విహారాలు

India

Gamyam

Sunday, April 24, 2011

సాంచి - బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధ సంఘ నివాసంతో పునీతమైన నేల.

రెండు పురా పర్యటనలు ధమ్మమూ ఆదిమమూ

భోపాల్‌కి సాంచి చాలా దగ్గర. గంటన్నర ప్రయాణం. మధ్యప్రదేశ్ గ్రామాల మధ్య నుంచి విదిశ వెళ్ళే రహదారి మీద ప్రయాణం. విదిశ అనే పేరు వినగానే 'వనలతాసేన్'ను వర్ణిస్తూ 'విదిశలో అలుముకున్న చిక్కని చీకట్లలాగా ఆమె కురులున్నాయి' అన్న జీవనానంద దాస్ వాక్యం గుర్తొచ్చింది. మేం వెళ్తున్న దారిలో ఒకచోట మైలురాయి మీద కర్కాటక రేఖ (Tropic of cancer) అని రాసి ఉంది. కర్కాటక రేఖను దాటుతున్నానని తెలియగానే నాకేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. బండి ఆపమని చెప్పి దిగి ఆ ఊహాజనిత రేఖమీద కొన్ని క్షణాలు నిల్చున్నాను.

సాంచి మధ్యప్రదేశ్‌లోని రాయిసెన్ జిల్లాలో ఉన్న ఒక మామూలు గ్రామం. ఊళ్లో అడుగుపెట్టాక కూడా ఏ విశిష్ట సంవేదనలూ కలగవు. సాంచి స్థూపం కొండమీద ఉందని తెలిసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యమనిపించింది. నేనంతదాకా చూసిన బౌద్ధ చైత్యాలు అమరావతి, నాగార్జునకొండ, ఘంటశాల వంటివి నేలమీద నిర్మించిన చైత్యాలు. కారు మలుపులు తిరుగుతూ పైకెక్కుతుండగా అప్పుడప్పుడే లేత చిగుళ్ళతో రంగులు పోసుకుంటున్న మాఘమాసపు అడవి మధ్య ఆ కొండ సాక్షాత్కరించింది. చుట్టూ లేతాకుపచ్చని నీలపు కాంతిలో పొలాలు, నేల, నింగి కలగలిసి ఒక నీటిరంగుల పూత నా ముందు ప్రత్యక్షమయింది. నాకు తెలియకుండానే నాలో ఏదో ప్రశాంత భావన ఉదయించడం మొదలయ్యింది.

బుద్ధుడు ప్రత్యక్షమైనట్టే ఉంది

కారు పార్కింగ్ ప్లేస్‌లో ఆపుతూ డ్రైవరు 'అదిగో అదే సాంచి' అన్నాడు. ఆ ఎండ వెలుతురులో నా ముందు స్థూపం ప్రత్యక్షం కాగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. పరుగు పరుగున ఆ ప్రాంగణం దగ్గరికి పోయి నిల్చొన్నాను. నా ముందు ధ్యానమూర్తి అయిన బుద్ధుడు ప్రత్యక్షమయినట్టే ఉంది. మనకెంతో పరిచితమైన ధ్యానబుద్ధ ప్రతిమలో ఏదో విశేషముంది. ఆ మూర్తిని చూస్తున్నప్పుడు మనలో ఏదో అనిర్వచనీయ భావన మేల్కొంటుంది. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండమీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధ స్థూపాలన్నిటిలోనూ కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యం లాగా కనిపిస్తుంది.

క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 10వ శతాబ్దం దాకా దాదాపు 1300 ఏళ్ళ పాటు ఈ స్థూపం ఎందరో బౌద్ధభిక్షువులకీ, బౌద్ధ మతాభిమానులకీ, బౌద్ధ సాంఘికులకీ ఆశ్రయంగా నిలబడుతూ వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికి సంబంధం లేదు. బుద్ధుడు తన జీవితకాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జుంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో సవివరంగా నమోదు చేశాడు గాని సాంచి గురించి కనీసం ప్రస్తావించలేదు. అయినా కూడా బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధ సంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచి చరిత్రలో నిలబడింది.

అశోకుడు నిర్మించాడు


సాంచి గురించి మొదటి ప్రస్తావన సింహళ బౌద్ధ గ్రంథాలైన 'మహావంశం', 'దీపవంశం'లలో ఉంది. అవి చెప్పేదాన్ని బట్టి అశోకుడు మౌర్యచక్రవర్తి కాకముందు ఉజ్జయినిలో రాజప్రతినిధిగా పరిపాలన సాగిస్తున్నప్పుడు ఇప్పటి విదిశకు చెందిన ఒక వర్తకుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు దేవి. ఏళ్ళ తరువాత అతడి కుమారుడు మహేంద్రుడు విదిశలో ఉన్న మహారాణి దేవిని చూడడానికి వెళ్లినపుడు ఆమె విదిశగిరి దగ్గర తాను నిర్మించిన బౌద్ధారామానికి అతణ్ణి తీసుకువెళ్ళి చూపించినట్టుగా ఆ గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్ళేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్ళేటప్పుడో ఈ అడవిలో ఈ కొండని చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండమీద రాస్తే నలుగురూ చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ 'దృష్టి' ఉంది. అందుకనే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండమీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. తన అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు అతడు ఈ స్థూప నిర్మాణం చేపట్టాడు.

అయితే సాంచి మౌర్య సామ్రాజ్య వైభవాన్ని కూడా దాటి బతికింది. మౌర్య సామ్రాజ్యం పతనమయ్యాక కొద్దికాలం ఇబ్బందిపడ్డప్పటికీ ఆ తరువాత వచ్చిన శుంగవంశుల కాలంలో ఆ నిర్మాణం మరింత విశాలమైంది. ఆ కాలంలో అశోకుడు నిర్మించిన స్థూపాన్ని పెద్దది చేయడం, చుట్టూ పిట్టగోడ, మెట్లు, హర్మిక నిర్మించడం జరిగింది. ఈసారి ఆ స్థూపాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే పని శాతవాహనుల వంతయింది. వాళ్ళ కాలంలోనే ఈనాడు మనం చూస్తున్న తోరణాలు నిర్మాణమయ్యాయి. మళ్లా హర్షుడి కాలంలో సాంచి మరొక వైభవాన్ని చవిచూసింది.

జనరల్ టేలర్ కనుగొన్నాడు

సాంచి ఎప్పటినుంచి నిర్జనంగా మారిందో స్పష్టంగా తెలియదు కాని 13వ శతాబ్దపు తరువాతి కాలానికి చెందిన నిర్మాణాలేవీ ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచి బౌద్ధభిక్షువులు నెమ్మదిగా తరలిపోయారు. అందుకు స్పష్టంగా చెప్పగల కారణాలేవీ లేవు. 1818లో ఈస్టిండియా కంపెనీకి చెందిన జనరల్ టేలర్ ఈ శిథిలాల్ని కనుగొనేదాకా సాంచి భారత చరిత్రలో ఒక విస్మృత పదం. సాంచిని ఇప్పుడున్న రూపంలో మనం చూడడానికి కారకులైనవాళ్లు అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్, కెప్టెన్ ఎఫ్.జి మైసే, మేజర్ కోల్ ముఖ్యంగా సర్ జాన్ మార్షల్. సాంచిలో స్థూపాలు సురక్షితంగా బయటపడడంతో పాటు, దుర్భరమైన నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అశోకుడు స్థాపించిన స్తంభాన్ని జమీందారు ముక్కలు చేసి చెరకు గానుగగా మార్చుకున్నాడు లాంటివి.

