విహారాలు

India

Gamyam

Wednesday, October 26, 2011

అబ్బురపరిచే... డోలోమైట్స్‌ ఆల్ప్స్‌

ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఇటలీలోని డోలోమైట్స్‌ పర్వతాలు. అందమైన ఆల్ప్స్‌ పర్వతాలలో భాగమే ఈ డోలోమైట్స్‌. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేరి అరుదైన ఘనతను సంపాదించుకున్న డోలోమైట్స్‌... 
ప్రపంచంలోనే ఎంతో అందమైన పర్వతాలుగా దేశవిదేశ పర్యాటకులను అలరిస్తున్నాయి.

The_Dolomites_Alps_Italy 

నిట్టనిలువుగా, కొనదేలిన శిఖరాలతో, చాలా ఇరుకైన లోయ లతో కూడిన పర్వత శ్రేణులు ఈ డోలోమైట్స్‌లో కనిపిస్తా యి. వీటిమధ్యలో కనువిందు చేసే అద్భు తమైన దృశ్యాలెన్నో ఉంటాయి. వీటిలో కొన్నింటిపై పేరుకున్న మంచు.. హిమానీ నదాలుగా మారుతుంది.
మొదటి ప్రపంచ యుద్ధానికి మూగ సాక్షులు...
మొదటి ప్రపంచ యుద్ధా నికి మూగ సాక్షులైన ఈ డోలోమైట్స్‌ పర్వతాల్లో.. 1915 మే నుంచి 1917 అక్టో బర్‌ వరకూ ఇటలీ, ఆస్ట్రియా దేశా ల సైనికులు 20 నెలలపాటు తలపడ్డా రు. ఈ యుద్ధంలో ఇరు పక్షాలు ప్రయోగించిన బాంబుల వల్ల కూడా ఈ పర్వతాలు రకరకాల ఆకారాల్లో ఏర్పడిన మార్పులు చూపరులను ఆకర్షించడం మరో విశేషం. ఇప్పటికీ అక్కడ కనిపించే యుద్ధ గుర్తుల కోసం ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.

Dolomites 

ఈ పర్వతాలలో వీరికోసం దాదాపు 500 స్కైలిఫ్ట్‌లు ఉన్నాయంటే, వీటికి ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. డోలోమైట్స్‌లో దాదాపు 18 శిఖరాలు 3 వేల మీటర్లు అంటే సుమారు పదివేల అడుగుల ఎత్తుగా నిలబడి అబ్బురపరుస్తుంటాయి. పెద్ద పెట్టెలాంటి దాంట్లో పర్యాటకులు కూర్చుంటే, యాంత్రిక కప్పీల సహాయంతో నిలువుగా లిఫ్ట్‌ లాగా ఇవి పైకి వెళ్తుంటే.. చుట్టూ ఉండే దృశ్యా లను చూస్తూ సందర్శకులు మైమరచిపోతుం టారంటే అతిశయోక్తి కాదు. ఈ స్కై లిఫ్ట్‌లు సుమారు 750 మైళ్లు అంటే 12 వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.

సముద్రం నుండి ఉద్భవించి...
డోలోమ్యూ అనే ఫ్రెంచ్‌ ఖనిజ శాస్తజ్ఞ్రుడు ఈ పర్వతాల శిలలపై పరిశోధనలు చేసి, ఇవి ప్రత్యేకమైన కర్బన పదార్థంతో కూడిన డోలోమైట్‌ అనే రాయితో ఏర్పడ్డాయని కనుగొన్నాడు. దీంతో ఈ పర్వతాలకు డోలోమైట్స్‌ పర్వతాలు అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ డోలోమైట్స్‌ పర్వతాలలో చెప్పుకోవాల్సిన విచిత్రం మరో టుంది. అదేంటంటే.. 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పర్వ తాలు సముద్రంలోంచి పొడుచుకొచ్చాయి. అందువల్లనే నీరు, మంచు, గాలుల కారణంగా చిత్రమైన ఆకారాలను ఇవి సంతరిం చుకుని చూపు మరల్చుకోనీయకుండా చేస్తాయి.

Dolomites-Italy 

రకరకాల రంగుల్లో ఉండే వాటిని చూసేందుకు రెండుకళ్లూ సరిపోవు. బూడిద రంగు, మట్టిరంగు, తెలుపు, నీలం రంగుల్లో ఉండే ఈ పర్వతాలు మన కళ్లను ఏ మాత్రం పక్కకు తిప్పనీవు, దృష్టిని మరల్చనీవు. అంత అందంగా, సుమనోహరంగా ఉంటాయవి. అందుకే ఎంత కష్టసాధ్యమయినా సరే ఈ పర్వతాలను ఎక్కేం దుకు పర్వతారోహకులు బారులు తీరుతుంటారు. ఇక పర్యాట కుల సంగతయితే చెప్పనవసరం లేదు. వీరు ఆయా మార్గాలు, సౌకర్యాల ద్వారా డోలోమైట్స్‌ పర్వాతాలను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుండి తరలివస్తుంటారు.

యూనెస్కో వారసత్వ సంపద...
యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ప్రపంచం లోని 13 దేశాలలోని కొన్ని ప్రదేశాలను కొత్తగా వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. వీటిలో డోలోమైట్స్‌ పర్వతాలు చేరాయి. స్పెయిన్‌ కేం ద్రంగా పనిచేసే యునెస్కో వివిధ దేశాల్లోని ప్ర కృతి, సాంస్కృతికపరమైన అద్భుత ప్రదేశాలు గుర్తించి, వాటి రక్షణకు కృషి చేస్తోంది.

Monday, October 3, 2011

డయ్యూ డామన్ - తరగని సాగరసుధా మధురం

గోవా డయ్యూ డామన్ అని చిన్నప్పుడు జాగ్రఫీ పాఠాల్లో ఒక వరసలో చదువుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. మ్యాప్ మీద చాలా చిన్న చుక్కలుగా ఉండేవి అవి. గోవా ఇప్పటికే చూసేయడం వల్ల అవకాశం వచ్చినపుడు మిగిలినవి కూడా చూద్దామనుకున్నాను. ఇంతలో మావారు డా. వెంకటరమణను ఎయిడ్స్‌పై గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం ఆహ్వానించడంతో మొదట డామన్‌కు, మూడు నెలల తర్వాత డయ్యూకు వెళ్ళే అవకాశం దొరికింది. డామన్ 'వల్‌సద్' జిల్లాలో, డయ్యూ 'జునాగఢ్' జిల్లాలో ఉన్నాయి. రెండూ గుజరాత్ రాష్ట్రంలోనే ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నాయి. 1961 వరకు పోర్చుగీస్ వారి పరిపాలనలో ఉన్న డామన్ డయ్యూలు ఆ తర్వాత 1987 దాకా గోవాతో కలిసి ఉండి, గోవా రాష్ట్రంగా అవతరించాక విడిగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటోంది.

నిజానికి డామన్, డయ్యూ దగ్గర దగ్గర ఏం ఉండవు. వాటి మధ్య 700 కి.మీ దూరం ఉంది. మేము మొదట డామన్ వెళ్ళాం. ముంబాయి నుండి ట్రెయిన్‌లో 195 కి.మీ. ప్రయాణించి 'వాపి' స్టేషన్‌లో దిగాం. అక్కడ నుండి డామన్ 13 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఒక రేవు పట్టణం. డామన్ కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆనాటి భీకర సమర జ్ఞాపకాలను మదిలోనే దాచుకుని భిన్న సంస్కృతుల కలయికతో ఎంతో సుందరంగా తయారైన ఈనాటి డామన్ టూరిస్టులకు, ముఖ్యంగా మహారాష్ట్ర వారికి ఒక మంచి ఆట విడిది. ఇక్కడ టూరిస్ట్ సీజన్ సెప్టెంబర్ నుండి మే వరకు ఉంటుంది.

నానీడామన్, మోతీడామన్

  'డామన్ గంగా' నది ఉత్తరాన 'నానీడామన్', దక్షిణాన 'మోతీడామన్' ఉంటాయి. రెండూ ఎంతో విభిన్నంగా కనిపిస్తాయి. మేము మొదట మోతీడామన్ చూశాం. అక్కడంతా పెద్ద రోడ్లు, పురాతనమైన కట్టడాలు కనబడ్డాయి. ఒక పెద్ద లైట్ హౌస్ ఉంది. 16వ శతాబ్దంలో కట్టిన 'బొమే జీసస్' చర్చి చూశాం. దాని ముఖద్వారాన్ని ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. చర్చి పైకప్పు ఎంతో ఎత్తులో ఉంది. గోడలు చెక్కతో నిర్మించారు. ఈ చర్చిని బాల ఏసుకు సమర్పణ చేశారట. మోతీడామన్‌లో ఒక పెద్ద కోట ఉంది. ఇది 1559 నాటిది. పోర్చుగీసు వారు, భూమి, సముద్రం, నదీ కలిసే చోటు ఎన్నుకుని దాన్ని ఎంతో పటిష్టంగా కట్టారు. వారు ఇక్కడ సెక్రటేరియట్ నిర్వహించిన గుర్తులు, వారి సిబ్బంది కుటుంబాలతో నివసించిన దాఖలాలు ఎన్నో కనబడ్డాయి.

సాయంత్రం గుజరాత్ సరిహద్దు వైపు వున్న 'జామే పోర్' బీచ్‌కి వెళ్ళాం. ఇక్కడి నీటిలో రాళ్ళు లేకపోవడంతో పిల్లా పెద్దలు హాయిగా ఈత కొడుతున్నారు. బీచ్ వెంబడి విస్తరించి ఉన్న జీడి మామిడి చెట్ల నీడలలో చాలాసేపు కూర్చుండిపోయాం. చిన్న పిల్లలు కతియవార్ ప్రాంతపు ఒంటెలను, గుర్రాలను ఎక్కుతూ, దిగుతూ కేరింతలు కొడుతున్నారు. సూర్యాస్తమయాన్ని తనివితీరా చూసి, బీచ్‌ని ఆనుకుని ఉన్న ఫుడ్ స్టాల్స్‌లో రకరకాల కబాబ్స్, జెట్టీ రోల్స్, పావ్‌బాజీ, వివిధ వెరైటీల ఫిష్‌కర్రీలు రుచి చూశాం. మరుసటి రోజు బ్రిడ్జి దాటి 'నానీడామన్' వెళ్లాం. మొదటగా అక్కడి టూరిస్ట్ కాంప్లెక్స్‌కి వెళ్లాం. అతి విశాలమైన ప్రాంగణంలో కెఫెటేరియా, అందమైన కాటేజీలు, కాన్ఫరెన్స్ హాల్స్, హెల్త్ క్లబ్స్, యాంఫీ థియేటర్లు, జలపాతాలు ఉన్నాయి. ఆదివారం కావడంతో పిల్లా పెద్దలు కిటకిటలాడుతున్నారు. అయినా గార్డెన్లు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి.

దగ్గరలోని మిరాసోల్ వాటర్ పార్క్, లేక్ గార్డెన్ చూశాం. పచ్చటి పచ్చికబయళ్లు, రంగు రంగుల ఫౌంటెన్స్, ఎన్నో రకాల పూల మొక్కలు, పొడుగాటి చెట్లు. ఎంతో రమణీయంగా ఉంది ఆ లేక్ గార్డెన్. హంసాకృతిలో ఉన్న బోట్స్, లేక్‌లో షికారు చేయమని స్వాగతం పలుకుతున్నాయి.
నానీ డామన్‌లో 'సెయింట్ జెరోమ్' కోట ఉంది. దాని ముఖద్వారం నీటికి అభిముఖంగా కట్టారు. ఇది కూడా 17వ శతాబ్దం నాటిది. దీనిలోనే ఒక చర్చి, శ్మశానం, స్కూలు కూడా ఉన్నాయి. తిరిగి, తిరిగి అలసిపోయి, సాయంత్రం అవుతుంటే 'దేవ్ కా బీచ్' చేరాం. అతి పొడవైన సాగరతీరం ఉన్న ఈ బీచి టూరిస్టులకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మ్యూజికల్ ఫౌంటెన్, అమ్యూజ్‌మెంట్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఈ బీచి తీరం వెంబడి ఎన్నో రెసార్ట్స్, రెస్టారెంట్లు ఉన్నాయి. రాత్రి డిన్నర్, మ్యూజికల్ ప్రోగ్రాంతో ఆనాటి ట్రిప్ ముగిసింది.

డామన్‌లో 'నారియల్ పున్నమి' అనే పండుగ చాలా బాగా చేసుకుంటారు. చేపలు పట్టడానికి వెళ్ళే ముందు మత్స్యకారులు సముద్రునికి కొబ్బరికాయలు నివేదన చేసే పండుగ అది. నారియల్ అంటే కొబ్బరికాయలు.
డామన్ హాస్పిటల్స్‌కి వెళ్ళినపుడు అక్కడి డాక్టర్లు, ఇతర సిబ్బంది డామన్‌లో ఎలాంటి ఒత్తిడి, ఉరుకులు, పరుగులు లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవితం గడుపుతున్నామని చెప్పారు. మాకు కూడా అనిపించింది మామూలుగా అతి వేగంగా పరుగెత్తే గడియారం డామన్‌లో ఎంతో నింపాదిగా సాగిందని.

డయ్యూ ఇంకా బాగుంది

మూడు నెలలు గడిచాక డయ్యూ వెళ్ళాం. ఈసారి ఇంజనీరింగ్ చదువుతున్న మా పెద్దబ్బాయిని ఇంటర్ చదువుతున్న చిన్నవాడిని మాతో తీసుకుని వెళ్ళాం. 13 కి.మీ పొడవు, 3 కి.మీ వెడల్పు మాత్రమే ఉన్న డయ్యూ అరేబియన్ సముద్రం ఒడ్డున ఉంది. సముద్రం పై నుండి సదా వీచే గాలి, పరిశుభ్రమైన బీచ్‌లు ఈ దీవిని ఒక టూరిస్ట్ స్వర్గధామంలా మార్చేశాయి. గుజరాతీలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. రేవు కావడం, మిగతా దేశాలకు ఒక వారధిలా ఉండడం డయ్యూకి ఎంతో ప్రాముఖ్యత సంతరించి పెట్టాయి.

డయ్యూ వెళ్లడానికి ముంబాయి నుండి ఫ్లయిట్స్ ఉన్నాయి. రైలు మార్గంలో వెడితే వెరావాల్ స్టేషన్‌లో దిగాలి. అక్కడ నుండి 50 కి.మీ. రోడ్డు మార్గంలో ఉంది డయ్యూ.
మాకిచ్చిన గెస్ట్‌హౌస్ చక్రతీర్థ అనే సముద్రతీరం దగ్గర ఉంది. మా రూమ్స్ నుండి సముద్రం బాగా కనపడుతోంది. అక్కడ ఉన్న రెండు రోజులూ బీచిలో కూర్చుని, మత్స్యకారుల పడవలను, వారి హడావిడినీ, దూరంగా లంగరు వేసి ఉన్న ఓడలను చూస్తూ అందరం బాగా ఎంజాయ్ చేశాం. పోటుతో బాటు చేరువగా వస్తూ, మళ్ళీ దూరంగా పోతూ సముద్రం కూడా మాతో దాగుడుమూతలు ఆడి తెగ అల్లరి చేసింది. గెస్ట్‌హౌస్ దగ్గర కొండల్లో బొరియలు చూసి ఇవి ఏమిటా అనుకున్నాం. ఆ రోజు రాత్రి రూముకి తిరిగి వస్తుంటే అచ్చు కుక్కల్లా ఉన్న నక్కలు బీచ్‌పై తిరుగుతూ కనిపించాయి. తర్వాత తెలిసింది. డయ్యూలో నక్కల కాటుకు చాలామందే బలి అవుతుంటారని. అప్పుడర్థమైంది అవి నక్కల స్థావరాలని.

పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు

పొద్దునే దగ్గరలో ఉన్న జలంధర్ గుడి, చంద్రికా దేవత గుడి చూశాం. కొద్ది దూరంలో గంగేశ్వర్ గుడి ఉంది. అక్కడ చిన్న బిల ద్వారం కనపడింది. నక్కలు కానీ ఉంటాయేమో అని కాస్త భయం భయంగానే కిందికి దిగితే ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఐదు లింగాలు కనపడ్డాయి. పంచపాండవులు ప్రతిష్ఠించిన ఈ లింగాలను సముద్రుడు నిత్యం తన నీటితో అభిషేకించి వెళ్తాడట. డయ్యులో చూడాల్సిన బీచ్‌లు చాలానే ఉన్నాయి. మేం మొదట నాగోవా పల్లెలో ఉన్న నాగోవా బీచ్‌కి వెళ్ళాం. గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ బీచ్ నిండా కొబ్బరి చెట్లు, పామ్ వృక్షాలు, హాకా చెట్లు ఉన్నాయి. ఇక్కడ రకరకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. మా పిల్లలు తనివితీరా వాటిని ఎంజాయ్ చేశారు. గోగ్లా బీచ్, గేట్‌వే కూడా చూసి, సాయంత్రం గంటసేపు బోట్ క్రూయిజ్ చేశాం.

డయ్యూలోని సెయింట్ థామస్ చర్చిని మ్యూజియంగా మార్చేశారు. పురాతనమైన విగ్రహాలు, రాతిపై చరిత్రల చెక్కడాలు, అందంగా తీర్చిదిద్దిన చెక్కబొమ్మలు ఎన్నో ఉన్నాయి ఈ మ్యూజియంలో. రాత్రికి సెయింట్ పాల్స్ చర్చి చూశాం. 1610 శతాబ్దం నాటి ఈ చర్చి మన దేశంలోని పోర్చుగీసు చర్చిల్లోకెల్లా అతి ముఖ్యమైనది. దీపపు కాంతుల్లో ఆ చర్చి మెరిసిపోతోంది. 16వ శతాబ్దం నాటి కోట డయ్యూకి ముఖ్య ఆకర్షణ.

కోటకు మూడువైపులా పరవళ్ళు తొక్కుతూ సముద్రం ఉంటుంది. చుట్టూ అతి లోతైన కందకాలు ఉన్నాయి. బహదూర్ షా సుల్తాన్‌కి, పోర్చుగీస్ వారికి మధ్య కుదిరిన సంధికి ఇది ఒక మూగసాక్షి. అలనాడు జరిగిన ఎన్నో యుద్ధాలు మిగిల్చిన గుర్తులుగా అనేక ఫిరంగులు కోటలో పడి ఉన్నాయి. పరధ్యానంగా నడిచేవాళ్లను, గోడల మధ్య నుండి భీకరంగా తొంగి చూసే ఫిరంగులు భయపెట్టే అవకాశం ఉంది.

ఫనికోట

కోటపై నుండి చూస్తే దూరంగా ఎన్నో ఓడలు కనబడ్డాయి. ఒకవైపు నుంచి చూస్తే ఓడ ఆకారంలోని 'ఫనికోట' కనబడింది. ఈ కోటకి ఒకప్పుడు సముద్రం నీటిలో సొరంగ మార్గం ఉండేదట. ప్రస్తుతం బోట్‌లో వెళ్ళాల్సిందే. దానిలో ఒక లైట్‌హౌస్, చిన్న చర్చి ఉన్నాయి. మేము ఆ పెద్ద కోటలో తిరుగుతుండగానే సాయంత్రం అయింది. క్రమంగా మంచు కోటను కమ్మేసి చరిత్ర దాచుకున్నట్టుగా దాచుకునేసింది. ఒక అవ్యక్త అనుభూతికి లోనై అందరం గబగబ కిందికి దిగేశాం. మా పిల్లలకు ఒక చిన్న సందేహం కలిగింది. ఈ కోటలో ఏమైనా ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయేమోనని.
డయ్యూలో గుజరాతీ, పోర్చుగీసు వారి సంస్కృతుల మేళవింపు కనిపిస్తుంది. గర్భా, మాండోవీరా, వెల్‌డిగావో నృత్యాలు ఇక్కడ ఎంతో ప్రఖ్యాతి. డయ్యూ ప్రజలు టూరిస్టులందరికీ ఒకటే చెబుతుంటారు. "రండి తినండి, తాగండి, పాడండి, ఆనందంగా ఉండండి'' అని.

డయ్యూ సందర్శనకు కాస్త అయిష్టంగానే మాతో వచ్చిన మా పిల్లలిద్దరూ అక్కడి జీవనశైలిని చూసి ఆశ్చర్యచకితులు అయ్యారు. హాయిగా, ఎంతో ప్రశాంతంగా జీవితం గడుపుతున్న అక్కడి వారిని చూసి మా చిన్నవాడు డిక్లేర్ చేశాడు- తను రిటైర్ అవ్వగానే అక్కడే సెటిల్ అవుతానని.

- డా. ఎం. రమణి
e-mail : ramani 59@yahoo.in