అంబరాన్ని తాకే హిమలయాలు.. వాటినుండి గలగలమంటూ పారే సెలయేళ్ళు.. క్రమశిక్షణకు మారుపేరుగా.. ఒకే వరుసలో సైనిక పటాలాన్ని తలపిస్తూ.. ఏపుగా పెరిగిన పైన్ వృక్షాల అందాలు.. అందమైన లోయలు.. ఆ లోయల్లో వివిధ రకాల పుష్పజాతుల సోయగాలు.. వీటన్నింటి కలయికే... భూలోకంలో స్వర్గాన్ని గుర్తుచేసే.. కుమావన్ పర్వతాలు..

కుమావన్ అందాలు...
వాయువ్యంలో కాశ్మీర్ మొదలుకుని ఈశాన్య భారతదేశం వరకు విస్తరిం చిన ఈ హిమాలయా పర్వతాలలో పైన మనం చెప్పుకున్న కుమావన్ ప్రాంతం అత్యంత సుందరమైనది. ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ కుమా వన్ పర్వతాల్లో.. హిమాలయాలలోనే అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడే పుణ్యక్షేత్రాలున్నాయి. కాశ్మీరీ అందాల కు ఆలవాలమైన సౌర్ లోయ కూడా కుమావన్‌లో భాగమే. ఆ లోయనుంచి ఎటు చూసినా పచ్చటి ప్రకృతే మనకు దర్శనమిస్తుంది. ఎతైన పర్వతాలు, ఆ పర్వతాల మధ్య మెలికలు తిరిగిన కాలిబాటలు, ఆ బాటల వెంట.. అడగడుగా ఓ దేవతా మందిరం.. ఇలా వర్ణించేందుకు వీలులేనంతటి విశేషాలను తనలో దాచుకున్నదే కుమావన్.
ప్రకృతి, దేవతల ప్రతిరూపాల ను ఇక్కడి కొండలు, గుట్టలు, లోయలలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి మందిరాల్లో ఒకటి.. చితాయ మందిరం. ఈ ఆలయం ముందు కొన్ని వందల గుడిగంటలు వేలాడగట్టి ఉండడం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఓ అరుదైన ఆచారాన్ని అవలంభిస్తారు. అక్కడి దేవతకు మన కష్టాలను విన్నవించుకునేందుకు కాగితాలను వాడతారు. తమ కోరికలను ఆ కాగితాలపై రాసి.. గంటతో సహా మందిర ప్రాంగణంలో వేలా డదీస్తారు. ఇలా చేస్తే.. ఆ దేవత తమ విన్నపాలను తప్పనిసరిగా మన్నిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఎటు చూసినా సరస్సులే...
ప్రకృతి సహజంగా ఏర్పడిన సుమారు 50 సరస్సులు కుమావన్ పర్వతాల అందాలకు మరింత శోభనిస్తుంటాయి. దాదాపు ప్రతి పర్వతం మధ్యన ఒక సరస్సు ఉంటుంది. ఆ పర్వతం మీద పడిన వర్షపు నీరు, కరిగిన మంచు ఈ సరస్సుల గుండా ప్రవహిస్తాయి. ఆ సరస్సుల్లో అత్యంత స్వచ్ఛమైన నీరు, ఆ నీటిలోపల చుట్టూ ఉన్న ప్రకృతి అందాల ప్రతిబింబాలు.. కనువిందు చేస్తాయి. కుమావన్‌లో మొత్తం 73 పర్వతాలున్నాయి. ప్రతి పర్వతం నేరుగా ఆకాశంలోకి చొచ్చుకుని వెళుతున్నట్లు కనబడుతుంది. ఇవేకాకుండా 17 హిమఖండాలు కూడా ఉన్నాయి. దేవతల కోసమే ఈ ప్రదేశం ఏర్పడిందా! అన్నట్టు ఉండే ఈ అందమైన ప్రదేశంలో అడుగడుగునా ఓ దేవాలయాన్ని దర్శనమిస్తుం ది. అలా మొత్తంగా 40 శైవ మందిరా లు, మరో 48 దేవీ మందిరాలు ఇక్కడ పూజలందుకుంటున్నాయి.
వన్యప్రాణులకూ నిలయమే...
కుమావన్ దేవతల నివాసమే కాదు. వన్యప్రాణులకూ ఆలవాలమే. పక్షి ప్రేమికులకు ఇది ఓ రకమైన స్వర్గమే. ఇక్కడ సుమారు 300 రకాల పక్షి జాతులు మనకు దర్శనమిస్తాయి. ఉదయం, సాయంత్ర వేళల్లో ఆ పక్షుల కిలాకిలారావాలు వీనులవిందు చేస్తాయి. పక్షులతో పోటీపడి రంగులు వెదజల్లే సీతాకోక చిలుకలకు కూడా ఈ దేవతల భూమే నిలయం.

అలాగే మంచుతో కప్పబడి ఉండే పర్వతాలలోని గోవింద వన్యప్రాణి సంరక్షిత ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇక్కడ హిమాలయాలకు మాత్రమే పరిమితమైన నల్ల భల్లూకం, మంచు చిరుత, కస్తూరు, కోళ్ల వంటి పక్షులు, తాహిర్‌లు కనువిందు చేస్తాయి. ఇక్కడి పర్వతాలలో స్వరరోహిణి, నల్లశిఖరం అనేవి ప్రత్యేకంగా చూడదగ్గవి.ఇంతటి ప్రకృతి విశేష ప్రదేశాలను తనలో దాచుకుని.. అలకానంద, మందాకిని, గంగ, యమునా నదుల పుట్టినిల్లుగా భాసిల్లుతున్న ఈ ప్రదేశం నేడు విధ్వంసానికి గురవుతోంది. అభివృద్ధి పథకాల పేరుతో కొంతమేరకు అడవులను ధ్వంసం చేయగా.. కలప కోసం మరికొంత అడవిని నాశనం చేస్తున్నారు. ఫలితంగా ఈ దేవతల భూమి నేడు జీవులపాలిట మరుభూమిగా మారిపోతోతుండడం బాధాకరమైన విషయం.
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment