విహారాలు

India

Gamyam

Monday, July 30, 2012

సిల్క్‌రూట్‌లో ఓ తెలుగు సాహసికుడు

ఎవరన్నారు టీవీ చూస్తే పిల్లలు చెడిపోతారని? ఎవరన్నారు చరిత్ర చదివితే ఎందుకూ కొరగాకుండా పోతారని? చిన్నప్పుడు నేషనల్ జాగ్రఫిక్ ఛానల్‌లో చూసిన సిల్క్‌రూట్ విశేషాల్ని, కొంచెం పెద్దయ్యాక వాళ్ళ నాన్న చెప్పిన చరిత్ర పాఠాల్ని మెదడులో నిత్యం మననం చేసుకుంటూ పెరిగినందువల్లే ఇవ్వాళ నల్లవారి గౌతమ్‌రెడ్డి అనే ఈ యువకుడు అలెగ్జాండర్, చంఘిజ్‌ఖాన్, మార్కొపోలో ప్రయాణించిన మార్గంలో ప్రయాణించి అభినవ చరిత్ర యాత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియాలో ఇంజనీరింగ్, పారిస్‌లో ఎంబిఎ చేసి అక్కడే ఉద్యోగ చేస్తున్న గౌతమ్‌రెడ్డి తొమ్మిది దేశాల్లో నాలుగు నెలల పాటు సాగించిన పర్యటన విశేషాలు.  

గ్రీస్ - టర్కీ -ఇరాన్ - తుర్క్‌మెనిస్తాన్ - ఉజ్బెకిస్తాన్ - కిర్గిస్తాన్ - చైనా - నేపాల్ - ఇండియా. ఇదీ నా ప్రయాణ మార్గం. దాదాపు ఆరున్నర వేల కిలోమీటర్ల దారి. క్రీ.పూ 200 సంవత్సరాల కాలంలోనే చైనా పట్టును పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేసే మార్గం కావడంతో దానికి 'సిల్క్ రూట్' అనే పేరొచ్చింది. ప్రయాణానికి సిద్ధపడేముందు నేను కొన్ని నియమాలను పెట్టుకున్నాను. మొదటిది, ఎప్పుడూ నేల మీదే ప్రయాణించాలి, వీలైనంత వరకూ ప్రాచీన 'సిల్క్ రూట్' మార్గంలోనే ప్రయాణించాలి. వీలైనంత చవగ్గా దొరికే ప్రయాణ సాధనాలనే ఎంచుకోవాలి. హాస్టళ్లలోనో, స్థానికుల ఇళ్లలోనో ఉండాలి. నచ్చినా, నచ్చకున్నా స్థానికంగా అందరూ తినే ఆహారాన్నే తినాలి. వీలైనన్ని ప్రశ్నలడగాలి. వెళ్లిన ప్రతిచోటా వారి సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలను తెలుసుకోవాలి. బయల్దేరినప్పటికన్నా ఎక్కువ విజ్ఞానం, సంతోషాలతో ఇంటికి చేరుకోవాలి. వీటన్నిటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి ముందు దక్షిణమెరికా వెళ్లాను. అక్కడ రెండు నెలలుండి, కష్టమైన వాతావరణ పరిసితుల్లో పర్వతారోహణ వంటివి చేసి ఈ గొప్ప ప్రయాణానికి నన్ను నేను ఆయత్తపరచుకున్నాను. తిరిగి వచ్చాక మార్చి 7న గ్రీస్ దేశానికి బయల్దేరాను.

