విహారాలు

India

Gamyam

Monday, May 16, 2011

మారిషస్

మారిషస్ వలసకూలీలే వర్థిల్లారు

"దేవుడు మొదట మారిషస్‌ను సృజించి, తరువాత స్వర్గాన్ని సృష్టించాడు. నిజం చెప్పాలంటే, మారిషస్‌కు నకలుగానే స్వర్గాన్ని సృష్టించాడు''- సుప్రసిద్ధ రచయిత మార్క్‌ట్వైన్ చేసిన వ్యాఖ్యలో కొంత ప్రశంస ఉన్నా, ఎక్కువ కొంటెతనమే ఉన్నది. మారిషస్ అందాన్ని గురించి పర్యాటకులు సరే, అక్కడి ప్రజలు చెప్పుకునే గొప్పలను వినీవినీ ఆయన ఆ మాటలు అన్నారట. ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని విసిరిపారేసి, వాచ్యార్థంలోనే ఆయన ప్రశంసను మారిషన్లు ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు.

జాతీయభావన ఏదీ ఇంకా గట్టిగా స్థిరపడని మారిషస్‌లో దేశమంటే ఇంకా మట్టీ నీరూ పర్వతాలూ పచ్చదనమే. కాసింత గాలీ, కొంచెం సూర్యరశ్మీ, అపారమైన సముద్రమూ, తగినంత విశ్రాంతీ- పనిగంటల తరువాత మారిషన్లకు ఇదే ప్రపంచం. కూపస్థమండూకాలని నిందాపూర్వకంగా అంటుంటారు కానీ, చిన్న ప్రపంచం నిజంగానే చింతలు లేని ప్రపంచం. ద్వీపవాసుల మనస్తత్వాలు చిరుసరిహద్దులలోనే సంతోషాన్ని వెదుక్కునేవిగా ఉంటాయి. ఎల్లలు లేని ప్రపంచం మీద వారికి మోజు ఉండదు. వారి ఆశలు దురాశల దూరాల వైపు కన్నెత్తి చూడవు.


మారిషస్ బహుశా ఇప్పుడు కూడా చాలావరకు అట్లానే ఉండి ఉంటుంది. కానీ, అది నిన్న అట్లా లేదు. బహుశా రేపు అట్లా ఉండనూబోదు. అక్కడి నైసర్గికత అద్భుతమే కావచ్చు కానీ, మానవ ప్రవృత్తి అక్కడ అత్యంత క్రౌర్యాన్నే చూపింది. ఐరోపా సామ్రాజ్యవాదుల మానవ వ్యాపారానికి, శ్రమదోపిడికి అది వేదిక అయింది. అక్కడి చెరుకు రసంలో నల్లజాతి రక్తకణాలున్నాయి. భారతీయుల స్వేదబిందువులున్నాయి. చెరకు పండించేదొకరైతే వండేది మరొకరు- అని ఒక మారిషస్ సామెత.

అక్కడ ఆదివాసులెవరూ లేరు


కోటి సంవత్సరాల కిందట హిందూమహాసముద్ర గర్భంలోని అగ్నిపర్వతం బద్దలై ఎగిసిన శిలాద్రవం రెండు మూడు దీవులకు జన్మనిచ్చింది. అందులో పెద్దది మారిషస్. మారిషస్ తీరమంతా వ్యాపించిన పగడాల శిలలు సాగర ఉధృతి నుంచి ఆ దేశాన్ని రక్షిస్తాయి. మడగాస్కర్‌కు తూర్పువైపున సుమారు తొమ్మిదివందల కిలోమీటర్ల దూరంలో, భారతదేశ దక్షిణతీరానికి నైరుతి దిశగా సుమారు మూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిషస్ దేశం వైశాల్యం అన్ని దీవులతో కలిసి రెండువేల నలభై చదరపు కిలోమీటర్లు. మారిషస్ విశేషమల్లా ఒకటే, అక్కడ ఆదివాసులెవరూ లేరు. నాలుగైదువందలేళ్ల కిందటిదాకా మానవ ఆవాసం తెలియని దేశం అది. మొదట అరబ్ యాత్రికులు, తరువాత పోర్చుగీసు నావికులు మజిలీచేసిన ఆ ఆఫ్రికన్ దీవిని డచ్ సామ్రాజ్యవాద అన్వేషకులు ఆక్రమించారు.

