విహారాలు

India

Gamyam

Saturday, October 23, 2010

గతమంతా ఘనమైన... జౌన్‌ ఫూర్‌ కళావైభవం

చారిత్రకంగా ఉత్తరభారతంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన పట్టణం జౌన్‌పూర్‌. భిన్నమత సంస్కృతికి ఆలవాలం. పురాణ ప్రఖ్యాతిగాంచిన ఈ నగరం ఆనాటి శిల్పకళావైభావానికి పెట్టనికోట. గోమతీ నదీ తీరాన నిర్మించిన జౌన్‌పూర్‌లో లెక్కకు మించిన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఖిల్జీ, మొఘల్‌ తదితర వంశస్తుల పాలనలో శోభాయ మానంగా విలసిల్లిన ఈ నగరం ఇప్పటికీ తన పర్యాటక వైభవాన్ని చాటుతోంది. సంగీత సాహిత్యాలకు నిలయంగా భాసిల్లిన జౌన్‌పూర్‌ ఎన్నో రాజవంశాలకు నివాసంగా ఉన్నది. తత్ఫలితంగా వారి కళానైపుణ్యాన్ని తనలో ఇముడ్చుకుంది. దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ సుందర నగర విశేషాలు......
Jaunpur-Quila
ఖిల్జీ వంశస్థులు క్రీశ 1290-1320 మధ్యకాలంలో ఉత్తరభారత దేశంలో తిరుగులేని పాలన సాగించారు. ముఖ్యంగా అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఉత్తర భారతమంతా దాదాపు జయించాడు. ఈ వంశ పాలన ఎంత త్వరగా విస్తరించిందో అంతే వేగంగా అంతరించింది. ఆ తరువాత మొఘలుల రాకతో వీరి పాలన అంతమయ్యింది. ఢిల్లీలో ఖిల్జీలపాలన నామావశిష్టమై, కుట్రలూ, కుతంత్రాలు, తిరుగుబాట్లు సర్వసాధారణమైపోయాయి. అనేక రాజ్యాలు స్థాపించుకున్నారు. ఇలాంటివాటిలో జౌన్‌పూర్‌ ఒకటి. షార్కి సుల్తానులు ఇక్కడ సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు పాలన సాగించారు. అవద్‌ గంగా పరీ వాహిక ప్రాంతంలో పశ్చిమాన అలీఘర్‌ నుంచి తూర్పున బీహార్‌ వరకు వైభవాన్ని చవిచూచింది. వీరి పాలనలో సంగీత సాహిత్యాలనేకాక శిల్పకళలూ ఆదరణకు నోచుకున్నాయి. ఎన్నెన్నో సుందర కట్టడాలను నిర్మించారు. మతమౌఢ్యంలేని, సౌభ్రాతృత్వం విలసిల్లిన సమాజాన్ని సుస్థిరం చేశారు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థానాలనూ, న్యాయవ్యవస్థనూ మినహాయిస్తే, వర్తక వాణిజ్యాలలోనూ రాజ్యపాలనలోనూ హిందువులదే ఆధిక్యత.

Atala-Masjid
ఆనాటి పరిస్థితులలో ఇది ఎంతో అపూర్వమైన విషయం. ముస్లిం సూఫీ మహా త్ములు, హిందూ సిద్ధ పురుషులు పరస్పరం. ఆనాటి మహాపురుషులు రామానంద, చైతన్య, కబీర్‌, నానక్‌దేవ్‌ వంటివారు తమ సరళమైన ప్రవచనాలతో భక్తి మార్గాన్ని సుగమంచేస్తే, మాలిక్‌ మహమ్మద్‌ జైసీ, రాస్‌ఖాన్‌వంటి ప్రముఖులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరినొకరనుసరించారని కాదు. మానవుని ఆధ్యాత్మిక పురోగతిని సుగమం చేయటమే వారందరి ధ్యేయం. ఈ భక్తిభావ సమ్మేళనంతో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసిందానాడు. తరువాత ఈ ప్రాంతం మొఘలుల అధీనంలోకి వెళ్ళినా, హుమా యున్‌ కాలంలో ఆనాటి బీహార్‌ గవర్నరుగానున్న షేర్షా ్రశ 1540 లో హుమాయూ న్‌ను జయించ టంతో అతడు కాందహార్‌ (ఈనాటి ఆఫ్ఘనిస్తాన్‌లో వుంది) కు తప్పించుకుని పోయాడు. ్రశ 1545లో షేర్షా మరణం తరువాత, హుమాయూన్‌ తిరిగి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడుగాని, అక్బర్‌ విజయ యాత్రలలోగాని, జౌన్‌పూర్‌ మొఘలుల వశం కాలేదు.

సుందర నిర్మాణాలు...
జౌన్‌పూర్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది జౌన్‌పూర్‌ కోట. షార్కి సుల్తానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోట నేడు శిథిలావస్థలో ఉంది. వీరు నిర్మించిన మసీదులలో అటలా, ఖాలిస్‌- మజ్లిస్‌, జాంజి, లాల్‌ దర్వాజా మసీదులు ముఖ్యమైనవి. వీటిలో అటలా ఒక్కటే నేడు మిగిలివుంది. తక్కినవన్నీ శిథిలమైపో యాయి. హిందీభవన్‌ పక్కనే వుందీ అటలా మసీదు. ఇక్కడో కథ వుంది. ఒకప్పుడిక్కడ అచలాదేవి మందిరముండేదిట. అది మసీదు వెలుపల చతుర్రసాకారంలో గదులు, రెండంతస్థులలో వున్నాయి. నాలుగు దిక్కులా ఏనుగులు ప్రవేశించేందుకు వీలుగా అతి పెద్ద దర్వాజాలున్నాయి. ఇది ఒకప్పుడు, అరబిక్‌, పర్షియన్‌ భాషల అధ్యయనానికి ఒక విశ్వవిద్యాలయంలా నడిచేది. దేశ దేశాలనుంచి విద్యార్థులు వచ్చేవారు. ఈ గదులన్నీ విద్యార్థుల వసతి కొరకు ఏర్పాటు చేసినవే. అతి సాధారణ జీవితం నుంచి వచ్చినా స్వశక్తితో హుమాయూన్‌ని జయించి చక్రవర్తి పదవినధిష్టించి, రోడ్లు నిర్మించటం, తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టటం లాంటి ప్రగతిశీల కార్యాలకు నాంది పలికిన మహావిజేత షేర్షాసూరి, విద్యనభ్య సించినది ఈ అటలా మసీదులోనే.

కనువిందుచేసే ఖిల్లా...
జౌన్‌పూర్‌ మధ్యలో పెద్ద ఖిల్లా వుంది. ఒక కిలోమీటరు విస్తీర్ణంలో అలనాటి వైభవానికి చిహ్నంగా ఉన్న ఈ కోటలోని వివిధ నివాస భవనాలన్నీ శిథిమైపోయాయి. ప్రాకార మంతా శిధిలమైపోయినా, ప్రవేశ ద్వారం మాత్రం గత ఏడు శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. లోపలకు ప్రవేశిస్తే మధ్యలో మసీదు. దీనికవతల స్నానశాల ఇంకా నిలచివున్నాయి. ఈ స్నానశాలలో ఎన్నో గదులు. అన్నిటిలోనూ నీటి తొట్టెలు. అన్నివైపులా సమాంతరంగా ప్రవేశద్వారా లతో వుండటం వల్ల వచ్చినదారి, వెళ్ళే దారి విష యంలో పర్యాటకులు ఇబ్బంది పడతారు. వచ్చా మో, ఎటు వెళ్లాలో తెలియక తికమకపడతాము.

గోమతీ వంతెన...
Gomati-River
ఇక్కడ గోమతీ తీరాన ఎన్నో పురాతన స్నానఘట్టా లున్నాయి. వీటికి పైన ఎన్నో గుళ్ళు గోపురాలు ఉ న్నాయి. స్థానికులు దీనిని పవిత్రతీర్థంగా భావిస్తా రు. దీని చరిత్ర మనకు ముస్లింల రాక నుంచి మా త్రమే తెలుసు. అంతకు ముందు ఇది ఇంకా ఎం తటి ఘన చరిత్ర కలిగివుందో మరి! ఇప్పుడు గోమ తీనది ఊరి మధ్యగా ప్రవహిస్తోంది. అంటే పట్టణం కాలక్రమేణ, నది ఆవలిగట్టుకు విస్తరించింది. ఈ నదిపైన ఒక పురాతనమైన వంతెన ఉన్నది. ఈ వం తెన మొఘలుల కాలంలో నిర్మిం చారు. ఇదొక విం త కట్టడం. నీరు పాయలుగా ప్రవహిస్తుంది. నీరు పారే చోట పెద్ద స్థంభాల మీద వంతెన నిర్మించారు. ఆ తరువాత వంతెన మళ్ళీ 5 స్థంబాల వరకు నిర్మిం చారు. వంతెన నిర్మాణ శైలి ఇప్పటి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలైన చిత్రమేమంటే ప్రతి స్థంభం వద్ద వంతెన మీద చిన్న చిన్న మంటపాలు నిర్మించారు. ఈ మంటపాల్లో వ్యాపారుల తమ వస్తువుల్ని పెట్టుకొని వ్యాపారం చేసేవారట.

మతమౌఢ్యం లేని సమాజం...
ఇక్కడ ఫిబ్రవరి నెలలో 12 రోజుల పాటు బారాబప్పార్‌ అనే వేడుక జరుగుతుంది. ఇవి మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలు. ఇది షియాలు ఒక రోజున, సున్నీలు ఒక రోజున జరుపుకుంటారు. దీనికి హిందూ ముస్లింలందరూ విరాళాలు ఇస్తారు. అలాగే ఇక్కడ శ్రీరామన వమికి జరిగే రామలీలా వేడుకలకు కూడా ఇరుమతాల వారూ విరాళాలందజేస్తారు. ఈ సామరస్యం షార్కీల కాలం నుంచి కొనసాగుతుండడం విశేషం. ఈ బారాబప్పార్‌ వేడుకలు ఎంతో వైభవంగా జరుగు తాయి. వీటికి ప్రధాన కేంద్రం అటలా మసీదు. ఈ వేడుకలు చూడటానికి ప్రతి సంవత్సరం చుట్టు పక్కల గ్రామాల నుంచి ఒక లక్షలాది జనం వస్తారు... ప్రధాన వీధులన్నిటిలోనూ పెద్ద పెద్ద ఆర్చీలు కట్టి, కాగితపు పూలతో అలంకరిస్తారు.. చిన్న చిన్న విద్యుద్దీ పాల తోరణాలతో వీధులన్నీ వేడుక శోభను సంతరించు కుంటాయి. అటలా మసీదు కళాత్మకమైన అలంకరణలో సొగసులు విర జిమ్ముతుంది. ప్రతి మొహల్లా నుంచి ఊరేగింపులు బయలుదేరతాయి. వీటిలో ఉత్సాహవంతులు, కత్తి యుద్ధాలు, కర్రసాముల చిత్ర విచిత్రరీతుల ప్రదర్శిస్తుంటారు. కత్తితో పోరాడే వారిని ఒట్టి చేతులతో మరొకరు ఎదుర్కొని ఆ కత్తిని వశపరచుకోవటం లాంటి సాహస విన్యాసాలు ప్రదర్శించడం విశేషం. ఊరే గింపులు అన్నీ ఊరంతా తిరిగి రాత్రి 2 గంటల ప్రాంతంలో అటలా మసీదు చేరుకుంటాయి. ఇక మిగిలిన రాత్రంతా భక్తిగీతాలూ, ప్రవచనాలూ ఉత్సాహభరితంగా సాగుతాయి. జనం కోలాహలం, సంబరం చెప్ప నలవి కాదు.
*  ఒకనాటి రాజధాని జౌన్‌పూర్‌ నేడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ జిల్లా కేంద్రం.

No comments:

Post a Comment