విహారాలు

India

Gamyam

Sunday, August 22, 2010

తమిళనాట.. అందాలు

పుదుచ్చేరి... చరిత్ర...
ఆంగ్లేయుల కంటే ముందు ఫ్రెంచి వారు మన దేశాన్ని పాలించారు. వారి పరిపాలనలో రూపుదిద్దుకున్న ఎన్నో పర్యాటక కేంద్రాలు తమిళనాడులో ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో ఫ్రెంచి కాలనీగా ఉండి, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పూర్తి ఫ్రెంచి వాతావరణం కనబడుతుంది. ఇక్కడి వీధులు, భవనాలకు ఇప్పటికీ ఫ్రెంచి పేర్లే వాడుకలో ఉండటం విశేషం. ఇక్కడి కట్టడాల్లో ఫ్రెంచి కళాత్మకత ఉట్టిపడుతుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆరోవిల్లె గ్రామం, అరవింద ఆశ్రమం పుదుచ్చేరిలోని ప్రధాన ఆకర్షణలు. మనక్కుల వినయనగర్‌ లాంటి దేవాలయాలు, అయి మనదపం లాంటి స్మారక చిహ్నాలు, అద్భుతమైన బీచ్‌లు మనల్ని సందర్శకులను మైమరిపిస్తాయి.

ట్రాంక్‌బార్‌ సౌందర్యం...
Tanjore2005లో సునామీ తాకిడికి గురైన నాగపట్టిణం జిల్లాలో ఉంది ఈ ప్రాంతం. క్రీ.శ.1620-1845 సంవత్సరాల మధ్యప్రాంతంలో డేనిష్‌ కాలనీగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక కోటలున్నాయి. వాటిలో ముఖ్యమైనది డాన్స్‌బర్గ్‌ కోట. ఈ కోట ప్రస్తుతం ఆ కాలం నాటి విశేషాలతో కూడిన మ్యూజియంగా విజ్ఞానాన్ని పంచుతోంది. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్‌ మిషనరీ బార్తెలా మౌస్‌ జియెంగన్‌ బాల్గ్‌ (బాల్గ్‌ బైబిల్‌ను తమిళంలోకి అనువదించారు). ఈ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడట. మరణానంతరం ఆయనను ఇక్కడే సమాధి చేశారు. చాలాకాలం పాటు ప్రధాన మిషనరీగా ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శకులను ఆకర్షించేందుకు ఇక్కడ ఉన్న కోట, చర్చిలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

కుంభకోణం...
తమిళనాడులో అద్భుత కళాత్మక సంపదకు ఆలవాలమైన ప్రసిద్ధ ఆలయాలన్నీ కావేరీ తీరంలోనే కొలువుదీరి ఉన్నాయి. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన... రాజరాజచోళుడు నిర్మించిన అతిపెద్ద ఆలయం కుంభకోణం. యునెస్కో చే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ దేవాలయంలో ఈ సంవత్సరం వెయ్యొవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. రాజరాజు చోళుని కుమారుడు రాజేంద్రచోళుడు కూడా మంచి కళాపోషకుడు. ఈయన కంగైకొండ చోళపురం వద్ద మరో పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. అది కూడా అద్భుతమైన కట్టడమే. ఇవే కాకుండా కావేరీ తీరంలో ఇంకా అనేక ఆలయాలున్నాయి. ఈ ప్రాంతానికి చుట్టూ ఉన్న నవగ్రహాల ఆలయాలు ఒక్కోదానికీ ఒక్కో చరిత్ర ఉంది. తమ తమ జాతకాలను అనుసరించి చాలామంది యాత్రికులు ఈ ఆలయాలను సందర్శిస్తుండడం గమనార్హం.

కాలుష్యానికి ఆస్కారం లేని... టాప్‌స్లిప్‌...
Kumbakonam బ్రిటీష్‌కాలంలో కొండలపై విరిగి పడ్డ దుంగలను కిందకు దొర్లించేవారంటే ఇక్కడ వృక్షసంపద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి అన్నామలై కొండలమీద ఉన్న ఇందిగాంధీ నేషనల్‌ పార్క్‌ మరో ఆకర్షణ. చుట్టూ దట్టమైన వెదురు, టేకు వనాలు ఉండటంతో ఏమాత్రం కాలుష్యానికి ఆస్కారం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం వైశాల్యం దృష్ట్యా చిన్నదైనప్పటికీ... ఏనుగులు మాత్రం అధికసంఖ్యలో ఉంటాయి. ఇక పక్షుల కిలకిలా రావాలను వింటూ సేదదీరాలనుకునే పర్యాటకులకు ఇది స్వర్గధామమనే చెప్పాలి. అత్యంత అరుదైన పక్షి జాతులెన్నో మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. టాప్‌స్లిప్‌ మీద ఏనుగు సవారీ జీవితంలో మరిచిపోలేని అనుభవం.

ఎలగిరి...
రెండు ఎతె్తైన కొండల మధ్య 14 చిన్న గ్రామాలతో కలిసి ఉన్న అందమైన ప్రాంతం ఎలగిరి. తమిళనాడులో ఊటి, కొడైకెనాల్‌ తరువాత మళ్లీ అంత ప్రశాంతతను చేకూర్చే పర్యాటక కేంద్రం ఏదైనా ఉందంటే అది ఎలగిరి మాత్రమే. ఎలగిరి కొండల్లో విహారం జీవితంలో మరిచిపోలేని అనుభూతినిస్తుంది. తమిళనాడులోని మిగిలిన హిల్‌స్టేషలన్నీ విపరీతమైన రద్దీతో ఉంటే, ఎలగిరి మాత్రం పర్యాటకులకు ఏకాంత వాతావరణాన్ని అందిస్తుంది. 3,500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతమంతా గులాబీ తోటల, పచ్చటి లోయలు, వాటి అందాలతో అలరారుతుంది. ట్రెక్కింగ్‌ చేసేవారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండే అక్కడ పారాగ్లైడింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి సాహస క్రీడలకు కూడా అనుమతినిచ్చారు. ఎలగిరితో పాటు ఉన్న గ్రామాల్లో ఎతె్తైన కొండ స్వామిమలై కొండ. ఇక్కడి నుండి పచ్చటి లోయలను చూస్తే... కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. జొలర్‌ పెటై్ల రైల్వే స్టేషన్‌కు ఇది కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి... చెన్నై నుండి 240 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- ఎస్‌.కె

No comments:

Post a Comment