వారి ఆకలికి అక్కడి డోడో పక్షి (స్థూలంగా ఉండి, గెంతడం తప్ప ఎగరలేని పక్షి) అంతరించిపోయింది. డచ్ రాకుమారుడు మారిస్ నసావ్ పేరుతో మారిషస్ అయిన ఆ దేశం ఫ్రెంచివారి వలసగా వందసంవత్సరాల దాకా ఉండింది. ఈ కాలంలోనే చెరకుతోటల పెంపకానికి ఆఫ్రికన్ నల్లజాతివారిని బానిసలుగా వినియోగించారు. అత్యంత క్రూరమైన బానిసవిధానం అక్కడ రాజ్యమేలింది. ఫ్రెంచివారి నుంచి 19వ దశాబ్దారంభంలో మారిషస్ బ్రిటిష్‌వారి చేతిలోకి వచ్చింది. బానిసవిధానంపై వ్యతిరేకత బ్రిటిష్ సమాజాన్ని కూడా నాడు కుదిపివేసింది. తప్పనిసరి అయి బ్రిటిష్ పార్లమెంటు బానిసత్వాన్ని రద్దుచేసింది. నల్లజాతివారు విముక్తులయ్యారు. స్వతంత్రులైన నల్లజాతివారు అనేకమంది తమ స్వదేశాలకు తిరిగివెళ్లగా, చెరకు భూస్వాములకు శ్రామికుల కొరత ఏర్పడింది. అప్పుడు ఇన్‌డెంచర్ పద్ధతిలో శ్రామికులను భారత్ నుంచి, చైనా నుంచి తరలించడం మొదలయింది.

70 శాతం భారతీయులే


మారిషస్ నేటి జనాభాలో సుమారు 70 శాతం మంది భారతీయ సంతతివారు . ఆశ్చర్యకరంగా అందులోని అత్యధికులు నేటి బీహార్ రాష్ట్రం నుంచి వెళ్లినవారు. సముద్రతీరం లేకపోయినా, కలకత్తా రేవు నుంచి ఎగుమతి అయిన మానవవనరులన్నీ దాదాపుగా బీహారీవే. బెంగాలీలు చదువులకోసం వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లారు కానీ, పొట్టచేత పట్టుకుని పడవలెక్కలేదు. మారిషస్ జాతిపిత శివసాగర్‌రామ్‌గులామ్ పూర్వీకులూ, అధ్యక్షులు అనిరూధ్ జగన్నాథ్ పూర్వీకులూ బీహార్‌నుంచి వచ్చిన శ్రామికులే. వారి పూర్వీకుల భాష భోజ్‌పురీయే. చెన్నై రేవు నుంచి, ఉత్తరాంధ్ర రేవుల నుంచి తమిళులు, తెలుగువారు మారిషస్ వెళ్లారు. ఉత్తరభారతదేశంలో 19 వ శతాబ్దం ఆరంభం నుంచి నెలకొని ఉన్న రాజకీయ అస్థిరతా, దారిద్య్రమూ, ఆర్థిక సంక్షోభమూ బీహార్ వంటి ప్రాంతాలనుంచి శ్రామికుల వలసకు నేపథ్యమైంది. 1834లో భారత్ నుంచి ఇండెంచర్ శ్రామికులతో మొదటి ఓడ మారిషస్ చేరింది. ఆ వలస తరువాత మూడు నాలుగు దశాబ్దాల దాకా సాగుతూనే వచ్చింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం ఉత్తరాదిలో నెలకొన్న సంక్షోభపరిస్థితులు కూడా ఈ వలసలకు కారణమయ్యాయి.

దక్షిణాదిలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చిన వరుస దుర్భిక్షాలు కొందరు సుదూరదేశానికి దోహద పడ్డాయి. తాము ఎంత దూరంలో ఉన్న ప్రాంతానికి వెడుతున్నామో, ఎప్పుడు తిరిగి రాగలమో వలసవెడుతున్న వారికి అవగాహన లేదు. త్వరలోనే తిరిగి రాగలమనే ధైర్యంతోనే చాలామంది ఓడలెక్కారు. అందుకే చాలామంది తమ కుటుంబసభ్యులను వదిలిపెట్టి బయలుదేరారు. శ్రామిక కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందంలో కనీస పనికాలం ఐదేళ్లు మాత్రమే ఉండడంతో, వేతనం, భోజనం, వైద్యం, నివాసం- వీటికి యజమానులు హామీ పడడంతో మెరుగైన జీవితం లభిస్తుందన్న ఆశతో శ్రామికులు వలసలకు సంసిద్ధం అయ్యారు.

