ఇరవై ఐదేళ్ళ నుంచి వింటున్నాను నేను ... మల్లెమడుగు, కూటాలమర్రి ఊరి పేర్లను... కడప, నెల్లూరు జిల్లాలను వేరుచేస్తూ హిమాలయాల వరుసలా కనిపించే వెలిగొండల శ్రేణుల మధ్య సంచరించే సాధువుల నోటా, బైరాగుల నోటా, మూలికా వైద్యుల నోటా, వెదురు కాంట్రాక్టర్ల నోటా, ఫారెస్టుగార్డుల నోటా, యానాదుల నోటా. ఆ రెండు పేర్లను వినగానే నాలో ఏవో మార్మిక స్పందనలు... మహా అంటే నేనుండే ప్రాంతం నుంచి నూట ఇరవై కిలోమీటర్లు కూడా ఉండవవి. నాగరిక జీవనభ్రమా జనిత ఒత్తిళ్ళు, నేనూ నా సమూహ సమాజం ఉనికి కోసం అనుక్షణమూ జరిపే పోరాటంలోని నిరుపయోగపు తీరికలేనితనం నన్ను ఇన్నేళ్ళూ ఆ అద్భుత దృశ్యకావ్య లోయప్రాంతాల నుంచి విడదీస్తూ వచ్చాయి.
చివరికి ఒకరోజు తిరుపతి నాగరాజుకు ఫోను చేశాను. సర్వదా సిద్ధం అంటూ అతను తలకోన అడవి పాదాల ఒక కుగ్రామంలో జీవించే అడవి ఆనుపానులు తెలిసిన పఠాను మస్తాన్‌ఖాన్‌ను తోడు తీసుకుని బయలుదేరాడు. ఇటు నేనూ, వృద్ధ బలుడైన బాలచంద్రుడూ గూడూరు చేరి రాపూరు బస్సెక్కాము. ఉత్తర దక్షిణాలుగా వ్యాపించిన వెలిగొండల శ్రేణిని పడమటి నుంచి వాళ్ళు, తూర్పు నుంచి మేము శరవేగంగా సమీపించాం. నాలుగు గంటల ప్రయాణం తర్వాత రాపూరు-చిట్వేలి ఘాట్‌లోని ఎత్తయిన వెలిగొండల నడినెత్తిన వొకర్నొకరు కలుసుకుని కరచాలనం చేసుకున్నాం ఉద్విగ్నంగా... అప్పుడప్పుడూ అరుస్తున్న పేరు తెలియని అడవి గువ్వల అరుపుల మధ్య... అడవి చెట్ల మధ్య... వొంపులొంపులు తిరిగి కనుమలోకి అదృశ్యమవుతున్న మల్లెమడుగు లోయ దారి మమ్మల్ని స్వాగతించింది... హృదయపూర్వకంగా...
సమ్మోహన నిశ్శబ్దం...
తెల్లటి బూజర మేఘాల దొంతరల మధ్య నుంచి కమ్మటి అడవిచెట్ల పచ్చి సువాసనను పీలుస్తూ బ్యాగులు భుజాలకు తగిలించుకుని లోయలోకి సాగిపోయాం ధైర్యంగా. ఆకాశాన్నంటే చెట్లు, అడవి ఆకుల పూల సుగంధాల మధ్యలో మెలికలు తిరుగుతూ కాలు నిలపలేని అడవి గుండురాళ్ళ మీద... ఆయాసపు యెగుడూ... ఎవడో నెట్టినట్టు తోసేసే దిగుడూ మార్గంలో ఒక కిలోమీటర్ దూరం నడిచాక భూ దిగంతాల కనుచూపు మేరా ఆక్రమించిన విశాలమైన లోయ- ఆ లోయ సమ్మోహన నిశ్శబ్ద ధ్యానంలో నిలువెల్లా తడిసిపోయాం. కనుచూపు పరిమితికి లొంగని ఆ విశాల లోయను అరగంట మౌనంగా వీక్షించాక యెక్కడో దూరాన జలపాతపు సవ్వడి వినిపించింది హోరున. ఆ తర్వాత పేరులేని పక్షి అరుపు సుదూరంగా క్వావ్.. క్వావ్ అంటూ.
లోయ నింపిన ట్రాన్స్‌లో గుండెల నిండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ కిందికి దిగి సాగిపోయాం. దిగేకొద్దీ... చీకటిగా... అక్కడక్కడా మా తలలపై వందల అడుగుల్లో కొండ అంచుపై దట్టంగా పెరిగి ఆకాశాన్నంటుతున్న మహావృక్షాల కొమ్మల ఎండ పొడల మధ్య... వెలుగు చీకట్ల సంధి ప్రదేశాలలో గలగలా సవ్వడులతో ప్రవహించే వాగువంకలు దాటుకుంటూ... ఉండుండి వినిపించే చిత్ర విచిత్ర పక్షుల నానావిధ సంగీత సవ్వడుల సునిశిత కూతల మధ్య రెండు కొండల నడుమ లోయలోకి నడుస్తూ అడవితల్లి సౌందర్యాన్ని విభ్రాంతితో నిశ్చేష్టులై చూస్తూ... ఆమె గర్భంలోకి నిర్భయంగా... నిరాయుధంగా... జ్ఞాన రహితంగా... అచేతనంగా ఎవరో మంత్రించినట్టు అలా సాగిపోయాం. ఎన్ని లక్షల రకాల చెట్లు, పురుగులు, మొక్కలు, పిట్టలూ... ఎప్పటికీ బంధించలేడు అల్పమానవుడు వీటిని తన డొల్ల పుస్తకాలలో... కెమెరాలలో.
చింతచెట్టు నీడలో చింతలు మరిచి...
