ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 22 వన్యమృగ సంరక్షణా కేంద్రాలలో శివారం వన్యమృగ సంరక్షణా కేంద్రం ఒకటి. ఇది గోదావరి నదికి రెండు వైపులా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో 37 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేక రకం నీటి మొసళ్ళను సంరక్షిస్తున్నారు. పర్యావరణ చరిత్రపై పిహెచ్.డి. చేసిన నాకు ఎప్పటికైనా ఈ పర్యావరణ పరిరక్షక కేంద్రాన్ని చూడాలని కోరిక ఉండేది. ఈ కేంద్రపు పడమటి సరిహద్దు గ్రామమైన ఎగ్లాస్‌పూర్ గురించి మా అమ్మ చెప్పిన వివరాలు నాలో మరింత కుతూహలాన్ని రేకెత్తించాయి.
నేను జూన్ 16వ తేదీ ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లో గోదావరిఖని బస్సు ఎక్కి 11 గంటలకు రామగుండం దాటిన (220 కి.మీ) తరువాత 'బి పవర్‌హౌస్‌గడ్డ చౌరస్తా' దగ్గర దిగాను. అక్కడి నుండి ఆటోలో 10 కి.మీ. ప్రయాణించి ఎగ్లాస్‌పూర్ చేరుకున్నాను. ఎగ్లాస్‌పూర్ ఒక చారిత్రక గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న రాతియుగం, బౌద్ధయుగం, శైవయుగం నాటి చారిత్రక ఆనవాళ్ళు ఈ ఊరి మొదటి పేరు 'ఎహువలసపురం' అయ్యుంటుంది అనడానికి ఆధారమిస్తున్నాయి. ఎహువల ఛాంతమూలుడు అనే ఇక్ష్వాకురాజు నాగార్జునసాగర్ ప్రాంతంలోని విజయపురి రాజధానిగా తెలుగుదేశాన్ని కీ.శ. 300ల ప్రాంతంలో పరిపాలించాడు.
ఇక్ష్వాకు పాలక ప్రాంతం ఖమ్మం జిల్లా వరకు ఉండేదని ఇటీవల ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాలు జరిపే వరకు తెలియదు. ఖమ్మం జిల్లా కరీంనగర్ జిల్లాకు తూర్పు సరిహద్దు. ఎగ్లాస్‌పూర్ కరీంనగర్ జిల్లా తూర్పు ప్రాంతంలోనే ఉంది. అయితే కుతుబ్‌షాహీ సుల్తానులు తెలుగు దేశాన్ని (గోల్కొండ రాజ్యాన్ని) పరిపాలించిన కాలంలో ఎక్లాస్‌ఖాన్ అని ఒక అధికారి ఉండేవాడు. ఎగ్లాస్‌పూర్‌లో ఆ కాలపు కచేరీ కూడా ఉంది కాబట్టి అతడు ఈ ఊరిని తన పేర పొంది ఉండవచ్చు. ఇదే ఊరిలో నిజాం కాలం నాటి ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ కూడా ఉండేది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల వారు తమ మ్యాపులు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్లలో ఎగ్లాస్‌పూర్‌లో ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ ఉందనే చూపుతున్నారు. కాని నిజానికి అది ఇప్పుడు లేదు.
ఏనుగుకండి
ఎగ్లాస్‌పూర్‌కు మూడు పక్కలా గుట్టలు, అడవులు ఉండగా, ఉత్తరాన నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. ఊరికి దక్షిణం వైపు నడుస్తుండగా మనకు ఎన్నో ఎత్తయిన పచ్చని గుట్టల వరుసలు కన్పిస్తాయి. ఆ గుట్టల్లో ప్రధానమైనవి నల్లగట్టు, పొల్లగట్టు, కొసగట్టు, బొల్లిగుండ్లు, చాపరేళ్ళ గండి. నల్లగట్టు ఎగ్లాస్‌పూర్‌కు, పుట్నూరుకు మధ్య సరిహద్దు. ఈ నల్లగట్టు, బొలిగుండ్లు కలిసే ప్రదేశం ఇరుకుగా ఉంటుంది.
ఆ రెండు ఊర్ల మధ్య రాకపోకలు, రవాణా జరగడానికి సుమారు వేయేండ్ల కింద ఒక రాజు ఆ ఇరుకు ప్రదేశాన్ని సుమారు ఫర్లాంగు పొడవున రెండు గజాల వెడల్పుతో తొలిపించాడు. దాంతో గోదావరి నదిపై వారు జరిపే వస్తు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సులభతరమయ్యాయి. ఆ కండి దాటిన ఫర్లాంగు దూరంలోనే పాలవాగు, పెద్దవాగు ప్రవహిస్తున్నాయి. అవి మరో వాగులో 'సంగమించి' చివరగా గోదావరిలో కలుస్తుండడం చూస్తే ఆ ప్రాంతంలో పూర్వం వ్యాపార సౌలభ్యం కొరకే ఆ కండి తొలిపించబడింది అనిపిస్తుంది.
కండి అంటే కనుమ. ఇది ఉత్తర దక్షిణంగా సాగుతుంది. కండి మార్గంలో ఉన్న ఒక పెద్ద బండ అంచున నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తు కొలతలతో దంతాలు గల ఒక ఏనుగు కుడి కాలు ఎత్తి దక్షిణం వైపు నడుస్తున్నట్లుగా తొలచబడింది. ఆ ఏనుగుపైన ఒకరు కూర్చున్నట్లుగా ఉంది. ఆ చిత్రం రాజుదో, రాణిదో, మరెవరిదో తెలియదు. శాసనాలుండకపోతాయా అని చుట్టుప్రక్కల ఒకటికి నాలుగుసార్లు వెదికాను. నా ప్రయత్నం ఫలించింది. ఒక శాసనం కనిపించింది.
శాసనం ఏనుగుకు వెనుకవైపున మూడు అడుగుల దూరంలో బాగా పాకురుపట్టి కనిపించకుండా ఉంది. కొద్దిగా శుద్ధి చేశాక అర్థమైంది. అది ఒక తెలుగు శాసనం. మూడు గజాల పొడవు, అడుగు వెడల్పుతో మూడు వరుసల్లో రాయబడి ఉంది. పాలియోగ్రఫీ (ప్రాచీన వ్రాతలకు సంబంధించిన శాస్త్రం) ప్రకారం ఆ శాసనం సుమారు పదవ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చు. ఆ శాసనాన్ని గురించి ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారికి తెలియజేస్తే దాని ఉద్దేశం మనకు స్పష్టంగా తెలియొచ్చు. అలాంటి శాసనాన్ని కనిపెట్టడం నా అదృష్టం. ఏనుగుకండి గుండా ప్రయాణించేవారు తమకు సంతానం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని ఏనుగు తొండం మీద నూనె పోసేవారట. ఆ నూనె మరకలు కన్పిస్తున్నాయి.
బోగందాని గుడి!
ఏనుగుకండికి తూర్పున కొద్దిదూరంలో నల్లగట్టు మీద బోగందాని గుడిగా చెప్పబడుతున్న గుహ ఉంది. ఆ గుహను ఒకప్పుడు ఆవాసంగా వాడారు అనడానికి నిదర్శనంగా అందులో గోడ కట్టడాలు కన్పిస్తున్నాయి. ఆ గుహలో సుమారు ముప్పై నలభై మంది కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. గుహ దగ్గర ఒక రోలు కూడా కనిపించింది. ఆ గుహ ఒకప్పటి నివాస ప్రాంతం అనడానికి ఇది కూడా నిదర్శనంగా నిలుస్తుంది. క్రీస్తుకు పూర్వం రెండు, మూడు శతాబ్దాలు, క్రీస్తు తర్వాత రెండు, మూడు శతాబ్దాలు తెలుగు దేశంలో బౌద్ధమతం బాగా వ్యాప్తిలో ఉండేదనేది చారిత్రక సత్యం. బౌద్ధ సన్యాసులు ఎండాకాలం, చలి కాలాల్లో గ్రామాలు, పట్టణాల్లో మత ప్రచారం చేసి వర్షాకాలంలో గుహల్లో తలదాచుకునేవారు.
మొదట్లో బౌద్ధ ఆరామ విహారాల్లోకి స్త్రీలకు ప్రవేశం ఉండేది కాదు. క్రమంగా క్రీ.శ. 6,7 శతాబ్దాల నుండి బౌద్ధ మతంలో వజ్రయాన శాఖ బయలుదేరి అందులో మద్యమాంసాలతో పాటు మగువలకు కూడా ప్రవేశం కల్పించబడింది. తదనంతరం బౌద్ధ ఆరామాల్లో లైంగిక కార్యకలాపాలు ఎక్కువై అవి ప్రజాదరణను కోల్పోయాయి. అలాంటి ఆవాసాలు బొంకుల దిబ్బలుగా, లంజల దిబ్బలుగా పేరుబడసాయి. అలాంటి పరిణామానికి గురైనదే ఈ ఎగ్లాస్‌పూర్ బౌద్ధ స్థావరం (బోగందాని గుడి) కూడా. మొదట అది పవిత్రమైనదే (గుడి) అయినా కూడా కాలక్రమంలో అందులో బోగం (లైంగిక) కార్యక్రమాలు జరగడం వల్ల అది బోగందాని గుడి అనే వింత పేరును సంతరించుకుంది. ఎగ్లాస్‌పూర్‌కు దగ్గర్లోని 'లంజమడుగు' ప్రాంత చరిత్ర కూడా ఇలాంటిదే కావడం గమనార్హం.
