విహారాలు

India

Gamyam

Sunday, October 24, 2010

శాంతిని ప్రసాదించే 'శ్రీ నెల్లియప్పార్'

లయకారుడైన మహాశివునికి మన దేశంలోనే కాక పొరుగు దేశాలలో కూడా జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, పంచారామాలు, పంచ నాట్యసభల పేరిట ఎన్నో ఆలయాలున్నాయి. మనకు తెలిసిన కైలాసగిరి, వారణాసి, కేదార్‌నాథ్, పశుపతినాథ్, మథురై, రామేశ్వరం, అరుణాచలం, కంచి, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి కొన్ని క్షేత్రాలు విశేష ప్రాముఖ్యం, ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. అన్నింటిలోనూ మహాదేవుడే స్వయంగా కొలువుతీరి, కొలిచిన వారిని కాపాడతాడన్న నమ్మకం శతాబ్దాలుగా భక్తులలో ఉంది. ఈ జాబితాలోనిదే తిరునల్వేలిలోని "శ్రీ నెల్లియప్పార్'' ఆలయం.

నేను, నా మిత్రులు ప్రసాదు, సుందర్‌లు గత ఆగస్టులో శబరి యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మాకు ఇష్టమైన 'కుర్తాళం' సందర్శించుకుని, అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలోని 'తిరునల్వేలి' చేరుకున్నాము.
తమిళనాడులోని తిరునల్వేలి చేరుకోవడానికి చెన్నయ్, కన్యాకుమారి, మధురైలనుండి నేరుగా రైలు, బస్సు సౌకర్యం ఉంది. వాయు మార్గంలో అయితే 'టూటికోరన్' గాని, మధురై గాని చేరుకుని, అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. బస్టాండ్ సమీపంలోనే అందుబాటు ధరలలో లాడ్జీలు, రుచికరమైన భోజన ఫలహారాల వసతులు లభిస్తాయి.
తిరునల్వేలిలోని ప్రధాన ఆలయం 'శ్రీకాంతిమతి అమ్మన్, శ్రీ నెల్లియప్పార్ దేవాలయం' బస్టాండు నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

భూలోక సంచార సమయంలో ప్రకృతి రమణీయతకు ఆకర్షితుడైన శివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని, త్రేతాయుగంలో శ్రీరాముడు, అగస్త్య మహామునిని ఈ ప్రాంతంలోనే కొలిచారని పురాణ కథనం.
పాండ్యరాజులు ఏడో శతాబ్దంలో ఆరంభించిన ఈ ఆలయ నిర్మాణం దశలవారీగా పదిహేడో శతాబ్దానికి పూర్తయి ప్రస్తుత రూపం సంతరించుకున్నదట. ఏడో శతాబ్దానికి చెందిన గాయక శివభక్తులైౖన 'నయమ్మార్'లలో ఒకరైన శ్రీతిరుజ్ఞాన సంబందార్ ఈ స్వామి మీద ఎన్నో 'తేవరాలు' (కీర్తనలు) గానం చేశారట.

ఆ పేరెలా వచ్చిందంటే...

క్షేత్రానికి తిరునల్వేలి అనే పేరు రావడానికి ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. మొదట్లో శ్రీరాముడు ఇక్కడి స్వామిని నిత్యం కొలిచేవారట. కాలక్రమంలో ఆలయం శిథిలమయ్యి చుట్టూ వెదురు పొదలు పెరగడం వలన వేణుపురము (వేణు=వెదురు) అని పిలిచేవారని, పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు వింధ్య దాటి దక్షిణాపథానికి వచ్చిన అగస్త్య మహాముని, పొదల మధ్య ఉన్న లింగాన్ని వెలికి తీసి పూజించారని అంటారు.
తదనంతర కాలంలో శివభక్తుడైన వేదశర్మ అనే పేద బ్రాహ్మణుడు, ప్రతి నిత్యం బిక్షమెత్తి సేకరించిన ధాన్యాన్ని వండి శ్రీ నెల్లియప్పార్‌కు నివేదన చేసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడట.
ఒకరోజు అలాగే ధాన్యాన్ని సేకరించి అరబెడుతుండగా, అకస్మాత్తుగా 'తమిర పారాణి' నదికి వరద వచ్చిందట. భక్తుని ధాన్యం కొట్టుకుపోకుండా కైలాసపతి చుట్టూ కంచె ఏర్పాటు చేశారట! విషయం తెలిసిన రాజు వచ్చి చూసి, వేదశర్మ శివభక్తిని ప్రశంసించి జరిగిన సంఘటనకు గుర్తుగా ఆ ప్రాంతాన్ని 'తిరునెల్ వెలి' (తిరు-శ్రీ, నెల్-ధాన్యం, వెలి-కంచె)గా పిలవాలని అధికారికంగా ప్రకటించారట. ఆ పేరే క్రమేణా వాడుకలో 'తిరునల్వేలి'గా మారింది.

ఉన్నతినిచ్చే శ్రీకాంతిమతి అమ్మాళ్

స్వయంభూ శ్రీ నెల్లియప్పార్, శ్రీ కాంతిమతీ అమ్మాళ్ విడివిడిగా రెండు ఆలయాలలో కొలువై ఉంటారిక్కడ. రెండు ఆలయాలను కలిపే దారిని 'సంగలి మండపం' అంటారు. ముందుగా ప్రాంగణానికి దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని దర్శించుకుని తర్వాత స్వామిని సేవించుకుంటే భక్తుల కోర్కెలు నెరవేరతాయని స్థానికుల నమ్మకం. ఈ కారణంగానేమో రెండు ఆలయాలకు వేర్వేరు రాజద్వారాలుంటాయి. శ్రీ కాంతిమతీ అమ్మాళ్ భక్తుల జీవితాల్లో ఉన్నత స్థాయినీ, శ్రీ నెల్లియప్పార్ ప్రశాంతతనూ ప్రసాదిస్తారని చెబుతారు.

ఆలయ విశేషాలు

సుమారు పద్నాలుగు ఎకరాల వైశాల్యం విస్తరించిన ఈ ప్రాంగణంలో ఐదు గోపురాలు, బం గారు కోనేరు, ఎన్నో ఉప ఆలయాలు ఉంటాయి. ప్రతి నిత్యం భక్తులు చేసే శివనామస్మరణ మరింత సందడిని సంతరించుకుంటుంది. ఈ ఆలయ ప్రధాన విశేషం 'శిల్పకళ'. ప్రతి రాతి మీద అపురూప చెక్కబడిన శిల్పాలు మనకు కన్నుల పండుగ చేస్తాయి. మహామండపం, అర్థమండపం, తొంభై ఆరు స్తంభాల ఊంజల్ మండపం, సంగిలి మండపం ... వీటన్నిటిపైనా అద్భుత శిల్ప సంపదని మనం చూడొచ్చు. పెద్ద నందీశ్వరుడు రాతి పీఠం మీద గంభీరంగా కూర్చుని మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటాడు. నందీశ్వరునికి ఎదురుగా ఏక రాతి మీద చెక్కిన అర్జున, కర్ణల విగ్రహా సౌందర్యం అద్వితీయం. వీటికి అలంకరణగా రాతితో చెక్కిన నగల సోయగం చూడాల్సిందే! సంగిలి మండపం ఆరంభంలో ఉన్న శ్రీ దక్షిణామూర్తి ఆలయానికి అలంకరణార్థం రాతి మీద చెక్కిన పూలు, లతలు అమోఘం!

ఆనవాయితీ ప్రకారం ముందుగా అమ్మవారిని దర్శించుకుని, అక్కడే ఉన్న వెయ్యి స్తంభాల మండపంలోని శిల్పాలను చూసి ఆనందించాం. ఈ సుందర మండపంలోనే అప్పాశి నెల (అక్టోబరు-నవంబరు)లో స్వామి వారి తిరుకళ్యాణం జరుగుతుందట! మరో మనోహరమైన మండపంలో చిత్తిరై నెల (ఏప్రిల్-మే)లో వసంతోత్సవం జరుగుతుందట!

తామ్రసభ
తమిళనాడులో నటరాజ పంచ నాట్యసభలు ఉన్నాయి. తిరువలంగాడు (అరక్కోణం దగ్గర)లో రత్నసభ, చిదంబరంలో కనకసభ మధురైలో వెండిసభ, కుర్తాళంలో చిత్రసభ అయితే తిరునల్వేలీ ఉన్నది తామ్రసభ. కాకపోతే ఇక్కడ లోహంతోగాని రాతితోగాని చేసిన శిల్పాలు ఉండవు. మిగతా వాటికి భిన్నంగా చెక్కతో చక్కని బొమ్మలు చెక్కారు. శివపురాణ దృశ్యాల మొదలు శృంగార శిల్పాల వరకూ అన్ని రకాలు ఉన్నాయి. తామ్రసభలో నటరాజు, శివకామిని దర్శించుకుని వెనుక చందన పూతతో అలంకరించబడిన 'చందన సభాపతి'ని దగ్గరలోని 'పెరియ సభాపతి'ని దర్శించుకున్నాము.

