విహారాలు

India

Gamyam

Monday, August 23, 2010

పర్యాటక దిగ్గజం... ఫతేపూర్‌ సిక్రీ

Buland-Darwaja
ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రాను ప్రముఖంగా చెప్పవచ్చు. ఉత్తర్రపదేశ్‌లోని యమునానదీ తీరాన వెలసిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే ఆగ్రా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్‌. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం కాకుండా ఈ నగరంలో ఇంకా అబ్బురప రిచే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ ప్రదేశం ఫతేపూర్‌ సిక్రీ నగరం.

తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్‌ సిక్రీ లాంటి పర్యాటక ప్రాంతాలు ఆగ్రాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాయి. యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశాలు ప్రపంచపర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫతేపూర్‌ సిక్రీ విషయానికి వస్తే... భారతదేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో ఆగ్రాలో పైన పేర్కొన్న ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలెన్నో నిర్మించారు. అక్బర్‌ కాలంలో నివాసయోగ్యంగా నిర్మించబడిన ఓ సుందర నగరమే ఈ ఫతేపూర్‌ సిక్రీ.

The_Panch_Mahal
అక్బర్‌ కాలంలో 1571 నుంచి 1585 వరకు ఈ నగరం రాజధానిగా విలసిల్లింది. ఈ నగరాన్ని సందర్శించిన పర్యాట కులకు ఇక్కడ నిర్మించబడిన అనేక కట్టడాలు విపరీ తంగా ఆకట్టుకుంటాయి. ఈ నగరంలోని బులం ద్‌ దర్వాజా, ఐదు అంతస్థుల పంచమహల్‌, సలీం చిష్తీ సమాధిలాంటివి చూడదగిన ప్రదేశాలు. అద్భుతమైన నగిషీలతో నిర్మించ బడిన ఈ నగరంలో కట్టడ వైభవం అడుగడుగునా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పర్యాటకకేంద్రాన్ని సంద ర్శించడానికి భారతీయ పర్యాటకులే కాక విదేశీ పర్యాటకులు సైతం ఎంతో మక్కువ చూపుతారు.

దక్షిణ కాశీ... అలంపూర్‌ క్షేత్రం

బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలాంటి వాటిలో ఒకటైన పవిత్ర క్షేత్రమే మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉన్న అలంపూర్‌ క్షేత్రం. ఉత్తర వాహిణీ తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశి గా పేరుగాంచిన ఈ క్షేత్ర విశేషాలు...


temple 
ప్రస్తుతం అలంపూర్‌గా పిలవబడుతున్న ఈ గ్రామం పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపురం అని స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రహ్మి శాసనంలో అలంపూర్‌ ప్రస్తావన ఉంది. నడుకస్రి అనే వాడు తన ఆయుష్షు పెరగడం కోసం భగవంతుడైన అలంపుర స్వామిి (బాలబ్రహ్మేశ్వర) కొంత భూమిని దారాదత్తం చేశాడు. గ్రామ దేవత అయిన ఎల్లమ్మ పేరుతో ఎల్లమ్మపురంగా ఉండి రానురాను అలంపురం, అలంపూర్‌గా మారడం జరిగింది.

స్థల పురాణంలో హేమలాపురం, ఎల్లమ్మపురంగా ఉండేది. అలంపూ ర్‌ దేవాలయంలో తోటను ఆనుకొని ఉన్న గుంతలో తవ్వకాలు జరిపినప్పుడు శతవాహనంలో నాణ్యాలు, పూసలు, దక్షిణవర్త శంఖం, అందమైన గాజులు, నలుపు, ఎరుపు రంగు పూత వేయ బడిన చిన్న మట్టి పాత్రలు, నలుచెదరం 21 అంగుళాల పొడవు వెడ ల్పు ఉన్న ఇటుకలు బయటపడడం వల్ల ఈ ప్రదేశంలో శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం నిర్మించారు.

శ్రీశైల క్షేత్ర పశ్చిమ ద్వారమే ఈ అలంపుర క్షేత్రం...
బాదామి చాళుక్యులు అలంపూర్‌లో నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. ‘‘పరమే శ్వర’’ అనే బిరుదుతో పాలించిన రెండవ పులేశి కాలంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. అలాగే బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాధిత్యుడు కనిపించడం జరుగుతుంది. ఆర్క బ్రహ్మా లయంలోని మంటప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది.అలంపూర్‌ ప్రాంతాన్ని క్రీశ 566 నుంచి 757 సంవత్సరం వరకు బాదామి చాళుక్యులు పరిపాలించారు. నవబ్రహ్మ ఆలయాల నిర్మాణాల్లో ఎర్ర ఇసుక రాళ్లను వాడడం జరిగింది.

temp 
ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి తెప్పించారు. శ్రీ కృష్ణదేవరాయలు క్రీశ. 1521 సంవత్సరంలో రాయచూర్‌ను సాధించి బాలబ్రహ్మేశ్వర స్వామికి, శ్రీ నరసింహస్వామికి దాన ధర్మాలు చేశారు. దక్షిణపదంలోని ప్రాచీన శైవ క్షేత్రాల్లో శ్రీశైలం పురాణ ప్రసిద్దమైంది. ఆ మహా క్షేత్రానికి నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాలు ఉన్నాయి. అవి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవతం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాణ ఉమమహేశ్వరం. పశ్చిమద్వారంగా ఉన్న ఈ క్షేత్రం భాస్కర క్షేత్రమని, పరుశరామ క్షేత్రమని దక్షిణ కాశీ అని పిలువడం జరుగుతుంది.

కాశీ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, 64 ఘట్టాలున్నాయి. దగ్గరలో త్రివేణి సంగమం కూడా ఉంది. అలంపూర్‌లో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ, పాపనా శిని, మణికర్ణికలు 64 ఘట్టాలు ఉన్నాయి. దగ్గరలో కృష్ణ, తుంగభద్ర నదులు కూడా కలవు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించినందువల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో విశేషంగా బ్రహ్మమూర్తులు ఉన్నారు. ఇక్కడి లింగం ‘‘జ్యోతిర్‌జ్వాలమయం’’. దీన్ని పూజించిన వారు అంతు లేని పుణ్యం పొందుతారు.

సంతాన ప్రదాయిని... ఎల్లమ్మ
cota-temp 
ఈ ప్రాంతంలో జమదగ్ని ఆశ్రమం ఉండేది. ఆయన భార్య రేణుకదేవి ప్రతిరోజు నదికి వెళ్లి ఇసుకతో కుండను తయారు చేసుకుని వాటితో నీరు తీసుకొని వచ్చేది. ఒకరోజు మహ రాజు వెయ్యి మంది భార్యలతో అక్కడికి వచ్చి జలక్రీడలు ఆడు తుండగా చూసిన రేణుక తన మనసులో రాజు వైభవాన్ని, అత ని భార్యల గురించి అనుకోవడం వలన మనోవికారం కలుగు తుంది. అందువల్ల ఆ రోజు ఇసుక కుండ తయారు కాదు. దాంతో రేణుక ఆలస్యం చేసి నీరు తీసుకురానందువల్ల జమదగ్ని కోపగించి ఆమెను చంపమని కొడుకులను ఆజ్ఞాపిస్తాడు.

తల్లిని చంపడానికి పెద్ద కుమారులు ఎవ రూ ముందుకు రారు. కానీ పరుశురాముడు మాత్రం తల్లి తలను నరికి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడు. అప్పుడు జమదగ్ని సంతృప్తి చెంది ఏం వరం కావాల ని అడుగగా పరుశురాముడు తల్లిని బ్రతికించమని ప్రార్థిస్తాడు. రేణుక తల చాండల వాటికలో పడడం వల్ల బ్రతికించడం కష్టమని, ఈ తల ఎల్లమ్మ పేరు తో గ్రామదేవతల పూజలు అందుకుంటుందని జమదగ్ని చెప్పడం జరిగింది. మానవపాడు మండ లం ఉండవెల్లి గ్రామంలో గుడి కట్టించి గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పూజించు కోవడం జరుగుతోంది. ఆమె శరీరం బ్రహ్మేశ్వర ఆలయంలో సంతానం లేని స్ర్తీలచే పూజలందుకుని సంతానం ఇచ్చే దేవతగా ఉంటుందని జమదగ్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ భూదేవి పేరుతో స్ర్తీలతో పూజలందుకుంటుంది.

శక్తిపీఠం... జోగులాంబ ఆలయం...
నవ బ్రహ్మ ఆలయాల్లో బాలబ్రహ్మే శ్వరుడు ప్రధాన దైవం. ఈ దేవాల యం క్రీశ 702 సంవత్సరంలో నిర్మించడం జరిగిందని స్థల పురాణాలను బట్టి తెలుస్తోంది. రెండవ ద్వారమే ఆలయ ప్రధాన ద్వారంగా ఉంది. దీనికి రెండువైపులా బ్రహ్మ అర్ధనారీశ్వర మూర్తులున్నారు. స్వామికి అఖండ దీపరాధానం, నిత్యపూజ, నైవేద్యాలు, శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు, శివరా త్రి సమయంలో రథోత్సవం జరుగుతుంది. 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠంగా పిలువబడుతున్న జోగుళాంబ అమ్మవారి ఆలయం, అలంపూర్‌, శ్రీశైలం, ద్రాక్షారామం, పిఠాపురంలు నాలుగు మనరాష్ట్రంలోనే ఉండడం గమనార్హం.

అమ్మవారి దేవాలయం క్రీ.శ 7వ శతాబ్దంలో నిర్మించారు. 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు, శ్రీ చక్రి ప్రతిష్ట చేసింది మొదలు నేటికీ భక్తుల పూజలు అందుకోవడం జరుగుతోంది. క్రీశ 14వ శతాబ్దంలో ముస్లింలు దండయాత్ర చేసి అమ్మవారి దేవాలయం ధ్వంసం చేశారు. స్థాని కులు అమ్మవారి విగ్రహాన్ని, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో చిన్న గుడిలో పెట్టి పూజించేవారు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయల కుమారుడు దేవరాయలు తండ్రి ఆజ్ఞాను సారం సైన్యంతో వచ్చి బహమనీ సైన్యాలను తరిమికొట్టి అలంపూర్‌ క్షేత్రాలను రక్షించాడు.

temples 
ఈ సంఘటన 1390 లో జరిగిందని చరిత్ర చెబుతోంది. 600 సంవత్సరాల తరువాత జగదాంబ ఇష్టానుసారం పాత ఆలయం ఉన్నచోట అదే వాస్తు ప్రకారం కొత్త దేవాలయాన్ని నిర్మించిన దేవదాయ, ధర్మాదాయ శాఖ పాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవబ్రహ్మ ఆలయాల్లో కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవ బ్రహ్మ ఆలయాలు ఈ ప్రాంతంలో నిర్మించారు.

జోగుళాంబ ఆలయానికి 2002 ఏప్రిల్‌ 8న కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతీ, విజయేంద్ర సరస్వతీ స్వా ములు శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణం 2004లో ముగిసింది. 2005 ఫిబ్రవరి 13న శృంగేరి శివగంగాపీఠాధిపతి శ్రీ సచ్చిదానంద భారతి చేతుల మీదుగా అమ్మవారి పునఃప్రతిష్ట నిర్వ హించబడింది.దేవాలయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థాపతుల పర్యవేక్షణలో జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈ దేవాలయం నిర్మాణానికి, ప్రతిష్ట కార్యక్రమానికి రూ. 2 కోట్లు వెచ్చించారు. కృష్ణా, తుంగభద్ర సంగమ క్షేత్రం అలంపూర్‌కు సమీపంలో ఉంది. శ్రీశైలం ఆనకట్ట, నీటి నిల్వ ఆలంపూర్‌ వరకు ఉంటుంది. కనుక కృష్ణా, తుంగభద్ర నదుల నీరు దాదాపు 5 నెలలపాటు నిలిచి ఉంటుంది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపూర్‌లో భక్తుల కోలాహలం తో కిటకిటలాడుతుంది.

