విహారాలు

India

Gamyam

Tuesday, November 23, 2010

అందాలకూ ఆనందాలకూ నెలవు * ‘ పోర్టోరికో ’

 
మన దేశానికి అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎలా ఉన్నాయో-అలానే ‘పోర్టోరికో’ అమెరికా దేశానికి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ప్రాకృతిక సౌందర్యం వెల్లివిరిసే బీచులు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, పర్వత శ్రేణులు, స్పానిష్ కాలనీల్లో నిర్మించిన కోటలు, భూమి మీదే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ‘అరబికో అబ్జర్వేటరీ’ లాంటి ప్రత్యేకతలున్న దీవి ఇది.

శానువాన్‌లోగల లూయిస్ మునో మారిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి మియామి నుంచి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి దిగగానే ఓ చక్కని ఫీలింగ్. హిల్టన్ డబుల్ ట్రీ హోటల్‌లో మా మకాం. మా అధికారిక సంబంధమైన పనులకై రోజూ ఉత్తరాన ఉన్న శానువాన్ నుండి దక్షిణాన ఉన్న గుయామా మధ్య ప్రయాణిస్తూనే సేకరించిన విశేషాలే ఈ వ్యాసం.

చరిత్ర, భౌగోళిక, రాజకీయ వివరాలు
కొలంబస్ రెండోసారి అమెరికా పరిసరాలు చుట్టేసరికి, సుమారు 1493 సంవత్సర ప్రాంతానికి ఈ దీవి స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. దాదాపు 40 యేళ్లు స్పానిష్ పరిపాలనలో ఉన్న పోర్టోరికో- అమెరికన్, స్పానిష్ యుద్ధం తర్వాత అమెరికా అధీనంలోకి వచ్చింది. 1917లో పోర్టోరికన్‌లకు అమెరికన్ పౌరసత్వం లభించింది. 1948 నుండి స్వతంత్ర గవర్నర్‌ల పాలన.

1952లో సొంత రాజ్యాంగం ఏర్పరుచుకున్న వారు, వరుసగా 1967, 1993, 1998లో జరిగిన రిఫరెండముల్లో యథాతథంగా కొనసాగేందుకు ఇష్టపడ్డారు. పోర్టోరికన్‌లకు అమెరికన్ పార్లమెంట్‌లో పాల్గొనేందుకు మాత్రం అవకాశం లేదు. వారికి ప్రత్యేకమైన పతాకం ఉంది. పతాకలో ఎర్ర గీతలు ప్రభుత్వమనే అవయవానికి జవసత్వాల్నిచ్చే రక్తమని, నీల త్రిభుజం... ప్రభుత్వంలోని న్యాయ, రాజ్యాంగ, పరిపాలన విభాగాలని, నక్షత్రం సార్వభౌమత్వానికి చిహ్నమనీ భావిస్తారు.

ఓ పక్క ఉత్తర అట్లాంటిక్ సముద్రం, మరోపక్క కరేబియన్ సముద్రం, మధ్యలో ఉన్న ఈ దీవి 13,790 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 501 కిలోమీటర్ల సముద్ర తీరంతో, దాదాపు 40 లక్షల జనాభాతో విలసిల్లుతోంది. ఈ ద్వీపం కరేబియన్ దీవులన్నిటికీ ఫ్యాషన్ క్యాపిటిల్ అని వాళ్లు గర్వంగా చెబుతారు. 2006లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పోర్టోరికన్ బ్యూటీ ‘జులైకా రివెరా’ విజయం సాధించింది. గోల్ఫ్, రాకెట్ బాల్, బీచ్ వాలీబాల్, హార్స్ బ్యాక్ రైడింగ్ వారి ప్రధాన క్రీడలు.

ఫోర్ట్ శాన్ ఫెలిప్ డెల్ మొర్రో
స్పానిష్‌వారు కరేబియన్ దీవులకు ముఖద్వారంగా ఉన్న ఈ దీవికి ‘ఫైన్ లేక రిచ్ పోర్ట్’ అని పిలవటం మొదలెట్టారు. ఇదే చివరికి పోర్టోరికో అయ్యింది. ప్రత్యర్థుల నుంచి భద్రత కోసం ఎత్తయిన ప్రదేశంలో రాజు ఫిలిప్-2 గౌరవార్థం కట్టిన ‘ఎల్ మొర్రో’ మాసనీరీ టవర్ ‘శాన్ ఫిలిప్ డెల్ మొర్రో’గా గుర్తించబడింది. ఈ దుర్భేద్యమైన కోట స్పానిష్ వారికి కీలకమైన స్థావరం. 1797లో ఏడు వేల మంది బ్రిటిష్ సైనికులు సైతం దీన్ని ఛేదించలేకపోయారు.

ఈ కోటకు దగ్గర్లో సెయింట్ క్రిస్టోఫర్ గౌరవార్థం కట్టిన మరో కోట ‘కాజిలో డి శాన్ క్రిష్టోబల్’ ఉంది. 1898లో జరిగిన స్పానిష్-అమెరికన్ యుద్ధం తర్వాత జనరల్ నెల్సన్ ఆధ్వర్యంలో అమెరికన్ సేనలు ఆ కోటను అధీనంలోకి తీసుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో ఈ కోటలు ‘నేషనల్ హిస్టారిక్ ప్రదేశం’గా యునెటైడ్ నేషన్స్‌చే గుర్తించబడ్డాయి. ఈ కోటలెప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. ఎంతోమంది సైనికులు పోరాడిన ప్రదేశంలో ఇప్పుడు సందర్శకులు గాలిపటాలు ఎగరేసుకుంటూ సేద తీరడం ఆశ్చర్యమనిపిస్తుంది.

సప్త సముద్రాల ఆవల ‘తంత్ర’
ఇడ్లీ, దోశ, సమోసా, ఆవకాయ అన్నం రుచి చూసిన నాలుక చప్పబడిపోయింది, ఎలా అనుకుంటున్న మమ్మల్ని, మిత్రుడు పోర్టోరికన్ లూయిస్ మెర్కాడో పాత శానువాన్ కోట ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. ‘చెఫ్ రమేష్ పిళ్లై’స్ తంత్ర - ఇండో లాటినో కుజిన్’ అన్న బోర్డు చూసి కాస్త ఆశ్చర్యపడ్డాం.

అడుగిడగానే ఎదురైన వినాయకుడు, సరస్వతి విగ్రహాలు, నాగదేవత బొమ్మ మమ్మల్ని మరింత థ్రిల్‌కి గురిచేశాయి. సమోసాలు, దోశ-సాంబార్, అప్పడాలు, కిచిడీ, కేరళ వెజిటేరియన్ కుర్మా... మెనూ చదువుకుంటూ వెళ్తే మతిపోయింది.

రమేష్ పిళ్లై తమిళనాడులో ‘నాగర్ కోయిల్’లో పుట్టి, చెన్నైలో పాకశాస్త్ర పట్టా సాధించి ప్రపంచాన్ని చుట్టిన చెఫ్! కార్పొరేట్ చెఫ్‌గా ఫజార్డోలోని ఓ రిసార్ట్‌కు అడుగిడిన రమేష్, సౌత్ ఇండియన్ వంటలను పోర్టోరికో సంప్రదాయ వంటలకు జోడించి సొంతగా ప్రారంభించిన రెస్టారెంట్ ‘తంత్ర’.

మాకంటే మాతోపాటు వచ్చిన లూయిస్ మెర్కాడో (పోర్టోరికన్), టెర్రీబ్రియన్ (అమెరికన్) తండూరీ వంట లన్నీ లొట్టలేసుకుంటూ తినడం నాకింకా గుర్తుంది. కరేబియన్ లాబ్‌స్టర్, రెడ్ స్నాపర్, ఓయిస్టర్స్ లాంటి సీఫుడ్ విపరీతంగా దొరుకుతుంది. వైన్‌లు, లోకల్ బ్రాండ్ ‘మెడల్లా’ బీర్‌లకు లోటే లేదు. లాటిన్, ఏషియన్, థాయ్, చైనీస్, ఐరిష్, ఫ్రెంచ్, స్పానిష్ వంటకాలందించే రెస్టారెంట్లు కోకొల్లలు.

ప్రపంచ ప్రఖ్యాత అరబికో అబ్జర్వేటరీ
కార్నెల్ యూనివర్సిటీ మరియు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు పరిశోధనలు సాగించే ఈ అబ్జర్వేటరీ, 13 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలో ఉంది. గోల్డెన్ ఐ, కెప్టెన్ రాన్-కాంటాక్ట్ సినిమాల్లో ఇది కనిపిస్తుంది.