తామ్రసభలో మార్గశిరమాసం(డిసెంబరు-జనవరి)లో నటరాజ "ఆరుద్ర దర్శనం'' జరుగుతుందట. 'ఆని' నెల (జూన్-జూలై)లో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేంత మంది భక్తులు ఈ ఆర్రుద దర్శనానికి కూడా వస్తారట! ప్రదక్షిణా క్రమంలో ప్రధాన ఆలయానికి పడమరన, మయూర వాహనం మీద దేవేరులు వల్లి, దేవసేనలతో కలిసి కొలువైన సుబ్రమణ్య స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని కన్నుల పండుగగా చూసి గర్భాలయం వైపు కదిలాం.

సంగీతాన్ని పలికే స్తంభాలు

గర్భాలయం సుమారు పది అడుగుల ఎత్తులో ఉంటుంది. పైకి సోపాన మార్గం ఉంది. మెట్లెక్కగానే వచ్చేది 'రత్న మండ పం'. ఇక్కడే ఉన్నాయి నాటి శిల్పుల అద్వితీయ ప్రతిభకు నిదర్శనమైన 'సంగీత స్తంభాలు'. ఏకరాతి మీద ఇరవై నాలుగు స్తంభాలను ఒక గుత్తిగా చెక్కారు. వీటి గురించి అడిగినప్పుడు గైడు మమ్మల్ని మూడో స్తంభంలోని ఒక దానికి చెవి ఆనించమని, తాను మొదటి స్తంభాలను ఒక దాని తర్వాత ఒకటి తట్టాడు. మధురమైన సప్తస్వరాల ధ్వని మాకు వినిపించింది. ఇంకో స్తంభంలో మృదంగ ధ్వని, మరో దాని నుండి మద్దెల వాయిద్యం వినిపించాడు.
కరకురాళ్ళను కర్ణపేయమైన సంగీతాన్ని పలికేలా చెక్కిన నాటి శిల్పుల గొప్పదనం ఎంతైనా ప్రశంసించదగినది. చిన్నపిల్లల్లా కాసేపు స్తంభాలను తట్టి సంగీతధ్వనులు వింటూ ఆనందించాం.
అనంతరం గర్భాలయంలోని శ్రీ నెల్లియప్పార్‌కు పూజలు జరిపించి తర్వాత విఘ్ననాయకుని, అనంతశయనుడైన 'నెల్లి గోవిందుని' దర్శించుకున్నాం.
 
ఆపద్బాంధవుని పేరు అనవతర ఖాన్

కొలిచేవారు ఎవరైనా శ్రీ నెల్లియప్పార్ కాపాడుతారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం- గైడు మాకు ఆలయ ఆగ్నేయ మూల చూపించిన 'అనవతర ఖాన్ లింగం'లో కనిపించింది. దీని తాలూకు పూర్వాపరాలు ఇలా తెలియజెప్పారు.
గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబుకు సంతానం లేదు. భార్య కూడా నిరంతరం కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదట. ఎన్నో రకాల వైద్యాలు చేయించినా ఫలితం లేకపోవడంతో ఆయన వేద పండితులను సంప్రదించగా, వారు నియమంగా 'శ్రీ నెల్లియప్పార్'ను సేవించమని తెలిపారట. ఆ ప్రకారం చేయడంతో అనతికాలంలోనే రాణి ఆరోగ్యం బాగుపడడంతో పాటు, ఆమె చక్కని మగశిశువుకు జన్మనిచ్చింది. సంతసించిన నవాబు దంపతులు కుమారునికి 'అనవతర ఖాన్' అని నామకరణం చేసి, కృతజ్ఞతా పూర్వకంగా లింగాన్ని ప్రతిష్ఠించారట. ఆ బాలుని పేరు మీద 'అనవతర ఖాన్ లింగం' అన్న పేరొచ్చిందట.

జీవంలేని రాళ్లను రమణీయ శిల్పాలుగా మలచిన శిల్పులకు, వారిని ఆ పనికి నియమించి చరిత్రలో శాశ్వత కీర్తి పొందిన రాజులకు, దేవదేవుడు శ్రీ నెల్లియప్పార్‌కు మరోసారి మనస్ఫూర్తిగా మొక్కి, ఎన్నో విషయాలు తెలిపిన గైడుకు కృతజ్ఞతలు తెలిపి మా తదుపరి మజిలీ అయిన 'తిరుచందూర్'కు బయలుదేరాము.

- ఇలపావులూరి వెంకటేశ్వర్లు
96666 37614

Saturday, October 23, 2010

గతమంతా ఘనమైన... జౌన్‌ ఫూర్‌ కళావైభవం

చారిత్రకంగా ఉత్తరభారతంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన పట్టణం జౌన్‌పూర్‌. భిన్నమత సంస్కృతికి ఆలవాలం. పురాణ ప్రఖ్యాతిగాంచిన ఈ నగరం ఆనాటి శిల్పకళావైభావానికి పెట్టనికోట. గోమతీ నదీ తీరాన నిర్మించిన జౌన్‌పూర్‌లో లెక్కకు మించిన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఖిల్జీ, మొఘల్‌ తదితర వంశస్తుల పాలనలో శోభాయ మానంగా విలసిల్లిన ఈ నగరం ఇప్పటికీ తన పర్యాటక వైభవాన్ని చాటుతోంది. సంగీత సాహిత్యాలకు నిలయంగా భాసిల్లిన జౌన్‌పూర్‌ ఎన్నో రాజవంశాలకు నివాసంగా ఉన్నది. తత్ఫలితంగా వారి కళానైపుణ్యాన్ని తనలో ఇముడ్చుకుంది. దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ సుందర నగర విశేషాలు......
Jaunpur-Quila
ఖిల్జీ వంశస్థులు క్రీశ 1290-1320 మధ్యకాలంలో ఉత్తరభారత దేశంలో తిరుగులేని పాలన సాగించారు. ముఖ్యంగా అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఉత్తర భారతమంతా దాదాపు జయించాడు. ఈ వంశ పాలన ఎంత త్వరగా విస్తరించిందో అంతే వేగంగా అంతరించింది. ఆ తరువాత మొఘలుల రాకతో వీరి పాలన అంతమయ్యింది. ఢిల్లీలో ఖిల్జీలపాలన నామావశిష్టమై, కుట్రలూ, కుతంత్రాలు, తిరుగుబాట్లు సర్వసాధారణమైపోయాయి. అనేక రాజ్యాలు స్థాపించుకున్నారు. ఇలాంటివాటిలో జౌన్‌పూర్‌ ఒకటి. షార్కి సుల్తానులు ఇక్కడ సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు పాలన సాగించారు. అవద్‌ గంగా పరీ వాహిక ప్రాంతంలో పశ్చిమాన అలీఘర్‌ నుంచి తూర్పున బీహార్‌ వరకు వైభవాన్ని చవిచూచింది. వీరి పాలనలో సంగీత సాహిత్యాలనేకాక శిల్పకళలూ ఆదరణకు నోచుకున్నాయి. ఎన్నెన్నో సుందర కట్టడాలను నిర్మించారు. మతమౌఢ్యంలేని, సౌభ్రాతృత్వం విలసిల్లిన సమాజాన్ని సుస్థిరం చేశారు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థానాలనూ, న్యాయవ్యవస్థనూ మినహాయిస్తే, వర్తక వాణిజ్యాలలోనూ రాజ్యపాలనలోనూ హిందువులదే ఆధిక్యత.

