విహారాలు

India

Gamyam

Sunday, September 5, 2010

తిరగండి... ఈ మట్టిని తిలకంగా ధరించండి *

"ఆవో బచ్చో తుమ్హే దిఖాయే ఝాంఖీ హిందుస్థాన్ కీ
ఇస్ మిఠ్ఠీసే తిలక్ కరో ఏ ధర్తీ హై బలిదాన్ కీ''


కవి ప్రదీప్ 1954లో జాగృతి సినిమా కోసం రాసిన ఈ పాట ఈ రోజుకూ కర్తవ్యబోధ చేస్తున్నది. లక్షలాది త్యాగధనుల రుధిర ధారలతో తడిసిన హిందుస్థాన్ దృశ్యాలను చూద్దాం రండి. ఆ మట్టిని నుదుట తిలకంగా పెట్టుకొందాం రండి అని ప్రదీప్ ఆనాడే బాలురకు సందేశమిచ్చారు. దేశంలో రెండు వందల ఏళ్ళు వ్యాపారం చేసి, మరో రెండు వందల ఏళ్ళు రాజ్యాధికారం నడిపిన బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాటంలో పలుచోట్ల అగ్నిపర్వతాలు బద్దలైనాయి. ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటు మే 10, 1857న మీరట్‌లో మొదలైన తరువాత ఢిల్లీ, బెనారస్, ఆగ్రా, పాట్నా, లక్నో, అలహాబాద్, జబల్పూర్, ఝాన్సీ, బందా, ఇందోర్, పూనె, రేవా ఒక్కటేమిటి పెషావర్ నుంచి కలకత్తా వరకు. హిమాలయాల నుంచి మొగిలిగిద్ద (ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా) వరకు అడుగడుగునా ఫిరంగులు పేలాయి.

వేలాది ఖైదీలను ఫిరంగుల నోళ్ళకు కట్టి పేల్చి వేశారు. అందుకే క్రూరులైన బ్రిటిష్ సైనికాధికారులను ఉత్తరాది వారు 'ఫిరంగీ'లని ఈసడించేవారు. కాని దేశం క్రమంగా ఈ వీరులను విస్మరిస్తున్నది. వారి త్యాగాలను మరచిపోతున్నది. ఈ కృతఘ్నత మన దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లోనూ ఈ జాడ్యం విస్తరిస్తున్నది. అందుకే చాలా యూరోపియన్ దేశాల్లో వాలర్ (శౌర్యం) టూరిజంను ప్రోత్సహిస్తున్నారు. మన దేశంలో కూడా "శూరులను తలచుకొని, వీరులను కొలుచుకునే'' యాత్రలను ప్రభుత్వాలు, పౌరసంఘాలు ఆరంభించడం అవసరం.

ఈ యాత్రల వల్ల ప్రజల్లో జాతీయతాభావాలు పొటమరిస్తాయి. స్వాతంత్య్రం వచ్చే నాటికి బహదూర్‌షా జఫర్ కృషి వల్ల కొంత, నానాసాహెబ్, తాంతియాతోపే వంటి దేశభక్తుల కృషి వల్ల కొంత జాతీయభావాలు వ్యాప్తిచెందాయి. అనేక భాషలు, సంస్కృతులు, కులాల కింద విభజితమైన జాతిలో స్వాతంత్య్ర పోరాటం ఒక మానసిక తాదాత్మ్యతను సృష్టించింది. స్వాతంత్య్రం వచ్చేనాటికే 560 సంస్థానాలుగా విడిపోయి భిన్నభిన్న రాజకీయ, ఆర్థిక సంస్కృతులతో జీవిస్తున్న ప్రాంతాలు క్రమేపీ భారత రిపబ్లిక్‌లో విలీనమైనాయి. కాని పూసల్లో దారం వలె జాతులన్నిటి మధ్యన సోదరభావాన్ని సృష్టించడంలో మాత్రం పాలకులు క్రమేపీ విఫలమవుతూ వచ్చారు.