లేబర్ కాంట్రాక్టర్లు స్త్రీకార్మికులను సమాన సంఖ్యలో తీసుకువెళ్లడానికి సుముఖంగా లేకపోవడంతో- మారిషస్‌లో స్థిరపడిన భారతీయులకు అతి త్వరలోనే కుటుంబ సమస్యలు తలెత్తాయి. ఉన్న సంసారాలు ఛిద్రం కావడం, పిల్లలకు సంబంధాల విషయంలో తమ కులం, భాష వారు దొరకకపోవడం- వంటి అనేక సమస్యలను వారు ఎదుర్కొన్నారు. ఇక యజమానుల క్రూరత్వానికి అయితే హద్దేలేదు. పనిచేయలేని వారికి అన్నమూ జీతమూ ఇవ్వకుండా వేధించేవారు. చెరకు తోటలమధ్య ఆకలితో చచ్చిపడి ఉన్న మనుషుల శవాలు తరచు తారసపడేవి. మారిషస్‌లో కట్టుకూలీల దుస్థితి గురించి గాంధీజీ అనేకమార్లు బ్రిటిష్‌ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయన 1901లో స్వయంగా మారిషస్ వెళ్లి మూడువారాల పాటు గడిపి, భారతీయుల స్థితిగతులను పరిశీలించారు. అంతిమంగా కట్టుకూలీల వ్యవస్థ రద్దు కావడానికి గాంధీపట్టుదల కూడా ఒక కారణం అయింది.

లౌకిక తెలుగు సమాజం వెలిసింది


ఫ్రెంచిపాలనలో వచ్చి స్థిరపడిన నల్లజాతివారు, కొందరు శ్వేతజాతీయులు, బ్రిటిష్‌పాలనలో కట్టుకూలీలుగా వచ్చిన చైనీయులు, భారతీయులు - వీరంతా ఒకే సమాజంగా రూపొందడానికి శతాబ్దానికి పైగా విఫలయత్నం చేశారు. మారిషన్లుగా కొన్ని సాధారణ లక్షణాలను సమకూర్చుకున్నప్పటికీ, ఫ్రెంచ్ పాలనలో రూపొందిన స్థానికమైన ఫ్రెంచిమిశ్రిత క్రోల్‌భాష, బ్రిటిష్ వలసపాలనలో అనుసరించవలసి వచ్చిన అధికార ఇంగ్లీషుభాష, తమ వెంట మోసుకువచ్చిన తమ పాత భాష- వీటి మధ్య మారిషన్లు నలిగిపోయారు. క్రమక్రమంగా తమ పూర్వీకుల భాషను విసర్జిస్తూ, స్థానిక క్రోల్- ఇంగ్లీషు భాషలను అనుసరించసాగారు. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్రపోరాటంలో ప్రధానంగా భారతీయ సంతతివారు భోజ్‌పురీల నాయకత్వంలో పాల్గొన్నారు. తక్కిన ప్రజావర్గాల వారు కూడా వలసవాద వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు కానీ, అధిక సంఖ్యాకులకు సహజంగానే నాయకత్వం దక్కింది.

పెద్దగా రాకపోకలు లేని ఒక దీవికి వివిధ నేపథ్యాలకు చెందిన భారతీయులు వలస వెళ్లి స్థిరపడిన సందర్భంలో- కులాలు, ఇతర భేదాలు సమసిపోవడమో, కొత్త రూపు తీసుకోవడమో జరగాలి. కాని మారిషస్‌లో కులం పూర్తిగా మాసిపోయిందని చెప్పలేము. శాకాహార అగ్రవర్ణమొకటి అక్కడి రాజకీయార్థిక శ్రేణుల్లో రూపొందింది. ఇప్పుడు పాలిస్తున్న రామ్‌గులామ్, జగన్నాథ్ ఆ వర్గానికి చెందినవారే. అయితే, తమలో కులాల సమస్య లేదని అక్కడి తెలుగుసంస్థల నాయకులు అంటున్నారు. దక్షిణాఫ్రికా తెలుగువారిలో లాగానే మారిషస్ తెలుగువారిలో కూడా 'నాయుడు' ఇంటిపేరున్న వారున్నారు. అధికులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినవారు కావడంతో, ఆ ఇంటిపేరును ఫలానా కులానికి చెందినదిగా భావించే అవకాశం ఉన్నది. కానీ, ఇతరుల విషయంలో ఇంటిపేర్లే అదృశ్యమయ్యాయి, కులాలేమిటో వారికి గుర్తు లేదు. ఇతర భాషల వారితో, మతాల వారితో కుటుంబాలు సంకరం కూడా అయ్యాయి. ఒక రకంగా లౌకికమయిన తెలుగు సమాజం మారిషస్‌లో వెలిసినట్టు లెక్క.

