రాజస్థాన్‌లోకెల్లా అత్యంత సుందర నగరం జైసల్మేర్. అయితే రాజస్థాన్ అనగానే అక్కడి థార్ ఎడారి, రాజధాని నగరం జైపూర్‌లే గుర్తుకు వస్తాయి. జైసల్మేర్ గురించి చాలామందికి తెలియదు. నేటికీ మధ్యయుగపు రాజపుత్రుల విశిష్ట కట్టడాలెన్నో ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వారి వీరగాథలకు ఈ కట్టడాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కొత్తజంటల హనీమూన్ విహారానికి జైసల్మేర్ ఎంతో అనువైన పర్యాటక కేంద్రం. అలనాటి రాజపుత్రుల ప్రేమ గురుతులు ఇక్కడి రాజసౌధాలు. హనీమూన్ ట్రిప్‌కోసం ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఆ సౌధాలు ఎన్నో తీపి గురుతులను మిగుల్చుతాయి. బ్రిటీష్ కాలంలో జైసల్మేర్ ప్రత్యేక రాష్ట్రం (ప్రిన్సిలీ స్టేట్) గా ఉండేది. ఆ తరువాత రాజస్థాన్ రాష్ట్రంలో అంతర్భాగం అయ్యింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైసల్మేర్‌కు వెళ్లాలంటే జోధ్‌పూర్ నుండి వెళ్లాలి. ఇక్కడ రాజస్థానీ, హిందీ, మర్వారీ భాషలు మాట్లాడతారు.
రాజస్థాన్ రాజవంశ చరిత్ర...
ఇక రాజస్థాన్ మొత్తం ఇంతకుముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. అలా రాష్ట్రం మొత్తం ముప్ఫైఆరు రాజవంశాల వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరంతా మొదట ఒకే వంశానికి చెందినవారు. కాలక్రమంలో అన్నదమ్ములగా విడిపోతూ ఎవరికివారు తమ వంతుకు వచ్చిన భాగంలో విడిగా ఒక రాజధాని నగరం నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న ప్రతీనగరంలోనూ ఒక కోట ఒక రాజభవనం (రాజుగారి నివాసం) రెండూ ఉంటాయి. ఎవరికివారు ముందువారికంటే గొప్పగా ఉండే కోటలు, రాజభవనాలు నిర్మించారు.
వీటిలో ఉదయ్‌పూర్‌లోని లేక్‌ప్యాలెస్, జైపూర్‌లోని ‘హవామహల్’ పేరెన్నికగన్నవి. ఈ కోటలు, రాజభవనాలు అన్నీ ఆయా రాజవంశాల వారి స్వంత ఆస్తి. ప్రతి ఊరిలోనూ ఆ రాజ కుటుంబం వారు ఒక ట్రస్టు స్థాపించి, ఈ కోటలు రాజభవనాలను ఆ ట్రస్టు పేరున మ్యూజియంగా చేశారు. కోట, బుండి, చిత్తోర్‌గడ్, ఉదయపూర్ నాథ్, అజ్మీర్, పుష్కర్, జైపూర్, బికనీర్, జైసల్మీర్, జోధ్‌పూర్, మౌంట్ అబూ వంటి నగరాలు ఆయా రాజవంశాలకు రాజధానులుగా వెలుగొందాయి. అందులోని ప్రముఖ కోటల్లో మౌంట్ అబూ, జైసల్మేర్ ప్రఖ్యాతిగాంచినవి.
పర్యాటక దిగ్గజం... జైసల్మేర్
ఈ నగరాన్ని ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా చెప్పవచ్చు. జైసల్మేర్ దేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రాలలో అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అక్కడి సోనార్ ఖిల్లానే జైసల్మేర్ కోటగా పిలుస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక సజీవ కోట ఇదే. ప్రసిద్ధ థార్ ఎడారిలోని మరుభూమిలో నిర్మితమైన సుందర పట్టణమే జైసల్మేర్. రాజపుత్రుల రాచరిక వైభవాన్ని, నాటి సంపన్నుల కళాత్మకతను చాటి చెబుతున్న అరుదైన ఇసుకరాయి భవనాలు అక్కడ ఎన్నో. భట్టి రాజపుత్రులు 12వ శతాబ్ధంలో జైసల్మేర్ పట్టణాన్ని స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది.