అందువల్లే దేశంలో జాతీయభావం కన్నా ప్రాంతీయభావం పైచేయిగా ఉంది. అందుకే భారతమాతకు పోటీగా తెలుగుతల్లి, తెలంగాణ తల్లి, కన్నడ తల్లి, మరాఠీ తల్లి అంటూ సవతుల పోటీ మొదలుపెట్టారు. భారతమాతకు, జాతీయగీతానికి, జాతీయభాషకు పోటీపెట్టడమంటే జాతీయవాదానికి తూట్లు పొడవడమే. జాతీయ ఉద్యమం లక్ష్యాలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడం వల్లే ప్రజాతంత్రం క్షీణించి, చోరతంత్రం (KLEPTOCRACY)గా దిగజారుతున్నది. ప్రజలతోగాని, ప్రజాసేవతోగాని సంబంధం లేని వ్యాపారులు, కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులై చట్టసభలతో ఊడిగం చేయించుకుంటున్నారు. ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారు. ప్రభుత్వాలకు, వాటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే ప్రజాసంఘాలు తమ రాజకీయ, ఆర్థిక లక్ష్యాలకు దిక్సూచిగా జాతీయ ఉద్యమాన్ని నిలుపుకుంటే, వాటికి నిరంతర ప్రేరణ, స్థిరత్వం లభిస్తాయి.

సోంపేట ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, ఏ వామపక్ష పోరాటమైనా భగత్‌సింగ్‌నో, వీర్‌సావర్కర్‌నో, వాసుదేవ్ బల్వంత్ పడ్కేనో తలచుకోకపోతే ఆ ఉద్యమం చుక్కాని లేని పడవలో తెడ్డులేని నావికుడు ఒడ్డులేని సముద్రంలో దారీతెన్నూ లేకుండా సాగిపోయినట్టు ఉంటుంది. ఏ ఉద్యమకారులైనా విధిగా మంగళ్‌పాండే పోరాటం మొదలుపెట్టిన కలకత్తాలోని బ్యారక్‌పూర్‌ను ఒక యాత్రాస్థలి చేసుకోవాలి. ఒక ప్లాసీ (పలాస-మోదుగపూవు), ఒక చిట్టగాంగ్, ఒక కాకోరీ, ఒక లాహోర్, ఒక ఝాన్సీ, ఒక మీరట్, ఒక అమృత్‌సర్, ఒక అంబాలా ఈ ఉద్యమాలకు చుక్కాని కావాలి. ఢిల్లీ కాశ్మీర్ గేటు వద్ద ఉన్న సిపాయి తిరుగుబాటుదార్ల స్మారకస్థూపం పోరాటాలకు దీపస్తంభం కావాలి.

వీర శివాజీ మొదలు యశ్వంత్‌రావ్ హోల్క ర్, నానాసాహెబ్, క్రాంతివీర్ లహూజీ ఉస్తాద్ సాల్వే, వాసుదేవ్ పడ్కే, బాలగంగాధరతిలక్, వీర్ సావర్కర్ సోదరులు, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ వరకూ అనేకమంది వీరయోధుల పుట్టినిల్లు పూనె నగరం మన పక్కనే ఉన్న సంగతి ఉద్యమకారులు మరచిపోరాదు. కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ, ఆమె సైన్యాధిపతి సంగోలి రాయన్న, మన చిత్తూరు వీరుడు వీరపాండ్య కట్ట బొమ్మన నేటికీ స్ఫూర్తిప్రదాతలే.

హైదరాబాద్‌లో కోఠీ రెసిడెన్సీ మీద 1857లో మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్, తుర్రేబాజ్‌ఖాన్‌ల నాయకత్వంలో 500 మంది సాయుధులు ఫిరంగులతో దాడిచేసి లోపల బందీగా ఉన్న చీదాఖాన్‌ను విడిపించే ప్రయత్నం చేశారు. తుర్రేబాజ్‌ఖాన్‌ను పట్టుకుని కాల్చి చంపి, స్తంభానికి శవాన్ని వేలాడదీసి కాకులు, గద్దలకు ఆహారంగా పెట్టారు. మౌల్వీ అల్లావుద్దీన్‌ను 1859లో అండమాన్‌కు ప్రవాసం పంపారు. వీరి చరిత్రను సుదీర్ఘ పరిశోధన తరువాత వెలికితీసిన ఒకనాటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్, ఇతర కౌన్సిలర్లు కోఠీలో స్మారకస్థూపం కట్టిస్తే, స్వాతంత్య్ర స్ఫూర్తిలేని నేటి కార్పొరేటర్లు ఆ వీరులను మరచి ఢిల్లీ స్టార్ హోటళ్లలో రాంకీ సంస్థ కార్పొరేట్ ఆతిథ్యంలో మునిగి తేలుతున్నారు. కోఠీ రోడ్డు పేరు తుర్రేబాజ్‌ఖాన్ రోడ్. చాదర్‌ఘాట్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకూ వెళ్లే రోడ్డు పేరు మౌల్వీ అల్లావుద్దీన్ రోడ్. వీరి పేర్లను సూచించే బోర్డులు ఎక్కడా లేవు. ఒక్క కార్పొరేటర్‌కు కూడా ఇది పట్టదు. రాంకీ ప్రయోజనాలే వారికి ముఖ్యం.

ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శౌర్యయాత్రలు తప్పనిసరి చేయాలి. జలియన్‌వాలా బాగ్ నుంచి అండమాన్ సెల్యులార్ జైలు వరకూ పర్యటనలు తక్కువ ఖర్చులో జరిగేట్లు వసతులు కల్పించాలి. జలియన్‌వాలా బాగ్‌లో రెండు వేల మంది దేశభక్తులు బ్రిటిష్ సైనికుల తుపాకీ గుళ్ళకు ఎలా బలైనారో చూపించాలి. సెల్యులార్ జైల్లో వీర్‌సావర్కర్‌తో సహా వేలాది దేశభక్తులు ఎంత నరకం అనుభవించారో వివరించాలి. ఇది చదువుకుంటే తెలిసేది కాదు. చూస్తేనే అనుభూతి. నిజామాబాద్ నుంచి సహాని సోదరులు ఏడాదికి రెండుసార్లు ఈ జైలు చూడ్డానికి వెళతారు.

కేవలం కంటినిండా ఏడవడానికే ఈ సోదరులు ఇక్కడికి వస్తారని అక్కడి గైడ్ మండల్ చెప్పారు. కన్నీరు పాపాలను కడిగివేస్తుంది, కర్తవ్యబోధ చేస్తుంది. అండమాన్‌కి వెళ్లేవారు సెల్యులార్ జైలుకన్నా అందమైన హావెలాక్ బీచ్‌కే ప్రాధాన్యమివ్వడం శోచనీయం. మరో ఘోరం ఏమిటంటే 1857లో వేలాదిమంది దేశభక్తులను లక్నోలో, కాన్పూర్‌లో ఫిరంగి నోళ్లకు కట్టి పేల్చివేసిన బ్రిటిష్ అ«ధికారి హెన్రీ హావెలాక్ పేరు ఆ అందమైన దీవికి ఇంకా కొనసాగడం. జైల్లో మగ్గిన ఒక కూకావీరుని పేరో, ఒక వాహబీశూరుని పేరో, ఒక గదర్ ఖైదీ పేరో ఈ దీవికి పెట్టాలని దేశభక్తులు ఎందరు కోరినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం మీద వేయి మంది గోండులతో, 400 మంది రొహిల్లాలతో గెరిల్లా దాడులు చేసి, నిర్మల్‌లో ఊడకొకరు చొప్పున వెయ్యి ఊడల మర్రికి ఉరి వేయబడ్డ రాంజీ గోండ్, హాజీల బలిదాన ప్రాంతాలు, రంప, అల్లూరి సీతారామరాజు పోరాట స్థలాలు, జోడెన్‌ఘాట్‌లో కొమరం భీమ్ అమరుడైన స్థలం, బైరాన్‌పల్లి, కడవెండి, విస్నూరు వంటి వీరగడ్డలు మన రాష్ట్రంలో కోకొల్లలు.

స్వాతంత్య్ర పోరాటంలో ఏ ఘట్టానికీ తీసిపోనివి మన రాష్ట్రంలో జరిగిన పోరాటాలు. దేశభక్తులు జీవితమంతా బరిసెలు, బాణాలు ఎదిరిస్తూ కత్తుల కోలాటం ఆడారు. దేశమంతటా గాలిలో శౌర్యం ఆవరించింది. ప్రతీరాయి ఒక నిప్పు కణిక అయింది. మట్టిలో తుఫానును బంధించి, నెత్తుటి హోలీ ఆడారు. వీరి త్యాగాలను మరిచిపోయిన నాయకత్వం ఉదాసీనంగా మారింది. సుఖాల వెంట, ఆస్తుల వెంట పరుగెత్తుతున్నది. విందులు, వినోదాలకు మరిగింది. ఈస్టిండియా కంపెనీలు దాడికొచ్చినప్పుడు, 1857లో సిపాయిలు తిరుగుబాటు చేసినప్పుడు విద్యావంతులు సరిగ్గా ఇదే మానసిక స్థితిలో ఉన్నారు. అందువల్లే దేశాన్ని ప్రస్తుతం పీడిస్తున్న అనేక అంశాల పట్ల విద్యాధికుల్లో ఉదాసీనభావం నెలకొన్నది. ఇది ప్రమాద సూచిక.

ఈ నేపథ్యంలో శౌర్యయాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కరువులు, వలసలు, ఆకలిచావులు, నైరాశ్యం వల్ల ఆత్మహత్యలు ఆగాలంటే దేశభక్తులు ఎన్ని కష్టనష్టాలు ఓర్చుకున్నారో ఈ తరానికి తెలపాలి. జీవితంలో సంతోషం కొరవడితే, రేపయినా సంతోషం లభిస్తుందనే ఆశ సన్నగిల్లితే ఆత్మహత్యలు అధికమవుతాయి. శౌర్యయాత్రలు మాత్రమే యువతలో స్థయిర్యాన్ని నింపుతాయి. శౌర్యయాత్రలు చేసే విద్యార్థులకు, యువతకు రైల్వే శాఖ రాయితీ కల్పించాలి. యాత్రాస్థలాల్లో చౌకగా సరాయిలు, సత్రాల వసతి కల్పించాలి. కొత్తగా నియామకమైన అఖిల భారత సర్వీసుల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఏర్పాటుచేసే దేశాన్ని అవగతం చేసే పర్యటన (Familiarisation tours) లలో ఈ శౌర్యయాత్రలను కూడా చేర్చాలి.

దేశమంతా ఒక్కటేననే భావం కలిగితే ఉద్యమకారుల్లో పరస్పర విద్వేషభావం తొలగిపోతుంది. జాతీయభావాల స్ఫూర్తి చుక్కానిగా ఉద్యమాలు సాగుతాయి. ఏ విదేశీ శక్తీ దేశం వైపు తేరిపార చూసే దుస్సాహసం చేయదు. దేశానికి ఒక జెండా, డండా(కర్ర), ఒక సైన్యం, ఒక జాతీయత, ఒక నినాదం (మారో ఫిరంగీ కో), ఒక నాయకత్వం ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు నుంచి జాతి నిరంతర ప్రేరణ గ్రహించవలసి ఉంది. వయసు, ఆరోగ్యం సహకరించకున్నా జాతి నాయకత్వ బాధ్యతను స్వీకరించి కొడుకులను, మనమణ్ణీ కోల్పోయి రంగూన్‌లో రెండు గజాల సమాధి స్థలం కోసం పరితపించిన బహదూర్ షా జఫర్ కవితను స్మరించుకోవడం అవసరం.

"ఘాజీయోఁ మే బూ రహేగీ జబ్ తలక్ ఈమాన్ కీ
తఖ్త్ - ఏ - లండన్ తక్ చలేగీ తేగ్ హిందుస్థాన్ కీ''
(మన యోధుల్లో నిజాయితీ గంధం ఉన్నంతవరకూ మన దేశ ఖడ్గం లండన్ సింహాసనం వరకూ పయనిస్తూనే ఉంటుంది.) ఇది మరచిపోతే ఏ విదేశీ ఖడ్గమైనా హస్తిన సింహాసనం వరకూ దాడికి రావడం ఖాయం.

పాశం యాదగిరి
94410 96231

No comments:

Post a Comment