గ్రీక్ రాజధాని ఏథెన్స్ విమానాశ్రయంలో దిగుతూనే చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇక కొన్నాళ్లీ విమానాలకేసి చూసే పని లేదని ఆనందపడ్డాను. ముందుగా ఏథెన్స్‌లో 'ఆల్ఫా టీవీ గ్రీస్'కు జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నా పారిస్ సహాధ్యాయిని కలవడానికి వెళ్ళాను. విచిత్రమేమంటే ఆయన కూడా నాలాగానే చదువైపోగానే సిల్క్ రోడ్‌లో ప్రయాణించాడట! ఆ విషయం తెలిసినప్పుడు నాకు నోట మాట రాలేదు. ఇద్దరం ఉత్సాహంతో ఊగిపోయాం. ఆ యాత్ర అతని దృక్పథాన్ని, అవగాహనను విశాలం చేసిందని చెబుతుంటే నాకు సంతోషంగా అనిపించింది. ఆయనిచ్చిన స్ఫూర్తితో ఏథెన్స్ నగర వీధుల్లో చక్కర్లు మొదలెట్టాను.


ఆక్రోపొలిస్, గ్రీస్

గాలిలో తేలి వస్తున్న బ్రేక్‌ఫాస్ట్ కమ్మటి వాసనలను ఆస్వాదిస్తూ వీధుల్లో చకచకా అడుగులేశాను. ఆక్రోపొలిస్ - ఏం నిర్మాణం! ఇది ప్రపంచానికి కేంద్రబిందువని ఒకనాడు గ్రీకులు నమ్మేవారు. దాన్ని చూస్తే అది నిజమేననిపిస్తుంది. నాకు పదేళ్లున్నప్పుడు టీవీలో చూశాను దాన్ని. ఇరవయ్యేళ్ల తర్వాత ఇప్పుడిలా... ఆనందం పట్టలేకపోయా. స్కూల్లో నాకు చరిత్ర పాఠాలు చెప్పిన టీచర్ గుర్తొచ్చారు. చరిత్రనొక నిషాలా తలకెక్కించిన మా నాన్నను కూడా తల్చుకున్నాను. థ్యాంక్స్ చెబుతూ ఆయనకో ఉత్తరం రాసి పోస్టు చేసేదాకా నా మనసాగలేదు. కమ్మటి గ్రీకు భోజనం లాగించిన తర్వాత భారీ ఒలింపిక్ స్టేడియంలోకి అడుగుపెట్టాను. ఆటలను అలా ఆస్వాదించవచ్చని 2200 ఏళ్ల క్రితం ఆలోచించిన వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

ఇజ్మిర్, టర్కీ

టర్కీలోని ఇజ్మిర్ 2500 ఏళ్ల పురాతన నగరం. నేను వెళ్లిన రోజు పదంతస్తుల భవనాలను కప్పేసేంత పెద్ద జెండాలు బజార్లో ఎగురుతున్నాయి. ఏమిటి విశేషమని వాకబు చేస్తే చరిత్రలో ఆరోజునే ఓటోమాన్ రాజులు ఆక్రమణదారుల మీద విజయం సాధించారని తెలిసింది. అక్కణ్నుంచి 'అగోరా ఆఫ్ స్మిర్నా'కు చేరుకున్నా. ఇది ప్రాచీన రోమన్ కట్టడం. భూకంపాల వల్లా, దుశ్చర్యల వల్లా పూర్తిగా శిథిలమైపోయింది. దగ్గర్లోనే కొండ మీద అలెగ్జాండర్ నిర్మించిన కోటను చూడటానికి వెళ్లాను. అక్కడ పిల్లలు గాలిపటాలెగరేస్తున్నారు. భారతదేశంలోనూ గాలిపటాలెగరేస్తారని నేను చెప్పినపుడు ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు. దారిలో ముగ్గురు జర్మన్ యాత్రికులు కలిశారు. వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనం చేసిన తర్వాత బస్సెక్కాను.