ఉగాది జాతీయ సెలవుదినం


లౌకికమయిన తెలుగుసమాజమే అయినా, అది ఎంతవరకు తెలుగు సమాజం అన్నది ఒక ప్రశ్న. 'మా పిల్లలకెవరికీ తెలుగు రాదు, మళ్లీ నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము' అన్నారు. మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం చైర్మన్ ఆదినారాయణ్ హచ్చమా (ఈయనను ఆత్మా అని పిలుస్తారు) 'మేం ఫ్రెంచిలో మాట్లాడతాము, ఇంగ్లీషులో రాస్తాము, తెలుగులో ప్రార్థన చేస్తాము' అని చెప్పారు. మారిషస్ వచ్చినతరువాత ఈ నాలుగైదు తరాల కాలంలో, తెలుగువారు మరచిపోనిది రామభజనలు మాత్రమేనని, ఇప్పటికీ ఉగాది, రామనవమి జరుపుకుంటారని చెప్పారు. మారిషస్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది తెలుగులో పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టనున్నారు. మారిషస్ ప్రభుత్వం తెలుగు ఉగాదిని జాతీయసెలవు దినంగా కూడా ప్రకటించింది.

ఉత్తరాంధ్ర వాళ్లే ఎక్కువ


మారిషస్ తెలుగువారు ఇప్పుడు కోరుకుంటున్నది ప్రత్యేక ప్రతిపత్తి. హిందువుల పేరిట ఉత్తరాదివారితో కలిపేసి తమకు ఏ పరిగణనా ఇవ్వకపోవడం సరికాదని, తెలుగువారిని, ఇతర భాషల వారిని విడిగా గుర్తించాలని వారు కోరుతున్నారు. జనాభా లెక్కల్లో చాలామంది తెలుగువారు మతం అన్న ప్రశ్న దగ్గర తెలుగు అని రాస్తుంటారు. పూర్వీకుల భాష కింద క్రోల్‌ను పేర్కొంటారు. దీని వల్ల తెలుగువారి సంఖ్య జనాభా లెక్కల్లో సరిగా ప్రతిఫలించడం లేదని, మూడుదశాబ్దాలుగా తెలుగువారి జనాభా ఉన్నచోటనే ఉండడం ఆశ్చర్యకరమని మారిషస్ ప్రభుత్వంలో ఆర్థిక నిపుణులుగా పనిచేస్తున్న రచయిత సోకప్పడు రామినాయుడు (విష్ణు) అంటారు.

రామినాయుడు మారిషస్ తెలుగువారి గురించి అనేక పుస్తకాలు రాశారు. తన తాత అయిన బాపినాయుడు పండ సోకప్పడు జ్ఞాపకాలను ఆయన ఇంగ్లీషు, క్రోల్ భాషల్లో పుస్తకంగా రాశారు. మారిషస్ తెలుగువారి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం పనికివస్తుంది. మారిషస్ తెలుగువారి ఇంటిపేర్ల గురించి, మారిషస్‌లో తెలుగువారి పెళ్లిళ్ల గురించి, పండగల గురించి, తెలుగు క్యాలండర్, పంచాంగాల గురించి రామినాయుడు రాసిన పుస్తకాలు ప్రసిద్ధాలు. భారతదేశంలోని తెలుగుసమాజంతో అనుసంధానం చెందాలని మారిషస్ తెలుగువారు తపన పడుతున్నారు. రాష్ట్రవిభజన గురించి ప్రస్తావిస్తూ- రేపు రెండు రాష్ట్రాలయితే, మారిషస్ తెలుగువారం ఏ రాష్ట్రంతో మానసిక అనుబంధం ఏర్పరచుకోవాలి? అని ఆత్మ ప్రశ్నించారు. మారిషస్‌కు వచ్చిన తెలుగువారిలో ఉత్తరాంధ్రవారే కాకుండా- నెల్లూరు జిల్లావారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కూడా ఉన్నారు.