‘యెల్ యుంకీ’ నేషనల్ ఫారెస్ట్
ప్రపంచంలో ఏడు ప్రాకృతిక వింతల పోటీల్లో నిలబడినదిగా పేరొందిన రెయిన్ ఫారెస్ట్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ! 28,000 ఎకరాల విస్తీర్ణంలో శానువాన్‌కి తూర్పు, ఉత్తర భాగాల్లో ఉన్న ఈ కీకారణ్యంలో 150 ఫెర్న్ జాతులు, 240 వృక్ష జాతులున్నట్టు అంచనా. ఈ 240లో 23 జాతుల వృక్షాలు ప్రపంచంలో మరెక్కడా లేవని ప్రతీతి! కోక్వీ ట్రీ ఫ్రాగ్, పోర్టోరికన్ పేరెట్, పిగ్మీ ఎనోల్ లాంటి జంతువులు ఈ అడవికి మాత్రమే ప్రత్యేకం. సంవత్సరానికి సుమారు పది లక్షల సందర్శకులు వస్తారని అంచనా. పోర్టోరికాకి ఆదిమ జాతిగా చెప్పబడే టైనో ఇండియన్స్ భాషలో ‘యుంకీ’ అంటే పవిత్రమైన నేల అని అర్థమట. హైకింగ్ ప్రేమికులకు, ప్రకృతి ఆరాధకులకు ఇది భూతల స్వర్గం.

మజా కోరుకుంటూ కాసినోలు, పబ్‌లు వెదుక్కొనే జల్సా, సల్సారాయుళ్లకైనా, ప్రకృతి ఆరాధనలో మైమరచిపోయే మృదు స్వభావులకైనా; స్విమ్మింగ్, పాడిల్ సర్ఫింగ్, కైట్ సర్ఫింగ్, బీచ్ వాలీబాల్ అంటూ జల క్రీడలకు సిద్ధమైపోయే బిందాస్ జంటలకైనా; మందే మనకు ముఖ్యమంటూ మత్తులో చిత్తయిపోయే మందు దాసులకైనా; రకరకాల రుచులకై ‘వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్’ అంటూ జిహ్వ చాపల్యం గల తిండిబోతులకైనా... ఇలా ఎలాంటి టూరిస్టులకైనా సేదదీరుస్తామనే ‘నైస్ ఫోర్ట్’ పోర్టోరికో!

‘పోర్టోరికో’ ప్రత్యేకతలు

స్పానిష్, టైనో ఇండియన్ మరియు ఆఫ్రికన్ సంస్కృతులు కలగలిసి ఉద్భవించిన జాతే పోర్టోరికన్.

స్పానిష్ మరియు ఇంగ్లిష్ అధికార భాషలైనా, ఎన్నో యేళ్లు స్పెయిన్ పాలనలో ఉండడం వలన స్పానిష్ ప్రభావం ఎక్కువ.

అధికారిక కరెన్సీ ‘అమెరికన్ డాలర్’, కానీ ‘పెసో’ అని పిలుస్తారు. ప్రఖ్యాత రమ్ బ్రాండ్ ‘బకార్డీ’ జన్మస్థలం ఇదే.

ప్రపంచంలోనే అతి పెద్దదైన సింగిల్ డిష్ రేడియో టెలిస్కోప్ (1000 అడుగుల వ్యాసార్థం) దాదాపు 20 ఎకరాలలో ఉంది. 10 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు పరిశోధించగల సామర్థ్యం ఉన్న ఈ టెలిస్కోప్‌కు మాత్రమే భూమిమీద ఆస్టరాయిడ్స్ ఎక్కడ, ఎప్పుడు పడగలవో కచ్చితంగా అంచనా వేయగల శక్తి ఉంది.

ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో 55, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 178 పోర్టోరికోలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. లైలా, ఫైజర్, డెక్స్‌టర్ వంటి ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడే కేంద్రీకరించాయి.

అమెరికాలో వినియోగించే 50 శాతం పేస్ మేకర్స్, డిఫ్రెబ్రిలేటర్స్ అవసరాలను పోర్టోరికో తీరుస్తోంది.

పోర్టోరికో అందాల భామలు అయిదుసార్లు మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలకు వేదికైన తొలి లాటిన్ అమెరికన్ దేశంగా కూడా గుర్తింపు కొట్టేసింది.

- పి.హరినారాయణరెడ్డి

1 comment: