విహారాలు

India

Gamyam

Wednesday, December 15, 2010

'' డబ్లిన్ '' టు '' క్లిఫ్స్ ఆఫ్ మొహర్ ''

'యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్'(యు.సి.డి)లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి గత సంవత్సరం మిత్రుడు వర్మా, నేనూ కలిసి విజయనగరం నుండి ఐర్లాండ్ వచ్చాం. 'యునైటెడ్ కింగ్‌డమ్'కు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రంలో సుందరమైన ప్రకృతితో అలరారుతున్న ఐర్లండ్ దీవిలో చదువుకోగలగడం నా అదృష్టంగా భావిస్తాను. 4 నెలల క్రితం ఒక వారాంతంలో డబ్లిన్‌కు 300 కి.మీ. దూరంలో సహజ సిద్ధంగా సముద్రతీరంలో ఏర్పడ్డ నిలువెత్తు రాతి కొండల వరసైన 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' చూడ్డానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను. దారి పొడవునా కన్పించిన ఐరిష్ అందాలను, అక్కడి ప్రజల జీవన శైలిని మీతో పంచుకోవడానికే ఈ వ్యాసం.

డబ్లిన్‌లో మేం ఉండే ప్రదేశం పేరు 'బ్లాక్ రాక్'. అక్కడ మా ఇతర స్నేహితులు కొందరు ఐర్లండ్‌లోని అత్యంత అందమైన 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' గురించి తరచూ చెప్పడం వలన ఆ ప్రదేశాన్ని ఎలాగైనా చూడాలని అనుకున్నాను. కానీ ఒకవైపు మాస్టర్స్ డిగ్రీ చదువు, మరోవైపు పార్ట్‌టైం ఉద్యోగంతో బిజీగా ఉండటం వలన, వచ్చిన సంవత్సరానికి గాని అక్కడికి వెళ్లడం వీలు పడలేదు. మా కోర్సు పూర్తయిన తర్వాత నెదర్లాండ్స్ నుండి వచ్చిన మా స్నేహితునితో కలిసి మొత్తం అయిదుగురం 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్'ను చూడ్డానికి బయలుదేరాం.

ప్రభుత్వమే సైకిళ్లను అద్దెకిస్తుంది

వెళ్లిరావడానికి ఒక రోజుకి కారుని అద్దెకు తీసుకున్నాం. ఇక్కడ డ్రైవర్‌ని పెట్టుకోవడం చాలా ఖరీదు కనుక మేమే డ్రైవ్ చేసుకుంటూ బయల్దేరాం. కారుకి ఒక రోజు అద్దె వంద యూరోలు. ఒక యూరో దాదాపు మన కరెన్సీలో 60 రూపాయలతో సమానం. సైకిళ్లు కూడా అద్దెకు దొరుకుతాయి. ప్రభుత్వమే సైకిళ్లు అద్దెకిస్తుంది. సైకిల్ అద్దె సంవత్సరానికి 10 యూరోలు మాత్రమే. ప్రజలు ఎక్కువగా సైకిళ్లనే వాడతారు. కార్లు వెళ్లే రహదారి ప్రక్కనే సైకిళ్లు వెళ్లడానికి చిన్న ట్రాక్, పాదచారులు నడవడానికి మరో దారి ఉంటాయి. రోడ్ క్రాస్ చేయాలంటే తప్పనిసరిగా జీబ్రా లైన్ల దగ్గరో లేదా ఫ్లరయోవర్ పైనుండో వెళ్లాలి. అంతే తప్ప మామూలుగా రోడ్డు క్రాస్ చేస్తే నేరం. అలా క్రాస్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే నడిచి వెళ్లేవారిదే తప్పుగా పరిగణిస్తారు. సైకిలు లేదా కారు తప్ప బైక్‌లు ఎక్కువగా వాడరు. నేను ఉన్న ప్రాంతంలో రెండు మూడు బైక్‌లు తప్ప ఎక్కువ కనిపించలేదు.

అన్ని జంక్షన్స్‌లోనూ సైకిల్ స్టాండ్‌లు పది పన్నెండు వరకూ ఉంటాయి. కాని అద్దెకిచ్చే మనుషులెవరూ ఉండరు. పదియూరోలు చెల్లిస్తే ఒక కార్డు ఇస్తారు. దాన్ని మిషన్‌లో ఉంచితే ఒక సైకిల్ రిలీజ్ అవుతుంది. సైకిల్ తీసుకువెళ్లిన గంటలోపు తెచ్చేయాలి. అయితే అక్కడ మరో సౌకర్యం ఉంది. సైకిల్‌ను ఏ స్టాండులో తీసుకున్నామో అక్కడే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు దగ్గర్లో ఉన్న ఏ స్టాండులో అయినా సైకిలును అప్పగించేయొచ్చు.

