ఛలో... ఛలో... ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ అంటే... నక్సల్స్ స్థావరమనీ, మందుపాతరలకు పుట్టినిల్లని మాత్రమే తెలుసు. అసలు ఆ రాష్ట్రం పేరు వింటేనే మావోయిస్టుల కనుసన్నుల్లో మెదిలే గిరిజనుల దయనీయ కథనాలు కళ్లముందు సాక్షాత్క రిస్తాయి. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరికిస్తే... ప్రకృతికాంత తన అందాలను ఆరబోసి... పరిచిన వెన్నెలలా... పడతి పూబంతి నవ్వులా పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఎన్నో చారిత్రక పర్యాటక కేంద్రాలకు ఛత్తీస్‌గఢ్ అడవితల్లి కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. మదిని పులకరింప జేసే ఆ అందాలను వీక్షించేందుకు మరి మీరు సిద్ధమా?!
ఒకప్పుడు బస్తర్ అడవులంటే మంత్రగాళ్ళు, చేతబడులు చేసేవారికి ఆలవాలంగా ఉండేవి. పర్యాటకులు వెళ్ళాలంటేనే భయపడేవారు. కాలక్రమేణా మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా తయారైంది. అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే గత కొన్నేళ్ళలో ప్రభుత్వం చొరవ చూపి ఛత్తీస్‌గఢ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంతో క్రమంగా పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆ బస్తర్ అడవుల గుండా వెళ్తే ఎన్నెన్నో ప్రకృతి అందాలు మనల్ని పలకరిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన తెగలవాళ్ళు అక్కడ ఉంటున్నారని ప్రతీతి. ‘‘నిరుపేదలు నివసించే ధనిక భూమి’’ అని దీనికి పేరు.
ఈ భూమి నిజంగానే చాలా గొప్పది. సహజ సౌందర్యానికి కూడా ఈ ప్రాంతానిది పెట్టింది పేరు. జీవితంలో ఎప్పుడూ చూడని సరికొత్త అందాలు, విభిన్న పార్శ్వాలను ఇక్కడ చూడొచ్చు. జానపద సంప్రదాయం, సంస్కృతి, పురావస్తు స్థలాలు, కొండలు, కొన్ని తరాలుగా ఇక్కడ నివసిస్తున్న గిరిజనుల ఆత్మీయత వీటన్నింటినీ ఏ ఒక్కరూ వదులుకోకూడదు. ఇక బస్తర్ అడవుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చివరకు సూర్యకిరణాలు కూడా ప్రసరించలేనంత దట్టంగా ఇక్కడి అడవులుంటాయి.
పాతరాతియుగంలోకి...
అబూజ్‌మాడ్ పేరు వినే వింటారు. ఒక్కసారి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే.. మీకు పాతరాతి యుగానికి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుంది. భూగ్రహం మీద ఇప్పటివరకు సజీవంగా ఉన్న అత్యంత పురాతన గిరిజనలు ఇక్కడే ఉన్నారు. దట్టమైన అడవుల్లో ఈ గిరిజనులు స్వేచ్ఛగా, నగ్నంగా సంచరిస్తూ వేటే జీవనాధారంగా గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం వలన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిషిద్ధప్రాంతంగా ప్రకటించినా, ఇప్పుడు మాత్రం పర్యాటకులను అనుమతిస్తోంది.
పాతరాతియుగం నాటి జీవనశైలిని చూడాలనుకుంటే ముందుగా పర్యాటక శాఖ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్తే సరిపోతుంది. గిరిజన జీవనశైలి, అడవుల్లో నుంచి వచ్చే సుగంధ పరిమళాలు, పెద్దపెద్ద జలపాతాలు, గుహల గోడల మీద చిత్రాలు ఇవన్నీ మనల్ని ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్లిపోతాయి.
ప్రకృతికి, ఈ గిరిజనులకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఇంతవరకు ఎవ్వరూ చెడగొట్టకపోవడం అదృష్టం. ఇలాంటి వాతావరణం మనకు ఇంకెక్కడా కనిపించదు.
దండకారణ్యం కూడా దట్టంగానే ఉన్నా, అక్కడా గిరిజనలున్నా... అదంతా నగరజీవన ప్రభావానికి లోనై గందరగోళంగా ఉంటుంది. రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడే ఎక్కువ రోజులు గడిపాడని పురాణాల్లో చెబుతారు. ఆయనకు, రాక్షసులకు పలు యుద్ధాలు జరిగిన ప్రాంతం కూడా ఇదేనంటారు. గుహల గోడల మీద ఉన్న చిత్రాలు మనల్ని దాదాపు ఆ కాలంలోకి తీసుకెళ్లిపోతాయి.
చిత్రమైన గుడ్డిచేపల గుహ...
ఛత్తీస్‌గఢ్ పర్యాటక ప్రదేశాల్లో అత్యంత ముఖ్యమైన, ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రం... గుడ్డిచేపల గుహ. జగదల్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహలను చూసి తీరాల్సిందే తప్ప వర్ణించడానికి పదాలు చాలవు. అప్పటివరకు చాలా గంభీరంగా కనిపించే కొండచరియ కాస్తా, ఈ గుహద్వారం వద్దకు వచ్చేసరికి ఉన్నట్టుండి అదృశ్యం అవుతుంది. ఈ గుహలో ఉండే గుడ్డిచేపల రహస్యం ఏమిటన్నది ఇప్పటివరకు శాస్తవ్రేత్తలు కూడా కనిపెట్టలేకపోవడంతో ఇది ఇప్పటికీ ఓ భౌగోళిక రహస్యంగానే మిగిలిపోయింది.
కొన్ని వందలమంది వీటిపై పరిశోధనలు చేసినా, ఏమీ కనిపెట్టలేక ఊరుకుండిపోయారు. గుహలోంచి పొడుచుకుని వచ్చినట్లు కనిపించే సిలిండర్ ఆకారాల నుంచి విచిత్రమైన సంగీత ధ్వనులు వస్తుంటాయి. ఈ ప్రాంతానికే అవి ఆకర్షణగా ఉంటాయి. ఇలాంటి స్టాలగ్‌మైట్లు, స్టాలస్‌టైట్లకు కోట్ ముసర్ గుహలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిగుండా వెళ్తుంటే కలిగే అనుభవాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేం. ఈ గుహలను సందర్శించేటప్పుడు ఓ గైడ్ సాయం తీసుకోవడం మంచిది.
ప్రకృతికాంత సోయగాలు...
కంగర్‌వ్యాలీ నేషనల్ పార్క్ పర్యటన దాదాపు ప్రతి ఒక్క పర్యాటకుడికి తిరుగులేని సంతృప్తిని, అత్యంత సహజమైన అనుభూతులను మిగులుస్తుంది. జగదల్‌పూర్‌కు ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ పూర్తి వైవిధ్యభరితమైన మొక్కలు, పూలు, జలపాతాలు, గుహలు, లోయలు అన్నీ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతివాదులు, శాస్తవ్రేత్తలు ప్రతి సంవత్సరం తమ పరిశోధనల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు.
పురావస్తు ప్రదేశాలంటే మీకు ఆసక్తి ఉన్నట్లయితే నేరుగా సిర్పూర్ వెళ్లి పోవాలి. ఇక్కడ 245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బరణ్వపర వైల్డ్ లైఫ్ రిజర్వ్ కూడా దాని అందాలకు ప్రసిద్ధి చెందినదే. ఇక్కడ బోలెడన్ని చిరుతపులులు, పులులు, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇవేకాక 150 రకాలకు చెందిన ఇతర జంతువులు కూడా ఉంటాయి. ఇందులోని కొన్ని వింతైన జంతువులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
సంవత్సరమంతా పర్యాటకుల తాకిడి...
వేసవి, శీతాకాలం అనే తేడా లేకుండా ప్రతి సీజన్‌లోనూ దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు పెద్దయెత్తున వస్తుంటారు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రకూట్ జలపాతానికి సంవత్సరం పొడవునా పర్యాటకల తాకిడి ఉంటుంది.
భారత నయాగరా...
నయాగరా జలపాతం చూడాలంటే న్యూయార్క్ వెళ్ళాల్సిందే. అయితే అచ్చంగా నయాగరా కాకపోయినా దాదాపు అలాగే ఉండే చిత్రకూట్ జలపాతాన్ని చూస్తే... ఇంచుమించు నయాగరా జలపాతాన్ని చూసిన అనుభూతి మీ సొంతం అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నయాగరా అంత వెడల్పు లేకపోయినా ఛత్తీస్‌గఢ్‌లోని ఈ జలపాతం మాత్రం చూపరులను కట్టిపడేస్తుంది. దేశంలోనే దట్టమైన అడవుల గుండా వెళ్తుంటే, అక్కడి లోయలు, గుట్టలు చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. జగదల్‌పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.
ఇంద్రావతి నదీ జలాలు ఇక్కడ వంద అడుగుల ఎత్తు నుంచి కిందకు అలా జాలువారుతుంటాయి. వర్షాకాలంలో నది పూర్తిగా ప్రవహిస్తున్నప్పుడు మొత్తం జలపాతమంతా కళకళలాడుతూ హోరెత్తిస్తుంది. ఆ వేగం, ఝరి చూస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ప్రవాహం దిగువకు వెళ్తుంటే నది మరింతగా విస్తరించి కనపడుతుంది. మీకు వీలైతే మాత్రం పున్నమి రోజునే ఈ జలపాతాన్ని చూడండి. జలపాతం పక్కనే ఓ కొండ చరియమీద పర్యాటక శాఖవారు ఓ చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి చూసేందుకు దృశ్యం బాగుంటుంది. జగదల్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే తీర్థ్‌గఢ్ జలపాతాలను కూడా మీరు సందర్శించొచ్చు.