అలా అడవి సౌందర్యపు కైపులో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాక 'సుస్వాగతము', 'అథర్‌సిన్హానగర్' కూటాలమర్రి అనే బోర్డును చూసి ఆశ్చర్యపోయాము. ఎవరీ ఉత్తర భారతీయుడు; ఈ నిర్జనారణ్యంలో ఇతనికి పని ఏమి? యానాది పాపులను సంస్కరింప వచ్చిన క్రీస్తు మత ప్రచారకుడా? అని ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి. అయితే ఇంత కాలానికి, ఇంత దూరానికి కూటాలమర్రిని చూడగలిగాననే సంతోషం ముందు ఆ సందేహాలన్నీ ఆవిరయ్యాయి. తరు, లత, ఫలవృక్షాల కొమ్మల ఆకుల సందుల్లో లీలగా గోచరిస్తున్న కూటాలమర్రి పూరిళ్ళ కప్పులు చూస్తూ బాట పక్కనే ఉన్న ఒక పూరింటి వద్ద ఆగాం... గడప తలుపుకు కేవలం గడిపెట్టి ఉంది. ఎంత అరిచినా ఎవరూ లేరు. ఆశ్చర్యపోతూ ఊరిలోకి ప్రవేశించాం.
అర్ధశిథిలమైన పదీ... ఇరవై ఇళ్ళు కనిపించాయి. ఊరికి పడమటగా అనేక చెట్ల మధ్యలో భూమిని తాకేలా వేలాడే చింతకాయల్ని మోస్తున్న ఒక చింత చెట్టు కిందకు చేరాం. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ అబాండన్డ్ విలేజ్ (ఖాళీ ఊరు) మాలో ఉత్సుకతను మరింత పెంచింది. అనంతమైన సందేహాలకు మా పూర్వజ్ఞానం మాకిస్తున్న సమాధానాలు సముదాయించలేక పోతున్నాయి. తెచ్చుకున్న జొన్న రొట్టెల్ని... పండు మిరపకాయ పచ్చడితో నంచుకుని రెండు డజన్ల అమృతపాణి అరటిపళ్లను తొక్కలుగా మార్చాక దగ్గరలో కన్పించిన బావిలోని చేతికందే నీళ్ళను వాటర్ బాటిల్‌తో ముంచుకొని తాగి, ఆ చింతచెట్టు నీడలోనే చింతలు మరిచి ఇరవై నిమిషాల పాటు నిద్రించాం. అది మధ్యాహ్నం సాయంత్రంలోకి తొలి అడుగులేస్తున్న సందర్భం.
మళ్ళీ కనుమలో ప్రయాణం... తెల్లటి మట్టి బురద చాళ్ళలో మోకాలి లోతు వాగుల నీళ్ళను దాటుకుంటూ... కడుపు నిండా తాగుతూ... అలా ఒక వాగుదాటే క్రమంలో దూరంగా నీళ్ళు తాగుతున్న ఒక కుర్ర గోధుమరంగు చిరుతను చూసి స్థాణువులమయ్యాం... అరికాళ్ళలో ప్రారంభమైన వొణుకు శరీరమంతా వ్యాపిస్తూ భయస్వరూపం అంతరంగానికి చేరింది. ఎప్పుడో పంతొమ్మిది వందలా ఇరవైలకు ముందు విలియమ్ బట్టర్‌వర్త్ ప్రస్తుతం మేము సంచరిస్తున్న చిట్వేలి రిజర్వ్ ఫారెస్ట్‌లో తిరిగే 'ఇబ్బంది గండు' అనే పులి, చిరుతల మధ్యరకం జంతువుల గురించి రాసిన విషయం గుర్తొచ్చింది. మళ్ళీ నడక... ఈసారి భయం భయంగా... అయినా అడవి సౌందర్య మోహం క్రమంగా మా భయాంతరంగాన్ని వ్యాపించింది. అలా నడుస్తూ... ఒక వెదురు చెట్టు వనంలోకి ప్రవేశించాం.
పట్టపగలే... ఆకస్మికంగా పొద్దువాలినట్టుండే చీకటి పొదలను దాటే క్రమంలో ఆ వేణువనం మధ్యలోని ఆయిల్ పెయింటింగ్ లాంటి ఒక చెరువును చూసి వివశులమయ్యాం. చుట్టూ ఆకాశాన్నంటే వేలాది వెదురుచెట్ల పొదలను చీల్చుకుంటూ కురుస్తున్న ఆ మధ్యాహ్న సాయంకాల సంధి ఎండలో విభిన్న వర్ణాలలో ఆ చెరువు అలరారుతోంది. వెదురు చెట్ల వెనక ఉన్న ఎత్తయిన కొండ చరియలతో సహా వెదురు గెడల ఆకుల సూక్ష్మ కొనలు సైతం స్వచ్ఛమైన ఆ చెరువు నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఒళ్ళంతా ఒక పురాతన ధార్మిక ఆవేశం ఆవహించింది. చేతులెత్తి నమస్కరించాను- కోటి వర్ణాలుగా వివర్ణించిన కాంతి ఇంద్రజాలానికి. అక్కడ నుంచి బలవంతంగా మళ్ళీ ప్రయాణమయ్యాం గమ్యం వైపు.
కోటి ఐమాక్స్‌లలోనూ పట్టని దృశ్యం...
మళ్లీ బండరాళ్ళ మధ్య ప్రయాణం. ముందుకు వెళ్ళే కొద్దీ అడవి చెట్లు బాటను కమ్ముకుంటున్నాయి. సరైన దారిలో వెళుతున్నామా? లేదా అనే సందేహాస్పద వాతావరణంలో మా బాట మూడు దారులుగా చీలింది. ఎటెళ్ళాలో చెప్పేవారెవరూ లేరు. మా మనస్సులోని నాగరిక మూల జ్ఞానం అస్థిరత్వంతో గింజుకోసాగింది. మూడు దారుల్లో కాస్త తాజాగా ఉన్న బాటలో నడక ప్రారంభించాం. అలా ఒక గంటన్నర నడక తర్వాత కనుమ దయతో విశాలంగా మారి మైదానమయ్యింది. ముందుగా మామిడి తోటలు ఎదురొచ్చాయి.
