పర్యాటకులకు స్వర్గధామం ఇండోనేషియా. 23 కోట్ల ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో హిందూ మూలాలు అనేకం... ఈ దేశంలోని బాలి పట్టణంలో 90% హిందువులు నివసించే ఎప్పటికీ వింతే... 30 లక్షల జనాభా ఉన్న బాలికి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యా టకులు వస్తుండటం విశేషం.
హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో, అందమైన సెలయేళ్ళు, పచ్చని అడవుల ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఇండోనేషియా... అన్నీ దీవి పట్టణాలే... జకార్తా, బాలి, బాండుంగ్, మేడాన్... ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నాయి . మరి ఆ దీవుల్లో విహరిద్దామా..!
ఇండోనేషియాలో జావా, సుమత్ర, సులవేసి, మలుకు, కాలీమంతన్, ఇరియన్ జయ అనే ఆరు ముఖ్యమైన దీవులున్నాయి. నిజానికి ఇండోనేషియా 14 వేల దీవుల సమాహారం అయినప్పటికీ... పైన చెప్పుకున్న ఆరింటిలో మాత్రమే జనావాసం ఉంది. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, జావా ద్వీపంలో ఉంటుంది. ఈనగరంతో పాటు సురబయ, బాలి, బాండుంగ్, మేడాన్, సెమారంగ్‌లు ఇక్కడి ప్రధానమైన ఇతర పట్టణాలు ఉన్నాయి.జకార్తాని 17వ శతాబ్దంలో జయకర్త అని పిలిచేవారట. అంటే... గొప్ప విజయానికి చిహ్నమైన నగరం అని దానర్థం.
అదే రానురాను వాడుకలో జకార్తాగా మారిపోయింది. జకార్తాలో చూడదగ్గ మ్యూజియంలు అనేకం ఉన్నాయి. ఇక్కడి జాతీయ ప్రదర్శనశాల, పపెట్ మ్యూజియం, టెక్స్‌టైల్ మ్యూజియం, స్టాంప్ మ్యూజియం, ఫ్రీడం మ్యూజియం.. లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఒకచోట ఇండోనేషియా చరిత్రను కళ్లకు కట్టినట్లు కనిపిస్తే, మరోచోట రకరకాల బొమ్మలు కనువిందు చేస్తాయి. ఇంకోచోట జాతీయ ఉద్యమ ఘట్టాలు, మరోచోట అక్కడి ప్రజల మత విశ్వాసాలు దర్శనమిస్తాయి. అయితే ఈ మ్యూజియంలు ఉన్న భవనాలన్నీ పురాతనమైనవే కావడం గమనార్హం.
జకార్తాలో చూడదగ్గ మరో ప్రాంతం నేషనల్ మాన్యుమెంట్. దీన్నే మోనాస్ అంటుంటారు. ఇదో పెద్ద స్తూపం. 137 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే దీనిపై వెలుగుతున్న దివిటీలాంటి నిర్మాణం ఉంది. 35 కిలోల బంగారంతో ఈ స్తూపాన్ని నిర్మించారట. దీన్ని ఆ దేశ స్వాతంత్య్రానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నగరంలోని మరో ఆకర్షణ తమన్ మినీ ఇండోనేషియా ఇండా అనే మీనియేచర్ పార్క్. దీన్ని చూస్తే, ఆ దేశం మొత్తాన్ని చూసినట్లే...! బీచ్‌లు, దీవులూ, మధ్యయుగంనాటి భవనాలు, చారిత్రక కట్టడాలు.. ఎన్నె ఎన్నెన్నో ఈ పార్కులో కొలువుదీరి ఉంటాయి.
పుష్పవనం... బోగోర్...
జకార్తాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే బోగోర్ పట్టణం కూడా పర్యాటక ప్రాంతమే. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పట్టణంలోని ప్రధాన ఆకర్షణ బొటానికల్ గార్డెన్. దీన్ని 1811వ సంవత్స రంలో సర్ స్టాన్‌ఫోర్డ్ రఫెల్స్ నిర్మించాడట.
ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం నుంచి అతి చిన్న పువ్వుదాకా ఈ గార్డెన్‌లో మనకు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో చిన్న చిన్న వెదురు వంతెనలు భలే తమాషాగా ఉంటాయి. ఈ గార్డెన్ మెయిన్ గేట్‌కు దగ్గర్లోనే ఒక జువలాజికల్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో దాదాపు 30 వేల స్పెసిమన్లు ఉంటాయి. స్టఫ్డ్ ఖడ్గ మృగం, వేల్ చేప, కొమొడొ డ్రాగన్‌లు మన చూపుల్ని కట్టిపడేస్తాయి.
