విహారాలు

India

Gamyam

Sunday, May 22, 2011

ఉరిమే డ్రాగన్ నేలలో... * Royal Kingdom of Bhutan

'పాలపుంతకి సైతం పాదయాత్ర చేస్తాను' అని నా 'భ్రమణకాంక్ష' పుస్తకంలో రాసుకున్నాను. కానీ సరిహద్దులు దాటి ప్రయాణాలు చెయ్యటానికి నాకు చాలా కాలం పట్టింది. తెలిసిన మిత్రుల ద్వారా గత సంవత్సరం నేపాల్ వెళ్లాను. ఈ సంవత్సరం భూటాన్ వెళ్లాను. ముందుగా ఖాట్మండు చేరుకొని పాత మిత్రుల్ని పలకరించి అక్కడ నుండి కాకరబిత్తా మీదుగా సిలిగురిలోని టెన్సింగ్ నార్కే బస్‌స్టాండుకి వెళ్లి, భూటాన్ బోర్డర్‌లో ఉన్న జయగాం అనే టౌన్‌కి ప్రయాణమయ్యాను.

దారి పొడవునా వంపుగా పెరిగిన వెదురు పొదలూ, నిటారుగా నింగిలోకి దూసుకుపోతున్న పోక చెట్లూ పచ్చని పతాకాల్ని ఎగురవేస్తున్నట్లు ఉన్నాయి. ఎర్రని సిమోల్ పూల చెట్ల మీద నల్లని బుల్ బుల్ పిట్టలు కూర్చుని పాడుతూ వసంతానికి వన్నెలు అద్దుతూ ఉన్నాయి. సాయంత్రానికి జయగాం చేరుకున్నాను. దానికి ఆనుకునే ఉంటుంది ఫుంట్‌షూలింగ్ టౌన్. అక్కడ నుండి Royal Kingdom of Bhutan మొదలవుతుంది. సరిహద్దు గేటు దాటి లోపలికి వెళ్లేసరికి బజార్ల నిండా విదేశీ యాత్రికులు, స్థానికులు, భారతీయులు సమపాళ్లలో కనిపించారు. భూటాన్ చేరుకోవటానికి ఈ ఫుంట్‌షూలింగ్ ఒక్కటే సరైన భూమార్గం. డార్జిలింగ్, సిక్కిం, కలకత్తాల నుండి ఇక్కడికి నేరుగా బస్‌లు ఉన్నాయి. అక్కడ ప్రతి కొండ మీదా ఇళ్లు కనిపిస్తాయి. కొండ వాలుల్లో కనిపిస్తున్న కాలి బాటల వైపు నా మనసు లాగింది. ఏ బాట పట్టుకొని నడిచినా ఏదో ఒక వింత ప్రదేశంలోకి చేరుకోవడం ఖాయం. బౌద్ధమందిరాల ముందు ఉన్న పెద్ద ప్రార్థనా చక్రాలు నిరంతరం 'ఓం మణి పద్మేహం' అంటూ తిరుగుతూనే ఉంటాయి. బార్డర్ పాస్ ఇచ్చే ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో అప్లికేషన్ తీసుకొని బజార్లన్నీ బాగా తిరిగి, ఒక ఇండియన్ హోటల్లో ఆకలి తీర్చుకొని, ధర్మశాలకి చేరుకొన్నాను రాత్రికి.


పాస్‌పోర్టు, వీసా అక్కరలేదు


తెల్లవారగానే ఇమ్మిగ్రేషన్ ఆఫీసుకి పరుగులు తీశాను. అక్కడ నాకంటే ముందే చాలామంది పాస్‌ల కోసం గుంపులుగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కూలీలు, కాంట్రాక్టర్లు. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన ఒక లేబర్ కాంట్రాక్టరుతో పరిచయం అయింది.'అయ్యా ! నేను మూడు నెలల నుండి తిరుగుతున్నాను. ఈ రోజు నా ఫైలు మీద సంతకం అవుతుంది' అని ఆనందంగా చెబుతున్నాడు. భూటాన్ వెళ్లే భారతీయ యాత్రికులకి పాస్‌పోర్టు, వీసా అక్కరలేదు. కాని పాస్ ఉండాలి. దానికి రెండు ఫోటోలు, ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు. అయితే భూటాన్ ఆఫీసరు నన్ను చూడగానే 'ఒంటరిగా వెళ్లే వారికి పాస్‌లు ఇవ్వటం లేదు. మీరు ఏదైనా గ్రూపులో చేరండి ఇస్తాం' అన్నాడు. తర్వాత ఏమనుకున్నాడో నా అప్లికేషన్ మీద తొమ్మిది రోజులకి బార్డర్ పాస్ స్టాంప్ వేశాడు. ఆనందంగా బయటికి వచ్చాను.


వెంటనే బస్‌స్టాండ్‌కి వెళ్లి తింఫూకి టికెట్ తీసుకున్నాను. ఏడు గంటల ప్రయాణం. చార్జీ 180 'నూ'లు. వారి 'నూ' మన రూపాయికి సమానం. వారి టైం మనకంటే 30 నిమిషాలు ముందు ఉంటుంది. బస్‌స్టేషన్ పేరు 'భూటాన్ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాన్స్‌పోర్టు సర్వీస్'. ప్రయాణీకుల భద్రతకి అంత ప్రాముఖ్యం ఇస్తారన్న మాట. ఐదు నిమిషాల్లోనే ఆకాశమంత ఎత్తులో ఉన్న రోడ్డు మీదకి చేరుకున్నాం. గంటకి 30 కి.మీ. కంటే వెళ్లలేవు వాళ్ల చిన్న బస్సులు. ఒక పక్క 'పూర్ విజిబిలిటీ', 'ల్యాండ్‌స్లైడ్ ఏరియా' బోర్డులు కనబడుతూనే ఉన్నా మరోవైపు అద్భుతమైన ప్రకృతి. పిట్టల గోల బస్‌లోకి కూడా వినిపిస్తూనే ఉంది. బౌద్ధ మందిరాలు అక్కడక్కడ తళుక్కుమంటున్నాయి. కొండల మీద అడవులు దట్టంగా ఉన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మెట్ల పద్ధతి వ్యవసాయం ఉంది. లోయల అంచుల నిండా పళ్లతోటలు ఉన్నాయి. చాలా చోట్ల జల విద్యుత్ కేంద్రాలున్నాయి. కొన్ని చోట్ల డాములూ ఉన్నాయి.


పోర్కు లేకుండా భోజనం దొరకదు


జేడూ పట్టణం చేరేసరికి అద్భుతమైన వాస్తు కళానైపుణ్యంతో నిర్మించిన ఒక భవన సముదాయం రోడ్డు పక్కనే కనిపించింది. అది రాయల్ భూటాన్ యూనివర్శిటీ. కొద్దిగా చదునైన భూమి ఉంటే చాలు, అక్కడ ఒక గ్రామం ఏర్పడిపోతుంది. సాయంత్రానికి కిన్‌లే అనే హోటల్ ముందు ఆగింది బస్సు. ఇక్కడ ప్రతి హోటల్‌కూ బార్ కలిసే ఉంటుంది. పోర్కు లేకుండా భోజనం దొరకడం కష్టం.
కొండల పైకి వెళ్లే కొద్దీ చీకటి ముసురుకొస్తూ ఉంది. చలి పెరిగింది. ఎంత ఎత్తులో ఉన్నాసరే ప్రతి ఇంటికి కరెంట్ సౌకర్యం ఉంది. చీకటి ఎక్కువయ్యే కొద్దీ భయం పోగొట్టుకోవటానికి అది చుక్కల్ని తోడుగా తెచ్చుకొంటూ ఉంది. కొండల మీద ఇళ్లలో లైట్లు, ఆకాశంలో చుక్కలు ఒకే రకంగా మెరిసిపోతున్నాయి. తింఫూ బస్‌స్టాండు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది. తాషిక్ దేలేర్ అనే హోటల్‌లో రోజుకి అద్దె ఐదు వందల 'నూ'లు. అదే అన్నిటికన్నా తక్కువ రేటు. అక్కడ పనిచేస్తున్న వారందరూ స్త్రీలే. ఓనరు కూడా ఒక వయసు మళ్లిన స్త్రీ. ఆవిడని చూడగానే పాల్ గాగిన్ చిత్రాలు గుర్తుకొచ్చాయి. బొద్దుగా, గుండ్రంగా ఉండే తహతియన్ సుందరిలాగా ఉంది ఆమె ఆకారం.

