు టీ మనం తాగలేం కాబట్టి వేడి నీటితో డైల్యూట్ చేసుకోవచ్చు. టర్కీ వెళ్లి రావడానికి దాదాపు 30 నుండి 35 వేలు ఖర్చు అవుతుంది. ఇస్తాంబుల్‌లో బస ఖరీదు కాస్త ఎక్కువే. బడ్జెట్ హోటల్‌లో డబుల్ బెడ్‌రూమ్‌కి అద్దె రోజుకి 2000 నుండి 5000 వరకు ఉంటుంది.

- డా. ఇ. సత్యప్రకాష్
(వ్యాస రచయిత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్)

No comments:

Post a Comment