విహారాలు

India

Gamyam

Wednesday, July 13, 2011

జలపాతాల నిలయం... కుట్రాలం

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే పర్యాటకులు జలపాతాలను సందర్శించడానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అయితే.. అలాంటివి ఓ ఏడు జలపాతాలు ఒకే చోట దర్శనమిస్తే.. ఇక పర్యాటకులకు పండగే మరి. అలాంటి ప్రదేశమే కుట్రాలం. తమిళనాడులో ఉన్న ఈ ప్రాంతంలో ఒకే చోట ఏకంగా ఏడు జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధుతను చేస్తున్నాయి. మరి ఆ జలపాతాల్లో జలకాలాటకు సిద్ధమేనా? అయితే పదండి...


new_farms
వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఇంతగా పర్యాటకులకు ఇష్టమైన జలపాతాలతో పాటు ఆద్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆద్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం.

కుట్రాలం ప్రత్యేకతలు...

కుట్రాలం పేరు చెప్పగానే జలపాతాల హోరుతో పాటు అక్కడ వెలసిన కుట్రాల నాదర్‌ స్వామి ఆలయం అందరికీ గుర్తుకు వస్తుంది. నటరాజు అవతారం కూడా అయిన ఆ పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా ఇక్కడ వెలిశారని పురాణాలు పేర్కొంటున్నాయి. కుర్తాలంలోని శివలింగాన్ని పురాణకాలంలో అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. కుర్తాలంలోని ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్పసంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. కుర్తాలంలోని కుర్తాల నాదర్‌గా వెలసిన పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు. ఈమెతో పాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలసినా ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరగడం ఓ విశేషం.

జలపాతాల నెలవు...

Tenkashi_Kutralam
కుట్రాలంలో కుట్రాల నాదర్‌ స్వామి తర్వాత మనల్ని మరింత పులకరింపజేసేది ఇక్కడ ఉన్న జలపాతాలు. పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్‌ ప్రాంతంలో పుట్టిన చిత్తరువి అనే నది కొండ కోనల్లో ప్రవహిస్తూ తన ప్రధాన నది అయిన శివలప్పెరి అనే నదిలో కలిసేముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా ప్రవహిస్తుంది. అత్యంత అద్భుతంగా కానవచ్చే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాద ప్రదేశాల్లో జాలువారే కారణంగా కొన్నిచోట్ల మాత్రమే పర్యాటకులు జలపాతాల్లో స్నానం చేయడానికి అనుమతిస్తారు. కుట్రాలంలోని జలపాతాల్లో తనివితీరా స్నానం చేసేందుకు ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటూనే ఉంటుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/6941031133fcb0d04bd1bd891ba0a1e9294e193a.jpeg
కుట్రాలం ప్రాతంలో జాలువారే ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుట్రాల నాదన్‌ ఆలయానికి సమీపంలోనే ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. కుట్రాలంలోని జలపాతాల్లో సిత్తరవి అనే జలపాతం పర్యాటకులు స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు నిరభ్యంతరంగా స్నానం చేయవచ్చు. కుట్రాలంలోని మరో జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్దదైన ఈ జలపాతం ఐదు పాయలుగా క్రిందికి జాలువారుతుంటుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ జలపాతం వద్ద కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj36uvk32GDu6KIAEeb-YOfNXEuhyphenhyphenCS8ooMff-xkPwJ-pN0x7goVPJ6JHjbeXhnUHEh_Yyr678ewuWHsAaFZ-GaWUGVZdH8WLcYfzovuihUb7GvlO7U4zREBL0cD7qkMAyEWR35f8ZuyW_-/s320/kutrallam-falls.jpg
‘సౌత్‌ స్పా’ సౌందర్యం కుట్రాలం జలపాతం...
ఎన్నిసార్లు చూసినా తనివితీరని అందం కుట్రాలం జలపాతం సొంతం. కనువిందు చేసే ప్రృతి, ఎత్తయిన కొండల పైనుంచి దుమికే జలపాతాలు, సెలయేటి గలగలలు, ఆహ్లాదపరిచే పచ్చదనంతో ఈ ప్రాంతం ఓ అద్భుతమైన ప్రపంచంలా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో అయితే కుట్రాలం భూలోక స్వర్గంగా మారుతుందనటంలో అతిశయోక్తి లేదు. సందర్శకుల తాకిడి, వారి హర్షాతిరేకాలతో కుట్రాలం మార్మోగుతూ ఉంటుంది. దక్షిణ స్పాగా వ్యవహరించే ఈ కుట్రాలంలోని జలపాతాలు చాలా ప్రఖ్యాతిగాంచాయి.