గోడమీద ఉన్న ఒక పోస్టర్ నన్ను ఆకర్షించింది. దాని పేరు The Lamb Shall Play With The Lion. ఒక మేక పిల్ల సింహం జూలు నిమురుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఈ బొమ్మ వేసిన చిత్రకారుడి పేరు ఎడ్వర్డ్ హిక్స్. ఆయన ప్రఖ్యాతి చెందిన అమెరికన్ జానపద కళాకారుడు. 'అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమించుకోవాలి' అనే తాత్త్విక భావాలున్న వాడు హిక్స్. భూటాన్ ప్రజల ఆలోచనా సరళికి ఈ చిత్రం బాగా నచ్చి ఉంటుంది. నా గదిలో ఉన్న టీవీలో భూటాన్ రాజు వాంగ్ ఛుక్ చేస్తున్న ప్రసంగాన్ని వింటూ నిద్రలోయల్లోకి దొర్లిపోయాను.


వారికి ఆదాయం కంటే ఆనందం ముఖ్యం


నన్ను ఆహ్వానించిన మిత్రుల అడ్రసు వెతకడానికి ఉదయమే బయలుదేరాను. అయితే అది నా హోటల్ ఎదురుగానే ఉంది. దాని పేరు వాస్ట్ గ్యాలరీ. టవర్‌క్లాక్ సెంటర్‌లోని పెద్ద భవనం అది. భూటానీయలు మాట్లాడే భాష పేరు జోంఖా. భూటాన్‌ని Land of The Thunder Dragon అని పిలుస్తారు. తింఫూ జనాభా మొత్తం 70 వేలకి మించదు. అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు, కంపెనీలు లేవు. దేశం జనాభా కూడా తక్కువే. ఇరవై లక్షలు. డెబ్బయి శాతం ప్రజలు వ్యవసాయం మీదా, మిగిలిన వారు టూరిజం మీదా జీవిస్తారు. భూటాన్‌లో బియ్యం, బంగాళాదుంపలు, మొక్కజొన్న, బార్లీ బాగా పండుతాయి. టింబర్ వారికి ముఖ్యమైన ఎగుమతి. జల విద్యుత్తు ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది.

విదేశీయుల్ని ఎక్కువగా అనుమతిస్తే వారి వలన కూడా ఎంతో ఆదాయం వస్తుంది. కాని ఏడాదికి 2000 మంది కంటే ఎక్కువమందిని అనుమతించరు. "మాకు జాతీయ తలసరి ఆదాయం కంటే తలసరి ఆనందం ముఖ్యం'' అనేది వారి పాలసీ. స్మోకింగ్‌ని అనుమతించరు. అలాగే ప్లాస్టిక్‌ను కూడా సరిహద్దుల అవతలే ఉంచేశారు. మన జేబులో సిగరెట్ ఉన్నా నేరమే. రెండు సిగరెట్ పెట్టెల్ని తన జేబులో ఉంచుకొన్నందుకు ఒక బౌద్ధ సన్యాసికి రెండు సంవత్సరాల జైలు శిక్ష వేసినట్లుగా నేను ఆ రోజే న్యూస్‌పేపర్లో చదివాను. భూటాన్ వారు ఆధునికతను పూర్తిగా ఆమోదించరు. బౌద్ధమత ధర్మాలకీ, ఆధునిక నాగరికతకీ మధ్య సమతౌల్యాన్ని సాధించాలనేది వారి లక్ష్యం.

బజార్లు తిరుగుతూ భూటాన్ గురించిన ఆలోచనలు చేస్తూ పది గంటలకల్లా వాస్ట్ గ్యాలరీ చేరుకున్నాను. కానీ నన్ను భూటాన్‌కు ఆహ్వానించిన ఇద్దరు చిత్రకారులూ ఊర్లో లేరు. ఒకరు శాంతినికేతన్‌లోనూ, మరొకరు థాయిలాండ్‌లోనూ ఉన్నారట. కాసేపట్లో ప్రముఖ చిత్రకారుడు ఆషాకామా అక్కడికి వస్తే పరిచయం చేసుకొన్నాను. వారి గ్యాలరీ చూడడానికి ఇండియా నుంచి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆషాకామా ఆ గ్యాలరీలో భూటాన్ యువకులకి చిత్రకళలో శిక్షణ ఇస్తుంటాడు. చెక్కతో నిర్మించిన పాత భవనం చాలా దృఢంగా ఉంది. "ఇక్కడ మీరు ఎన్నాళ్లయినా ఉండవచ్చు'' అంటూ అక్కడ ఒక గది నాకు చూపించాడు. చుట్టూ చిత్రాలు, మంచి ఆర్ట్ లైబ్రరీ, పక్కనే హోటల్. అంతకంటే ఏం కావాలి? సాయంత్రానికి కెజాంగ్ అనే ఫోటోగ్రాఫర్ పరిచయం అయ్యాడు. "ఇండియన్ ఎంబసీలో నా One Man Show జరుగుతూ ఉంది'' అంటూ ఆహ్వాన పత్రిక అందించాడు. తరువాత నాకు పరిచయం అయిన మరో యువకుడు రించేన్. ఇతడు తింఫూలోని Happy Valley Youth అనే సంస్థని నడిపిస్తున్నాడు. "నేను ఎక్కువగా మాట్లాడతాను, కాబట్టి నాకు ఎక్కువమందితో పరిచయం ఉంది'' అంటూ నా స్కెచ్‌బుక్‌లో చిన్న బొమ్మ కూడా వేశాడు. గ్యాలరీలో కూర్చుంటే ఇలాగే చాలామంది పరిచయం అయ్యారు.