ఒకప్పటి బాధితులే నేటి పాలకులు


మారిషస్ స్వాతంత్య్రం పొంది నలభయిమూడేళ్లే. పూర్తి రిపబ్లిక్‌గా పరివర్తన చెందింది రెండుదశాబ్దాల కిందటే. బానిసత్వమూ వెట్టిచాకిరీ లేని స్వతంత్ర ప్రస్థానంలో మారిషస్ ఇంకా బాల్యంలోనే ఉన్నది. చిన్నదేశం కావడం వల్లా, ద్వీపదేశం కావడం వల్లా ఉండే సహజ లక్షణాలు, నవ స్వతంత్రదేశం కావడం వల్ల మిగిలి ఉన్న ఆదర్శ సంక్షేమవ్యవస్థలు ఆ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అదే సమయంలో దేశదేశాల పర్యాటకులకు విడిది కావడం, పారిశ్రామికులకు సంపన్నులకు పన్నుల్లేని స్వర్గం కావడం ప్రపంచీకరణ యుగంలో మారిషస్‌ను ప్రమాదకరసీమల్లోకి నెట్టివేశాయి. శుభ్రతకు, ప్రకృతికీ పెట్టింది పేరైన మారిషస్ ఇప్పుడు అభివృద్ధిలో సింగ్‌పూర్‌ను ఆదర్శంగా భావిస్తున్నది. నిట్టనిలువు హర్మ్యాలనే అభివృద్ధి చిహ్నాలుగా భావించేపక్షంలో, మారిషస్ కూడా త్వరలోనే జనసమ్మర్దంతో వినియోగ సంస్కృతితో కిక్కిరిసిపోతుంది. చెరకుతోటలు అంతరించిపోయి, కాంక్రీటు నిర్మాణాలే అంతటా నిండిపోతాయి. సముద్రతీరాలు కాలుష్యంతో మురిగిపోతాయి. ఎబొనీ అడవులు కలపదాహానికి ఎండిపోతాయి.

ఒకనాడు కూలీలుగా వలసవెళ్లిన ప్రజలు తమను తాము పాలించుకుంటున్న దేశం మారిషస్. నూటాయాభై ఏండ్ల కిందట నష్టజాతకులై మాతృదేశాన్ని వదిలివెళ్లినవారు, ఇప్పుడు మరో దేశంలో స్వతంత్రపౌరులుగా ఉన్నారు. తమ దేశ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోగలిగిన అవకాశం వారికి ఉన్నది. భారత ప్రభుత్వంతో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని తమ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. దక్షిణాఫ్రికాలోను, సుదూర కరేబియన్ దీవుల్లోను తమలాగే వలసవెళ్లిపోయిన భారత సంతతివారితోనూ ఒక అనుబంధాన్ని నిర్మించుకోవచ్చు. వలసవాద క్రూరత్వంతోనే మానవ ఆవాసం మొదలైన మారిషస్‌లో ఇప్పుడు బాధితులే పాలకులు. వారి వల్లనే అది ఒక దేశం అయింది. భారతదేశపు అవలక్షణాలు సోకకుండా వారి ప్రయాణం సాగాలి. భారతీయులకు మార్గదర్శకంగా ఉండేలా వారి ప్రగతి ఉండాలి.