ఆనాటి వ్యాపారులు సంచరించే ప్రధాన మార్గంలో ఒక ప్యూహాత్మకంగానే ఇది ఏర్పడింది. సంపన్న వ్యాపారులు ఆనాటి రాజాస్థానాలలో మంత్రులుగానూ ఉన్నట్టు చెబుతారు. జైసల్మేర్‌లోని హవేలీలు వారి కళాత్మక హృదయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మన రాజధాని నగరం హైదరాబాద్‌తోపాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల నుండి జైసల్మేర్‌కు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఇక్కడ పర్యాటకులకు తగినంతగా వసతి సౌకర్యాలు లేవు. కానీ, రాజస్థాన్ పర్యాటక శాఖ చొరవతో ప్రస్తుతం జైసల్మేర్‌లో పర్యాటకుల వసతి ఏర్పాట్లు ఎంతో మెరుగయ్యాయి. దాంతో ఇక్కడికి పర్యాటకుల రాకపోకలు ఎక్కువయ్యాయి. జైసల్మేర్ పట్టణంలోని ఇసుక కోటతో పాటు మొత్తం పట్టణం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న రజ్వాడ కోట వంటి హోటళ్ళలో బసచేస్తే సోనార్ ఖిల్లాను దగ్గరగా చూడవచ్చు. సోనార్ ఖిల్లాతో పాటు పట్టణంలోని ప్రతి ప్రాచీన భవనం పసుపు పచ్చని ఇసుక రాయితో ఆకర్షణీయంగా మనసును ఉల్లాసపరుస్తుంది.
తీలన్ కీ పూల్...
జైసల్మేర్‌లో అడుగిడగానే ముందుగా మదిని దోచేది తీలన్ కీ పూల్ సరస్సు. ఇదొక వర్షపునీటి సరస్సు. ఈ సరస్సులో నీలిరంగులో ఉండే నీరు, వాటి మీదుగా సింధూరకాంతులు విరజిమ్మే సూర్యుని ప్రతిబింబం చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తీలన్ కీ పూల్ సరస్సుకు అత్యంత ఎతె్తైన ప్రవేశద్వారం ఉన్నది. ఎంతో కళాత్మకంగా చెక్కబడిని ఈ ద్వారం ఎంతో సౌందర్వంతంగా మనసును ఆకట్టుకుంటుంది. ఈ ద్వారం గుండానే సరస్సులోకి వెళ్ళవచ్చు. రాచరిక కాలానికి చెందిన తీలన్ అనే ఒక వేశ్య దీనిని నిర్మించడం వలన ఆమె పేరుతోనే ‘తీలన్ కీ పూల్’ గాస్థిర పడింది. ఈ సరస్సు ప్రాంతం ఒక చూడచక్కని పిక్నిక్ స్పాట్‌గా అభివృద్ది చెందింది. ఇక్కడ పలు దేవాలయాలు, ప్రాచీన రాజభవనాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి కొద్ది దూరంలో ‘బడాబాగ్’ ఉంటుంది. అది ఆనాటి పాలకుల స్మశాన వాటిక. అక్కడ సుందరమైన రాచరిక స్మారక కట్టడాలు (ఛత్రీలు) ఉన్నాయి.
సోనార్ ఖిల్లా... కళావైభవం...
జైసల్మేర్ పట్టణంలోని ఒక కొండపై ఉంది సోనార్‌ఖిల్లా. ఈ కోట ఎత్తు సుమారు 250 అడుగులు. రాజస్థాన్ మరుభుమిలోని ఒక మహాద్భుతంగా దీనిని అభివర్ణిస్తారు. ఈ కోట గోడలు ఇసుకలో నిర్మితమైన తీరు విస్మయపరుస్తుంది.ఒక ఇసుక నేలలలో ఇంతటి మహా కట్టడం నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గణేష్ పూల్, సూరజ్ పూల్ (సన్‌గేట్) ల మీదుగా ఈ కోటలోకి వెళ్లాలి. సన్‌గేట్‌కు ఇరువైపులా దుకాణ సముదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని ఏకైక సజీవ కోటగా దీనిని చెబుతారు. దుర్గంలోని అనేక భవనాలను రాజులు అప్పట్లోనే తమ పరివారానికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ఇప్పటికీ ఈ కోటలోని పరిసరాలు, భవనాలు, హవేలీలు స్థానికులకు నివాసయోగ్యంగా ఉన్నాయి. అక్కడ సుమారు 1000కి పైగా కుటుంబాలు నివసిస్తునట్లు అంచనా. అక్కడి వ్యాపారుల, ప్రజల జీవనశైలి ఎంతో విలక్షణమైంది. ఆడపిల్లలు గాజులు అమ్ముతూ కనిపిస్తారు. దీని తరువాత భూటా లేదా భోయింటా పూల్ ఉంటుంది. దీనినే టర్న్‌గేట్‌గా పిలుస్తారు. దీని తర్వాత చిట్టచివరన హవాపూల్ ఉంటుంది. అన్ని ప్రాసాదాలకు, భవనాలకు ఉన్న ఎత్తైన ద్వారాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. కోటలోని ప్రజాదర్భారుకు ఆవరణగా హవాపూల్ ఉంది. ఇదే కోటలో భాగంగా పలుపురాతన జైనదేవాలయాలు ఉన్నాయి. 12 నుండి 15వ శతాబ్ధాలకు చెందిన ఈ ఆలయాల నిర్మాణ రీతులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అడుగడుగునా శిల్ప నైపుణ్యం ఉట్టిపడుతుంది. అక్కడి నుంచి స్థానికుల ప్రధాన కేంద్రం మనేక్‌చౌక్‌కు చేరుకోవచ్చు.
ఎటు చూసినా ‘హవేలీ’లే...
మనేక్‌చౌక్ నుండి బయలుదేరి చిన్నవీధులు, గల్లీల గుండా వెళ్తే పురాతన భవనాలైన హవేలీలు దర్శనమిస్తాయి. ఒకనాటి పుర ప్రముఖుల నివాస కేంద్రాలే ఇవి. అసాధారణ నిర్మాణ నైపుణ్యంతో కూడిన ఈ భవనాలలో ఎక్కడ చూసినా శిల్ప సౌందర్యం చూపు తిప్పుకోనీయదు. రాజభవనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడు హవేలీలను నిర్మించారు. జైసల్మేర్‌లోని ప్రధాన హవేలీలలో ‘సలీం కీ హవేలి’, ‘నథ్‌మల్ హవేలీ’, ‘పట్వాన్ కీ హవేలీ’ వంటివి ఉన్నాయి.
వీటినీ దర్శించుకోవచ్చు...
జైసల్మేర్ పరిసరాలలోని మరిన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. వాటిలో... లోర్‌డ్వా, సాంలు ప్రముఖమైనవి లోర్‌డ్వా ఒక ప్రాచీన రాజధాని. అమర్‌సాగర్ మీదుగా ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమర్‌సాగర్‌లో ఒయాసిస్సుల వంటి సరస్సులు, రాజభవనాలు, రాళ్ళతో నిర్మితమైన ఒక డ్యాం, పలు జైన దేవాలయాలు ఉన్నాయి. లోర్‌డ్వా ప్రాంతమంతా శుష్కనేల. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుకే. లోర్‌డ్వా ప్రాంతంలో వేసవిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక సాం నిజమైన ఎడారి ప్రదేశంగా ప్రసిద్దిగాంచింది. సువిశాలమైన ఎడారిని అక్కడ చూస్తాం. అక్కడి అద్భుతమైన ఎడారి ఇసుక దిబ్బల ప్రాకృతిక సౌందర్యానికి ప్రతి పర్యాటకుడు ముగ్ధుడవుతాడు. సాం లోని కాటేజ్‌లలో తాత్కాలికంగా నివాస సౌకర్యాలు ఉంటాయి. అక్కడ ఒంటెలపై ఎడారిలో ఓడ ప్రయాణం ఓ మరుపురాని అనుభూతి.
మరో ప్రసిద్ధ క్షేత్రం పుష్కర్...
అజ్మీర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు పుష్కర్. ఇక్కడి దగ్గరలో పర్యాటకులకు అంతగా పరిచయం లేని మరో క్షేత్రం ‘నాథ్‌ద్వారా’ కూడా ఉంది. ఇది ఉదయ్‌పూర్ నుండి ఉత్తరంగా 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుజరాత్, రాజస్థాన్ ప్రజలకు ‘పంచద్వారక’ లలో ఒకటిగా చెప్పబడే నాథ్‌ద్వారా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం భౌగోళికంగా రాజస్థాన్‌లోనే ఉన్నా... గుజరాత్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉంటుంది. దీనికి 185 కిలోమీటర్ల దూరంలో... దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వేసవి విడిది కేంద్రమైన మౌంట్ అబూ పర్వతం ఉంది.
ఎప్పుడు, ఎలా వెళ్ళాలి?
జైసల్మేర్‌లో అక్టోబర్ నుండి మొదలుకొని మార్చి నెల వరకు సంవత్సరంలో సుమారు ఆరునెలలు జైసల్మేర్ వెళ్ళడానికి మంచి సీజన్‌గా చెబుతారు. మరీ ముఖ్యంగా ఎడారి ఉత్సవం జరిగే సమయంలో అయితే అక్కడి ప్రాంతాలన్నీ కన్నుల పండుగగా ఉంటాయి. ఢిల్లీ, జోథ్‌పూర్ వంటి ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. పట్టణంలో యత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. పలు ప్రైవేట్ రిసార్ట్‌లు కూడా కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.
No comments:
Post a Comment