ఇలా వెళ్ళాలి...
సికింద్రాబాద్‌ నుంచి కర్నూల్‌ రైలు మార్గంలో ఈ ప్రాంతం కలదు. కర్నూల్‌ నుంచి బస్సు సౌకర్యం కలదు. రాష్ట్రం నలుమూల నుండే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కు చెందిన రవాణా సంస్థలు కూడా కర్నూలు, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు బస్సు లు నడుపుతున్నాయి. కర్నూలు నుండి ఇక్కడికి గం ట గంటకు బస్సులుంటాయి. విమాన ప్రయా ణీ కులకు దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్‌.

- రమేష్‌, అలంపూర్‌

Sunday, August 22, 2010

కమనీయ దృశ్యం.. కనిగిరి దుర్గం

kanegiri1
వారసత్వంగా అందించేవి చారిత్రక కట్టడాలు. కోట్లు వెచ్చించినా కట్టలేని అలాంటి కట్టడాలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వం, మనందరిపైనే ఉంది. ఆ కోవకు చెందినదే ‘కనిగిరి’ దుర్గం. ప్రకృతి అందచందాలతో అలలారే ఈ దుర్గం నాటి నుండి నేటి వరకు గత వైభవానికి చిహ్నంగా, కమనీయంగా వెలుగొందుతుంది. రాజులు, రాజ్యాలు అంతరించినా వారి ప్రాభవానికి, కళాతృష్ణకు ఆనవాలుగా నిలిచిన ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నేటికి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 80 కిలోమీటర్ల దూరంలోనున్న... ఒకప్పుడు ‘కనకగిరి’గా ఖ్యాతిగాంచిన నేటి కనిగిరి దుర్గం చరిత్ర ఇది.

kanegiri2
చరిత్ర కలిగిన కనిగిరిలోనే 13-14 వ శతాబ్దంలో యాదవ రాజైన కాటమరాజు, మనుమసిద్దులకు పోరాటం జరిగింది. అనంతరం శ్రీ కృష్ణదేవరాయలు కనిగిరి దుర్గంలో కొలువు ఏర్పరుచుకొన్నాడు. ఈ దుర్గంలో ఉన్న చెన్నముక్క బావి, సింగరప్ప దేవాలయాలు ఆయన కాలంలో నిర్మితమైనవే. ఇవి నేటికి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీరి కాలంలోనే నిర్మించిన కోటబురుజులు, ప్రహరీ, లోదుర్గంలోని మందుకొట్టాలు, చెన్నమ్మబావి, గుర్రపుశాలలు, ఏనుగుల బావి, మండాలు చరిత్ర మరవని చారిత్రాత్మక దృశ్యాలు. ఆ తరువాత 1520 లో వీరభద్ర గజపతి, రెడ్డిరాజులు ఈ ప్రాంతాన్ని పాలించగా... 1776లో కనిగిరి దుర్గం సుల్తానుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. లోదుర్గం చుట్టూ ఉండే 26 కిలోమీటర్ల కోటగోడ ఇప్పుడు 20 కిలోమీటర్ల మేర ఉండి చూపరులను అమితంగా ఆకర్షిస్తున్నది.

బొగ్గుల గొంధి ప్రాంతంలోని కోటగోడ ప్రధాన ద్వారం గుండానే నాడు ఇక్కడ పరిపాలించిన రాజులు రాకపోకలు సాగించారని ప్రతీతి. కోటకు నాలుగు వైపుల ఉండే నాలుగు కోట బురుజుల్లో 3 బురుజులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. దొరువుకు సమీపంలో ఉండే ప్రధాన బురుజులలో ఒకటైన బురుజు పర్యాటకులకు ఇక్కడి చారిత్రక ప్రసిద్ధిని గుర్తుచేస్తున్నది. లోదుర్గంలోని దుర్గమ్మ గుడి, సీతారాముల గుడి గత వైభవాలకు చిహ్నలుగా నిలిస్తున్నాయి. కోటలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మందుకొట్లు, మండెం, ఏనుగులబావి, గుర్రపుశాలలు, నీటి కొలనులు, సువిశాల ప్రాంగణం, కొలనులో నీటి చలమలు ప్రకృతితో పోటీ పడుతూ వీక్షకులను అలరిస్తున్నాయి.

kanegiri3
40 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండే మూడు అరలుగల మందుల కొట్లు ఆనాటి రాజుల యుద్ధ సామర్ధ్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. ఈ దుర్గంలో 2 కిలోమీటర్లు వ్యాపించి ఉండే నేలగొయ్యి, రహస్య గొయ్యి, నాగుల పొదలు సైతం నేటికి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాటి చారిత్రక కట్టడాలకు స్వాగత తోరణంగా ఉన్న కనిగిరిని ఆనుకొని ఉన్న దుర్గం దానికి ముందుండే సింగరప్ప ఆలయం గత స్మృతులకు నిదర్శనం. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు లోదుర్గంలోని వింతలను, విశేషాలను, పరిశోధనాత్మకంగా తిలకిస్తూ, సందర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో కనిగిరి కోటను సందర్శించడం కోసం ఇతర రాష్ట్రాల నుండి సైతం పర్యాటకులు అధికసంఖ్యలో రావడం విశేషం. దేశ సంస్కృతికి, పురాతన చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిన ఈ ప్రాచీన కట్టడాలు కాలగర్భంలో కలసిపోకుండా కాపాడాలంటే పురావస్తు శాఖ, రాష్ట్ర పర్యటక శాఖ చర్యలు శ్రద్ధవహించి గత వైభవాన్ని నేటి, భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కోటలోని ప్రత్యేక ఆకర్షణలు...
దుర్గం చుట్టు ఉండే కొండ పై భాగంలో అక్కడక్కడ ప్రకృతి పేర్చిన అందాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటిలో ముఖ్యంగా బొగ్గుల గొంధి ప్రాంతంలో ఉన్న తాబేలు రాయి, దుర్గం ఉత్తరం వైపునున్న ఉగ్గుగిన్నె రాయి, దుర్గంలోనున్న డైనోసార్‌ రాయి, చింతకాయ రాయి, పాము రాయి, అక్కా చెల్లెళ్ళ బండలు, చేపరాయిలు ప్రధానాకర్షణగా ఉన్నాయి. వీటి నుండే ఆదిమానవుని రూపాంతరం వెలువడినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.
- బత్తుల రామ్‌ప్రసాద్‌,
కనిగిరి, ప్రకాశం జిల్లా

ప్రాచీన కళావైభవానికి రామగిరి ఖిల్లా...!

ramagiri4
ఆ దుర్గం అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం... నాటి శిల్పుల నైపుణానికి తార్కాణం... ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు... ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు... రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా... ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటికీ పర్యాటకులను అలరిస్తూ విరాజిల్లుతోంది... కాకతీయుల కాలం శిల్ప కళాపోషణకు పెట్టింది పేరుగా ఉండేది... వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు స్థానికులు కథలు కథలుగా చెబుగారు. దీంతో రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రాంగాను భాసిల్లుతోంది... 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లాఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా పేరొందింది. చారిత్రాత్మక నేపథ్యంతో... ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని... తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన రామగిరిఖిల్లా విశేషాలు ‘విహారి’లో మీకోసం...

చారిత్రక నేపథ్యం...
ramagiri
క్రీశ 1వ శతాబ్దంలో రామగిరి కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్‌, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్దిపరిచారని చరిత్ర చెబుతుంది. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకొన్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాప రుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు మంత్రకూటముల శాశనాలు తెలియపరుస్తు న్నాయి. అనంతరం 1442 లో బహమనీ సుల్తానులు ఆక్రమించుకోగా వారి నుంచి రెడ్డి రాజు లు స్వాధీనం చేసుకొన్నట్లు చరిత్రక ఆధారాలున్నాయి. అటుపిమ్మట 1595లో మొఘలాయిల స్వాధీనంలోకి వెల్లింది. 1606 లో గోల్కొండ నవాబుల ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసు కున్నారు. వారి నుండి మహమ్మదీయులు వశపరుచుకొని నైజాం కాలం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది.

సంగీత, నృత్యకళలకు ఆనవాలు...
ramagiri3
పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరామచంద్రుడు వన వాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్టించి నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్‌ విగ్రహాల తో పాటు నంది విగ్రహం కూడా ఉంది. శ్రీరాముని విగ్రహం ఉన్నచోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజులపాలనలో రామగిరి ఖిల్లా పరిసర ప్రాం తానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానం లో సంగీత నృత్యకళా కారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాల క్రమేణ అది బోగంపేట మారింది.

శ్రావణం మాసంలో పర్యాటకులసందడి...
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో... ప్రతి శ్రావణ మాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లదకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూలికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళాసంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సివుంది. పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్న నేటికి ఆచరణ కు అమలు కాలేదు.

శిల్ప కళకు ఒడి..!
కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్పకళా సంప దతో శోభిల్లుతోంది. పర్యాటకులను ఆహ్ల దపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలు స్తూ... శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సంద ర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి నిర్మింపజే సిన రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటు తాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.

వనవాసంలో రామగిరిపై రామచంద్రుడు...
వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబు తారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకుల కు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరిం చిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.

నాటి వాడలు... నేడు పల్లె సీమలు...
ramagiri1
రాజుల పరిపాలనాకాలంలో వాడలుగా పిలువబడిన రామగిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నేడు పల్లె సీమలుగా మారాయి. వాడల యొక్క విశిష్టతను బట్టి నేటికీ ఆ గ్రామాల పేర్లు అలాగే కొనసాగుతుండడం విశేషం. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌ గా మహ్మదీయుల కాలంలో బేగంలు నివాసం ఉండేప్రాంతం నేడు బేగంపేటగా పిలవబడుతోంది. అదే విధంగా పోత న పేరుతో ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగాళ్లు నిలిపేచోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగేచోటును శుక్రవారంపేట అని ఆదివారం సంత జరిగే చోటు ఆది వారంపేట గా మైదపుపిండి విసురురాళ్ళు ఉండే చోటును మైదం బండగా, గుండ రాజు పేరున గుండారం అనే పేర్లు వాడుకలోకి వచ్చినట్లు స్థానికులు చెబుతారు.

దుర్గంలో చూడాల్సిన ప్రదేశాలు...
రామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాప రుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజనశాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యాటకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.

రామగిరి చరిత్ర వెలుగులోకి వచ్చిన విధం...
రామగిరి చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పలువురు రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలుకోర్చి రామగిరి చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం మంగపేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్‌ మండలానికి చెందిన మాధవరావు, బలరాందాస్‌లు ‘రామగిరి మహత్యం’ పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు. వీరికంటే ముందు రామగిరి చరిత్రను వెలికితీసిన ఘనత ఆర్‌.బాల ప్రసాద్‌కే దక్కుతుందంటారు.