వాటిని దాటే క్రమంలో... అద్భుతం... వేల ఎకరాల పచ్చిక బీళ్ళ మైదానం... కోటి ఐమాక్స్‌లలోనూ పట్టని దృశ్య ఉత్సవం. దూరంగా చెట్ల సందుల్లో కనిపిస్తున్న పూరిళ్ళ ఊరు... మల్లెమడుగు... ఏళ్ళ జ్ఞాపకం వాస్తవమై సాక్షాత్కరించిన సందర్భం... బ్యాగులు విసిరేసి పసిపిల్లల్లా పచ్చికలో పొర్లాడి పల్టీలు కొట్టాం... చెమటతో తడిసిన చొక్కాలు విప్పి అడవితల్లి ఆకుపచ్చని పొట్టపై వెల్లకిలా... అర్ధనగ్నంగా... పారాడి... పొర్లాడాం. చుట్టూ కొండల మధ్యలో సాసర్‌లా వేల ఎకరాల మైదానం. నేలపై వెల్లకిలా పడుకుని ఆకాశంలోకి నేరుగా చూస్తే కులాసాగా ఎగురుతున్న దూది మేఘాలు. మరో దిక్కు తలతిప్పితే నిర్విరామంగా మేస్తున్న అడవి ఆవులూ... ఎగురుతున్న పాడుతున్న పిట్టలు, నా అనుభవంలోని ఆ సంపూర్ణ దృశ్య సౌందర్యం గురించి ఏం రాసి ఎలా చూపించి చెప్పగలనూ?
నరవాసనే లేని ఊరు
అడవంతా వ్యాపించిన పచ్చని సౌందర్య పరిమళాన్ని గుండెల నిండా పీల్చుకున్నాక పొద్దుకుంకడానికి ఒక గంట ముందు ఊరి వైపు దారితీసే ఒక బండి బాటలో అడుగులేశాం. వెదుర్లపై ఎండు వరిగడ్డి రెల్లు కుప్పిన పూరిళ్ళ వీధుల్లోకి ప్రవేశించాం... ఆశ్చర్యం... వెంటనే భయం. ఒక్క ఇంట్లో కూడా మనిషి లేడు. గాఢమైన ఆ నిశ్శబ్దంలో ఇల్లిల్లూ తిరిగాం. నరవాసనే లేదు. ఇళ్ళన్నీ కూలిపోయి, శిథిలమయ్యి. కొన్ని చెక్కుచెదరకుండా. కుండలూ... పొయ్యిరాళ్ళూ... నాగళ్ళూ... ఎద్దు బండ్లూ... జల్లలూ... వెదురుతోటలూ... ఇళ్ళలో ఉట్టెలూ... నిబిడాశ్చర్యంతో ఆ విధ్వంసక దృశ్యాన్ని వీక్షించాం.
ఏమయ్యారు జనమంతా అని ఈగల్లా మెదడును ముసురుకుంటున్న ప్రశ్నలకు ఆ ఊరి తూర్పు మూల ఒక గుడిశెలో నుంచి గాల్లో సుళ్ళు తిరుగుతూ లేస్తున్న పొగ సమాధానమిచ్చింది. ఆవైపు అడుగులేశాం. ఆ పూరి గుడిసె ముందు ఒక వ్యక్తి ఏదో వండుతున్నాడు. ఆ అసుర సంధ్యవేళలో ఒకర్నొకరం ఎగాదిగా చూసుకున్నాం. దెయ్యాలమేమో? అన్న అనుమానంతో. తుంగ పూరింట్లో పచ్చి మిరపకాయలూ, ఉల్లిపాయలూ, ఏదో అడవి ఆకు కలిపి దంచిన పచ్చడి కలుపుకుని... ఊదుకుంటూ... పొగలు కక్కే అన్నాన్ని మింగుతున్నామో? తింటున్నామో? తెలియని పరిస్థితి. అడవిలోంచి వీచే మంచు చలిగాలి ఇంట్లోని బుడ్డిదీపాన్ని తాకి మా నీడల్ని గడగడలాడిస్తోంది. ఆ క్షణాలలో శివరామరాజు అనే మల్లెమడుగు గ్రామ మాజీ కాపురస్తుడు తన వేదనను మాటలుగా మార్చి చేస్తున్న ధ్వని ప్రసారాన్ని ఏకాగ్రతతో వింటున్నాయి మా చెవులు... ఆ అనంతానంత కటిక అరణ్యపు చీకట్లో.
మంచుకే పంటలు పండే దేశం
ఏమయ్యారు జనమంతా అని ఈగల్లా మెదడును ముసురుకుంటున్న ప్రశ్నలకు ఆ ఊరి తూర్పు మూల ఒక గుడిశెలో నుంచి గాల్లో సుళ్ళు తిరుగుతూ లేస్తున్న పొగ సమాధానమిచ్చింది. ఆవైపు అడుగులేశాం. ఆ పూరి గుడిసె ముందు ఒక వ్యక్తి ఏదో వండుతున్నాడు. ఆ అసుర సంధ్యవేళలో ఒకర్నొకరం ఎగాదిగా చూసుకున్నాం. దెయ్యాలమేమో? అన్న అనుమానంతో. తుంగ పూరింట్లో పచ్చి మిరపకాయలూ, ఉల్లిపాయలూ, ఏదో అడవి ఆకు కలిపి దంచిన పచ్చడి కలుపుకుని... ఊదుకుంటూ... పొగలు కక్కే అన్నాన్ని మింగుతున్నామో? తింటున్నామో? తెలియని పరిస్థితి. అడవిలోంచి వీచే మంచు చలిగాలి ఇంట్లోని బుడ్డిదీపాన్ని తాకి మా నీడల్ని గడగడలాడిస్తోంది. ఆ క్షణాలలో శివరామరాజు అనే మల్లెమడుగు గ్రామ మాజీ కాపురస్తుడు తన వేదనను మాటలుగా మార్చి చేస్తున్న ధ్వని ప్రసారాన్ని ఏకాగ్రతతో వింటున్నాయి మా చెవులు... ఆ అనంతానంత కటిక అరణ్యపు చీకట్లో.
మంచుకే పంటలు పండే దేశం
నాకు ఊహ తెలిసాక మూడు వందలా యాభై గడపలుండేవి ఈ రెవిన్యూ గ్రామంలో. అన్ని కులాలోళ్ళ బిడ్డా పాపా గొడ్డూ గోదా కేరింతలతో సందడిగా ఉండేది ఊరంతా. ఇంటికో మల్లెచెట్టు ఉండడంతో మల్లెమడుగని పేరొచ్చిందీ వూరికి. మా తాతల ముత్తాతలూ... వారి ముత్తాతలూ ఇక్కడే కడతేరిపోయారు. వాళ్ళ రెక్కల కష్టం ఇలా మైదానాన్ని సాగులోకి తెచ్చింది. పుటక నుంచీ చావుదాకా ఊరు దాటి పోయినోడు లేడు. బస్సులూ కరెంటు దీపాలూ ఎట్టుంటాయో చూడకనే కాటికి పోయినోళ్ళని నేనెరుగుదును. నీటి సౌకర్యం లేకపోయినా మంచుకే పంటలు పండే దేశం ఇది. దుక్కి దున్ని విత్తనాలు విసిరితే చాలు... పుట్లకొద్దీ పంట కోసుకోవడమే ఇక మిగిలింది. పురుగు మందు లేదు... ఎరువూ లేదు. ఇంక అడవి పెట్టే కూటికి అడ్డే లేదు.
ఎన్ని గెడ్డలూ, ఎన్ని పొళ్ళూ.. కాయలూ... ఎంత తేనె... ఎన్ని రకాల పప్పులూ... కలికాలమొచ్చింది. మా బిడ్డలు బయటి ప్రపంచాన్ని చూశారు. రోగాలూ... రొష్టులూ వచ్చాయి. బయటోళ్ళు మాకు పిల్లనివ్వడం మానేశారు. పెళ్ళిళ్ళు లేవు. చిన్న బిడ్డలకు బళ్ళు లేవు. పిలకాయల్ని రాపూరు-చిట్వేలి ఊళ్ళలోని హాస్టల్లో పెట్టి చదివించాం... ఉద్యోగాలొచ్చాయి... ఒక్కొక్కరూ బయటి ప్రపంచంలోకి ఎగిరిపోయారు. నలభై యేళ్ళుగా మా ఊరికి రోడ్డెయ్యండనీ, కరెంటీయండని మొక్కని నాయకుడు లేదు. దణ్ణం పెట్టని కలెక్టర్ లేడు. ఎంతమంది కలెక్టర్లు మారినా మా పరిస్థితి మారలేదు. ఇంక ఏమీ జరగదని జనాలు కొంపా గోడూ... పొలాలూ ఆవులూ వొదిలి చెట్టుకొకరూ పుట్టకొకరూగా ఒక్కో కుటుంబం దేశం మీద పడిపోయింది. పోయినేడు ఇదే కాలానికి ఇక్కడ పది కుటుంబాలు నిల్చాయి... ఇప్పుడు వాళ్ళూ ఎల్లిపోయారు.
ఎన్ని గెడ్డలూ, ఎన్ని పొళ్ళూ.. కాయలూ... ఎంత తేనె... ఎన్ని రకాల పప్పులూ... కలికాలమొచ్చింది. మా బిడ్డలు బయటి ప్రపంచాన్ని చూశారు. రోగాలూ... రొష్టులూ వచ్చాయి. బయటోళ్ళు మాకు పిల్లనివ్వడం మానేశారు. పెళ్ళిళ్ళు లేవు. చిన్న బిడ్డలకు బళ్ళు లేవు. పిలకాయల్ని రాపూరు-చిట్వేలి ఊళ్ళలోని హాస్టల్లో పెట్టి చదివించాం... ఉద్యోగాలొచ్చాయి... ఒక్కొక్కరూ బయటి ప్రపంచంలోకి ఎగిరిపోయారు. నలభై యేళ్ళుగా మా ఊరికి రోడ్డెయ్యండనీ, కరెంటీయండని మొక్కని నాయకుడు లేదు. దణ్ణం పెట్టని కలెక్టర్ లేడు. ఎంతమంది కలెక్టర్లు మారినా మా పరిస్థితి మారలేదు. ఇంక ఏమీ జరగదని జనాలు కొంపా గోడూ... పొలాలూ ఆవులూ వొదిలి చెట్టుకొకరూ పుట్టకొకరూగా ఒక్కో కుటుంబం దేశం మీద పడిపోయింది. పోయినేడు ఇదే కాలానికి ఇక్కడ పది కుటుంబాలు నిల్చాయి... ఇప్పుడు వాళ్ళూ ఎల్లిపోయారు.
మరి మీరెందుకిక్కడున్నారని రాజుని ప్రశ్నిస్తే...
బంగారం లాంటి పొలాన్ని వదల్లేక పోతున్నాను... ఈ శరీరం చిట్వేలు టౌన్లో ఉంటున్నా మనసంతా ఈ పొలం మీదే. అదను కాలంలో అతి కష్టం మీద ఇక్కడకొచ్చి, నాలుగు రోజులుండి దున్ని విత్తనాలు చల్లి వెళతాను. మళ్ళీ మధ్యలో ఒకటో... రెండో సార్లు వచ్చి పంట చూసుకుని పోతాను. పంట పండాక కోసుకుని బళ్ళ మీద తోలుకెళతాను. మీరు రేపో... ఎల్లుండో ఇక్కడికొచ్చుంటే నేను కూడా ఉండనని చెప్పి మమ్మల్ని షాక్‌కి గురి చేశాడు. తరతరాల మా పూర్వీకులు ఇక్కడ బతకంగా లేనిది మీరెందుకు బతకలేకపోయారనే ప్రశ్నకు రాజు జ్ఞాన పరిమితి సమాధానం ఇవ్వలేదనే విషయం నాకు అర్థమయ్యింది.
బయటి ప్రపంచపు నాగరికతను రుచి చూసిన వారికి ఈ అడవిలో తాము కోల్పోతున్నదేదో వారిని వలసకు ప్రోత్సహించి ఉండొచ్చుగాక. ఒక తరం ఆశలకు వృద్ధతరం విశ్వాసాలకూ మధ్య ఈ గ్రామంలో జరిగిన యుద్ధంలో- సంఘర్షణలో ఎన్ని హృదయాలు గాయపడ్డాయో? ఎన్ని గుండెలు ఊరిని వదలలేక కుమిలి కుమిలి ఆగి మరణించాయో? ఒక యుద్ధానంతర దైన్యాన్నీ, వేదననూ ఆ శిథిల గ్రామం అణువణువునా ప్రతిబింబిస్తోందనిపించిందా క్షణం.
ఊరు అడవిలో..మనుషులు కాలనీలో
ఆ రాత్రి మా బస మల్లెమడుగులోని ఒక బడి అనబడే గదిలో. ఎప్పుడో పదేళ్ళ ముందు చదువుకున్న పిల్లల వొంకర టింకర అక్షరాల గ్రాఫిటీలు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయక్కడ. ఆ పిల్లలంతా ఇప్పుడు ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?... చీకట్లోనే కర్రా పుల్లా పోగేసి కాంప్ ఫైర్ లాంటిది వెలిగించి చుట్టూ చేరాం. కొరివి దెయ్యాల కథల్నుంచి... గాయత్రి, ఎగ్జార్సిస్ట్, వోమెన్, అరుంధతి, కాంచన వరకూ విలేజ్ అండ్ అర్బన్ లెజెండ్స్ అనబడే హత్యా ఆత్మహత్యల బీభత్సరస ప్రధాన గాథలన్నీ మా మెదళ్ళ స్మృతి పేటికల నుంచి మాటలుగా ప్రవహించాయి. చీమలు మొదలు రకరకాల పురుగుల మధ్య క్షణక్షణ రజ్జు సర్ప భీతితో కీచురాళ్ళ వేల నిర్విరామ నేపథ్య ధ్వనుల్లో... చలీ... చలిమంట వెచ్చదనాల మధ్య ఒళ్ళెరుగని నిద్రా... కలా... నిద్రా... కలా నడుమ ఆ రాత్రి కరిగి వేకువగా మారింది.
యుద్ధానంతర బీభత్సం అది
తెల్లవారుఝామున కూడా అర్ధరాత్రి లాగే ఉంది అడవి... అడవంతా పరచుకున్న నిశ్శబ్దంలో నుంచి ఎదురుగా కొండపై సన్నని వెలుగు గీత కన్పిస్తూ క్రమంగా పెద్దదయింది. కొన్ని వేల పిట్టల అరుపులతో ఆ అడవిలోయ ప్రతిధ్వనించింది. ప్రకాశవంతమైన సూర్యుడి స్పర్శతో అడవి తన దైనందిన జీవితాన్ని ప్రారంభించింది. ఊరంతా తిరిగి ఒక పాతకుండను సంపాదించి నాలుగు రాళ్ళు పేర్చి మంట చేసి శంభూక వేర్లను తవ్వి... వాటికి మర్రివూడల చివుళ్ళనూ, లేత వెదురు ఆకులనూ కలిపి నీళ్ళతో ఉడికించి చేసిన సూప్ లాంటి ద్రవాన్ని తాగి ఊరిమీద పడ్డాం. ఉత్తర దక్షిణాలుగా వ్యాపించిన మల్లెమడుగు క్షతగాత్రురాలిలా ఉంది.
పూరిళ్ళూ, చుట్టిళ్ళూ, పశువుల దొడ్లూ, మర్రిచెట్లూ, స్నానాలగది తడికెలూ, తొట్టెలూ, పెరళ్ళూ, దూలాలూ, ముంగిళ్ళూ, ముగ్గులూ, రోళ్ళూ, రోకళ్ళూ, తిరగళ్ళూ, వేలాడుతున్న తాళ్ళూ, పలుపులూ, నారమోపులూ, లోయ మైదానాలను వరి పొలాలుగా మార్చిన నానారకాల నాగళ్ళూ, కూలిపోయి కకావికలైన బండి చ్రకాలూ, బళ్ళూ, తుంగ కమ్మిన లోగిళ్ళూ, మూకుళ్ళూ, పశువుల ముకుతాళ్ళూ సమస్తం చెదలకు ఆహారం అవుతూ... ఎంతసేపని చూడగలం యుద్ధానంతర బీభత్సాన్ని? వీడ్కోలు చెప్పేందుకు అక్కడెవరూ లేరు- అడవి చెట్లూ, చుట్టూ కొండలూ, పిట్టలూ, మైదానాన్ని మేస్తున్న అడవి ఆవుల గుంపూ, మేఘాలూ, నీరెండా, అర్ధ శిథిలగ్రామ దృశ్యమూ తప్ప. వెలగ, ఉసిరిక పండ్లు తింటూ, సెలయేటి నీళ్ళు తాగుతూ తిరుగు ప్రయాణమయ్యాము. అడవిలోయ చెట్లన్నీ ఏకాంత నిశ్శబ్దంతో మమ్మల్నే గమనిస్తున్నాయి. నీడల క్రీనీడల మొజాయిక్ వెదురువనాన్ని దాటాక మళ్ళీ కూటాలమర్రి మా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అరగంట నడక తర్వాత బాట పక్కనే ఒక మారేడు చెట్టు నీడలో విశ్రమించాం. ఆకాశంలో లేత మబ్బుల వెనక సూర్యుడు పశ్చిమాద్రికేసి సాగిపోతున్నాడు. దూరంగా ఎవరో ఒక మనిషి వస్తున్న అలికిడి. ఈల వేసి పలకరించాం... అతనూ ఈలతో ప్రతిస్పందించాడు.
జ్ఞానబోధను చేసిన పెదయానాది
అడవి భాషను ఔపోసన పట్టిన వృద్ధ ఋషిలా ఉన్న పెదయానాది మా వంక అనుమానంగా చూశాడు. అతనితో మాటలు కలిపి అడుగులేశాం. అందరి గమ్యం మైదానం వైపే. పేరు చెప్పడానికి పెదయానాది ఇష్టపడలేదు. అడవి నుండి విడిపోయిన ఒక పురాతన కాలంలో అతనికీ మాకూ సంబంధాలు తెగిపోయాయి. గంటసేపటి తర్వాత మాతో మనసూ, మాటా కలిపి అరణ్య రహస్యాలతో మమ్మల్ని ఆశ్చర్యభరిత ప్రపంచంలోకి తీసుకెళ్ళాడా మాంత్రిక వాస్తవవాది. అడవిలో చిరుతల విన్యాసాలు, అవి గుంపులు గుంపులుగా వెంకటగిరి దుర్గం వెనుక దొరువులోకి ఎండాకాలం వలసపొయ్యే విధానం, వాటి అలవాట్లు, వేట రహస్యాలు, ఇబ్బందిగండ్లు (పులి, చిరుతల మధ్య రకం జంతువు) తమ తండ్రులను తాతలను ఎలా ఇబ్బంది పెట్టిందీ చెప్పాడు.
