విహారాలు

India

Gamyam

Saturday, February 26, 2011

సై.. అంటూ ఢిల్లీకి

విజయవాడ టు ఢిల్లీ.. సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం... రైల్లో వెళ్లాలంటే ముప్పై గంటలు పడుతుంది. మరి సైకిలెక్కి వెళ్లాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అయినా సైకిలెక్కి వెళ్లే సాహసం ఎవరు చేస్తారు అనుకుంటున్నారా... విజయవాడకి చెందిన ముప్పైమంది సైకిలిస్టులు అదే పని చేశారు. రాజధాని చేరడానికి వారికి నెల రోజులు పట్టింది. అయ్యబాబోయ్.. అన్ని రోజులా..! అనుకోకండి. వారి ఉద్దేశం ఎంత తొందరగా ఢిల్లీ చేరాలన్నది కాదు. సైకిల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, మన చుట్టూ ఉండే పర్యావరణానికి ఎంత మేలు కలుగుతుందో తెలియజేయడం.

అందుకే ఢిల్లీ యాత్రని ఎంచుకున్నారు. తమ నినాదాన్ని దేశ రాజధాని దాకా తీసుకెళ్లాలనుకున్నారు. 2010 డిసెంబర్ 29న సైకిలెక్కి బయల్దేరి... పల్లెలు, పట్టణాలు, నగరాలు చూసుకుంటూ... రాష్ట్రాలు దాటుకుంటూ... ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, గురుద్వార్‌లు... ఎక్కడ వసతి దొరికితే అక్కడ రాత్రులు బస చేస్తూ ఢిల్లీ చేరుకున్నారు. కొత్త కొత్త ప్రదేశాల్ని చూస్తూ, ప్రజలతో సంభాషిస్తూ... ఓ విహార విజ్ఞాన యాత్రలా సాగింది వారి ఢిల్లీ ప్రయాణం. అంత చలికాలంలో సైకిలెక్కి ఢిల్లీ యాత్రకి వెళ్లడం ఓ అదనపు సాహసం. ఈ సాహస యాత్రను నిర్వహించింది యాక్టివ్ బైసైకిలర్స్ అసోసియేషన్ (విజయవాడ). దాని కార్యదర్శి వి.సత్యనారాయణ మనతో పంచుకున్న యాత్రా విశేషా
లు...

తనని తాను సైకిల్ ఉద్యమకారుడిగా పిలుచుకుంటారాయన. సైక్లింగ్ గురించి ప్రజలకు చెప్పడమే కాదు, చేసి చూపించాలనుకుంది ఆయన నాయకత్వంలోని యాక్టివ్ బైసైకిలర్స్ అసోసియేషన్. స్థాపించినప్పటి నుండి (అన్నట్టు 09-09-09 దాని పుట్టిన రోజు) నెలనెలా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూనే ఉన్నారు. విద్యార్థుల్ని, ఆసక్తి ఉన్న మరికొందరిని కూడగట్టి విజయవాడలోనూ, అక్కణ్ణుంచి చుట్టుపక్కల ఉన్న నూజివీడు, గుంటూరు, బాపట్ల... మొదలైన పట్టణాలకు సైకిల్‌పై వెళ్లొచ్చేవారు. బడిపిల్లల దగ్గర్నుండి రిటైర్ అయిన సీనియర్ సిటిజన్ల దాకా చాలా మంది ఆ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఒక్కో యాత్ర యాభై అరవై కిలోమీటర్ల కన్నా ఉండదు. అయితే ఈ సారి మాత్రం మహా యాత్ర నిర్వహించాలనుకున్నారు వాళ్లు. అది ఎంత పెద్ద యాత్ర అంటే.. రెండు వేల కిలోమీటర్లు.. ఢిల్లీ దాక. సైకిళ్లు తొక్కుకుంటూ రాజధాని చేరి రాష్ట్రపతిని కలిసి తమ యాత్ర ఉద్దేశాన్ని ఆమెకి తెలియజేయాలన్నది వారి ప్రణాళిక.

ఆచరణ సాధ్యమే


ఆలోచన బాగానే ఉంది. ఏ బస్సులోనో, రైల్లోనో విహార యాత్రకు వెళ్తే ఎక్కడపడితే అక్కడ ఆగలేం.. దేన్ని చూడాలంటే దాన్ని చూడలేం. అదే సైకిల్ అయితే ఎవరి ఇష్టం వచ్చిన చోట వాళ్లు ఆగొచ్చు. అన్నీ చూసి తరించొచ్చు. తమ పర్యావరణ నినాదాన్ని జనానికి తెలియజేయొచ్చు. అందుకే ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అయితే అది సాధ్యమేనా ! ఒక్కొక్కరికి ఎంత ఖర్చవుతుంది, మార్గంలో తిండి తిప్పలు ఎలా? పైగా చలికాలం. రాత్రిళ్లు ఎక్కడుండాలి? లాడ్జిల్లో ఉండాలంటే వేలు ఖర్చు చేయాలి. ఇలాంటి చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే అవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించలేదు సత్యనారాయణకి. ఇదివరకే ట్రెక్కింగ్‌కి, సైకిల్ యాత్రలకి వెళ్లిన అనుభవం ఉందాయనకి. అసలు ఈ అసోసియేషన్ పెట్టాలన్న ఆలోచన కూడా కులూ మనాలీలో ట్రెక్కింగ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడే వచ్చింది.

ఢిల్లీ యాత్ర ఆలోచనను రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి డా. వెలగా జోషికి తెలియజేశారు సత్యనారాయణ. ఆయన 'యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' కృష్ణా జిల్లా చైర్మన్ కూడా. ఇలాంటి యాత్రల పట్ల ఆయనకి కూడా ఆసక్తి ఉంది. కాబట్టే ఢిల్లీ యాత్రలో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చంటూ యువజన సంక్షేమ శాఖ నుంచి జిల్లాలో కాలేజీలకి లేఖలు పంపించారు. చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపారు. అందరూ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలే. వారిలో నుండి 26 మంది యాత్రకొచ్చారు. శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల నుంచి 15 మంది విద్యార్థులు వస్తే మిగతా వాళ్లు తిరువూరు, విజయవాడ, అవనిగడ్డలలోని వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్లు.

నిధుల కోసం...


యాత్రకి కావాల్సిన నిధుల్ని సమకూర్చే పనిలో పడ్డారు సత్యనారాయణ. పర్యావరణ పరిరక్షణ కదా వారి నినాదం. అందుకే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ని సంప్రదించారు. యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు వాళ్లు. ఒక సిమెంటు ఫ్యాక్టరీ అధినేత ఇంకో యాభై వేలు సాయం చేశారు. అలా లక్ష రూపాయలొచ్చాయి. సైకిల్ ర్యాలీ గురించి బిఎస్ఏ సైకిల్ కంపెనీకి లేఖ రాస్తే ఆ సంస్థ స్పందించి 26 గేర్ సైకిళ్లను పంపించింది. కొన్ని టైర్లు, ట్యూబులు కూడా ఇచ్చింది. యాత్ర ముగిశాక తిరిగి ఇచ్చేయాలనే షరతు మీద. దారిలో వండుకుని తింటే ఖర్చు తగ్గుతుంది. పైగా రాష్ట్రం దాటితే తిండి సమస్య. ఉత్తరాది వాళ్ల తిండి మనం తినలేమని వంట చేసుకోవాలనుకున్నారు. వంటసామానుకి, అందరి లగేజి తీసుకెళ్లడానికి ఓ వ్యాన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఒక వంటాయన్ని మాట్లాడుకున్నారు. యాత్రలో పాల్గొనే 26 మందితో పాటు మరో ఏడుగురు సహాయకులు కలిసి మొత్తం 33 మంది సిద్ధమయ్యారు. వారిలో సత్యనారాయణ భార్య, వారి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.

అలా మొదలైంది...


2010 డిసెంబర్ 29 ఉదయం... సైకిళ్లన్నీ ప్లకార్డులు తగిలించుకుని యాత్రకి సిద్ధమయ్యాయి. విద్యార్థులందరూ తమ అమ్మనాన్నలను ఒప్పించి యాత్రకు బయల్దేరారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పచ్చజండా ఊపి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. సాయంత్రానికి కృష్ణాజిల్లా ఎ. కొండూరు చేరి అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో బస చేశాం. ఉదయం మొదటిసారిగా పరిచయమైన వాళ్లం సాయంత్రానికల్లా ఫ్రెండ్స్ అయిపోయాం. 30 ఉదయాన్నే మళ్లీ సైకిలెక్కి సాయంత్రానికి ఖమ్మం చేరాం. 31,1 వరంగల్ జిల్లాలో, రెండున కరీంనగర్‌లో, మూడున మంచిర్యాలలో, నాల్గున ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌లో... ప్రతిచోటా ప్రభుత్వ కార్యాలయాల్లో బస చేస్తూ సాగిపోయాం. రాష్ట్ర ప్రభుత్వ యువజన సంక్షేమ శాఖ ప్రోత్సాహం ఉంది కాబట్టి యాత్ర మన రాష్ట్రంలో సాగినన్నాళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లోనే పడుకున్నాం. కొందరు అధికారులు విసుక్కున్నా కొందరు మాత్రం చాలా సహకరించారు. యాత్రకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు.

రాష్ట్రం దాటాం...