రాత్రి పదకొండుకే సూర్యాస్తమయం

'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' చూడ్డానికి ఉదయం ఆరు గంటలకు డబ్లిన్ నుండి బయల్దేరాం. కారుతో పాటు జి.పి.యస్. (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) కూడా అద్దెకి తీసుకున్నాం. దానికోసం మరో 20 యూరోలు అదనంగా చెల్లించాలి. జి.పి.యస్. పరికరంలో మనం బయలుదేరిన ప్రదేశం, మన గమ్యస్థానం మార్క్ చేస్తే సాటిలైట్ ద్వారా అదే మనకు దారి చూపుతుంది.
మేం వెళ్లింది వేసవి కాబట్టి ఉదయం 5 గంటలకే సూర్యోదయం అయింది. మళ్లీ రాత్రి పదకొండుకే సూర్యాస్తమయం. ఉత్తర ధృవానికి దగ్గర గా ఉండడం వలన వేసవిలో దాదాపు 18 గంటలు సూర్యకాంతి ఉంటుంది.
డబ్లిన్ వచ్చి సంవత్సరం అయినా మొదటిసారి సిటీ నుండి బయటకు రావడం - ఐరిష్ గ్రామాలను చూసే అవకాశం కలగడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సిటీ నుండి బయలుదేరిన అరగంటలోనే హైవే పైకి చేరుకున్నాం. రోడ్లు చాలా విశాలంగా ఉండడం, ఫోర్ వీలర్స్‌కి తప్ప మిగతా వాహనాలకు అనుమతి లేకపోవడంతో గంటకు 150 కి.మీ. వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాం.

ఒకప్పుడు బ్రిటిష్ వారి వలస దేశమే

ఐర్లాండ్ జనాభా మొత్తం 5 లక్షలే. జనసాంద్రత చాలా తక్కువ కారణంగా రోడ్డు పొడవునా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అప్పుడే మాకు జి.పి.యస్. పరికరం ఎంత అవసరమో తెలిసి వచ్చింది. నిజానికి జి.పి.ఎస్. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది - దారి తప్పినా అడగడానికి మానవ మాత్రుడు కనిపించడు కాబట్టి.
ప్రయాణంలో గమనించిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఐర్లాండ్‌లో వ్యవసాయపు పంట ఏదీ కనిపించకపోవటం. దారి పొడవునా కొన్ని ఎకరాల వైశాల్యంలో పందులూ, ఆవుల పెంపకం మాత్రమే కనిపించింది. వాటి మధ్య పెద్ద ఇల్లూ, కార్లూ తప్ప ఇంకేమీ కనిపించలేదు. సిటీ బయట ఇంటికీ - ఇంటికీ మధ్య దూరం అరకిలోమీటరు ఉంటుంది. ప్రజలు పని ఉంటే తప్ప బయటకి రారు - అదీ కారులోనే. ఐర్లాండ్ ముఖ్య ఉత్పత్తులు పోర్క్, బీఫ్ కాక కొన్ని పాల సంబంధితమైనవి మాత్రమే. మిగిలిన నిత్యావసర వస్తువులన్నీ యూరప్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.

ఐర్లాండ్ కూడా ఒకప్పుడు మన భారతదేశంలాగా బ్రిటిష్ వలస రాజ్యమే. బ్రిటన్ ఆక్రమించుకున్న ముప్పయికి పైగా దేశాలలో ఇది కూడా ఒకటి. 1921 డిసెంబర్ 6న అది స్వతంత్ర దేశం అయ్యింది.
18వ శతాబ్దం తొలినాళ్లలో ఐర్లాండ్ చాలా బీద దేశం. ఐరిష్ ప్రజలు చాలా కష్ట జీవులు. లండన్‌లోని పరిశ్రమల్లో పనులకోసం అసంఖ్యాకంగా వలసలు పోయినట్లు చరిత్రకారుల కథనం.

అంతా పొగమంచు మయం

బయల్దేరిన రెండున్నర గంటల్ల్లోనే (ఉదయం 8.30కి) క్లిఫ్స్ ఆఫ్ మొహర్ చేరుకున్నాం. ఈ ప్రదేశం ఐర్లాండ్‌లోని మరొక ముఖ్య పట్టణం గాల్వే సమీపంలో సముద్ర తీరంలో ఉంది. క్లిఫ్స్ అంటే నీటితో నిలువుగా కోయబడి, ఏర్పడిన రాతి కొండలని అర్థం. ఈ క్లిఫ్స్ సాధారణంగా సముద్ర తీరాన ఉన్న పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి.
సముద్ర తీరానికి కనిష్టంగా 120 మీటర్ల ఎత్తు నుంచి, 214 మీటర్ల ఎత్తు వరకూ 8 కి.మీ. పొడవున ఈ క్లిఫ్స్ ఏర్పడ్డాయి. అక్కడి లోకల్ కౌన్సిల్స్ ఈ పర్యాటక ప్రదేశాన్ని మరింతగా అభివృద్ది చేశారు. మేం వెళ్లిన కాసేపటికే వర్షం మొదలయ్యింది. దానికి తోడు విపరీతమైన గాలీ, పొగమంచు కారణం గా కొండపైకి చేరుకున్నా మొత్తం వ్యూని చూసే అవకాశం కలగలేదు. కింద సముద్రం కూడా కనిపించనంత పొగమంచు ఆవరించింది. ఎంతో శ్రమకోర్చి వచ్చిన మాకు వ్యూ స్పష్టంగా కన్పించలేదని కాస్త నిరాశ అనిపించింది.

ఎత్తయిన 'జీబ్రియన్ టవర్'

తర్వాత 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్'లో అత్యంత ఎత్తయిన ప్రదేశం 'జీబ్రియన్ టవర్' దగ్గర కొంత సేపు కూర్చున్నాం. ఈ టవర్ 1835లో అప్పటి స్థానిక భూస్వామి 'కొర్నేలియస్ జీబ్రియన్' నిర్మించాడట. ఆ టవర్ చుట్టూ రాళ్లతో నిర్మించిన ప్రహరీ ఉంది. చుట్టూ ఆకుపచ్చని పరిసరాలు ఎంతో అహ్లాదంగా కన్పించాయి. అక్కడి నుండి చూస్తే అట్లాంటిక్ మహాసముద్రంలోని ఆరెన్ ఐలాండ్స్‌గా పిలవబడే మూడు ఐలాండ్స్ కనిపిస్తాయట. కానీ పొగమంచు కారణంగా అవి కూడా మాకు సరిగా కనిపించలేదు.

అక్కడి నుండి కొండ దిగువకు చేరుకున్నాం. సముద్ర తీరాన చిన్న గ్రామం, కొన్ని నౌకలు కనిపించాయి. పైనుండి కన్పించిన ఆరెన్ ఐలాండ్స్‌లోని ఒక ఐలాండ్‌ని చూపించడానికే నౌకలున్నాయని తెలిసింది. ఆ ఐలాండ్‌కి తీసుకెళ్లడానికి, అక్కడ్నించి 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' అందాలను చూపించడానికి మనిషికి 10 యూరోలు అని చెప్పారు. వెంటనే టికెట్లు తీసుకున్నాం.
ఆ చిన్న షిప్‌లో ఐలాండ్స్ చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టింది. అప్పటికి సమయం 12 గంటలు కావడంతో దిగిన వెంటనే ఒక చిన్న రెస్టారెంట్‌లో బన్‌లు, సాండ్‌విచ్ లాంటివి తిని లంచ్ పూర్తి చేశామనిపించాం.
'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' నుండి అస్పష్టంగా, చిన్నగా కనిపించిన ఆ ఐలాండ్‌లో ఒక ఊరూ, దాదాపు 3 వేల జనాభా ఉండటం ఆశ్చర్యమనిపించింది. అందులోనే చిన్న చిన్న విమానాలు దిగడానికి ఒక ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది.

ఆరెన్ దీవిలో గుర్రబ్బండి ప్రయాణం

మా భోజనానంతరం ఆ ఐలాండ్‌లో తిరగడానికి ఒక గుర్రపు బండిని అద్దెకు మాట్లాడుకున్నాం. చిన్న గ్రామమైనా ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఊరి మధ్యలో ఒక పాత కోట, అక్కడక్కడా రాళ్లతో కట్టిన ఇళ్లూ, దారికి ఇరువైపులా కాంపౌండు వాలూ కన్పించాయి.
గ్రామానికి మధ్యలో ఒక చిన్న సరస్సు కన్పించింది. మా గుర్రపు బండిని సరస్సు ఒడ్డునే ఆపాం. 'చుట్టూ సముద్రం ఉన్నా ఆ సరస్సులోని నీరు చాలా తియ్యగా ఉంటుందని, సముద్రానికీ, ఈ సరస్సుకూ ఎటువంటి సంబంధం ఉండదని, తాగడానికి ఆ సరస్సు నీటినే వాడతారని' చెప్పారు. ఆ సరస్సులోని నీరు తాగి చూశాం. నిజంగానే అక్కడివాళ్లు చెప్పినట్లు చాలా తియ్యగా ఉన్నాయి. అక్కడ గుర్రపు బళ్లే కాకుండా, సైకిళ్లు కూడా పర్యాటకులకు అద్దె కివ్వడం కన్పించింది. రెండు గంటలపాటు ఆ ఐలాండ్‌లో గడిపి, తర్వాత షిప్‌లో మొహర్ ప్రాంతానికి తిరిగి వచ్చాం. అయితే ఈసారి వచ్చిన మార్గంలో కాకుండా 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' పక్కనుండి షిప్‌ని తీసుకెళ్లారు. పొగమంచు కారణంగా వ్యూని మిస్సయిన మాకు సముద్ర ప్రయాణంలో మొహర్‌ని చూడ్డం నిజంగా చాలా ఆనందం కలిగించింది. అద్భుతమైన ఆ దృశ్యం మా మనోనేత్రం నుండి ఎప్పటికీ చెరిగిపోదనిపించింది.
'క్లిఫ్స్ ఆఫ్ మొహర్'తో పాటు అదనంగా మరో దీవిని కూడా చూడగలిగినందుకు కొండంత తృప్తితో డబ్లిన్‌కి తిరుగు ప్రయాణమయ్యాం.

- వి. రాహుల్
92472 35401
v.rahul.in@gmail.com

No comments:

Post a Comment