Atala-Masjid
ఆనాటి పరిస్థితులలో ఇది ఎంతో అపూర్వమైన విషయం. ముస్లిం సూఫీ మహా త్ములు, హిందూ సిద్ధ పురుషులు పరస్పరం. ఆనాటి మహాపురుషులు రామానంద, చైతన్య, కబీర్‌, నానక్‌దేవ్‌ వంటివారు తమ సరళమైన ప్రవచనాలతో భక్తి మార్గాన్ని సుగమంచేస్తే, మాలిక్‌ మహమ్మద్‌ జైసీ, రాస్‌ఖాన్‌వంటి ప్రముఖులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరినొకరనుసరించారని కాదు. మానవుని ఆధ్యాత్మిక పురోగతిని సుగమం చేయటమే వారందరి ధ్యేయం. ఈ భక్తిభావ సమ్మేళనంతో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసిందానాడు. తరువాత ఈ ప్రాంతం మొఘలుల అధీనంలోకి వెళ్ళినా, హుమా యున్‌ కాలంలో ఆనాటి బీహార్‌ గవర్నరుగానున్న షేర్షా ్రశ 1540 లో హుమాయూ న్‌ను జయించ టంతో అతడు కాందహార్‌ (ఈనాటి ఆఫ్ఘనిస్తాన్‌లో వుంది) కు తప్పించుకుని పోయాడు. ్రశ 1545లో షేర్షా మరణం తరువాత, హుమాయూన్‌ తిరిగి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడుగాని, అక్బర్‌ విజయ యాత్రలలోగాని, జౌన్‌పూర్‌ మొఘలుల వశం కాలేదు.

సుందర నిర్మాణాలు...
జౌన్‌పూర్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది జౌన్‌పూర్‌ కోట. షార్కి సుల్తానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోట నేడు శిథిలావస్థలో ఉంది. వీరు నిర్మించిన మసీదులలో అటలా, ఖాలిస్‌- మజ్లిస్‌, జాంజి, లాల్‌ దర్వాజా మసీదులు ముఖ్యమైనవి. వీటిలో అటలా ఒక్కటే నేడు మిగిలివుంది. తక్కినవన్నీ శిథిలమైపో యాయి. హిందీభవన్‌ పక్కనే వుందీ అటలా మసీదు. ఇక్కడో కథ వుంది. ఒకప్పుడిక్కడ అచలాదేవి మందిరముండేదిట. అది మసీదు వెలుపల చతుర్రసాకారంలో గదులు, రెండంతస్థులలో వున్నాయి. నాలుగు దిక్కులా ఏనుగులు ప్రవేశించేందుకు వీలుగా అతి పెద్ద దర్వాజాలున్నాయి. ఇది ఒకప్పుడు, అరబిక్‌, పర్షియన్‌ భాషల అధ్యయనానికి ఒక విశ్వవిద్యాలయంలా నడిచేది. దేశ దేశాలనుంచి విద్యార్థులు వచ్చేవారు. ఈ గదులన్నీ విద్యార్థుల వసతి కొరకు ఏర్పాటు చేసినవే. అతి సాధారణ జీవితం నుంచి వచ్చినా స్వశక్తితో హుమాయూన్‌ని జయించి చక్రవర్తి పదవినధిష్టించి, రోడ్లు నిర్మించటం, తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టటం లాంటి ప్రగతిశీల కార్యాలకు నాంది పలికిన మహావిజేత షేర్షాసూరి, విద్యనభ్య సించినది ఈ అటలా మసీదులోనే.

కనువిందుచేసే ఖిల్లా...
జౌన్‌పూర్‌ మధ్యలో పెద్ద ఖిల్లా వుంది. ఒక కిలోమీటరు విస్తీర్ణంలో అలనాటి వైభవానికి చిహ్నంగా ఉన్న ఈ కోటలోని వివిధ నివాస భవనాలన్నీ శిథిమైపోయాయి. ప్రాకార మంతా శిధిలమైపోయినా, ప్రవేశ ద్వారం మాత్రం గత ఏడు శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. లోపలకు ప్రవేశిస్తే మధ్యలో మసీదు. దీనికవతల స్నానశాల ఇంకా నిలచివున్నాయి. ఈ స్నానశాలలో ఎన్నో గదులు. అన్నిటిలోనూ నీటి తొట్టెలు. అన్నివైపులా సమాంతరంగా ప్రవేశద్వారా లతో వుండటం వల్ల వచ్చినదారి, వెళ్ళే దారి విష యంలో పర్యాటకులు ఇబ్బంది పడతారు. వచ్చా మో, ఎటు వెళ్లాలో తెలియక తికమకపడతాము.

గోమతీ వంతెన...
Gomati-River
ఇక్కడ గోమతీ తీరాన ఎన్నో పురాతన స్నానఘట్టా లున్నాయి. వీటికి పైన ఎన్నో గుళ్ళు గోపురాలు ఉ న్నాయి. స్థానికులు దీనిని పవిత్రతీర్థంగా భావిస్తా రు. దీని చరిత్ర మనకు ముస్లింల రాక నుంచి మా త్రమే తెలుసు. అంతకు ముందు ఇది ఇంకా ఎం తటి ఘన చరిత్ర కలిగివుందో మరి! ఇప్పుడు గోమ తీనది ఊరి మధ్యగా ప్రవహిస్తోంది. అంటే పట్టణం కాలక్రమేణ, నది ఆవలిగట్టుకు విస్తరించింది. ఈ నదిపైన ఒక పురాతనమైన వంతెన ఉన్నది. ఈ వం తెన మొఘలుల కాలంలో నిర్మిం చారు. ఇదొక విం త కట్టడం. నీరు పాయలుగా ప్రవహిస్తుంది. నీరు పారే చోట పెద్ద స్థంభాల మీద వంతెన నిర్మించారు. ఆ తరువాత వంతెన మళ్ళీ 5 స్థంబాల వరకు నిర్మిం చారు. వంతెన నిర్మాణ శైలి ఇప్పటి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలైన చిత్రమేమంటే ప్రతి స్థంభం వద్ద వంతెన మీద చిన్న చిన్న మంటపాలు నిర్మించారు. ఈ మంటపాల్లో వ్యాపారుల తమ వస్తువుల్ని పెట్టుకొని వ్యాపారం చేసేవారట.

మతమౌఢ్యం లేని సమాజం...
ఇక్కడ ఫిబ్రవరి నెలలో 12 రోజుల పాటు బారాబప్పార్‌ అనే వేడుక జరుగుతుంది. ఇవి మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలు. ఇది షియాలు ఒక రోజున, సున్నీలు ఒక రోజున జరుపుకుంటారు. దీనికి హిందూ ముస్లింలందరూ విరాళాలు ఇస్తారు. అలాగే ఇక్కడ శ్రీరామన వమికి జరిగే రామలీలా వేడుకలకు కూడా ఇరుమతాల వారూ విరాళాలందజేస్తారు. ఈ సామరస్యం షార్కీల కాలం నుంచి కొనసాగుతుండడం విశేషం. ఈ బారాబప్పార్‌ వేడుకలు ఎంతో వైభవంగా జరుగు తాయి. వీటికి ప్రధాన కేంద్రం అటలా మసీదు. ఈ వేడుకలు చూడటానికి ప్రతి సంవత్సరం చుట్టు పక్కల గ్రామాల నుంచి ఒక లక్షలాది జనం వస్తారు... ప్రధాన వీధులన్నిటిలోనూ పెద్ద పెద్ద ఆర్చీలు కట్టి, కాగితపు పూలతో అలంకరిస్తారు.. చిన్న చిన్న విద్యుద్దీ పాల తోరణాలతో వీధులన్నీ వేడుక శోభను సంతరించు కుంటాయి. అటలా మసీదు కళాత్మకమైన అలంకరణలో సొగసులు విర జిమ్ముతుంది. ప్రతి మొహల్లా నుంచి ఊరేగింపులు బయలుదేరతాయి. వీటిలో ఉత్సాహవంతులు, కత్తి యుద్ధాలు, కర్రసాముల చిత్ర విచిత్రరీతుల ప్రదర్శిస్తుంటారు. కత్తితో పోరాడే వారిని ఒట్టి చేతులతో మరొకరు ఎదుర్కొని ఆ కత్తిని వశపరచుకోవటం లాంటి సాహస విన్యాసాలు ప్రదర్శించడం విశేషం. ఊరే గింపులు అన్నీ ఊరంతా తిరిగి రాత్రి 2 గంటల ప్రాంతంలో అటలా మసీదు చేరుకుంటాయి. ఇక మిగిలిన రాత్రంతా భక్తిగీతాలూ, ప్రవచనాలూ ఉత్సాహభరితంగా సాగుతాయి. జనం కోలాహలం, సంబరం చెప్ప నలవి కాదు.
*  ఒకనాటి రాజధాని జౌన్‌పూర్‌ నేడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ జిల్లా కేంద్రం.