ఇంకా అడవిలో దొరికే బంకమట్టి గింజ, భిల్లగింజ, మారేడు, నల్లమామిడి గడ్డల గుణగణాల గురించీ, గెవిల్లో (గుహ) గీసిన బొమ్మల గురించీ (బహుశా ఆది మానవులవై ఉండొచ్చు) సార, గాధం, చిల్ల, ముష్టి, కరక, బూరుగ, పొలుకు, జువ్వి, తంభోధి, ఊటి, ఎల్ల, గుడ్డుపోలు, దిరశన, గుంజు వంటి అడవి చెట్ల స్వరూప స్వభావాల గురించీ అనంతంగా చెబుతూ నడుస్తున్న పెదయానాదితో పాటే మేమూ నడిచాం.
లోయలో చిరు చీకట్లు కమ్ముకుంటుండగా నడక దారిలో పసుపు కుంకుమలు పూసిన ఒక బండ ముందు ఒంగి సాష్టాంగ దండం పెట్టాడు పెదయానాది. నాగరికతా శాపగ్రస్తులమైన మేము ఒట్టి చేతులతో మాత్రమే నమస్కారం నటించాం. ఇంతకాలమూ తమని కాపాడిన అడవిగంగమ్మ ఆ బండలో ఉందంటూ ఆమె మహత్యాన్నీ, సత్యాన్నీ అనేక ఉదాహరణలతో వివరిస్తూ ముందుకు కదిలాడు పెదయానాది. అడవిగంగమ్మ దయతోనే అడవి వర్థిల్లుతూందనీ, కణితీ, దుప్పీ, కొండగొర్రె, అడవి పంది, ఎలుగు, ఏదుపంది, చిరత, గండు, ఉడుము, మండవ, పునుగుపిల్లీ, నల్లపిల్లీ, మట్టుపిల్లీ, దేవాంగపిల్లీ, సమస్తాది పురుగూ పుట్రా, రాయీ రప్పాతో సహా కోట్లాది జీవచరాలు తమ ధర్మం తప్పక నడుచుకుంటున్నాయని గంభీరంగా తన జ్ఞానాన్ని వేదాంతీకరించాడు.
ఇంకా పెదయానాది... ఏమారితే బర్రెనే మింగే కొండ చిలువ గురించీ, నీళ్ళలోనే తిరుగుతూ కాటేసే నీటి పెంజిరి గురించీ, రకరకాల అడవిపాములూ, తేళ్ళూ, చేపలూ, కప్పలూ, మొసళ్ళ గురించీ, వర్ష శీతాకాలాల్లో, వెన్నెల రాత్రుల్లో అడవి వర్తన గురించీ ఒళ్ళు గగుర్పొడిచే విశేషాలు చెప్పాడు.
సాయంత్రపు సూర్యుడు చిట్వేలి కొండ అంచుపై నుంచి పడమటి లోయల్లోకి జారేందుకు సిద్ధమవుతున్న ఘడియలలో గమ్యానికి నాలుగు అడుగుల దూరంలో ఒక బండపై కూర్చుని పెదయానాది అడవి ఆకుతో పేనిన బీడీ లాంటిదాన్ని ముట్టించి నిరామయంగా పొగ వదులుతూ మేమెలా మల్లెమడుగుకు చేరామో చెప్పాడు. నాయనలారా మీరు కుంకుడుమాను దాటుకోని, జిల్లేడు పెంట, గాదమాకులనడ్డి మీదగా తాండ్రమాను సెలయేళ్ళను దాటి అడివిగంగమ్మ ముందు నడిచి, లోతొంకలో దిగి కూటాలమర్రికొచ్చి; ఆనక, ముంతమామిడి చెట్ల పక్కన వెదురుపొదల్లో నుంచి రెడ్డిచెరువు పక్కగా నడిచి; మర్రికొనొంక, పిచ్చిదాని వంకల పైనబడి, పుటానారప్ప కొదమరేవు కాణ్ణించి; రాజుల కాలంలో అక్కదేవతై అడవిని చల్లగా చూసిన పెదనరసక్క కొమరేవు చాటుకోని కొనపొడి చేలల్లోబడి మల్లెమడుక్కి చేరామని కడప రిజర్వు ఫారెస్టులోని చిట్వేలి సెక్షన్‌ను 'మాప్'లా మా కళ్ళ ముందు పరిచాడు. ఆ క్షణాలలో అడవి పెదయానాదిగా మారి తన విశ్వరూపం చూపిస్తున్నట్టనిపించింది. ఆరిపోయిన బీడీ ముక్కను మళ్ళీ వెలిగించి పెదయానాది చెప్పడం ప్రారంభించాడు. ఏమి ఖర్మమని మల్లెమడుగోళ్ళు దేశాలు బట్టి పొయ్యారు. మల్లెమడుగు పైన మర్లబయలుంది, పెర్లకుంట, పెద్దాయపల్లి ఉండాయి. ఆడ బతికేది మనుషులుగాదా? ఆపైన మూడూళ్ళు మాత్రం సోమశిల నీళ్ళ కింద మునిగిపోయాయి... చెబుతున్న పెదయానాది మాటలకు ఊ కొడుతూ విచారించాం అక్కడికి వెళ్ళలేకపోయామనీ...
మీకు అడవి... మాకు ఇల్లు
బీడీ కణకణ మండేలాగా తాగిపారేస్తూ పెదయానాది ఇంకా ఇలా అన్నాడు. అడవి చెట్లను నరికి అమ్ముకునే వాళ్ళను చూశాను. పిడికెడు కూడు మాత్రమే ఆశించి పల్లెజనాల్ని పచ్చంగా కాపాడిన అన్నల్ని చూశాను... మా ముత్తాతల కాలం నుంచీ మా జాతిలో ఒక్కణ్ణి కూడా అడవిలోని ఏ జంతువూ, పురుగూ, పామూ ముట్టలేదు. అంత ఒద్దిగ్గా అడవిలో ఇమిడిపోయాం. ఇది మీకు అడవి... మాకు ఇల్లు నాయనలారా. నేనెవరో మీకు దెలీదు. మీరెవరో నాకు దెలీదు. ఇందాకట్నించి ఈ ఊళ్ళలో మనుషులెక్కడికి పోయారని జీరంగుల్లా (నిరంతరం శబ్దం చేస్తూ ఉండే పురుగు) మీరు నన్ను అడగతా ఉండారు. నాయనలారా చెప్తా... నా కర్మాంతరాన నా బతుకులో ముగ్గురు దొరల్ని చూశాను.
వోళ్ళ ముగ్గురి మూలకంగా మా అడివి బిడ్డలంతా అనాథలయ్యారు. ఒంటిపందులయ్యారు. అడివొదిలి మనుషులతో జేరి మటమటలాడుతున్నారు. ఆ కతంతా నేను చెప్పలేను. అదిగో ఆ కొండదిగినపాట వచ్చే అనుంపల్లి దాటినాక కూటాలమర్రోళ్ళ కాలనీ అంటే యెవురైనా జెప్తారు. ఫలానావోళ్ళకాడికి బోండి మీకు అన్నీ తెలుస్తాయి. అదుగో మీ దారి అంటూ ఒంపు తిరిగిన ఒక ఎండిన సెలయేరు దారిలో నడుస్తూ క్షణాల్లో కనుమరుగయ్యాడు. అతను పెదయానాది రూపంలో వచ్చిన అడవి మునీశ్వరుడని నా బలమైన నమ్మకం.
కలకటేరును భుజాల మీద మోసుకుపోయినాం
మళ్ళీ బయల్దేరినచోటికి రాపూరు-చిట్వేలి కొండల నడినెత్తికి చేరుకున్నాం. రాపూరు నుంచి చిట్వేలి వెళుతున్న ఆర్టీసీ బస్సెక్కి ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత కూటాలమర్రి కాలనీకి వెళ్ళే దారిలో దిగాం. కొంతదూరం నడిచాక ఒక ఎండిపోయిన బొడితిప్ప మీద ఉన్న కూటాలమర్రి కాలనీలోకి అడుగుపెట్టాం అశోక్‌నగర్ అని రాసివున్న రేకుబోర్డు పక్కగా నడుచుకుంటూ. ఆడోళ్ళు, పిల్లా జెల్లా, కుక్క ఒకటి, రెండు బర్రె దూడలూ మమ్మల్ని చుట్టుముట్టి అనుమానంగా చూడసాగారు. పెదయానాది చెప్పిన ఫలానావారి పేర్లు ఇంటి పేర్లతో సహా చెప్పాక మామీద నమ్మకం కలిగి వాళ్ళను పిలుచుకొచ్చారు.
కాలనీ అంతా మా చుట్టూ గుమిగూడింది. ఒక ఆడమనిషి మమ్మల్ని మీరు పొదుపోళ్ళా అని అడిగింది. మీరు పేపరోళ్ళా, గవర్నమెంటోళ్ళా, సిఐడిలా ఇలా వంద రకాలుగా విచారించారు. అన్నిటికీ కాదనే చెప్పాం. చివరికి కూటాలమర్రి నుంచి వచ్చాం అనే మాట వాళ్ళ చెవిలో పడగానే వాళ్ళ మొహాల్లో సంబరమే సంబరం. అప్పటి నుంచీ మేమెంతో కాలంగా పరిచయం ఉన్న వారిలాగా మాతో మాట్లాడసాగారు. ఒక ఇంట్లో నులక మంచంపై మమ్మల్ని కూర్చోబెట్టి నీళ్ళు, ఉసిరికాయలు ఇచ్చి యోగక్షేమాలు విచారించాక, ఎట్లా ఉంది మా ఊరని అడిగారు. మీరెట్లా ఉన్నారని అడిగాం.
వనమ్మ బావురుమంది. అయ్యా మా కూటాలమర్రి బ్యాంకీ (మైదానపు పరిభాష ఆమెకీ ఒంటబట్టింది) అడివి మా కూటికీ, గుడ్డకూ ఏనాడూ అడ్డు చెప్పలేదు. దేశాలన్నీ కరువులతో మలమలా మాడిన రోజుల్లో గూడా మా అడివి మమ్మల్ని మహరాజుల్లాగే చూసింది. తట్టనిండా అన్నం పెట్టిందే కానీ ఏనాడు తరిమి కొట్టలేదు... ఆ ముగ్గురు కలకటేర్ల మాటలు నమ్మి ఇదిగో ఇలా మశానంలో బడ్డాము. మా బతుకులు నాశనమయ్యాయి. అయ్యా సాములారా! అడివి గుండెల్లో ఆదమరిచి నిద్రబోతావుణ్ణాం. కడుపులో కణకణ మండే ఆకలైనా మా అడివి గాలి పీలిస్తే అణిగి పోవాల్సిందే.
ఐదారు సంవత్సరాల క్రితం సుబ్రమణ్యం కలకటేరు మమ్మల్ని చూడాలనివొస్తే నులక మంచం యెక్కించి మా భుజాల మీద మల్లెమడుక్కి మోసుకుపోయినాం. మా అడవీ, చెట్లూ, గాలీ చూసి ఆయన మైమరచిపోయి ఇంజేటి గడ్డలు తిని తేని సప్పరిస్తా మాకు వరాలిస్తున్నాడన్న మాయలో మమ్మల్నంతా అభివృద్ధి చేయాలన్నాడు. తర్వాత వొచ్చిన అతారుసింహం (అథర్‌సిన్హా) కలకటేరు సారపప్పు తింటా... బయటికొచ్చేయండి బంగారంగా బతకొచ్చు. మీకు భూములిస్తాం, ఇళ్ళు కట్టిస్తాం అంటూ ఆశలు బెట్టాడు. మాలో కొంతమంది దురాత్ములు రాపూళ్ళో, చిట్వేలిలో చిలిమాలకు (సినిమాలకు) చికార్లకు (షికార్లకు) ఆశబడి ఆయన మాటలకు మొగ్గినారు. వాళ్ళెనక కొండగొర్రెల మాదిరిగా అందరూ పరుగులు తీశారు. ఇది జూసి యేదో గెడ్డ పాసిపోతూందని మేమూ పోలోమన్నాం.