శ్రమణజీవితఫలం గుర్తుకొచ్చింది

నేను పిచ్చివాడిలా ప్రదక్షిణంగా, అప్రదక్షిణంగా ఆ స్థూపం చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ, నా చేతుల్లోకి చిక్కుతున్నట్టే చిక్కి మరుక్షణమే జారిపోతున్న ఆ అపురూపమైన ప్రశాంతి ఎటువంటిదో బోధపరచుకునే ప్రయత్నం చేశాను. ఇది ఎటువంటి జీవిత ప్రయత్నాలకు సార్థక్యంగా, సత్ఫలితంగా లభించగల కానుక అయి ఉండవచ్చునని ఆలోచించాను. బుద్ధుడి దీర్ఘ సంభాషణల్లో 'సామంజ ఫలసుత్త'మనే అందమైన, ఆలోచనాపూరితమైన సంభాషణ ఉంది. నాకా సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక కార్తీక పున్నమి రాత్రి మగథ చక్రవర్తి అజాతశత్రు రాజగృహంలో తన ఇంటి మేడ మీద వెన్నెల్ని చూస్తూ ఇంత అందమైన రాత్రి ఎవరైనా ఒక వివేకవంతుడు సన్నిధికి పోయి కూర్చుంటే ఆయన చెప్పే మాటలు వింటే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అటువంటి వివేకవంతుడు ఎవరన్నా ఉన్నారా అని తన మంత్రుల్ని ప్రశ్నిస్తాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి గురించి చెప్తారు.

కాని జీవక కుమారబచ్చ అనేవాడు తన మామిడితోటలో విడిది చేసిన బుద్ధుడి గురించి చెప్తాడు. అప్పుడు అజాతశత్రువు బుద్ధుణ్ణి చూడడానికి వెళ్ళి ఆయనతో సంభాషణకు పూనుకుంటాడు. ఆ రోజు అతడు బుద్ధుణ్ణి అడిగిన ప్రశ్న శ్రమణజీవిత ఫలమేమిటని. బుద్ధుడు అతనికి ఎన్నో పార్శ్వాలలో, ఎన్నో ఉదాహరణలతో ఎంతో వివరంగా చెప్తాడు దాని గురించి. అది చదివినప్పుడు నాకర్థమైందేమిటంటే, ఒక మనిషి సామాజిక నిశ్రేణిలో భాగంగా ఉండకుండానే, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ తాలూకు బానిసత్వం నుండి బయటపడి అదే సమయంలో తనకూ, సమాజానికీ కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చునని చెప్పాడని. ఒక ఇంటిమీద నిల్చొన్న మనిషి కింద రహదారుల మీద మనుషులు అటూ ఇటూ తిరుగుతూ, ఇళ్ళలోకి వస్తూ వెళ్తూ ఉండడాన్ని చూస్తూ 'మనుషులు ఇలా ఇళ్ళల్లో ప్రవేశిస్తున్నారు. ఇలా బయటికి వెళ్తున్నారు, ఇలా వీధుల్లో నడుస్తున్నారు, ఇలా నాలుగు రోడ్ల కూడళ్ల దగ్గర చేరుతున్నారు' అని అనుకున్నట్టే మృత్యువు గురించి, మనుషుల ప్రవేశాల గురించీ, నిష్క్రమణల గురించి కూడా ఆలోచించడానికి వీలవుతుందన్నాడాయన.

శ్రమణజీవితంలో ఉండే వివిధ రకాల ప్రయోజనాల గురించి చెప్తూ, బుద్ధుడు ఇంకో మాట అన్నాడు. ఆ జీవితం పనికిమాలిన సంభాషణలకి దూరంగా ఉండే జీవితమన్నాడు. ఆ జీవితంలో 'రాజుల గురించీ, దొంగల గురించీ, మంత్రుల గురించీ, సైన్యాల గురించీ, భయాల గురించీ, తిండి గురించీ, తాగుడు గురించీ, వస్త్రాల గురించీ, శయ్యల గురించీ, హారాల గురించీ, అత్తరుల గురించీ, బంధువుల గురించీ, వాహనాల గురించీ, గ్రామాల గురించీ, నగరాల గురించీ, దేశాల గురించీ, స్త్రీల గురించీ, నాయకుల గురించీ' అనవసర సంభాషణలు ఉండవన్నాడు. దాని గురించీ, దీని గురించీ ఊహాగానాలు ఉండవన్నాడు. మనం మన కార్యస్థానాల్లో, మన సమాచార, వార్తా ప్రసార మాధ్యమాల్లో, మన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చేస్తున్నదదే అని గుర్తొచ్చాక సాంచి మరింత గొప్పగా అనిపించింది.

భీమ్ బేట్క గుహలు

సాంచి నుండి భోపాల్ తిరిగి వస్తుండగా భోపాల్ దగ్గరలోనే భీమ్‌బేట్క గుహలున్నాయని తెలిసింది. ఎప్పుడో పదేళ్ల కిందట నేనా గుహల గురించి చదివాను. అప్పుడు నాలో రగిలిన కుతూహలం మళ్లా బయటికొచ్చింది. ఒక్కసారి నా మనసు క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 300వ శతాబ్దానికి (అవును 300 శతాబ్దమే) పరుగులు పెట్టింది.

ఇట్లాంటి స్థలాలకి మనం అసలు ఎందుకు వెళ్ళాలి? ఠాగూర్ ఒకచోట రాస్తాడు. మనం ఇట్లాంటి స్థలాలకు వెళ్లినపుడు మనం మనలోని పరిమిత జ్ఞానాల నుంచి, సంకుచిత దృక్పథాల నుంచి బయటపడతామనీ; అపరిమితమైన దాంతో, గంభీరమైన దాంతో శాశ్వతమైన దాంతో మనని మనం అనుసంధానించుకుంటామనిన్నీ, అవకాశాల కోసం వెతుకులాడే పరుగు నుంచి కొద్దిసేపైనా పక్కకు తిరిగి ఇటువంటి తీరికవేళల కోసం, సోమరివేళల కోసం ప్రయత్నాలు చేయాలన్నాడాయన. బషో యాత్రా వర్ణనలు చదివి వాటిని తెలుగులోకి తెచ్చిన తరువాత, నాకు కూడా ఇట్లాంటి సోమరివేళల కోసం వెతుకులాట మొదలయ్యింది.

భీమ్ బేట్క గుహలు వింధ్య పర్వతాల్లో ఉన్న గుహల సముదాయం. సముద్ర మట్టానికి దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న ఈ గుహల్లో తొలి భారతీయ మానవుడు నివసించిన జాడలున్నాయి. అక్కడ కనీసం ఒక లక్ష ఏళ్ళ కిందటనే మనిషి జీవించిన ఆనవాళ్లున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అక్కడ గుహల్లో ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలున్నాయి. ఈ చిత్రాలు కనీసం 30 వేల ఏళ్ల నాటివి.

ఇప్పుడు కవితలు రాసే యువకవులు నగరాల్లో కూర్చుని తమ పల్లెటూళ్ల గురించీ, బాల్యం గురించీ, ఎడ్ల గురించీ, వ్యవసాయ పనిముట్ల గురించీ రాస్తున్నట్టే ఒకప్పుడు వాల్మీకి, కాళిదాసు వంటివారు వ్యావసాయిక సమాజంలో భాగంగా కవిత్వం రాస్తూ తమ అరణ్య జీవిత జ్ఞాపకాల్ని తలపోసుకున్నారు. వైదిక, వేదాంత, తాంత్రిక, దార్శనిక పరిభాషల్లో 'గుహ' అంటే అత్యంత పవిత్రస్థలం. జీవిత రహస్యాలు గోచరించే స్థలం. నేడు మనకు వాక్కులో దివ్యజ్ఞానానికి ఆనవాళ్లుగా మిగిలిన గుహలు నిజంగా ఎలా ఉంటాయో, అక్కడ మానవుడు ఎలా జీవించి ఉంటాడో చూడాలంటే భీమ్ బేట్క వెళ్లాలి!

చరిత్ర వెనక్కి జరిగింది

1870లో స్పెయిన్‌లో అల్టామీర గుహల్లో ఆదిమ మానవుడు చిత్రించిన చిత్రాలు బయటపడడం యూరప్‌నే కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది. అంతదాకా దావిన్సీని, రాఫేల్‌ని, రూబెన్స్‌ని మాత్రమే ఆరాధిస్తూ వచ్చిన యూరోపియన్ చిత్రకారుణ్ణి పికాసోగా మార్చిన గుహలవి. ఆదిమ మానవుడు వస్తుపరంగా మనకన్నా వెనకబడి ఉండవచ్చునేమోగానీ, సాంకేతికంగా శిల్ప దృష్టిపరంగా మనకన్నా ఎన్నో యుగాల ముందున్నాడని ఆ చిత్రాలు ప్రపంచానికి చాటాయి. అల్టామీర గుహాచిత్రలేఖనాలు బయటపడ్డ కొద్ది రోజులకే ఫ్రాన్స్‌లో, ఆఫ్రికాలో, చైనాలో కూడా ప్రాచీన గుహాచిత్రలేఖనాలు బయటపడ్డాయి. వీటన్నిటిలోనూ ఆఫ్రికన్ గుహాచిత్రలేఖనాలు అత్యంత ప్రాచీనాలు.

అయితే 1957లో ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయానికి చెందిన వి.ఎస్. వకాంకర్ భీమ్‌బేట్క గుహల్లోని చిత్రలేఖనాల్ని బయటపెట్టడంతో భారతదేశ కళాచరిత్ర, మానవభావావేశ చిత్రణ 30 సహస్రాబ్దాలు వెనక్కి జరిగింది. భారతదేశంలోని తక్కిన గుహాచిత్రలేఖనాలు అన్నీ ఒక ఎత్తు, భీమ్‌బేట్క గుహాచిత్రాలొక్కటీ ఒక ఎత్తు. అందుకనే వకాంకర్ భీమ్‌బేట్కని 'ప్రాగైతిహాసిక మానవుడి స్వర్గం'గా అభివర్ణించాడు. అందుకనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా భీమ్ బేట్కని గుర్తించింది.

భారతదేశంలో ఈ గౌరవం పొందిన గుహాసముదాయం ఇదొక్కటే. ప్రపంచంలో దీనితో సమానమైన గౌరవం పొందిన గుహాసముదాయాలు కొన్ని ఉన్నాయి. కలహారి ఎడారిలోని బుష్‌మన్‌ల గుహాచిత్రాలు, ఫ్రాన్స్‌లోని పాతరాతియుగపు గుహాచిత్రాలు. ఒక మానవ నివాసాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కో పది ప్రమాణాలు పెట్టుకుంది. అందులో భీమ్‌బేట్క రెండు ప్రమాణాలకు నిలబడుతోందని యునెస్కో చెప్పింది. ఒకటి, ఇక్కడ మానవుడికీ ప్రకృతికీ మధ్య సుదీర్ఘంగా ఒక నిరంతర ఆదానప్రదానం జరిగిందన్న నిరూపణ ఉండడం, రెండవది, ఈ ప్రాంతంలో ఇప్పటికీ నివసిస్తున్న ఆదివాసుల జీవన విధానాన్ని బట్టి గత 300 శతాబ్దాలుగా వేట, ఆహార సేకరణ ముఖ్య వృత్తులుగా వికసించిన ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ వస్తున్నది అన్నది.

అగస్త్యుణ్ణి కానన్నాను

అడవి దారమ్మట పలాశ, మోదుగు వృక్షాల్ని చూస్తూ భీమ్ బేట్క చేరాను. డ్రైవరు కారు ఆపి 'ఇక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళాలి' అన్నాడు. వింధ్యపర్వతాల్లో అడుగుపెట్టాను అని స్ఫురించగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. ఒకప్పుడు అగస్త్యుడు ఉత్తరం నుంచి ఈ వింధ్య దాటే దక్షిణానికి అడుగుపెట్టాడు. ఆయన తిరిగి వెళ్లడం కోసం వింధ్య అప్పటి నుంచీ తలొగ్గి ఎదురుచూస్తూనే ఉంది. కాని వింధ్యని శాశ్వతంగా అణచడం కోసం అగస్త్యుడు ఈ దారిన తిరిగి వెళ్లలేదు. బహుశా అప్పణ్ణుంచీ తనను చేరవస్తున్న ప్రతి మానవుడిలోనూ వింధ్య ఒక అగస్త్యుణ్ణి గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుందనుకుంటాను. అందుకనే ఆ పర్వత సముదాయం నన్ను 'నువ్వు అగస్త్యుడివేనా?' అని అడిగినట్టనిపించింది. నేను చిరునవ్వుతో 'అగస్త్యుణ్ణి కాదు! అవిసె చెట్టుని మాత్రమే' అన్నానా కొండలతో (సంస్కృతంలో అగస్త్యమంటే అవిసె చెట్టు అని కూడా అర్థం.)

సుమారు నాలుగు గంటల పాటు ఆ గుహలంతటా కలియ తిరిగాను. ఆ గుహా సముదాయం ఒక ప్రాచీన మెట్రోపోలిస్ లాగా అనిపించింది. అది దాదాపుగా 700 గుహల సముదాయం. అందులో 243 గుహల దాకా భీమ్‌బేట్క చుట్టుపక్కల ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 30 వేల సంవత్సరాల నాటివనే వాళ్లూ ఉన్నారు. కాదు ఐదువేల ఏళ్ళ నాటివే అనే వాళ్లూ ఉన్నారు. పూర్తిగా నిర్ధారణ కాకున్నా అవి రాతియుగం కాలం నాటి వనడంలో సందేహం లేదు. మన కళలు, సాహిత్యం, మతాల మీద మధ్యరాతియుగం ప్రభావాలే బలంగా ఉంటాయి. ఆ రకంగా చూసినట్లయితే భారతీయ సాహిత్యం మీద, మతాల మీద, భారతీయ జీవిత దృక్పథం మీద మధ్యరాతియుగ ప్రభావం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

మధ్యరాతియుగంలో భారతదేశం ఐదు ప్రధాన భూభాగాలుగా ఉండేది. వేదాల్లో పంచజనుల ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. ఈ పంచజనుల ప్రస్తావన చాలామంది అనుకునేటట్లుగా ఐదు కులాల ప్రస్తావన కాదు. ఇది మధ్యరాతియుగపు భారతీయ జీవిత జ్ఞాపకాల నుంచి ఉత్పన్నమైన భావన. భారతదేశపు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మధ్యభాగాలకు చెందిన జనజీవితాన్ని సూచించే మాట అది. అప్పట్నుంచీ, ఇప్పటిదాకా కూడా భారతదేశం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు భాగాలుగా వికసిస్తూ ఉన్న ఏకజాతి, ఏకదేశం, ఏకస్ఫూర్తి. ఈ ప్రతిపాదనకు గంభీరమైన ప్రాతిపదికగా భీమ్ బేట్క గుహలు నిలబడి ఉన్నాయి.

అది చిత్రకేంద్ర సంస్కృతి

  అనేక ప్రాచీన గుహాచిత్రాల్లో, అయితే మనుషులకి ప్రాతినిధ్యం ఉంది, లేదా జంతువులకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. బహుశా ఈ సమస్య అనాదికాలం నుంచి కళనీ, సాహిత్యాన్నీ కూడా పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికీ మన ఆధునిక, అత్యాధునిక చిత్రకళలో కూడా అయితే ప్రకృతి ఉంటుంది లేదా మనుషులు మాత్రమే ఉంటారు. కాని భీమ్‌బేట్క గుహల్లో చిత్రించిన చిత్రాల్లో జంతువులు, మనుషులు కూడా సమాన ప్రాతినిధ్యం పొందారు. ఆ మాటకొస్తే ఆ చిత్రలేఖనాల్లో కేవలం ప్రకృతి లేదు, కేవలం మనిషి లేడు. ప్రకృతి, మనిషి సమానంగా పాల్గొనే ఒక జీవనక్రతువు మాత్రమే ఉంది. బహుశా ఈ స్ఫూర్తినే ఋగ్వేదం కూడా అనుసరించి ఉంటుందనుకోవచ్చు. ఋగ్వేదమానవుడి గురించి రాస్తూ రేమండ్ పణిక్కర్ తన 'వేదిక్ ఎక్స్‌పీరియన్స్'లో ఈ విషయాన్నే పదేపదే వివరిస్తాడు. కాగా, ఋగ్వేదమానవుడు ప్రకృతి, మానవుడు పాల్గొనే ఇటువంటి క్రతువులకి ఆలంబనగా 'వాక్కు'ని స్వీకరించాడు. అది శబ్దకేంద్ర సంస్కృతి. వింధ్య పర్వతాల్లో నివసించిన ప్రాచీన భారతీయుడు ప్రకృతి - మనిషి పాల్గొనే క్రతువుకి ఆలంబనగా చిత్రలేఖనాన్ని స్వీకరించాడు. ఇది చిత్రకేంద్ర సంస్కృతి.

నేనక్కడ సంచరిస్తున్నంతసేపూ ఆ గుహల్లో ఆదిమానవులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నట్టూ, తింటున్నట్టూ, పాడుతున్నట్టూ, ఆడుతున్న ట్టూ ఊహించుకున్నాను. కింద లోయల్లో రకరకాల వన్యమృగాలు ఘీంకారాలతో, క్రేంకారాలతో అరుస్తూ అటూఇటూ పరుగెడుతున్నట్టుగా అనిపించిం ది. నా రక్తంలో ఎక్కడో లోపల నిద్రిస్తున్న 300 శతాబ్దాల కిందటి, అంటే సుమారు 1200 తరాల కిందటి నా పూర్వమానవుల భావోద్వేగాల్ని నా జన్యుస్మృతుల్లోంచి తట్టి లేపే ప్రయత్నం చేశాను. ఆనాటి మానవుడు ఏమి కోరుకుని ఉంటాడు? ఏమి కలగని ఉంటాడు? మధ్యయుగాల భారతీయ చిత్రకళ గురించి రాస్తూ ఆచార్య సుశీలాపంత్ ఇట్లా అన్నాడు.

ఆదిమానవుడి అడుగుల్లోకి...

'భారతీయ శిలాచిత్రలేఖనాల విశిష్టలక్షణమేమిటంటే, అవి తమ యుగస్వభావానికి అద్దం పడతాయి. అవి మొత్తం ఉపఖండానికే చెందిన ఒక ఉమ్మడి దృగ్విషయం. వాటిలో భారతీయ సాంస్కృతిక ఏకత్వం ప్రతిబింబిస్తూంటుందని మనం చెప్పవచ్చు ... ఈ చిత్రకళ తక్కిన ప్రాచీన భౌతిక అవశేషాల్లాగే మానవుడి నాగరికతా ప్రయాణంలో మొదటి అడుగుల్ని గుర్తు చేస్తుంది. తన తదనంతర తరాల ప్రయోజనం కోసం చరిత్రపూర్వ మానవుడు తన మొత్తం ప్రపంచాన్నంతటినీ ఇక్కడ చిత్రించి పెట్టాడు. మానవుడి అభివృద్ధి అతడుండే స్థలాన్ని బట్టీ, అతడు జీవించే కాలాన్ని బట్టీ ఎట్లా ప్రభావితమవుతుందో ఈ చిత్రకళ చూపిస్తుంది. తక్కిన పురావస్తుసాక్ష్యాల్లో మనకు లభ్యంకాని రహస్యాలకోసం ఈ గుహసముదాయాల్లో మనం వెతకవలసి ఉంటుంది ... మానవుడి చరిత్రకీ, సమాజానికీ, ఆర్థికవ్యవస్థకీ, మతానికీ, క్రతువులకీ, వలసలకీ సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లభ్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇతిహాసపు చీకటికోణం అట్టడుగునపడి కనిపించని కథల్ని ఈ మౌనచిత్రాలు వినిపించాలంటే మనమింకా ఎంతో మట్టి తవ్వవలసి ఉంటుంది. బూజు దులపవలసి ఉంటుంది.'
తిరిగి వెనక్కి వస్తూంటే నాకో మన్వంతరం పూర్తయినట్టనిపించింది. సాంచి స్థూపం పరిపూర్ణమానవుడి పరిపూర్ణ ప్రజ్ఞానానికి స్మారకచిహ్నమయితే, భీమ్‌బేట్క గుహలు ఆదిమానవుడి ఆదిమ జీవితకాంక్షకు, జిగీషకు నిలువెత్తు సాక్ష్యాలుగా నాకు గోచరించాయి. మానవ చరిత్రలో నేనొక పూర్తి అధ్యాయాన్ని ఏకబిగిన చదివేసాననిపించింది.


* వాడ్రేవు చినవీరభద్రుడు
వ్యాసకర్త సెల్ : 94909 57129

No comments:

Post a Comment