ప్రకృతి సౌందర్యం.. సాహసకృత్యం మొదలియార్‌ కుప్పం

Mudiliar-Kuppam
చెన్నై, పాండిచ్చేరి ఈస్ట్‌ కోస్టు రోడ్‌, కాంచీపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మొదలియార్‌కుప్పం రెయిన్డ్రాప్‌ బోట్‌ హౌస్‌ స్వదేశీ పర్యాటకులనే కాకుండా విదేశీ ప ర్యాటకులను కూడా విశేషంగా అలరిస్తోంది. విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో... సంద ర్శకులను మరింత ఆకర్షించేందుకు తమిళనాడు పర్యా టక శాఖ, ఒక ప్రైవేట్‌ సంస్థతో కలిసి సంయుక్తంగా సాహస జల క్రీడ లకు శ్రీకారం చుట్టింది. నీటి రివ్వున దూసుకెళ్ళే పడవల్లో సందర్శ కులు వింత అనుభూతికి లోనవుతారు. అలాంటి అరుదైన అనుభూ తిని పంచుతున్న ప్రాంతమే మొదలియార్‌కుప్పం. చిన్న బోటుకు కట్టిన తాడు సహాయంతో సుమారు రెండు వందల అడుగుల ఎత్తుకు రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లే వాటర్‌ పారా సైలింగ్‌ జలక్రీడను ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్చు.

ఈ రెయిన్‌డ్రాప్‌ బోట్‌హౌస్‌లో సందర్శకులను ఆకట్టుకునే పలురకాల సదుపాయాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా పలు సదుపాయాలను కల్పించే పనిలో పర్యాటక శాఖ నిమగ్నమై ఉంది. ముందుగా పది పడవలతో ప్రారంభమైన ఈ బోట్‌హోస్‌లో ప్రస్తుతం గయాక్‌ పడవలు, రెండు వాటర్‌ స్కూటర్లు, అరటిపండు ఆకారంలోగల బోట్‌లు, గంటకు వంద కిలోమీటర్ల దూరం వేగంతో దూసుకెళ్లే బోట్లను సిద్ధం చేస్తారు. అంతేగాకుండా ఈ బోట్‌హోస్‌లో వాటర్‌ పారాసైలింగ్‌, వాటర్‌ స్కీ లాంటి సదుపాయాలను కూడా పర్యాట శాఖ అందుబాటులోకి తెచ్చింది. చిన్న బోటుకు కట్టిన ఓ తాడు సాయంతో సుమారు 2 వందల అడుగుల ఎత్తుకు ఆకాశం లోకి దూసుకెళ్లటం పారాసైలింగ్‌ ప్రత్యేకత కాగా... నీళ్లపై బోటు కదిలే వేగానికి అనుగుణంగా సందర్శకులు ఆకాశంలో తేలుతూ ముందుకు దూసుకెళ్తుంటారు.

Mudiliar-Kuppam2 అయితే ఈ పారాసైలింగ్‌ క్రీడకు పర్యాటకులు శిక్షకుడితో కలిసే ప్రయాణించాల్సి ఉంటుంది. కొత్త వారైతే ఒక్కరు, పారాసైలింగ్‌లో ఇదివరకే అనుభవం ఉన్నవారయితే ఇద్దరు ఒకేసారి ప్రయాణించవచ్చు. వాటర్‌ స్కీ కూడా బోటు సాయంతో ప్రయాణించేదే అయినప్పటికీ... సందర్శకుడు ఆకాశంలో కాకుండా, నీటి ఉపరితలంపై ప్రయాణిస్తుంటాడు.

ఇది కూడా బోటు వెళ్లే వేగానికి అనుగుణంగా ఉంటుంది. ఇది నీటి ఉపరితలాన్ని చీల్చుకుని ముందుకు దూసుకెళ్తూ పర్యాటకులకు వింత అనుభూతులను పంచుతుంది. ఇదిలా ఉంటే... ఈ బోట్‌హౌస్‌లో జూలై నెల మొదటి వారంలో ప్రవేశ పారాసైలింగ్‌, వాటర్‌ స్కీ తదితర జలక్రీడలకు పర్యాటకుల నుంచి విశేష స్పందన కనిపించిందని పర్యాటకశాఖ ప్రకటించింది.

ఇదిలా ఉంటే... మొదలియార్‌ కుప్పం బోట్‌హోస్‌లో త్వరలోనే మరిన్ని వసతులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పర్యాటకశాఖ వెల్లడించింది. సందర్శకుల్లో సాహసకృత్యాల పిపాసను తీర్చేవిధంగా బంపింగ్‌ అండ్‌ జంపిగ్‌, వేడిగాలి సాయంతో గాలిలో ప్రయాణించే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, వాటర్‌ కైట్‌ ఫ్లయింగ్‌, నీటిలో మునిగి సముద్రం అంతర్భాగంలోని దృశ్యాలను తనివితీరా చూసేందుకు వీలుగా ఉండే స్కూబా డైవింగ్‌’ తదితర జలక్రీడలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు ఆ శాఖ ప్రకటించడం విశేషం.

Tuesday, October 5, 2010

ఎల్లలులేని సౌందర్యం... ఎల్లోరా

దేశంలోకెల్లా ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలు మహారాష్ర్టలో ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి మన్మాడు వెళ్ళే రైలు మార్గంలో ఉన్న ఔరంగాబాద్‌ స్టేషన్‌కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు. అజంతా గుహలు కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి.అందుకే అజంతా - ఎల్లోరా గుహల చిత్ర శిల్పాలు భారతీయ కళావేత్తలనే కాకుండా ప్రపంచ కళాకోవిదులను కూడా ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాయి. ఇవి ప్రకృతి రమణీయాలైన నదీ పర్వతారణ్య పరిసరాలలో ఉండడం ఒక విశేషం. ఆ పర్వత సానువుల్లో పలు రకాలైన సెలయేర్లూ ఎంతో మోహనంగా అలరిస్తాయి.ఇలాంటి అందమైన ప్రదేశాల్లోనే మునులు తపస్సు చేసుకునేవారేమో! ప్రకృతి కళోపాసకులు, శిల్పులు, బౌద్ధ భిక్షువులు ఇలాంటి సుందర ప్రదేశంలోనే ఆ ళాలక్ష్మికి నీరాజనాలు పలికారు. తరతరాలుగా ఈ ప్రకృతి అందాలు పర్యాటకుల మది దోచుకుంటూనే వున్నాయి. సృష్టికే శోభనిచ్చేంతటి సౌందర్యం ఎల్లోరా సొంతం. అందుకే భారతీయ శిల్పకళా పరిశోధనకు, ఆ విలువైన అందాలను ఆస్వాదించడానికి ఎందరో విదేశీయులు అజంతా ఎల్లోరా గుహలను సందర్శిస్తుంటారు.

WaterFall_Elloraఅనేక శతాబ్దాలుగా ఎల్లోరా గ్రామం వెరూల్‌ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ గ్రామం ప్రాచీన వాణిజ్యకేంద్రంగా పేరు పొం దింది. అరబ్‌, యూరప్‌ దేశాల నుండి ప్రజలు తమ వ్యాపార అవస రాలకు ఈ గ్రామం దర్శించేవారట. ఎల్లోరా కొండల్లోని 34 గుహ ల్లో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులో హిందూ, బౌద్ధ, జైన మతాలకు చెందిన శిల్పరీతుల్ని ప్రతిబింబించే అపురూప శిల్పాలు సర్వమత సౌభ్రాత్రుత్వాన్ని చాటుతున్నాయి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటిని ఐదో శతాబ్ధం నుండి ఎనిమిదో శతాబ్దం మధ్య కాలంలో చెక్కారు. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి. ఇవి ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దంలో చెక్కినవి. 5 గుహలు అంటే 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటిని ఎనిమిది - పది శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి.

ఈ గుహల్లో ఎక్కువ భాగం ధ్యానాది సాధనలు, విద్య గడపడానికి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ప్రత్యేక గదులుగా విభజింపబడ్డా యి. కొన్ని గుహలు రెండు అంతస్తులు, మరికొన్ని 3 అంతస్తులుగా ఉండి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా కట్టబడి ఉన్నాయి. ఈ ఎల్లోరా గుహలన్నింటి లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభా లపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

bududu10వ గుహనే విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలు స్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. ఆయన ఒక్కరాత్రిలో నిర్మించా రో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది.ఇక్కడ బుద్ధుని మూర్తి చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది.

అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది. నిజంగా ఈ విశ్వకర్మ గృహాలయం చాలా వింత గొలుపుతుంది.

హిందూ మతగుహలు...
Ellora-Gohoto13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి, హిందూ పౌరాణిక కథలను తెలిపే శిల్పాలతో ఉన్నాయి. వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు అమోఘం. 16వ గుహ కైలాస గుహ అంటారు. ఈ కైలాసనాధ దేవాలయపు శిల్పం చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం మొత్తం ఒకే రాతితో తొలిచి శిల్పించారు. అలాగే ఈ ఆల యం ముందు కూడా రాతి ధ్వజస్తంభం కూడా చాలా అద్భుతం. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూ స్తాం.

ఈ అద్భుతమైన శిల్పాలను చూడడం కోసం యాత్రికులు తప్పకుండా ఈ గుహను చూడాల్సిందే. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటా రు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి. 25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.

జైనమత గుహలు...
Ellora-Caves1మిగిలినవి ఐదు గుహలు. ఈ ఐదూ జైనులకు సంబంధించినవి. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి. 32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం చాలా అద్భుతం గా ఉంటుంది. ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతి ర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సంద ర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

- దామర్ల విజయలక్ష్మి

ప్రకృతి రమణీయతను తనలో ఇముడ్చుకొని అటవీ జంతువులకు ఆలవాలంగా... సందర్శకుల మది దోచుకుంటోంది కంబాల కొండ...

 అటవీ జంతువుల అండ... కంబాల కొండ

అరకులోయ, బొర్రా గుహలు, కైలాసగిరి, రామకృష్ణా బీచ్‌, రుషికొండ బీచ్‌, భీమిలి... ఈ పేర్లన్నీ వింటే మీకేమనిపిస్తోంది. అందాల సాగరతీరం విశాఖ మీ కళ్లముందు కదలాడుతోంది కదూ..! అలాంటి ప్రకృతి అందాలకు కొదువలేని ఈ ఉక్కు నగరం సమీపంలో మరో మణిహారం కూడా ఉంది. అదే కంబాల కొండ.ప్రకృతి రమణీయతను తనలో ఇముడ్చుకొని అటవీ జంతువులకు ఆలవాలంగా... సందర్శకుల మది దోచుకుంటోంది కంబాల కొండ...

Ellora1ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుండే పచ్చని అటవీ సంపద, గలగలపారే సెలయేళ్ళు, జలాశయం, చెంగుచెంగున ఎగిరే మయూరాలు. అడవికే వన్నె తెచ్చే జింకలు, ఇలా ఎన్నో అందాలకు నెలవైన కంబాల కొండ ఎకో టూరిజం పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గిరిజనులు నిర్వహించే ఈ పార్కు విశాఖ రైల్వే స్టేషన్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇక్కడికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అంతేకాక, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కంబాల కొండకు 3 కిలో మీటర్ల దూరంలో ఉండడం గమనార్హం.కొండకు చేరుకోవాలంటే... రైల్వేస్టేషన్‌, బస్టాండు నుంచి ఆటోలూ, బస్సులూ ఎప్పు డూ అందుబాటులో ఉంటాయి.




ఎన్నెన్నో అందాలు...
Kambala-Konda01కంబాల కొండ అటవీ ప్రాంతం సుమారు ఎనిమిదివేల హెక్టార్ల విస్తీర్ణం పరుచుకొని ఉంది. ఇందులో ఎనభై ఎకరాలను పార్కు కోసం కేటాయించారు. ఇక్కడ నెమళ్లు, కుందేళ్లు, చిరుతపులులు, పాలపిట్టలు, రామ చిలుకలు... ఇలా ఎన్నో రకాలై న పక్షులు, జంతువులను చూడవచ్చు. అంతేకాకుండా... ఇక్కడ నెలకొల్పిన రివర్‌ క్రాసింగ్‌, ట్రెక్కింగ్‌, బోటింగ్‌ వంటి సదు పాయాలు పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శకుల సందడితో కిటకిటలాడే కంబాల కొండ అటవీ ప్రాంతంలోకి చీకటి పడిందంటే మాత్రం ఎవరినీ అనుమతించరు. కంబాల కొండ సాంతం ఒకే రోజులో చుట్టేయాలంటే సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే... ఇక్కడ నెలకొన్న ప్రకృతి రమణీయతను తనివితారా చూడాలంటే కనీసం రెండు రోజులైనా ఇక్కడ ఉండాల్సిందే. పర్యాటక శాఖవారు ఇక్కడ కాటేజీ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి రెండు మూడు రోజులు ఇక్కడ విడిది చేయడం పెద్ద సమస్య కానే కాదు.

Kambala-Kondaఎన్ని జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడి నెమళ్ల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. పురివిప్పి ఆడే మయూరాల వయ్యారాలను చూసేందుకు సందర్శకులు క్యూ కడతారు. ఇక చలాకీ కుందేళ్ల వెంట పరుగులు తీసేవాళ్లు కొంతమందైతే... లేళ్లతో పోటీపడేవాళ్లు మరికొందరు. ఇలా ఎవరికి తోచినవిధంగా వాళ్లు పసిపిల్లలైపోతారంటే అతిశయోక్తి కాదు.

Monday, October 4, 2010

దేశంలో ఉన్న ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు పర్యటించండి.. పరవశించండి ....



చలికాలం వచ్చేసింది. వేకువలో మంచులో తడిసిన నీటిబిందువులను రాల్చే వృక్షాలు... గుత్తులు గుత్తులు గా పూచే పూలు.. చల్లగా మనసును తాకే పిల్ల తెమ్మెరలు... సూర్యోదయం వేళ రెక్క లు టపటప కొట్టుకుంటూ ఆకాశానికి ఎగిరే పక్షుల గుంపులు... కికిలా రావాలు... ఇలా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు... ఎన్నెన్నో అద్భుతాలు... ఎలాంటి వారినైనా పరవశింపజేసే గుణం ఒక్క ప్రకృతికే ఉంది. మనదేశంలో సంభ్రమాశ్చర్యాలను కలిగించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆధ్యాత్మి కానుభూతినిచ్చే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, చిరస్మరణీయమైన అను భవాలను అందించే దర్శనీయ స్థలాలూ ఉన్నాయి.
మన రోజువారీ జీవితంలో జఢత్వాన్ని వదిలించుకుని నూతన ఉత్సాహాన్ని నింపుకోవడానికి  విహార యాత్ర లు తప్పనిసరి. విహార యాత్రానంతరం కలిగే మానసిక ఆహ్లాదం తప్పనిసరిగా మనలో మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. విహార యాత్రలు ఎవరికైనా... ఏ వయసువారికైనా ఎంతో ఉత్సాహాన్నిస్తాయి.   

మనదేశంలో ఉన్న ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలపై విశిష్ట కథనం...

మన నిత్యజీవితానికి భిన్నంగా, కొద్ది మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. అయితే ‘వెళ్లాలి’ అని అనుకోగానే... ఎక్కడికి? ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇంటిల్లిపాదితో కలిసి విహరించడమంటే ఎవరికి ఆసక్తి ఉండదు. పిల్లలతో కలిసి యాత్ర చేస్తే... ఆ ఆనందమే వేరు. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి.

చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు మనదేశంలో కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, మ్యూజియాలు, కొండలు, అడవులు, జలపాతాలు, బీచ్‌లు, నదులు ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మన ల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఉత్తర భారతానికి వెళ్తే ఆధ్యాత్మికతను కలిగించే అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని యాత్ర పారంభించి మధుర, ఆగ్రా, జైపూర్‌, అజ్మీర్‌, హరిద్వార్‌, హృషీకేష్‌, పంజాబ్‌, మానస సరోవర్‌ లాంటి మరుపురాని విహార ప్రదేశాలెన్నింటినో సందర్శించవచ్చు.

స్వర్ణానుభూతి...

పంజాబ్‌ అనగానే మనకు వెంటనే అమృతసర్‌ లోని స్వర్ణదేవాలయం గుర్తుకొస్తుంది. పంజాబీల విశిష్ట దేవాలయ సందర్శనా నంతరం జలియన్‌ వాలాబాగ్‌ దురంతం జరిగిన మైదానాన్ని కూడా చూడవచ్చు. ఆనాడు జనరల్‌ డయర్‌ సాగించిన మారణ కాండకు ఎందరో వీరులు మరణించారు. వారి త్యాగానికి గుర్తుగా అక్కడ ఒక అమరవీరుల స్థూపాన్ని నిర్మించింది కేంద్రప్ర భుత్వం. ఆ ప్రాంతంలో ఒక మ్యూజియం కూడా వుంది. ఆనాటి విశేషాలను ఆ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజి యంలో ఒక విశిష్టత ఉంది. అప్పట్లో జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని చూసిన ఓ చిత్రకారుడు గీసిన చిత్రం మన ముందు ఆ దుస్సంఘటనను కళ్ళకుకడుతుంది.

