విహారాలు

India

Gamyam

Sunday, June 19, 2011

బెలూన్ సఫారీలో 'గ్రేట్ మైగ్రేషన్' చూశాం

వేసవి సెలవులు ముగుస్తుండగా పరీక్షా ఫలితాలు వచ్చాయి. నా మనుమలు హరిశంకర్ ఎస్ఎస్‌సిలో 80శాతం మార్కులు, ప్రణబ్ ఐదో తరగతిలో 95 శాతం మార్కులతో పాసయ్యారు. బహుమతిగా ఆఫ్రికా దేశాలు చూపించమన్నారు. అందులో కెన్యా, టాంజానియా దేశాల్ని ఎంచుకున్నాము. అక్కడ నాకు సన్నిహితులైన సాంబశివరావు గారి కుటుంబం ఉండటం కూడా ఒక కారణం.

మే 29న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో దుబాయ్ వెళ్లి నాలుగు గంటల విశ్రాంతి తర్వాత సాయంత్రం 3.30 గంటలకు నైరోబి ఎయిర్‌పోర్టులో దిగాము. సాంబశివరావుగారు, వారి మిత్రులు స్వాగతం పలికారు. నైరోబీలో ఔషధ, తోళ్ళ పరిశ్రమలలో ఆయన మూడేళ్ల క్రితం స్థిరపడి తెలుగువారందరికీ తలలో నాలుకలా ఉన్నారు. వారి వ్యాపారాలు ఉగాండా, టాంజానియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. కెన్యాలో సుమారు 600 తెలుగు కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మంది ఉద్యోగాలలో, మరికొంతమంది కెమికల్స్, ఫార్మా రంగాలలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు. అందరూ ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా కొత్తగా వెళ్లిన తెలుగువాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆరోజు సాయంత్రం దాదాపు 25 మంది తెలుగువారితో ఇష్టాగోష్టి సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. చక్కగా అనేక విషయాలు మాట్లాడుకున్నాము. రాత్రికి నాయుడుగారి బిడ్డ పుట్టినరోజు పండగకు 'అంగీత' హోటల్‌లో జరిగిన వేడుకల్ని చూశాము. దాదాపు 50 కుటుంబాలు అందులో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ విధంగా నెలకు ఐదారు సార్లు కలుస్తుంటారట. పండగలు, పబ్బాలు జరుపుకుంటారట. తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు వాళ్ళంతా కలిసి కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని హైందవ సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. కెన్యాలో ఉన్న కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాల్ని గుర్తించి తెలుగు వాళ్ళకు సహాయ పడాలని కెన్యా ప్రవాసాంధ్రులు ఆలోచించడం చాలా సంతోషం కలిగించింది.

కెన్యా తూర్పు ఆఫ్రికాలో ప్రముఖమైన దేశం. జనాభా నాలుగు కోట్లు, వారు మాట్లాడే భాష స్వాహిలి. దీనికి లిపి లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వలస దేశం కావడం వల్ల అందరికీ ఇంగ్లీష్ వాడుక భాష. ప్రజాస్వామ్య దేశం కాబట్టి శాంతిభద్రతలు, అభివృద్ధి స్థిరంగా, పటిష్టంగా ఉన్నాయి. భూమధ్య రేఖపై ఉన్నప్పటికీ సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు మించదు. దేశంలో 70శాతం వ్యవసాయానికి అనుకూలం. కాఫీ, టీ, మొక్కజొన్న, విరివిగా పండుతాయి. ప్రజల అక్షరాస్యత 80 శాతం. ఉపాధి కోసం ఎక్కడికైనా వెళ్లే చొరవ ఉన్నవారు. భారతీయులంటే బాగా అభిమానం. ఇక్కడి భారతీయులు ముఖ్యంగా గుజరాతీలు, సింధీలు, దక్షిణాది ర్రాష్టాల వాళ్లు. ఎంతో అభివృద్ధి చెందినా వారిలో అసూయ కనిపించదు.

కెన్యాకు సరిహద్దులుగా ఉగాండా, టాంజానియా, సోమాలియా, మరో పక్క హిందూ మహాసముద్రం ఉన్నాయి. పొరుగు దేశాలతో మంచి సంబంధాలే కాక వ్యాపార లావాదేవీలు కూడా కలిగి ఉంటుంది ఆ దేశం. భగవాన్ సత్యసాయి బాబా, ప్రపంచ దేశాలన్నిట్లోకి ఒక్క కెన్యాలోనే వారి జీవిత కాలంలో పర్యటించి అనుగ్రహ భాషణం ఇచ్చారు. వారి తల్లి ఈశ్వరమ్మ గారు ఆ తర్వాత విదేశాలకు వెళ్లవద్దని కోరారని చెబుతారు. విక్టోరియా మహారాణిని రాణిగా ప్రకటించింది, ఆమె కెన్యాలో పర్యటిస్తున్న సందర్భంలోనేనంటారు. అమెరికా ప్రెసిడెంట్ తండ్రి కెన్యా నివాసే నన్నది అందరికీ తెలిసిందే. ఐక్యరాజ్య సమితి రెండు ప్రధాన కార్యాలయాలు ఉన్నది కూడా కెన్యా దేశంలోనే.

