చలికాలం వచ్చేసింది. వేకువలో మంచులో తడిసిన నీటిబిందువులను రాల్చే వృక్షాలు... గుత్తులు గుత్తులు గా పూచే పూలు.. చల్లగా మనసును తాకే పిల్ల తెమ్మెరలు... సూర్యోదయం వేళ రెక్క లు టపటప కొట్టుకుంటూ ఆకాశానికి ఎగిరే పక్షుల గుంపులు... కికిలా రావాలు... ఇలా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు... ఎన్నెన్నో అద్భుతాలు... ఎలాంటి వారినైనా పరవశింపజేసే గుణం ఒక్క ప్రకృతికే ఉంది. మనదేశంలో సంభ్రమాశ్చర్యాలను కలిగించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆధ్యాత్మి కానుభూతినిచ్చే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, చిరస్మరణీయమైన అను భవాలను అందించే దర్శనీయ స్థలాలూ ఉన్నాయి.
మన రోజువారీ జీవితంలో జఢత్వాన్ని వదిలించుకుని నూతన ఉత్సాహాన్ని నింపుకోవడానికి విహార యాత్ర లు తప్పనిసరి. విహార యాత్రానంతరం కలిగే మానసిక ఆహ్లాదం తప్పనిసరిగా మనలో మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. విహార యాత్రలు ఎవరికైనా... ఏ వయసువారికైనా ఎంతో ఉత్సాహాన్నిస్తాయి.
మనదేశంలో ఉన్న ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలపై విశిష్ట కథనం...
మన నిత్యజీవితానికి భిన్నంగా, కొద్ది మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. అయితే ‘వెళ్లాలి’ అని అనుకోగానే... ఎక్కడికి? ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇంటిల్లిపాదితో కలిసి విహరించడమంటే ఎవరికి ఆసక్తి ఉండదు. పిల్లలతో కలిసి యాత్ర చేస్తే... ఆ ఆనందమే వేరు. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి.
చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు మనదేశంలో కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియాలు, కొండలు, అడవులు, జలపాతాలు, బీచ్‌లు, నదులు ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మన ల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఉత్తర భారతానికి వెళ్తే ఆధ్యాత్మికతను కలిగించే అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని యాత్ర పారంభించి మధుర, ఆగ్రా, జైపూర్, అజ్మీర్, హరిద్వార్, హృషీకేష్, పంజాబ్, మానస సరోవర్ లాంటి మరుపురాని విహార ప్రదేశాలెన్నింటినో సందర్శించవచ్చు.
స్వర్ణానుభూతి...
పంజాబ్ అనగానే మనకు వెంటనే అమృతసర్ లోని స్వర్ణదేవాలయం గుర్తుకొస్తుంది. పంజాబీల విశిష్ట దేవాలయ సందర్శనా నంతరం జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన మైదానాన్ని కూడా చూడవచ్చు. ఆనాడు జనరల్ డయర్ సాగించిన మారణ కాండకు ఎందరో వీరులు మరణించారు. వారి త్యాగానికి గుర్తుగా అక్కడ ఒక అమరవీరుల స్థూపాన్ని నిర్మించింది కేంద్రప్ర భుత్వం. ఆ ప్రాంతంలో ఒక మ్యూజియం కూడా వుంది. ఆనాటి విశేషాలను ఆ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజి యంలో ఒక విశిష్టత ఉంది. అప్పట్లో జలియన్ వాలాబాగ్ దురంతాన్ని చూసిన ఓ చిత్రకారుడు గీసిన చిత్రం మన ముందు ఆ దుస్సంఘటనను కళ్ళకుకడుతుంది.
అలాగే జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనకు బాధ్యుడైన డయర్‌ను హత్య చేసి లండన్ ప్రభు త్వానికి లొంగిపోయి... ఉరితాడుకు బలైన వీరుడు ఉధమ్ సింగ్ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దేశంలో మర్కెడ కూడా ఉధమ్‌సింగ్ చిత్రం లేకపోవడం గమనార్హం. అలాగే అమృత్‌సర్ నుండి 25 కిమీ దూరంలోఉన్న ‘వాఘా’ సరిహద్దు దర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం. అక్కడ రోజూ సాయంత్రం 6 గంటల నుండి 6.30 నిమిషాల వరకు ‘జెండా’ పండుగ జరుగుతుంది. ‘వాఘా’ అంటే భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దు ప్రాంతం. భారత్ నుండి పాక్‌కు వేళ్లే బస్సు ఈ సరిహద్దు నుండే వెళ్తుంది. ఈ జండా పండుగను చూస్తున్న భారతీయుడు ఉప్పొంగిపోయి ‘మేరా భారత్ మహాన్’ అంటూ నినదిస్తాడు. అక్కడ భారత సరిహద్దు దళాలు... తమ విన్యాసాలతో జెండాలను అవనతం చేస్తారు. ఆవలివైపు పాకిస్తాన్ దేశ ప్రజలు కూడా తమ జెండా పండుగను తిలకిస్తూ చప్పట్లతో హోరెత్తిస్తారు. ఆ సాయం సంధ్యవేళ చూట్టూ చెట్లపై ఉన్న పక్షులు గూటికి చేరుతూ ఉంటాయి. ఇక్కడ ఇరుదేశాల ప్రజల చప్పట్లు, అరుపులతో పక్షలు ఒక్కసారిగా రెక్కలు టపటపమనిపిస్తూ... అరుపులతో చెట్ల నుండి గుంపుగా లేస్తాయి. ఆ సమయంలో వాటిని చూస్తుంటే... పక్షులు కూడా మనకు మద్దతుగా అరుస్తున్నాయనిపిస్తుంది. ఈ జెండా పండుగ ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన పండుగ.
శృంగార జగత్తు ఖజురహో...
భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్‌లో ఉంది. శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు... ఎన్నో ప్రకృతి బీభత్సాలకు గురయ్యాయి. ఎందరో దురాశాపరుల దాడులతో పాడైపోగా మిగిలిన ఆలయాల్లో జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వెయ్యేళ్ల కిత్రం చందేలా రాజవంశీయుల పరిపాలనలో రాజధానిగా వెలుగొందిన ఖజురహో గ్రామం... ఆ రాజుల పరిపాలన అంతమవడంతో అక్కడి అద్భుత శిల్ప సంపద కూడా మరుగున పడిపోయింది. కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడివిలా మారిపోయింది. 1839 లో మళ్లీ ‘ఖజురహో’ వెలుగు చూసింది. ఆనాడు చందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆయలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా ఉంటాయి. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.
ఖజురహో సందర్శించాలంటే మద్రాసు - ఢిల్లీ రైలు మార్గంలోని ఝాన్సీ స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుండి దాదాపు 180 కిమీ ఏదైనా వాహనం తీసుకొని గాని, రాష్ట్ర టూరిజం బస్సు ద్వారాగాని ఖజురహో చేరవచ్చు. ఖజురహో సందర్శనానంతరం... రసోద్దీపనతో కవ్వించే పద్మినీ జాతి స్ర్తీల సుందర శిల్పాల సౌందర్యాన్ని గుర్తుచేసుకుంటూ... ఆ తరువాత వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి కోట కూడా చూసుకుని ఆమె శౌర్య పరాక్రమాలను నెమరువేసుకుంటూ తిరుగు ప్రయాణమవుతాం.
ప్రభాకర దర్శనం...
ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం కూడా అద్భుత శిల్పాలతో యాత్రికులను అలరిస్తుంది. సుందర పూరీ సాగరతీరానికి 35 కిమీల దూరంలోనూ, భువనేశ్వర్‌కు 65 కిమీల దూరంలో ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకృతిలో రూపొందించిన ఈ రథాలయానికి 20 చక్రాలు, ఏడు గుర్రాలు ఉంటాయి. ప్రతి చక్రంలోనూ సూర్యుని గమనం సమయాన్ని తెలియజేస్తుంది. గైడ్లు... గంటలూ, నిమిషాలతో సహా లెక్కించి సమయం ఎంతైందో చెబుతారు. ఈ దేవాలయ కట్టడంలోని అద్భుతం ఇదే. దేవాలయ గోడలపై ఉన్న శిల్ప సౌందర్యం చూపు మరల్చనీయదు.కోణార్క్‌కు వెళ్లాలంటే మద్రాసు - ఢిల్లీ స్టేషన్ల మధ్య భువనేశ్వర్‌లో దిగాలి. అక్కడి నుండి బస్సులేక ఏదైనా వాహనంను తీసుకొని వెళ్లాలి.
తెలుగునాట విహారం...
మన రాష్ట్రంలోనూ సుప్రసిద్ధ విహార ప్రదేశాలున్నాయి. చెప్పాలంటే మన తెలుగు నేలలోనూ లెక్కకుమించిన ప్రకృతి అందాలున్నాయి. ఉదాహరణకు గోదావరిపై పడవ ప్రయాణం. గోదావరి నది మీద పాపికొండల నుండి భద్రాచలం వరకు లాంచీలో వెళ్లడం గొప్ప అనుభూతినిస్తుంది. ఈ పర్యటన పిల్లుకూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. పాపికొండల మధ్య నుండి గోదా వరి నీటిని చీల్చుకుంటూ... పయనిస్తున్న లాంచీలోనుంచి చుట్టూ పచ్చగా పరుచుకున్న ప్రకృతి అందాల ను చూడడంలో కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. మధ్యమధ్యలో గిరిజన గ్రామాలో ఆగుతూ... గిరిజనుల వేషభాషలు, ఆహార్యం గమనిస్తుంటే మన గ్రామీణ భారతం కళ్ళముందు కదలాడుతుంది.సంపూర్ణ విహారానుభూతి పొందాలంటే..?