విషాద పాదముద్రలు


"మారిషస్ ఎట్లా అనిపిస్తోంది?'' అని అడిగారు ఆత్మా, రామినాయుడు.
"మారిషస్ ఎక్కడ చూశాను, మేం మారిటిమ్ మాత్రమే చూస్తున్నాము'' అని చెప్పాను. మారిటిమ్ అంటే మేం విడిది చేసిన రిసార్ట్ హోటల్. ఏప్రిల్ 24 నుంచి 28 దాకా మారిషస్‌లో అయిదురోజుల అధికార పర్యటన కోసం వచ్చిన భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ వెంట వెళ్లిన మీడియా బృందానికి ఆ ఐదునక్షత్రాల హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే లేవడం, రాష్ట్రపతి కార్యక్రమానికి అనుగుణంగా వాహనాలలో వెళ్లడం, రాత్రికి తిరిగి రావడం తప్ప సొంతంగా ఆ ద్వీపదేశాన్ని పరిశీలించడానికి గానీ, ప్రజలతో మాట్లాడడానికి గానీ మాకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు తెలుగుసినిమా డ్యూయెట్లలో విరివిగా కనిపిస్తున్న సుందర సముద్రతీరాలను ప్రత్యక్షంగా చూడలేకపోయాము. ఒకరోజు మాత్రం ఒక కార్యక్రమాన్ని తప్పించుకుని మారిషస్ తెలుగు సాంస్క­ృతిక కేంద్రం వారిని కలుసుకున్నాను.

అట్లాగని, రాష్ట్రపతి కార్యక్రమంలో మారిషస్‌ను అర్థం చేసుకోవడానికి కావలసిన దినుసులు లేవని కాదు. చిన్న చిన్న రోడ్ల గుండా మోటార్‌సైకిల్ పైలట్ల వెనుక ప్రయాణించిన మా వాహనాల అద్దాలకిటికీలు మారిషస్‌ను బాగానే అర్థం చేయించాయి. రాష్ట్రపతి సందర్శించిన స్థలాలు కూడా ఆ దేశచరిత్రను, వర్తమాన ప్రాధాన్యాలను అవగతం చేసుకోవడానికి ఉపకరించాయి. రాష్ట్రపతి కార్యక్రమంలో ఆ దేశానికి, భారత్‌కు చెందిన జాతీయనేతలకు నివాళులర్పించే కార్యక్రమంతో పాటు, ఒక ధార్మిక కార్యక్రమం, రెండు చారిత్రక వారసత్వ స్థలాల సందర్శన కూడా ఉన్నాయి.

మధ్య మారిషస్‌లోని సవన్నె జిల్లాలో ఉన్న గంగాతలావ్ (గంగా తటాకం) మతప్రాధాన్యమున్న స్థలం. మారిషస్ పర్యావరణ, జల శాఖలు ఈ స్థలాన్ని నిర్వహిస్తున్నాయి. కొండల మధ్య అగాధంలో ఏర్పడిన ఆ తటాకం (పూర్వపు పేరు గ్రాండ్ బేసిన్) లోని నీరు భారతదేశంలోని గంగానది నుంచి వస్తున్నట్టుగా 19వ శతాబ్దం చివరలో ఒక హిందూపూజారికి కల వచ్చిందట. అది ఆ నోటా ఈ నోటా ప్రచారమై హిందువులలో సంచలనం సృష్టించింది. మరుసటి సంవత్సరం మహాశివరాత్రికి ఆ తటాకం నుంచి నీరు తీసుకువెళ్లి అభిషేకం చేశారు. తరువాత కాలంలో ప్రతి మహాశివరాత్రికి కాలినడకన వెళ్లి అక్కడ ఆ తీర్థాన్ని సందర్శించడం ఆనవాయితీ అయింది.

1972లో భారతదేశం నుంచి గంగాజలాన్ని తె చ్చి ఆ సరస్సులో కలిపారు. 1998లో తటాకాన్ని పవిత్రసరస్సుగా ప్రకటించారు. 2007లో 108 అడుగుల శివవిగ్రహాన్ని సరస్సు ఒడ్డున ప్రతిష్ఠించారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా తన వెంట 60 లీటర్ల గంగాజలాన్ని తీసుకువచ్చి, తటాకంలో కలిపారు. శివుని విగ్రహం దగ్గర వేదమంత్రాలతో రాష్ట్రపతి కుటుంబసభ్యులు పూజాదికాలు చేశారు. సెక్యులర్ రాజ్యాధినేత గంగాజలాన్ని తీసుకురావడం, పూజలు చేయడం సబబేనా అన్న ప్రశ్నలు ఆ కార్యక్రమం దగ్గర వినిపించాయి.

