విహారాలు

India

Gamyam

Monday, May 30, 2011

ఒక దివ్య చారిత్రక ప్రకృతి.. సలేశ్వరం

సాధారణంగా ఒక టూర్‌లో దేవాలయాలను గాని, చారిత్రక ప్రదేశాలను గాని, ప్రకృతి రమణీయ ప్రదేశాలను గాని ఏదో ఒకటే చూస్తాం. కాని ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉండే అరుదైన ప్రదేశాల్లో ఒకటి మన రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవుల్లో ఉంది. పేరు సలేశ్వరం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేమార్గంలో 150 కిలోమీటర్ల మైలు రాయి దగ్గర ఫరహాబాద్ గేటు ఉంటుంది. అక్కడి నుండి 32 కి.మీ. దట్టమైన అడవుల్లోకి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌వారి అనుమతితో వెళ్లొచ్చు. 10 కి.మీ. వెళ్ళగానే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిథిల భవనాలు కనిపిస్తాయి.

నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు, చల్లదనానికి ముగ్దుడై వందేళ్ళకు ముందే అక్కడ వేసవి విడిదిని నిర్మించుకొన్నాడు. అందుకే ఆ ప్రదేశానికి ఫరహాబాద్, అంటే అందమైన ప్రదేశం అని పేరొచ్చింది. అంతకు ముందు దాని పేరు పుల్లచెలిమల (పులుల చెలిమలు). ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. 'టైగర్ సఫారీ' పేరిట ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే జంతువులను, పులులను చూపిస్తారు.

నిజాం విడిది (రాంపూర్ చెంచుపెంట) చౌరస్తా నుంచి ఎడమకు తిరిగి 22 కి.మీ. వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్‌క్యాంప్ వస్తుంది. అక్కడ వాహనాలు ఆపుకోవాలి. అక్కడనుండి సలేశ్వరం అనే జలధార (వాటర్‌ఫాల్స్)ను చేరుకోవడానికి 2 కి.మీ నడవాలి. రెండు పొడవైన, ఎత్తైన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయక్కడ. ఆ గుట్టల మధ్య ఒక లోతైన లోయ (సుమారు అర కి.మీ.)లోకి ఈ జలధార దుముకుతుంది. తూర్పువైపున్న గుట్టను అమాంతంగా అర కిలోమీటరు దిగి (పశ్చిమం వైపుకి) తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమపు గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొసను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. అలా దిగేటప్పుడు మనలని ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలి పడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి.

సలేశ్వరం జలధార: కుండం ఒక ఫర్లాంగు దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడి నుండి కుండం నుండి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒకచోటయితే కేవలం బెత్తెడు దారి మీద నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడ జారితే భక్తుడు శివైక్యం చెందవలసిందే. కుండం (గుండం) చేరిన తరువాత అత్యంత అద్భుతమైన దృశ్యం మనకు దర్శనమిస్తుంది. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార కుండంలోకి దుముకుతుంది. కుండం దగ్గర నిలబడి పూర్తిగా తల ఎత్తి పైకి చూస్తే రెండు గుట్టలు ఒక నిజమైన పెద్ద కుండగా ఏర్పడినట్లు, ఆ కుండ మూతి నుండి ఆకాశం, సూర్యకిరణాలు లీలగా కనిపిస్తున్నట్లు తోస్తుంది.

జలధార కింద నేను, నా మిత్రుడు రామారావు స్నానం చేశాం. ఆ నీటి చల్లదనానికి ఒళ్ళు పులకించిపోయింది. దోసిళ్ళతో కడుపు నిండా నీళ్ళు తాగాం. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం వల్లనేమో ఆ రోజంతా మాకు ఆకలే కాలేదు. జలధార కింద కుండం, కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకొని రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. ఆ స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. స్వామికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కొద్దిగా దక్షిణంగా నడిచి కింది గుహలోకి వెళ్ళాం. ఈ గుహలో కూడా శివలింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి.

జాతర ప్రత్యేకత


సలేశ్వరం జాతర సంవత్సరానికొకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి, నీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. స్థానికులు కొందరు అరుదైన వనమూలికలను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. భక్తులు దారి పొడవునా 'అత్తన్నం అత్తన్నం లింగమయ్యో', 'పోతున్నం పోతున్నం లింగమయ్యో' అని అరుస్తూ నడుస్తుంటారు.

చారిత్రక ఆనవాళ్లు


నాగార్జునకొండలో బయటపడిన ఇక్ష్వాకుల నాటి (క్రీ.శ. 220 - క్రీ.శ. 360) శాసనాలలో 'చుళ ధమ్మగిరి' గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై ఆనాడు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువుల కోసం ఆరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ ధమ్మగిరి ఈ సలేశ్వరమేనేమోననిపిస్తుంది. కారణం అక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16" x 10" x 3" (పొడవు x వెడల్పు x ఎత్తు) అంగుళాలుగా ఉంది. ఇలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనే ఉండేది. 'చుళ' తెలుగులో 'సుల' అవుతుంది కాబట్టి బౌద్ధ క్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరం (లేదా శూలేశ్వరం) గాను, చివరిగా సలేశ్వరంగానూ మారి ఉంటుందనిపిస్తుంది.

ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా విష్ణుకుండినుల (క్రీ.శ. 360-క్రీ.శ. 570) కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణం 10" x 10" x 3" అంగుళాలుగా ఉంటుంది. దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినుల చిహ్నమగు 'పూలకుండి' శిలాఫలకం ఉంది. (అయితే అలాంటి కుండ శాతవాహనులకు, ఇక్ష్వాకులకు కూడా చిహ్నంగా ఉండేది.) ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం ఉంది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తుగల నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలతో ఉంది. కుడి చేతుల్లో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో డమరుకం, మరో ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉంది.

వీరభద్రుని కింద కుడివైపున పబ్బతి పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ ఉండగా, ఎడమవైపున స్త్రీ మూర్తి (?) ఉంది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలు(?) ఉన్నాయి. ఇవే పాతవిగా తోస్తున్నాయి. ఆ విగ్రహాల ముందర ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించే విసురు రాయి ఉంది. గుడికి ఎడమ వైపున గల రాతి గోడకి బ్రాహ్మీలిపిలో ఒక శాసనం చెక్కబడి ఉంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం ఉంది. ఈ రెండూ విష్ణుకుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్రకారులు చదివితే విష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చుననిపిస్తోంది.

'స్థల మహాత్మ్యం' అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్రమహాత్మ్య కావ్యంలో దీన్ని (సలేశ్వరం) రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా, పశ్చిమాన గల లొద్దిని (గుండం) బ్రహ్మకుండంగా పేర్కొన్నారు. విష్ణుకుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి నిరూపించారు కూడా.

క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి 'మల్లికార్జున పండితారాధ్య చరిత్ర'లో 'శ్రీ పర్వత క్షేత్ర మహాత్మ్యం'లో కూడా ఈ సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు విశేషంగా వర్ణించాడు. 17వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర చెపుతోంది.

ప్రకృతి రమణీయత


భారతదేశంలోని అడవుల్లో నల్లమల అడవులు రెండవ పెద్ద అడవులుగా పేర్గాంచాయి. ఈ అడవులు హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో 130 కి.మీ. తరువాత మన్ననూరులో ప్రారంభమవుతాయి. సముద్ర మట్టానికి సుమారు కి.మీ. ఎత్తున ఏర్పడడం వలన ఈ అటవీ ప్రదేశం చల్లగా ఉంటుంది. సలేశ్వరం దగ్గర్లోనే భూమి-గుట్టల సంగమ ప్రాంతం (వ్యూపాయింట్) ఉండటం వలన చల్లగాలులు వీస్తూ అలరిస్తాయి. ఇదే ప్రాంతంలో 'పులుల చెలిమలు' (పులులు నీరు తాగే కుంటలు) కూడా ఉండటం వలన గాలిలో చల్లదనం ఎక్కువ అవుతుంది. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు మనల్ని దారిపొడవునా అలరిస్తాయి.

సలేశ్వరం లోయ సుమారు రెండు కి.మీ. పొడవుండి మనకు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్‌ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కాన్యన్ అందాలను చాలామంది మెకనెస్‌గోల్డ్ సినిమాలో చూసి ఉంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులున్నాయి. అవి జంతువులు నీటికోసం వెళ్ళే మార్గాలని స్థానిక గిరిజనుడు చెప్పాడు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆదిమ మానవులకు, ఆ తరువాత బౌద్ధ భిక్షువులకు, మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలే చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆదిమ మానవుల ఆనవాళ్ళైన చెంచులు అక్కడ జీవిస్తున్నారు.

అడవిలో ట్రాఫిక్ జామ్


సలేశ్వరం జాతరకు ఇంతకు ముందు స్థానిక ప్రాంతాలవారే పోయేవారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు రావడంతో అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ సంవత్సరమైతే రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది ఈ జాతరను వీక్షించారని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దాంతో లింగమయ్య దర్శనానికి పర్యాటకులు గంటల తరబడి క్యూలో నిల్చోవలసి వచ్చింది.

ఇంతకు ముందు తిరుపతి దర్శనానికే అలాంటి పరిస్థితి ఉండేది. అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఇరుకైన దారిలో వందలాది వాహనాలు వెళ్లాల్సివచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వార్త టీవీల్లో కూడా వచ్చింది. ఏప్రిల్ 17న సలేశ్వరానికి వెళ్ళిన మాకు అడవి నుంచి బయటకు రావడానికి ఐదు గంటల సమయం పట్టింది. ఐతే అర్థరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో గడపడం భలే ఆనందంగా అనిపించింది.
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, పరిశోధకులకు ఎంతగానో నచ్చే ప్రదేశం ఇది.


- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250

1 comment:

  1. సలేశ్వరం గురించి చాలా చక్కగా రాశారు. మాలాంటి వాళ్లకు మీ సమాచారం ఉపయుక్తంగా ఉంది.
    - పెద్ది విజయభాస్కర్, జిల్లా విలేఖరి, మహాన్యూస్

    ReplyDelete