విహారయాత్రను ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ప్రారం భిస్తే... అనవసర హడావిడికి తావుండదు. అంతేకాక పర్యటన మరింత మధురానుభూతుల్ని మిగుల్చుతుంది. దానికోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి... విహార ప్రదేశం, అక్కడి చేరుకోవడానికి సులభమార్గం, విడిది లాంటి వాటిని ముందుగానే నిర్ణయించుకుంటే మీ విహారం సంపూర్ణానందాన్ని ఇస్తుంది.మనదేశంలో సామాన్యంగా దూరప్రాంతాల ప్రయాణాలకు రైలు ప్రయాణం ఎంతో అనుకూలమైనది. ప్రయాణం సురక్షితమే కాకుండా రోడ్డు మార్గంకంటే వేగంగా, సుఖంగా అనుకున్న చోటి కి చేరుకుంటాం. రైలు ప్రయాణం ఎంతో చౌక. ఈ యాత్రాస్థలం ఎంపిక, టూరిస్ట్ గైడ్‌లు, రోడ్, రైలు మ్యాప్‌లు, రైల్వే టైం టేబుల్, టూరిజం శావారి వివరాలు మీకు సహాయపడుతాయి. ఇంతకు ముందే ఆ ప్రదేశాలను చూసి వచ్చిన స్నేహితుల, బంధువుల సలహాలు తీసుకుంటే ఇంకా మంచిది. లిస్ట్‌లో చాలాప్రాంతాలు ఉన్నట్లయితే... ఆ ప్రాంతాలను ఒక క్రమపద్ధతిలో అమర్చుకుంటే... మళ్లీ మళ్లీ తిరగాల్సిన పని ఉండదు.
ఉదాహరణకి మీరు హైదరాబాద్‌లో ఉన్నారనుకోండి. అక్కడి నుండి కన్యాకుమారి వరకు యాత్రను ఏర్పాటు చేసుకొని కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రదేశాలన్ని చూసి చివరగా తిరుపతిని దర్శించుకొని ఇంటికి చేరుకోవచ్చు. తమిళనాడులోని కన్యాకుమారి, రామేశ్వరం, ఊటీ, కొడైకొనాల్, మధురె,ై తిరుచ్చి, కుంభకోణం, తంజావూరు, చిదంబర మేకాక ప్రక్కనే వున్న పాండిచ్చేరిని కూడా దర్శించుకోవచ్చు. కేరళలోని కొచ్చిన్, త్రివేండ్రం మొదలైన ప్రాంతాలను చూడవచ్చు. అటు తరువాత మద్రాసు నగరం ఆ నగరం చుట్టుప్రక్కలగల కంచి, మహాబలిపురం దర్శించుకోవాలి. ఆతరువాత మద్రాసు నుండి కర్ణాటక వెళ్లి బెంగ ళూరు మైసూరు చూడవచ్చు. మైసూరులోని బృందావన్ గార్డెన్స్ చూడవచ్చు. చివరగా బెంగళూరు నుండి తిరుపతిని దర్శించుకొని హైదరాబాద్‌ను చేరుకోవచ్చు. ఈ విధంగా మీ దక్షిణాది విహారయాత్ర సఫలం అవుతుంది. ఇదేవిధంగా ఉత్తరానికి వెళ్తే... షిర్దీ, అజంతా, ఎల్లోరాలు, ఆగ్రా జైపూర్, ఢిల్లీ, హరిద్వార్, హృషికేష్‌లాంటి చారిత్రాక ఆధ్యాత్మిక ప్రదేశాలాన్నింటినో సందర్శించవచ్చు.
ఇవీ... పాటించండి...