కపడోసియా

కపడోసియా అనే చిన్న పట్టణానికి చేరుకున్నా. దీనికి 3000 ఏళ్ల చరిత్ర ఉంది. అగ్నిపర్వతం పేలిన బూడిద కొండల మధ్య గుహలనే తమ నివాసాలుగా మార్చుకున్నారక్కడి మనుషులు. అలాంటి 'షూ స్ట్రింగ్ కేవ్ హాస్టల్'లో నా బస. అక్కడ వైఫై సదుపాయం కూడా ఉంది! యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన బైజాంటైన్ కాలానికి చెందిన గుహలు, క్రిస్టియన్ మత వ్యాప్తికోసం చిత్రించిన పెయింటింగ్‌లను చూశాను. తర్వాత మట్టిపాత్రలను తయారుచేసే మార్కెట్లో కాసేపు తిరిగి రాళ్లలో రకరకాల ఆకారాలుండే 'ఇమాజినేషన్ వేలీ'కి చేరుకున్నా.

ఇక్కడి ఆకృతులను మనం ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు. అక్కడి నిశ్శబ్దం నాకు ప్రశాంతతనీ, భయాన్నీ ఒకేసారి కలిగించింది. అక్కడ్నించి తివాచీలల్లే చోటికి వెళ్లాను. ఒక టూ బై టూ పట్టు తివాచీని తయారుచెయ్యడానికి ఒక మనిషి పదకొండు నెలల పాటు శ్రమిస్తాడని తెలుసుకుని ఆశ్చర్యపోయా. వధువు గుణగణాలను పరిశీలించేప్పుడు తివాచీల అల్లకంలో పనితనముందా లేదానని కూడా చూస్తారట. రాత్రి కపడోసియన్ కబాబ్ తిన్నా. ఒక చిన్న కుండలో వండే దాన్ని కుండ పగలకొట్టే తినాలి.


మర్నాడు భూగర్భ నగరాన్ని చూడాలన్నది నా ప్లాన్. పన్నెండంతస్తుల లోతుండే ఆ భూగర్భ నగరంలో శతాబ్దాలుగా మానవ నివాసం సాగుతోంది. ఆహారం దాచడం కోసమంటూ మొదలైన ఈ భూగర్భ ఆవాసాలు క్రమంగా జనావాసాలుగా మారాయి. శత్రువులు రావడానికి వీల్లేకుండా చిన్న ద్వారాలు పెట్టడంతో నాకెందుకో వాటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు తెగ భయమనిపించింది. భూమి కిందన అంత పెద్ద నగరాన్ని సందర్శించడం ఒక వినూత్నమైన అనుభవం! తర్వాత అమెరికాలోని గ్రాండ్ కెన్యాన్‌ను తలపించే రాతి నిర్మాణాలను చూడటానికి వెళ్లాను. 'స్టార్ వార్స్' సినిమాకి ప్రేరణ ఈ ప్రాంతం నుంచే వచ్చిందని బస్ డ్రైవర్ చెప్పాడు. ఇక్కణ్నుంచి నా ప్రయాణం నల్ల సముద్రానికి ఉత్తరంగా ఉన్న మరొక టర్కీ నగరం ట్రాబ్‌జాన్‌వైపు సాగింది.


ట్రాబ్‌జాన్

ఇదొక పెద్ద పారిశ్రామిక నగరం. ఎటుచూసినా భారీ నౌకలు, ఆయిల్ రిగ్గులు, క్రేన్లు వంటివే కనిపిస్తాయి. నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సుమేరా మొనాస్టరీ'కి బయల్దేరాను. బైజాంటైన్ శకానికి చెంది రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ అనేక దాడులను తట్టుకొని నిలబడిన గొప్ప చర్చి ఉందక్కడ. వెనక్కొస్తున్నప్పుడు నేను పోలిష్ యాత్రికుల జంటను కలిశాను. వాళ్లయితే కేవలం లిఫ్ట్ అడిగే ప్రయాణాలు చేస్తున్నారు.

వాళ్లు చెప్పిన ట్రిక్కులుపయోగించి ముగ్గురం కలిపి ఒక పెద్ద వ్యాన్‌లో నగరం చేరుకున్నాం. అక్కడి బజార్లో తమ స్కూలు కోసం విరాళాలు సేకరిస్తున్న విద్యార్థులు కనిపించారు. ఇంట్లోని పెద్దవారు వండిన వంటలు, తయారుచేసిన కళాకృతులను విక్రయిస్తున్నారు వారు. వారితో సంభాషణ సరదాగా గడిచింది. భారతదేశం గురించి అనేక ప్రశ్నలు అడిగారు. పదిహేను గంటల బస్సు ప్రయాణం చేశాక దొగుబాయ్‌జిత్ అనే పట్టణానికి చేరుకున్నాను.


దొగుబాయ్‌జిత్

ఇరాన్‌లోకి ఇక్కణ్నుంచే ప్రవేశించాలి. కొండ మీదున్న 'ఇసిక్ పసా సరాయ్' అనే కోటను చూశాను. పదిహేడో శతాబ్దంలో కట్టిన ఆ రాతి కోట శత్రుదుర్భేద్యంగా ఉంది. అక్కణ్నుంచి కనిపిస్తున్న మరో పర్వతం సైనిక స్థావరంగా ఉపయోగపడేదట. నాలోని పర్వతారోహకుడు ఊరుకోలేదు. కష్టమైనా సరే, పైకెక్కి అక్కణ్నుంచి ఇరాన్‌ను చూశాను. ఆ నిర్మానుష్య ప్రదేశంలో కాసేపు తిరిగిన తర్వాత నావంటి మరో పర్వతారోహకుణ్ని చూశాను. అతను సెల్‌ఫోన్‌లో టర్కీ ప్రేమగీతాల్ని వింటున్నాడు. రాత్రి అతను తాను పనిచేసే చోట భోజనానికి ఆహ్వానించాడు. 'మీకు డబ్బులున్నప్పుడు సంతోషంగా ఉన్నారా, ఇలా చేతిలో తక్కువ పైసలతో తిరుగుతూనా' అని అతనడిగిన ప్రశ్నకు చిరునవ్వే నా సమాధానమైంది.

తబ్రిజ్, ఇరాన్

షేరింగ్ టాక్సీలో ఇరాన్‌లోకి ప్రవేశించడం కొత్తగా అనిపించింది. డాలర్‌కు పద్దెనిమిదివేల రియాళ్లు. ఏటీఎమ్‌లేం ఉండవు. ఇక్కడ మహదీ అనే 22ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థికి నేను అతిథినయ్యాను. అతని కుటుంబ ఆతిథ్యం చూసి నాకు కళ్లు తిరిగాయంటే నమ్మండి. 'అతిథి దేవోభవ' అన్న మన సూక్తినే వారు పార్శీలో చెప్పారు. మర్నాడు తబ్రిజ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తివాచీ మార్కెట్‌ను చూశాను. "చైనావాళ్లు అన్ని డిజైన్లనూ కాపీ కొట్టేసి యంత్రాల సాయంతో తయారుచేసిన తివాచీలను ఇరాన్ తివాచీలని అమ్మేస్తున్నారు. దాంతో మా భుక్తి పోతోంది'' అంటూ చెప్పుకొచ్చారు అక్కడి వర్తకులు. ఇరాన్ సంస్కృతీ సంప్రదాయాలు అద్భుతంగా అనిపించాయి నాకు.

టాక్సీ డ్రైవర్లను ఎంత తీసుకుంటారని అడిగితే 'అయ్యో, మీరు మాకు అతిధి, రండిరండి' అంటూ పిలిచేవారు. వాళ్లకు డబ్బవసరం లేదని కాదు, కానీ వారి అతి«థి మర్యాద అలాంటిది. నాలుగైదుసార్లడిగాక, ఎంతోకొంత తీసుకునేవారు. మర్నాడు నేను కాండోవన్ అనే ఊరికెళ్లాను. రాతి నిర్మాణాలతో నిండి అది కపడోసియాలాగే అనిపించింది. పదికిలోమీటర్ల దగ్గర్లోనే నగరం ఉండగా, ఈ రాతి గుహల్లో మనుషులెందుకు నివసిస్తున్నారో నాక ర్థం కాలేదు.


ఎస్‌ఫహాన్, మధ్య ఇరాన్

ఇక్కడ నాకు ఆతిథ్యమిచ్చింది అమీన్. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయినా రహస్యంగా డీజేగా కూడా పనిచేస్తుంటాడు. ఎందుకంటే పార్టీలు, డీజేయింగ్ వంటివి అక్కడ నిషిద్ధం. ఈ నగరం ప్రాచీన కాలం నుంచీ ఎందరో ఆలోచనాపరులు, కవులకు పుట్టినిల్లు. అక్కణ్నుంచి టె హ్రాన్ చేరుకున్నా. కాంక్రీట్ అరణ్యం. జనాల ఉరుకులుపరుగులు. పూర్వపు అమెరికన్ కాన్సులేట్ భవనాన్ని తప్పక చూడాలని అనుకున్నా. కాని నాకు ప్రవేశం లభించలేదు. మర్నాడు కిర్గిస్తాన్ ఎంబసీకి వెళ్లాను. రోజుకు ఇద్దరు వస్తే గొప్ప ఇక్కడ. అందుకే కాన్సులర్ ఎదురొచ్చి మరీ నాకు వీసా జారీ చేసేశాడు. తబ్రిజ్‌తో పోలిస్తే ఇక్కడ జనాలకు స్వేచ్ఛ ఎక్కువ. మహిళలు సూపర్ మోడర్న్‌గా ఉంటారు. ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఇప్పుడక్కడ ఫ్యాషన్. ఎంత ఎక్కువంటే, చేయించుకోనివాళ్లు కూడా ముక్కుకు బ్యాండేజ్ వేసుకుని, చేయించుకున్నట్టు పోజులిస్తూ తిరుగుతుంటారు.

ప్రాచీన పెర్సిపొలిస్

ముందుగా షిరాజ్ చేరుకుని వీసా ఎక్స్‌టెన్షన్ కోసం ప్రయత్నించాను. శతాబ్దాలుగా ఈ నగరం కళలకు, సంస్కృతికీ పుట్టినిల్లు. సిల్క్‌రూట్‌లోని ఒక ముఖ్య వాణిజ్య కేంద్రమే కాకుండా ఈ నగరంలో ఒకనాడు విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు విలసిల్లాయి. ప్రాచీన పర్షియన్ సామ్రాజ్యానికి, జొరాస్ట్రియన్ మతానికి రాజధాని. పెర్సిపొలిస్‌లో అడుగుపెడుతూనే ఏదో తెలియని ఉద్వేగం కలిగింది నాలో. భారీతనం, వైభవం కలగలిసిన ఈ నగరమే గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌కు అసలైన ప్రత్యర్థిగా నిలిచింది. అతి కష్టమ్మీద దీనికి ఆక్రమించుకున్న ఆయన సేనలు సంపదనంతా దోచుకుని నగరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. పెర్సిపొలిస్ అన్న పేరు కూడా గ్రీకులే పెట్టారని, దానికి అర్థం 'మంటల నగరం' అని చెప్పారు. తన సేనల దౌష్ట్యానికి అలెగ్జాండర్ సైతం బాధ పడ్డాడంటారు.

అష్గబాత్, తుర్క్‌మెనిస్తాన్

షేరింగ్ టాక్సీలోనే ఇరాన్ సరిహద్దు దాటి తుర్క్‌మెనిస్తాన్‌లోకి ప్రవేశించాను. ముప్ఫై కిలోమీటర్ల పాటు మనిషన్నవాడు కనిపిస్తే ఒట్టు. ఇక్కడి చట్టాల ప్రకారం సర్టిఫైడ్ గైడ్ లేనిదే టూరిస్ట్‌లు తిరగడానికి వీల్లేదు. గంట ప్రయాణం తర్వాత అష్గబాత్‌లోకి ప్రవేశించాం. ప్రతి భవనమూ, అపార్ట్‌మెంట్లూ... అన్నీ మార్బుల్‌తో కట్టినవే. ప్రతిదీ తెల్లగా మెరిసిపోతుంటుంది - చెత్తకుండీలతో సహా! గుర్రాలకు, తివాచీలకు అందానికి మంత్రిత్వ శాఖలు వంటివి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి మార్కెట్లో తిరుగుతుండగా పోలీసులొచ్చి తీవ్రవాదినంటూ నన్ను అరెస్టు చెయ్యబోయారు. వివరంగా చెప్పిన తర్వాతగానీ వదిలిపెట్టలేదు. 'ఇండియన్ పాస్‌పోర్టుతో టూరిస్ట్ వీసానా' అంటూ ఆశ్చర్యపోయారక్కడి అధికారులు.