అలాగే జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనకు బాధ్యుడైన డయర్‌ను హత్య చేసి లండన్‌ ప్రభు త్వానికి లొంగిపోయి... ఉరితాడుకు బలైన వీరుడు ఉధమ్‌ సింగ్‌ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దేశంలో మర్కెడ కూడా ఉధమ్‌సింగ్‌ చిత్రం లేకపోవడం గమనార్హం. అలాగే అమృత్‌సర్‌ నుండి 25 కిమీ దూరంలోఉన్న ‘వాఘా’ సరిహద్దు దర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం. అక్కడ రోజూ సాయంత్రం 6 గంటల నుండి 6.30 నిమిషాల వరకు ‘జెండా’ పండుగ జరుగుతుంది. ‘వాఘా’ అంటే భారత్‌-పాకిస్థాన్‌ దేశాల సరిహద్దు ప్రాంతం. భారత్‌ నుండి పాక్‌కు వేళ్లే బస్సు ఈ సరిహద్దు నుండే వెళ్తుంది. ఈ జండా పండుగను చూస్తున్న భారతీయుడు ఉప్పొంగిపోయి ‘మేరా భారత్‌ మహాన్‌’ అంటూ నినదిస్తాడు. అక్కడ భారత సరిహద్దు దళాలు... తమ విన్యాసాలతో జెండాలను అవనతం చేస్తారు. ఆవలివైపు పాకిస్తాన్‌ దేశ ప్రజలు కూడా తమ జెండా పండుగను తిలకిస్తూ చప్పట్లతో హోరెత్తిస్తారు. ఆ సాయం సంధ్యవేళ చూట్టూ చెట్లపై ఉన్న పక్షులు గూటికి చేరుతూ ఉంటాయి. ఇక్కడ ఇరుదేశాల ప్రజల చప్పట్లు, అరుపులతో పక్షలు ఒక్కసారిగా రెక్కలు టపటపమనిపిస్తూ... అరుపులతో చెట్ల నుండి గుంపుగా లేస్తాయి. ఆ సమయంలో వాటిని చూస్తుంటే... పక్షులు కూడా మనకు మద్దతుగా అరుస్తున్నాయనిపిస్తుంది. ఈ జెండా పండుగ ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన పండుగ.

శృంగార జగత్తు ఖజురహో...
భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్‌లో ఉంది. శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు... ఎన్నో ప్రకృతి బీభత్సాలకు గురయ్యాయి. ఎందరో దురాశాపరుల దాడులతో పాడైపోగా మిగిలిన ఆలయాల్లో జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

వెయ్యేళ్ల కిత్రం చందేలా రాజవంశీయుల పరిపాలనలో రాజధానిగా వెలుగొందిన ఖజురహో గ్రామం... ఆ రాజుల పరిపాలన అంతమవడంతో అక్కడి అద్భుత శిల్ప సంపద కూడా మరుగున పడిపోయింది. కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడివిలా మారిపోయింది. 1839 లో మళ్లీ ‘ఖజురహో’ వెలుగు చూసింది. ఆనాడు చందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆయలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా ఉంటాయి. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఖజురహో సందర్శించాలంటే మద్రాసు - ఢిల్లీ రైలు మార్గంలోని ఝాన్సీ స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుండి దాదాపు 180 కిమీ ఏదైనా వాహనం తీసుకొని గాని, రాష్ట్ర టూరిజం బస్సు ద్వారాగాని ఖజురహో చేరవచ్చు. ఖజురహో సందర్శనానంతరం... రసోద్దీపనతో కవ్వించే పద్మినీ జాతి స్ర్తీల సుందర శిల్పాల సౌందర్యాన్ని గుర్తుచేసుకుంటూ... ఆ తరువాత వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి కోట కూడా చూసుకుని ఆమె శౌర్య పరాక్రమాలను నెమరువేసుకుంటూ తిరుగు ప్రయాణమవుతాం.

ప్రభాకర దర్శనం...
ఒరిస్సాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం కూడా అద్భుత శిల్పాలతో యాత్రికులను అలరిస్తుంది. సుందర పూరీ సాగరతీరానికి 35 కిమీల దూరంలోనూ, భువనేశ్వర్‌కు 65 కిమీల దూరంలో ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకృతిలో రూపొందించిన ఈ రథాలయానికి 20 చక్రాలు, ఏడు గుర్రాలు ఉంటాయి. ప్రతి చక్రంలోనూ సూర్యుని గమనం సమయాన్ని తెలియజేస్తుంది. గైడ్లు... గంటలూ, నిమిషాలతో సహా లెక్కించి సమయం ఎంతైందో చెబుతారు. ఈ దేవాలయ కట్టడంలోని అద్భుతం ఇదే. దేవాలయ గోడలపై ఉన్న శిల్ప సౌందర్యం చూపు మరల్చనీయదు.

కోణార్క్‌కు వెళ్లాలంటే మద్రాసు - ఢిల్లీ స్టేషన్ల మధ్య భువనేశ్వర్‌లో దిగాలి. అక్కడి నుండి బస్సులేక ఏదైనా వాహనంను తీసుకొని వెళ్లాలి.

తెలుగునాట విహారం...
మన రాష్ట్రంలోనూ సుప్రసిద్ధ విహార ప్రదేశాలున్నాయి. చెప్పాలంటే మన తెలుగు నేలలోనూ లెక్కకుమించిన ప్రకృతి అందాలున్నాయి. ఉదాహరణకు గోదావరిపై పడవ ప్రయాణం. గోదావరి నది మీద పాపికొండల నుండి భద్రాచలం వరకు లాంచీలో వెళ్లడం గొప్ప అనుభూతినిస్తుంది. ఈ పర్యటన పిల్లుకూడా ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. పాపికొండల మధ్య నుండి గోదా వరి నీటిని చీల్చుకుంటూ... పయనిస్తున్న లాంచీలోనుంచి చుట్టూ పచ్చగా పరుచుకున్న ప్రకృతి అందాల ను చూడడంలో కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. మధ్యమధ్యలో గిరిజన గ్రామాలో ఆగుతూ... గిరిజనుల వేషభాషలు, ఆహార్యం గమనిస్తుంటే మన గ్రామీణ భారతం కళ్ళముందు కదలాడుతుంది.

సంపూర్ణ విహారానుభూతి పొందాలంటే..?
విహారయాత్రను ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ప్రారం భిస్తే... అనవసర హడావిడికి తావుండదు. అంతేకాక పర్యటన మరింత మధురానుభూతుల్ని మిగుల్చుతుంది. దానికోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి... విహార ప్రదేశం, అక్కడి చేరుకోవడానికి సులభమార్గం, విడిది లాంటి వాటిని ముందుగానే నిర్ణయించుకుంటే మీ విహారం సంపూర్ణానందాన్ని ఇస్తుంది.

మనదేశంలో సామాన్యంగా దూరప్రాంతాల ప్రయాణాలకు రైలు ప్రయాణం ఎంతో అనుకూలమైనది. ప్రయాణం సురక్షితమే కాకుండా రోడ్డు మార్గంకంటే వేగంగా, సుఖంగా అనుకున్న చోటి కి చేరుకుంటాం. రైలు ప్రయాణం ఎంతో చౌక. ఈ యాత్రాస్థలం ఎంపిక, టూరిస్ట్‌ గైడ్‌లు, రోడ్‌, రైలు మ్యాప్‌లు, రైల్వే టైం టేబుల్‌, టూరిజం శావారి వివరాలు మీకు సహాయపడుతాయి. ఇంతకు ముందే ఆ ప్రదేశాలను చూసి వచ్చిన స్నేహితుల, బంధువుల సలహాలు తీసుకుంటే ఇంకా మంచిది. లిస్ట్‌లో చాలాప్రాంతాలు ఉన్నట్లయితే... ఆ ప్రాంతాలను ఒక క్రమపద్ధతిలో అమర్చుకుంటే... మళ్లీ మళ్లీ తిరగాల్సిన పని ఉండదు.

ఉదాహరణకి మీరు హైదరాబాద్‌లో ఉన్నారనుకోండి. అక్కడి నుండి కన్యాకుమారి వరకు యాత్రను ఏర్పాటు చేసుకొని కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రదేశాలన్ని చూసి చివరగా తిరుపతిని దర్శించుకొని ఇంటికి చేరుకోవచ్చు. తమిళనాడులోని కన్యాకుమారి, రామేశ్వరం, ఊటీ, కొడైకొనాల్‌, మధురె,ై తిరుచ్చి, కుంభకోణం, తంజావూరు, చిదంబర మేకాక ప్రక్కనే వున్న పాండిచ్చేరిని కూడా దర్శించుకోవచ్చు. కేరళలోని కొచ్చిన్‌, త్రివేండ్రం మొదలైన ప్రాంతాలను చూడవచ్చు. అటు తరువాత మద్రాసు నగరం ఆ నగరం చుట్టుప్రక్కలగల కంచి, మహాబలిపురం దర్శించుకోవాలి. ఆతరువాత మద్రాసు నుండి కర్ణాటక వెళ్లి బెంగ ళూరు మైసూరు చూడవచ్చు. మైసూరులోని బృందావన్‌ గార్డెన్స్‌ చూడవచ్చు. చివరగా బెంగళూరు నుండి తిరుపతిని దర్శించుకొని హైదరాబాద్‌ను చేరుకోవచ్చు. ఈ విధంగా మీ దక్షిణాది విహారయాత్ర సఫలం అవుతుంది. ఇదేవిధంగా ఉత్తరానికి వెళ్తే... షిర్దీ, అజంతా, ఎల్లోరాలు, ఆగ్రా జైపూర్‌, ఢిల్లీ, హరిద్వార్‌, హృషికేష్‌లాంటి చారిత్రాక ఆధ్యాత్మిక ప్రదేశాలాన్నింటినో సందర్శించవచ్చు.

ఇవీ... పాటించండి...
మనీ: మీరు దర్శించాలనుకున్న ప్రదేశాన్ని ఎన్నుకున్న తరువాత ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకోవాలి. రైలు టికెట్‌, హోటల్‌ లాడ్జ్‌ల ఖర్చులు, లోకల్‌ సైట్‌ సీయింగ్‌ ఖర్చులు, ప్రవేశ రుసుములు, ఆహారం, ఫోటోలు, షాపింగ్‌కు మొదలైన వాటికి సరిపడా పైకాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇతర ఖర్చులకు అదనంగా మరికొంత డబ్బు దగ్గరుంచుకుంటే మంచిది. కొత్త ప్రదేశాల్లో ఇబ్బంది పడకుండా వుండవచ్చు.

రిజర్వేషన్లు: ఈ కంప్యూటర్‌ యుగంలో క్యూలైన్లో నిలబడి టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే రోజులు పోయా యి. ఇప్పుడు రైలు, బస్సు ప్రయాణాలకోసం అడ్వా న్స్‌ బుకింగ్‌ అందుబాటులో ఉంది. విహారయాత్రకు కొన్ని రోజులు ముందుగానే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసు కుంటే మంచిది. వెళ్ళే సమయానికి తీసుకుందాంలే అనుకుంటే టికెట్లు దొరక్క ఇబ్బందిపడాల్సివస్తుంది.

వసతి సౌకర్యాలు: కొత్తగా యాత్రికులు దిగగానే అనేక మంది దళారులు చుట్టుముడుతారు. వివిధ లాడ్జిల రేట్లను మనముందు ఏకరువు పెడతారు. మనమే హోటల్‌లోకి వెళ్లి అక్కడ రూమ్స్‌ బాగున్నాయో లేదో చూసి రూమ్‌ బుక్‌ చేసుకోవాలి. లేకపోతే దళారుల చేతుల్లో మోసపోతాం. అంతేకాక హోటల్స్‌లో కూడా దొంగతనాలు, మోసాలు అనేకం జరుగుతుంటాయి. అందుకని కొద్దిగా డబ్బు ఎక్కువైనా మంచి హోటళ్లను ఎన్నుకోవడం మంచిది. ప్రభుత్వ టూరిజం కాటేలు అందుబాటులో ఉంటే... వాటిలో ఉండడం శ్రేయస్కరం.
ఆహారం, నీరు: విహారయాత్రలో ఆహారం, నీరు శుభ్రత విషయంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం పాలై, విహారయాత్రకు ఆటంకాలేర్పడతాయి. వీలైతే... మినరల్‌ వాటర్‌నే వాడడం మంచిది. ఎక్కడపడితే అక్కడ నీరు తాగడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. మెనూ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదిపడితే అది తినకూడదు. మధ్యమధ్యలో పళ్ళరసాలు వాడితే ఆరోగ్యానికి మంచిది.

మందులు: మనతోపాటు చిన్న పిల్లలు ఉన్నట్లయితే... చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తనీరు, కొత్త వాతావరణం పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తాయి. అక్కడ డాక్టర్‌ మనకు అందుబాటులో వుండరు. అందుకని మీరే జ్వరం, దగ్గు జలుబు, తలనొప్పి, విరోచనాలు మొదలైన వాటికి అవసరమైన మందులు దగ్గరుంచుకేంటే మంచిది.

ఫోటోగ్రఫీ: విహారయ్రాతల్లో మీ అనుభూతుల్ని భద్రపరుచుకోవాలంటే మీ వెంట కెమెరా తప్పకుండా ఉండాల్సిందే... వీలుంటే వీడియో కెమరాను కూడా తీసుకెళ్ళడం ఇంకా మంచిది.

అంతేకాకుండా, కొత్త ప్రదేశాల్లో భాషా సమస్య ఎదురౌతుంది. అందుకని ఇంగ్లీషు, హిందీ కొద్దిగానైనా తెలిసివుంటే మరీ మంచిది. స్ర్తీలు విహారయాత్రలకు వెళ్లే సమయంలో నగలు ఎక్కువగా వెంట తీసుకెళ్లేకుండా ఉంటేనే మంచిది. కొత్త ప్రదేశాల్లో, లాడ్జిల్లో అనవసర ఇబ్బందులు కలుగకుండా వుంటుంది. కొత్త ప్రదేశాల్లో రాత్రుళ్ళు బయట తిరగడం అంత మంచిది కాదు. మీరు వుంటున్న లాడ్జి పేరు, వీధి తదితర అడ్రసు ఉన్న కాగితాలు మీ పిల్లలతో పాటు అందరి దగ్గర ఉంచుకోవాలి. వీలైతే స్వస్థలంలో ఉన్న మనవారికి మన విడిది చిరునామా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం మంచిది.

సదరన్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వాళ్ల టూరు పాకేజీలు ఎంచుకంటే మంచిది. ఎందుకంటే సదరన్‌ వాళ్ళకు దేశంలోని అన్ని ముఖ్య విహారప్రదేశాల్లో హోటల్స్‌ ఉన్నాయి. ఏంచక్కా తెలుగు భోజనం తింటూ తిరగొచ్చు. పైగా భాష సమస్య కూడా ఉండదు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ విహారయాత్ర మీ జీవితాంతం గుర్తుండిపోతుంది.
- దామర్ల విజయలక్ష్మి

Sunday, October 3, 2010

పాలరాతి కొండల మధ్య పడవ ప్రయాణం

జబల్పూరుకు దగ్గర్లో ఉన్న బేడాఘాట్‌లో ఎత్తైన పాలరాతి శ్రేణుల మధ్య ప్రవహించే నర్మదానదిలో నౌకా విహారం ఒక అద్భుతం. పండువెన్నెల్లో అయితే అది పరమాద్భుతం. ఆ మధురానుభూతిని అనుభవించాలనే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్‌లోని భోపాల్, సాంచీ, వైశాలీ వగైరా ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడికి చేరుకున్నాం. దారిలో మాకు తారసిల్లినప్రదేశాలు, దేవాలయాలు, జలపాతాలు ...

మనదేశానికి దాదాపు మధ్యభాగంలో ఉండి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న పట్టణం జబల్పూరు. ఎన్నో భవ్య స్మారకాలు ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో మనకు కనువిందు చేస్తాయి. మహాభారతంలో కూడా ఉటంకించబడిన ఈ పట్టణం తర్వాత మౌర్య, గుప్త, కల్చురి రాజుల పాలనలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. దాదాపు నాలుగు శతాబ్దాల పాటు పాలించిన యువరాజు దేవుడు, కర్ణదేవుడు, గంగ దేవుడు మొదలైన కల్చురి వంశపు రాజుల రాజధానిగా ఇది ప్రసిద్ధికెక్కింది. పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠాలు తమ రాజధానిని సాగర్‌నుండి జబల్పూరుకు మార్చారని, ఆ తర్వాత క్రీ.శ. 1817లో ఇది ఆంగ్లేయుల స్వాధీనమైందని చారిత్రక కథనం.

