విహారాలు

India

Gamyam

Friday, September 14, 2012

అద్భుత సౌందర్యం ఆన్గ్‌కార్ వాట్ ఆలయం

 కొద్దిరోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధ ఆన్గ్‌కార్ వాట్ దేవాలయాన్ని సందర్శించే అవ కాశం కలిగింది నాకు. కాంబోడియా దేశంలోని సయాంరీప్ రాష్ట్రంలో ఉన్న ఈ వైష్ణవ దేవాలయం ప్రపంచంలోని హిందూ దేవాలయ సముదాయాలన్నిటిలోకి అతి పెద్దది. అద్భుత శిల్ప నైపుణ్యంతో కూడుకున్నది. ఈ 12 వ శతాబ్దపు కట్టడం 400 ఏళ్లపాటు అడవిలో అజ్ఞాతవాసం చేసి 20 వ శతాబ్దంలోనే మళ్లీ వెలుగులోకి వచ్చిందంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఒకటిన్నర రోజు ఆ దేవాలయ ప్రాంగణమంతా తిరిగి మేము చూసిన విశేషాలు....

మా అబ్బాయి ఆదిత్య సింగపూర్‌లో ఆసియా-పసిఫిక్ దేశా గూగుల్ సంస్థల మానవ విభాగానికి డైరెక్టరుగా పని చేస్తున్నాడు. మా కోడలు పారుల్, మనవరాలు కనక్ కూడా అక్కడే ఉంటారు. వాళ్లతో కొంతకాలం గడుపుదామని నేను, నా శ్రీమతి విజయలక్ష్మి మొదటి సింగపూర్ వెళ్లాం. అక్కడి నుంచి ఆగస్టు 24 న బయలుదేరి కాంబోడియాలోని సయాంరీప్‌కు వెళ్లాం. భారతీయులకు విమానాశ్రయంలోనే వీసా పొందేవీలుంది. కాబట్టి ఐదు నిమిషాల్లో ఆ పని ముగించుకుని మేము ముందుగానే రిజర్వు చేయించుకున్న 'బోర్ ఆన్గ్‌కార్' అనే హోటల్‌కు చేరుకున్నాం.
http://i.telegraph.co.uk/multimedia/archive/02159/siem-reap620_2159798b.jpg
బోర్ ఆన్గ్‌కార్ ఒక ఫైవ్‌స్టార్ హోటల్. ఐదు లక్షల జనాభా కలిగిన సయాం రీప్ నగరం నడిబొడ్డులో ఉంది. ఆ సాయంత్రం రెండు 'టుక్-టుక్'లను తీసుకుని దగ్గరలో ఉన్న నైట్ మార్కెట్‌కు వెళ్లొచ్చాం. 'టుక్-టుక్' చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక మోటార్ సైకిల్‌కో లేక మోపెడ్ కో ఆటో వెనుక భాగాన్ని తగిలించి ప్రయాణీకులను తిప్పుతారు. లోపల కూర్చున్నవారికి వాన, ఎండ తగలకపోయినా నడిపేవారికి మాత్రం ఏ ఆసరా ఉండదు. మేం నైట్‌మార్కెట్‌కు వెళ్లడానికి 8000 కాంబోడియా రియల్స్ ఇచ్చాం. రాత్రి భోజనం చేసిన చోట 90,000 ఇచ్చాం. ఆ తరువాత అర్థమయింది మాకు, కాంబోడియా కరెన్సీ విలువ చాలా తక్కువ అని. ఒక అమెరికన్ డాలర్‌కు 4000 రియల్స్ మారకం రేటు. రియల్స్‌కంటే డాలర్ల చలామణీయే ఎక్కువ అనిపించింది మాకు.
'ఆన్గ్‌కార్ వాట్'కు వెళ్లి రావడానికి 45 డాలర్లకు కారు, 35 డాలర్లకు గైడ్, మా నలుగురికి కలిపి 80 డాలర్ల ఎంట్రీ ఫీజు-మొత్తం 160 డాలర్ల ఖర్చుతో అన్నీ సమకూరాయి. మొదటిరోజు పగలంతా, రెండో రోజు ఉదయం కూడా అక్కడే గడిపాం. అంత గొప్ప అనుభూతి గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు.తెలియకుండానే నాలుగైదు కిలోమీటర్లు అలసట లేకుండా తిరిగాం.

రాజధాని యశోధరపురం
ఇప్పుడు ఆన్గ్‌కార్ వాట్ ఉన్న ప్రదేశం ఒకనాడు ఆ దేశ రాజధాని. అప్పుడు దాన్ని యశోధరపురం అనేవారు. ఖ్మేర్ రాజవంశస్థుడైన రెండవ సూర్యవర్మన్ దీన్ని నిర్మించాడు. తన పూర్వీకుల మతమైన శైవాన్ని దూరం పెట్టి, ఆన్గ్‌కార్ వాట్ దేవాలయాన్ని విష్ణు దేవుడికి అంకితమిచ్చాడు సూర్యవర్మన్. మొదట హిందువుల ఆలయంగా ఉన్నప్పటికీ, ఆ తరువాత బౌద్ధుల ఆరామంగా కూడా వుంటూ వచ్చింది. సాంప్రదాయిక ఖ్మేర్ వాస్తుకళకు ముమ్మూర్తులా ప్రాతినిధ్యం వహించే విధంగా మలిచిన ఈ దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు అడవిలో ఎవరికీ కానరాని విధంగా చెట్ల మధ్య-పుట్టల మధ్య జాడ తెలియకుండా ఉండిపోయింది.

ఇప్పుడు ఆన్గ్‌కార్ వాట్ కాంబోడియా సంస్కృతీ-సాంప్రదాయాలకు ప్రతీకగా ఆ దేశ జాతీయ జండాపై దర్శనమిస్తుంది. హిందూ పురాణాలలో దేవ తల నిలయంగా పేరొందిన మేరు పర్వతం తరహాలో దీనిని డిజైన్ చేశారు. దేవాలయ సముదాయం చుట్టూతా ఎల్లప్పుడూ నీటితో నిండివుండే వెడల్పాటి కందకం ఉంది. సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడ కూడా ఆలయం చుట్టూతా ఉంది. వీటికి అదనంగా దీర్ఘ చతురస్రాకారంలో వున్న మూడు గ్యాలరీలు  ఒకదానికంటే మరొకటి ఎత్తుగా ఉండే విధంగా ఆన్గ్‌కార్ వాట్ చుట్టూ వున్నాయి.
http://www.interessantes.at/angkor-wat/angkorwat12.jpg
టెంపుల్ సిటీ
ఆంగ్లంలో ఆన్గ్‌కార్ వాట్ అంటే 'టెంపుల్ సిటీ'. ఖ్మేర్ భాషలో 'దేవాలయాల నగరం' అని అర్థం. లోగడ ఈ దేవాలయాన్ని ఖ్మేర్‌లో 'ప్రేహ్ పిష్ణులోక్' (సంస్కృతంలో 'వర విష్ణులోక') అనేవారు. దీనికి అతి సమీపంలోనే శివుడికి అంకితం చేసిన 11వ శతాబ్దంనాటి 'బాఫువాన్'దేవాలయం కూడా ఉంది. అదీ చూడదగ్గ స్థలమే.
http://farm4.static.flickr.com/3052/3070806814_79b354737b.jpg
ఆన్గ్‌కార్ వాట్ దేవాలయం నిర్మాణం ఇంకా కొంచెం మిగిలి వుండగానే, రాజా సూర్యవర్మన్ చనిపోవడంతో, పని ఆగిపోయింది. కొన్నేళ్లు గడిచాక, ఏడవ జయవర్మన్ రాజయ్యాడు. 'ఆన్గ్‌కార్ థాం' పేరుతో ఆన్గ్‌కార్ వాట్‌కు ఉత్తర దిక్కుగా నూతన రాజధానిని, అధికారిక దేవాలయంగా 'బాయాన్'ను నిర్మించారాయన. పదమూడవ శతాబ్దంనాటికి ఆన్గ్ కార్ వాట్ హిందువుల అధీనంలోంచి క్రమేపీ థెరవాడ బౌద్ధుల చేతుల్లోకి పోయింది. నేటికీ ఒక విధంగా అలానే ఉందనాలి. ఆ మాటకొస్తే ఏ దేవుడికీ పూజా పునస్కారాలు లేవక్కడ. ఒకనాడు జరిగిన దాఖలాలు కూడా లేవు.

