విహారాలు

India

Gamyam

Tuesday, June 14, 2011

గోల్డ్ కోస్ట్... సందడే సందడి

డౌన్ అండర్‌గా పేరుపొందిన ఆస్ట్రేలియా చూడటానికి ప్లాన్ చేసుకొని, పోయిన మార్చి నెలలో నేనూ, మావారు మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో, కౌలాలంపూర్ మీదుగా బ్రిస్‌బేన్ చేరాం. మన కంటే అక్కడి టైం ఐదున్నర గంటలు ముందుకు ఉంటుంది కాబట్టి దిగగానే వాచీలో టైం పెంచేసి, కస్టమ్స్ క్లియరెన్స్‌కి వెళ్లాం. చెక్ ఇన్ లగేజీలోని అరిసెలు కస్టమ్స్ వాళ్ళ కళ్ళలో పడ్డాయి. ఇండియన్ కుక్కీస్ అని ఆవిడకు నచ్చచెప్పి బయటపడ్డాం.

ఆస్ట్రేలియాలో టాక్సీల కంటే వెనుక ట్రెయిలర్‌తో కోచ్‌లే ఎక్కువ వాడతారు. ట్రావెల్ ఏజెంట్ చెప్పినట్లుగా మా కోచ్ వచ్చేసింది. లగేజీ ట్రెయిలెర్‌లో వేసి ఎక్కి కూర్చున్నాం. మా డ్రైవర్ నవ్వుతూనే చెప్పాడు, ఈ దేశంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే భారీగా ఫైన్ వేస్తారని. ఆ రాత్రికి మా బస బ్రిస్‌బేన్ నగరంలోనే. హోటల్ చేరేటప్పటికి బాగా రాత్రి అయింది. ఆస్ట్రేలియాలోని అన్ని హోటల్స్‌లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు క్రెడిట్ కార్డులో 100 డాలర్లు లాక్ ఇన్ చేసి, మళ్ళీ మనం చెక్ అవుట్ చేసేటప్పుడు అవి రిలీజ్ చేస్తారు. మోంటన్ దీవిలోని టంగలూమా రెసార్ట్‌కి పొద్దునే బయలుదేరాం. ప్రతీచోట రూంతో బాటు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్- మెనూ దాదాపు ఒకటే- బ్రెడ్, మఫిన్స్, కార్న్‌ఫ్లేక్స్, బటర్, జామ్స్, ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్స్, హాఫ్ బ్రౌన్ అని వేయించిన బంగాళదుంప, రకరకాల పళ్ళు, జ్యూసులు, యోగర్ట్ అనబడే పెరుగు- రకరకాల ఫ్లేవర్లలో కాఫీ, టీ. నాన్‌వెజ్ ఐటెమ్స్ జోలికి వెళ్ళలేదు. వెదికి మరీ నీళ్ళు తెచ్చి తాగుతుంటే కొంతమంది వింతగా చూసేవారు.

మళ్ళీ ఒక కోచ్ ఎక్కాం, లగేజీతో సహా. ప్రతీ ఏజెంట్ ఒక విషయం గట్టిగా వక్కాణించి చెప్పారు. ఎక్కడ పిక్ అప్ చేయాలన్నా ఆ ప్రదేశంలో కనీసం పది నిమిషాలు ముందుగా వేచి ఉండాలని లేదా ఆ రోజు ట్రిప్ కాన్సిల్ అని. దారిలో ఇంకొంతమంది టూరిస్టులను పికప్ చేసుకుంటూ లాంచీలు ఆగే వార్ఫ్ దగ్గర మమ్మల్ని దింపాడు మా డ్రైవరు. అప్పటికే మేం ఎక్కాల్సిన టంగలూమా వైల్డ్ డాల్ఫిన్ రెసార్ట్ లాంచ్ వచ్చేసి ఉంది. టికెట్స్ చెకింగ్ చేశాక మా లగేజీ టాగ్స్ వేసి వారి బండిలో పెట్టేశారు. "హమ్మయ్య, మోత బాధ తప్పిందిరా నాయనా'' అనుకున్నాం. ముందే పాస్‌పోర్టులు, డబ్బు, కెమెరా, హాండీకాం, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్లు అన్నీ ఒక బాగ్‌లో సర్దుకున్నాం. ట్రిప్ మొత్తం హచ్ వారి డాగ్‌లా మమ్మల్ని వదలకుండా అంటిపెట్టుకుని ఉంది ఆ బాగ్. అలా వారు తీసుకెళ్లిన మా లగేజీ రెసార్ట్‌లోని మా హోటల్ రూం బయట సాక్షాత్కరించింది. టూరిస్టులకు ఎంతో సౌకర్యవంతమైన ఏర్పాటు ఇది.

'కూక్కబుర్ర' పక్షులు

లాంచ్ ఎక్కి కాసేపు కింద టీవీ రూంలో, కాసేపు డెక్ పైన చుట్టూ ఉన్న నీళ్ళను చూస్తూ గంట ప్రయాణం గడిపేశాం. రెసార్ట్ వచ్చేస్తోందని దూరంగా మెరుస్తున్న ఇసుక చెప్పింది. అందరం దిగుతుండగానే పసుపు పచ్చటి పూలచొక్కాలు వేసుకుని రిసార్ట్ స్టాఫ్ మాకు స్వాగతం పలికారు. కొంతమంది మెడల్లో రంగురంగుల ప్లాస్టిక్ పూల దండలు వేశారు. టంగలూమాలోని సౌకర్యాల గురించి వివరించి అన్ని ప్రదేశాలను టూకీగా చూపించారు. మా రూం తొమ్మిదవ అంతస్థులో ఉంది. బాల్కనీలో నిల్చుంటే ఎదురుగా సముద్రం, చుట్టూ పచ్చని చెట్లూ ఉన్నాయి. ఆదివారం కావడంతో చాలామంది లోకల్ టూరిస్టులు నీటిలో ఈదుతూ, ఇసుకలో వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. క్వాడ్ బైక్ టూర్స్‌లో నాలుగు చక్రాల బండి తోలడం, పారా సెయిలింగ్, జెట్ స్కైయింగ్ ఇలా అన్నీ పిల్లా పెద్దా అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

మొదటగా మెరైన్ ఎడ్యుకేషన్ సెంటర్ చూశాం. రకరకాల జలచరాలు ఫోటోలు, వాటి వివరాలు ఉన్నాయి. రెసార్ట్ షాప్‌లో దినపత్రికలతో సహా సమస్త వస్తువులు దొరుకుతాయి. ఆస్ట్రేలియాలో విరివిగా కనిపించే కూక్కబుర్ర అనే పక్షుల్ని చూశాం. ఇవి అరిస్తే కోతులు అరిచినట్లు గోలగా ఉంటుంది. రెసార్ట్‌లో ఒక పక్క షిప్ రెక్ ఉంటే వెళ్ళాం. పనికిరాని ఓడల్ని కొన్ని తెచ్చి పెట్టారు. ఎండకు ఎండి, వానకు తడిసి అవి శిథిలాల్లా తయారయ్యాయి. వాటి పైకి వెళ్ళి ఇసుకలోకి పలకలాంటి దానిమీద జారడం (సాండ్ గ్లైడింగ్) చేశాం.

డాల్ఫిన్లకు మేత వేశాం

ఈ రిసార్ట్‌లో ఉన్న జెట్టీ దగ్గరకు ఎన్నో ఏళ్ళుగా మచ్చిక చేస్తున్న వైల్డ్ డాల్ఫిన్లు చీకటి పడుతుండగా వస్తాయి. వాటికి అప్పుడు ఫీడ్ ఇస్తారు. అది చూడడానికి వెళ్లాం. ట్రైనర్లు వచ్చి, కాస్త దూరంలో నిలబడి మైక్‌లో కామెంటరీ మొదలుపెట్టగానే ఒక్కొక్కటిగా డాల్ఫిన్లు రాసాగాయి వింత వింత శబ్దాలు చేస్తూ. అక్కడ ఉన్నవారందరూ చప్పట్లు కొట్టి వాటికి స్వాగతం పలికారు. ట్రైనర్సు మమ్మల్ని క్యూలో నిలబెట్టి, చేతులు శుభ్రపరచుకోవడానికి లిక్విడ్ డిటర్జెంట్, ఫీడ్ చేయడానికి చేపలు ఇచ్చారు. నడుములోతు సముద్రం నీటిలో మునిగి, ఆ లైట్ల వెలుతురులో చేపలను మేము అందిస్తుంటే అంత పెద్ద డాల్ఫిన్లు సుతారంగా వాటిని తీసుకుని తినేసి మళ్లీ వెనక్కు వస్తున్నాయి.

పొద్దునే పక్షుల సందడికి లేచి అలా బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళ్ళాం. మసాజ్ పార్లర్లు, టెన్నిస్ కోర్ట్సు, టీటీ టేబుల్స్, ఆర్చరీ పాయింట్స్, స్విమ్మింగ్ పూల్స్- ఇలా అందరికీ ఏదో ఒక ఆనందాన్ని అందించే ప్రయత్నం జరుగుతోంది. సముద్రం నీటిని రీ సైకిల్ చేస్తూ ఎంతో చక్కగా రెసార్ట్‌ని ఎవర్‌గ్రీన్‌గా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కాసేపు పెలికన్స్ అనే పక్షులను చూసి, వాటికి మేత వేశాం. లాంచ్‌లో గోల్డ్‌కోస్ట్‌కి వెళ్ళాం. అందమైన బీచ్‌లు, బోటింగ్ చేయడానికి కెనాల్ సిస్టమ్స్, ఆకాశాన్నంటే సౌధాలు ప్రశాంతమైన రెయిన్ ఫారెస్ట్, పబ్స్, 24 గంటల షాపింగ్ కోసం ఎన్నో మాల్స్, వన్యప్రాణుల పార్కులు, రకరకాల థీం పార్కులు, వెరసి గోల్డ్ కోస్ట్ ఒక భూతల స్వర్గం. ఇక్కడ మా బస హోటల్ గ్రాండ్ చాన్సిలర్‌లో. బాల్కనీ నుండి చూస్తుంటే పరిసరాలు ఎంతో అందంగా కనిపించాయి. 'క్యూ ప్లస్' అని ప్రపంచంలో అతి ఎత్తయిన నివాసయోగ్యమైన టవర్ చూశాం.

టాంబోరీన్ రెయిన్ ఫారెస్ట్

మరుసటిరోజు టాంబోరీన్ రెయిన్ ఫారెస్ట్‌కి వెళ్ళాం. చిక్కటి అడవిలో నడుస్తూ, రకరకాల చెట్లను చూస్తూ, అతి ఎత్తయిన చెట్లమీద నిర్మించిన కాంటీ లీవర్ బ్రిడ్జి ఎక్కాం. అక్కడ నుండి వ్యూ అద్భుతంగా ఉంది. రంగురంగుల సీతాకోక చిలుకలు, అక్వేరియం చూశాం. అక్కడినుంచి దగ్గరలోని గుహలను చూడడానికి వెళ్ళాం. ఆ గుహలో మిణుగురు పురుగుల్లాంటి గ్లోవార్మ్స్‌ని చూశాం. రాత్రిపూట మాత్రమే కనిపించే జంతువులను, పురుగులను చూశాం. మా హోటల్ దగ్గర ఉన్న 'రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్' అని ప్రపంచంలోని వింతలన్నీ పొందుపర్చిన ఆడిటోరియం, దానికి దగ్గరలోని హాంటెడ్ భవనం చూశాం. అందులో అతి బీభీత్సమైన, భయంకరమైన విశేషాలున్నాయి. అందులో దెయ్యాలు, భూతాలు తిరిగే స్మశాన వాటికలు, శవాల గదులు, మాంసాహారులు, షార్క్ చేపలు, విషం కక్కే పురుగులు, పాములు ఉన్నాయి.

ఒకరోజు పొద్దునే మూవీ వరల్డ్‌కి వెళ్ళాం. పిల్లలు పెద్దలతో క్రిక్కిరిసి ఉంది ఆ థీం పార్క్. టిక్కెట్టు ధర కొంచెం ఎక్కువే కానీ రైడ్స్ అన్నీ ఫ్రీ. కార్టూన్ క్యారెక్టర్స్ ఆధారంగా ఉన్నాయి రైడ్స్. బాట్‌మాన్, బాట్‌వింగ్, సూపర్‌మాన్, లూనీ ట్యూన్స్. పిల్లల కార్టూన్ వేషాలు వేసుకుని కొందరు పెద్దలు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఆ తరువాత 'జర్నీ టు సెంటర్ ఆఫ్ ఎర్త్' అనే 4డి సినిమా చూశాం. ఒక యువశాస్త్రవేత్త తన మేనల్లునితో కలిసి భూమి లోపలికి వెళ్ళడం, అక్కడ వారు మాంసాహార మొక్కలు, డైనోసార్లు, లోయలు, మంటలు, నదులు ... వీటి నన్నింటినీ అధిగమించి మళ్ళీ పైకి రావడం- ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది ఆ సినిమా చూస్తుంటే. మొత్తానికి మా మూవీ వరల్డ్ ట్రిప్ చాలా సందడిగా ముగిసింది.

పెంగ్విన్స్ లోకంలో విహరించాం

మరుసటి రోజు సీ వరల్డ్‌కి వెళ్ళాం. 1958లో ప్రారంభమైన ఈ పార్క్ గోల్డ్ కోస్ట్‌లో చాలా పాపులర్. ఎంట్రీ దగ్గర చిన్న మేప్ ఇచ్చారు. దానిని క్షుణ్ణంగా చదివి, దగ్గరలో ఉన్న స్కైవే స్టేషన్‌లో గోండోలా ఎక్కి పార్క్ అవతలి వైపునకు వెళ్ళాం. టచ్ పూల్, స్నోర్కలింగ్, డైవింగ్ లగూన్ చూసి, షార్క్ బే వెళ్ళాం. గ్లాస్ బాటం బోటు ఎక్కి గైడ్ చెప్పే వివరాలు వింటూ అక్కడ ఉన్న షార్క్‌లను చూశాం. పక్కనే పోలార్ బేర్ ప్రదేశం ఉంది.

అతి శీతలమైన ప్రదేశాలలో ఉండాల్సిన ఎలుగుబంట్లను తెచ్చి ఎంతో చల్లని అనువైన ప్రదేశం వాటి కోసం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి పెద్దదైన పెంగ్విన్ పాయింట్‌కి వెళ్ళాం. పరిశుభ్రమైన నీటిలో చకచకా ఈదే ఈ పక్షులు నేలపై రొమ్ము విరుచుకుని నడవడం ఎంతో బాగుంది. దగ్గరల్లో సీ వరల్డ్ థియేటర్‌లో ఒక సినిమా చూశాం. పెంగ్విన్ పక్షి ఒకటి డాన్సింగ్ కాళ్ళతో పుడితే మిగతావి దానిని వెలివేస్తాయి. అదే వాటికి తిండి సంపాదించి పెట్టి, శత్రువుల బారి నుండి కాపాడుతుంది. 4డి గ్లాసెస్ పెట్టుకుని కదిలే కుర్చీలలో కూర్చుని మధ్య మధ్య నీటి తుంపర్లు పడుతుంటే తడుస్తూ పెంగ్విన్స్ లోకంలో విహరించాం.

తరువాత మోనో రైలు ఎక్కి పార్కంతా చుట్టేశాం. పార్క్‌లో పిల్లలకు ప్రత్యేకమైన రైడ్స్, గేమ్స్, రీసెర్చి సౌకర్యాలు, హెలికాప్టర్ సౌకర్యం ఉన్నాయి. మేం చూసిన థీం పార్క్‌లలో ఒకటి గమనించాం. టూరిస్టులు వారి పిల్లల్ని ఎంతో ఓపికగా చూసుకోవడం, వికలాంగులు, వృద్ధులు నిరాశ పడకుండా వీల్ చైర్లలో అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఎంతో ఆనందించడం.
మొత్తానికి నాలుగు రోజులు మమ్మల్ని ఎంతో అలరించిన గోల్డ్ కోస్ట్ వదిలి, ఆస్ట్రేలియాలోని ఇంకో నగరానికి పయనమయ్యాం.


- డా ఎం. రమణి,
98491 34064

No comments:

Post a Comment