విహారాలు

India

Gamyam

Sunday, July 17, 2011

ఊరెళ్లే రైలు కాదు ... టూరెళ్లే రైలు!


ప్యాలెస్ ఆన్ వీల్స్
భారతదేశపు మొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్. లగ్జరీ ట్రైన్లలో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. రాజస్థాన్ రాజ్‌పుత్‌లు, గుజరాత్ రాజులు, హైదరాబాద్ నిజాములు, బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ వాడిన రైలు బోగీల థీమ్‌లతో చారిత్రక వైభవం ఉట్టిపడేలా ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు.

ఇది రాజస్థాన్ రాష్ట్ర పర్యాటక శాఖ- ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఈ రైల్లోని 14 బోగీలకు రాజస్థాన్‌లోని పద్నాలుగు సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. ఆర్నెల్ల ముందుగా బుకింగ్‌‌స అయిపోయే ఈ రైలుకు విదేశీ పర్యాటకులెక్కువ. 1991లో ఏసీ ఏర్పాటుచేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు.


చూపించే ప్రదేశాలు: ప్రతి బుధవారం ఢిల్లీ నుంచి ప్రయాణం మొదలవుతుంది. జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయపూర్, చిత్తోర్‌ఘడ్, సవాయి మదోపూర్ (రణతంబోర్ కోట, నేషనల్‌పార్క్), భరత్‌పూర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా.

ఖర్చు: ఎనిమిది రోజుల ఈ ప్యాకేజీ ధర రోజుకు, ఒకరికి 22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే 33 వేలు, ముగ్గురు గదిని పంచుకుంటే 45 వేలు ఛార్‌‌జ చేస్తారు. అక్టోబరు-మార్చి మధ్య ధరలు ఎక్కువ. మే, జూన్, జూలై నెలల్లో ఈ ట్రైన్ బంద్!

మహరాజా ఎక్స్‌ప్రెస్

2010లో ప్రయాణం ప్రారంభించిన ఈ రైలు లగ్జరీ ట్రైన్ సిరీస్‌లో తాజా ప్రాజెక్టు. ఇండియన్ రైల్వే, గ్లోబల్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ సంయుక్తంగా నడుపుతున్నాయి. మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి రూపకల్పన చేసిన రైలిది.

చూపించే ప్రదేశాలు:

ప్రిన్స్‌లీ ఇండియా: ప్రతి శనివారం ముంబయి నుంచి ప్రారంభం. వడోదర, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీ.

రాయల్ ఇండియా: పైనున్న ప్రాంతాలే. ఢిల్లీ నుంచి ప్రతి ఆదివారం టూరు ప్రారంభం.
క్లాసికల్ ఇండియా: ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగ్రా, గ్వాలియర్, ఖజురహో, బంద్‌వగ్రా, వారణాసి, లక్నో మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.

ఖర్చు: ప్రిన్స్‌లీ ఇండియా, క్లాసికల్ ఇండియా టూర్ ప్యాకేజీ మొత్తం రూ. 3 లక్షల 18 వేలు. రాయల్ ఇండియా ప్యాకేజీ 2 లక్షల 78 వేలు. ఇందులోని ప్రెసిడెన్షియల్ సూట్ ప్యాకేజీ 9 లక్షలు.


రాయల్ రాజస్థాన్
ప్యాలెస్ ఆన్ వీల్స్‌కు సమాంతర ప్రాజెక్టు. జనవరి 2009లో ప్రారంభం. రాజ్‌పుత్‌ల అంతఃపురంలో మాత్రమే కనిపించే ఇంటీరియర్‌ను ఏర్పాటుచేశారు.

చూపించే ప్రదేశాలు:
ప్రతి ఆదివారం ప్రయాణం మొదలై మరుసటి ఆదివారంతో ముగుస్తుంది. ఢిల్లీ-జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘడ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా-ఢిల్లీ.

ఖర్చు: ఇద్దరు కలిసి గది తీసుకుంటే ఒకరికి రోజుకు రూ.26,200. ఎక్స్‌ట్రార్డినరీ సూట్ రోజుకు రూ. 71,000.


డెక్కన్ ఒడిస్సీ
ఇది దక్షిణ భారతదేశంలో మొదటి లగ్జరీ రైలు. ప్రకృతి, చరిత్ర మేళవింపుతో మహారాష్ట్ర ప్రభుత్వం - రైల్వేశాఖ సంయుక్తంగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు డెక్కన్ ఒడిస్సీ. దీనికి ఫైవ్ స్టార్ హోటల్ ఆన్ వీల్స్ అని కూడా పేరుంది.

చూపించే ప్రదేశాలు:
మే, జూన్, జూలై నెలల్లో నడవదు. మిగతా సమయాల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి ప్రతి బుధవారం ప్యాకేజీ ప్రారంభం. డిమాండ్‌ను బట్టి నడుస్తుంది. ముంబయి నుంచి బయలుదేరి.. సింధుదుర్గ్, గోవా, కొల్హాపూర్, దౌలతాబాద్, చంద్రపూర్, అజంతా గుహలు, నాసిక్‌లను చుట్టేసుకుని మళ్లీ బుధవారం ముంబయికి చేరుకుంటుంది.

ఖర్చు: ఇద్దరు ఒకే బోగీ తీసుకుంటే ఒకరికి రోజుకు రూ. 17,400. ఇది డీలక్స్ క్యాబిన్ ధర. ఇక ప్రెసిడెన్షియల్ సూట్ ఇద్దరు పంచుకుంటే ఒకరికి రోజుకు రూ. 29000. పీక్ సీజన్లో (అక్టోబరు- మార్చి) ధరలు మరింత ఎక్కువ.


ద గోల్డెన్ చారియట్
గోల్డెన్ చారియట్ కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించడానికి రూపొందించిన ప్యాకేజీ. పూర్తి అత్యాధునిక రైలు. 2008 మార్చిలో ఇది ప్రారంభమైంది. నిర్వహణ ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్. రెండురకాల ప్యాకేజీలను నిర్వహిస్తుంది.

చూపించే ప్రదేశాలు:
ప్రతి సోమవారం టూర్లు ప్రారంభం. ‘ప్రైడ్ ఆఫ్ సౌత్’ ప్యాకేజీలో బెంగలూరు నుంచి మొదలై కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హోస్పేట్, బాదామి, గోవాల మీదుగా- మళ్లీ బెంగలూరు చేరుతుంది.
‘స్ల్పెండర్ ఆఫ్ సౌత్’ ప్యాకేజీలో తమిళనాడు, కేరళ స్పెషల్. బెంగలూరు నుంచి చెన్నై, మామళ్లపురం, పాండిచ్చేరి, తిరుచిరాపల్లి, తంజావూరు, మధురై, తిరువనంతపురం, పూవార్, కోచి (బ్యాక్‌వాటర్స్) చూపించి మళ్లీ బెంగలూరుకు తీసుకువస్తుంది.
ఖర్చు: ఒక గదిని ఇద్దరు పంచుకుంటే ఒకరికి రోజుకు రూ.18,000 పడుతుంది. ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న లగ్జరీ ట్రైన్లలో ఇదే కాస్త తక్కువ ఖరీదు.

ఇంకా ఇవి కూడా...

వీటికి భిన్నమైన కొన్ని ప్రత్యేక పర్యాటక రైళ్లను భారతీయ రైల్వే నిర్వహిస్తోంది. 


ఫెయిరీ క్వీన్: 1855లో ఇంగ్లండ్‌లో తయారుచేసిన ఈ రైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో రిటైరైన దీన్ని బాగు చేసి 1997 జూలైలో మళ్లీ పట్టాలపైకి తెచ్చారు. ఇది ఢిల్లీ-ఆల్వార్-సరిస్కా (పులుల కేంద్రం)- ఢిల్లీ ప్యాకేజీ నిర్వహిస్తుంది. రెండ్రోజుల ఈ మొత్తం ప్యాకేజీ ఒకరికి రూ. 10,500 .

బుద్ధిస్ట్ ట్రైన్:
ఇది ఎనిమిది రోజుల ప్యాకేజీ టూరు. గౌతమబుద్ధుడికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో మాత్రమే పర్యటిస్తుంది. బుద్ధుడు పుట్టిన లుంబిని ప్రాంతం, ఆయన జ్ఞానోదయం పొందిన బుద్ధగయ, మొదట శిష్యులకు బోధించిన సార్‌నాథ్, నిర్యాణం పొందిన కుశినగర్‌తో పాటు ఇతర బౌద్ధస్థూపాలను సందర్శించాలనుకునే వారికి ఇంతకంటే మరో మంచి ఎంపిక లేదు. మొత్తం ఎనిమిది రోజులూ పర్యటించాల్సిన అవసరం లేదు. కావల్సినంత వరకే ప్రయాణించవచ్చు. మామూలు ఏసీ ట్రైన్ల ఖరీదులో ప్యాకేజీలు ఉంటాయి.

రైల్వే టూరిజం ప్యాకేజీలను భారతీయ రైల్వే నిర్వహించే www.irctc.co.in ద్వారా బుక్ చేసుకోవచ్చు. అన్ని లగ్జరీ ట్రైన్లకు వాటిపేరు మీదనే ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అన్ని ప్యాకేజీలు ఆన్‌లైన్ ద్వారా బుక్/క్యాన్సిల్ చేసుకోవచ్చు. ‘ఆలస్యం అమృతం విషం’ అని తెలియదా మీకు!


లగ్జరీ ట్రైన్ల సదుపాయాలు

దాదాపు అన్నింటిలో 14 బోగీలుంటాయి. ప్రతిగదికి ప్రత్యేక ఏసీతో ఫైవ్ స్టార్ సదుపాయాలతో బెడ్‌రూమ్ ఉంటుంది. ఇక ప్రతి ట్రైన్‌లో ఒక బార్, రెండు రెస్టారెంట్లు, లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, ఆయుర్వేద స్పా, జిమ్, అవుట్‌గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్‌కమ్, ఎల్‌సీడీ టీవీలు, డీవీడీ, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్ (అద్దెకు) ఉంటాయి. ప్రతి గదికి బాత్/టాయ్‌లెట్ రూమ్ ఉంటాయి. 24 గంటలూ వేడి/చల్లటి నీరు. హెయిర్ డ్రయ్యర్‌తో సహా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. ప్రతి గదికి అటెండర్‌‌స ఉంటారు. 

- ప్రకాష్ చిమ్మల

No comments:

Post a Comment