విహారాలు

India

Gamyam

Monday, November 1, 2010

సర్వాలంకార శోభితయ్తె వర్థిల్లుతున్న శ్రీ మహశక్తియే వరిగొండ శ్రీజ్వాలాముఖి

jwalamuki
ప్రస్తుతం ఆధ్యాత్మిక టూరిజం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. హిమాలయాలు మొదలుకొని వివిధ ఆలయాలు, ఆశ్రమాలు ఇలా ఒకటేమిటి అనేక ప్రాంతాలను దర్శించేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఇహపరాలు రెండూ కలిసి వచ్చేలా వారు తమ పర్యటనలను రూపొందించుకుంటున్నారు. ఒక్క భారతీయులే కాదు ఈ దేశ మార్మికత, సంప్రదాయాలు పట్ల మోజు పెంచుకునే విదేశీయులు సైతం దేశంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించేందుకు మక్కువ చూపుతున్నారు. హిమాలయాలే కాదు అనేక మఠాలు, ఆలయాలు, ఆశ్రమాలలో కూడా వీరు కనుపిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రాచుర్యం పొందిన క్షేత్రాలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థానికంగా ప్రాముఖ్యత సంపాదించుకున్న ఆలయాలు, ప్రదేశాలు అనేకం. ఈసారి అటువంటి క్షేత్రాన్నే పరిచయం చేస్తున్నాం....

jwalamuki2చాలామంది దేవతల చరిత్ర మాదిరే ‘శ్రీ జ్వాలాముఖి మహాదేవి’ జన్మ వృత్తాంతం తెలియజెప్పే చారిత్రక ఆధారాలు కానీ... ప్రశస్తిని ప్రకటించే స్థల పురాణాదులుగానీ ఏవీ లభ్యం కాలేదు. కానీ జనం నోట వినిపించే ‘జనశృతి’ మాత్రం విస్తృతంగా వుందనేది తెలుస్తోంది. కొన్ని వందల ఏండ్లకు పూర్వం ఒంగోలు సమీపానవున్న పెళ్లూరు సంస్థా నానికి... వెంకటగిరి రాజాలకు మధ్య వైషమ్యాలు ఏర్పడి, వైరంగా పరిణ మించాయి. వెంకటగిరి రాజ్య సైన్యశక్తిని ఎదుర్కొనే బలం పెళ్లూరు సంస్థానా నికి లేకపోవడంతో... అనుభవజ్ఞులు, మిత్రులను పెళ్లూరు వారు సలహా కోర డం జరిగింది. ‘మానవ శక్తి చాలనప్పుడు దైవశక్తిని ఆశ్రయించడం తప్ప చేయగలిందేమీ లేదనే’ శ్రేయోభిలాషుల సలహాల మేరకు, మంత్రశక్తితో మహా శక్తిని వశం చేసుకోవడానికి యజ్ఞం ప్రారంభించారు. ఖర్చుకు వెనుకాడక మహాయజ్ఞ నిర్వహణను చేపట్టారు. ఆ యజ్ఞం వలన మహాశక్తి ఉద్భవిస్తే మను గడ కష్టమవుతుందని భావించిన వెంకటగిరి రాజులు... క్షుద్ర పూజలు ద్వారా యజ్ఞానికి అంతరాయం కల్పించారు. సరిగ్గా ఆ సమయంలో హోమాగ్ని నుం చి ఉల్కలు ఉవ్వెత్తున రేగుతుండగా... ఆ ఉల్కలు, జ్వాలలు మధ్య అఖండ తేజస్సుతో... అరుణారుణ కాంతితో... అద్వితీయరూపంతో... ఆవిర్భవిం చింది ‘‘మహాశక్తి’’.