‘కళ’ తప్పుతోందా..?
ramagiri2
గత చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమైన రామగిరి ఖిల్లా... ప్రభుత్వం, పురావస్తు శాఖల నిర్లక్ష్యం మూలంగా కళావిహీనమవుతోంది. ప్రాచీన సంస్కృతికి, కళా వైభవానికి అద్దంపట్టిన ఇక్కడి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమా దంవుంది. ఇప్పటికైనా ఈ కళాసంపద కనుమరుగు కాకుండా ఈ చారిత్రాత్మక కళా సంపదను పరిరక్షించాల్సిన అవసరం ప్రభు త్వం పై ఉంది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యా సాగర్‌రావు పాదయాత్ర చేపట్టి... రామగిరిఖిల్లాను పర్యా టక కేంద్రం గా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. అయి నా ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్ది అరుదైన కళాసంపదను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఖిల్లాకు వెళ్లాలంటే...
కరీంనగర్‌ జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా... మంథని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల దూరంలో వుంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్‌ మం డలం లోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామ గిరి ఖిల్లాకు చేరు కోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా సాంతం చూడాలంటే కనీసం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట - బల్లార్షా మార్గం లోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ లో దిగి బస్సుద్వారా మంథని మార్గం లో బేగంపేటకు చేరుకోవచ్చు.

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది. పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ... శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. మిగతా సీజన్‌ల కంటే శ్రావణమాసంలోనే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనికి ఈ సీజన్‌లో దట్టంగా పరుచుకునే పచ్చదనం ఒక కారణమైతే... శ్రావణమాసంలో ఇక్కడ పూజలు చేయడానికి పురోహితులు కూడా అందుబాటులో ఉండడం మరో కారణం.
- బండ సాయిశంకర్‌,  కమాన్‌పూర్‌

శతాబ్దాత చరిత్రకు సాక్ష్యాలు.. ఎలిఫెంటా గుహలు

elephanta-caves
విశేషాలను, ప్రకృతి రమణీయతను తమలో ఇముడ్చుకున్న ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర లోని ‘ఘరాపురి ద్వీపం’ లో ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్యాటక కేంద్రం జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినది. దేశవిదేశాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. 1987లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎలిఫెంటా గుహలకు ఆ పేరు పోర్చుగీసు వారు పెట్టారని చెబుతారు. పోర్చుగీసువారి కాలం నుండి ఆంగ్లేయులు, డచ్‌వారు ఎందరో వీటిని సందర్శించారు. 12, 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ గుహల్లో ఉన్న విగ్రహాల ముఖాకృతులను మార్చేశారు. 9వ శతాబ్దం, 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు దీనిని నిర్మించారు. వీటిలో కొన్ని విగ్రహాలు రాష్టక్రూటులు నిర్మించారు. ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా ఈ గుహల్లో కొలువై ఉన్న విగ్రహాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

elephanta_caves1
‘త్రిమూర్తి’ విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలను పోలివుంటుంది. నటరాజు, సదాశివుడు, అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్టక్రూటుల కళలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ రాతిలో చెక్కబడిన మందిర సముదాయం, 60,000 చ.అ. విస్తీర్ణం కలిగివున్నది. దీనిలో ముఖ్యమైన హాలు, పక్క హాళ్ళు, ప్రాంగణం లాంటి అనే కట్టడాలు ఉన్నాయి. ఇందులో సుందరమైన శిల్పాలు, శివాలయం ఉన్నాయి. ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి. ఇక్కడ ఉన్న ప్రముఖ విగ్రహాల్లో ఒకటైన సదాశివుని విగ్రహం, ఉత్తర దక్షిణ దిశల్లో 20 అడుగుల ఎత్తులో, త్రిముఖంతో, పంచముఖ శివునికి పోలి వుండడం విశేషం. ఇలా ఆధ్యాత్మిక చింతనను, ప్రకృతి అందాలను, చారిత్రక విజ్ఞానాన్ని ఒకే చోట అందిస్తున్న ‘ఎలిఫెంటా’ గుహలు పర్యాటకులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తమిళనాట.. అందాలు

పుదుచ్చేరి... చరిత్ర...
ఆంగ్లేయుల కంటే ముందు ఫ్రెంచి వారు మన దేశాన్ని పాలించారు. వారి పరిపాలనలో రూపుదిద్దుకున్న ఎన్నో పర్యాటక కేంద్రాలు తమిళనాడులో ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో ఫ్రెంచి కాలనీగా ఉండి, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పూర్తి ఫ్రెంచి వాతావరణం కనబడుతుంది. ఇక్కడి వీధులు, భవనాలకు ఇప్పటికీ ఫ్రెంచి పేర్లే వాడుకలో ఉండటం విశేషం. ఇక్కడి కట్టడాల్లో ఫ్రెంచి కళాత్మకత ఉట్టిపడుతుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆరోవిల్లె గ్రామం, అరవింద ఆశ్రమం పుదుచ్చేరిలోని ప్రధాన ఆకర్షణలు. మనక్కుల వినయనగర్‌ లాంటి దేవాలయాలు, అయి మనదపం లాంటి స్మారక చిహ్నాలు, అద్భుతమైన బీచ్‌లు మనల్ని సందర్శకులను మైమరిపిస్తాయి.

ట్రాంక్‌బార్‌ సౌందర్యం...
Tanjore2005లో సునామీ తాకిడికి గురైన నాగపట్టిణం జిల్లాలో ఉంది ఈ ప్రాంతం. క్రీ.శ.1620-1845 సంవత్సరాల మధ్యప్రాంతంలో డేనిష్‌ కాలనీగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక కోటలున్నాయి. వాటిలో ముఖ్యమైనది డాన్స్‌బర్గ్‌ కోట. ఈ కోట ప్రస్తుతం ఆ కాలం నాటి విశేషాలతో కూడిన మ్యూజియంగా విజ్ఞానాన్ని పంచుతోంది. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్‌ మిషనరీ బార్తెలా మౌస్‌ జియెంగన్‌ బాల్గ్‌ (బాల్గ్‌ బైబిల్‌ను తమిళంలోకి అనువదించారు). ఈ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడట. మరణానంతరం ఆయనను ఇక్కడే సమాధి చేశారు. చాలాకాలం పాటు ప్రధాన మిషనరీగా ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శకులను ఆకర్షించేందుకు ఇక్కడ ఉన్న కోట, చర్చిలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

కుంభకోణం...
తమిళనాడులో అద్భుత కళాత్మక సంపదకు ఆలవాలమైన ప్రసిద్ధ ఆలయాలన్నీ కావేరీ తీరంలోనే కొలువుదీరి ఉన్నాయి. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన... రాజరాజచోళుడు నిర్మించిన అతిపెద్ద ఆలయం కుంభకోణం. యునెస్కో చే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ దేవాలయంలో ఈ సంవత్సరం వెయ్యొవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. రాజరాజు చోళుని కుమారుడు రాజేంద్రచోళుడు కూడా మంచి కళాపోషకుడు. ఈయన కంగైకొండ చోళపురం వద్ద మరో పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. అది కూడా అద్భుతమైన కట్టడమే. ఇవే కాకుండా కావేరీ తీరంలో ఇంకా అనేక ఆలయాలున్నాయి. ఈ ప్రాంతానికి చుట్టూ ఉన్న నవగ్రహాల ఆలయాలు ఒక్కోదానికీ ఒక్కో చరిత్ర ఉంది. తమ తమ జాతకాలను అనుసరించి చాలామంది యాత్రికులు ఈ ఆలయాలను సందర్శిస్తుండడం గమనార్హం.

కాలుష్యానికి ఆస్కారం లేని... టాప్‌స్లిప్‌...
Kumbakonam బ్రిటీష్‌కాలంలో కొండలపై విరిగి పడ్డ దుంగలను కిందకు దొర్లించేవారంటే ఇక్కడ వృక్షసంపద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి అన్నామలై కొండలమీద ఉన్న ఇందిగాంధీ నేషనల్‌ పార్క్‌ మరో ఆకర్షణ. చుట్టూ దట్టమైన వెదురు, టేకు వనాలు ఉండటంతో ఏమాత్రం కాలుష్యానికి ఆస్కారం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం వైశాల్యం దృష్ట్యా చిన్నదైనప్పటికీ... ఏనుగులు మాత్రం అధికసంఖ్యలో ఉంటాయి. ఇక పక్షుల కిలకిలా రావాలను వింటూ సేదదీరాలనుకునే పర్యాటకులకు ఇది స్వర్గధామమనే చెప్పాలి. అత్యంత అరుదైన పక్షి జాతులెన్నో మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. టాప్‌స్లిప్‌ మీద ఏనుగు సవారీ జీవితంలో మరిచిపోలేని అనుభవం.

ఎలగిరి...
రెండు ఎతె్తైన కొండల మధ్య 14 చిన్న గ్రామాలతో కలిసి ఉన్న అందమైన ప్రాంతం ఎలగిరి. తమిళనాడులో ఊటి, కొడైకెనాల్‌ తరువాత మళ్లీ అంత ప్రశాంతతను చేకూర్చే పర్యాటక కేంద్రం ఏదైనా ఉందంటే అది ఎలగిరి మాత్రమే. ఎలగిరి కొండల్లో విహారం జీవితంలో మరిచిపోలేని అనుభూతినిస్తుంది. తమిళనాడులోని మిగిలిన హిల్‌స్టేషలన్నీ విపరీతమైన రద్దీతో ఉంటే, ఎలగిరి మాత్రం పర్యాటకులకు ఏకాంత వాతావరణాన్ని అందిస్తుంది. 3,500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతమంతా గులాబీ తోటల, పచ్చటి లోయలు, వాటి అందాలతో అలరారుతుంది. ట్రెక్కింగ్‌ చేసేవారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండే అక్కడ పారాగ్లైడింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి సాహస క్రీడలకు కూడా అనుమతినిచ్చారు. ఎలగిరితో పాటు ఉన్న గ్రామాల్లో ఎతె్తైన కొండ స్వామిమలై కొండ. ఇక్కడి నుండి పచ్చటి లోయలను చూస్తే... కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. జొలర్‌ పెటై్ల రైల్వే స్టేషన్‌కు ఇది కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి... చెన్నై నుండి 240 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- ఎస్‌.కె

Friday, August 20, 2010

కలలు కళలుగా.. కోటలు మ్యూజియాలుగా..... పారిస్

పారిస్ నగరం మధ్యలో సీన్(siene) నది ప్రవహిస్తుంటుంది. దానికి రెండువేపుల చూడవలసినవి, చరిత్రాత్మకమైనవి చాలా ఉన్నాయి. అందుకని మా టూరు మేనేజరు తెలివిగ మమ్మల్ని బోటెక్కించేశాడు. పడవ ముందుకు సాగుతుండగా ముందుగా రికార్డు చేసి పెట్టిన క్యాసెట్టులోని గొంతు మాకు కుడి, ఎడమ భాగాలలో ఉన్న భవనాల ప్రశస్తి గురించి చెప్తూ పోయింది. అటూ, ఇటూ తిప్పి తిప్పి మెడ ఎంత నొప్పి పుట్టిందో! వాటిలో ముఖ్యమైనది 12వ శతాబ్దానికి చెందిన Notre Dame de Paris అనే గోతిక్ చర్చి. ఎంతో గొప్ప ఆర్కిటెక్చరు కలదట. దాదాపు 200 ఏళ్లు (1163-1345) పట్టిందట దాన్ని పూర్తి చేయడానికి. ఇంకా చాలా చాలా చూశాం- ఒపేరా హౌసులు, మ్యూజియంలూ సీన్ నదిమీదున్న అతి పురాతనమైన, అత్యంతాధునికమైన వంతెనలు కూడా అనేకం చూశాం. వాటిమీదున్న శిల్పాలు, సోయగాలు చూసి ముచ్చట పడ్డాం.

ఎగ్జిబిషన్ కోసం కట్టారట

నదిమీద వ్యాహ్యాళి చేస్తున్నప్పుడే ఈఫిల్ టవర్ చూశాం. కాని ఆ చూడడం వేరు. దానిమీదికెక్కడం వేరు. అదొక ప్రత్యేకమైన, అలౌకికమైన అనుభవం. పారిస్ అంటే ఈఫిల్ టవరు అన్నంతగా పేరు పడింది. నిజానికి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద కట్టలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దాన్ని ఎగ్జిబిషన్ కొరకు కట్టారట. Mr.Eiffelఅనే ఇంజనీరు రూపొందించిన ఈ కట్టడాన్ని తరువాత కూల్చేయాలనుకున్నారట. ఇంకో విషయం తెలుసా! చాలామంది ఫ్రెంచి వారికి అది నచ్చలేదట. ఎన్నో వివాదాలకు దారితీసిన ఆ కట్టడమిప్పుడు ఎంతో ప్రసిద్ధిచెందిన పర్యాటకాకర్షణయ్యింది. పారిశ్రామిక కళకు అదొక ప్రారంభం. దీంట్లో ఉన్న మూడంతస్థులలో ఒకటి 57, రెండవది 115, మూడవది 276 మీటర్ల ఎత్తు ఉన్నాయి.

అంత ఎత్తులో  Mr.Eiffel  తనకొక గది కట్టుకుని, కూతురితో పాటు ఉండేవాడట. టవరును చూడవచ్చిన గొప్పవారినక్కడే కలుసుకునేవాడట. ఆ గదిలో ఉన్న థామస్ ఆల్వా ఎడిసిన్, ఈఫిల్, ఆయన కుమార్తె విగ్రహాలు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. అక్కడ నిలబడి చూస్తే మెలికలు తిరిగిన సన్నని రిబ్బన్ లాగ సీన్ నది, బొమ్మరిళ్ళలాగా గొప్ప గొప్ప కట్టడాలు కనిపిస్తాయి. చుట్టూ దృఢమైన ఇనుప గర్డిల్స్ ఉన్నాయి కనుక సరిపోయింది లేకపోతే తీవ్రంగా వీచే ఆ గాలికి ఎగిరిపోతామనిపిస్తుంది. ఆ అనుభవం ఒక ఎత్తయితే రాత్రి చీకట్లో మిరిమిట్లు గొలిపే విద్యుదలంకరణలో దానందం చూడడమింకొక ఎత్తు. పారిస్‌లో ఏ మూల నుండి చూసినా కనిపించి మైమరపింప చేస్తుంది. మధ్యలో యూరోపియన్ యూనియన్ చిహ్నంగా ఏర్పరచిన నక్షత్రాల లైట్లు కాంతులీనుతూ కనువిందు చేస్తాయి.

ఊపిరి పీల్చడం మరచిపోయి చూశాం

ఆ రాత్రి మేము చూసిన 'లిడో షో' మరొక మరపురాని జ్ఞాపకం. మనం కూర్చునే ఆసనాలు, స్టేజి కూడా అర్ధ వలయాకారంగా ఉంటాయి. మనం తింటూ తాగుతూ ప్రదర్శన చూడొచ్చు. స్టేజి నిర్మాణం వైవిధ్యభరితమైనది. పలు హంగులు, సెట్టింగులు, సీనరీలు, అంతస్థులు వగైరా ఎప్పుడవసరమొస్తే అప్పుడేర్పడే, ఎప్పటికప్పుడు మారే ఇది ఇంద్రజాలమా అనేట్లు అరేంజిమెంట్లున్నాయి. అతి విశాలంగా ఉండడం చేత రంగస్థలం మీద ఒకేసారి యాభైమంది దాకా కళాకారులు పడతారు. వాళ్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆటోమాటిక్‌గా ఏర్పడే అంతస్తులు ఎక్కుతూ, దిగుతూ వయ్యారాలొలకబోస్తూ నాట్యం చేయొచ్చు. మన కళ్లముందే ఒక విమానమెక్కడి నుండో ఎగిరొచ్చి ఒక మూలకు ఆగగానే పైనుండి కిందికొక నిచ్చెన జారడం, ఒక వయ్యారిభామ హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ హొయలొలకబోస్తూ దిగడమాలస్యం బిలబిలమని ఆవిడ చెలికత్తెలు చేరడం, అందరూ కలిసి షాపింగు చేయడమొక కథ.

ఉన్నట్లుండొక రాజప్రాసాదం పైనుండొస్తే, కింది నుండి నీళ్ళు చిమ్మే ఫౌంటెన్లు, మొక్కలు వగైరా వచ్చి నిలుచోడం, ఏనుగు అంబారి ఎక్కి రాజు, రాణి ఊరేగడం, గుర్రాలపై రౌతులు కవాతు చేయడం, రాకుమార్తె తోటలో సఖులతో కలసి ఆడుకోడం- అన్నీ గబగబా జరిగిపోయాయి. క్షణాల్లో మారే వారి అలంకరణలు కూడా అట్లాంటి, ఇట్లాంటివి కాదండోయ్ కాలి బొటన వేళ్ళ నుండి శిరస్త్రాణాల దాకా వారు ధరించిన నగలు, దుస్తులు ఎన్ని రకాలో చెప్పలేను. అసలే పొడగర్లు, కాళ్ళకు ఎత్తు మడమల జోళ్ళు, తలపై మూడడుగులెత్తున్న రంగురంగుల, రకరకాల టోపీలు క్షణం క్షణం మారే సైకిడెలిక్ లైటింగుతో కళ్ళు చెదిరిపోయాయి. అమ్మాయిలు నామమాత్రంగా ఏవో దారప్పోగుల వంటి బట్టలు వేసుకున్నా, దాదాపు నగ్నంగా ఉన్నట్లే లెక్క. అయినప్పటికీ అసభ్యమనిపించలేదు. ఎందుకంటే వారి కదలికలలో కవ్వింపు, రెచ్చగొట్టడం లాంటివి లేవు. పూర్తి నగ్నంగా నాట్యం చేసే వారి కోసం ప్రత్యేకమైన థియేటర్లున్నాయట.

వైభవాల పుట్ట వర్సైల్స్ ప్యాలెస్

మర్నాడుదయం పారిస్‌కి చేరువలోనే ఉన్న వర్సైల్స్ (versaillas palace) ప్యాలెస్‌కెళ్లాము. దీనిని సూర్యదేవుడైన అపోలోని ఆరాధించే లూయీ వంశపు రాజులు కట్టించారు. ఆ బ్రహ్మాండమైన భవనసముదాయాన్ని కట్టేందుకు యాభై ఏళ్లు పైనే పట్టిందట. తోటలు వగైరా కలిపి దీని విస్తీర్ణం 800 హెక్టార్లట. దీని లోపల 20 కిలోమీటర్ల రోడ్లు, అంతే పొడవున్న ప్రహరీ గోడలు, రెండు లక్షల చెట్లు, 35 కిలోమీటర్ల మేర నీటి పైపులు, 11 హెక్టార్ల పై కప్పులు, 2153 కిటికీలు, 67 మెట్ల వరుసలు, పెద్దపెద్ద చెరువులు, అందమైన సరోవరాలు-దాని వైభవాన్ని చెప్పడం కష్టం. ఇది ఎంత విశాలమైనదో అంత విలాసవంతమైనది.

ఆనాటి ఫ్రెంచి ప్రభువుల అధికార దర్పాన్ని, భోగలాలసతని, వైభవాన్ని అడుగడుగున అనేదానికంటే అంగుళమంగుళము ప్రతిఫలిస్తుందిక్కడ. అంతటి మహత్తరమైన భవంతిలో మేము చూసింది 14 ఛేంబర్సు మాత్రమే. అయితేనేమి ఒక్కొక్కటొక మ్యూజియం మాదిరుంది. ప్రతి గదిలో ప్రశస్తమైన రంగురంగుల పాలరాతిని, మేలిరకం కలపను, అతి నాణ్యమైన అద్దాలను, వెండి, బంగారాలను, సుతిమెత్తని ముఖమల్, బంగారు జరీతో పూలు కుట్టిన మెత్తటి పట్టువస్త్రాలను....ఇంకా ఏవేవో ఉపయోగించారు. అప్పటి ఫ్రెంచి వాళ్లకు ఇటలీ వాళ్లన్నా, వారి కట్టడాలన్నా, చలువరాతి శిల్పాలన్నా, కుడ్య చిత్రాలన్నా ఈర్ష్యగా ఉండేదట. తాము వారికంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలనే తపన అటు ప్రభువులకు, ఇటు కళాకారులకు కూడ ఉండేదట. దాని ఫలితమే ఈ వర్సైల్స్ ప్యాలెస్.

పై కప్పంతా పెయింటింగులే...

రోములోని వాటికన్ సిటీ భవనాల వలె ఈ రాజప్రసాదంలోని ప్రతి గది పైకప్పు, గోడలు, స్థంభాలు, ద్వారాలు, కిటికీలు శిల్పాలతో, చిత్రాలతో నిండివుండడంతో చూసిన వారి కళ్లు చెదిరిపోతాయి. నేలకునేల అతి చక్కనైన చలువరాతి డిజైన్లతో అలరారుతుంటుంది. అన్ని వైపులా అలంకరణలు, ఆకర్షణలే. అతి ఖరీదైన ఫర్నీచరు, అంతకంటే ఖరీదైన జరీ సిల్కు కర్టెన్లు. వాటికంటే హుందాగా పొడవుగా నిలబడ్డ ఫ్రెంచి విండోలు, తళతళలాడే వాటి గాజు తలుపులు, వాటికి దీటుగ పైకప్పునుండి వేలాడుతున్న కాంతులీను గాజు బుడ్లు (chandeliers). ప్రతిగదిలో ఒక ఫైర్ ప్లేస్ (fire place), దాని చుట్టూ ఏవేవో డిజైన్లు, చిత్రాలు, శిల్పాలు.

ముఖ్యంగా పైకప్పంతా మెగా పెయింటింగులు. ఒకదాంట్లో హెర్కులస్‌కు సంబం«ధించినవి, ఇంకొక దాంట్లో డయానాకు సంబంధించినవి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథనక్కడ ఆవిష్కరించేరు.అపోలో సెలూననే గది పై కప్పంతా పరుచుకొని ఉన్న పెయింటింగు ఎంతో అద్భుతంగా ఉంది. నాలుగు గుర్రాలు పూనిన రథంపై దౌడుతీస్తున్న సూర్యుని వెనుక గ్రీష్మ, వసంత, హేమంత, శిశిర రుతువులు పరుగులు పెడుతున్నట్లు చిత్రించారు. ఆ గదిలో ఉన్న లూయీ 14 తైలవర్ణ చిత్రానికొక ప్రత్యేకత ఉంది. ఆయన పొట్టి వాడవటం చేత రాజదర్పానికి కొరత ఉండకూడదని ఎత్తుగ ఉండే హైహీల్సు, బఫ్ వచ్చేట్లు ఎత్తుగ దువ్వుకొన్న జుట్టు పెయింట్ చేసారు.

ఆ మూడు చూస్తే చాలు...

తర్వాత Louvre museum చూశాం. దీన్ని వాళ్లు లూవర్ అని పలుకుతారు. ఒకప్పుడిది రాజ భవనంతో కూడిన కోట. వర్సైల్స్ నిర్మించిన తరువాత దీనిని మ్యూజియం చేసినట్లున్నారు. నాలుగంతస్థుల భవనం. 700 పైన గదులు. గదులనకూడ దనుకుంటా, చాలా పొడవు వెడల్పు ఉన్న హాల్సనో, కారిడార్లనో అనాలి. అసలా భవనం డిజైనే విచిత్రంగా ఉంటుంది. మనకిచ్చిన బ్రోచర్లో తప్ప అంతు పట్టదు. కేవలం ఈ భవనాన్ని చూడ్డానికే వారం పడుతుందంటే అతిశయోక్తి కాదు.

ఇందులో మూడు భాగాలున్నాయి. అవి. Sully, Denon, Richelieu. ప్రపంచంలోని అన్ని దేశాల కళా సంపద క్రీస్తు పూర్వం 8000 నుండి వివిధ దశలలో సేకరించి భద్రపరిచారు. వర్సైల్స్ చూసిన అలసట తీరనే లేదింకా. ఇంక దీన్నేమి చూస్తాము అని గుండె జారింది. స్థానిక ప్రజలు కూడా అప్పుడొకటి అప్పుడొకటి చూస్తారట. మీలాంటి టూరిస్టులు ముఖ్యమైన మూడింటిని చూస్తే చాలని చెప్పాడు మా టూరు మేనేజరు. అవి.. Venus de Milo, The winged victory of Samathrace, Monalisa. ఆయన చెప్పిన ఆ మూడు చూసే సరికే మూడు చెరువుల నీళ్లు తాగినంత పనైంది. ఈ మూడు ఎంత ప్రఖ్యాతి చెందిన కళాఖండాలంటే మ్యూజియంలో ఎక్కడ చూసినా వాటి పేర్లు రాసి బాణం గుర్తులేసి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ మూడూ చూశాక కళ్లూ, మనసూ కూడా నిండిపోయాయి.

ఇంకా చూడాల్సిన కళాఖండాలున్నప్పటికీ అలసిన శరీరం మొరాయించింది. పైగా మా గ్రూపు వాళ్లెవరూ కనపడ్డం లేదు. బయటికెలా వెళ్లాలో తెలియక అవస్థ పడుతుంటే సెక్యూరిటీ గార్డులు మమ్మల్ని తీసుకెళ్లి మా గ్రూపు వద్దకు చేర్చారు. ఆ సాయంత్రం బస్సులో కూర్చునే నగర విహారం చేసాము. ఇతరుల మనోరంజనం కోసం పాటలు పాడే మా ఆయన ఆ సాయంత్రం తన మనోవాంఛితం మేరకు మహమ్మద్ రఫీ పాడిన 'యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్' పాట పాడి వినిపించాడు. అప్పటికే ఆయన్ని హీరో వర్షిప్ చేస్తున్న మా గ్యాంగ్ ఉత్సాహంతో ఊగిపోయారంటే నమ్మండి. ఆ విధంగా ఆయన చిరకాల వాంఛ తీరింది.

- డా. కొత్తింటి సునంద
94410 96231

Saturday, August 7, 2010

ఒక ఆంధ్రా ఫారెస్ట్ ఊటీ కంటే బాగుంటుంది

వానాకాలంలో శేషాచలం కొండలు మరింత అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి చూసి వచ్చాక మరోసారి వెళ్లకుండా ఉండలేనంత అందం వాటి సొంతం. ఈ ప్రాంతం తిరుపతికి దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి... అక్కడికి వెళ్లినప్పుడు 'పనిలో పనిగా'నైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. నిజానికి నేరుగా అక్కడికే టూర్ ప్లాన్ చేసుకునేంత సుందరమైన టూరిస్టు స్పాట్ శేషాచలం కొండలు.

పక్షుల పలకరింపులు, ఎత్తైన కొండలు, అబ్బురపరిచే జలపాతాలు... ఎటు చూసినా చిరుజల్లుకు ముసురుకుంటున్న పచ్చదనమే. కొండల మధ్య నడుస్తూ, సెలయేళ్లు దాటుకుంటూ చెట్లు, పొదలు తప్పించుకుంటూ అడుగు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో అందాలు కనిపిస్తాయక్కడ. ఈ కాలంలో పచ్చని గొడుగు పట్టుకుని ప్రకృతి ఒద్దికగా కూర్చున్నట్టు ఆ అడవుల్లో పచ్చదనమే కాదు ఎక్కడ చూసినా గుంటలన్నీ నీటితో నిండి జలకళ ఉట్టిపడుతుంటుంది.

అక్కడ మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మజెముడు పుష్పం ఎంత విశేషమో, రాతిబండలపై ఆదిమానవుడు గీశాడని భావించే పశువుల బొమ్మలు కూడా అంతే విశేషం. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ వాచర్స్ చూస్తూ ముందుకు పోతుంటే అక్కడక్కడ గిరిజనులు పశువుల కోసం వేసుకున్న పాకలు కనిపిస్తాయి. ఊటీని తలపించే లోయల్ని చూడటం, ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్ల మధ్య నుంచి నడవటం ఒక గొప్ప అనుభూతినిస్తుంది.

రైల్వేకోడూరు నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్తే... కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళగుట్టలు, మలిట్లకోన, పెద్ద కంజులు, చిన్న కంజులు, ముంతతువ్వ బండలు, జాలకోన, యానాది ఊట్ల, దొంగబండలు, ఊరగాయకుంట, కమ్మపెంట, కుందేలుపెంట, ఈతకాయ బండలు, కోటమారుకుంట, ఏనుగలబావి, స్వామి వారి పాదాలు, (ఆ పాదాలు కొలిచే వీలులేని ఎత్తులో అద్భుతంగా ఉంటాయి) కోతులకుప్ప, నెప్పోడిసెల, కందిరేవులు, మట్లకోన, సలీంద్రకోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. గుండాలకోనలో గుంజన జలపాతం, గాదెల అటవీ ప్రాంతంలో జాలకోన చూడటం ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

క్షేత్రాలయాలు

విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వై.కోట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయ ఉత్సవాలకు కొందరు వాహనాల్లో వెళ్తే, కొందరు కాలి నడకన వెళ్తుంటారు. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.

గుండాలకోన సెలయేరు పైభాగాన పసుపుగుండం, గిన్నిగుండం, అక్కదేవతల గుండం... ఇలా ఏడు గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత. గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సలీంద్ర కోన కూడా పర్యాటకులను ఆకట్టుకునేదే.

గలగల శబ్దాలతో ఒక అందమైన జలపాతం. దాని పక్కనే ఒక గుహ. అడవి మధ్యలోనున్న ఆ గుహలో కొలువుదీరిన తుంబుర స్వామి. చూడముచ్చటగా కనిపించే ఆ ప్రదేశమే తుంబురకోన క్షేత్రం. ఇక్కడ కూడా మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు.

ఔషధ మొక్కలు


ఈ అడవుల్లో ప్రధానంగా నాలుగు రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. అవి పెర్రీత, పసలోడి గడ్డ(గ్లోరియోసోసుపర్భా), ఫేమ్ లిల్లీ పూలు, ఎర్రచందనం చెట్లు. పెర్రీత, పసలోడి చెట్లకు ఏర్పడే గడ్డల నుంచి రసాన్ని తీసి ఎరువులు, పురుగుమందుల తయారీలో ఉపయోగిస్తారు. విషపూరితమైన ఈ గడ్డల్ని మనుషులు తింటే చనిపోతారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి మంచి గిరాకీ ఉందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఒక కిలో ఐదు వేల నుండి పది వేల రూపాయల వరకు ఉంటుంది. పెర్రీత పండ్లకు కిలో రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ధర ఉంటుంది.

సన్నని తీగలా పెద్ద చెట్లకు అల్లుకుపోయి ఎరుపు, పసుపుపచ్చరంగులు కలగలిపిన ఫేమ్‌లిల్లీ (గ్లోరియోసోసుపర్భా) పువ్వులు ఎక్కడున్నా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటి వాసనకు పది నిమిషాల్లో శరీరం మత్తెక్కిపోతుంది. వీటినీ మందుల తయారీలోనే ఉపయోగిస్తారు. ధర కిలోకు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ పూలకు కిలో యాభై వేల రూపాయలు ధర ఉంటుందని చెప్తారు. ఇవి అటవీ అధికారుల రక్షణలోనే పెరుగుతున్నాయి. ఈ పూలు కూడా మనుషులకు ప్రమాదమే.

ఇక్కడ ఎర్రచందనం వృక్షాలు కూడా ఎక్కువే. వాటితో తయారు చేసిన బొమ్మలు, గృహోపకరణాలను ఇంట్లో పెట్టుకోవటం 'స్టేటస్ సింబల్'గా భావిస్తారనేది తెలిసిన విషయమే. అంతేకాదు ఔషధ గుణాలు కలిగిన ఎర్రచందనం చెట్లను మందుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. చైనా, జపాన్, సింగపూర్, మలేషియా లాంటి విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి.

జలపాతాలు

బాలపల్లె అడవుల్లో ఉన్న గుంజన నది జలపాతం నయగరా జలపాతాన్ని గుర్తుకు తెస్తుందంటే అతియోశక్తి కాదేమో! అంత అందంగా కనిపిస్తుందది. బండల మీదుగా సుమారు 500 అడుగుల లోతుకు ప్రవహించే జలధార అద్భుతం. ఈ జలపాతం గురించి చాలామందికి తెలియకపోవటం దురదృష్టం. ఇది దట్టమైన అటవీ ప్రాం తంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల రాకపోకలకు ఎంతో ఇబ్బంది. అంతేకాదు ప్రమాదం కూడా. రహదారి సౌకర్యం ఉంటే దీనికి ఎంతో గుర్తింపు వచ్చేది. చెంచమ్మకోనలోని జలపాతం, సెలయేళ్లు కూడా ఎంతో హాయిని కలిగించేవే.

కొండెలెక్కుతున్నా, జారిపడుతూ సెలయేళ్లు దాటుతున్నా, ఇరుకుదారుల్లో నుంచి నడవాల్సి వచ్చినా ఆ కష్టమేదీ అనిపించదు. ఆ అడవి అందాలు చేసే మాయ అది. ఒక్కసారి సందర్శిస్తే చాలు... 'మళ్లీ ఓ సారి వచ్చిపో' అన్నట్టు ఆ ఆహ్లాదపు జ్ఞాపకాలు మనసులో తిష్ట వేసుకుంటాయి. పూర్తిగా ఒక కొత్త లోకంలో ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో మంచి నేస్తాన్ని వదిలివస్తున్న గాఢమైన అనుభూతికి లోనవ్వాల్సిందే ఎవరైనా.

టూరిస్టు స్పాట్‌గా చేయండి

'అరుదైన ఔషధ, అటవీ వృక్షాలతో పాటు శేషాచల అడవుల్లో ఏనుగుల మందలు, పొడదుప్పిలు, కొండగొర్రెలు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, చిరుతపులుల సంఖ్య ఎక్కువే. సింహాలకైతే కొదువలేదు. అంతేకాదు దేవంగ పిల్లి, బెట్లూడుత, బంగారు బల్లి లాంటి అరుదైన జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. కరక్కాయ, బిక్కి, ఈతపళ్ళు, నేరేడు పండ్లు, ఉసిరి, తంగేడు, చీమ ఉసిరి లాంటి ఫలాలు ఎంత విరివిగా దొరుకుతాయో కొండ వేపాకు, మోగి, తంబజారి వంటి ఔషధాలు కూడా అంతే విపరీతంగా దొరుకుతాయని' బాలపల్లె ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఎం. క్రిష్ణయ్య చెప్పారు.

'ఈ కొండల్లో అద్భుతమైన లోయలు, పురాతన దేవాలయాలు, సుందరమైన జలపాతాలు, విష్ణుగుండం, బ్రహ్మగుండం...లాంటి గుండాలు చాలానే ఉన్నాయి. ఇన్ని ప్రకృతి అందాల నడుమ ఈ అడవిలో రేంజర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని' రైల్వేకోడూరు రేంజర్ రామ్లానాయక్ చెప్పారు.

