విహారాలు

India

Gamyam

Saturday, January 29, 2011

సాయంకాలం.. సాగరతీరం.. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌

ఊహాలోకంలో విహరించే ప్రేమికులైనా, సాయంత్రం వరకు పనిచేసివచ్చే ఉద్యోగులైనా, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైనా హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ చెంత సేద తీరేందుకు ఇష్టపడతారు. అలా నెక్లెస్‌ రోడ్డుపైకి వెళ్ళాక వాతావరణానికి తగ్గట్టు అక్కడ దొరికే చిరుతిళ్ళను ఆరగిస్తూ ఆనందించడమూ ఆనవాయితే.నగరంలో వయోభేదం లేకుండా అందరికీ ఆత్మీయ నేస్తమైన నెక్లెస్‌రోడ్డు హైదరాబాద్‌లో సాగర తీరం లేదనే కొరతను కొంతలో కొంత తీరుస్తోంది. పరిసరాలలో చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకుపోతూ నగరవాసులు అక్కడ దొరికే చిరుతిళ్ళనే ఆస్వాదించడం విశేషం..

necklaceroad-
వేరే ప్రదేశాలలో ధనిక, పేద వంటి తారతమ్యాలు ఉంటాయేమోగానీ సరదాగా గడిపే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధారణంగా ఇవేవీ కనిపించవు. ఇటువంటి సేదతీరే ప్రాంతమైన నెక్లెస్‌రోడ్డులో దొరికే ఏ తినుబండారాలనైనా అందరూ ఇష్టంగా తింటారు. ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఫుడ్‌ ఐటమ్స్‌ ధరలు ఉంటాయి కాబట్టి వాటికి పెద్ద ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. ఇలా నెక్లెస్‌రోడ్డుపై దొరికే మొక్కజొన్న పొత్తుల నుంచి కూల్‌డ్రింక్‌ల వరకు అందరికీ ప్రీతిపాత్రమే.

రుచిలో అమోఘం...
పానీపూరీలో రసంతో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే...ఆ టేస్టే వేరు. ఈ ఖరీదైన రోజుల్లో ట్యాంక్‌ బండ్‌పై యువతీ యువకులు ఇష్టపడే పానీపూరీని పరిశుభ్రంగా అతి తక్కువ ధరల్లో లభిస్తుందంటే ఎవరుమాత్రం తినకుండా ఉంటారు చెప్పండి. ఈ పూరీలను చిన్న చిన్న ట్రావెలింగ్‌ బల్లపై పెట్టి అమ్మేవారు చాలా మంది ఉన్నా కూడా అందరి వ్యాపారం జోరుగానే ఉండడం విశేషం. సాయంత్రాలలో వీటి వ్యాపారం యమ స్పీడుగా ఉంటుందని హుస్సేన్‌ సాగర్‌ వద్ద పానీపూరీ వ్యాపారం నిర్వహించే వారు చెబుతున్నారు.‘రుచికరమైన నీటితో నింపి ఇచ్చే పానీపూరీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు సాయంకాలం ఆఫీసు ముగిసిన వెంటనే స్నేహితులతో కలిసి కాసేపు నెక్లెస్‌ రోడ్డులో సరదాగా గడుపుతాను. ఈ సందర్భంగా అందరం కలిసి పానీపూరీలను తింటాము. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే ఈ గప్‌చుప్‌ల రుచి అమోఘం’ అని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీకాంత్‌ అన్నారు.

ఆ అనుభూతే వేరు...
in-the-parkచలిగాలులు వీస్తూ ఒళ్లంతా గిలిగింతలు పెడుతుంటే వేడి వేడి మొక్కజొన్న తింటుంటే కలిగే అనుభూతే వేరు. హుస్సేన్‌ సాగర్‌ వచ్చే వారు ఇష్టపడే వాటిల్లో మొక్క జొన్న పొత్తులకు ప్రత్యేక స్థానం దక్కుతుంది.చలికాలం వచ్చిందంటే ఇక నెక్లెస్‌రోడ్డుకు మహారాజు మొక్కజొన్నే. చాలామంది కాల్చిన మొక్కజొన్నలనే తినేందుకు ఇష్ట పడతారు.వీటి ఖరీదు పది రూపాయలు మాత్రమే.హుస్సేన్‌ సాగర్‌ వద్ద కొందరు గత పదేళ్ల నుంచి మొక్క జొన్న పొత్తులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారంటే ఇక్కడ వీటికి ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రోడ్డున పోయే వాళ్లు ఎంత మంది తింటారో కార్లలో వచ్చే ధనవంతులు కూడా అంతమందే తింటారు.చలికాలంలో మొక్క జొన్నలను అమ్మే వారికి క్షణం తీరిక ఉండదంటే నమ్మండి. ‘వేడి వేడి మొక్కజొన్న తింటూ నెక్లెస్‌రోడ్డులో సరదాగా నడుస్తుంటే ఆ అనుభూతే వేరు. స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనీసం వారానికి ఒకసారైనా హుస్సేన్‌సాగర్‌ చెంతకు వస్తాము. ముఖ్యంగా వీకెండ్స్‌లో నెక్లెస్‌ రోడ్డుకు స్నేహితులందరం కలిసి వచ్చి కొంత సేపు గడుపుతాము. సరదాగా ఆడుతూపాడుతూ మొక్కజొన్నలను ఆస్వాదిస్తాము’ అని డిగ్రీ విద్యార్థిని సుష్మ పేర్కొంది.

ఐస్‌క్రీమ్‌ తినాల్సిందే...

good-placeమధ్యాహ్నం వేళలోనైనా, రాత్రి సమయంలోనైనా వర్షం కురిసినా, చలి గాలులు వీస్తున్నా ఏ వాతావరణంలోనైనా అందరికీ ఇష్టమైనది ఐస్‌క్రీమ్‌. అందరూ తినే ఐస్‌క్రీం ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. ‘హుస్సేన్‌ సాగర్‌ తీరానికి వచ్చాక ఐస్‌క్రీమ్‌ తినకుండా వెళ్ళే సమస్యేలేదు.రోజులో ఒక సారైనా ఇటువైపు రావాల్సిందే వచ్చిన తరువాత ఐస్‌క్రీం తినాల్సిందే’ అని కాలేజీ స్టూడెంట్‌ తరణ్‌ చెప్పాడు. ఇక నెక్లెస్‌ రోడ్డు ప్రాంతంలో వివిధ కంపెనీల ఐస్‌క్రీమ్‌ వాహ నాలు కనిపిస్తాయి. అన్ని కాలాల్లో ఈ ఐస్‌క్రీమ్‌లకు మంచి గిరాకి ఉంటోంది.

కోరుకుంటారు...

etingచేతిలో తినటానికి ఏది పట్టుకున్నా దాహమేస్తే మాత్రం శీతల పానీ యాన్ని కోరుకుంటారు. కూల్‌డ్రింక్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లిన చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరికీ కామన్‌గా ఏదో ఒక కూల్‌డ్రింక్‌ తప్పకుండా కావాల్సిందే.అలాగని ఇక్కడి కూల్‌డ్రింక్‌ల ధర ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. మామూలుగా ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందిక్కడ.స్నాక్స్‌ను తింటూ కూల్‌డ్రింక్‌ను తాగితే ఆ మజాయే వేరని కొందరు యువతీయువకులు పేర్కొంటున్నారు.

పొగలు కక్కే...
మానసిక ప్రశాంతత కావాలంటే ఏ పార్క్‌కు వెళ్ళినా లభిస్తుంది. కానీ నెక్లెస్‌ రోడ్డు దగ్గర మాత్రమే మానసిక ఉల్లాసంతో పాటూ చక్కని ఇరానీ చాయ్‌ కూడా దొరుకుతుంది. అక్కడ ఫ్లాస్క్‌ల్లో టీ, కాఫీలను అమ్మేవారు ఉంటారు. చల్లని వాతావరణంలో వేడి వేడిగా చాయ్‌ తాగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆఫీసుల నుంచి వచ్చేవారు రిలాక్స్‌డ్‌గా కాఫీ తాగడానికే ఇక్కడకు వస్తారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రోజంతా పనితో అలసిపోయిన కొందరు యువతీయువకులు సాయంత్రం పూట కొంతసేపు ఇక్కడికి వచ్చి ఛాయ్‌ తాగుతూ సేద తీరుతూ కనిపిస్తారు. కబుర్లు చెప్పుకుంటూ మానసికోల్లాసాన్ని పొందుతారు.

బోలెడంత ఎంటరటైన్‌మెంట్‌...
popcianఇవే కాకుండా ట్యాంక్‌బండ్‌పై ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్నీ ఉల్లాసపరుస్తుంది. సాగర్‌నుంచి సంగీతంలా వినిపించే చిరుగాలి అందర్నీ ఉల్లాసపరుస్తుంది. లుంబినీ పార్క్‌ వెళ్లి బోట్‌లో కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ తిరగవచ్చు. ఇక కొత్తగా పెళె్ళైన జంటలకైతే ఇలా విహరిస్తుంటే లాహిరి లాహిరి లాహిరిలో... అనే పాట తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇక అక్కడ ముఖ్యంగా కనిపించేది చిలక జోస్యం. నమ్మకాలు కాసేపు పక్కన పెడితే చిలక జోస్యం చెప్పించుకోవడంలో ఎంత మజా ఉంటుందో ఒక సారి చెప్పించుకుంటే గానీ అర్థంకాదు.ఇలా సాగర్‌ వద్ద సరదాలకు అనేక మార్గాలు ఉన్నాయి.

‘నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో కాసేపు గడిపేతే ఆ మధురానుభూతే వేరు. ఇక్కడ జలకాలాటలు ఆడుతూ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. మా పిల్లలైతే వారానికి ఒక్కసారైనా జలవిహార్‌కు వెళ్లకపోతే ఊరుకోరు. పిల్లల కోసమైన మేము అక్కడికి వెళ్తాము’ అని హైదరాబాద్‌ నివాసి ప్రకాష్‌ చెప్పారు. ఇవేగాకుండా తరచుగా నెక్లెస్‌రోడ్డులో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నీ సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగులుస్తున్నాయి.

-ఎస్‌.అనిల్‌ కుమార్‌

No comments:

Post a Comment