ఆలయమంతా తిరుగుతూ దక్షిణం వైపున్న టవర్ కింది భాగంలోని విష్ణుమూర్తి భారీ విగ్రహం దగ్గరకు వెళ్ళాం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి ఎనిమిది చేతులున్నాయి. ఖ్మేర్ భాషలో ఆ మూర్తిని 'టారీచ్' అంటారు. బహుశా ఆన్గ్‌కార్ వాట్ దేవాలయ ప్రధాన పూజా విగ్రహం ఇదే అయ్యుండాలి. ఈ విగ్రహానికి కూడా పూజా పునస్కారాలు ఏమీ లేవు.
http://blog.zeemp.com/wp-content/uploads/2010/11/cambodia_angkor_5.jpg
కొద్దిదూరంలో తల-చేతులు నరికేసిన లక్ష్మీ దేవి భారీ విగ్రహం ఉంది. బహుశా ఏదో దండయాత్రలో అలా జరిగుండాలి. టవర్ల మధ్య గ్యాలరీలున్నాయి. గోపురానికి రెండువైపులా 'ఏనుగు ద్వారాలు'గా పిలువబడే రెండు మార్గాలున్నాయి. వెలుపలి గ్యాలరీ నుంచి లోపలి ఒక భాగాన్ని కలిపే ప్రదేశానికి 'వేయి దేవుళ్ల హాల్' అని పేరు. శతాబ్దాల తరబడి యాత్రికులు వస్తూ, వస్తూ బుద్ధుడి విగ్రహాలను తెచ్చి వేసి పోయేవారట. తల భాగం తీసేసిన మొండేలుగా ఉండడంతో అతి జుగుప్సాకరంగా కనిపిస్తుంది. వెలుపలి గ్యాలరీలోని లోపలి గోడలపైన హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో గాథలను చెక్కారు. హిందువుల పురాణగాథలలోని 32 నరకాలను, 37 స్వర్గాలను కూడా చెక్కారు. తూర్పువైపున వున్న గ్యాలరీ గోడపై సముద్రమథనం దృశ్యం, ఉత్తరం వైపు గ్యాలరీ గోడపై శ్రీకృష్ణుడు పూతనను వధించడం మొదలైన దృశ్యాలున్నాయి.
ఈజిప్టు 'ఖాఫ్రే' పిరమిడ్ కట్టడానికి ఎంత కంకరరాయి అవసరమైందో - సుమారు ఏభై లక్షల టన్నులు - అంతే రాయిని ఆన్గ్‌కార్ వాట్ నిర్మాణానికి ఉపయోగించారని చెపుతారు.