దేవాలయాల విషయానికి వస్తే... ఈ బోగోర్ పట్టణంలో శివాలయం, సాయిమందిరం, కృష్ణుడి గుడి అంటూ హిందూ దేవతల ఆలయాలు చాలానే కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో భారతదేశం నుంచి వచ్చిన స్థిరపడినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇక్కడ హిందువులతో పాటు ముస్లిం ప్రజలు కూడా హిందూ పండుగలను జరుపుకోవడం. రామాయణం చదివే ముస్లింలు బోగోర్‌లో చాలామందే కనిపిస్తుంటారు.
బాలి విహారం భలే.. భలే..
బాలి గురించి తెలుసుకోవాలంటే నెట్‌లో, పుస్తకాల్లో దొరికే సమాచారం కాదు అదంతా పర్యాటకులు వివరించాల్సిందే. మనదేశంలో వేళ్లూనుకొని ఉన్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలిలో కూడా ఉంది. ఇలాంటి సాంప్రదాయ సమాజాల్లో సంస్కృతీ సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ముఖ్యంగా స్ర్తీలే. గృహ జీవితంలో, పిల్లల పెంపకంలో, ఆహారం తయారు చెయ్యటంలో, ఇలా వివిధ నిత్య గృహ కృత్యాల్లో తమ చర్యల ద్వారా సాంప్రదాయాల్ను కొత్త తరానికి అందజేస్తుంటారు ఇక్కడి స్ర్తీలు. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్యనున్నది బాలి దీవి.
మొత్తం 17వేల దీవులతో కూడిన ఇండోనేషియాలో బాలి అందం ప్రత్యేకత మరి దేనికీ లేదంటారు. బాలి తూర్పునుంచీ పశ్చిమానికి 140 కి.మీ., ఉత్తరం నుంచీ దక్షిణానికి 80 కి.మీ విస్తరించి ఉంది. అయితే తూర్పు నుంచీ పశ్చిమానికి నిప్పులు చెరిగే పర్వతాలు ఉండటం దురదృష్టంగానూ భావిస్తారు. వీటిలో అత్యంత పెద్దది గునుంగ్ అగుంగ్ పర్వతం 1963లో పేలి నిప్పు నది ప్రవహించింది. ఆ తర్వాత ఇంతవరకూ అలాంటవి సంభవించలేదు. ఈక్వేటర్‌కి ఎనిమిది డిగ్రీలు దక్షిణంగా ఉన్న ఈ బాలి వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు సీజన్లే ఉంటాయి. ప్రతీ సంవత్సరం చలి, పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాధారణంగా ఇక్కడ 28 డిగ్రీల సెల్సియస్ వేడిమి ఉంటుంది.భారీ వర్షాల కాలంలో పచ్చగా మెరుస్తూ మహాద్బుతంగా ఉంటుంది బాలి. ఎంతో మాగాణి భూమి కావడంతో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. బాలి దక్షిణాన కొండప్రాం తాల్లో ధాన్యం, ఉత్తర తీర ప్రాంతాల్లో కాఫీ, కూరగాయలు బాగా పండుతాయి.
ఇక్కడ హిందువులే అధికం...
అత్యధిక ముస్లిం జనాభా వున్న ఇండోనేషియాలోని బహు చక్కని దీవి బాలి. బాలిలో అత్యధికభాగం హిందువులే ఉన్నారు. దీన్ని దేవతల నివాసంగా పిలుస్తారు. అంత ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. 2.5 మిలియన్ల జనాభా లో 90 శాతం హిందువులే ఉన్నారు. తమను ప్రశాంతంగా ఉండేట్టు చేయమని, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరుతూ ప్రతీ ఇంటాపూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆ మంత్రోచ్ఛారణ అంతటా వినవస్తూంటుంది. ప్రతీ దేవాలయంలోనూ సాయింత్రాలు పూజలు, మంత్రాల పఠనంతో ఆ ధ్యాత్మిక వాతావరణం కట్టేస్తుంటుంది.
భజనల్లో అక్కడక్కడ సంస్కృత పదా లు వినపడుతూంటాయి. బాలి ప్రజల్లో మతం, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పలు దేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తూ పోతున్నప్పటికీ ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలకు మాత్రం ఎలాంటి ఆపదా కలగలేదు. ఇక్కడి ప్రధాన మతం ఆగమ హిందూ ధర్మం. 11వ శతాబ్దంలో సుమత్రా, జావాల్లో హిందూ ప్రచారం బాగా జరగడంతో బాలిలో ఆగమ హిందూ ధర్మం ఏర్పడింది. భారత దేశం నుంచీ వచ్చిన మతమే అయినప్పటికీ బాలిలో హిందు, బౌద్ధ, జావా మతాలు ఆచారంలో ఉన్నా యి. 15వ శతాబ్దంలో జావాకు ఇస్లాం రావడంతో అక్కడి కళాకారులు, సంగీతకారులు అనేకమంది బాలికి పారిపోయారంటారు.
పురాణాలంటే మహా ఇష్టం...
బాలి ప్రజలు ఎంతో సృజన సంపన్నులు. సంప్రదాయసిద్ధమైన శక్తి సామర్ధ్యా లు ఎక్కువగా మతపరమైన కార్యకలాపాలకే వినియోగిస్తారు. రామాయణం, భారతం పట్ల అపార భక్తి శ్రద్ధలున్నాయి. వాటిలోని కథలతో ఇక్కడి ప్రజలు స్పూర్తి పొందుతున్నారు. ప్రతీ పండుగ సందర్భం ఎంతో ఆనందంగా, కళాత్మకంగాచేసుకోవడం వారి ప్రత్యేకత. ప్రతీ పని, ప్రతీ అంశంలోనూ సౌందర్యం తొణికిసలాడుతుంది. వారిది కళా దృష్టి కావడమే అందుకు కారణం.
అందాల కుగ్రామం... కూటా...
బాలిలోని దిన్‌పాసార్, సింగరాజా పట్టణాలు ఎంతో బావుంటాయి. టూరిస్టులును అమితంగా ఆకట్టుకుంటున్న కూటా బాలి విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది. ఇదో కుగ్రామం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇక్కడి బీచ్‌లు, ఎంతో ఆకట్టుకునే సూర్యోదయ, సూర్యాస్తమయాలు టూరిస్టులను కట్టిపడేస్తాయి. 1970ల నుంచీ పర్యాటకుల రాక ఎక్కువయింది. ఇపుడు ఇది రిజార్ట్ టౌన్‌గా మారింది. వందల హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, అనేక రకాల దుకాణాలు ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ తన ‘సాగరిక’ అనే కవిత 80ఏళ్ల క్రితం ఇక్కడ పర్యటనికి వచ్చినపుడు రాశారు.
‘‘విదేశీయునిగా నేను మొదటగా ఇక్కడికి వచ్చినపుడు ఆరాతి తీరంలో నువ్వు కూర్చుని వున్నావు. నన్ను ఆహ్వానించావు. మనం ఇద్దరం పువ్వుల్ని సేకరించాం. నేను మరోసారి వచ్చినపుడు నువ్వు వాణిజ్య రాకుమారుడివి. మళ్లీ నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించావు. దేవతలను కలిసి ప్రార్ధించాం. నా ఆస్తులు తరగిపోయాయి. ఇవాళ నా వీణతో వచ్చాను. నీలో నన్ను దర్శిస్తున్నాను. నన్ను గుర్తించావా?’’ అని ప్రశ్నించారు టాగోర్ తన కవితలో. ఇవాళ బాలివాసులు సమాధానంతో సిద్దంగా వున్నారు. భారతీయులను ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తూన్నారు. ఇండోనేషియా సందర్శించే పర్యాటకులలో సగంపైగా పర్యాటకులు బాలిలో ఒక్కరోజైనా గడపడానికి వెళతారు. ఇక్కడి ఉబుద్ అనే గ్రామం సంప్రదాయ హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి.
ఎప్పుడైనా రావచ్చు...
ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా సరే ఇండోనేషియా పర్యటనకు వెళ్లవచ్చు. రాజధాని జకార్తా నగరం షాపింగ్‌కు అనుకూలం. మకదువా, బోటనీ స్క్వేర్‌లలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, దుస్తులు చాలా చౌకగా లభిస్తాయి. ఈ దేశానికి వీసా పొందటం కూడా చాలా సులభం. వీసా ఆన్ ఎరైవల్ పద్ధతిలో జకార్తాకు చేరుకున్నాక విమానాశ్రయంలోనే వీసాను పొందవచ్చు.
ఎలా వెళ్లాలంటే...
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మూడు గంటలపాటు ప్రయాణిస్తే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకుంటాం. అక్కడి నుంచి ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాకు మరో మూడు గంటలపాటు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి జకార్తాకి నేరుగా విమాన సౌకర్యం లేదు కాబట్టి, బ్యాంకాక్ లేదా మలేషియాల మీదుగా వెళ్ళాల్సిందే...!!
No comments:
Post a Comment