అతారుసింహం వెనక వచ్చిన అసోకుకుమారు కలకటేరు మాకు ఇళ్ళు గట్టిచ్చి ఆయన పేరు పెట్టిన ఈ బోడితిప్పనగరాన మమ్మల్ని కొలువు జేశాడు. మాకు భూములిస్తామని జెప్పాడు. ఇదిగో... అదిగో అన్నాడు. మా ఇరవై కుటుంబాలకు రెండెకరాల లెక్కన ఒక యెకరా రాజుగుంటలో, ఇంకో ఎకరా మా ఇళ్ళ పక్క ఇచ్చినామన్నారు. ఈ మాట జెప్పి ఆరేళ్ళు కావస్తుంది. ఎమ్మారోవులు (ఎమ్మార్వోలు) మారతానే ఉండారు. ఇంతదాకా భూములు చూపిచ్చలేదు. కొలిచి ఇచ్చిందీ లేదు. అడివిలో ఆ గింజా, ఈ గడ్డా ఏరుకుని నిమ్మళంగా బతకతున్యాం. ఈ దేశాన కూలికి పిల్చేవోళ్ళు లేరు. పండించుకు తిందామంటే భూమి లేదు.
యేరుకుందామంటే గులక తప్ప గింజ లేదు. అడివిగంగమ్మని మరిచినాక మా బతుకులు బదాబదలయ్యాయి. ఇరవై ఐదు కుటుంబాలు ఇరవై ఐదు దార్లయ్యాయి. ఈ ఇందిరమ్మ సమాధుల్లో (ఇళ్ళ ల్లో) చెరపాలయ్యి చావా లేకా బతకాలేక గోజారుతున్నాము. ఎన్నిమార్లు దిరగాల సాములా... ఆఫీసుల చుట్టూ... తిరిగి తిరిగి బతుకుమీదే యాష్ట వస్తా వుంది థూ!! (విపరీతమైన ఆవేశంతో నేలపై ఎంగిలి వూస్తూ) ఈళ్ళ కడుపులు కాలా! ఇన్ని రకాలుగా జీవాలను ఇంస (హింస) పెట్టొచ్చని ఈడకొచ్చినాకే తెలిసింది... అపద్ధాలు... అన్నీ అపద్ధాలు ఇంత అపద్ధపు బతుకెందుకబయా? అంటూ తన స్థితికి కారకులైన వారిని వొళ్ళెరుగని ఆవేశంతో, శాపాలతో దీవించింది. కాసేపయ్యాక... అయినా మా కర్మకు యెవురేం జేస్తారని ముక్కు చీదుకొంది.
మాయదారి మైదానపోళ్ల మాటలిన్నాం
ఆ పక్కనే పక్షవాతంతో అల్లాడుతూ అర్థమయ్యీ కానీ మాటలతో అడవివైద్యగుడు (వైద్యుడు) నరసింహులు అడవి సౌందర్యాన్ని, అక్కడి తన ఆత్మగౌరవపు జీవితాన్ని యానాది యాసతో, బాషతో మా ముందు సాక్షాత్కరింపజేశాడు. ఆడమనిషిని మగమనిషిగా, మగమనిషిని ఆడమనిషిగా జేసే గడ్డలున్నాయన్నాడు. వందలాది జబ్బులకి వేలాది మూలికలున్నాయన్నాడు. మనిషిని పులిగా, పులిని మనిషిగా చేయగలనన్నాడు. మాయదారి మైదానపోళ్ళ మాటలిని అడివితల్లిని అర్ధంతరంగా ఒదిలినందుకే అడివిగంగమ్మ తనకు పక్షవాత శాపం పెట్టిందన్నాడు. అడివి గాలి పీలిస్తేనే ఈ జబ్బు నశిస్తుందనీ, కానీ అక్కడికి వెళ్ళలేననీ విలపించాడు. మనవణ్ణి చంకనెత్తుకుని ఇదంతా చూస్తున్న అంకమ్మ కూడా శివాలెత్తింది. నోరులేని అడివి జీవాల్లాంటి మమ్మల్ని ఎంత మోసం చేశారబయా? ఇక్కడికొచ్చి ఈ దుమ్ము, గాలి పీల్చి మావోళ్ళు రోగాల పాలయ్యి సచ్చిపోతా ఉండారు.
యెంత మంది ఆఫీసర్ల కాళ్ళు మా కంటినీటితో కడిగినా ఒక్కరూ కన్నుతెరవడం లేదు, కనికరించడం లేదు. మమ్మల్ని అడివికి పోనీరు, ఇక్కడ భూములు ఈరు, ఈ నరకవేంది నాయినా. మా కొండలకి చిల్లుపెట్టి (టన్నెల్) రయిలు నడిపిస్తారంట (ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్) నాశనమైపోతారు, అబయా ఈ మట్టిమీద నిలబడి ఈ ఆకాశం కింద చెపతండా అడివిగంగమ్మ సత్యం ఈళ్ళ వంశ వంశాలను బుగ్గిపాలు చేస్తాది. ఆమెతో ఆటలుగాదు. ఇంక లాభం లేదు రెండు మూడు నెల్లు జూసి భూమి ఈకుంటే అందరిదారి కూటాలమర్రికే అంటూ అంకమ్మ ఆగ్రహించడంతో మూకుమ్మడిగా ఒకరకమైన పూనకంతో ఎవరి వేదనను, ఆవేశాన్ని వాళ్ళు వెళ్ళగక్కారు. తిక్కవరం మల్లయ్య, బుజ్జయ్య, గాలి పాపయ్య, ఈశ్వరమ్మ, చెంచమ్మ, వజ్రమ్మ, సీనయ్య, ఎల్లయ్య ఒక్కొక్కరిదీ ఒక్కో దిగులు, ఒక్కో కష్టం, ఒక్కో యాతన. సన్యాసులో, ఋషులో తప్ప ఎవరు వినగలరు సహనంతో. మా బస్సు చిట్వేలి ఘాట్ దిగుతుండగా అకారణంగా విలపించాను ఎందుకో?
- డాక్టర్ లెనిన్ ధనిశెట్టి *నాగరాజుదేవర్, బాలచంద్రుడితో కలిసి.
doctorlenin@gmail.com
ఫోటోలు : పి. మస్తాన్‌ఖాన్
ఫోటోలు : పి. మస్తాన్‌ఖాన్