పరిరక్షించాలి
భారత పురాతత్వ శాఖ వారు పాతికేళ్ల క్రితం ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి కొంత కృషి చేసినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. ఆన్గ్‌కార్ వాట్ ప్రాంగణాన్ని, అక్కడికి వెళ్లే దారిని, ఆ పరిసరాలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. దేశ, విదేశీ యాత్రికుల ఆసక్తిమేరకు వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వం దాన్ని ఒక పర్యాటక స్థలంగా మార్చడమైతే చేసింది కాని, అంతకు మించి శ్రద్ధ కనపరుస్తున్న దాఖలాలు లేవు. వాస్తవానికి ఈ దేవాలయన్ని బాగు చేసి అన్ని హంగులూ సమకూర్చగ లిగితే, తిరుపతి కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తారనడంలో సందేహం లేదు. భారత ప్రభుత్వం, తిరుపతి తిరుమల దేవస్థానాలు కలిసి, ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో! హిందూ మతోద్ధరణకు కంకణం కట్టుకున్నామని చెప్పే భారతదేశ మతపెద్దలు ఎంతమంది ఇక్కడకు వచ్చారో తెలియదు కాని, వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూమతాభిమానులలో ఉత్తేజాన్ని కలిగించి, వారి దగ్గరనుంచి వచ్చే విరాళాలతోనైనా, ఆన్గ్‌కార్ వాట్‌లోని విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి.
http://beautifulplacestovisit.com/wp-content/uploads/2010/04/Angkor_Wat_Cambodia1_Sunrise.jpg
సూర్యోదయం 
ఆన్గ్‌కార్ వాట్‌ను సందర్శించాలనుకునే వారు, ముందుగా, 'అప్సర అథారిటీ' కార్యాలయం నుంచి, ఒక్కో వ్యక్తికి రోజుకు 20 డాలర్ల చొప్పున చెల్లించి, ఫోటో ఐడెంటిటీతో సహా ఎంట్రీపాస్ కొనుక్కోవాలి. ఒకేసారి మూడురోజులకు, వారం రోజులకు కూడా కన్సెషన్ ధరలో కొనవచ్చు. దేవాలయాల సముదాయం మొత్తం చూడాలంటే, సుమారు ఐదుకిలోమీటర్ల దూరం ఎత్తు-పల్లాల బాటలో నడవాలి. చీకటిపడితే చేతిలో బాటరీ లైట్ తప్పనిసరిగా ఉండాలి. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. మేం వెళ్లిన మొదటిరోజున వర్షం పడుతుంటే గొడుగుల సహాయంతో తిరిగాం. రెండో రోజున ఉదయం నాలుగున్నరకే అక్కడికి చేరుకున్నాం. ఆన్గ్‌కార్ వాట్ దేవాలయం గోపురాల మధ్య నుంచి, ఎదురుగా ఉన్న నీటిలో నీడ పడుతూ కనిపించే సూర్యోదయాన్ని వీక్షించడానికి మాతో పాటు వేలాదిమంది దేశ, విదేశీ పర్యాటకులున్నారక్కడ. తెల్లవారే వరకు పూర్తి చీకటే. అడుగులో అడుగు వేసుకుంటూ, బ్యాటరీ కాంతిలో నెమ్మదిగా సూర్యోదయం కనిపించే స్థలానికి చేరుకున్నాం. అక్కడ సూర్యోదయం చూడటం నిజంగా అద్భుతమైన దృశ్యం!
http://www.devata.org/wp-content/uploads/2010/01/1967-03-Jackie-03.jpg
Raising toasts at the ceremonious dinner, Prince Sihanouk and his wife Princess Monique stand at Jackie's left. Cambodian Prime Minister Son Sann is on her other side.

కెనడీకి విందు
వియత్నాం యుద్ధం జోరుగా కొనసాగుతున్న రోజుల్లో, అలనాటి కాంబోడియా అధినేత ప్రిన్స్ నోరోడం సిహనౌక్, అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ సతీమణి జాక్విలిన్ కెన్నెడీ జీవితాభిలాషైన ఆన్గ్‌కార్ వాట్ సందర్శన కోసం, ఆమెకు ప్రత్యేకంగా కాంబోడియాలో విందు ఏర్పాటు చేశాడు!
http://files.myopera.com/ANGKORwelcome/albums/5896572/angkor_wat_rear.jpg
దేవుళ్ల నివాసం
 భారతదేశానికి చెందిన ఒరిస్సా శిల్పకళా సాంప్రదాయాలు, చోళుల కాలానికి చెందిన తమిళనాడు దేవాలయాల సాంప్రదాయాలు ఇందులో అక్కడక్కడా కనిపిస్తాయి. దేవుళ్ల నివాసస్థలమైన మేరు పర్వతాన్ని పోలిన విధంగా దీని డిజైన్ వుంటుందని చెప్పా కదా. మేరు పర్వతానికి ఉన్న విధంగానే, వాటి శిఖరాల స్థానంలో నాలుగు దిక్కులా చతురస్రాకారంలో నాలుగుగోపురాలు, మధ్యలో మరో గోపురం ఉంటాయి. ఈ కట్టడానికి ఇసుకరాళ్లు, లాటరైజ్ ఖనిజం ఉపయోగించారు. ప్రహరీగోడ పొడవు 1024 మీటర్లు, వెడల్పు 802 మీటర్లు, ఎత్తు 4.5 మీటర్లు. 30 మీటర్ల పొడవు-వెడల్పు ఉన్న పచ్చిక బయలు గుడి చుట్టూతా వుంటుంది. దేవాలయానికి వెళ్లడానికి తూర్పు-పశ్చిమ దిక్కులలో మట్టివంతెన లాంటివి ఉంటాయి. మధ్య మధ్య కట్టెలతో తయారు చేసిన వంతెనలుంటాయి.

- వనం జ్వాలా నరసింహారావు
jwala99@gmail.com