విహారాలు

India

Gamyam

Friday, August 20, 2010

కలలు కళలుగా.. కోటలు మ్యూజియాలుగా..... పారిస్

పారిస్ నగరం మధ్యలో సీన్(siene) నది ప్రవహిస్తుంటుంది. దానికి రెండువేపుల చూడవలసినవి, చరిత్రాత్మకమైనవి చాలా ఉన్నాయి. అందుకని మా టూరు మేనేజరు తెలివిగ మమ్మల్ని బోటెక్కించేశాడు. పడవ ముందుకు సాగుతుండగా ముందుగా రికార్డు చేసి పెట్టిన క్యాసెట్టులోని గొంతు మాకు కుడి, ఎడమ భాగాలలో ఉన్న భవనాల ప్రశస్తి గురించి చెప్తూ పోయింది. అటూ, ఇటూ తిప్పి తిప్పి మెడ ఎంత నొప్పి పుట్టిందో! వాటిలో ముఖ్యమైనది 12వ శతాబ్దానికి చెందిన Notre Dame de Paris అనే గోతిక్ చర్చి. ఎంతో గొప్ప ఆర్కిటెక్చరు కలదట. దాదాపు 200 ఏళ్లు (1163-1345) పట్టిందట దాన్ని పూర్తి చేయడానికి. ఇంకా చాలా చాలా చూశాం- ఒపేరా హౌసులు, మ్యూజియంలూ సీన్ నదిమీదున్న అతి పురాతనమైన, అత్యంతాధునికమైన వంతెనలు కూడా అనేకం చూశాం. వాటిమీదున్న శిల్పాలు, సోయగాలు చూసి ముచ్చట పడ్డాం.

ఎగ్జిబిషన్ కోసం కట్టారట

నదిమీద వ్యాహ్యాళి చేస్తున్నప్పుడే ఈఫిల్ టవర్ చూశాం. కాని ఆ చూడడం వేరు. దానిమీదికెక్కడం వేరు. అదొక ప్రత్యేకమైన, అలౌకికమైన అనుభవం. పారిస్ అంటే ఈఫిల్ టవరు అన్నంతగా పేరు పడింది. నిజానికి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద కట్టలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దాన్ని ఎగ్జిబిషన్ కొరకు కట్టారట. Mr.Eiffelఅనే ఇంజనీరు రూపొందించిన ఈ కట్టడాన్ని తరువాత కూల్చేయాలనుకున్నారట. ఇంకో విషయం తెలుసా! చాలామంది ఫ్రెంచి వారికి అది నచ్చలేదట. ఎన్నో వివాదాలకు దారితీసిన ఆ కట్టడమిప్పుడు ఎంతో ప్రసిద్ధిచెందిన పర్యాటకాకర్షణయ్యింది. పారిశ్రామిక కళకు అదొక ప్రారంభం. దీంట్లో ఉన్న మూడంతస్థులలో ఒకటి 57, రెండవది 115, మూడవది 276 మీటర్ల ఎత్తు ఉన్నాయి.

అంత ఎత్తులో  Mr.Eiffel  తనకొక గది కట్టుకుని, కూతురితో పాటు ఉండేవాడట. టవరును చూడవచ్చిన గొప్పవారినక్కడే కలుసుకునేవాడట. ఆ గదిలో ఉన్న థామస్ ఆల్వా ఎడిసిన్, ఈఫిల్, ఆయన కుమార్తె విగ్రహాలు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. అక్కడ నిలబడి చూస్తే మెలికలు తిరిగిన సన్నని రిబ్బన్ లాగ సీన్ నది, బొమ్మరిళ్ళలాగా గొప్ప గొప్ప కట్టడాలు కనిపిస్తాయి. చుట్టూ దృఢమైన ఇనుప గర్డిల్స్ ఉన్నాయి కనుక సరిపోయింది లేకపోతే తీవ్రంగా వీచే ఆ గాలికి ఎగిరిపోతామనిపిస్తుంది. ఆ అనుభవం ఒక ఎత్తయితే రాత్రి చీకట్లో మిరిమిట్లు గొలిపే విద్యుదలంకరణలో దానందం చూడడమింకొక ఎత్తు. పారిస్‌లో ఏ మూల నుండి చూసినా కనిపించి మైమరపింప చేస్తుంది. మధ్యలో యూరోపియన్ యూనియన్ చిహ్నంగా ఏర్పరచిన నక్షత్రాల లైట్లు కాంతులీనుతూ కనువిందు చేస్తాయి.

ఊపిరి పీల్చడం మరచిపోయి చూశాం

ఆ రాత్రి మేము చూసిన 'లిడో షో' మరొక మరపురాని జ్ఞాపకం. మనం కూర్చునే ఆసనాలు, స్టేజి కూడా అర్ధ వలయాకారంగా ఉంటాయి. మనం తింటూ తాగుతూ ప్రదర్శన చూడొచ్చు. స్టేజి నిర్మాణం వైవిధ్యభరితమైనది. పలు హంగులు, సెట్టింగులు, సీనరీలు, అంతస్థులు వగైరా ఎప్పుడవసరమొస్తే అప్పుడేర్పడే, ఎప్పటికప్పుడు మారే ఇది ఇంద్రజాలమా అనేట్లు అరేంజిమెంట్లున్నాయి. అతి విశాలంగా ఉండడం చేత రంగస్థలం మీద ఒకేసారి యాభైమంది దాకా కళాకారులు పడతారు. వాళ్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆటోమాటిక్‌గా ఏర్పడే అంతస్తులు ఎక్కుతూ, దిగుతూ వయ్యారాలొలకబోస్తూ నాట్యం చేయొచ్చు. మన కళ్లముందే ఒక విమానమెక్కడి నుండో ఎగిరొచ్చి ఒక మూలకు ఆగగానే పైనుండి కిందికొక నిచ్చెన జారడం, ఒక వయ్యారిభామ హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ హొయలొలకబోస్తూ దిగడమాలస్యం బిలబిలమని ఆవిడ చెలికత్తెలు చేరడం, అందరూ కలిసి షాపింగు చేయడమొక కథ.

ఉన్నట్లుండొక రాజప్రాసాదం పైనుండొస్తే, కింది నుండి నీళ్ళు చిమ్మే ఫౌంటెన్లు, మొక్కలు వగైరా వచ్చి నిలుచోడం, ఏనుగు అంబారి ఎక్కి రాజు, రాణి ఊరేగడం, గుర్రాలపై రౌతులు కవాతు చేయడం, రాకుమార్తె తోటలో సఖులతో కలసి ఆడుకోడం- అన్నీ గబగబా జరిగిపోయాయి. క్షణాల్లో మారే వారి అలంకరణలు కూడా అట్లాంటి, ఇట్లాంటివి కాదండోయ్ కాలి బొటన వేళ్ళ నుండి శిరస్త్రాణాల దాకా వారు ధరించిన నగలు, దుస్తులు ఎన్ని రకాలో చెప్పలేను. అసలే పొడగర్లు, కాళ్ళకు ఎత్తు మడమల జోళ్ళు, తలపై మూడడుగులెత్తున్న రంగురంగుల, రకరకాల టోపీలు క్షణం క్షణం మారే సైకిడెలిక్ లైటింగుతో కళ్ళు చెదిరిపోయాయి. అమ్మాయిలు నామమాత్రంగా ఏవో దారప్పోగుల వంటి బట్టలు వేసుకున్నా, దాదాపు నగ్నంగా ఉన్నట్లే లెక్క. అయినప్పటికీ అసభ్యమనిపించలేదు. ఎందుకంటే వారి కదలికలలో కవ్వింపు, రెచ్చగొట్టడం లాంటివి లేవు. పూర్తి నగ్నంగా నాట్యం చేసే వారి కోసం ప్రత్యేకమైన థియేటర్లున్నాయట.

వైభవాల పుట్ట వర్సైల్స్ ప్యాలెస్

మర్నాడుదయం పారిస్‌కి చేరువలోనే ఉన్న వర్సైల్స్ (versaillas palace) ప్యాలెస్‌కెళ్లాము. దీనిని సూర్యదేవుడైన అపోలోని ఆరాధించే లూయీ వంశపు రాజులు కట్టించారు. ఆ బ్రహ్మాండమైన భవనసముదాయాన్ని కట్టేందుకు యాభై ఏళ్లు పైనే పట్టిందట. తోటలు వగైరా కలిపి దీని విస్తీర్ణం 800 హెక్టార్లట. దీని లోపల 20 కిలోమీటర్ల రోడ్లు, అంతే పొడవున్న ప్రహరీ గోడలు, రెండు లక్షల చెట్లు, 35 కిలోమీటర్ల మేర నీటి పైపులు, 11 హెక్టార్ల పై కప్పులు, 2153 కిటికీలు, 67 మెట్ల వరుసలు, పెద్దపెద్ద చెరువులు, అందమైన సరోవరాలు-దాని వైభవాన్ని చెప్పడం కష్టం. ఇది ఎంత విశాలమైనదో అంత విలాసవంతమైనది.

ఆనాటి ఫ్రెంచి ప్రభువుల అధికార దర్పాన్ని, భోగలాలసతని, వైభవాన్ని అడుగడుగున అనేదానికంటే అంగుళమంగుళము ప్రతిఫలిస్తుందిక్కడ. అంతటి మహత్తరమైన భవంతిలో మేము చూసింది 14 ఛేంబర్సు మాత్రమే. అయితేనేమి ఒక్కొక్కటొక మ్యూజియం మాదిరుంది. ప్రతి గదిలో ప్రశస్తమైన రంగురంగుల పాలరాతిని, మేలిరకం కలపను, అతి నాణ్యమైన అద్దాలను, వెండి, బంగారాలను, సుతిమెత్తని ముఖమల్, బంగారు జరీతో పూలు కుట్టిన మెత్తటి పట్టువస్త్రాలను....ఇంకా ఏవేవో ఉపయోగించారు. అప్పటి ఫ్రెంచి వాళ్లకు ఇటలీ వాళ్లన్నా, వారి కట్టడాలన్నా, చలువరాతి శిల్పాలన్నా, కుడ్య చిత్రాలన్నా ఈర్ష్యగా ఉండేదట. తాము వారికంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలనే తపన అటు ప్రభువులకు, ఇటు కళాకారులకు కూడ ఉండేదట. దాని ఫలితమే ఈ వర్సైల్స్ ప్యాలెస్.

పై కప్పంతా పెయింటింగులే...

రోములోని వాటికన్ సిటీ భవనాల వలె ఈ రాజప్రసాదంలోని ప్రతి గది పైకప్పు, గోడలు, స్థంభాలు, ద్వారాలు, కిటికీలు శిల్పాలతో, చిత్రాలతో నిండివుండడంతో చూసిన వారి కళ్లు చెదిరిపోతాయి. నేలకునేల అతి చక్కనైన చలువరాతి డిజైన్లతో అలరారుతుంటుంది. అన్ని వైపులా అలంకరణలు, ఆకర్షణలే. అతి ఖరీదైన ఫర్నీచరు, అంతకంటే ఖరీదైన జరీ సిల్కు కర్టెన్లు. వాటికంటే హుందాగా పొడవుగా నిలబడ్డ ఫ్రెంచి విండోలు, తళతళలాడే వాటి గాజు తలుపులు, వాటికి దీటుగ పైకప్పునుండి వేలాడుతున్న కాంతులీను గాజు బుడ్లు (chandeliers). ప్రతిగదిలో ఒక ఫైర్ ప్లేస్ (fire place), దాని చుట్టూ ఏవేవో డిజైన్లు, చిత్రాలు, శిల్పాలు.

ముఖ్యంగా పైకప్పంతా మెగా పెయింటింగులు. ఒకదాంట్లో హెర్కులస్‌కు సంబం«ధించినవి, ఇంకొక దాంట్లో డయానాకు సంబంధించినవి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథనక్కడ ఆవిష్కరించేరు.అపోలో సెలూననే గది పై కప్పంతా పరుచుకొని ఉన్న పెయింటింగు ఎంతో అద్భుతంగా ఉంది. నాలుగు గుర్రాలు పూనిన రథంపై దౌడుతీస్తున్న సూర్యుని వెనుక గ్రీష్మ, వసంత, హేమంత, శిశిర రుతువులు పరుగులు పెడుతున్నట్లు చిత్రించారు. ఆ గదిలో ఉన్న లూయీ 14 తైలవర్ణ చిత్రానికొక ప్రత్యేకత ఉంది. ఆయన పొట్టి వాడవటం చేత రాజదర్పానికి కొరత ఉండకూడదని ఎత్తుగ ఉండే హైహీల్సు, బఫ్ వచ్చేట్లు ఎత్తుగ దువ్వుకొన్న జుట్టు పెయింట్ చేసారు.

ఆ మూడు చూస్తే చాలు...

తర్వాత Louvre museum చూశాం. దీన్ని వాళ్లు లూవర్ అని పలుకుతారు. ఒకప్పుడిది రాజ భవనంతో కూడిన కోట. వర్సైల్స్ నిర్మించిన తరువాత దీనిని మ్యూజియం చేసినట్లున్నారు. నాలుగంతస్థుల భవనం. 700 పైన గదులు. గదులనకూడ దనుకుంటా, చాలా పొడవు వెడల్పు ఉన్న హాల్సనో, కారిడార్లనో అనాలి. అసలా భవనం డిజైనే విచిత్రంగా ఉంటుంది. మనకిచ్చిన బ్రోచర్లో తప్ప అంతు పట్టదు. కేవలం ఈ భవనాన్ని చూడ్డానికే వారం పడుతుందంటే అతిశయోక్తి కాదు.

ఇందులో మూడు భాగాలున్నాయి. అవి. Sully, Denon, Richelieu. ప్రపంచంలోని అన్ని దేశాల కళా సంపద క్రీస్తు పూర్వం 8000 నుండి వివిధ దశలలో సేకరించి భద్రపరిచారు. వర్సైల్స్ చూసిన అలసట తీరనే లేదింకా. ఇంక దీన్నేమి చూస్తాము అని గుండె జారింది. స్థానిక ప్రజలు కూడా అప్పుడొకటి అప్పుడొకటి చూస్తారట. మీలాంటి టూరిస్టులు ముఖ్యమైన మూడింటిని చూస్తే చాలని చెప్పాడు మా టూరు మేనేజరు. అవి.. Venus de Milo, The winged victory of Samathrace, Monalisa. ఆయన చెప్పిన ఆ మూడు చూసే సరికే మూడు చెరువుల నీళ్లు తాగినంత పనైంది. ఈ మూడు ఎంత ప్రఖ్యాతి చెందిన కళాఖండాలంటే మ్యూజియంలో ఎక్కడ చూసినా వాటి పేర్లు రాసి బాణం గుర్తులేసి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ మూడూ చూశాక కళ్లూ, మనసూ కూడా నిండిపోయాయి.

ఇంకా చూడాల్సిన కళాఖండాలున్నప్పటికీ అలసిన శరీరం మొరాయించింది. పైగా మా గ్రూపు వాళ్లెవరూ కనపడ్డం లేదు. బయటికెలా వెళ్లాలో తెలియక అవస్థ పడుతుంటే సెక్యూరిటీ గార్డులు మమ్మల్ని తీసుకెళ్లి మా గ్రూపు వద్దకు చేర్చారు. ఆ సాయంత్రం బస్సులో కూర్చునే నగర విహారం చేసాము. ఇతరుల మనోరంజనం కోసం పాటలు పాడే మా ఆయన ఆ సాయంత్రం తన మనోవాంఛితం మేరకు మహమ్మద్ రఫీ పాడిన 'యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్' పాట పాడి వినిపించాడు. అప్పటికే ఆయన్ని హీరో వర్షిప్ చేస్తున్న మా గ్యాంగ్ ఉత్సాహంతో ఊగిపోయారంటే నమ్మండి. ఆ విధంగా ఆయన చిరకాల వాంఛ తీరింది.

- డా. కొత్తింటి సునంద
94410 96231

No comments:

Post a Comment