మసాయి మారా

నైరోబి నుంచి చిన్న విమానంలో గంట ప్రయాణం తర్వాత ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో దిగాము. అక్కడ విమానాలు దిగడానికి రన్‌వే కూడా లేదు. గట్టి నేల మీదే దిగింది. మసాయి తెగలుండే ఈ ప్రాంతం 1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఎక్కువ ప్రాంతం చదునుగా, అక్కడక్కడ చిట్టడవులతో నిండి ఉంటుంది. దీన్ని కెన్యా 'సహజవనరుల సంరక్షణ శాఖ' నిర్వహిస్తుంటుంది. ఈ ప్రాంతంలో అన్ని జాతుల శాకాహార, మాంసాహార జంతువులు, పక్షులు స్వేచ్ఛగా మసలుతుంటాయి. వీటిని వేటాడటం పూర్తిగా నిషేధం. రెండు రోజులు జంతు సఫారీలో వేల కొద్ది జంతువుల్ని, పక్షులను చూశాము.

ముఖ్యంగా సింహాలు, చిరుతలు, హైనాలు, అడవి దున్నలు, జీబ్రాలు, జిరాఫీలు, ఖడ్గ మృగాలు, జింకల్లో అనేక రకాలు, పక్షుల్ని విడివిడిగాను, గుంపులుగాను కూడా చూశాము. వీటి జీవనాధారం, ఆహారపు అలవాట్లు, వేటాడే విధానం, కోపతాపాలు, శత్రువుల్ని, మిత్రుల్ని పసిగట్టే విధానాలను గైడ్ ద్వారా విన్నాం. ముఖ్యంగా తమ బిడ్డల్ని కాపాడుకోవటం కోసం ప్రాణాలకు తెగించి అవి శత్రువుతో పోరాడే విధానాలు ఆశ్చర్యం కలిగించాయి. ఐదు పెద్ద జంతువుల్ని కలిపి బిగ్ 5 అంటారు. అవి సింహం, అడవి దున్న, చిరుత, ఏనుగు, రైనో. ఈ మృగాలన్నిటినీ గుంపుల్లో చూశాం. ఆశ్చర్యం ఏమిటంటే వేటాడే జంతువులన్నీ పక్కపక్కనే ఉన్నా ఆకలి అయినపుడు మాత్రమే వేటాడటం జరుగుతుంది. మిగతా సమయంలో వాటి జోలికి పోవు. పులులు, సింహాలైతే రోజుకు సుమారు 16 గంటలు నిద్రపోపతాయట.

బెలూన్ సఫారీ

450 డాలర్ల చార్జీతో గంటసేపు ఈ బెలూన్ సఫారీని ఏర్పాటు చేశారు. బూటేన్ గ్యాస్‌తో నింపిన పెద్ద బెలూన్‌లో 12 మందిని భూమికి 1000-5000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి మసాయిమారాలో విస్తృతంగా తిరిగే జంతు జాలాల్ని, ప్రకృతి రమణీయతను చూసే అవకాశం కలిగించారు. దిగిన తర్వాత ఆ చిట్టడివిలో ఏర్పాటు చేసే అల్పాహారాన్ని బుష్ బ్రేక్ ఫాస్ట్ అంటారు. (బుష్ అంటే చిట్టడవి కదా)

గ్రేట్ మైగ్రేషన్

ఇది చూడదగిన జంతు సఫారీ. జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే ఈ జంతు వలసలో సుమారు 15-20 లక్షల జంతువులు, ముఖ్యంగా జీబ్రాలు, వైల్డ్ బీస్ట్‌లు టాంజానియా లోని సెరంగిటి ప్రాంతం నుంచి మారా నదిని దాటుకుంటూ కెన్యాలోని మసాయిమారాకు వలస వస్తాయి. ఈ కాలంలో సెరంగిటిలో ఆహార కొరత, కెన్యాలో విస్తృత గడ్డి, ఆహారం లభించడమే ఈ వలసలకి కారణం. అక్టోబర్ నాటికి సెరంగిటిలో బాగా ఏపుగా గడ్డి, ఆహారం దొరకడంతో ఆ జంతువులన్నీ మళ్లీ మసాయిమారా నుంచి సెరంగిటి వెళ్లిపోతాయి. ఈ వలసలో వేలాది జంతువులు తొక్కిసలాటలో చనిపోతాయి. నదిని దాటేటప్పుడు మొసళ్లకు ఆహారంగా మారిపోతాయి. ఈ గ్రేటర్ మైగ్రేషన్ తప్పకుండా చూడాల్సిన దృశ్యం. ఈ జంతువులు కెన్యా చేరేటప్పటికే వాటి కోసం డేగలు, వేటాడే వన్యమృగాలు వచ్చి కాచుకొని ఉంటాయి.