మనీ: మీరు దర్శించాలనుకున్న ప్రదేశాన్ని ఎన్నుకున్న తరువాత ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకోవాలి. రైలు టికెట్, హోటల్ లాడ్జ్‌ల ఖర్చులు, లోకల్ సైట్ సీయింగ్ ఖర్చులు, ప్రవేశ రుసుములు, ఆహారం, ఫోటోలు, షాపింగ్‌కు మొదలైన వాటికి సరిపడా పైకాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇతర ఖర్చులకు అదనంగా మరికొంత డబ్బు దగ్గరుంచుకుంటే మంచిది. కొత్త ప్రదేశాల్లో ఇబ్బంది పడకుండా వుండవచ్చు.రిజర్వేషన్లు: ఈ కంప్యూటర్ యుగంలో క్యూలైన్లో నిలబడి టికెట్ రిజర్వేషన్ చేసుకునే రోజులు పోయా యి. ఇప్పుడు రైలు, బస్సు ప్రయాణాలకోసం అడ్వా న్స్ బుకింగ్ అందుబాటులో ఉంది. విహారయాత్రకు కొన్ని రోజులు ముందుగానే ఆన్‌లైన్ బుకింగ్ చేసు కుంటే మంచిది. వెళ్ళే సమయానికి తీసుకుందాంలే అనుకుంటే టికెట్లు దొరక్క ఇబ్బందిపడాల్సివస్తుంది.
వసతి సౌకర్యాలు: కొత్తగా యాత్రికులు దిగగానే అనేక మంది దళారులు చుట్టుముడుతారు. వివిధ లాడ్జిల రేట్లను మనముందు ఏకరువు పెడతారు. మనమే హోటల్‌లోకి వెళ్లి అక్కడ రూమ్స్ బాగున్నాయో లేదో చూసి రూమ్ బుక్ చేసుకోవాలి. లేకపోతే దళారుల చేతుల్లో మోసపోతాం. అంతేకాక హోటల్స్‌లో కూడా దొంగతనాలు, మోసాలు అనేకం జరుగుతుంటాయి. అందుకని కొద్దిగా డబ్బు ఎక్కువైనా మంచి హోటళ్లను ఎన్నుకోవడం మంచిది. ప్రభుత్వ టూరిజం కాటేలు అందుబాటులో ఉంటే... వాటిలో ఉండడం శ్రేయస్కరం.
ఆహారం, నీరు: విహారయాత్రలో ఆహారం, నీరు శుభ్రత విషయంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం పాలై, విహారయాత్రకు ఆటంకాలేర్పడతాయి. వీలైతే... మినరల్ వాటర్‌నే వాడడం మంచిది. ఎక్కడపడితే అక్కడ నీరు తాగడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. మెనూ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదిపడితే అది తినకూడదు. మధ్యమధ్యలో పళ్ళరసాలు వాడితే ఆరోగ్యానికి మంచిది.
మందులు: మనతోపాటు చిన్న పిల్లలు ఉన్నట్లయితే... చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తనీరు, కొత్త వాతావరణం పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తాయి. అక్కడ డాక్టర్ మనకు అందుబాటులో వుండరు. అందుకని మీరే జ్వరం, దగ్గు జలుబు, తలనొప్పి, విరోచనాలు మొదలైన వాటికి అవసరమైన మందులు దగ్గరుంచుకేంటే మంచిది.
ఫోటోగ్రఫీ: విహారయ్రాతల్లో మీ అనుభూతుల్ని భద్రపరుచుకోవాలంటే మీ వెంట కెమెరా తప్పకుండా ఉండాల్సిందే... వీలుంటే వీడియో కెమరాను కూడా తీసుకెళ్ళడం ఇంకా మంచిది.
అంతేకాకుండా, కొత్త ప్రదేశాల్లో భాషా సమస్య ఎదురౌతుంది. అందుకని ఇంగ్లీషు, హిందీ కొద్దిగానైనా తెలిసివుంటే మరీ మంచిది. స్ర్తీలు విహారయాత్రలకు వెళ్లే సమయంలో నగలు ఎక్కువగా వెంట తీసుకెళ్లేకుండా ఉంటేనే మంచిది. కొత్త ప్రదేశాల్లో, లాడ్జిల్లో అనవసర ఇబ్బందులు కలుగకుండా వుంటుంది. కొత్త ప్రదేశాల్లో రాత్రుళ్ళు బయట తిరగడం అంత మంచిది కాదు. మీరు వుంటున్న లాడ్జి పేరు, వీధి తదితర అడ్రసు ఉన్న కాగితాలు మీ పిల్లలతో పాటు అందరి దగ్గర ఉంచుకోవాలి. వీలైతే స్వస్థలంలో ఉన్న మనవారికి మన విడిది చిరునామా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం మంచిది.
సదరన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ల టూరు పాకేజీలు ఎంచుకంటే మంచిది. ఎందుకంటే సదరన్ వాళ్ళకు దేశంలోని అన్ని ముఖ్య విహారప్రదేశాల్లో హోటల్స్ ఉన్నాయి. ఏంచక్కా తెలుగు భోజనం తింటూ తిరగొచ్చు. పైగా భాష సమస్య కూడా ఉండదు.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ విహారయాత్ర మీ జీవితాంతం గుర్తుండిపోతుంది.
- దామర్ల విజయలక్ష్మి
No comments:
Post a Comment