సమాచారం మీద బోలెడంత నిఘా. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివే కాదు, ఇతర న్యూస్ వెబ్‌సైట్ల మీదా నిషేధమే. ఈమెయిళ్లూ, ఉత్తరాలూ ఏవైనా సరే ప్రభుత్వం తెరిచి చదువుతుంది. ఈ నిర్బంధమెందుకో నాకర్థం కాలేదు. ఈ దేశంలో 80 శాతం కారకోరమ్ ఎడారే. దాన్ని దాటి ప్రాచీన మెర్వ్ నగరంలోకి ప్రవేశించాను. వ్యాపారమే కాకుండా, మతపరమైన సిద్ధాంతాలు సిల్క్ రూట్ వెంబడి అభివృద్ధి చెందడానికి నగరం ఎంతగానో ఉపయోగపడింది చరిత్రలో. మతాలిక్కడ సహజీవనం చేసేవనీ, వందకు పైగా గ్రంథాలయాలుండేవనీ చెబుతోంది చరిత్ర. చెంఘిజ్‌ఖాన్ ఈ నగరాన్ని నేలమట్టం చేశాడు.


ఉజ్బెకిస్తాన్

తుర్క్‌మెనిస్థాన్ వదిలి ఉజ్బెకిస్తాన్‌లోకి ప్రవేశించగానే హమ్మయ్య అంటూ నిట్టూర్చాను. 'ఇండియానా? నమస్తే' అన్నారక్కడి గార్డులు. అనుమతులు సంపాదించడమూ కష్టం కాలేదు. టాక్సీ డ్రైవర్ దగ్గర పది డాలర్లు మోసపోయి బుఖారా నగరానికి చేరుకున్నా.
ఇదొక ప్రాచీన పవిత్ర నగరం. మతం, మేధలకు కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడికి చేరుకోగానే నా మనసంతా అవ్యక్త పురా భావనతో నిండిపోయింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా అన్నట్టుంటాయి అక్కడ ప్రతిదీ. మార్పు తక్కువ. ఇక్కడి ఒక మినార్‌ను చెంఘిజ్‌ఖాన్ చూసి ఆశ్చర్యపోయి, దాన్నేమీ చెయ్యవద్దని సైనికులను ఆజ్ఞాపించాడట. మరోవైపు ఇక్కడ జరిగిన నరమేధం ఎంత భయంకరమైనదంటే, ఆ దెబ్బకి చాలా రాజ్యాలు పెద్ద ప్రతిఘటన లేకుండానే ఆయనకి లొంగిపోయాయట.

మార్కోపోలో ఏడాదిపాటు ఈ మహాసామ్రాజ్యంలో గడిపి, భాష నేర్చుకుని, సంస్కృతిని తెలుసుకుని, ప్రాచ్య దేశాల గురించి అవగాహన చేసుకున్నాడు. మర్నాడు హోటల్లో కలిసిన ఎస్తోనియా దేశస్థురాలు కిర్కాతో కలిసి సమీప గ్రామాల్లో తిరిగాను. "మాక్కావలసినవన్నీ మా పొలం నుంచే వస్తాయి. మేం కొనే వస్తువేదంటే నూనె'' అని అక్కడి కుటుంబపెద్ద ఒకరు చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. మట్టి పని చేస్తున్న ఆయన కొడుకులు కూడా రైతులే అనుకున్నాన్నేను. కానీ చిన్నవాడు మెడిసిన్ చదువుతున్నాడు, పెద్దవాడు బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి బుఖారాలో పనిచేస్తున్నాడు. వాళ్లెంత సామాన్యంగా ఉన్నారోకదా అని ఆశ్చర్యపోయాను. మొత్తానికి ఐదు రోజులు అక్కడ గడిపి ట్రెయినెక్కి సమర్‌ఖండ్ చేరుకున్నాను.


సమర్‌ఖండ్

ఇది ఒయాసిస్సు సమీపంలో ఉన్న నగరం. ఎడారిలో అంతులేని ప్రయాణం చేసిన నాకు అక్కడికి చేరుకోగానే ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. చరిత్రలో వ్యాపారులు కూడా ఇలాగే సేదదీరి ఉంటారా అనిపించింది. అడుగుపెట్టగానే ఎత్తైన మసీదులు నీలి రంగులో మెరిసిపోతూ కనిపించాయి. వాటి భారీతనం, వైభవం చూడటానికి రెండు కళ్లూ చాలవు. నిజానికీ నగరం కూడా చెంఘిజ్‌ఖాన్ చేతిలో పూర్తిగా ధ్వంసమైపోయినదే. తర్వాత నెమ్మదిగా పునర్నిర్మించుకున్నారు. మర్నాడు నేను 'మరకందా' గ్రామానికి వెళ్లాను. అలెగ్జాండర్ అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రోక్సానా. ఆ ఊరి గ్రామపెద్ద కూతురు రాత్రికి రాత్రే ప్రపంచానికి పట్టపురాణి అయిపోయింది! దీన్ని ఇష్టపడని కొందరు తిరుగుబాటు చేశారు. అది ప్రారంభం - అలెగ్జాండర్ తిరుగుబాట్లను ఎదుర్కోవడం.

ఆ చక్రవర్తి దారిలో నేను నడవడం అక్కడితో ఆఖరు. ఎందుకంటే ఆ తర్వాత అతని సైన్యం ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌ల మీదుగా మన దేశంలోకి వచ్చాయి. ఉజ్బెకిస్తాన్‌లో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచే అక్కడి వారు నామీద చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ అర్థమైంది. ఎందుకు అనేది కాస్త ఆలస్యంగా తెలిసింది. వాళ్లకు మన హిందీ సినిమాలంటే పిచ్చి. దాదాపు అన్ని హిందీ సినిమాలనూ డబ్ చేసుకుని చూస్తారు. హిందీ తారల పేర్లు, పాటలు... అన్నీ వాళ్లకు తెలుసు. ఆ అభిమానమంతా నామీద కుమ్మరించారన్నమాట. మర్నాడు నేను 13 శతాబ్దానికి చెందిన ఓగుల్ బెక్ అబ్జర్వేటరీని సందర్శించాను. నాలుగు రోజుల తర్వాత తాష్కెంట్‌కు ట్రెయిన్లో బయల్దేరా.


కిర్గిస్తాన్

ఎత్తైన పర్వతాలున్న దేశమిది. ఒక్కోటీ పదిహేనువేల అడుగుల పైగా ఉన్న శిఖరాలు. నాలోని పర్వతారోహకుడికి పండగే పండగ. చాలా కష్టపడి వాటిని అధిరోహించి శిఖరాగ్రానికి చేరినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. అక్కడి గొర్రెల కాపరులతో మాట్లాడటం, వారితో ఆ పర్వతాల్లో కలిసి ఉండటం నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవం. జీవితంలో చిన్న చిన్న ఆనందాలకుండే ప్రాధాన్యమేమిటో తెలుసుకున్నదక్కడే.

చైనా

కిర్గిస్తాన్‌ను ఆనుకుని ఉండేదే తఖ్లమాన్ ఎడారి. దాదాపు మూడువేల చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద ఎడారిని ట్రక్కు డ్రైవర్ సాయంతో దాటి చైనాలోకి ప్రవేశించాను. నేను వెళ్లిన కాష్గర్ నగరానికి ఆరేడువేల ఏళ్ల చరిత్ర ఉంది. మార్కోపోలో ఈ నగరాన్ని ఎలా వర్ణించాడో అది ఇప్పటికీ అలానే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని పాత నిర్మాణాలను కూల్చేసి ఆధునికంగా కడుతున్నారు. దీని సరిహద్దులోని పర్వతాలను ఎక్కడానికి మూడు రోజులు పట్టింది. వాటి పైనుంచి చూస్తే చైనా, పాకిస్తాన్, తజకిస్తాన్ - మూడు దేశాలూ కనిపిస్తాయి.

మధ్య చైనా

ప్రశాంతమైన బౌద్ధారామాలకు చేరుకున్నాను. కొండచరియల్లో, దట్టమైన అడవుల్లో ఉండే వీటికి ప్రయాణం కష్టం. అయినా నేను ఇష్టంగా దాన్ని జయించాను. ఒక వారం పదిరోజులు అక్కడ బౌద్ధ సన్యాసులతో కలిసి ఉండటం గొప్ప ప్రశాంతతనిచ్చింది. ఇక్కణ్నుంచి షియాన్ అనే నగరానికి చేరుకున్నా. ఇది ప్రాచీన చైనాకు రాజధాని. అప్పట్లో బీజింగ్ అన్న ఊరే లేదు. అసలు సిల్క్ రూట్‌కు ఇదే ప్రధాన ప్రవేశ స్థానం. ఇక్కడకి చేరుకున్నాక నాకు ఏదో నదీ మూలాన్ని కనుక్కున్న భావన కలిగింది. ఈ నగరం ఇవాల్టి పారిస్, రోమ్‌లకు పదింతలుంది. నగరం చుట్టూ కట్టిన గోడను చూస్తే ఆశ్చర్యం అనేది చిన్న మాట అనిపిస్తుంది.

టెర్రకోట సైనికుల బొమ్మలు బయల్పడిందిక్కడే. ఇక్కణ్నుంచి బీజింగ్ వెళ్ళాను. అన్నాళ్ల పాటు ఎడారులు, పర్వతాలు, అడవులు, గ్రామాల్లో తిరిగిన నాకు బీజింగ్ కాలుష్యాన్ని భరించడం చాలా కష్టమయింది. ఒకవైపు కాలుష్యం, మరోవైపు రాజ్యబలం - నాకు ఊపిరాడనివ్వలేదు. ఫర్బిడెన్ సిటీతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద నగరం షాంఘైను సందర్శించేసరికే ఇక చాలు అనిపించేసింది. తర్వాత హాంగ్‌కాంగ్, అక్కణ్నుంచి మన దేశానికి చేరుకుని నా ప్రయాణాన్ని ముగించేశాను.


మొత్తానికి ఈ ప్రయాణంలో నాకు అర్థమైన విషయాలు కొన్ని : విశాల విశ్వంలో మనం చిన్న ప్రాణులం, ఏ రకంగా చూసినా అల్పజీవులం.మనం చూసే ప్రదేశాల కన్నా, అక్కడ కలిసే వేర్వేరు వ్యక్తులు, వారి నుంచి వచ్చే భిన్నమైన ఆలోచనలు ముఖ్యమైనవి, వాటిని అవగాహనలోకి తెచ్చుకున్నప్పుడే అసలు ప్రయాణం సార్థకమైనట్టు! ఇంతాచేసి ఇదేదో భారీ ప్రాజెక్టు అనుకోకండి. మన దేశంలో నాలుగూళ్లు తిరిగితే అయ్యేంత ఖర్చే అయింది నాకు. ఈ స్ఫూర్తితో వచ్చే ఏడాది హిమాలయాల ట్రెక్కింగ్ చెయ్యాలనుకుంటున్నా.


- నల్లవారి గౌతమ్‌రెడ్డి
ఫోన్ నెం. 9704439788
seyyahproject.blogspot.com