'ఎన్నో విశేషాలు కలిగిన ఈ అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఊటీని మరపిస్తుంది. అడవుల్లో దారులు ఏర్పాటు చేసి వాహన సౌకర్యం కల్పిస్తే పర్యాటకులకు, అభివృద్ధికి అనువుగా ఉంటుంది. అటవీ సిబ్బందిని గైడ్‌గా ఉపయోగించుకుంటే సందర్శకులకు పర్యటన మరింత సులువు అవుతుంద'ని రైల్వేకోడూరువాసి తాతంశెట్టి తులసి అన్నారు.
వీరందరి ఆలోచన ఒక్కటే శేషాచలకొండల్ని అటవీ ప్రాంతంగా మాత్రమే కాకుండా పర్యాటక ప్రాంతంగా చూడాలనేది. అధికారులు చొరవ తీసుకుంటే అది సాధ్యమే. అదే జరిగితే చల్లదనం కోసం ప్రశాంతత కోసం టూర్‌కు వెళ్లాలని అనుకునేవారు ఫస్టు ప్రిఫరెన్స్ ఈ ఊటీకే ఇవ్వొచ్చు.

- సుగవాసి రాజశేఖర్, రైల్వేకోడూరు

Thursday, August 5, 2010

కాకతీయుల కళా వైభవానికి ప్రతీక ... ఓరుగల్లు

kakatiya 
చుట్టూ పచ్చిక బయళ్లు... ఆపై జలజల పారే సెలయేళ్లు... దానికి మించి చారిత్రక ప్రాశస్థ్యం గల కళా సంపదకు ఆలవాలమైన వరంగల్‌ (ఓరుగల్లు) ప్రాంతం... ఎన్నో శిల్పకళాఖండాలు, పురావస్తు కట్టడాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను తన ఒడిలో నిక్షిప్తం చేసుకుని ప్రపంచ పర్యాటకులకు కనువిందు చేస్తూ విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం శిల్పకళా పోషణకు పెట్టింది పేరుగా ఉండేది. ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించడం కోసం శైవ దేవాలయాలను విరివిగా నెలకొల్పారు.తటాకాలు, చెరువులు, కుంటలు నిర్మించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఓరుగల్లు... కాకతీయుల కాలం నాటి అపూర్వమైన వారసత్వ సంపద, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవంతో అలరారుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఈ జిల్లా కాకతీయుల సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

రెండు శతాబ్దాల పాటు మహోజ్వలంగా వెలుగొందిన కాక తీయాంధ్ర సామ్రాజ్య రాజధాని నగరంగా చారి త్రక ఔన్నత్యానికి ఓరుగల్లు గీటురాయి. ఈ జిల్లా అనేక విశి ష్టతలకు నిలయం. మార్కోపోలో నుండి మహాత్మాగాంధీ వరకు ఎందరో మహనీయులు ఈ నగరాన్ని సందర్శించారు. ఈ ఐతిహా సిక నగరం తెలంగాణా ప్రాంగణానికి మకుటాయమానం. వరంగల్లు జిల్లా కు ఉత్త రాన కరీంనగర్‌, దక్షిణాన నల్గొండ, తూర్పున ఖమ్మం, పశ్చిమాన మెదక్‌ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఓరుగల్లు సముద్రమట్టానికి 90 అడుగుల ఎత్తులో ఉంది.

17 డిగ్రీల 19’ నుండి 19 డిగ్రీల 36’ ఉత్తర అక్షాం శాలకు, 78 డిగ్రీల 49’ నుండి 80 డిగ్రీల 43’ తూర్పు రేఖాంశాలకు మధ్య నెలకొని ఉంది. 2846 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ జిల్లా పారిశ్రామికంగా, వ్యవసా యికంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన వనరులు, అటవీ సంపద, ఖనిజ సంప ద పుష్కలంగా ఉన్నాయి. ఆనాటి కాకతీయ రాజులు తవ్వించిన అందమైన సరస్సులు ఇప్పటి కీ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. రామప్ప, లక్నవరం, పాకాల, గణపురం చెరువులు ఈ నాటికి జిల్లా వాసులకు సాగు, త్రాగు నీరును అందిస్తున్నాయి. ఈ జిల్లా పర్వత శ్రేణులు, దట్టమైన అరణ్యాలు, వాగులు, వంకలతో అలరారుతోంది.

కాకతీయుల కాలం నాటి సామాజిక జీవితం...
jatara కాకతీయుల కాలం ఒక స్వర్ణ యుగం. ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన స్థితిగతులు వారి ప్రాచీన కట్టడాలు, శిల్పకళా ఖం డాలు ఈ నాటికీ పర్యాటకులను ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. ఒక పక్క కత్తులు కదనరంగంలో కదం తొక్కితే మరో పక్క కవుల రచ నలు సాహితీ రంగంలో స్వేచ్ఛా విహారం చేశాయి. ఇంకో పక్క కళాకారులు, శిల్పులు తమ ప్రతిభా పాటవాలతో అచ్చెరువొందే చిత్ర విచిత్రాలెన్నో సృష్టిం చారు. సమత, మమ తలతో కూడిన సమైక్య జీవన సౌందర్యం ఇక్కడ పరిఢవిల్లింది. అంగ ళ్ళలో రతనాలను రాశులుగా పోసి అమ్మిన ఆ కాలంలో ప్రజలందరూ సుఖ సంతో షాలతో సహజీవనం సాగించారని చరిత్ర చెబుతోంది.

ఓరుగల్లు చారిత్రక ప్రాశస్త్యం...
తెలుగు తేజానికి, జాతి చైతన్యానికి ప్రతీకగా విలసిల్లిన వరంగల్లు జిల్లా... సుమారు వెయ్యేళ్ళ సుదీర్ఘ చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుంది. అనేక చారి త్రక కట్టడాలు, అపురూపమైన శిల్ప సంపదతో... పురావస్తు పరిశోధకులు, ప్రకృతి సౌందర్యోపాసకులు, కవులు, చరిత్ర కారులకు ఉత్సుకత రేకెత్తించే విహార భూమిగా పేరెన్నిక గన్నది.

temple-warఅడుగడుగునా ఆనాటి కాకతీయుల స్వర్ణయుగాన్ని ఈ జిల్లా స్ఫురణకు తెస్తుంది. మొదటి బేతరాజు, పశ్చిమ చాళుక్యుల సామంతుడుగా... క్రీ.శ. 1000 నుండి 1030 వరకు, అనం తరం ఆయన కుమారుడు ప్రోలరాజు 1108 నుండి 1116 వరకు, క్రీ.శ. 1158 నుండి 1195 వరకు రుద్రదేవుడు, క్రీ.శ. 1195 నుండి 1198 వరకు ఆయన సోదరుడు మహదేవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన రాణి రుద్రమదేవి, ఆమె దౌిహత పుత్రుడు ప్రతాప రుద్రుడు ఓరుగల్లులో శిల్ప కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలను పరిపుష్టం చేశారు.

తరగని శిల్పకళా సంపద...
కాకతీయ శిల్పం ఒక అద్భుత సృష్టికి సాక్షాత్కారం. ఇంతటి విశిష్టమైన కళా ఖండాలు భారతదేశంలో మరెక్కడా కానరావు. ఈ శిల్ప సంపదలో, నిర్మాణ వైఖరిలో ఏకత్వం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలలో వేటిని చూసినా ఇది కాకతీయులదే అని సులభంగా చెప్పగలిగే ప్రత్యేకత వీటిలో ప్రదర్శితమవుతుంది. అందుకే 11-13 శతాబ్దాల మధ్య కాలంలో ఒక ఉద్యమంగా వికసించిన ఈ కళ కాకతీయ శిల్పంగా గుర్తింపు పొంది వరంగల్లు జిల్లా అనేక సుప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలకు నిలయంగా మారింది. ఇక్కడి కట్టడాలు, సుందర ప్రదేశాలు, చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. ప్రాచీన కళాఖండాలు అబ్బురపరుస్తాయి.

శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం... వరంగల్‌ కోట...
తెలుగు వైభవాన్ని దశదిశలా రెపరెపలాడించిన కాకతీయుల రాజధాని నగరం ఓరుగల్లు. అప్పటి వైభవోపేత సామ్రాజ్యపు ఆనవాళ్లుగా మిగిలిన నేటి శిథిలాలలో దక్షిణ భారతదేశంలోనే అపురూపమైన వాస్తు శిల్పకళ దర్శనమిస్తోంది. ఇక్కడి అందమైన సరస్సులు, నిన్నటి చారిత్రక ప్రాభవా నికి నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట అనే మూడు పట్టణాల సంగమమే నేటి వరంగల్‌. కళలు, శిల్ప కళ, ప్రకృతి సోయగాల ఆరాధకులకు అద్భుతమైన కనువిందు ఓరుగల్లు.

చూడాల్సిన ప్రదేశాలు...
వరంగల్‌ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వరంగల్‌ కోట, ఖుష్‌మహల్‌, వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళీ దేవాలయం, కాజీపేట దర్గా, ఫాతిమా చర్చ్‌, మెట్టుగుట్ట రామలిం గేశ్వర స్వామి దేవాలయం, జూపార్క్‌ తదితర ప్రదేశాలున్నాయి. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు, ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి నిర్మించిన ఈ శత్రు దుర్భేధ్యమైన కోట... అందంగా తీర్చిదిద్దిన కమాన్‌లతో విరాజిల్లుతోంది.

temple-front19 కిలోమీ టర్ల పరిధిలో ఉన్న ఈ కోటలో 45 బురుజులు, స్తంభాలున్నాయి. చుట్టూ మూడు కోటల మధ్య విస్తరించిన ఈ కోట మధ్యభాగంలో భూదేవి ఆలయం, స్వయం భూదేవి ఆలయం ఉన్నాయి.హైదరాబాద్‌ నగరానికి చార్‌మినార్‌ వలె వరంగల్‌ పట్టణానికీ, కాకతీయ సామ్రాజ్యానికీ ప్రతీకగా కోట సింహద్వాంం ఏకశిల నెలకొని ఉంది.

ఈ కోటను పురావస్తుశాఖ నూతన ఒరవడులతో పునర్నిర్మించింది. కాకతీయుల కాలంలో నిర్మించిన శిల్ప సంపద శిథిలా వస్థకు చేరుకోగా దాన్ని కాపాడడంలో భాగంగా కొటలోని సింహ ద్వారాన్ని పునరుద్ధరించి నాటి శిల్పాలను నూతన పద్ధతిలో అమర్చారు. వరంగల్‌, హన్మకొండ పట్టణాలను కలుపుతూ 19 కిలోమిటర్ల మేర ఈ కోట విస్తరించి ఉంది. శత్రుదుర్భేద్యమైన ఏడు ప్రాకారా లు కలిగిన మట్టికోట, రాతికో టలతో కూడిన వరంగల్‌ ఖిల్లా శిల్పకళల కాణాచిగా అలరారుతోంది. ఇక్కడ ఎటు చూసినా 20 కిలోమీటర్ల వరకు పరిసరా లు కనిపిస్తాయి. దీనిపై సైనికులు అప్రమ త్తంగా ఉండి శత్రువుల రాకను పసిగ ట్టేవారట. ప్రపంచ తెలుగు మహా సభలు మొదలుకొని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే పలు ఉత్సవాలకు కాకతీయ కళా తోరణాన్ని లోగోగా వాడడం విశేషం.

ఖుష్‌మహల్‌...
temple గత వైభవానికి సాక్షిగా సితాబ్‌ఖాన్‌ నిర్మించిన అపురూప కళాఖండం ఖుష్‌ మహల్‌. ఇది వరంగల్‌ కోటకు దగ్గరలో ఉంది. పరిసర ప్రాంతాల నుండి వెలికి తీసిన విగ్రహాలు, ఆనాడు యుద్ధంలో వాడిన పరికరాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రకృతి అందాల్లో దిట్ట మెట్టుగుట్ట...
కైలాసాన శివుడు కొలువుదీరి ఉన్న సమయంలో మునుల కోరిక మేరకు సిద్ధేశ్వ రునిగా వెలిసెదనని అభయమిస్తూ... మడి కొండలోని గుట్టపై శివుడు వెలి శాడని చరిత్ర చెబుతోంది. మెట్టు గుట్టపై శివుడు వెలిసినందునే ఈ గుట్టను మెట్టుగుట్ట అని, మెట్టు రామప్ప అని, దక్షిణ కాశీ అని పిలు స్తున్నారు. సుమారు 55 ఎకరాల విస్తీర్ణం, రెండు ఎతె్తైన శిఖరాలు, 50 అడుగుల ఎత్తులో ఉండి చూపరులను ఇట్టే ఆకట్టు కుంటున్నాయి. మెట్టుపై పాలగుండం, జీగి గుండం, వామ గుండం, బ్రహ్మ గుండం, కన్ను గుండం, ఇలా నవగుండాలు నేటికీ దర్శన మిస్తాయి. ఒకదానిపై ఒకటి పేర్చినట్లు
ఉండే గుండ్రని పెద్ద బండరాళ్ళు మెట్టుగుట్టపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భీముడు, హిడింబి ప్రేమించుకొని విహరిం చారని అందుకే దీన్ని హిడింబాశ్రమం అని పిలుస్తున్నా రని ప్రతీతి.

భద్రకాళి దేవస్థానం...
వరంగల్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న భద్రకాళీ చెరువు కట్టను ఆనుకొని శ్రీ భద్రకాళి- భద్రేశ్వ రుల దేవాలయం ఉంది. భద్రకాళీ తటాకం నగర ప్రజల దాహార్తిని తీరుస్తుండగా... శ్రీ భద్రకాళీ
మాత భక్తుల పాలిట ఇలవేల్పుగా కోరిన వారికి కొంగు బంగార మై కోటి వరాలిచ్చే వరప్రదాయినీగా భాసిల్లుతోంది. ఈ చారిత్రక ఆలయాన్ని దర్శించడానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం వందలాది మంది భక్తులు వస్తారు. ఎతె్తైన కొండపై నిలిచిన అమ్మవారు, సుందరమైన ప్రకృతి రమణీయత, మరోవైపు తటాకంతో కలిసి ఉండి ఈ దేవాలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంది.

ఈ దేవతను పూర్వం ఆంజనేయుడు పూజించాడనీ, భద్రములు ఇవ్వడం వల్ల భద్రకాళి అనే పేరు వచ్చిందని చెబుతారు. కాల ప్రభావంలో ఈ దివ్యక్షేత్రం కొంతకాలం మరుగున పడింది. చాళుక్య చక్రవర్తి కాలంలో భద్రకాళి ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు న్నాయి. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రా న్ని అభివృద్ధి చేసి ఆరాధించారు. 1950 లో నూతన దేవాలయాన్ని నిర్మించారు. గర్భాలయం, ముఖ మండపం ఇందులో ఉన్నాయి.

warngal-hallonsసుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయుడు, శివ పార్వతులు ఉన్నారు. శివలింగాన్ని తర్వాత ప్రతిష్టించారు. భద్రకాళీ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా భక్తులతో కిటకిట లాడుతూ అభివృద్ధి చెందుతోంది. విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన అమ్మవారిలాగానే ఇక్కడ భద్రకాళీ అమ్మవారు భక్తుల పూజలను అందు కుంటోంది. పేరుకు భద్రకాళి అయినా శాంతరూపంలోనే భక్తులకు దర్శనమిచ్చి అభయాన్ని, రక్షణ ను ఇస్తోంది. ఈ అమ్మవారి వద్ద ఏ కోరిక కోరినా ఫలిస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కాకతీయుల కాలం నాటి శిల్పకళావైభవమే కాకుండా వరంగల్‌ నగరం కూడా దానికి తగిన రీతిలో పర్యాటక రంగంలో అభివృద్ధి సాధిస్తోంది. గత రెండు దశాబ్ధాల కాలంలో వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ఎంతో అభివృద్ధిని సాధించాయి. తెలంగాణ జిల్లాలకే విద్యాకేంద్రంగా వెలుగొందుతోంది వరంగల్‌ నగరం. కాకతీయ విశ్వవిద్యాలయం, కాకతీయ మెడికల్‌ కాలేజి, భారతదేశంలోనే ఎంతో గుర్తింపు సాధించిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (ఎన్‌.ఐ.టి)లు ఎందరో ప్రతిభావం తులను అందిస్తున్నాయి. చారిత్రక ప్రాశస్త్యంతో పాటు, ఆధునికరంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతున్న వరంగల్‌ మున్ముందు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

tempఆనాటి కాకతీయ రాజులు తవ్వించిన అందమైన సరస్సులు ఇప్పటికీ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి.రామప్ప, లక్నవరం, పాకాల, గణపురం చెరువులు ఈ నాటికి జిల్లా వాసులకు సాగు, త్రాగు నీరును అందిస్తున్నాయి.గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క-సారక్క ఉత్సవాలు జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతాయి. జిల్లాలోని మేడారంలో జరిగే ఈ వేడుకలకు తెలంగాణ జిల్లాల నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు ఓరుగల్లుకు మరింత శోభను చేకూర్చుతున్నాయి.

ఇలా వెళ్లాలి...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి 135 కి.మీ. దూరంలో ఉన్న ఓరుగల్లు జిల్లా (వరంగల్‌)లో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశాలు, మనస్సును దోచే ప్రకృతి అందాలు అబ్బురపరిచే శిల్ప కళా సంపదను చూడాలంటే రైలు, రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. హైదరాబాద్‌ నుండి కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ నగరాలకి చేరుకోవడానికి గంటగంటకి బస్సు సౌకర్యం ఉంది. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరు, చెనై్న నగరాల నుండి కాజీపేట్‌, వరంగల్‌ల మీదుగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్‌ప్రెస్‌ రైళ్ళు, ప్యాసింజర్‌ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్‌.

వేయిస్తంభాల గుడి... శిల్ప కళకు ఒడి...
statues కాకతీయుల కాలంలో నిర్మించిన వేయి స్తంభాల దేవాలయం, నేటికీ శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది.పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ అలరి స్తోంది. హన్మకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం నేటికీ దేశ విదేశా లకు చెందిన పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కాకతీయుల శిల్ప, సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ నిత్యం వందలాది మంది భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. వీటికి తోడు ఈ దేవాల యం... సినిమా చిత్రీకరణకు సెంటిమెంట్‌గా మారడంతో ఈ మధ్య కాలం లో షూటింగ్‌లతో కళకళలాడుతోంది. కాకతీయుల వాస్తు నిర్మాణ శైలి, కళా విశిష్టతకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ దేవాలయాన్ని నిర్మించి తొమ్మిది శతాబ్దాలయినా నేటికీ సజీవ కళతో ముచ్చట గొలుపుతూ అలరిస్తోంది. క్రీ.శ.1158 నుండి 1195 వరకు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన రుద్రదేవుడు దీన్ని నిర్మించాడు. స్వతంత్ర రాజ్యస్థాపనకు చిహ్నంగా తనతో రుద్రేశ్వరుడిని, వాసుదేవుడిని, సూర్యదేవుడిని హన్మకొండలో ప్రతిష్టించి ఈ త్రికూటాలయాన్ని వేయి స్థంభాల మండపంతో సుందరంగా నిర్మించాడు. దీనికి తూర్పు దిశలో శివాలయ ద్వారానికి ఎదురుగా సూర్య దేవుని విగ్రహం, దక్షిణ ముఖంగా వాసుదేవుని విగ్రహం ఉంటాయి. రుద్రేశ్వ రాలయ ముఖ ద్వారంపై మనోహరమైన తోరణ శిల్పమున్నది.

canel-boatవీటితో పాటు నర్తించే శిల్పాలు, రంగ మండప స్తంభాలు, లోపలి కప్పు, ఆలయ రాతి గోడ, మందు భాగంలో నంది, త్రికూటాలయాల మధ్యనున్న నల్లరాతి చెక్కడాలు, వలయాకార దర్పణంలా కనబడుతాయి. దానిపై పడిన సూర్య కాంతి గర్భగుడిలో వెలుగును నింపుతుంది. రుద్రేశ్వర స్వామి (వేయి స్థంభాల) దేవాలయం నిత్య పూజాదులతో శోభిల్లుతోంది.

నిత్యార్చనలు, అభిషేకాలు, ఏడాది కాలంలో సంప్రదాయ పర్వదినాలైన కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి, శనిత్రయోదశి, వినాయక నవరాత్రి ఉత్సవాలు, శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.హైదరాబాద్‌ నగరానికి చార్‌మినార్‌ వలె వరంగల్‌ పట్టణానికీ, కాకతీయ సామ్రాజ్యానికీ ప్రతీకగా కోట సింహద్వాంం ఏకశిల నెలకొని ఉంది. ఈ కోటను పురావస్తుశాఖ నూతన ఒరవడులతో పునర్నిర్మించింది. కాకతీయుల కాలంలో నిర్మించిన శిల్ప సంపద శిథిలా వస్థకు చేరుకోగా దాన్ని కాపాడడంలో భాగంగా కొటలోని సింహ ద్వారాన్ని పునరుద్ధరించి నాటి శిల్పాలను నూతన పద్ధతిలో అమర్చారు.
- మాదిరాజు రాజేశ్వర్‌రావు,వరంగల్‌

Sunday, August 1, 2010

టర్కీ - మూడు నగరాలు... ముప్పేట మర్యాదలు

మూడు నగరాలు... ముప్పేట మర్యాదలు

రెండు ఖండాలు... ఒక నగరం... దాని మధ్యలో బాస్పరస్ జలసంధి. రెండు సముద్రాలను కలిపే జలమార్గం. బైబిల్‌లోని నోవా కథకి పుట్టినిల్లు. అక్కడ పడవలో విహరిస్తుంటే ఓ టర్కీ మ్యూజిక్ ఛానల్‌వారు మా బృందంతో ఆవారా పాట పాడించుకున్నారు. హిందుస్థాన్ వాళ్లెవరు కనిపించినా అప్రయత్నంగా ఆవారా హూ... పాటను హమ్ చేస్తారు టర్కీవాసులు. ఆవారా తర్వాత హిందీ సినిమాలేమీ అక్కడకి వెళ్లినట్టు లేవు చూడబోతే.

In Dialogue సంస్థ ఆహ్వానంపై హైదరాబాద్ నుండి 13 మందిమి మే నెలలో టర్కీ వెళ్లాం. ఇది టర్కీ-ఇండియాల మధ్య ప్రజాసంబంధాల మెరుగుకు కృషి చేసే సంస్థ. ఆహ్వానితుల్లో అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్ర రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, చరిత్రకారుడు అయిన నరేంద్ర లూథర్, కొంతమంది యూనివర్శిటీ అధ్యాపకులు, సోషల్ వర్కర్లు ఉన్నారు. అధ్యాపకుల్లో నేనూ ఒకడిని. మే 24 ఉదయం హైదరాబాద్‌లో విమానమెక్కి సాయంత్రానికల్లా మా మొదటి మజిలీ ఇస్తాంబుల్ చేరుకున్నాం. హైదరాబాద్ నుండి దుబాయ్‌కి మూడు గంటల ప్రయాణం. అక్కడి నుండి ఇస్తాంబుల్‌కి మరో నాలుగు గంటలు. ఈ యాత్రలో ఫ్లయిట్ టికెట్ మేమే పెట్టుకున్నాం. టర్కీలో ఉన్న ఏడు రోజుల ఖర్చులు మాత్రం ఇన్‌డయలాగ్ వాళ్లే పెట్టుకున్నారు. అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించారు. మొదటి మూడు రోజులు ఇస్తాంబుల్‌లోను, ఒకరోజు కొన్యాలోను గడిపి చివరి రెండు రోజులు అంకారా దర్శించాం.