పాతిక శాతం హిందువులే


ఆ రోజు ఆషాకామా ఆహ్వానంపై ఆయన మిత్రుడి ఇంటికి వెళ్లాను. ఇల్లు చేరేసరికి చీకటి పడింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కడే రెండు రివాల్వింగ్ హీటర్ల మధ్యన కూర్చొని పెయింటింగ్ వేస్తున్నాడు. ఆయన పేరు బిస్వాస్. భూటాన్‌లో 25 శాతం హిందువులు కూడా ఉన్నారని అప్పుడే తెలిసింది. గతంలో ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవాడు. కాని ప్రస్త్తుతం ఫుల్‌టైం ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆయన నీటిరంగుల చిత్రాల్లో ఎక్కువగా భూటాన్ వాస్తుకళా నిర్మాణాలు సాక్షాత్కరిస్తుంటాయి. ఆయన వద్ద యాంగ్లింగ్ (గాలంతో చేపలు పట్టడం) మీద మంచి బుక్ కలెక్షన్ ఉంది.

భూటాన్ వారి పేర్లు ఎక్కువగా వాంగ్ ధేమ్, దోర్జీ, కిన్‌లే, దోల్మా, వాంగ్ ఛుక్ లాంటివి ఉంటాయి. వాళ్ల రాజు గారి పేరు Wang Chuck కాబట్టి మామూలు ప్రజలు ఆ పేరు పెట్టుకున్నప్పుడు Chuk అని మాత్రమే రాసుకుంటారు. అక్కడ ప్రతి ఇంటి పైకప్పుకీ ఆకుపచ్చని రంగుని విధిగా వేస్తారు. తింఫూ నగరమంతా ఒక విశాలమైన లోయలో నిర్మించబడి ఉంది. భూటానీయులు ఎక్కువగా వారి జాతీయ దుస్తులే ధరిస్తున్నారు. మోకాళ్ల వరకు నల్లని మేజోళ్లు, వదులుగా ఉండే కోటు, బూట్లు, టోపీ.. ఇవీ వారి దుస్తులు. 1959వ సంవత్సరం వరకూ భూటాన్ విదేశీయుల్ని అసలు అనుమతించలేదు. తమ నాగరికత నాశనమై విదేశీయుల ప్రాబల్యం ఎక్కువ అవుతుంది అనే భయంతో. కానీ ఆధునిక ప్రపంచపు ఒత్తిడిని తట్టుకోలేక, పాత అలవాట్లను కొనసాగించటంలో ఉండే ఇబ్బంది వలన తలుపులు తీయక తప్పలేదు.

ఇండియన్ ఎంబసీకి వెళ్లి డైరెక్టరును కలుసుకున్నాను. సమకాలీన భారతీయ కళాకారుల చేత ఒక షో ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. తరువాత హ్యాండీ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్లాను. వాల్‌నట్ చెక్కతో చేసిన చిన్న బొమ్మలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. తేలిగ్గా, అందంగా ఉన్న ఆ చిన్న బొమ్మల్లోనే ఎంతో పనితనం ఉంది. అంగుళం సైజులో ఉండే బొమ్మల్లో కూడా హావభావాలు చూపించారు. చెక్కతో చేసిన మాస్క్‌లు అన్నిటికంటే అందంగా ఉన్నాయి. వారి ఉత్సవాల్లో మాస్క్‌లు లేకుండా నాట్యం ఉండదు.

జడల బర్రెలపై ప్రయాణిస్తారు


వాస్ట్ స్టూడియోకి రోజూ వచ్చిపోయే విదేశీ యాత్రికులతో బాగానే పరిచయాలు ఏర్పడ్డాయి. గ్యాలరీ పనులు చూస్తున్న అమ్మాయి పేరు కింగ్‌వాంగ్‌దేమ్. ఆమెకి చదరంగం అంటే ఇష్టం. నా రాజుకి చెక్ చెప్పకుండానే చంపేస్తూ ఉండేది. నేను మాత్రం "మీ రాజుని ఓడించడం నాకు ఇష్టం లేదు. స్మోకింగ్, ప్లాస్టిక్ లాంటి శత్రువుల్ని జయించి మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి'' అని చెప్పి, ఆమె చేతుల్లో ఓడిపోతూ, ఆట నేర్పిస్తూ ఆనందించేవాడిని. "సార్! ఈ సారి వచ్చినపుడు మా ఊరుకి తీసుకెళ్తాను. వస్తారా?'' అని అడిగింది. "జడల బర్రె మీద ప్రయాణం చేయాలనే కోర్కె తీరుస్తానంటే తప్పకుండా వస్తాను'' అన్నాను.
"మా గ్రామానికి వెళ్లాలంటే రెండు రోజుల పాటు నడవాలి'' అంది.
"అక్కడ మీ వాళ్లు ఏం చేస్తుంటారు?''
"వ్యవసాయానికి, యాత్రికులకి గుర్రాల్ని, జడల బర్రెల్ని సరఫరా చేయడంతోపాటు కోర్టీసెప్‌లు ఏరుకొంటారు. దాంతో జీవితం గడిచిపోతుంది'' అని చెప్పింది.

ఆ పురుగులకి మంచి డిమాండ్ ఉంది

కోర్టీసెప్‌లు అంటే పురుగులు. ఇవి 14 నుండి 17 వేల అడుగుల ఎత్తులో ఉండే మంచుకొండల మీద ఉంటాయి. అవి ఒక రకమైన పురుగు మొక్కలు. చలికాలంలో పురుగులాగా, ఎండాకాలంలో గడ్డిలాగా కనిపిస్తాయి. నిజానికి ఇవి Himalayan Bat Moth అనే పురుగులు. ఇవి గొంగళి పురుగుల్లాగా ఉండి పసుపురంగులో మెరుస్తూ, చిన్న మంచు కన్నాలలో కూరుకుపోయి ఉంటాయి. వైద్యానికి పనికి వచ్చే ఈ చిత్రమైన కోర్టీసెప్‌లకు హాంగ్ కాంగ్, సింగపూర్ చేశాల్లో మంచి డిమాండ్ ఉంది. శీతాకాలంలో ఆ ప్రాంత ప్రజలు వాటి సేకరణలో ఉంటారు.

ఒక రోజు సాయంత్రం ఆషాకామా వచ్చి "మనం ఇప్పుడు కొండల మీదికి వెళుతున్నాం రండి'' అంటూ కారు ఎక్కించాడు. తూర్పు వైపున ఉన్న కొన్ని కొండల మీద బొత్తిగా చెట్లు లేవు. "ఈ ప్రాంతాల్లో మొక్కల అవసరాన్ని గురించి కింగ్‌కి ఒక ప్రపోజల్ తయారు చేస్తున్నాను'' అని చెప్పాడు ఆషాకామా. ఆ కొండల మీద కొన్నిచోట్ల బౌద్ధ మందిరాలున్నాయి. మంచినీళ్ల సౌకర్యం కూడా ఉంది. ఎత్తయిన దిబ్బల మీద వందల కొద్దీ పార్థనా జెండాలు పాతి ఉన్నాయి. నిలువుగా ఉండే ఆ ప్రార్థనా జెండాల వెడల్పు రెండు అడుగులు, ఎత్తు పది నుండి యాభై అడుగుల వరకూ ఉంది. ప్రతి పది కిలోమీటర్లకీ వీటిని చూడగలం. ఇక్కడ డెబ్బయి శాతం ప్రజలు బౌద్ధులు కావడంతో వారి ప్రార్థనా విధానాలే అమలులో ఉంటాయి.