5న మహారాష్ట్రలోకి ప్రవేశించాం. రాష్ట్రం దాటేటప్పుడు అక్కడున్న మన పోలీసు చెక్‌పోస్టు అధికారులు మా అందరికీ టీ, కాఫీలు, బిస్కట్లు తెప్పించారు. మా వ్యాన్‌కి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందా అని అడిగితే లేదన్నాం. 'మనవాళ్లు కాబట్టి మేం వదిలేస్తున్నాం కాని ఇతర రాష్ట్రాల్లో పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కొంటార'ని చెప్పారు వాళ్లు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్న వేరే వ్యాన్ తెప్పించుకోవడానికి ఒక రోజు పట్టింది. దాంతో ఆ రోజు మహారాష్ట్రలోని లక్కడుకోట గ్రామంలో ఉండిపోయాం. పల్లెటూరు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలేవీ లేవు. అయితే ఆ గ్రామంలో చాలామంది తెలుగు వాళ్లున్నారు. వాళ్లు నడిపే హోటల్ కూడా ఉంది. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి ఆ రాత్రికి ఆ ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో పడుకున్నాం.

ఆరవ తేదీకల్లా మా వ్యాన్ వచ్చేసింది. మాకు కొత్త శక్తి వచ్చినట్టయింది. ఇక దిగుల్లేదు, పోలీసులు పట్టుకుంటారనే సమస్య కూడా లేదు. నూతనోత్తేజంతో ముందుకు సాగాం. సాయంత్రానికి చంద్రపూర్ పట్టణం చేరుకున్నాం. మేం సైకిళ్లపై వెళ్తుంటే చూసి చాలామంది ఎన్నో ప్రశ్నలడిగే వారు. ఎక్కణ్ణుంచి వస్తున్నారు. ఎక్కడి కెళ్తున్నారు. ఎందుకిదంతా... ఇలాంటివే మరెన్నో ప్రశ్నలు. వాళ్ల ప్రశ్నలకి సమాధానం చెప్పడం మా దినచర్య అయిపోయింది. చాలాచోట్ల విలేకరులు కూడా కలిసి మాట్లాడారు. మేం ఎక్కడికెళ్లినా మీ గురించి పేపర్లో చూశాం, వాళ్లు మీరేనా అనే వాళ్లు. అప్పుడు కాని అర్థం కాలేదు.. మా గురించి పేపర్లో రాస్తున్నారని. పనిలో పనిగా ప్రాంతాల్ని చూస్తూ వాటి విశేషాలు తెలుసుకుంటూ వెళ్లాం.

చంద్రపూర్ నుంచి బయల్దేరిన రోజు సాయంత్రం బుట్టిబోరి అనే టౌన్ చేరుకున్నాం. అక్కడ ఓ పెద్ద స్కూల్ కనిపించింది. శ్రీ దత్తా విద్యా మందిర్ అని రాసుంది. ఆ స్కూల్‌కి వెళ్లి మా ట్రిప్ గురించి వివరించాం. స్కూల్ చైర్‌పర్సన్ మా గురించి, మేం చేపట్టిన యాత్ర గురించి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తెలుగువాళ్లని తెలియగానే ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని పిలిపించారు. ఆయన వచ్చి తెలుగులో మాట్లాడడంతో మా ఆనందానికి అవధుల్లేవు. మన తెలుగు వాడేనట. మరో ఇద్దరు టీచర్లు కూడా తెలుగు వాళ్లున్నారు. వాళ్లంతా స్కూల్లో ఉండడానికి మాకు వసతి కల్పించారు. మరునాడు ఉదయం ఆ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించి, స్కూల్ వాళ్లందరికి ధన్యవాదాలు తెలిపి మళ్లీ పయనమయ్యాం.

వాటర్ ట్యాంక్ తెప్పించారు...


అందరూ యువకులే కాబట్టి, పోటాపోటీగా సైకిళ్లు తొక్కేవాళ్లు. టౌన్లు, నగరాల్లో మాత్రం గ్రూపులుగా విడిపోయి ఎవరు చూడాలనుకున్న ప్రదేశానికి వారు వెళ్లిపోయేవాళ్లు. అనుకున్న సమయానికి అనుకున్న చోట కలిసేవాళ్లు. నేను, మరో ఒకరిద్దరు మావసతి ఏర్పాట్లు చూసుకునే వాళ్లం. సైకిళ్లపై వెళ్లే వాళ్లకంటే ముందే వ్యాన్ వెళ్లిపోయి ఒక చోట ఆపేసి, అన్నం రెడీ చేసేసే వాళ్లం. భోజనాలు అయిపోగానే ఆ వ్యాన్ బయలుదేరి ఆ రోజు బస చేయబోయే ఊళ్లో ఆగేది. పనివాళ్లు వారి పనుల్లో వాళ్లుండేవాళ్లు. ఆ విధంగా తొమ్మిదో తేదీకి 'సియోని' అనే పట్టణానికి చేరాం. అక్కడి పోలీస్ కమిషనర్‌ని కలిసి మా గురించి వివరించాం. 'వసతి కోసం మమ్మల్నే ఎందుకు కలవాలనిపించింది' అనడిగారాయన. యా త్ర గురించి చెప్పాక వెంటనే అక్కడున్న పాలిటెక్నిక్ కళాశాలలో వసతి ఏర్పాటు చేయించారు. స్నానానికి నీళ్లు లేకపోతే ఒక వాటర్ ట్యాంకర్ అప్పటికప్పుడు తెప్పించారు. అంత బాగా స్పందించిన ఆ కమిషనర్‌ని చూసి మాకే ఆశ్చర్యమేసింది.

ఉదయాన్నే మళ్లీ ప్రయాణం.. పదో తేదీ సాయంత్రం మంగ్వాని అనే ఊళ్లో ఓ పాఠశాలలో రాత్రి బస చేశాం. ఢిల్లీ వైపు వెళుతున్నాం కాబట్టి చలి నానాటికీ పెరిగిపోతోంది. అందరం రగ్గులు, దుప్పట్లతో వెళ్లినా..వాటితో చలి ఆగలేదు. 11వ తేదీన లోలారి రాజ్ మార్గ్ అనే గ్రామానికి వెళ్లి కేరళకి చెందిన టీచర్లు నడుపుతున్న 'రుక్మిణి దేవి పబ్లిక్ స్కూల్'లో ఉన్నాం. దేశంలో ఎక్కడికెళ్లినా కేరళ టీచర్లు కనిపిస్తారనిపించింది వారిని చూస్తుంటే.

గురుద్వారాల్లోనే మా బస


మధ్యప్రదేశ్‌లోని సాగర్ పట్టణం నుంచి మా బస ఎక్కువగా గురుద్వార్‌లలోనే బస జరిగింది. విజయవాడ గురుద్వారా నిర్వాహకులు చేసిన సాయాన్ని మేం ఎన్నడూ మరువలేం. ఎందుకంటే... ఆయన ఒక్క మాట చెప్పినందుకే మా ప్రయాణంలో 12 రోజుల పాటు గురుద్వారాలలో బసతో పాటు ఉచితంగా ఆహారం కూడా పెట్టారు. 13న లలిత్‌పూర్ గురుద్వారాలో, 14న ఝాన్సీ గురుద్వారా ఉన్నాం. 15న గ్వాలియర్ చేరాం. అక్కడ గురుద్వారా కొండపైన ఉంటుంది. కొండపై నుంచి గ్వాలియర్ నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఆ నగరంలో అద్భుత కట్టడాలకు కొదవలేదు. గొప్ప పర్యాటక కేంద్రమే కాక ఆధ్యాత్మిక కేంద్రం కూడా. అందుకే అక్కడ రెండురోజులు ఉండి సిటీ మొత్తం తిరగాలని ముందే అనుకున్నాం. చేతిలో సైకిళ్లున్నాయి, వాటిపై మా నినాదాలూ ఉన్నాయి. నగరం మొత్తం తిరిగినట్టూ ఉంటుంది.. ప్రజలకి మా ఉద్దేశం గురించి తెలియజేసినట్టూ ఉం టుంది. అలా అనుకుని అందరం గ్వాలియర్ మొత్తం తిరిగి చూశాం. అక్కణ్ణుంచి బయల్దేరి ముందే అనుకున్న చోట అందరం కలిశాం... ఒక్కరు తప్ప.

అజయ్ వచ్చేశాడు...


అజయ్ అనే అబ్బాయి తప్పిపోయాడు. ఉత్సాహంగా ముందుకి వెళ్లిపోయి మా నుంచి వేరైపోయాడు. సాయంత్రం అయిపోతోంది. అజయ్ ఇంకా రావట్లేదు. సెల్‌ఫోన్ లేదు. వెంట తెచ్చుకున్న డబ్బులు అందరం వ్యాన్‌లోని మా బ్యాగ్‌లలో పెట్టుకున్నాం. అందుకే అజయ్ ఏమయ్యాడో, ఎలా వస్తాడో అని భయపడి చచ్చాం. అంతపెద్ద గ్వాలియర్ నగరంలో ఎక్కడని వెతకాలి. ఏం చేయా లో అర్థం కాలేదు. ఎలా గైనా వస్తాడులే అని ఎదురు చూస్తూ కూర్చున్నాం. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి ఇక్కడున్నాడు తీసుకెళ్లండి అని ఎవరో చెప్పారు.

ఒక్కసారిగా మా అలిసిపోయిన ముఖాల్లో చిరునవ్వులు. వెంటనే వ్యాన్ వేసుకెళ్లి అజయ్‌ని తీసుకొచ్చాం. మా సైకిళ్లన్నిటి మీదా మా నినాదాలతో పాటు మా ఆర్గనైజేషన్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్‌కి ఫోన్ చెయ్యమని చాలామందిని అడిగాడట అజయ్. చివరికి ఒక పెద్దాయన కరుణించి ఫోన్ చేశాడని చెప్పాడు. ఇలాంటి సంఘటన జరిగితే మనం చేయాల్సింది ఒక్కటే అని ముందే చెప్పుకున్నాం. ఎపి రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఏ లారీ అయినా ఆపితే చాలు.. వాళ్లు మనల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారని. ఎవరైనా నీరసపడి సైకిల్ తొక్కలేకపోతే దాన్ని వ్యాన్‌పై వేసుకుని వ్యాన్‌లో వెళ్లిపోయే వాళ్లు. ఒకబ్బాయికి నీరసంగా ఉంటే ఎందుకైనా మంచిదని సెలైన్ కూడా పెట్టించాం.

ఫైర్ ఇంజన్‌తో స్నానం చేశాం...


16న గ్వాలియర్‌లో బయల్దేరి రాజస్థాన్‌లోని డోలాపూరా వెళ్లాం. అక్క డ గురుద్వారా చాలా చిన్నది. అంతమంది ఉండడానికి సాధ్యం కాలేదు. డోలాపూర్ జిల్లా కేంద్రం కావడం వల్ల నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వసతి కల్పించాలని అభ్యర్థించాం. ఆ కలెక్టర్ పేరు రామ్ కిలాడి మీనా. మా యాత్ర గురించి తెలుసుకుని మమ్మల్ని అభినందించారు. మేం ఉండడానికి ప్రభుత్వ గోడౌన్‌లలో ఒక గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించారు. అంతే కాదు, మా స్నానాలకి నీళ్లు లేకపోతే వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ తెప్పించారు. ఆ నీళ్లతో స్నానాలు చేసి బట్టలు కూడా ఉతుక్కు న్నాం. అధికారులు తలుచుకుంటే పనులు ఎంత చకచకా జరుగుతాయో తెలిసింది. అందుకే ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఆగ్రాకి బయల్దేరాం.

ఆగ్రాలో ఫోటోలే ఫోటోలు


17, 18 తేదీల్లో ఆగ్రాలో గడిపాం... ఆగ్రా చూడ్డానికి రెండ్రోజులు చాలవు. తాజ్‌మహల్ సౌందర్యాన్ని చూసి తరించాలన్న మాలో చాలామంది కోరిక ఈ సైకిల్ యాత్రతో నెరవేరింది. మిగతా ఎక్కడా ఫోటోలపై అంతగా ఆసక్తి చూపని మేమంతా తాజ్‌మహల్ ముందు మాత్రం మమ్మల్ని మేం చూసుకోవాలని తెగ ఆరాటపడ్డాం. ఆగ్రా వెళ్లిన వాళ్లు తప్పకుండా అక్కడున్న గురుద్వారాని చూడాలి. గురుద్వారాలు నియమాలకి, నిబద్ధతకి, పవిత్రతకి చిహ్నాలు. అక్కడి వాళ్లు అతిథులపై చూపించే ప్రేమ, గౌరవం మేం ఎక్కడా చూడలేదు. ఎవరెవరో ఖరీదైన కారుల్లో వచ్చి భక్తుల చెప్పులు తుడిచే వాళ్లు. మనం తిన్న ప్లేట్లు కూడా కడుగుతారు. వాళ్లలా సేవలు చేయడం చూసి మా కళ్లని మేమే నమ్మలేకపోయాం. మా ట్రిప్ మొత్తంలో సగం రోజులు గురుద్వారాలలో ఉన్నందుకు మేం చాలా సంతోషించాం. మనం ఇలా సేవచేయగలమా అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకుని సిగ్గుపడ్డాం.

ఢిల్లీలో ఓ వారం


19న ఆగ్రాలో బయల్దేరి సాయంత్రానికి మధుర చేరుకున్నాం. అక్కడ కూడా మాకు వసతినిచ్చింది గురుద్వారానే. అక్కణ్ణుంచి 20న ఢిల్లీకి 30 కిమీ దూరంలోని బల్లబ్‌గాజ్ చేరుకుని అక్కడి గురుద్వారాలో రాత్రి గడిపాం. 21న రాజధానికి చేరుకున్నాం. ఆరోజు మధ్యాహ్నం మన తెలుగు సోదరులు కోటిరెడ్డి, శ్రీనివాస్‌తో పాటు కొందరు మాకు స్వాగతం పలికారు.

రాజధానిని చూడడానికి వారం కేటాయించుకున్నాం. పార్లమెంటు దగ్గర్లోని రకబ్‌గంజ్ గురుద్వారా ఉండడానికి అవకాశం లభించినా రిపబ్లిక్‌డే ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి భద్రతా కారణాల వల్ల అక్కడ ఉండడానికి వీలు కాలేదు. దాంతో ఆ మహానగరంలో ఎక్కడుండాలో తెలీలేదు. దగ్గర్లో ఉన్న హిందూ సమాజ్ భవనంలో ఓ మూడు వేలు చెల్లించి ఆ రాత్రికి తల దాచుకున్నాం. మా యాత్ర మొత్తంలో ఆ ఒక్కరోజు మాత్రమే మేము ఉండడానికి డబ్బులు ఖర్చు చేశాం. మరునాడు ఉదయం చాందినిచౌక్‌లోని శిశు గురుద్వారాకి వెళ్లి.. మిగిలిన ఆరు రోజులూ అక్కడే ఉన్నాం.


రోజంతా సిటీ మొత్తం తిరగడమే మా దిన చర్య. 26న రిపబ్లిక్‌డే వేడుకలు తిలకించాం. 27న పార్లమెంటు భవనాన్ని చూడ్డానికి వెళ్లాం. ఆ సమయంలో మాలాగే కొందరు పార్లమెంటు చూడ్డానికి వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు అయిన సందీప్ దీక్షిత్ వారికి ఆ విశేషాలన్నీ వివరిస్తున్నాడు. వాళ్లతో పాటు మాకు కూడా ఆయన చాలా విశేషాలు చెప్పారు. అపరిచితులమైన మాకు కూడా ఆయన అంత ఆసక్తిగా వివరించడం చూసి మేం ఆశ్చర్యపోయాం. ఆరోజు సాయంత్రం కేంద్ర పర్యావరణ శాఖ కార్యాలయానికి వెళ్లాం. ఆ శాఖ సభ్య కార్యదర్శి జె ఎస్ కామ్యోత్రని కలిశాం.


మా యాత్ర గురించి చెప్పి ఆయన అభినందనలు పొందాం. 28న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ని కలిశాం. ఆమె అపాయింట్‌మెంట్ దొరుకుతుందో లేదో అని మాలో చాలామంది రాలేదు. ఏడుగురమే వెళ్లాం. ఆమె అపాయింట్‌మెంట్ దొరికింది. సాయంత్రం అయిపోవడంతో అప్పటికే చలి బాగా ఉంది. మా ఏడుగురిలో ఇద్దరు ఆడవాళ్లు, మా పాప కూడా ఉన్నారు. 'ఇంత చలిలో ఏమీ కప్పుకోకుండా వచ్చారే' అంటూ వెంటనే మూడు షాల్స్ తెప్పించి మా పాపకి, ఇద్దరు ఆడవాళ్లకి కప్పారు. ఆమెతో కాసేపు ముచ్చటించి అక్కణ్ణుంచి సెలవు తీసుకున్నాం. అన్నట్టు మేం ఎపి భవన్‌కి వెళ్లి అక్కడ మన తెలుగు భోజనాన్ని కూడా రుచి చూశాం. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ని కూడా కలిశాం.


సైకిలెక్కి వందల గ్రామాలు, పదుల పట్టణాలు తిరిగాం. వేలమందిని కలిశాం, వారందరికీ మా యాత్ర గురించి వివరించాం. ఉపఖండంలో ఎంతో కొంత భాగాన్ని కలియ తిరగడానికి, మన దేశంలోని భిన్నత్వాన్ని కనులారా చూడడానికి ఇది మాకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. జనవరి 29న ఢిల్లీలో రైలెక్కి 30న విజయవాడ చేరుకున్నాం. సైకిళ్లు ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేశాయి. వాటిని మళ్లీ బిఎస్ఏ కంపెనీకి అప్పజెప్పాం... సైకిల్ యాత్ర తాలూకు మధురానుభూతుల్ని మాత్రం మాతోనే ఉంచుకున్నాం.

Wednesday, February 23, 2011

'లైఫ్ అబ్రాడ్' * ఐర్లండ్

బిడ్డ పుడితే డబ్బులిస్తారు

పురాతన చర్చి శిఖరాలు, వాటి నుంచి వినిపించే శ్రావ్యమైన ధ్వనులు, మరోవైపు పచ్చదనం సముద్రంలాగా పరుచుకున్న ప్రాంతంలో నివాసం.. ఐర్లాండ్‌లో జీవితం కనువిందుగా, వీనుల విందుగా ఉంటుంది. బిడ్డ పుడితే అక్కడి ప్రభుత్వం డబ్బులిస్తుంది. నిరుద్యోగులకు భత్యం చెల్లిస్తుంది. ఏ పనినైనా గౌరవిస్తారు.. అంటూ ఐర్లండ్ గురించి ఎన్నో విశేషాలు చెబుతున్నారు ఐ.బి.ఎం. సంస్థలో హార్డ్‌వేర్ విభాగంలో పనిచేస్తున్న రఘు సింగమనేని.

"వాతావరణం చల్లగా ఉంటుంది కనుక వారానికి రెండుమూడు సార్లు స్నానం చేస్తారంతే. ఆడవారిని ఎంతో గొప్పగా గౌరవిస్తారు. పెళ్లి కన్నా సహజీవనం చేసే పద్ధతే ఎక్కువ. చాలామంది పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడరు. పిల్లలు పుట్టాక విడిపోతే తల్లికి ఉద్యోగం లేకపోతే ఆమెకి ఉచిత వసతిని కల్పిస్తుంది ప్రభుత్వం. పిల్లలకు, ఆమెకు నెలకింతని ఇస్తారు. విద్య, వైద్యం అన్నీ ఉచితమే. ఉద్యోగం ఉన్నా లేకున్నా, బిడ్డ పుడితేచాలు నెలకి 160 యూరోలు ఇస్తుంది ప్రభుత్వం ''


బాగా చదువుకుని, మంచి ఉద్యోగానుభవం ఉన్నా సరే, చేతిలో చిల్లిగవ్వలేని ఒకానొక విచిత్రమైన పరిస్థితిలో నేను ఐర్లాండ్‌లో అడుగుపెట్టాను. పదిహేను ఇరవై రోజుల తర్వాత అనుకోకుండా ఒక భారతీయుడు, అందునా ఒక హైదరాబాదీ కుర్రాడు కనిపించినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. అప్పటిదాకా ఎలాగోలా గడుపుతున్న నేను ముందు చేసిన పనేంటో తెలుసా? అతని గదికెళ్లి అన్నం వండించుకుని తినడం!

దాదాపు పదేళ్ల నుంచీ ఐర్లాండ్ రాజధాని నగరమైన డబ్లిన్‌లో ఉంటున్నాను నేను. ఐరిష్ ప్రజలు చాలా మంచివాళ్లు. అలా ఎందుకంటున్నానంటే నేను అంతకుముందు సింగపూర్‌లో నాలుగైదేళ్లు ఉండొచ్చాను. అక్కడ జాతి వివక్ష, రకరకాల విద్వేషాలు బాగా ఉండేవి. ఈ పదేళ్లలో ఇక్కడ ఎప్పుడూ నాకు అలాంటి పరిస్థితి కనిపించలేదు. అలాంటి వాతావరణమే ఇక్కడ ఉండదు.

మనలాగా ఇక్కడ విద్య నిర్బంధం కాదు. పద్ధతిగా స్కూలుకు వెళ్లి చదువుకోవడం అనేది ఉండదు. పదో తరగతి పూర్తయితే చాలు 17, 18 ళ్లొస్తే ప్రభుత్వం తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి. లేకపోయినా పదహారేళ్ల తర్వాత సొంతంగా బతకడానికి ఇష్టపడతారు. అలాంటివారికి సాంఘిక సంక్షేమ విభాగం కొంత భత్యం ఇచ్చి పోషణకు సహకరిస్తుంది. మరొకటి - ఏ పనీ ఎక్కువా తక్కువా అని ఉండదు. చేతులతో చేసే ఏ పనినైనా వాళ్లు చాలా గౌరవిస్తారు. నిజానికి ఇక్కడ కార్ డ్రైవర్‌గానో, భవన నిర్మాణ కార్మికుడిగానో పనిచేసేవారు సాఫ్ట్‌వేర్ నిపుణుల కన్నా ఎక్కువ సంపాదిస్తారు.

సహజీవనం ఎక్కువ..

ఆధునిక పద్ధతిలో కట్టే ఇళ్లన్నిటినీ కేవలం ఐదారు మోడళ్లలోనే కడతారు. బయల మనకిష్టమైనట్టు మార్చుకోవడానికి, డి జైన్లు పెట్టడానికి వీల్లేదు. లోపల కూడా చిన్న చిన్న మార్పులకు మాత్రమే ప్లానింగ్ కమిషన్ ఆమోదం లభిస్తుంది. దుమ్మూధూళీ వంటివి ఉండవు, వాతావరణం చల్లగా ఉంటుంది కనుక వారానికి రెండుమూడు సార్లు స్నానం చేస్తారంతే. ఆడవారిని ఎంతో గొప్పగా గౌరవిస్తారు. పెళ్లి కన్నా సహజీవనం చేసే పద్ధతే ఎక్కువ. చాలామంది పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడరు. పిల్లలు పుట్టాక విడిపోతే తల్లికి ఉద్యోగం లేకపోతే ఆమెకి ఉచిత వసతిని కల్పిస్తుంది ప్రభుత్వం.

పిల్లలకు, ఆమెకు నెలకింతని ఇస్తారు. విద్య, వైద్యం అన్నీ ఉచితమే. ఉద్యోగం ఉన్నా లేకున్నా, బిడ్డ పుడితేచాలు నెలకి 160 యూరోలు ఇస్తుంది ప్రభుత్వం. అలా పదిహేడేళ్లపాటు ఇస్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా రెండుమూడు నిమిషాల్లో పోలీస్, అంబులెన్స్ అన్నీ వచ్చేస్తాయి. పోలీస్ అంటే దేవుడే ఇక్కడ. మన దేశంలోలా కాదు. ఐర్లండ్ వాసులకు వారంటే చాలా గౌరవం.


ఐరిష్ సముద్రంలో లిఫీ నది కలిసే దగ్గర ఉంటుంది డబ్లిన్. మధ్య నుంచి ప్రవహించే నది ఊరిని ఉత్తర, దక్షిణాలుగా విడగొడుతుంది. ఉత్తరం వైపంతా శ్రామికులు, దక్షిణం వైపు అంతా ఎగువ మధ్య తరగతి. అయినా నగరంలో ఎటుచూసినా పచ్చదనం తప్ప మరొకటి కనిపించదు. ఊరుఊరంతా పచ్చటి తివాచీ పరిచినట్టుగా ఉంటుంది. పార్కులు, మైదానాలు, పంటపొలాలు.... భూమ్మీద ఆకుపచ్చ రంగంతా అక్కడే పులిమేశాడా దేవుడు అన్నట్టుంటాయి. కౌన్సిల్ ప్రతియేటా ఐదువేల చెట్లను నాటుతుంది, మూడున్నరవేల ఎకరాలకు పైగా స్థలంలోని పార్కుల సంరక్షణ చేస్తుంటుంది. దేశంలోని ముఖ్య పట్టణాలు కార్క్, గాల్‌వే, వాటర్‌ఫోర్డ్. నిత్యజీవితంలో అవినీతి ఎక్కడా ఉండదు. పెద్దపెద్ద వైట్ కాలర్ నేరాలు మాత్రం జరుగుతుంటాయి.

బ్రిటిష్ వాళ్లంటే కోపం
మీకో విచిత్రం చెప్పనా? ఐర్లాండ్ అనగానే ఇంగ్లీష్ దేశమనుకుంటారు చాలామంది. కానీ, అది ఇంగ్లీష్ దేశం కాదు. బ్రిటిష్ వారి పాలనలో ఉండటం వల్ల వారికీ మనలాగానే ఇంగ్లీష్ పరిచయం అయ్యింది. 'రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్'గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ దేశం కూడా ఎంతో కష్టపడింది. మనకన్నా ఎక్కువగా వారు బ్రిటిష్‌వారిని అసహ్యించుకుంటారు. వాళ్ల పేరెత్తితే రక్తం మరిగిపోతుంది ఐరిష్ జనానికి.

వందల ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్ పాలనలో ఐరిష్ మాట్లాడితే నాలుక తెగ్గోసేవారట. అందువల్ల ఎక్కువమందికి ఇంగ్లీష్ వచ్చు. మాట్లాడలేకపోయినా అర్థమవుతుంది. కానీ వాళ్లకు అదంటే మాత్రం పడదు. తూర్పు యూరోపియన్ దేశాల నుంచి ఏడాదికి సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు రెండు మూడు నెలల పాటు తమ ప్రాజెక్టు వర్క్ చేయడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఐర్లాండ్‌కు వస్తుంటారు.
ireland-images

అన్నీ దొరుకుతాయి..
మొత్తం తెలుగు జనాభా పదివేలకు పైనే ఉంటుందిక్కడ. ఇండి యన్ స్టోర్లున్నాయి. మొన్నమొన్నటి వరకూ మామూలు బియ్యం దొరికేవి కావు. దాంతో బాస్మతి తినేవాళ్లం. ఇప్పుడు కర్నూలు సోనామసూరి దొరుకుతున్నాయి. 20 కిలోల బస్తా కొనాలంటే 36 యూరోలు పెట్టాలి. బాస్మతి అయితే 30 -32 యూరోలే. ఐదారేళ్ల నుంచి పప్పులు ఉప్పులు పచ్చళ్లు ఆవాలు జీలకర్ర ఒకటేమిటి అన్నీ దొరుకుతున్నాయి.

కందిపప్పు రెండు కిలోల ప్యాక్ ఐదు యూరోలుంటుంది. మన స్వీట్లన్నీ దొరుకుతాయి. బోలెడన్ని ఇండియన్ రెస్టారెంట్లున్నాయి. పాకిస్తాన్ వాళ్లు మొదలెట్టినవి కూడా భారతీయ పేర్లతోనే నడుస్తుంటాయి. వాటినీ ఇండియన్ రెస్టారెంట్లే అంటారు. ఈమధ్యే ఒక టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. ఒక మసాలా దోశ 4.99 యూరోలు. ఇడ్లీ సాంబార్ 2.99 యూరోలు. తెలుగువాళ్లం కలిసినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటాం. హీరోలకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. రెండు ఇస్కాన్ (శ్రీకృష్ణ)' దేవాలయాలున్నాయి. మాకు దగ్గరలో వినాయకుడి గుడి ఉంది.

అందరూ 'బీర'కాయలే...

పురాతన కెథెడ్రల్ చ ర్చి శిఖరాలు, భవనాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. పబ్‌లు, బార్ల వైభవం అయితే ఇక మాటల్లో చెప్పలేం. ఇక్కడివారికి తాగడానికి ఓ కారణం అవసరం లేదు. ఆనందం, విచారం దేన్ని వ్యక్తం చేయడానికైనా వాళ్లు తాగుతారు. మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ తాగుతారు. ఆనందమో విచారమో ఏదీ లేని సాదా స్థితిని వ్యక్తం చేయడానికీ తాగక తప్పదన్నట్టుంటారు. అది అత్యంత సహజం అక్కడ. ఇక తిరగడం అంటే వీరికి ఎంత ఇష్టమో.

పర్యాటక ప్రాంతాల అందాన్ని ఆస్వాదించడానికి మైళ్లకు మైళ్లు నడుస్తుంటారు. సాకర్, ర గ్బీ ఆటలు ఇక్కడి వారికి చాలా ఇష్టం. వాటిని చూడటానికి ఎంత ప్రయాసపడి అయినా వెళతారు. ఐర్లాండ్‌లో బెట్టింగ్ చట్టబద్ధమే. దానివల్ల గుర్రప్పందాలు, గ్రేహౌండ్ డాగ్ రేసింగ్స్ వంటివి ఒక పెద్ద పరిశ్రమగా వర్థిల్లుతున్నాయి. ఇక్కడి ప్రజలు వేడిగా ఆహారం తిననే తినరు. కారం అస్సలు తినరు. బ్రెడ్, శాండ్‌విచ్ వంటివే తింటారు. పచ్చికూరల సలాడ్లు, పచ్చిపాలు.... అన్నీ పచ్చివే ఇష్టం. నేనో స్నేహితుణ్ని ఇంటికి భోజనానికి పిలిచాను.

అతను వెళుతూ ఏమన్నాడంటే - '42 ఏళ్ల జీవితంలో ఇదే మొదటిసారి నేను వేడిగా ఆహారం తినడం...' అని! చాక్లెట్లు బాగా తింటారు. మొత్తమ్మీద ఆహారం తక్కువగా ఎక్కువసార్లు తినడం వీరి అలవాటు. మతం పట్ల పెద్ద పట్టింపు ఉండదు. దేవుణ్ని తిట్టినా ఏమీ అనుకోరు. క్రిస్మస్ గొప్పగా చేసుకుంటారు. అదిగాక సెయింట్ పాట్రిక్స్ డేను ఘనంగా చేసుకుంటారు. సాధారణంగా దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. తోటి మనిషికి ఎంతయినా సాయం చేస్తారు. సునామీ వచ్చినప్పుడు చూడాలి... మాకు బయట విపరీతమైన మంచు, వాన భారీగా కురుస్తోంది. అయినా సునామీ బాధితులకు సాయం చేయడానికి క్రెడిట్ డెబిట్ కార్డులు, డబ్బులు పట్టుకొని క్యూలలో నిల్చున్నారు దాతలు.

Ireland, beautiful pictures of the Irish countryside and nature

  
Ireland, beautiful nature and countryside
 
Ireland, beautiful nature on the Irish Coast
 
Ireland, green Irish countryside and farmland picture
 

పచ్చని పర్యాటకం...
ఏడాదికి 9-10 మిలియన్ల పర్యాటకులు ఐర్లాండ్‌కు వస్తుంటారని అంచనా. వాళ్ల వల్ల సుమారు 2 బిలియన్ యూరోల వ్యాపారం జరుగుతుంది. ఐర్లాండ్ జనాభాలో ఎక్కువమందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. తర్వాత పాల పరిశ్రమ, చాక్లెట్ల ఉత్పత్తి. ముల్లంగి, బార్లీ, ఆలూదుంపలు, ఎర్ర దుంపలు, గోధుమ - విరివిగా పండే పంటలు. బీఫ్, పాల ఉత్పత్తులయితే పొంగిపొర్లుతూ ఉంటాయి.

వేసవిలో 16-17 గంటలు వెలుగుంటుంది. శీతకాలంలో అదే మోతాదులో చీకటి ఉంటుంది. వాటి ప్రకారం పనివేళలను నిర్ణయించుకుంటారు. మా ఊళ్లోని డబ్లిన్ రాజభవనం చూసి తీరవలసిన ప్రదేశం. నార్మన్ల దండయాత్ర తర్వాత వేరే ఏ దాడికీ అవకాశం ఇవ్వకూడదని పటి ష్టంగా 1230లో నిర్మించారా కోటను. స్పైర్ ఆఫ్ డబ్లిన్ (మాన్యుమెంట్ ఆఫ్ లైట్) కూడా అద్భుతం. చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా చూసినా, విద్య, కళలు, ఆర్థికవ్యవస్థల దృష్ట్యా చూసినా ఐర్లాండ్‌లో డబ్లిన్ ప్రాధాన్యం చాలా గొప్పది.


- అరుణ పప్పు

Tuesday, February 22, 2011

కమనీయ ప్రకృతి దృశ్యం... '' కక్కబె ''

కాఫీ తోటలు... ఏలకుల పరిమళాలు... నారింజ పండ్ల తోట లు... జలపాతాలు... కొండలతో దోబూచులాడే మేఘాలు... పర్వతారోహకులకు అనువైన కొండలు... ఇలాంటి చూడ ముచ్చటైన ప్రృతి అందాలు ఆ ప్రాంతం సొంతం. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని ‘కక్కబె’ అనే గ్రామంలో ఈ రమణీయ దృశ్యాలు కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదు... ఆసియా ఖండంలోనే అత్యధిక పరిమాణంలో తేనె ఉత్పత్తి అవుతున్న ప్రాంతంగా కూడా ఈ కక్కబెకు మరో రికార్డు ఉంది.

ఓ చిన్న గ్రామం ఇది...
Kakkabఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా తేనె తుట్టెలే దర్శనమిస్తాయి. దేశ విదే శాల నుంచి అధిక సంఖ్యలో పర్యాట కులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటా రు. ఈ ప్రాంతం ఓ కుగ్రామమైనప్పటి కీ... స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, రెస్టా రెంట్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా ఇక్కడున్నాయి. కాఫీ తోటల్లో ఉన్న పురాతన బంగళాలు... ప్రస్తు తం స్టే హోంలుగా సేవలందిస్తున్నాయి.

Kakkabe4కొడగు ప్రజల సంప్రదాయాలు.. ఆహారపు అలవాట్లు ఇక్కడ మ రో ప్రత్యేకత. ఈ ప్రాంతంలో విస్తా రంగా ఉండే కాఫీ తోటల్లో వి హరిస్తూ... రమణీయమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉంటే... కా లం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదంటారు పర్యాటకులు. కాఫీ తోటలతో పాటు... ఏలకుల తోటలు ఇక్కడ ప్రసిద్ధి. ఈ ప్రాంతా నికి సమీపంలో ఉన్న తడియాండల్‌ కొండలు పర్వతారోహకులకు స్వర్గధా మాలు.ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో శిఖరం నుంచి చూస్తే అరేబియా సము ద్రం ప్రత్యేక అందాలను సంతరించు కుందా అనిపిస్తుంది. కక్కబె కు సమీపంలో ఉన్న సల్నాడ్‌ రాజప్రాసాదం మరో ఆకర్షణ. ఈ ప్రాంతా న్ని పాలించిన దొడ్డవీరరాజు ఈ రాజప్రాసా దాన్ని నిర్మిం చినట్టు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నాటి ఈ ప్యాలెస్‌ను చూసేందుకు పర్యాటకులు విశేషంగా వస్తారు.

ఇలా ఎలా వెళ్లాలి...
Kakkabeబెంగళూరు, మైసూరు నగరాల నుంచి మడికెరెకు బస్సు సదుపాయం ఉంది. అక్కడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కక్కబె చేరుకోవచ్చు. ప్రైవేట్‌ బస్సులు, టాక్సీల సదుపాయం కూడా ఉంది. ఈ గ్రామంలో ఉన్న హోంస్టేలు, రిసార్టులు, హోటళ్లలో బస చేసేందుకు రోజుకు వెయ్యి నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తారు.

మధ్యయుగ సంస్కృతి సౌరభం... జైసల్మేర్‌

భారత్‌లోని అన్ని రాష్ట్రాలకెల్లా టూరిజం విషయంలో రాజస్థాన్‌ ముందువరుసలో ఉంటుంది. యుగయుగాల చరిత్ర, సంస్కృతులకు సాక్ష్యంగా నిలిచిన ఎన్నో పురాతన ఆలయాలకు రాజస్థాన్‌ నెలవు. రాజధాని జైపూర్‌తో సహా రాష్ట్రంలోని ప్రతి ముఖ్యపట్టణం పర్యాటక ప్రాధాన్యం కలిగి ఉండడం విశేషం. అలాంటి పట్టణాల్లో జైసల్మేర్‌ ఒకటి. మధ్యయుగ నాగరికతకు ఆలవాలమైన ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ కొలువై ఉన్నాయి.