రాష్ట్రపతి కార్యక్రమంలో మరో ముఖ్యమైనది ఆప్రవాసీఘాట్ సందర్శన. బానిసత్వాన్ని నిషేధించబోతున్న బ్రిటిష్ ప్రభుత్వం దాని స్థానంలో కట్టుకూలీల వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనుకుని అందుకు ఎంచుకున్న వలసదేశం-మారిషస్. 1834లో మొదటి కట్టుకూలీల నౌక 'అట్లాస్' పోర్ట్‌లూయిస్ తీరం చేరింది. మొదటి అజ్ఞాత కూలీ మారిషస్ నేలపై అడుగుపెట్టిన చోట నిర్మించిన స్మారకమే ఆప్రవాసీఘాట్. ఆ స్థలంలో వలసకూలీలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక విడిది, వైద్యసదుపాయాల గదులు ఉన్నాయి. మూడంతస్థుల అసలు భవనం శిథిలమై ఇప్పుడు ఒక అంతస్థు మాత్రమే మిగిలింది. మానవజాతి చరిత్రలో ఇండెంచర్‌కూలీల వ్యవస్థ తప్పనిసరిగా నమోదు కావలసిన దుర్మార్గఘట్టమని గుర్తించిన యునెస్కో 2006లో ఈ స్థలాన్ని అంతర్జాతీయ చారిత్రక వారసత్వ స్థలంగా గుర్తించింది. రాష్ట్రపతి ఈ స్థలంలో మారిషస్‌కు వలసవచ్చిన కూలీలకు నివాళి అర్పించారు. 1834నుంచి 1923 దాకా సాగిన ఈ వలసల్లో భారతీయులే కాక, చైనా తదితర దేశాలనుంచి కూడా కార్మికులు వచ్చారు.

ఆప్రవాసీఘాట్ ప్రధానంగా మారిషస్‌లోని భారతీయసంతతివారికి ఉద్వేగపూరితమైన స్మారకంకాగా, ఆఫ్రికన్‌సంతతివారికి ముఖ్యమైనది బానిసత్వచరిత్రకు సంబంధించిన స్మారకం లె మోర్నె. మారిషస్ నైరుతి భాగంలో హిందూమహాసముద్రంలోకి తొంగిచూస్తున్నట్టున్న ఈ పర్వతం నల్లబానిసలు పారిపోయి తలదాచుకునే స్థలంగా ప్రసిద్ధిచెందింది. ఈప్రాంతంలో ఫ్రెంచివారి బానిస వ్యాపారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో, తిరుగుబాటు చేసిన బానిసలు, పారిపోయిన బానిసలు ఈ కొండసానువుల్లో సంచరించేవారట.

1835 ఫిబ్రవరి ఒకటిన ఒక పోలీసు బృందం కొండను ఎక్కడానికి వస్తూ, బానిసత్వవిధానం రద్దయిన సమాచారాన్ని కొండపై దాక్కున్న బానిసలకు తెలియజేయడానికి ప్రయత్నించారట. పోలీసులు చెబుతున్నదేమిటో వినిపించుకోకుండా, వారు తమను పట్టుకోవడానికే వస్తున్నారని అనుకుని కొండకొమ్ముమీద నుంచి బానిసలు దూకి చనిపోయారట. అప్పటినుంచి ఫిబ్రవరి ఒకటోతేదీని మారిషన్ క్రోల్‌లు (ప్రధానంగా క్రోల్ ఫ్రెంచి మాట్లాడే ఆఫ్రికన్లు) బానిసత్వ నిషేధ స్మారకదినంగా జరుపుకుంటున్నారు. ఈ స్థలాన్ని కూడా యునెస్కో చారిత్రక వారసత్వ స్థలంగా గుర్తించింది. ప్రతిభాపాటిల్ ఈ స్మారకం దగ్గర కూడా నివాళులర్పించారు. వేర్వేరు ప్రజాశ్రేణులకు సంబంధించిన రెండు ప్రధాన చారిత్రక అంశాలను స్ప­ృశించడం ద్వారా మొత్తం ప్రజానీకాన్ని సంతృప్తిపరచినట్టయింది.
గంగాతలాబ్ మినహాయిస్తే, ఈ రెండు స్థలాల వెనుకా విషాదం ఉన్నది, వాటిని స్మరించుకుని ముందుకు వెళ్లడంలో మారిషస్ సౌందర్యమూ ఉన్నది. తెలుగుసినిమాల్లో కనిపించే మారిషస్‌లో ఈ ఉద్వేగం, అందం ఎక్కడ కనిపిస్తుంది?
* కె. శ్రీనివాస్

No comments:

Post a Comment