ఆషాకామాలో దాగి ఉన్న మరో కోణం పర్యావరణ పరిరక్షణ."ఈ ప్రార్థనా జెండాల కోసం నరికి వేస్తున్న చెట్ల వలన సంవత్సరానికి పదిశాతం అడవి తగ్గిపోతూ ఉంది. నిజంగా బుద్ధుణ్ణి గౌరవించే వాళ్లు ఈ పని చేయకూడదు. దీని వలన పుణ్యం కంటే పాపమే ఎక్కువగా జరుగుతుంది'' అని వాపోయాడు. అదే సమయంలో కింద ఉన్న లోయలో ఒక చోట దట్టంగా పొగ పైకి లేస్తూ ఉంది. ఎక్కడో నిప్పంటుకొంది. నిటారుగా ఆకాశం వైపుగా ప్రయాణిస్తున్న ఆ పొగని చూస్తుంటే వేదకాలం నాటి యజ్ఞాలు గుర్తుకొచ్చాయి. 'తమని రక్షించమని వృక్షాలు ఆకాశ దేవతలకి పొగతో సందేశాలు పంపుతున్నట్లుగా ఉంది' అనుకొన్నాను.

169 అడుగుల బుద్ధుణ్ణి చూశాను

ఫోటోలు తీయడం పూర్తి కాగానే మేమిద్దరం బుద్ధ విగ్రహం ఉన్న కొండ మీదకి వెళ్లాం. ఒక ఎత్తయిన కొండని చదును చేసి బుద్ధుని కంచు విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీని ఎత్తు 169 అడుగులు. కానీ వాస్ట్ స్టూడియో నుంచి చాలా చిన్నదిగా కనిపించింది. అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. చైనా ప్రభుత్వ సహాయంతో దాన్ని గత ఐదు సంవత్సరాలుగా నిర్మిస్తూనే ఉన్నారు. భూమి స్పర్శ ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకొంటున్న ఆ మైత్రేయ బుద్ధ విగ్రహం చుట్టూతా 50 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని చూశాక తింఫూ దాటి ఎటూ వెళ్లలేక పోయానన్న బాధ తీరిపోయింది.

తెల్లారి ఏడుగంటలకే నా తిరుగు ప్రయాణం కాబట్టి ఆ రాత్రి భోజనం ఆషాకామా గారింట్లో ఏర్పాటైంది. ఆషాకామా ఇల్లు చాలా విశాలంగా ఉంది. దానిలో అచ్చంగా చిత్రకళా సాధన కోసం ఒక పెద్ద గది ఉంది. అందులో అన్నీ సగం పూర్తి చేసిన బొమ్మలే ఉన్నాయి. ప్రతి దానికీ oh my god అని ఆశ్చర్యపోయే ఆయన భార్య 'మీ కోసం పోర్క్ స్పెషల్ వండాను. దాన్ని చౌమీన్‌తో తింటేనే బాగుంటుంది ఆది భయ్యా' అంటూ ఒక పెద్ద పింగాణీ ప్లేటుని నింపి నా ముందు పెట్టింది. "మీరందరూ కూడా ఇండియాకి తప్పకుండా రావాలి'' అని ఆహ్వానిస్తూ నా బ్యాగులో ఉన్న బుద్ధుని బొమ్మ బహుమతిగా ఇవ్వబోయాను. కానీ O.M.G ఒప్పుకోలేదు సరికదా, భయ్యా We have enough Buddhas, we want your traditional art అని చెప్పారు. 'సార్! మా రాజుగారి ఫోటో ఒకటి ఉంచుకోండి' అంటూ ఆషాకామా మాత్రం నాకు వాంగ్ ఛుక్ ఫోటో ఒకటి ఇచ్చాడు.

నన్ను గ్యాలరీ దగ్గర దించి వెళ్లిపోతూ "మరలా వచ్చే ఏడాది తప్పనిసరిగా రావాలి'' అంటూ అందరూ ఆహ్వానించారు. "మీ రాజుగారి పెళ్లికి తప్పకుండా వస్తాను'' అని వాగ్దానం చేసాను.
బస్ సరిగ్గా ఉదయం ఏడు గంటలకి బయలుదేరి పొగమంచుని చీల్చుకొంటూ కిందికి దూసుకుపోతూ ఉంది. డ్రైవర్‌కి అలవాటైన దారి. మాకు బయట ఏమీ కనిపించటం లేదు. కుడివైపు కొండమీద ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహం మంచు తెరల మధ్య తేలిపోతున్నట్టుగా ఉంది. ఈ దివ్యమైన పర్వతాల ప్రపంచానికి మరలా ఎప్పుడు వస్తానో అనుకుంటూ తిరుగుముఖం పట్టాను.


- ప్రొఫెసర్ ఎమ్. ఆదినారాయణ
ఫైన్ ఆర్ట్స్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం
e-mail : auscholargypsy@gmail.com, 98498 83570, 98498 83570

No comments:

Post a Comment