పర్యాటక స్థలాలే కాకుండా చారిత్రాత్మక ప్రదేశాలు కూడా చూసేలా ఏర్పాట్లు చేశారు. స్కూల్ టీచర్లతోను, పిల్లలతోను మాట్లా డాం. పత్రికలు, టి.వి. ఆఫీసులు సందర్శించి జర్నలిస్టులతో చాలా విషయాలు చర్చించాం. అంతే కాదు, టర్కీ కుటుంబాలతో భోజనాలు, ఆ దేశ పార్లమెంట్ డిప్యుటీ స్పీకర్ ఇంట్లో విందు... వీటన్నిటితో ఎంతో ఆసక్తికరంగా సాగింది మా యాత్ర. ఇస్తాంబుల్ లోని 'రైటర్స్ అండ్ జర్నలిస్ట్స్ ఫౌండేషన్' ఏర్పాటు చేసిన సమావేశంలో నేను భారతదేశంలో మీడియా వ్యవస్థపై ప్రజెంటేషన్ కూడా చేశాను.

అతిప్రాచీన నగరం

ఇస్తాంబుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ నగరానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాని పూర్వ నామధేయం కాన్‌స్టాంటినోపుల్. రోమన్, బైజాంటైన్, ఒట్టోమన్ సామ్రాజ్యాలకి రాజధానిగా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత, అంటే క్రీ.శ. 1453 వ సంవత్సరంలో తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని ఆక్రమించుకొన్నప్పటి నుండి అది ఇస్తాంబుల్‌గా ప్రసిద్ధికెక్కింది.

ఇప్పటి ఇస్తాంబుల్ ఆధునిక నగరం. కోటి యాభైలక్షల జనాభాతో ప్రపంచంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా పేరొందింది. అంత పెద్ద నగరమంటే ఇరుకు రోడ్లు, వీధులు సాధారణమే అని మనకు అనిపించవచ్చు... కాని ఇస్తాంబుల్ ఎక్కడా ఇరుకుగా అనిపించదు. చక్కటి 8 లేన్, 6 లేన్ రోడ్లు, ఫ్లయ్ఓవర్లతో విశాలంగా ఉంటుంది. మెట్రో రైల్వే వ్యవస్థ, బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లతో నగరంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇంకో విషయం... ఇస్తాంబుల్ సిటీలో నీటి కోసం బోర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. నగరం చుట్టూ 15 డాములు కట్టి పైపుల ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేస్తున్నారు. హీటింగ్ సిస్టమ్‌కి, వంట చేసుకోడానికి ఆ నీళ్లే వాడతారు. నీళ్లే కాదు, ప్రతి ఇంటికి గ్యాస్ కూడా పైప్‌లైన్ ద్వారానే సప్లయ్ చేస్తున్నారు. ఒక్క ఇస్తాంబుల్ లోనే కాకుండా టర్కీలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ పైపుల ద్వారా గ్యాస్ సప్లయ్ చేస్తున్నారని విన్నపుడు మరి మనకు కెజి (కృష్ణా గోదావరి) బేసిన్ గ్యాస్ ఎప్పుడు వస్తుందో అనిపించింది.

చర్చి మసీదై ఇప్పుడు మ్యూజియమైంది

ఇస్తాంబుల్‌లో మేము సెమాన్యోలు టి.వి. ఆఫీస్, హజియా సోఫియా మ్యూజియం, బ్లూ మాస్క్ (బ్లూ మసీదు) బాస్పరస్ జలసం«ధి, గ్రాండ్ బజార్, టోప్ కపి సరాయిలను సందర్శించాం. వీటన్నిటిలో హజియా సోఫియాది గొప్ప చరిత్ర. ఇది క్రీ.శ. 360లో రోమన్లు నిర్మించిన చర్చి. అప్పటి నుండి వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా విలసిల్లింది. 1453లో సుల్తాన్ మహ్మద్-ఐఐ ఆధ్వర్యంలో తురుష్కులు కాన్స్‌టాంటినోపుల్‌ని ఆక్రమించుకుని ఇస్తాంబుల్‌గా పేరు మార్చారు. అప్పటి నుండి 1934 దాకా హజియా సోఫియా మసీదుగా ఉంది.

1922లో ముస్తాఫా కమల్ పాషా అధికారంలోకి వచ్చారు. వెంటనే సంస్కరణలు మొదలుపెట్టారు. టర్కీ భాషకు అరబిక్ స్క్రిప్ట్‌కి బదులు ఇంగ్లీషు స్క్రిప్ట్‌ని వాడడం ఆ సంస్కరణల్లో ఒకటి. సెక్యులర్ భావజాలం గల ఆయన ఆ సంస్కరణల్లో భాగంగానే 1934లో హజియా సోఫియాని మ్యూజియంగా మార్చాడు. అప్పటినుండి ఇప్పటివరకు అది మ్యూజియంగానే ఉంది. అలాగే మన దేశంలోనూ బాబ్రీ మసీదు-రామజన్మభూమిని మ్యూజియంగా, జాతి సంపదగా మార్చే ఆలోచన చేయొచ్చేమో.

రూమీ స్మృతులు, డెర్విష్ డాన్స్‌లు..

కొన్యా మా రెండవ మజిలీ. ఆ పేరు చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే కొన్యా అనగానే సుప్రసిద్ధ సూఫీ కవి మౌలానా జలాలుద్దీన్ రూమీ గుర్తొస్తాడు. అలాగే డెర్విష్‌లు చేసే సూఫీ నృత్యం గుర్తుకొస్తుంది. 'జోదా అక్బర్' సినిమాలో 'ఖ్వాజా మేరే ఖ్వాజా' పాటలో డెర్విష్‌ల నృత్యం ఎంత పాపులర్ అయిందో మనకి తెలుసు. ఇన్‌డయలాగ్ సంస్థ వారు రెండేళ్ల క్రితం టర్కీ నుంచి డెర్విష్‌లను రప్పించి తారామతి బరాదరీలో నృత్య కార్యక్రమం కూడా నిర్వహించారు.

భగవంతుని పట్ల ప్రేమని, మానవత్వాన్ని, పరమత సహనాన్ని ప్రవచించే సూఫీ సంగీతానికి వైతాళికుడైన రూమి పుట్టిన ప్రదేశాన్ని, ఆయన సమాధిని సందర్శించుకోవడం చాలా ఆనందం కలిగించింది. కొన్యాలోని టర్కీ వ్యాపార సంఘం స్థానిక కేంద్రంలో బ్రేక్‌ఫాస్ట్ చేసాం. ఒక వ్యాపారవేత్త కుటుంబంతో కలిసి భోజనం కూడా చేసాం. తర్వాత ఒక హైస్కూల్‌కి వెళ్లి విద్యార్థులతో టీచర్లతో కాసేపు ముచ్చటించాం. అదే రోజు రాత్రి అంకారా ప్రయాణమయ్యాం.

అటాటుర్క్ మ్యూజియంలో...

అంకారా టర్కీ రాజధాని. 60 లక్షల జనాభాతో ఎన్నో ఇండస్ట్రీలతో కళకళలాడే నగరం. అంకారాలో మూడు రాత్రులు, రెండు పగళ్లు బస చేసాం. అటాటుర్క్ మౌసోలియం, మ్యూజియం ఆఫ్ అనటోలియన్ సివిలైజేషన్స్, కోజా టోపే మసీదు, అంకారాలోనే అతిపెద్దదైన అంకా మాల్‌లను సందర్శించాం.

అటాటుర్క్ మౌసోలియంకి వెళ్లినపుడు ఆధునిక టర్కీ నిర్మాత అయిన కమల్‌పాషా చేసిన యుద్ధాలు, సాహసాలు, ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులను గురించి మా గైడ్ చెబుతూ ఉంటే కమల్ పాషా గొప్పదనాన్ని కీర్తించకుండా ఉండలేకపోయాం. మౌసోలియం లోని సావనీర్ షాప్‌లో అటాటుర్క్ రాసిన 'గ్రేట్ స్పీచ్' పుస్తకం కొనుక్కొన్నాను. 'మ్యూజియం ఆఫ్ అనటోలియన్ సివిలైజేషన్'లో రాతియుగం నుంచి హిట్టైట్లు, గ్రీకులు, రోమన్లు, ఒట్టోమన్ల వరకు అందరి గురించి విపులంగా ఎగ్జిబిట్స్‌ని ఉంచారు. అందుకే అంకారా వెళ్లిన వాళ్లు ఈ మ్యూజియంని తప్పకుండా సందర్శించాలి.

అంకారా నుండి తిరిగి ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి ఇండియా తిరుగు ప్రయాణం అయ్యాం. మా టర్కీ యాత్రలో అన్నిటిలోకి నా మనసును దోచుకొన్నది టర్కీ కుటుంబాల ఆత్మీయత, ఆతిథ్యం. ప్రతిరోజూ ఒక్క పూటయినా ఒక టర్కీ కుటుంబంతో కలిసి భోజనం చేశాం. వారి మర్యాదలు, గెస్టులను రిసీవ్ చేసుకొనే తీరు, గౌరవించే విధానం మరచిపోలేను. అందుకే ఇండియాలో వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వమని కోరాం.

ఆలివ్ పికిల్, చెర్రీ జామ్...

టర్కీ సందర్శించాలనుకునే వారు అక్కడ ఆహారం ఎలా ఉంటుందో అని చింతపడనవసరం లేదు. అద్భుతమైన సలాడ్‌లు, బాయిల్డ్, ఫ్రయిడ్, పికిల్డ్ వెజిటబుల్స్ అన్నీ అక్కడి ప్రజల భోజనంలో భాగమే. వెజిటేరియన్లమని చెప్పుకునే వారికన్నా ఎక్కువగా కూరగాయలు తింటారు ఆ దేశ ప్రజలు. ఆ మాటకొస్తే మధ్యధరా తీరప్రాంత వంటకాలలో వెజిటబుల్స్‌ది ఎప్పుడూ అగ్రస్థానమే. కొద్ది మొత్తంలో చికెన్, మటన్ లేదా బీఫ్ భోజనంతో పాటు తీసుకోవడం టర్కీలో పరిపాటి. పలావ్ కూడా తింటారు. టర్కీలో ఆలివ్‌లు, పిస్తా, చెర్రీలు, ఆప్రికాట్‌లు, హేజల్‌నట్‌లు విస్తారంగా పండుతాయి కాబట్టి వీటన్నిటినీ వంటకాల్లో విరివిగా వాడతారు. ఆలివ్ పికిల్, చెర్రీజామ్, ఆఫ్రికాట్ జామ్‌లను చాలా టేస్టీగా తయారుచేస్తారు.

టర్కీ వాసుల భోజనంలో టీ తప్పనిసరి. మనలా టీలో పాలు కలుపుకోరక్కడ. బ్లాక్ టీ తాగుతారు. అది కూడా చాలా చిక్కగా ఘాటుగా ఉంటుంది. నల్లసముద్రం తీర ప్రాంతంలో పండే ఘాటురకమైన టీనే వీరు ఇష్టపడతారు. అంత ఘాటు టీ మనం తాగలేం కాబట్టి వేడి నీటితో డైల్యూట్ చేసుకోవచ్చు. టర్కీ వెళ్లి రావడానికి దాదాపు 30 నుండి 35 వేలు ఖర్చు అవుతుంది. ఇస్తాంబుల్‌లో బస ఖరీదు కాస్త ఎక్కువే. బడ్జెట్ హోటల్‌లో డబుల్ బెడ్‌రూమ్‌కి అద్దె రోజుకి 2000 నుండి 5000 వరకు ఉంటుంది.

- డా. ఇ. సత్యప్రకాష్
(వ్యాస రచయిత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్)