ఏనుగులు, సింహాలు

ఆఫ్రికాలో పులులుండవు. ఇక ఆఫ్రికా ఏనుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి కుటుంబాలుగా కలిసి జీవించడాన్ని గమనించాం. ఒక్కో ఏనుగు రోజుకి డెబ్భై గ్యాలన్ల నీళ్లు తాగుతుంది. ఏనుగులు తమ పిల్లల్ని పుట్టిననాటి నుంచి 20 నెలలపాటు కాచి కాపాడతాయి. పిల్ల్లల్ని గుంపు మధ్యలో ఉంచుతూ వాటి చుట్టూ పెద్ద ఏనుగులు తిరుగుతూ శత్రువుల బారి నుంచి పిల్లల్ని రక్షించుకుంటాయి. ఏనుగులు 60 నుంచి 70 ఏళ్లు జీవిస్తాయి. ముసలితనంలో దవడ పళ్లు ఊడిపోవడంతో ఆహారం తినలేవు. అందుకే ఆ వయసులో నీళ్లు తాగడం నుంచి ఆహారం తినడనికి కూడా తొండమే ప్రధానమవుతుంది. చివరికి పళ్లన్నీ ఊడిపోయి క్షీణించి చనిపోతాయి. సింహాలు కూడా కుటుంబాలుగానే జీవిస్తాయి. ఒక్కో సింహం చుట్టూ మూడునాలుగు శివంగులుంటాయి. శివంగులు వేటాడి ఆహారం తెచ్చిపెడితే సింహాలు పిల్లలకి కాపలా కాస్తాయి. అయితే పిల్లలు పెద్దవయ్యేకొద్దీ వాటిపై తల్లి చూపిస్తున్న ప్రేమను చూసి సింహాలు అసూయతో ఆ పిల్లలపై దాడి చేస్తాయి. అప్పుడు వాటి తల్లి సింహంపై ఎదురుదాడికి దిగుతుంది.

అన్ని రకాల జంతువులూ ఒకే చోట కలిసి జీవిస్తూ ఉంటాయక్కడ. ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడతాయి. చిరుతలు గుంపులుగా కలిసి వేటాడతాయి. నీళ్లు దొరకనపుడు జంతువులను వేటాడి వాటి రక్తాన్ని తాగి దాహం తీర్చుకుంటాయి. జీబ్రాలు ఎక్కువ వేగంగా పరిగెత్తలేవు కాబట్టి అవి వీటికి ఆహారంగా మారుతుంటాయి. జీబ్రాలకున్న ప్రత్యేకత ఏమిటంటే.. మన వేలిముద్రల్లాగే వాటి చర్మంపై ఉన్న చారలు మిగతా వాటికంటే భిన్నంగా ఉంటాయి.

సంప్రదాయ గ్రామీణ కెన్యా

చిన్న, చిన్న జనావాసాలు (70-80 ఇళ్లు ఉండేవి) ఇక్కడ చాలా ఉంటాయి. నాగరికతకు దూరంగా ఈ గ్రామాలలో జనం ప్రధానంగా ఆవుల్ని, గొర్రెల్ని, కోళ్ళను పెంచుతుంటారు. బహు భార్యాత్వం ఉంది. ఐదున్నర అడుగులకు మించని ఇళ్ళల్లో ఉంటూ వేట, పాడి జీవనాధారంగా జీవిస్తుంటారు. ప్రభుత్వ సహాయం కూడా తక్కువే. వారానికోసారి జరిగే సంతలో వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని వస్తుమార్పిడి విధానం ద్వారా తెచ్చుకుంటారు.

బయలుదేరే ముందు రోజు కెన్యా రెవెన్యూ మంత్రి జేమ్స్‌ను కలవడం జరిగింది. చాలా స్నేహంగా మాట్లాడారు. కెన్యా దేశంలోని వనరుల గురించి, పెట్టుబడి అవకాశాల గురించి చర్చించాం. ఇటీవల ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా ఎన్నో ఒప్పందాలు చేసుకొని, ఆర్థిక సహాయం ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటికే చాలా మంది తెలుగువాళ్ళు, గుజరాతీలు, పంజాబీలు అక్కడి వివిధ రంగాలలో స్థిరపడ్డారు. అనేక మంది తెలుగువారితో, కెన్యా వారితో మాట్లాడిన తర్వాత అక్కడ విద్య, ఆరోగ్యం, ఫార్మా, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన రంగాలలో పూర్తి అవకాశాలున్నట్లు తెలిసింది.
ఆరు రోజుల పర్యటన తర్వాత ఆఫ్రికా గురించి ముఖ్యంగా కెన్యా గురించి నాకు ఎంతో సదభిప్రాయం కలిగింది. ఎన్నో అనుభవాలతో అనుభూతులతో ఎమిరేట్స్ విమానంలో ఆంధ్రాకు తిరిగి వచ్చాం.

కొసమెరుపు

అనుమతి దొరికితే తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అక్కడ స్థాపిస్తామన్న టాంజానియా తెలుగువాళ్ల మాటలకు నేను చాలా సంతోషించాను.


- డాక్టర్ కోడెల శివప్రసాద్,
మాజీ మంత్రి, నరసరావుపేట

No comments:

Post a Comment