Jaisalmer2రాజస్థాన్‌లోకెల్లా అత్యంత సుందర నగరం జైసల్మేర్‌. అయితే రాజస్థాన్‌ అనగానే అక్కడి థార్‌ ఎడారి, రాజధాని నగరం జైపూర్‌లే గుర్తుకు వస్తాయి. జైసల్మేర్‌ గురించి చాలామందికి తెలియదు. నేటికీ మధ్యయుగపు రాజపుత్రుల విశిష్ట కట్టడాలెన్నో ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వారి వీరగాథలకు ఈ కట్టడాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కొత్తజంటల హనీమూన్‌ విహారానికి జైసల్మేర్‌ ఎంతో అనువైన పర్యాటక కేంద్రం. అలనాటి రాజపుత్రుల ప్రేమ గురుతులు ఇక్కడి రాజసౌధాలు. హనీమూన్‌ ట్రిప్‌కోసం ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఆ సౌధాలు ఎన్నో తీపి గురుతులను మిగుల్చుతాయి. బ్రిటీష్‌ కాలంలో జైసల్మేర్‌ ప్రత్యేక రాష్ట్రం (ప్రిన్సిలీ స్టేట్‌) గా ఉండేది. ఆ తరువాత రాజస్థాన్‌ రాష్ట్రంలో అంతర్భాగం అయ్యింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ నుండి 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైసల్మేర్‌కు వెళ్లాలంటే జోధ్‌పూర్‌ నుండి వెళ్లాలి. ఇక్కడ రాజస్థానీ, హిందీ, మర్వారీ భాషలు మాట్లాడతారు.


రాజస్థాన్‌ రాజవంశ చరిత్ర...
ఇక రాజస్థాన్‌ మొత్తం ఇంతకుముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. అలా రాష్ట్రం మొత్తం ముప్ఫైఆరు రాజవంశాల వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరంతా మొదట ఒకే వంశానికి చెందినవారు. కాలక్రమంలో అన్నదమ్ములగా విడిపోతూ ఎవరికివారు తమ వంతుకు వచ్చిన భాగంలో విడిగా ఒక రాజధాని నగరం నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న ప్రతీనగరంలోనూ ఒక కోట ఒక రాజభవనం (రాజుగారి నివాసం) రెండూ ఉంటాయి. ఎవరికివారు ముందువారికంటే గొప్పగా ఉండే కోటలు, రాజభవనాలు నిర్మించారు.


Tilon-ki-polవీటిలో ఉదయ్‌పూర్‌లోని లేక్‌ప్యాలెస్‌, జైపూర్‌లోని ‘హవామహల్‌’ పేరెన్నికగన్నవి. ఈ కోటలు, రాజభవనాలు అన్నీ ఆయా రాజవంశాల వారి స్వంత ఆస్తి. ప్రతి ఊరిలోనూ ఆ రాజ కుటుంబం వారు ఒక ట్రస్టు స్థాపించి, ఈ కోటలు రాజభవనాలను ఆ ట్రస్టు పేరున మ్యూజియంగా చేశారు. కోట, బుండి, చిత్తోర్‌గడ్‌, ఉదయపూర్‌ నాథ్‌, అజ్మీర్‌, పుష్కర్‌, జైపూర్‌, బికనీర్‌, జైసల్మీర్‌, జోధ్‌పూర్‌, మౌంట్‌ అబూ వంటి నగరాలు ఆయా రాజవంశాలకు రాజధానులుగా వెలుగొందాయి. అందులోని ప్రముఖ కోటల్లో మౌంట్‌ అబూ, జైసల్మేర్‌ ప్రఖ్యాతిగాంచినవి.


పర్యాటక దిగ్గజం... జైసల్మేర్‌
ఈ నగరాన్ని ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా చెప్పవచ్చు. జైసల్మేర్‌ దేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రాలలో అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అక్కడి సోనార్‌ ఖిల్లానే జైసల్మేర్‌ కోటగా పిలుస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక సజీవ కోట ఇదే. ప్రసిద్ధ థార్‌ ఎడారిలోని మరుభూమిలో నిర్మితమైన సుందర పట్టణమే జైసల్మేర్‌. రాజపుత్రుల రాచరిక వైభవాన్ని, నాటి సంపన్నుల కళాత్మకతను చాటి చెబుతున్న అరుదైన ఇసుకరాయి భవనాలు అక్కడ ఎన్నో. భట్టి రాజపుత్రులు 12వ శతాబ్ధంలో జైసల్మేర్‌ పట్టణాన్ని స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది.


Salim_ki_Haveliఆనాటి వ్యాపారులు సంచరించే ప్రధాన మార్గంలో ఒక ప్యూహాత్మకంగానే ఇది ఏర్పడింది. సంపన్న వ్యాపారులు ఆనాటి రాజాస్థానాలలో మంత్రులుగానూ ఉన్నట్టు చెబుతారు. జైసల్మేర్‌లోని హవేలీలు వారి కళాత్మక హృదయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మన రాజధాని నగరం హైదరాబాద్‌తోపాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల నుండి జైసల్మేర్‌కు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఇక్కడ పర్యాటకులకు తగినంతగా వసతి సౌకర్యాలు లేవు. కానీ, రాజస్థాన్‌ పర్యాటక శాఖ చొరవతో ప్రస్తుతం జైసల్మేర్‌లో పర్యాటకుల వసతి ఏర్పాట్లు ఎంతో మెరుగయ్యాయి. దాంతో ఇక్కడికి పర్యాటకుల రాకపోకలు ఎక్కువయ్యాయి. జైసల్మేర్‌ పట్టణంలోని ఇసుక కోటతో పాటు మొత్తం పట్టణం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న రజ్వాడ కోట వంటి హోటళ్ళలో బసచేస్తే సోనార్‌ ఖిల్లాను దగ్గరగా చూడవచ్చు. సోనార్‌ ఖిల్లాతో పాటు పట్టణంలోని ప్రతి ప్రాచీన భవనం పసుపు పచ్చని ఇసుక రాయితో ఆకర్షణీయంగా మనసును ఉల్లాసపరుస్తుంది.


తీలన్‌ కీ పూల్‌...
Sonar_Khillaజైసల్మేర్‌లో అడుగిడగానే ముందుగా మదిని దోచేది తీలన్‌ కీ పూల్‌ సరస్సు. ఇదొక వర్షపునీటి సరస్సు. ఈ సరస్సులో నీలిరంగులో ఉండే నీరు, వాటి మీదుగా సింధూరకాంతులు విరజిమ్మే సూర్యుని ప్రతిబింబం చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తీలన్‌ కీ పూల్‌ సరస్సుకు అత్యంత ఎతె్తైన ప్రవేశద్వారం ఉన్నది. ఎంతో కళాత్మకంగా చెక్కబడిని ఈ ద్వారం ఎంతో సౌందర్వంతంగా మనసును ఆకట్టుకుంటుంది. ఈ ద్వారం గుండానే సరస్సులోకి వెళ్ళవచ్చు. రాచరిక కాలానికి చెందిన తీలన్‌ అనే ఒక వేశ్య దీనిని నిర్మించడం వలన ఆమె పేరుతోనే ‘తీలన్‌ కీ పూల్‌’ గాస్థిర పడింది. ఈ సరస్సు ప్రాంతం ఒక చూడచక్కని పిక్నిక్‌ స్పాట్‌గా అభివృద్ది చెందింది. ఇక్కడ పలు దేవాలయాలు, ప్రాచీన రాజభవనాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి కొద్ది దూరంలో ‘బడాబాగ్‌’ ఉంటుంది. అది ఆనాటి పాలకుల స్మశాన వాటిక. అక్కడ సుందరమైన రాచరిక స్మారక కట్టడాలు (ఛత్రీలు) ఉన్నాయి.


సోనార్‌ ఖిల్లా... కళావైభవం...
జైసల్మేర్‌ పట్టణంలోని ఒక కొండపై ఉంది సోనార్‌ఖిల్లా. ఈ కోట ఎత్తు సుమారు 250 అడుగులు. రాజస్థాన్‌ మరుభుమిలోని ఒక మహాద్భుతంగా దీనిని అభివర్ణిస్తారు. ఈ కోట గోడలు ఇసుకలో నిర్మితమైన తీరు విస్మయపరుస్తుంది.ఒక ఇసుక నేలలలో ఇంతటి మహా కట్టడం నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గణేష్‌ పూల్‌, సూరజ్‌ పూల్‌ (సన్‌గేట్‌) ల మీదుగా ఈ కోటలోకి వెళ్లాలి. సన్‌గేట్‌కు ఇరువైపులా దుకాణ సముదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని ఏకైక సజీవ కోటగా దీనిని చెబుతారు. దుర్గంలోని అనేక భవనాలను రాజులు అప్పట్లోనే తమ పరివారానికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది.


Jaisalmerఇప్పటికీ ఈ కోటలోని పరిసరాలు, భవనాలు, హవేలీలు స్థానికులకు నివాసయోగ్యంగా ఉన్నాయి. అక్కడ సుమారు 1000కి పైగా కుటుంబాలు నివసిస్తునట్లు అంచనా. అక్కడి వ్యాపారుల, ప్రజల జీవనశైలి ఎంతో విలక్షణమైంది. ఆడపిల్లలు గాజులు అమ్ముతూ కనిపిస్తారు. దీని తరువాత భూటా లేదా భోయింటా పూల్‌ ఉంటుంది. దీనినే టర్న్‌గేట్‌గా పిలుస్తారు. దీని తర్వాత చిట్టచివరన హవాపూల్‌ ఉంటుంది. అన్ని ప్రాసాదాలకు, భవనాలకు ఉన్న ఎత్తైన ద్వారాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. కోటలోని ప్రజాదర్భారుకు ఆవరణగా హవాపూల్‌ ఉంది. ఇదే కోటలో భాగంగా పలుపురాతన జైనదేవాలయాలు ఉన్నాయి. 12 నుండి 15వ శతాబ్ధాలకు చెందిన ఈ ఆలయాల నిర్మాణ రీతులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అడుగడుగునా శిల్ప నైపుణ్యం ఉట్టిపడుతుంది. అక్కడి నుంచి స్థానికుల ప్రధాన కేంద్రం మనేక్‌చౌక్‌కు చేరుకోవచ్చు.