Nataraja
ఇక్కడ పలు జలపాతాలు ఉన్నా... వాటిలో మెయిన్‌ శ్హఫాల్స్‌ ప్రధానమైంది. దీనినే స్థానికులు పెరియ అరువి (అరువి అంటే తమిళంలో జలపాతం అని అర్థం) అని పిలుస్తుంటారు. ఈ పెరియ అరువియే కుట్రాలం జలపాతంగా పేరుగాంచింది. దీనికి సమీపంలో షన్బగదేవి, చిట్టరువి, తేనరువి, ఐందరువి, పులి అరువి, పళతోట్ట అరువి, పాత కుట్రాలం, బాలరువి... తదితర జలపాతాలున్నాయి. అయితే వీటన్నింటికంటే కుట్రాలం జలపాతంలో వర్షాకాలంలో సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

టైగర్‌ ఫాల్స్‌.. గాండ్రింపు..

కుట్రాలంలోని మరో జలపాతమైన టైగర్‌ ఫాల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జలపాతం పైనుంచి జాలువారుతుంటే దాని శబ్ధం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి టైగర్‌ ఫాల్స్‌ అనే పేరువచ్చింది. ఈ జలపాతంలో సైతం పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇవేకాకుండా కుట్రాలంలో ఇతర జలపాతాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

నటరాజు నర్తించిన నేల...

నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే కలదు. అలాగే ఈ ప్రాంతంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. తేనరువి వద్ద తేనెపట్టులు అధికంగా ఉండటంతో దానికా పేరు వచ్చినట్లు చెబుతుంటారు. ఇది ప్రమాదకరమైనది కావటంతో ఆ ప్రాంతంలోకి సందర్శకులను అనుమతించరు.


Melaittirumanancheri
ఇక ప్రతి సంవత్సరం జూన్‌ నుంచి ఆగస్టు నెల వరకూ కుట్రాలం సీజన్‌ ఉంటుంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావడంతో తొలి అర్ధభాగంలోనే కుట్రాలం సీజన్‌ ప్రారంభమయ్యింది. మహిళలు కుట్రాలంలో స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతులను కల్పించారు. జలపాతాల వద్ద తైల మర్దనం కూడా చేస్తారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు స్థానిక అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవటం వల్ల ప్రశాంతంగా ఇక్కడ సందర్శించవచ్చు. అయితే జలపాతం ఉధృతి పెరిగే సమయాల్లో మాత్రం కుట్రాలం జలపాతాల్లో స్నానాలకు సందర్శకులను అనుమతించరు.

దక్షిణ కాశీ.. తెన్‌కాశి...

కుట్రాలం ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలవబడే ఈ కుట్రాలంలో తెన్‌కాశి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుట్రాలనాథుడుగా కొలువైన శివుడు... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులచే నిత్యపూజలు అందుకుంటున్నాడు.అలాగే కుట్రాలంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ ఆలయం సమీపంలోని సిద్ధుల గుహ కూడా ప్రసిద్ధి చెందినదే. నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే ఉంది. చిట్టూరు, మణి ముత్తారు, పచ్చయారు, తామపర్ణి నదుల జన్మస్థలం కూడా కుట్రాలమే..!


ఎలా వెళ్లాలంటే...
కుట్రాలం, తమిళనాడులోని చెన్నై నగరానికి 620 కిలోమీటర్ల దూరంలోనూ, కన్యాకుమారికి 137 కిలోమీటర్ల దూరంలోనూ, తిరునల్వేలికి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. కుట్రాలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో తెన్‌కాశి రైల్వే స్టేషన్‌ ఉంటుంది. అలాగే.. తిరుచ్చి, మధురై, రాజపాళయం, కోవిల్‌పట్టి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. కుట్రాలంలో సందర్శకుల సౌకర్యార్థం పలు విడిది గృహాలు కూడా అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment