
* * *
విశాఖపట్నం నుండి విమానంలో బయలుదేరిన మేము అంటే మా అమ్మా నాన్నా నేనూ ఢిల్లీలో దిగి, అక్కడ ఆ రాత్రి బస చేసి, మరుసటి రోజు మూడు గంటల ప్రాంతంలో కాశ్మీరుకు చేరాం. దారిలో విమానంలోంచి హిమాలయాలను చూడడం గొప్ప అనుభవం. ఆ కొండలన్నీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కట్టిన తెల్లటి ఇసుక గూళ్లలా కనిపించాయి. పైనుండి భూమిని చూడటమే ఒక వింత అనుభవమయితే అలాంటిది ఏకంగా హిమాలయాలనే చూడటం మహా అద్భుత అనుభవం.
ముందుగానే జమ్ముకాశ్మీర్ పర్యాటక కేంద్రం వారి రూమ్స్‌ను ఇంటర్నెట్‌లో బుక్ చేసుకున్నందువల్ల హోటల్ 'లలారుఖ్' చేరుకుని గదిలో సామన్లు పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత శ్రీనగర్‌లోని అందమైన ప్రాంతాలు చూడడానికి బయల్దేరాం.
ఇంకొన్ని కళ్లుంటే...

కాశ్మీరులో గొప్పవారైనా, పేదవారైనా ఇంటి పై కప్పును రేకులతోనే వేసుకుంటారు. కప్పులన్నీ ఇంగ్లీషు 'ఎ' ఆకారంలో ఉండి కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా ఉంటాయి.
తర్వాత రోజు గుల్మార్గ్ వెళ్లాం. ఆ చోటంతా మంచు నిండుగా అందంగా కనిపించింది. ఆ ముందురోజు వరకూ బాగా వర్షం పడి, దారంతా మంచుతో నిండిపోయి యాత్రికులను ఇబ్బంది పెట్టిందట. కాని మేం వెళ్లిన రోజునుండే వర్షాలు తగ్గి, రోడ్డు మీద పేరుకుపోయిన మంచును ఊడుస్తున్నారు. మన దగ్గర మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు మీద చెత్త ఊడ్చినట్టు అక్కడ మంచును ఊడ్చి పారేస్తున్నారు.
స్టెడ్జ్ బళ్లపై తిరిగాం

తర్వాత 'హజరత్‌బల్ దర్గా'కి వెళ్లాం. మహ్మద్ ప్రవక్త వెంట్రుక ఉండడం వల్లే అది వారికి ఎంతో పవిత్రం. ఆ దర్గా వెనుక భాగం నుంచి దాల్ సరస్సులో బోట్ షికారు చేశాం. మధ్యలో ఒక చోట చిన్న ద్వీపంలా కనిపించింది. అక్కడ నాలుగు చినార్ చెట్లు ఉన్నాయి. అందుకే ఆ చోటుని 'చార్ చినార్' అంటారు. బోటులో అక్కడిదాకా వెళ్లొచ్చాం.
సింధునదిలో గంతులేశాం

సోన్‌మార్గ్ కూడా గుల్మార్గ్ లాగే మంచు కొండలతో నిండి ఉంటుంది. కానీ ఇక్కడ మంచు కరిగి సింధూనదిగా ప్రవహిస్తుంది. పరవళ్లు తొక్కి పారుతున్న నదిని చూస్తే అందమైన లేడి పిల్ల చెంగు చెంగున గంతులేసి పరిగెడుతున్నట్లు ఉంటుంది. నదిలో చెయ్యి పెడితే షాక్ కొట్టేంత చల్లగా ఉన్నాయి. అయినా సరే ముఖం కడుక్కొని, ఆ నీళ్లు తాగి, మా దగ్గరున్న సీసాల్లో నింపుకొని కదల్లేక కదిలాం.
అక్కడనుంచి ఆసియాలోనే అతి పెద్ద సరస్సయిన వుళ్లారు సరస్సు చూడడానికి వెళ్లాం. సరస్సు చుట్టూ పార్కులాంటిది కట్టారు. మంచు కొండలు, చెట్లు చూస్తున్నప్పుడు కాశ్మీరు వాళ్లు వాళ్ల సినిమాలు తీయడానికి వేరే ఎక్కడికీ వెళ్లనవసరం లేదనిపించింది.
అందాల 'టులిప్' గార్డెన్

మూడో రోజు పహల్గాం వెళ్లాం. అక్కడికి వెళ్లే దారిలో లిడ్డర్ వేలీ కనబడుతుంది. లిడ్డర్ వేలీ అంటే అదేదో లోయ కాదు - ఒక నది. ఆ నదిలో ఎవరు గేలం వేసినా తప్పనిసరిగా చేప తగులుతుందని విని ఆశ్చర్యపోయాం. దీన్ని బట్టి ఆ నదిలో ఎన్ని లక్షల చేపలున్నాయో అనిపించింది! ఆ నీళ్లు మానససరోవరం దగ్గరి మంచు కరిగి ప్రవహిస్తుండడం వల్ల వచ్చినవట. ఎలాగూ మానస సరోవరం వరకూ వెళ్లలేం కదా అని ఆ నీళ్లలో కాసేపు దిగి ఆడుకున్నాం. ఆ నీళ్లు కూడా ఒళ్లు జిల్లుమనేంత చల్లగా ఉన్నాయి. అక్కడి పారే నదు లు అంత అందం గా ఎందుకుంటాయా అని ఆలోచిస్తే ... పారే నీటికి ఇరుపక్కలా కొండ రాళ్లు ఉండడం వల్లనేమో అన్పించింది. మన దగ్గర ఇసుక ఉన్నట్టు. నీరు ఆ రాళ్లకు తగుల్తూ, ఆ రాళ్ల సందుల్లోంచి పైకి చిందుతూ తుంపర్లుగా లేస్తూ వెళ్లడం మనోహరంగా కన్పించే దృశ్యం. అదే రోజు శ్రీనగర్‌లో పారి మహల్ కూడా వెళ్లాం. పారి మహల్ నుంచి దాల్ సరస్సు మొత్తం కనిపిస్తుంది.
కాశ్మీరీలు యాత్రికుల్ని గౌరవిస్తారు
శ్రీనగర్‌లో మనుషులు చాలా స్నేహశీలతతో కనిపించారు. యాత్రికులను గౌరవిస్తారు. పర్యాటకుల్ని మోసం చేయరు. ఒకరోజు అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని మమ్మల్ని జీలమ్ నదికి తీసుకెళ్లమని అడిగితే ఇంత దగ్గరగా ఉన్న దానికి ఆటో ఎందుకని చెప్పి దారి చూపించాడే కానీ అటూ ఇటూ తిప్పి డబ్బులు అడగాలనుకోలేదు. అక్కడి మనుషులతో మనం కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు టీ తాగి వెళ్లమనో, భోంచేసి వెళ్లండనో ఎంతో మర్యాదగా వాళ్లింటికి ఆహ్వానిస్తారు. మనుషుల పట్ల వారు చూపించే ప్రేమకు కళ్లు చిప్పిల్లాయి నాకు.
చలిపులికి భయపడిపోయాను

మన స్కూళ్లు ఏప్రిల్, మే మాసాల్లో మూసేస్తే అక్కడ చలికి భయపడి నవంబర్, డిసెంబర్లలో మూసేస్తారట. మనవి వేసవికాలం సెలవులైతే వాళ్లవి శీతాకాలం సెలవులన్నమాట. అన్నం పొయ్యి మీదనుంచి దించగానే తినెయ్యాలి అక్కడ. లేదంటే క్షణాల్లో బిరుసెక్కిపోతుంది. 'కీషవ' అనే డ్రై ఫ్రూట్స్‌తో చేసిన లిక్విడ్ స్వీట్‌ని నేను చాలా ఇష్టంగా తాగాను.
మేం సుమోలో వెళ్తున్నప్పుడు ఒక ఉద్యోగిని కలిశాం. మాతో కాసేపు మాట్లాడిన తరువాత 'కాశ్మీరు గురించి, మా వాళ్ల గురించి మీ వాళ్లతో ఏమని చెప్తారు' అని అడిగాడాయన. 'ఇక్కడ ప్రశాంతంగా ఉందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లని' చెబుతాం అని బదులిస్తే అతను చాలా సంతోషించాడు.
- ఎస్.ఎ. కిరణ్మయి
No comments:
Post a Comment