ఎటు చూసినా ‘హవేలీ’లే...
మనేక్‌చౌక్‌ నుండి బయలుదేరి చిన్నవీధులు, గల్లీల గుండా వెళ్తే పురాతన భవనాలైన హవేలీలు దర్శనమిస్తాయి. ఒకనాటి పుర ప్రముఖుల నివాస కేంద్రాలే ఇవి. అసాధారణ నిర్మాణ నైపుణ్యంతో కూడిన ఈ భవనాలలో ఎక్కడ చూసినా శిల్ప సౌందర్యం చూపు తిప్పుకోనీయదు. రాజభవనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడు హవేలీలను నిర్మించారు. జైసల్మేర్‌లోని ప్రధాన హవేలీలలో ‘సలీం కీ హవేలి’, ‘నథ్‌మల్‌ హవేలీ’, ‘పట్వాన్‌ కీ హవేలీ’ వంటివి ఉన్నాయి.


వీటినీ దర్శించుకోవచ్చు...
Jaisalmer1జైసల్మేర్‌ పరిసరాలలోని మరిన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. వాటిలో... లోర్‌డ్వా, సాంలు ప్రముఖమైనవి లోర్‌డ్వా ఒక ప్రాచీన రాజధాని. అమర్‌సాగర్‌ మీదుగా ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమర్‌సాగర్‌లో ఒయాసిస్సుల వంటి సరస్సులు, రాజభవనాలు, రాళ్ళతో నిర్మితమైన ఒక డ్యాం, పలు జైన దేవాలయాలు ఉన్నాయి. లోర్‌డ్వా ప్రాంతమంతా శుష్కనేల. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుకే. లోర్‌డ్వా ప్రాంతంలో వేసవిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక సాం నిజమైన ఎడారి ప్రదేశంగా ప్రసిద్దిగాంచింది. సువిశాలమైన ఎడారిని అక్కడ చూస్తాం. అక్కడి అద్భుతమైన ఎడారి ఇసుక దిబ్బల ప్రాకృతిక సౌందర్యానికి ప్రతి పర్యాటకుడు ముగ్ధుడవుతాడు. సాం లోని కాటేజ్‌లలో తాత్కాలికంగా నివాస సౌకర్యాలు ఉంటాయి. అక్కడ ఒంటెలపై ఎడారిలో ఓడ ప్రయాణం ఓ మరుపురాని అనుభూతి.

మరో ప్రసిద్ధ క్షేత్రం పుష్కర్‌...
అజ్మీర్‌ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు పుష్కర్‌. ఇక్కడి దగ్గరలో పర్యాటకులకు అంతగా పరిచయం లేని మరో క్షేత్రం ‘నాథ్‌ద్వారా’ కూడా ఉంది. ఇది ఉదయ్‌పూర్‌ నుండి ఉత్తరంగా 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుజరాత్‌, రాజస్థాన్‌ ప్రజలకు ‘పంచద్వారక’ లలో ఒకటిగా చెప్పబడే నాథ్‌ద్వారా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం భౌగోళికంగా రాజస్థాన్‌లోనే ఉన్నా... గుజరాత్‌ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉంటుంది. దీనికి 185 కిలోమీటర్ల దూరంలో... దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వేసవి విడిది కేంద్రమైన మౌంట్‌ అబూ పర్వతం ఉంది.


ఎప్పుడు, ఎలా వెళ్ళాలి?
జైసల్మేర్‌లో అక్టోబర్‌ నుండి మొదలుకొని మార్చి నెల వరకు సంవత్సరంలో సుమారు ఆరునెలలు జైసల్మేర్‌ వెళ్ళడానికి మంచి సీజన్‌గా చెబుతారు. మరీ ముఖ్యంగా ఎడారి ఉత్సవం జరిగే సమయంలో అయితే అక్కడి ప్రాంతాలన్నీ కన్నుల పండుగగా ఉంటాయి. ఢిల్లీ, జోథ్‌పూర్‌ వంటి ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. పట్టణంలో యత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. పలు ప్రైవేట్‌ రిసార్ట్‌లు కూడా కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.

Friday, February 11, 2011

గ్రీన్ టూర్ లేడీస్ స్పెషల్

పదిమంది అతివలు... 21 నుంచి 52 వరకూ వివిధ వయసుల వారు, ఒక్కొక్కరిదీ ఒకో ప్రాంతం, వేర్వేరు భాషలు... అందర్నీ కలిపింది సాహసమే. 'గో గ్రీన్ గాళ్స్' అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డారు. పర్యావరణానికి మేలు చేయాలి, తమను చూసి మరో పదిమంది నేర్చుకోవాలి. తమకు సాహసమనే సరదా తీరాలి. ఇవన్నీ ఆలోచించి 35 రోజుల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. కోల్‌కతాలో జనవరి 25న జెండా ఊపి బయల్దేరారు.

ఫిబ్రవరి 28న కన్యాకుమారిలో ఆ జెండాను పాతి యాత్రను ముగిస్తారు. రోజుకు సగటున 70-100 కిలోమీటర్ల దూరాన్ని ఆడుతూపాడుతూ అధిగమిస్తున్నారు. మధ్యమధ్యలో ఊళ్లలో ఆగి పాఠశాలలు, కళాశాలల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారు. "ఇలా చేస్తే బాలికల్లో సాహసం పట్ల స్పృహ పెరుగుతుంది. తలచుకుంటే తాము చేయలేనిదేమీ లేదన్న ఆత్మవిశ్వాసం వాళ్లలో కలుగుతుంది'' అంటున్నారు ఈ బృందం మహిళలు.

ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న వసుమతి శ్రీనివాసన్ 40 ఏళ్లుగా ఇదే రంగంలో కృషి చేస్తున్నారు. ఆమె ఉత్సాహానికి ఆర్మీలో పనిచేసే భర్త ప్రోత్సాహం తోడయింది. "ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగున్నరకల్లా నిద్రలేస్తాం. ఐదున్నరకల్లా యాత్రను ప్రారంభిస్తాం. రోజుకు ఇద్దరు లీడర్స్‌గా వ్యవహరిస్తారు. వాళ్లు ముందుంటారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఏడున్నర ఎనిమిదింటికి శుభ్రంగా ఉండే చోట అల్పాహారం తీసుకుంటాం.

మళ్లీ ముందుకెళతాం. భోజనాలు చేశాక కాసేపు విశ్రమిస్తాం. సాయంత్రం ఐదున్నర, ఆరింటి వరకూ ప్రయాణం సాగుతుంది. మధ్యలో కనిపించిన వారినల్లా పర్యావరణానికి హాని చేయొద్దని అభ్యర్థిస్తూ ముందుకెళుతున్నాం...'' అంటూ ఈ సైకిల్ సాహసయాత్ర జరుగుతున్న తీరును వివరించారామె. "ఊళ్లలో మా వైపు విచిత్రంగా చూస్తుంటారు. కానీ, మా యాత్ర ఉద్దేశం చెప్పగానే గౌరవిస్తున్నారు. అప్పుడప్పుడూ ఈవ్ టీజింగ్ చేసేవాళ్లూ ఎదురవుతుంటారు. కామెంట్లను సరదాగ తీసుకుని ముందుకెళ్లిపోతాం.

మరీ ఇబ్బంది పెట్టే సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు..'' నవ్వుతూ అన్నారు ఆ మహిళలు. 'ఇన్నిసార్లే ఆగాలనే నియమం ఏం పెట్టుకోలేదు. మధ్యమధ్యలో చల్లటి కొబ్బరినీళ్లు వంటివి కనిపిస్తే ఆగిపోతాం. నిన్న ఒకచోట తాజా కల్లు ఇచ్చారు అక్కడివారు. అబ్బో దాని రుచి అమోఘం... లోకల్‌గా ఎక్కడేది దొరికితే దాన్ని లాగించేస్తున్నాం..'' అంటున్నప్పుడు నవ్వులే నవ్వులు.

మాకు భయం లేదు..

వీళ్లందరికీ పర్యావరణ స్పృహ ఒక్కటే కాదు. సాహసాలు చేయాలన్న ఉత్సాహం కూడా ఎక్కువ. "నాకు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఏటా మూడు నాలుగు సార్లు హిమాలయాలను ఎక్కేందుకు వచ్చే బృందాలకు నాయకత్వం వహించాను. నిజానికి చాలామందికి సాహసాలు చేయాలన్న ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని సరైన దిశలో ప్రోత్సహించాలి. ముఖ్యంగా పిల్లలను.

చిన్నప్పటి నుంచీ ఉత్తేజపరచడం వల్ల వాళ్లకు పెద్దయ్యాక ఒక బృందంగా కలిసి పని చెయ్యడం, ఇతరుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు అబ్బుతాయి. ఉదాహరణకు మీరొక శిఖరాన్ని చూస్తారు. 'అబ్బో దీన్ని అధిగమించడం కష్టం, నావల్ల కాదులే' అనుకుంటారు. కానీ కష్టపడి దాన్ని సాధించిన తర్వాత ఇందాక భయపెట్టిన పర్వత శిఖరం ఇప్పుడు మీ కాళ్ల కింద ఉంటుంది. అదెంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేం..'' అన్నారు బెంగళూరుకు చెందిన వసుమతి శ్రీనివాసన్.

కోల్‌కతాకు చెందిన లిపిక బిశ్వాస్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. "నా సోదరులు సరదాగా పర్వతారోహణ చేస్తుంటే నాకూ చెయ్యాలనిపించింది. అన్నయ్య చెయ్యగాలేనిది నేనెందుకు చెయ్యకూడదు? అని మా నాన్నను అడిగితే 'ఎందుకు చెయ్యకూడదూ, నువ్వు కూడా బాగా చెయ్యగలవు' అంటూ భుజంతట్టారు. డార్జిలింగ్‌లోని 'హిమాలయన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్'లో కొన్ని కోర్సులు చేశాను. 95 నుంచి నేను పర్వతారోహణ చేస్తున్నాను. కిందటేడు వసుమతిని కలిసిన తర్వాత విమెన్ అడ్వెంచర్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (డబ్య్లుఎఎన్ఐ)లో సభ్యత్వం తీసుకున్నా.

రైల్వే ఉద్యోగినైనా సమయం సర్దుబాటు చేసుకుంటున్నా. పదేళ్ల కింద ఒక సాహసయాత్ర చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నా బూట్లు పాడయిపోయాయి. అందరినీ నాకోసం ఆగమనలేను, అలాగని బేస్‌క్యాంపు దాకా వెళ్లి కొత్తవి తెచ్చుకోలేను. నా తోటి వాళ్లను ముందుకు సాగిపోమ్మని చెప్పి నేను ఉదయం పది నుంచీ సాయంత్రం ఆరింటివరకూ వాళ్లు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాను. హిమాలయాల్లో ఎవరూ లేకుండా ఒంటరిగా... గాలి వీచిన శబ్దానికి ఉలిక్కిపడేదాన్ని. ఎవరో వస్తున్నారనిపించేది... మళ్లీ నిశ్శబ్దం...'' మరిచిపోలేని జ్ఞాపకాలను ముచ్చటగా చెప్పుకొచ్చారామె.

అందరికీ అతిథులం

ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో కూడా కొందరు సైకిల్‌యాత్రలో పాల్గొంటున్నారు. సరదాతోపాటు సాహసం చేస్తే వచ్చే థ్రిల్‌ను వారు సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మాటే చెప్పుకొస్తూ.. "రెండేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని మొన్నే వదిలేశాను. మరో ఉద్యోగంలో చేరే ముందు ఏదైనా సాహసయాత్ర చేద్దామనుకుంటున్నప్పుడు ఈ బృందం గురించి తెలిసింది. ఇదే నా మొదటి సాహసయాత్ర. మొన్న ఒరిస్సాలో జలేశ్వర్‌లో ఆగినప్పుడు అక్కడొక జాతర జరుగుతోంది. వాళ్లు మమ్మల్ని ముఖ్య అతిథులుగా అందరికీ పరిచయం చేశారు.

వారి ఆదరం ఎప్పటికీ మరపురానిది..'' అంటూ చెప్పుకొచ్చారు బెంగుళూరుకు చెందిన స్నేహ సుబ్రమణ్యం. ఇలాంటి సాధారణ ఉద్యోగినులే కాదు. పర్వతారోహణను ఒక సవాల్‌గా తీసుకున్న మరికొందరు మహిళలు కూడా ఈ సైకిల్‌యాత్రలో తళుక్కుమన్నారు. "ఎవరెస్ట్‌ను అధిరోహించిన అతి పిన్న మహారాష్ట్ర అమ్మాయిని నేనే. మరో నాలుగు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను అధిరోహించాను. సాహసక్రీడల్లో నిత్యం పాల్గొనేదాన్ని.

గడచిన రెండేళ్లుగా పర్వతారోహణ నా నిత్యజీవితంలో భాగమైపోయిందంటే నమ్మండి. ప్రస్తుతం 'జోర్‌కా ఝట్కా' అనే రియాల్టీషో చేస్తున్నాను. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరాన్ని ఎక్కిన మొదటి భారతీయ అమ్మాయిగా రికార్డు ఉంది. మొత్తం ఏడు ఖండాల్లో ఇలాంటి రికార్డును నెలకొల్పాలన్నదే నా ఆశయం..'' అంటున్న పుణె వాసి కృష్ణా పాటిల్ పట్టుదలను మెచ్చుకోకుండా ఉండలేము.

మరపురాని అనుభవాలు..
"రెండేళ్లక్రితం ఒక పర్వతారోహణ చేస్తున్నప్పుడు మా లీడర్ విమలా నేగికి సైక్లింగ్ ఆలోచన వచ్చింది. నాకూ చెయ్యాలనిపించిందిగానీ సైక్లింగ్ రాదు. మాది పర్వత ప్రాంతం కావడం, ఏడాదికి ఆర్నెల్లు మంచుతో కప్పేయడం వల్ల నేర్చుకోవడం కుదర్లేదు. మా తమ్ముడు ఒకరోజు రెండుగంటల పాటు నేర్పాడంతే. దానితో ఏమీ రాలేదు. అయినా ఇందులో పాల్గొనాలని యాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందు ప్రాక్టీస్ చేశాను. ఊళ్లలో సైకిల్ తొక్కడం కష్టమనిపిస్తోందిగానీ, ఆరుబయట ప్రదేశాల్లో మాత్రం అందరితో సమంగా తొక్కగలుగుతున్నా. నిన్న ఒడిషాలో ఒక టీవీ కెమెరామన్ నాకు దగ్గరగా కెమెరా పెట్టాడు. సైకిల్‌ను గాభరాగా తొక్కడంతో ఆయనతోపాటు కెమెరా కూడా కిందపడిపోయింది..'' అంటూ నవ్వుకున్నారు మనాలికి చెందిన కృష్ణ ఠాకుర్.

వీళ్లంతా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పర్వతప్రాంతాలలో పర్యటించారు. మరిచిపోలేని అనుభూతులను సొంతం చేసుకున్నారు. అలాంటి మహిళల్లో డెహ్రడూన్‌కు చెందిన కవిత ఒకరు. "నేను ఒకసారి ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు మంచు తుపాను కమ్ముకుంది. నేను ఇక బతకడం కష్టమే అనుకున్నాను. నా కళ్లముందే ఇద్దరు విదేశీయులకు గాయాలయ్యాయి. ఒక షేర్పా మంచులో కూరుకుపోయి చనిపోయాడు..'' అంటూ యాత్రలో ఎదురైన విషాద అనుభవాన్ని చెప్పారు కవిత. "నేను ఋషీకేశ్‌లో పర్యాటకులతో బంగీజంప్ చేయిస్తుంటాను. మరికొన్ని సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తుంటాను. కేవలం మహిళలతో మాత్రమే కలిసి ఈ యాత్ర చేయడం అద్భుతం'' అన్నారు రూప సాహీ.

దేశవ్యాప్తంగా మహిళల సాహసయాత్రలను ప్రోత్సహించడానికి 'విమెన్ అడ్వెంచర్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా' సంస్థ పనిచేస్తోంది. సాహసాలే మాధ్యమంగా మహిళలను ఉత్తేజపరచడానికి, పనిలో పనిగా పర్యావరణ పరిరక్షణకూ తన వంతు సాయం చేస్తుంది. ఈ సంస్థలో సభ్యులే ఇప్పుడీ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు.

జనవరి 25న కోల్‌కతాలో ప్రారంభమైన 'గో గ్రీన్ గాళ్స్' సైకిల్ యాత్ర ఒడిషాను దాటి మన రాష్ట్రంలో ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, రణస్థలం, విశాఖపట్నం వరకూ వచ్చింది. ఇక్కడ నుంచి తుని, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, చిన్న గంజాం, కావలి, మనుబోలు, తడల మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. ఫిబ్రవరి 28న కన్యాకుమారిలో సైకిల్‌యాత్ర ముగుస్తుంది. బీఎస్‌యే హెర్క్యులస్, ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్, టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్, రోటరీ సంస్థలు ఈ యాత్రను స్పాన్సర్ చేస్తున్నాయి.

రికార్డులు కొట్టారు..

ఈ మహిళల బృందంలో అందరూ సైకిళ్లే కాదు. మోటర్‌బైక్‌లు కూడా నడుపుతారు. బైక్‌ల మీద సహసాలు కూడా వీరికి కొత్తేం కాదు. "కొన్నేళ్ల కిందట నేను ఉత్తరాఖండ్ పర్వతాల్లో మూడు వేల కిలోమీటర్ల బైక్ యాత్ర చేశా. నాకు సీబీజెడ్ సొంత బైక్ ఉంది తెలుసా? ఊరికే హారన్ కొట్టడం నాకు నచ్చదు. అందుకే నా బైక్‌కు హారన్ లేదంటే మీరు నమ్మగలరా?'' అంటున్న సోనీషా మాటల్లో పర్యావరణం పట్ల తనకున్న బాధ్యతను చెప్పకనే చెప్పినట్లయింది. అమెరికాలోని నేషనల్ అవుట్‌డోర్ లీడర్‌షిప్ స్కూల్‌లో విద్యార్థులకు సాహసక్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు రీనా ధర్మసక్తు.

ఈమె దక్షిణ ధృవానికి స్కీ చేసిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సైకిల్ యాత్రలో భాగస్వాములయ్యారు. ఈ యాత్రలో అందరినీ ఆకర్షిస్తున్న తల్లీకూతుళ్లు వసుమతి, స్మితా శ్రీనివాసన్. పర్వతారోహణ చేసిన తొలి తల్లీకూతుళ్లుగా వీరి పేరిట లిమ్కా రికార్డు కూడా నమోదయ్యింది. "సైకిల్‌కు రెండు చక్రాలు. మా ఆశయానికి రెండు లక్ష్యాలు సాహసాభిరుచి, సామాజిక స్పృహ. ఇవే మమ్మల్ని కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు నడిపిస్తున్నాయ్'' అంటున్న వీరందరికీ చల్లటి విశాఖ తీరం కాస్త సేద తీరమని స్వాగతం పలికింది.