అయితే ఆవిర్భవించిన శక్తికి ఆహుతి, ఆహారం అందివ్వక పోవడం, పూర్ణహుతి సమర్పించి ప్రసన్నం చేసుకోకపోవడానికి అక్కడ ఎవ్వ రూ లేకపోవడంతో ఆగ్రహించిన మహాశక్తి చుట్టూ వున్న గ్రామాలను తన జ్వా లలతో దహించడం మొదలు పెట్టింది. ఆ ప్రాంతంలోనే పశువులు మేపుతున్న మంత్రవేత్త విషయాన్ని పసికట్టి తాను దాచుకున్న పాలకుండను మహాశక్తికి సమర్పించి శాంతింపజేశాడు. అంతటితో ఆ శక్తి అదృశ్యమయ్యింది. జరిగిన సంఘటనను తెలుసుకున్న అక్కడి గ్రామీణులు అన్ని వివరాలను తెలుసుకుని ఆ మహాశక్తిని ‘జ్వాలాముఖి’ అమ్మవారుగా గుర్తించి పూజించారు. అది మొద లు ఆయా గ్రామాలలో మంటలతోపాటు గ్రామీణుల ఈతి బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అక్కడి వారంతా సుఖశాంతులతో తులతూగారు. ఈ విధంగా భక్తులకు ప్రత్యక్షమైన జ్వాలాముఖి తన అష్టాంశలును గురించి వివరిస్తూ... భక్తుల రక్షణార్థం తాను అష్టస్థానములందు వెలయగలనని ఆనతినిచ్చింది. ఆ ఆనతి ప్రకారమే ఏడు స్థానాలలో అవతరించిన ఆ మహాశక్తి శ్రీ జ్వాలాముఖి, ఎనిమిదవ స్థానంగా వరిగొండ గ్రామంలో అవతరించి నమ్మిన భక్తులను ఆదరిస్తోంది అన్నది ఒక కథనం.

jwalamuki1
వరిగొండ (వరికొండ) కథనం: మునుపు సింహపురి పట్టణానికి అంటే ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరానికి తూర్పున 10 కిలో మీటర్లు దూరంలో వరిగొండ గ్రామం ఉంది. పూర్వం ఆ గ్రామంలో మండలమ్మ అనే గ్రామ దేవత ఉండేదట, ఆ దేవత పేరునే ఆ ఊరు ‘మండలంపేట’ అని పిలువబడుతూ వుండేది. పాడి పంట లతో సశ్యశ్యామలంగా ఉండే ఆ గ్రామంలో వరికుప్పలు కొండలను తలదన్నే ట్లుగా ఉండడంతో వాటిని చూసి ముగ్ధుడైన ఎవరో ఒక ప్రబుద్ధుడు వరి + కొండల్లాగా వుండే ఆ ఊరికి వరికొండ అనే పేరు సార్థకమైనది అన్నాడట. ఆ మహనీయుని వాక్కు ప్రభావమేమోగానీ మండలంపేట వరికొండగా మారింది. క్రమంగా జనం నోళ్లలో ‘కొండ-గొండ’ అయి వరిగొండగా స్థిరపడిపోయిం దని ప్రతీతి. అయితే సంపన్న గ్రామమైన వరిగొండలో ప్రకృతి బీభత్సం వలన ఒకప్పుడు ప్రజలు.., జంతు జాలాలు భయంతో భీతిల్లాయి. పచ్చని పొలాలు చీడపీడలు పట్టి నశించడంమే కాక వింత వ్యాధులు, విషజ్వరాలు సంభవించ డంతో ప్రజలు విలవిలలాడిపోయారు. ఆ ఉపద్రవాన్ని నివారించి కాపాడమని దేవుళ్లు, దేవతలందరికీ ప్రజలు మొక్కుతున్న సమయంలో ఆ గ్రామ పెద్ద కలలో కనిపించి అవతరించింది శ్రీ మహాశక్తి.

ప్రజలను ఈతి బాధలనుంచి రక్షించి, వారి గుండెల్లో కొలువైంది. ఆనాటి నుంచి నేటి వరకూ సర్వాలంకార శోభితయై, భక్త వరప్రదాయినిగా వర్థిల్లుతూ... శ్రీ జ్వాలాముఖి అమ్మవారుగా కొనియాడబడుతోంది. ఆ తల్లి ప్రశస్తి, ప్రభావం, మహిమాన్వితశక్తి, నానాటికీ...ఆనోటా, ఈనోటా వరిగొండ ఎల్లలు దాటి చుట్టూ పట్టూ పల్లెలకు.., సమీప పట్టణాలకే కాక ఖండాంత రాలకు కూడా వ్యాపిస్తోంది.

దర్శనం తప్పని సరి: ఎంతటి కఠినాత్ములైనా.., దైవ దూషణ, దర్శన నిరాకరణ చేసే వారైనా శ్రీ జ్వాలాముఖి అమ్మవారుని తప్పక దర్శించడం విశేషం. అమ్మవారి పిలుపో, తలపో, మహిమో... మహాత్మ్యమో... ఏమో కాని ఆలయ పరిసరాలకు వె ళ్లిన ఎంతటి కసాయి, పాషాణ మనస్కులు కూడా ఒక్కసారైనా ఆమెను దర్శించి తరించాల్సిందే. అలా ఆమె పాదాల చెంతన చేరిన ఎందరినో ఆదరించడంతో పాటు వారిలోని మనో మాలిన్యాలను తొలగించి కోరిన వరాలను ఈడేర్చే తల్లిగా ప్రసిద్థికెక్కింది ఇక్కడి అమ్మవారు.

పోలీసుశాఖ బహుమానం: ఒకనాడు వేకువన అమ్మవారి తలుపులు బార్లా తెరచి వుండడంతో పూజారి హడలిపోయాడు. అమ్మవారి ముందు బోర్లాపడివున్న వ్యక్తిని చూసి ఊర్లోవాళ్లకు తెలపినాడు. గ్రామపెద్దతోపాటు ఊర్లోని వారంతా గద్దించి అడుగగా తాను ఆలయాల దొంగనని చెప్పాడు. ఎన్నో పేరు మోసిన ఆలయాలలో కూడా దొంగ తనం చేశానని, ఇంత శక్తి, పవిత్రత కలిగిన అమ్మవారుని తాను చూడలేదని వివరించాడు. ఆ తర్వాత పోలీసులకు అతన్నఇప్పగించారు. ఎంతో కాలంగా పోలీసుశాఖకు పెను సవాల్‌గా మారిన ఆ దేవళాల దొంగను సులభంగా పట్టించిన అమ్మవారుకు ‘ వెండి వడ్డాణం’ను బహు రించింది అప్పటి పోలీస్‌శాఖ.

మతసామరస్యానికీ వేదిక:హిందువులచేతే కాదు అన్య మతస్థుల చేత కూడా పూజింపబడుతుంది ఇక్కడ అమ్మవారు. వరి గొండ మజరా గ్రామమైన తట్టుగొల్లపాళెంలోని ముస్లింలు వ్యాపారాల నిమిత్తం అప్పట్లో భద్రా చలం వెళ్లేవారు. ఒక ఏడాది వారికి వ్యాపారం లో ఏదో అవాంతారాలు ఏర్పడి తీరని నష్టాలు సంభవించాయి. దీంతో కలత చెందిన వారు శ్రీ జ్వాలాముఖి అమ్మవారుని ధ్యానించి మొక్కుకున్నారు. వెంటనే ముస్లింల కష్టాలు తొలగిపోవడంతోపాటు వారి వ్యాపారాలు లాభాలతో వృద్ధినందుకున్నాయి. తమ జీవితాల్లో మార్పు గమ నించిన ముస్లింలు సొంత నిధులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించారు. అది మొదలు ప్రతి ఏడాది అమ్మవారి దర్శనానికి ముస్లింలు రావడం పరిపాటిగా మారింది. ఇలా మతసామరస్యానికీ ఈ ప్రాంతం వేదికైంది.

జంతు బలులు నిషేధం: మునుపు ఉగ్రదేవతగా వున్న శ్రీ జ్వాలాముఖిని 1975వ సంవత్సరము తర్వాత పూర్తిగా మార్పు చేశారు. శ్రీ రాక్షసనామ సంవత్సరం జేష్టశుక్ల ఏకాదశి గురువారం నాడు జులై 19న శ్రీ వినాయక, నాగ ప్రతిష్ఠలతో కూడా దాత గూడూరు సుబ్బారెడ్డి, అప్పటి ఆలయ ధర్మకర్త నెల్లిపూడి జయరామిరెడ్డిల ఆధ్వర్యంలో అశేష జనవాహిని నడుమ విగ్రహ ప్రతిష్ఠ లు మహా వైభవంగా జరిగాయి. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి నూతన శిలా విగ్రహ శ్రీచక్ర ప్రతిష్ఠాపన మహాకుంభాభిషేకమును శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి స్వహస్తములతో జరిపించారు. అది మొదలు అమ్మవారు ఉగ్రదేవాతా రూపం నుంచి సౌమ్య - ప్రశాంత, ప్రసన్న దేవతగా పరిణా మం పొందింది. తదుపరి జంతు బలలు, రక్త బలులు నిషేధించబడి, సాత్విక నివేదనలు సమర్పించబడుతున్నాయి. నియమిత పద్ధతిలో పూజా కైంకర్య ములు జరుగుతున్నాయి. అనంతరం ఇక్కడి శ్రీ జ్వాలాముఖి ఆలయ ప్రదేశం ఎన్నదగిన యాత్రా స్థలంగా మారింది. ఆమె ప్రతిభ - ప్రాభవం, మహిమ - మహాత్మ్య ములు సుదూర ప్రాంతాలకు వ్యాపించాయి. శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక అలంకరణలతో నిండిన అమ్మవారు కళకళలాడు తోంటుం ది. ఆమె దివ్య దర్శనాన్ని దర్శించి తరించే భక్తులతో ఆలయ ప్రాంగ ణం కిటకిటలాడుతోంటుంది.

ఆలయానికి ఇలా చేరాలి: నెల్లూరు నుంచి ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా పేరొందుతున్న కృష్ణపట్నంకు వెళ్లే రహదారినుంచి కాకుపల్లి వద్ద రోడ్డును వీడి, తోటపల్లిగూడూరు రోడ్డున కిలోమీటరు దూరం ప్రయాణించగా వరిగొండ మజరా గ్రామమైన దేవళాలమిట్ట వస్తుంది. దేవళాలమిట్ట అనగానే ఈ ప్రదేశం దేవాలయాలకు ప్రసిద్ధి అనేది ఆట్టే తెలసిపోతుంది ఎవ్వరికైనా!. దేవళాలమిట్టలో రోడ్డుకు ఉత్తర దిక్కున ఇరువైపులా లక్ష్మీ, సరస్వతుల విగ్రహములు... గజరాజుల రంగు రంగుల ప్రతిమలతో అలంకృతమైన పెద్ద గేటు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే పచ్చని పంటచేల మధ్య సువిశాల మైదానంలో ఒక పెద్ద ఊడల మర్రి, దాని మొదట్లో ఒక మహావాల్మీకం ( పుట్ట) ఉన్నాయి. పశ్చిమవైపున విఘ్నేశ్వనిగుడి, దానికి అటు ఇటు కొద్ది దూరంలో తూర్పు ముఖమై సరస్వతిగుడి - నాగుల గుడి వున్నాయి. వినాయకుని గుడికి ఎదురుగా మహాద్వారా ప్రాకార కళా మండపం, ధ్వజస్థంభం, శిల్ప కళా విరాజిత సింహద్వార శాఖా విరాజితమైన శ్రీ జ్వాలా ముఖి ఆలయం ఉంది.
- తాళ్ళూరు వేంకటరమణ, పెళ్లూరు నాగార్జున
తోటపల్లిగూడూరు,
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

No comments:

Post a Comment