నీటి బండలు
బోగందాని గుడికి వంద అడుగుల దూరంలో తూర్పున ఒక బోరు ఎక్కి సగం దిగినాక 'గద్దవాలు' అనే ప్రదేశంలో 'నీటిబండ' ఉంది. అది ఒక రాతి గుండంలా ఉంది. దానిలో ఎంతో లోతైన నీరు ఉంది. ఒక పొడవాటి కట్టెను దించినా దాని అడుగు అందలేదు. అక్కడి ప్రజలు అతిశయోక్తిగా అందులో ఏడు మంచాల నులకకు రాయి కట్టివేసినా అడుగు అందదని చెప్తారు. ఆ గుండంపైకి ఒక రాయి పైకప్పుగా ఉంది. ఆ గుండం పరిసరాల్లో సుమారు అరడజను ఆవాసయోగ్యమైన గుహలున్నాయి. నీటిబండకు ఎదురుగా పడమటి దిక్కున ఉన్న బొల్లిగుండ్ల గుట్టపై మరో అరడజను గుహలున్నాయి.
ఇంకొంచెం పడమటి దిక్కున చాపరేళ్ళ గండి దాటాక 'కుక్కమూతి రాళ్ళ' మధ్య మరో నీటి దొన ఉంది. ఆ రెండు నీటి దొనల్లో ఎండాకాలంలో కూడా నీళ్ళుంటాయి. కుక్కమూతి రాళ్ళ దగ్గర గల పెద్ద దొనలో 'అంబటి మల్లన్న' అనే దేవుడు (శివుడు) పూజలందుకుంటున్నాడు. అయితే మల్లన్న గుడి ముందున్న 'పెయ్యకండి'లోని పెయ్య (లేగదూడ) కాళ్ళ డెక్కల గుర్తులు, ఏనుగుకండిలోని ఏనుగు గుర్తులు ఇక్కడికి పడమరన 20 కి.మీల దూరంలో ఉన్న కోటిలింగాల రాజుల (గోబద, సమగోప, సాతవాహన) నాణేల మీద కూడా ఉన్నాయి. వాటి మధ్య ఉన్న పోలిక ఏనుగుకండి, పెయ్యకండిల చరిత్రను క్రీస్తు పూర్వపు కాలానికి తీసుకెళ్ళింది.
పీరీల దొనలో అడవి పందులు
ఏనుగుకండికి పడమరగా ఉన్న బొల్లిగుండ్ల గుట్టను ఎక్కిన తరువాత శిఖరాన్ని ఎక్కక ముందే పడమర వైపుకి తిరిగితే కనిపించేది పీరీల దొన. దాని ముందు కనిపించేది పీరీల గుండం. తెలుగు దేశాన్ని కుతుబ్‌షాహీలు, వారి తరువాత నిజాంలు పరిపాలించిన (15-20 శతాబ్దాల) కాలంలో పీరీల పండుగ సమయంలో ఇక్కడ ముస్లింలు, హిందువులు పీరీలను నిలిపేవారట. ఆ దొన లోతుగాను, పొడవుగాను, చీకటిగాను ఉంది. అందులోకి దేవుడు ఆవహించిన (శిగం తూలే) మనిషి వెళ్ళి పీరీలను బయటికి తీసుకువచ్చేవాడట. ఆ దొన పైన రాతిబండకు నాగులు, బైరాగులు వంటి అస్పష్టమైన విగ్రహాలున్నాయి. రాతియుగపు చిత్రాలు కూడా గోచరిస్తున్నాయి. స్పష్టంగా తెలుసుకుందామని ఆ దొన దగ్గరికి వెళ్ళేసరికి పొలోమని ఐదారు అడవి పందులు బయటికి వచ్చి పొదల్లోకి పారిపోయాయి.
ప్రకృతి రమణీయత
పీరీల దొన నుండి మేము బొల్లిగుండ్ల శిఖరమెక్కాం. అక్కడి నుంచి చూస్తే ప్రపంచమంతా మన ముందే ఉందనిపించింది. ఆ శిఖరం భూమికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ఉత్తరం వైపు చూస్తే గలగలా పారుతున్న గోదావరి, మిగతా మూడుపక్కలా ఎత్తయిన గుట్టల వరుసలతో కూడిన పచ్చని అడవులు, లోయలు, వాగులు, కొండల్లో ఏకాంతంగా కనిపించే తెల్లని గుడి (అంబటి మల్లన్న దేవాలయం) ఉన్నాయి. గురజాడ అప్పారావుగారి కన్యక వెళ్ళింది ఈ గుడికేనేమో అనిపిస్తుంది.
ప్రకృతి ప్రేమికులను, అడ్వెంచర్ పర్యాటకులను, పరిశోధకులను తప్పకుండా అలరించే ప్రదేశం ఎగ్లాస్‌పూర్ ఏనుగుకండి ప్రాంతం.
- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250