దుర్గావతి పేరు మిగిలిపోయింది

మేం జబల్పూరును చూడటానికి ఒక ఆటోరిక్షా మాట్లాడుకున్నాం. చిన్న ఊరు కాబట్టి ఒక్క పూటలోనే జబల్పూరులోని విశేషాలన్నీ చూడగలిగాం. ఇది సముద్ర మట్టానికి 393 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల వేసవిలో కూడా మరీ భరించలేనంత ఎండలు ఉండవు. మహారాణి లక్ష్మీబాయి కారణంగా ఝాన్సీ పేరు చిరస్థాయైనట్లు, మహారాణి దుర్గావతి శౌర్య పరాక్రమాల వల్ల జబల్పూరు చారిత్రక ప్రదేశమైంది. దుర్గావతి గోండు రాణిగానే కాక అక్బర్ చక్రవర్తిని ఎదిరించి పోరాడిన స్త్రీగా ప్రసిద్ధురాలు. ఆ సంగ్రామంలో ఆమె అసువులు బాసినట్లు చరిత్ర చెబుతోంది. జబల్పూరులోని భంపర్‌లాల్ ఉద్యానవనంలో ఏనుగుపై స్వారీ చేస్తున్న మహారాణి దుర్గావతి విగ్రహం ఉంది. 'రాణి దుర్గావతి మ్యూజియం'లో ఆ కాలంనాటి దుస్తులు, ఆయుధాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటితో పాటు పెక్కు శిలా శాసనాలు కూడా మనకు ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి.

గోండుల మహల్‌కోట

ఆ తరువాత ఆటోవాలా మమ్మల్ని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదన్ మహల్ కోటకు తీసుకెళ్లాడు. కొండపై కట్టిన ఈ దుర్గం ఒకప్పుడు గోండు రాజులదట. క్రీ.శ. 1116లో ఈ దుర్గాన్ని గోండు రాజు 'రాజా మదన్‌షా' నిర్మించాడట. దీనిపై నుండి నిలబడి చూస్తే జబల్పూరు పట్టణమంతా కనిపించింది.

బేడాఘాట్ నర్మద అందాలు

తర్వాత అక్కడ్నుంచి బేడాఘాట్‌కు చేరుకున్నాం. ప్రధానంగా మేము జబల్పూరుకు వచ్చింది కూడా బేడాఘాట్ చూడాలనే ఉద్దేశ్యంతోనే. అటూ ఇటూ పాలరాతి కొండల మధ్య ప్రవహించే నర్మదానది దృశ్యం ఎంతో నయనానందకరంగా ఉంటుంది. ఈ కొండల మధ్య నర్మద ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. దారిలోనే పంచవటీ ఘాట్ దగ్గర పావన్‌గంగ అనే నది పాయగా వచ్చి నర్మదలో కలుస్తుంది. ఆ కొండలకు కుడివైపున అనేక మందిరాలు కనిపించాయి. పాలరాతి శిలలలో 'భూల్ భు లయ్యా' అనే ప్రదేశం ఉంది. ఇక్కడ నర్మదానది బండరాళ్ల మధ్యన ఏ మార్గంలో ముందుకు దూకుతోందో తెలుసుకోవడం కష్టం. అక్కడ చూడతగ్గ వాటిల్లో శివలింగం, కాలభైరవుని ఆకారంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నల్లని పాషాణం, ఏనుగు తల ఆకారంలో ఉండే శిల, దత్తాత్రేయ ముని గుహ, గణేశుని గుహ మొదలైనవి ఉన్నాయి.

వెన్నెల్లో నౌకా విహారం అద్భుతం

ఒకటిన్నర కిలోమీటర్ల దాకా ఇరువైపులా సుమారు 30 మీటర్ల ఎత్తుగల పాలరాతి శిలల మధ్య నర్మదలో నౌకావిహారం ఒక మరపురాని మధురానుభూతి. దాదాపు 45 నిమిషాలు పట్టింది ఆ ప్రయాణానికి. మార్గ మధ్యంలో నర్మదానది లోతు కనీసం 30 - 80 మీటర్ల మధ్య ఉంటుందని అక్కడి వారు చెప్పారు. వెన్నెల రాత్రుళ్లలో అయితే ఆ తెల్లని పాలరాళ్లు మరింతగా మెరుస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతాయనిపించింది.

దీపావళి తరువాత బేడాఘాట్‌లో పెద్ద ఉత్సవం జరుగుతుందని, ఆ ఉత్సవానికి పరిసర ప్రాంతాలనుండి వేలాదిమంది ప్రజలు వస్తుంటారని చెప్పారు. పంచవటీ ఘాట్ సమీపంలోని పర్వతాలపై 64 మంది యోగినుల మందిరం ఉంది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన ఎన్నో విగ్రహాలు కనిపించాయి. ఇక్కడున్న ఒక శిలాఫలకంపైన ఈ మందిరాన్ని క్రీ. శ. 1156లో కల్చురి వంశపు రాజు నిర్మించినట్లు ఉంది. ఖజురహో దేవాలయంపై కనిపించే శృంగార శిల్పాల్లాంటివి ఈ మందిరంపై కూడా చూడవచ్చు.

హోరు ఒకటిన్నర కి.మీ. దూరం విన్పిస్తుంది

బేడాఘాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో జబల్పూరు నుండి శాహ్‌పూర్‌కు వెళ్లే మార్గంలో నర్మదానది జలపాతంగా మారి ఇరవైమీటర్ల పైనుండి దూకుతుంది. ఈ జలపాతపు హోరు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. నర్మదానది వింధ్యాచలం, మేక్లే పర్వతాల పైనుండి అంటే దాదాపు 1070 మీటర్ల ఎత్తునుండి బయలుదేరి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌లోని ఖంజాత్ అఖాతంలో సముద్రంలో కలుస్తుంది.

జబల్పూరుకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో నాగపూర్‌కు వెళ్లే మార్గంలో వందమీటర్ల ఎత్తున్న మఢియా అనే చిన్న పర్వతం ఉంది. దానిపైన 12 జైన మందిరాలు, 24 ఇతర చిన్న మందిరాలు ఉన్నాయి. పర్వతం చాలా అందంగా ఉంటుంది. పైకెక్కడానికి సుమారు 265 మెట్లున్నాయి. నర్మదానదీ తీరంలోనే తిల్‌వార్‌ఘాట్ అనే పిక్నిక్ స్పాట్ ఉంది. ఇక్కడ 1935లో నిర్వహించబడిన కాంగ్రెస్ మహాసభలకు గుర్తుగా గాంధీజీ స్మారకస్థూపం నిర్మించబడింది. తర్వాత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. ఆ రాత్రికి జబల్పూరులోనే బసచేసి మర్నాడు పచ్‌మరీ వెళ్లాం.

పచ్‌మరీ అందచందాలు

పచ్‌మరీ మరో అద్భుతమైన ప్రదేశం. జబల్పూరుకు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. ఇక్కడి జలాశయాలు, జలపాతాలు మన మనసుల్ని మరోలోకంలోకి తీసుకెళ్తాయి.

అప్సరా విహార్: ఇక్కడ జలపాతం ప్రవాహంతో ఏర్పడిన జలాశయం ఉంది. పర్యాటకులు స్నానం చెయ్యటానికి, ఈత కొట్టడానికి చక్కని ఏర్పాట్లు ఉన్నాయి. ఇది పచ్‌మరీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హాండీలోయ: పచ్‌మరీలో ఇదొక అద్భుతమైన దర్శనీయ ప్రదేశం. అటూ ఇటూ కొండల వరస, మధ్యలో వందలాది అడుగుల లోతుగల లోయ. తొంగి చూడటానికే మాకు గుండె దడదడలాడింది. బాగా దగ్గరకి వెళ్లకుండా ఇనుప కడ్డీలతో కంచెలా ఏర్పాటు చేశారు. పచ్‌మరీ పరిసర ప్రాంతాలలో ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి 30 - 40 దాకా వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జలపాతాలు చూడతగ్గవి. జలపాతాలలో చెస్‌ఫాల్, బిగ్‌ఫాల్, లిటిల్ ఫాల్ పేరొందినవి. ఇవి దాదాపు 100 - 125 మీటర్ల ఎత్తునుండి కిందకి దూకుతుంటాయి. మధ్యప్రదేశ్ మంత్రి మండలి సమావేశాలు (గ్రీష్మకాలంలో) ఇక్కడే నిర్వహించబతాయట. పచ్‌మరీని అక్టోబర్ - జూన్ మధ్య 9 నెలల కాలంలో దర్శిస్తే చాలా బాగుంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
నిజానికి పచ్‌మరీ ఒక్క రోజులో చూసే ప్రదేశం కాదు. తనివితీరా చూసి మన మనస్సులో గాఢంగా పదిలపరచుకోవాలంటే కనీసం వారం రోజులైనా మకాం వెయ్యాలి. లేదంటే 'తనవి తీరలేదే - నా మనసు నిండలేదే' అని పాడుకుంటూ బస్సెక్కాల్సిందే - మేమూ అదే చేశామనుకోండి!

- నల్లబెల్లి శ్రీమన్నారాయణ
98490 54936